టీ తాగుతుంటే.. కాల్చి చంపేశారు!
బిహార్‌లో ప్రముఖ ప్రాంతీయ దినపత్రికకు చెందిన పాత్రికేయుడు ఒకరిని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. అక్రమ స్టోన్ చిప్ యూనిట్లపై కథనాలు రాయడంతో ఆగ్రహించిన వర్గాలే ఆయనను చంపించి ఉంటాయని భావిస్తున్నారు. ధర్మేంద్ర సింగ్ (35) రోడ్డు పక్కన టీస్టాల్‌లో టీ తాగుతూ ఉండగా కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఆయనపై సమీపం నుంచి కాల్పులు జరిపారని సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్ అలోక్ రంజన్ తెలిపారు.
పాయింట్ బ్లాంక్ రేంజి నుంచి పొట్ట భాగంలో కాల్చడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను చికిత్స నిమిత్తం వారణాసికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. ధర్మేంద్ర సింగ్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. రోహతస్ జిల్లాలో చాలా రోజుల నుంచి అక్రమ క్వారీయింగ్ వ్యాపారం కొనసాగుతోంది. ఇంతకుముందు కూడా ఇదే జిల్లాలోని సివాన్ ప్రాంతంలో రాజ్‌దేవ్ రంజన్ అనే మరో పాత్రికేయుడిని గత మే నెలలో కాల్చి చంపారు.