
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అపారంగా ఉన్న ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మైనింగ్ అధికారులకు సూచించారు. ఏపీఎండీసీ(ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ) పనితీరుపై మంగళవారం విజయవాడలోని సంస్థ కార్యాలయంలో ఆయన సమీక్ష జరిపారు. బెరైటీస్, బొగ్గు, బీచ్ శాండ్, ఐరన్ ఓర్, బాల్ క్లే, సిలికా శాండ్, గ్రానైట్ తదితర ఖనిజాలకు సంబంధించిన ఆపరేషన్స్‌పై అధికారులతో ఈ సందర్భంగా మంత్రి సమీక్షించారు. ఖనిజ ఆధారిత పరిశ్రమలకు తోడ్పాటును అందించాలని ఆయన సూచించారు.
రాష్ట్రంలో కీలకమైన ఖనిజాల వెలికితీతలో ఏపీఎండీసీ చక్కటి ప్రగతి కనబరుస్తోందని, ఇతర రాష్ట్రాల్లోనూ బొగ్గు గనులను దక్కించుకుని ఆదాయ మార్గాలను పెంచుకుంటోందని అభినందించారు. ప్రభుత్వరంగ సంస్థగా ఏపీఎండీసీ రాష్ట్రంలో లభ్యమవుతున్న ఖనిజాల మైనింగ్‌లో ఇంకా చురుకైన పాత్ర పోషించాలని కోరారు. ఈ ఏడాది ప్రభుత్వం నిర్దేశించిన మేరకు మైనింగ్ కార్యక్రమాలను, లక్ష్యాలను సాధించేలా నిర్వహించాలని సూచించారు. ప్రైవేటు రంగంలోని మైనింగ్ సంస్థలకు దీటుగా ఏపీఎండీసీ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని కోరారు. ప్రాజెక్టుల వారీగా చేపట్టిన కార్యక్రమాలను ఏపీఎండీసీ ఎండీ వీజీ వెంకటరెడ్డి వివరించారు. కార్యక్రమంలో ఏపీఎండీసీ సలహాదారు డీఎల్‌ఆర్ ప్రసాద్, పలువురు అధికారులు పాల్గొన్నారు.