అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు గోబెల్స్ ప్రచారంలో చంద్రబాబు దిట్ట. అవసరానికి ఎన్ని అబద్ధాలైనా అవలీలగా ఆడేస్తారు. చెప్పిన అబద్ధాన్నే వందసార్లు వల్లించి అదే నిజమని నమ్మించేందుకు యత్నిస్తుంటారు. తాను చేస్తేనే సక్రమం.. ఇతరులు చేస్తే అక్రమం.. ఇదే ఆయన నైజం. ఇంతా ఎందుకంటే.. కుప్పంలో ఇటీవల పర్యటించిన బాబు ఇష్టారాజ్యంగా ప్రభుత్వంపై బురద చల్లారు. నిబంధనలకు విరుద్ధంగా వైఎస్సార్‌సీపీ నేతలు మైనింగ్ చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. తీరా అసలు ‘ఘనులు’ టీడీపీ నాయకులే అని తెలియడంతో ప్లేటు మార్చేశారు. తమ పార్టీ వాళ్లు నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకులంటూ సర్టిఫికెట్ ఇచ్చేశారు. కథ అంతటితో అయిపోలేదు.. మళ్లీ తమ్ముళ్లను ఉసిగొల్పి నిరసన నాటకాలు ఆడించారు. అధికార పార్టీ నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం ద్వారా కొత్త డ్రామాకు తెరతీశారు. ప్రతిపక్షనేత ఎందుకిలా మాట్లాడుతున్నారు.. కుప్పంలో మైనింగ్‌కి సంబంధించి అసలేం జరిగిందో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..
సాక్షి, తిరుపతి: 2019కి ముందు.. సరిగ్గా చెప్పాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు టీడీపీ ప్రభుత్వంలో కుప్పం నియోజకవర్గం అక్రమ మైనింగ్‌కు అడ్డా చంద్రబాబు హయాంలో పచ్చచొక్కాల నాయకులు అడ్డూ అదుపు లేకుండా ప్రకృతి సంపదను అడ్డగోలుగా దోచుకున్నారు. జిల్లా మొత్తంమీద అక్రమ మైనింగ్ ఎక్కువ జరిగింది ఎక్కడంటే స్వయంగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే కావడం గమనార్హం.
ఇక్కడి టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలకు ప్రధాన ఆదాయ వనరు అడ్డగోలు తవ్వకాలే. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో దశాబ్దాలుగా సాగుతున్న అక్రమ మైనింగ్‌కు బ్రేకులు పడ్డాయి. గనులు, భూగర్భ వనరుల శాఖ అధికారులు అక్రమ క్వారీలను ఎక్కడికక్కడ కట్టడి చేశారు. ఇతర జిల్లాల నుంచి కూడా సిబ్బందిని రప్పించి దాడులు నిర్వహించారు. లెక్కకి మించి కేసులు పెట్టి జరిమానాలు విధించారు.
టీడీపీ నేతల క్వారీలోనే నిలుచుని వైఎస్సార్‌సీపీ నాయకులపై ఆరోపణలు చేస్తూ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతున్న చంద్రబాబు(ఫైల్)
ఇప్పుడు కొత్త నాటకం
మాటలు.. చేతలతో ప్రజలను బురిడీ కొట్టించే విద్యలో ఆరితేరిన చంద్రబాబు అండ్ కో తాజాగా మరో నాటకానికి తెర లేపారు. ఎప్పుడో ఆగిపోయిన క్వారీలు ఇంకా సాగుతున్నాయని రెండు రోజుల క్రితం ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ జి.శ్రీనివాసులు చిత్తూరులో నిరసన తెలిపారు. దీనికి కొనసాగింపుగా ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌ను అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మకు లేఖ రాశారు. ముద్దనపల్లె గ్రామంలో అక్రమ మైనింగ్ యథేచ్చగా జరుగుతోందని, దీని వెనుక వైఎస్సార్‌సీపీ నాయకులు ఉన్నారని ఆరోపించారు.
ఇదీ వాస్తవం
కుప్పం ప్రాంతంలో అక్రమ క్వారీల అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికార యంత్రాంగం 2021 అక్టోబర్ నుంచి తనిఖీలు ముమ్మరం చేసింది. మహా చెక్ పేరిట అన్ని క్వారీల అనుమతులు, పరిధి, తరలిస్తున్న బ్లాకుల సమాచారాన్ని పూర్తి స్థాయిలో సమీక్షించింది. ముద్దనపల్లెలో సాగుతున్న దందాను పూర్తిస్థాయిలో కట్టడి చేసింది. కడప, అనంతపురం నుంచి కూడా అదనపు సిబ్బందిని రప్పించి అనధికారిక క్వారీలపై ఉక్కు పాదం మోపింది. సుమారు రూ.3 కోట్ల విలువైన 550 పైగా క్వారీ బ్లాకులను సీజ్ చేసింది. చంద్రబాబు పర్యటన అనంతరం జనవరి 13న రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి నేరుగా ఇక్కడి క్వారీలను పరిశీలించారు.
బాబు రివర్స్ డ్రామా
అక్రమ మైనింగ్‌కు అలవాటు పడిన టీడీపీ నేతలు ప్రభుత్వ తీరుతో తీవ్రంగా నష్టపోతున్నామంటూ చంద్రబాబును ఆశ్రయించారు. దీంతో ఆయన రివర్స్ డ్రామాకు తెరతీశారు. గత నెల కుప్పంలో పర్యటించిన చంద్రబాబు మైనింగ్ అంశాన్ని తీసుకువచ్చి వైఎస్సార్‌సీపీ నేతలపై విమర్శలు సంధించారు. శాంతిపురం మండలం ముద్దనపల్లె రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 104, 213లోని అటవీ భూముల్లో వైఎస్సార్‌సీపీ నేతలు అక్రమ క్వారీలు నిర్వహిస్తున్నాంటూ కొత్త పల్లవి అందుకున్నారు.
జనవరి 8న బాబు ఈ క్వారీలను సందర్శించి అధికార పార్టీపై నిందలు మోపేందుకు ఆపసోపాలు పడ్డారు. అదీ టీడీపీ ఎంపీటీసీ నామాలప్ప, ఆయన మామ వెంకటేశుకు చెందిన క్వారీలోనే నిలబడి మీడియాతో మాట్లాడారు. సరిగ్గా ఆ సమయంలోనే పక్కన ఉన్న నాయకులు ఇది మన పార్టీ వారిదేనని బాబుగారి చెవిన వేశారు. అంతే.. వెంటనే మాట మార్చేశారు. ఇక్కడ క్వారీలు మన వాళ్లు చేసుకుంటే పర్వాలేదు. బయటి వ్యక్తులు మాత్రం వ్యాపారాలు చేయకూడదని ప్లేటు ఫిరాయించారు. అధినేత మాటలకు ఉత్సాహం పుంజుకున్న అక్రమార్కులు, టీడీపీ నేతలు వెంటనే గజమాలతో బాబును సత్కరించారు. ఈ విషయం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
ఆరోపణలు అవాస్తవం
ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు వందశాతం అవాస్తవం. రాజకీయాలతో మాకు సంబంధం లేదు. కుప్పం నియోజకవర్గంలోనే కాదు.. జిల్లాలోనే అక్రమ మైనింగ్ సాగడం లేదు. ఎవరైనా అక్రమ తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాం.
– పి.వేణుగోపాల్, మైనింగ్ శాఖ ఏడీ
Comments
Please login to add a commentAdd a comment