
ఉగ్రవాదులను, వారికి మద్దతిస్తున్న వారిని కలలో కూడా ఊహించలేని విధంగా శిక్షిస్తాం
ఎక్కడ దాక్కున్నా సరే వెతికి మరీ పట్టుకొస్తాం
ఉగ్రవాద శేషాన్ని సమూలంగా అంతం చేసే సమయం వచ్చింది
ప్రధాని మోదీ తీవ్ర హెచ్చరికలు
మధుబని: పహల్గాంలో పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు భూమండలంలో ఎక్కడ దాక్కున్నా సరే వెతికి మరీ పట్టుకొని శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్న దుష్ట శక్తులకు తగిన శిక్ష విధించక తప్పదని హెచ్చరించారు. గురువారం బిహార్‌లోని మధుబనిలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. రూ.13,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.
మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, నమో భారత్ ర్యాపిడ్ రైలుతోపాటు మరికొన్ని రైళ్లను ప్రారంభించారు. జాతీయ పంచాయత్ అవార్డులు ప్రదానం చేశారు. పహల్గాం మృతులకు సంతాప సూచకంగా బహిరంగ సభలో తొలుత మౌనం పాటించారు. అనంతరం మోదీ కొద్దిసేపు ఆంగ్ల భాషలో మాట్లాడారు.
పహల్గాం ఉగ్రవాద దాడి వెనుక ఉన్న ముష్కరులందరినీ కచ్చితంగా శిక్షిస్తామని ప్రతిన బూనారు. ఇలాంటి దాడులు మన నైతిక స్థైర్యాన్ని ఏమాత్రం దెబ్బతీయలేవని అన్నారు. శత్రువులు కేవలం నిరాయుధ పర్యాటకులనే కాదు, మనదేశాన్ని లక్ష్యంగా చేసుకొనే సాహసానికి ఒడిగట్టారని చెప్పారు. వారిని మట్టిలో కలిపేస్తామని స్పష్టంచేశారు. దేశంలో మిగిలిన ఉన్న ఉగ్రవాద శేషాన్ని తుదముట్టించే సమయం వచ్చిందన్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే...
కుట్రదారుల వెన్నువిరచడం ఖాయం
‘‘మిత్రులారా.. బిహార్ గడ్డపై నుంచి మొత్తం ప్రపంచానికి చెబుతున్నా. ఉగ్రవాదులు, వారికి మద్దతిస్తున్నవారు ఎక్కడ దాగి ఉన్నా సరే గుర్తించి, బంధించి, శిక్షిస్తాం. ప్రపంచం అంచుల దాకా వారిని వేటాడుతాం. కలలో కూడా ఊహించలేని విధంగా శిక్ష విధిస్తాం. ఉగ్రవాదులెవరూ తప్పించుకోలేరు. ముష్కర మూకలను చట్టం ముందు నిలబెట్టడం తథ్యం. 140 కోట్ల మంది భారతీయుల సంకల్పం కుట్రదారుల వెన్నువిరచడం ఖాయం.
శిక్ష తప్పనిసరిగా ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో మన దేశమంతా ఒకే మాటపై ఉంది. మానవత్వాన్ని విశ్వసించే వారంతా మన వెంటే ఉన్నారు. ఉగ్రవాదుల హేయమైన చర్య మనసున్న ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తు్తన్నా. వారికి దేశమంతా మద్దతుగా నిలుస్తోంది. ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదు. ఈ ప్రతికూల సమయంలో మనకు అండగా నిలిచిన ప్రపంచ దేశాల నేతలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని ప్రధాని మోదీ అన్నారు.
దేశమంతటా ఒకేలా ఆగ్రహావేశాలు
ఉగ్రవాద దాడిలో ఎంతోమంది నష్టపోయారు. కొందరు తమ కుమారులను పోగొట్టుకున్నారు. మరికొందరు తమ సోదరులను, జీవిత భాగస్వాములను కోల్పోయారు. బాధితులు దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాలకు చెందినవారు ముష్కరుల రాక్షసత్వానికి బలయ్యారు. కార్గిల్ నుంచి కన్యాకుమారి దాకా దేశమంతటా ఆగ్రహావేశాలు, విచారం ఒకేలా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి దారుణాలు ఇకపై జరగడానికి వీల్లేదు. వేగవంతమైన అభివృద్ధి కావాలంటే శాంతి, భద్రతలతో కూడిన పరిస్థితులు అత్యంత కీలకం.