సాక్షి, అమరావతి: ఏపీలో మూడవ విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుకు భారీ షాక్ తగిలింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. మూడున్నర దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోటగా ఉంటూ వచ్చిన కుప్పంలో ఆ పార్టీ కుప్పకూలిపోయింది. వైఎస్సార్‌సీపీ అభిమానులు విజయభేరి మోగించారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో ప్రభంజనం కొనసాగుతోంది. తొలి రెండు విడతల్లో మాదిరే బుధవారం మూడో విడతలోనూ పల్లె ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పాలనకు బ్రహ్మరథం పట్టారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ప్రతిపక్ష టీడీపీ కంచుకోటలను ప్రజలు తమ ఓటుతో బద్దలు కొట్టారు.
ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజల తీర్పు ఒక్కటే అన్నట్టుగా మూడో విడతలోనూ 80 శాతానికి పైగా సర్పంచ్ స్థానాలను వైఎస్సార్‌సీపీ అభిమానులు గెలుచుకున్నారు. మూడో విడత మొత్తం 3,221 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈ నెల 6వ తేదీన నోటిఫికేషన్లు జారీ కాగా, అందులో 579 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో చోట సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆ మూడు స్థానాలో ఎన్నికలు జరగలేదు. మిగిలిన 2,639 సర్పంచి స్థానాలకు బుధవారం ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగింది.
కందుకూరు నియోజకవర్గం కొండికందు కూరులో వైఎస్సార్‌సీపీ సంబరాలు
ఆ నియోజకవర్గాల్లో రికార్డు విజయం
చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ పడింది. మూడో విడతలో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని 89 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. 74 చోట్ల వైఎస్సార్‌సీపీ అభిమానులు విజయం సాధించారు. టీడీపీ మద్దతుదారులు 14 పంచాయతీల్లో, ఇతరులు ఒక పంచాయతీలో గెలుపొందారు. గుంటూరు జిల్లాలో మూడవ విడతలో మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో 78 పంచాయతీలకు గాను 75 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభిమానులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. మిగిలిన మూడు స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగింది. లెక్కింపు అనంతరం ఈ మూడు స్థానాల్లో కూడా వైఎస్సార్‌సీపీ అభిమానులు విజయదుందుభి మోగించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో 85 గ్రామ పంచాయతీలకు గాను 85లో వైఎస్సార్‌సీపీ అభిమానులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
విజయనగరంలో అత్యధికంగా 87.09%
పోలింగ్‌కు 3.30 గంటల వరకు అవకాశం ఉన్నప్పటికీ, మధ్యాహ్నం ఒంటిగంట లోపే దాదాపు ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకున్నట్టు విజయనగరం జిల్లాలో ఎన్నికల పర్యవేక్షణ అధికారులు తెలిపారు. మూడో విడతలో మొత్తం 80.71 శాతం ఓటింగ్ పోలవగా, మధ్యాహ్నం 12.30 గంటలకే 67% నమోదు అయింది. ఆఖరి గంటలో కేవలం 4% మందే ఓటు వేశారు. ఇప్పటి వరకు మూడు విడతల పాటు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా ఈ విడతలో విజయనగరం జిల్లాలో 87.09 శాతం పోలింగ్ నమోదైంది. ఈ జిల్లాలో ఈ విడత 207 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరిగింది. ఆయా గ్రామాల్లో మొత్తం 3,60,181 మంది ఓటర్లకు గాను 3,13,679 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
వేగంగా కౌంటింగ్ పూర్తయ్యేలా చర్యలు
ఈ విడతలో ఎన్నికలు జరిగిన వాటిలో 448 గ్రామ పంచాయతీలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిలో పోలింగ్ మధ్యాహ్నం 1.30 గంటలకే ముగియడంతో అక్కడ కౌంటింగ్ రెండు గంటలకే మొదలైందని అధికారులు వెల్లడించారు. మిగిలిన చోట్ల పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ చేపట్టారు. కాగా, గత రెండు విడతల ఎన్నికల్లో మరుసటి రోజు తెల్లవారు జాము వరకు ఓట్ల లెక్కింపు కొనసాగడంతో ఈసారి వేగంగా కౌంటింగ్ పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఏవైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించేందుకు 5 వేలకు పైబడి ఓటర్లు ఉండే గ్రామ పంచాయతీల్లో పర్యవేక్షణకు పలు చోట్ల ఇద్దరు చొప్పున తహసీల్దార్ స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగిన వార్డులన్నింటికీ ఒకే సారి లెక్కింపు పూర్తి చేసేలా రెండు టేబుళ్ల ద్వారా ప్రత్యేక ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామ పంచాయతీల్లో ఓట్ల లెక్కింపును వీడియో రికార్డింగ్ చేయించారు. అర్ధరాత్రి 12 గంటల లోపే దాదాపు అన్ని చోట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి అయ్యేలా తగిన చర్యలు చేపట్టారు.
కుప్పం నియోజక వర్గం దాసిమానుపల్లిలో వైఎస్సార్‌సీపీ అభిమానుల విజయోత్సాహం
తూర్పుగోదావరి జిల్లాలో ఏపీవో మృతి
తూర్పు గోదావరి జిల్లా చింటూరు మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీలో అసిస్టెంట్ పోలింగ్ అధికారిణి దేవకృపావతి విధి నిర్వహణలో మృతి చెందినట్టు ఎన్నికల కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆమెకు గుండె పోటు రాగా, వెంటనే వైద్య చిక్సిత కోసం ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అనంతపురం జిల్లా ఉరవకొండ గ్రామ పంచాయతీలో మూడో వార్డులో నామినేషన్ ఉపసంహరించుకున్న అభ్యర్థి పేరును సైతం చేర్చి, అధికారులు బ్యాలెట్ పేపర్‌ను సిద్ధం చేయడంతో ఆ వార్డు ఎన్నికను వాయిదా వేయాల్సి వచ్చింది. గుంటూరు జిల్లా గురజాల మండలం మాడుగల గ్రామంలో రెండు వార్డుల బ్యాలెట్ పేపరులో గుర్తు ముద్రణలో తప్పులు దొర్లడంతో ఆ రెండు వార్డులలోనూ ఎన్నికను నిలిపివేశారు.
చెదురుమదురు ఘటనలు కూడా లేవు : ఎస్‌ఈసీ నిమ్మగడ్డ
మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దఫా ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, నక్సల్ ప్రభావిత పోలింగ్ కేంద్రాలుగా ఎన్నికల సంఘం వర్గీకరించిందని తెలిపారు. అందుకనుగుణంగా పోలీసు భద్రతను ఏర్పాటు చేశామని, దీని వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా, ఎక్కడా చెదురుమదురు సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బంధీగా పోలింగ్ నిర్వహించామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు.
‘చంద్రబాబును కుప్పం ప్రజలు ఛీకొట్టారు’
వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా): వెన్నుపోటు, కుళ్లు కుతంత్రాలతో ఇన్నాళ్లూ మోసం చేస్తున్న చంద్ర బాబు నిజస్వరూపాన్ని గుర్తించిన కుప్పం ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఛీకొట్టారని ఉపముఖ్య మంత్రి నారాయణస్వామి అన్నారు. కుప్పం నియోజకవర్గంలో 90% టీడీపీని వ్యతిరేకించి వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు పట్టం కట్టారని ఇ ది విశ్వాసం, నమ్మకానికి సంకేతమని స్పష్టం చేశా రు. బినామీ ఓట్లతో చక్రం తిప్పుతున్న బాబుకు ఈ ఫలితాలతో ప్రజలు షాక్ ఇచ్చినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment