
సాక్షి, అమరావతి: అక్రమ మైనింగ్ పేరుతో తనపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విమర్శించారు. టీడీపీలో ఉంటేనే కమ్మ కులంగా ఎల్లో మీడియా భావించడం దుర్మార్గమన్నారు. దేవినేని ఉమా ఆరోపిస్తున్న మైనింగ్ జరిగిన ప్రాంతం అటవీ భూమా? రెవెన్యూ భూమా? నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. అటవీభూమి అని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో క్రషర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శేఖర్, శ్రీధర్‌తో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
అనుమతులిచ్చింది వాళ్లే
‘ఇవి రెవెన్యూ భూములని, వీటికి సర్వే నంబర్లు కేటాయించాలని టీడీపీ హయాంలో జేసీ విజయకృష్ణన్ నివేదిక ఇచ్చారు. ఇవి రెవెన్యూ భూములు కాదని దేవినేని ఉమా రద్దుచేయించి, తరువాత కేఈ కృష్ణమూర్తితో స్టే ఇప్పించారు. సర్వేనంబర్ 143లో టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు చెన్నుబోయిన రాధాకు లీజు అనుమతి ఉంది. ఇదే సర్వేనంబర్‌లో 2016 డిసెంబర్ 4న దేవినేని ఉమా ఆ క్రషర్‌ను ప్రారంభించాడు. ఈ సర్వేనంబర్‌లో 105 ఎకరాలు డాక్టర్ సుదర్శన్‌రావుకిచ్చారు. ఇవి అటవీ భూములంటూ దేవినేని హైడ్రామా చేస్తున్నాడు. 15 సార్లు క్వారీ భూముల వద్దకు వెళ్లాడు. నాకు సంబంధం లేకున్నా అక్రమ మైనింగ్ చేస్తున్నానంటూ సిగ్గులేకుండా ఆరోపణలు చేస్తున్నాడు. డాక్టర్ సుదర్శన్‌రావు రాయల్టీలు చెల్లించినా లీజు పునరుద్ధరించలేదు. 20 ఏళ్ల కిందట జరిగిన మైనింగ్ అంతా కృష్ణప్రసాద్ చేశారని ఆరోపిస్తున్నారు. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా భయపడం’ అని కృష్ణప్రసాద్ అన్నారు.