Journalist shot dead
-
మద్యం మాఫియా ఆగడం : జర్నలిస్టు మృతి
లక్నో: యూపీలో లిక్కర్ మాఫియా బరితెగించింది. సహరన్‌పూర్‌లో ఆదివారం ఓ జర్నలిస్ట్, ఆయన సోదరుడిని మద్యం మాఫియా కాల్చిచంపిన ఘటన కలకలం రేపింది. ప్రముఖ హిందీ వార్తాపత్రికలో పనిచేసే జర్నలిస్ట్‌ను గతంలోనూ పలు సందర్భాల్లో మద్యం మాఫియా బెదిరించిందని సమాచారం. దుండగుల కాల్పుల్లో గాయపడిన జర్నలిస్ట్ ఆశిష్ జన్వాని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, ఆయన సోదరుడు ఘటనా స్ధలంలోనే మరణించారు. ఈ ఘటనకు సంబందించి పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితులను ప్రశ్నిస్తున్నారు. జర్నలిస్ట్‌ను మద్యం మాఫియా హతమార్చడంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. తనకు బెదిరింపులు రావడంపై ఆశిష్ పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని స్ధానికులు ఆరోపించారు. కాగా మద్యం మాఫియా జర్నలిస్టుపై కాల్పులు జరిగిన సమాచారం అందగానే డీఐజీ ఉపేంద్ర అగర్వాల్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులకు రూ 5 లక్షల చొప్పున యూపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. -
టీ తాగుతుంటే.. కాల్చి చంపేశారు!
బిహార్‌లో ప్రముఖ ప్రాంతీయ దినపత్రికకు చెందిన పాత్రికేయుడు ఒకరిని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. అక్రమ స్టోన్ చిప్ యూనిట్లపై కథనాలు రాయడంతో ఆగ్రహించిన వర్గాలే ఆయనను చంపించి ఉంటాయని భావిస్తున్నారు. ధర్మేంద్ర సింగ్ (35) రోడ్డు పక్కన టీస్టాల్లో టీ తాగుతూ ఉండగా కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఆయనపై సమీపం నుంచి కాల్పులు జరిపారని సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్ అలోక్ రంజన్ తెలిపారు. పాయింట్ బ్లాంక్ రేంజి నుంచి పొట్ట భాగంలో కాల్చడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను చికిత్స నిమిత్తం వారణాసికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. ధర్మేంద్ర సింగ్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. రోహతస్ జిల్లాలో చాలా రోజుల నుంచి అక్రమ క్వారీయింగ్ వ్యాపారం కొనసాగుతోంది. ఇంతకుముందు కూడా ఇదే జిల్లాలోని సివాన్ ప్రాంతంలో రాజ్దేవ్ రంజన్ అనే మరో పాత్రికేయుడిని గత మే నెలలో కాల్చి చంపారు. -
జర్నలిస్ట్ దారుణ హత్య
రాంచీ : జార్ఖండ్‌లో ఓ జర్నలిస్టు దారుణంగా హత్యకు గురయ్యాడు. చత్రా జిల్లాలో ఇంద్రదేవ్ యాదవ్ అనే జర్నలిస్టును గుర్తు తెలియని దుండగులు గత రాత్రి హతమార్చారు. పోలీసుల కథనం ప్రకారం బైక్‌పై వచ్చిన దుండగులు ...జర్నలిస్టుపై అయిదు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలిపారు. దీంతో అతడు ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు వెల్లడించారు. ఇంద్రదేవ్ యాదవ్ స్థానిక టీవీ చానల్లో కరస్పాండెంట్‌గా పని చేస్తున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న అతడిపై దాడి చేసి, కాల్పులు జరిపారు. ఈ ఘటనను జార్ఖండ్ జర్నలిస్టు అసోసియేషన్, జర్నలిస్ట్ బిచర్ మార్చ్‌తో పాటు ఇతర మీడియా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాయి. కాగా జర్నలిస్టుపై దుండగులు ఎందుకు కాల్పులకు తెగబడ్డారనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు.