
వైఎస్సార్‌సీపీ సభ్యులతో కలిసి సభ నుంచి వాకౌట్ చేస్తున్న వైఎస్ జగన్
అసెంబ్లీ బయట మీడియాతో వైఎస్సార్‌సీపీ నేతలు బొత్స, పెద్దిరెడ్డి
సభలో ప్రతిపక్షం ఉండకూడదనే కూటమి సర్కారు కుట్ర.. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తామని భయపడుతున్నారు
ప్రజాసమస్యలపై పాలకపక్షం చొక్కా పట్టుకుని నిలదీస్తాం
మిర్చికి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
చట్ట సభలో ప్రజా గొంతుక వినిపించేందుకు వైఎస్సార్‌సీపీని ప్రతిపక్ష పార్టీ గా గుర్తించండి
ప్రభుత్వ వైఖరికి నిరసనగా గవర్నర్ ప్రసంగిస్తుండగా సభ నుంచి వైఎస్సార్‌సీపీ వాకౌట్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా.. చట్టసభలో ప్రజల గళాన్ని వినిపించనివ్వకుండా చేయాలనే కుట్రతో కూటమి సర్కారు వ్యవహరిస్తోందని విపక్ష పార్టీ నేతలు మండిపడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం వైఎస్సార్‌సీపీ నేతలు బొత్స, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టి.చంద్రశేఖర్, వరుదు కళ్యాణి బయట మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష హోదా ఇస్తే తమ పాలనా వైఫల్యాలను చట్టసభ సాక్షిగా నిలదీస్తారనే భయంతోనే కూటమి సర్కారు ఇలాంటి దుర్మార్గ పోకడలను అనుసరిస్తోందని ధ్వజమెత్తారు.
ప్రజా గొంతుక వినిపించడానికి వీల్లేకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని అంతకుముందు వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు శాసనసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఉన్న ఏౖకైక విపక్షం వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా కల్పించకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి పాతరేసిన చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలో సభ నుంచి వైఎస్సార్‌సీపీ వాకౌట్ చేసింది.
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jaganmohan Reddy) నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉభయ సభల సంయుక్త సమావేశానికి హాజరయ్యారు. ఆయన వెంట శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.
సభలో ఉన్నవి రెండే పక్షాలు: బొత్స సత్యనారాయణ, శాసన మండలిలో ప్రతిపక్షనేత
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ప్రజల వాణిని వినిపించేది, వారి కష్టాలపై ఎలుగెత్తేది ప్రతిపక్షమే. అలాంటి ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన హోదా, గౌరవం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. సభలో ఉన్నవి రెండే పక్షాలు. ఒకటి అధికారంలో ఉన్న కూటమి పార్టీలు... మరొకటి ప్రతిపక్షంగా నిలిచిన వైఎస్సార్‌సీపీ. సభలో మేం ఒక్కరమే విపక్షంలో ఉన్నాం కాబట్టే మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలని కోరాం.
మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులు, వారి కష్టాల గురించి సభలో ప్రస్తావించాం. వైఎస్ జగన్ గుంటూరు మిర్చియార్డు వద్దకు వెళ్లిన తరువాతే ఈ ప్రభుత్వం మేలుకుని రైతుల గురించి ఆలోచించడం మొదలు పెట్టింది. అయినా నేటికీ మిర్చి కొనుగోళ్లు చేయడం లేదు. కేంద్రం స్పందించాలని, కేంద్రమే కొనుగోలు చేయాలని అంటున్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా మిర్చి ఎందుకు కొనుగోలు చేయడం లేదు? ఇటువంటి అంశాలపై మాట్లాడాలంటే మాకు ప్రతిపక్ష హోదా కావాలి. అప్పుడే మాకు తగినంత సమయం లభిస్తుంది. మిర్చి రైతులను కలిసిన మా నాయకుడిపై కేసులు పెట్టారు.
మ్యూజికల్ నైట్ కోసం హంగూ ఆర్భాటంగా వెళ్లిన వారిపై మాత్రం ఎటువంటి కేసులు లేవు. ఇటువంటి నిరంకుశ విధానాలను ప్రశ్నించాలంటే ప్రతిపక్షంగా మాకు సరైన సమయం ఇవ్వాలి. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చారు. నేటికీ వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. కొత్తగా ప్రవేశపెట్టే బడ్జెట్‌లోనూ కేటాయింపులు లేకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. సర్కారు వైఖరిని ఎండగడుతూ ప్రజల సమస్యలను మీడియా ముఖంగా ప్రశ్నిస్తాం. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేస్తాం.
ప్రభుత్వ వైఫల్యాలను చొక్కా పట్టుకుని నిలదీస్తాం. రాష్ట్రంలో అన్ని వర్గాల వారు ఇబ్బందుల్లో ఉన్నారు. మిర్చి రైతులకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్ జోక్యంతో ఆదుకోకుండా కేంద్రం ఎప్పుడో కొనుగోలు చేస్తుందని మిర్చి రైతులను గాలికి వదిలేయడం సరికాదు. అప్పటి వరకు రైతులు తట్టుకునే పరిస్థితిలో లేరు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిని కల్పించవద్దు. ప్రభుత్వం వెంటనే దీనిపై ఆలోచన చేయాలనేది మా డిమాండ్. అసెంబ్లీకి వెళ్లాలా వద్దా అనే దానిపై ప్రభుత్వ ప్రతిస్పందన చూసి నిర్ణయం తీసుకుంటాం.
సభలో నిలదీస్తామనే భయంతోనే: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి
టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతి సందర్భంలోనూ వైఎస్సార్ సీపీని లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తోంది. గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగిందంటూ బురద చల్లటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఎనిమిది నెలలు గడుస్తున్నా ప్రజలకు ఏం చేస్తారో మాత్రం చెప్పడం లేదు. ప్రజల గళాన్ని వినిపిస్తుందనే భయంతోనే వైఎస్సార్‌సీపీని ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. మా నాయకుడు వైఎస్ జగన్ సభలో మాట్లాడేందుకు ప్రతిపక్ష నేతగా అవకాశం కల్పించాలి. ఇప్పటికే దీనిపై న్యాయ పోరాటం కూడా చేస్తున్నాం.
వైఎస్సార్‌సీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని గవర్నర్‌ని కోరాం. ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడంతో నిరసన వ్యక్తం చేసి సభ నుంచి వాకౌట్ చేశాం. దేశంలో ఎక్కడైనా సరే ప్రతిపక్షానికే పీఏసీ చైర్మన్ పదవి ఇస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనూ ఆ పదవిని ప్రతిపక్షానికే ఇచ్చాం. గతంలో ఒకే ఒక్క శాసనసభ్యుడు ఉన్న కాంగ్రెస్ పార్టీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు. ప్రపంచంలో ఒక్క ఆఫ్ఘనిస్తాన్‌లో మాత్రమే తాలిబన్ల పాలనలో కేవలం అధికార పక్షం మాత్రమే పని చేస్తుంది. ప్రతిపక్షం లేకుండా టీడీపీ మన రాష్ట్రంలో తాలిబన్ పాలన సాగిస్తోంది.
దేశంలో మరెక్కడా లేదు: వరుదు కళ్యాణి ఎమ్మెల్సీ
రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది. సభలో మూడు పార్టీలు అధికార పక్షంగానే ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ ఒక్కటే ప్రతిపక్షం. కాబట్టి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు? ఒక్క ఏపీ మినహా దేశంలో ఎక్కడా ఇలా లేదు. గతంలో ఢిల్లీలో బీజేపీ తరఫున కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్నిక కాగా, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించారు. కూటమి పాలనలో జరుగుతున్న అక్రమాలను ఎక్కడ సభలో నిలదీస్తారోననే భయంతోనే వైఎస్సార్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు.
కూటమి పాలన చూశాక ఇటువంటి పార్టీలకు ఎందుకు ఓటు వేశామని ప్రజలు బాధపడుతున్నారు. ప్రతిపక్ష హోదాపై కోర్టులో పిటిషన్ వేస్తే స్పీకర్ కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయకపోవడం దారుణం. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఏపీకి ప్రత్యేక హోదాపై ఎందుకు ప్రశ్నించడం లేదు? పోలవరం ఎత్తు తగ్గిస్తున్నా ఎందుకు నిలదీయలేకపోతున్నారు? వైఎస్సార్ సీపీకి అప్పు రత్న అవార్డు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు తొమ్మిది నెలల్లోనే ఏకంగా రూ.1.19 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన సీఎం చంద్రబాబుకు అంతకంటే గొప్ప బిరుదు ఏం ఇవ్వాలో పవన్ కళ్యాణ్ చెప్పాలి.
11 మందిని ఎదుర్కొనే సత్తా లేదా?
పదకొండు మందిని ప్రతిపక్షంగా ఎదుర్కొనే సత్తా కూటమి ప్రభుత్వానికి లేదా? ప్రజలు వైఎస్సార్ సీపీకి 41 శాతం ఓట్ షేర్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభలో మా గళం వినిపించేందుకు తగిన సమయం లభిస్తుంది. కూటమి ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసింది. తమ వైఫల్యాలను సభలో ఎండగడతారనే భయంతో ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీని గుర్తించేందుకు నిరాకరిస్తోంది.
రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం, రైతుల పక్షాన మాట్లాడాల్సిన అవసరం లేదా? అధికార మదంతో ప్రతిపక్షం గొంతును నొక్కేస్తున్నారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత గవర్నర్‌కు లేదా? ప్రజాస్వామిక విలువలను కాపాడి ప్రజల పక్షాల పాలన సాగేలా ఆయన చొరవ తీసుకోవాలి. కూటమి సర్కారు నిరంకుశ పాలనకు పరాకాష్ట నాలుగు మీడియా సంస్థలను నిషేధించడం. దేశ చరిత్రలో నోటీస్ ఇవ్వకుండా నాలుగు చానెళ్లను బహిష్కరించిన ఘటనలు ఎప్పుడూ లేవు.
– ఎమ్మెల్యే టి.చంద్రశేఖర్
విపక్షం వాకౌట్
చట్ట సభలో ప్రజల గొంతుక వినిపించాలంటే వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా కల్పించాల్సిందేనని పార్టీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో పట్టుబట్టారు. శాసనసభ సభలోకి గవర్నర్ ప్రవేశించి ప్రసంగిస్తుండగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ స్థానాల్లో నిలబడి ఆందోళన చేశారు. వారి ఆందోళనను పట్టించుకోకుండా గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో సేవ్ డెమోక్రసీ.. ఉయ్ వాంట్ జస్టిస్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి.. వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా కల్పించండి... అంటూ నినాదాలు చేశారు.
బాబు ష్యూరిటీ.. మోసం, బాదుడు గ్యారంటీ!
మద్దతు ధర లభించక తీవ్రంగా నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ.. బాబు ష్యూరిటీ.. ధరల బాదుడు గ్యారంటీ.. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. నిరసనలను పట్టించుకోకుండా గవర్నర్ ప్రసంగాన్ని కొనసాగిస్తుండటంతో సభ నుంచి వైఎస్సార్ సీపీ వాకౌట్ చేసింది. వైఎస్ జగన్ వెంట నినాదాలు చేస్తూ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి నిష్క్రమించారు.
Comments
Please login to add a commentAdd a comment