సాక్షి, అమరావతి: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 40 శాతం టీడీపీ మద్దతుదారులే గెలుపొందారని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కుప్పం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఓడిందన్నారు. విశ్వసనీయత, శాంతి, నీతి, నిజాయితీలకు కుప్పం మారు పేరు అని.. అలాంటి ప్రాంతాన్ని ఉన్మాదంతో కలుషితం చేస్తారా అని ప్రశ్నించారు.వైఎస్సార్‌సీపీ పతనం ప్రారంభమైందన్నారు. పోలీసులే రౌడీల్లా తయారయ్యారని దూషించారు. ఓట్లు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామంటూ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి బెదిరిస్తున్నారని.. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులు కూడా సహకరించలేదని చెప్పారు.
సాయంత్రం వరకు టీడీపీ మద్దతుదారులకు అత్యధిక స్థానాలొచ్చాయని.. రాత్రి ఏడున్నర నుంచి పరిస్థితి మొత్తం మారిపోయిందన్నారు. అర్ధరాత్రి తర్వాత ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించారు. పోలీసులు కౌంటింగ్ బూత్‌లలోకి వెళ్లారని.. పవర్ కట్ చేసి ఫలితాలు ప్రకటిస్తున్నారని ఆరోపించారు.
ఇలాంటి ఘటనలపై ఎస్‌ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రజాదరణ ఉన్నవాళ్లే ఎన్నికల్లో గెలుస్తారు కానీ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నదేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ గళం ఎత్తడం వల్లే ప్రజలు ఓటింగ్ వరకు వచ్చారన్నారు. మొదటి విడతలో 38 శాతం, రెండో విడతలో 39 శాతం, మూడో విడతలో 40 శాతం స్థానాల్లో టీడీపీ గెలుపొందిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment