కేసుల క్వారీ..ఒత్తిళ్ల స్వారీ! | TDP leader chandrababu naidu Case Activities | Sakshi
Sakshi News home page

కేసుల క్వారీ..ఒత్తిళ్ల స్వారీ!

Published Sun, Aug 31 2014 2:39 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

కేసుల క్వారీ..ఒత్తిళ్ల స్వారీ! - Sakshi

కేసుల క్వారీ..ఒత్తిళ్ల స్వారీ!

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:తప్పు చేసినవారు ఎంతటివారైనా చర్యలు తప్పవు.. చివరికి మా పార్టీ నేతలైనా సరే.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చెబుతున్న డైలాగులకు.. జిల్లా జరుగుతున్న తంతుకు ఎక్కడా పొంతన లేదు. ప్రభుత్వ రాయల్టీకి ఎగనామం పెడుతూ.. జనావాసాలకు సమీపంలో బ్లాస్టింగులతో అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడిన వ్యక్తి టీడీపీ నేత అని తేలడంతో అతన్ని ఆ రొంపి నుంచి తప్పించేందుకు ఆ పార్టీ జిల్లా నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
 
 మొదట కేసే లేకుండా చూడాలనుకున్న పత్రికల్లో వార్తలు రావడంతో దాన్ని పెట్టీ కేసుగా మార్చడంతోపాటు క్వారీలోని పనివారిని ‘బుక్’ చేసి.. తమవాడిని తప్పించాలని అధికారులపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం పరిదిలో గ్రామాలను అనుకొని ఉన్న కొండల్లో అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడుతున్న సదరు నేతపై చర్యలు తీసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నా ఉన్నత స్థాయి ఒత్తిళ్లతో వెనక్కు తగ్గాల్సి వస్తోంది. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మైనింగ్, రెవెన్యూ అధికారుల సహాయంతో ఇటీవల సింగుపురం ప్రాంతంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
 
 లీజు పత్రాలు లేకుండానే టీడీపీ నేత మరో 10 మందితో కలిసి క్వారీ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. 137 జిలెటిన్ స్టిక్స్, 44 డిటొనేటర్లు, 5 కట్టల ఫ్యూజ్‌వైర్లు సీజ్ చేసి సంబంధిత నివేదికను రూరల్ పోలీసులకు, రెవెన్యూ, మైనింగ్ అధికారులకు అందజేశారు. టీడీపీ నేతపై కేసు నమోదైనట్లు తెలియడంతో అది వీగిపోయేలా చిన్న చిన్న సెక్షన్లు నమోదు చేయించాలని, యజమానిని కాకుండా పనివారినే అరెస్టు చేయాలని టీడీపీ నేతలు పట్టుబట్టారు. పోలీసులూ అదే చేశారు. యజమాని పరారీలో ఉన్నట్టు చూపించి, అక్కడ పనిచేసేవారిని రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజిలెన్స్ అధికారులు మాత్రం తాము తనిఖీలకు వెళ్లినప్పుడు అక్కడున్నవారినే విచారించినప్పటికీ..పేలుళ్లకు సంబంధించి సామగ్రిని స్వాధీనం చేసుకున్న తరువాత..యజమాని మాత్రం టీడీపీ నేతేనని కనుగొన్నట్టు చెబుతున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు నివేదిక అందజేశామంటున్నారు.
 
 కంప్రెషర్ ఎవరి పేరిట ఉందో...
 విజిలెన్స్ అధికారులు కొన్నాళ్లుగా రెక్కీ నిర్వహించి అక్రమ క్వారీయింగ్ చేస్తున్న వ్యక్తిని గుర్తించి తనిఖీలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఒత్తిళ్లు తీవ్రతరం కావడంతో ఎవరికి వారు తమకేమీ తెలియదని, కేసు విచారణ దశలో ఉందని చెప్పి తప్పించుకుంటున్నారు. వాస్తవానికి తనిఖీల సమయంలో అక్కడ సీజ్ చేసిన వస్తుసామగ్రి ఎవరి పేరిట ఉంది, ప్రభుత్వం ఆ స్థలం ఎవరికి లీజుకు ఇచ్చింది అన్న విషయాల్ని అక్కడి కార్మికులను అడిగినా చెప్పేస్తారు.
 
 విజిలెన్స్ నివేదిక అధారంగా, అక్రమ క్వారీకి పాల్పడిన వ్యక్తుల నుంచి వన్ ప్లస్ ఫైవ్ చొప్పున సీనరేజీ కట్టించడంలోనూ అధికారులు వెనుకంజ వేస్తున్నారంటే ఒత్తిళ్లు ఎంత తీవ్రంగా ఉన్నాయో  అర్థం చేసుకోవచ్చు. కనీసం సీజ్ చేసిన కంప్రెషర్ ఎవరి పేరిట ఉందో.. విజిలెన్స్ అధికారులిచ్చే ‘అక్‌నాలెడ్జ్‌మెంట్’ నివేదికలో ఏముందో తెలుసకునే ప్రయత్నం కూడా అధికారులు చేయడం లేదు. వాస్తవానికి సింగుపురం పరిసర ప్రాంతాల్లో చాలమంది అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నా అధికారులు ఎందుకు తనిఖీలు చేయడం లేదో అర్థం కావడం లేదు. టీడీపీ నేత చాన్నాళ్ల నుంచి అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడుతుంటే విజిలెన్స్ విభాగం దాడులు చేసింది తప్ప ఇతర విభాగాలు కనీసం అక్కడకు వెళ్లలేదు.
 
 అయితే ఇవన్నీ చిన్నచిన్నవేనని, ఎప్పటికప్పుడు ఇలాంటి వారిని పట్టుకుంటున్నామని మైనింగ్ అధికారులు సమర్థించుకుంటున్నారు. అరెస్టుకు సంబంధించి సీఐ తాతారావును వివరణ కోరగా తప్పుచేసినవారిని వదిలేది లేదని, ఈ కేసులో ప్రధాన నిందితుడిపై విచారణ ముమ్మరం చేశామని, ఫిర్యాదు ఇచ్చిన ప్రభుత్వ విభాగాల సిబ్బందితో పాటు చాలా మంది నుంచి ఇప్పటికే వివరాలు సేకరించామన్నారు. అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడిన వ్యక్తిని తొందర్లోనే అరెస్టు చేస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement