
తిరుపతి వైఎస్సార్‌సీపీలో కీలక నాయకుడిగా ఉన్న పుంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy)పై ఈనాడు పత్రిక పనిగట్టుకుని విషం చిమ్ముతోందని ధ్వజమెత్తారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పడి ఏడ్వటం ఈనాడుకు అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు.
డి.పట్టాభూములు,ప్రీహోల్డ్ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ తప్పుడు కథనాలు రాయడం ఈనాడు పత్రిక పనిగా పెట్టుకుందన్నారు. ఏడు నెలల క్రితం మదనపల్లి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో తగలబెట్టారు అంటూ ప్రచురించిన ఈనాడు.. ఇప్పుడు తప్పుడు కథనాలు ప్రచురిస్తూ విషం చిమ్ముతున్నారన్నారు. పచ్చి అబద్ధాలతో కూడిన వార్తలు రాస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)కు బాకా ఊదడం కోసమే పార్టీ పత్రికగా ఈనాడు మిగిలిపోయిందని భూమన విమర్శించారు.
‘ఈ కేసు విషయంలో డీజీపీని మదనపల్లెకు పంపించి మరీ విచారణ జరిపించారు. నివేదిక ఇచ్చారు. ఈనాడు మళ్లీ బురద చల్లడానికే ఈ వార్తలు ప్రచురిస్తున్నారు. ఫైల్స్ దహనం కేసులో ఏ సంబంధం లేకపోయినా పనికట్టుకుని ఇరికించాలని చూస్తోంది. ప్రజాధరణ కల్గిన నాయకుడు కనుక ఆయన్ని బద్నాం చేయాలని చూస్తోంది. వైఎస్సార్‌సీపీ(YSRCP)ని బలహీన పర్చాలని కుట్రలు చేస్తున్నారు.ఆయన ఏ తప్పు చేయలేదని ప్రజలు అందరికీ తెలుసు. ఎన్ని విచారణలు చేసినా, చేయించినా ఏ తప్పు చేయలేదన్నదే తేలుతుంది’ అని భూమన స్పష్టం చేశారు.