
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో మహిమాన్వితమైన కాశీనాయన క్షేత్రం కూల్చివేతల వెనుక ఉన్న దుష్టశక్తులు ఎవరో బయట పెట్టాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ల మధ్య ఉన్న వైరుధ్యాలతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు నలిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీనాయన క్షేత్రం కూల్చివేతలు ఈ రాష్ట్రంలో హిందూధర్మం గుండెలను బుల్డోజర్‌లతో బద్దలుకొట్టడమేనని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
సనాతనధర్మ పరిరక్షణ అంటే ఇదేనా పవన్?
సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ కూల్చివేతలపై ఎక్కడా స్పందించలేదు. పాశవికంగా, దుర్మార్గంగా జరిగిన ఈ దాడిపై ఆయన నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదు. ఈ కూల్చివేతలు చేపట్టిన అటవీశాఖ సనాతన ధర్మ పరిరక్షకుడుగా తనకు తాను చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిధిలో, ఆయన పర్యవేక్షణలో పనిచేస్తోంది. సనాతన ధర్మంపై దాడి చేస్తే, వారి తలలు తీస్తాను అంటూ భీకర ప్రతిజ్ఞలు చేసే పవనానందుల గొంతుక ఇప్పుడు మాత్రం మూగబోయింది. ఆయన దీనిపై స్పందించాల్సిన అవసరం లేదా? గతంలో తిరుపతిలో ఆరుగురు చనిపోయినప్పుడు నేరుగా ఇక్కడికి వచ్చి క్షమాపణలు చెప్పారు.
ఈ రోజు కాశీనాయన క్షేత్రాన్ని పవన్ పరిధిలోని శాఖకు చెందిన అధికారులే కూల్చేవేస్తే ఎందుకు మౌనంగా ఉన్నారు? మీకు బదులుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు క్షమాపణలు చెప్పారు? తిరుపతి విషయంలో సారీలు చెప్పడం మా పార్టీ విధానం కాదు అంటూ ఆనాడు మంత్రి లోకేష్ వ్యాఖ్యలు చేయడం నిజం కాదా? ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆధీనంలోని అటవీశాఖ అధికారులు చేసిన దానికి విద్యాశాఖ మంత్రిగా క్షమాపణలు చెప్పడం, తానే కాశీనాయన క్షేత్రంను నిర్మించి ఇస్తానని ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. నారా లోకేష్, పవన్ కల్యాణ్‌ల మధ్య ఉన్న వైరుధ్యాల వల్ల పవిత్ర క్షేత్రాలు నలిగిపోవాలా?
సోషల్ మీడియా సాక్షిగా వీరిద్దరి మధ్య ఉన్న గొడవలు అందరికీ తెలిసినవే. రెడ్‌బుక్ గుడ్డితనం కమ్మి గతంలో ఆలయాలను కూల్చిన వారు నేడు కాశీనాయన క్షేత్రంపై విరుచుకుపడ్డారు. ఎవరు కూల్చారో తెలియదు, ఉత్తర్వులు ఎవరో గుడ్డిగా ఇచ్చారంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఇది సమర్థించుకోవడం కాదు? మీకు తెలియకుండానే ఆలయాలు నేలమట్టం అవుతాయా? ఆశ్రమాలు కూలతాయా? ప్రసాదంలో విషాలు కలుస్తాయా? కాషాయం కింద విషం చిమ్ముతున్నది మీది కాదా? పార్టీ మీటింగ్‌లకు ప్రభుత్వ సొమ్ముతో గాలిలో ఎగిరి ప్రయాణాలు చేసే పవన్ కళ్యాణ్ హెలికాఫ్టర్‌కు కాశీనాయన క్షేత్రంకు దారి కనిపించడం లేదా?
మా ఇంట్లోనే సనాతన ధర్మం పుట్టింది అంటూ గతంలో పవన్ చెప్పారు. ఆయనే మా తండ్రి పూజ గదిలో వెలిగే దీపారాదనతో సిగరెట్ వెలిగించుకునేవారు అని కూడా అన్నారు. ఇవ్వన్నీ కూడా సనాతన ధర్మం కిందకు వస్తాయా అని కూడా పవనానంద స్వామీ చెప్పాలి.
శ్రీశైలం క్షేత్రాన్ని కూడా కూల్చివేస్తారా?
కాశీనాయన క్షేత్రం కూల్చివేతలపై దేవాదాయశాఖ మంత్రి స్పందిస్తూ ఈ క్షేత్రం టైగర్‌జోన్ పరిధిలో ఉన్నందునే కూల్చివేశారు అంటూ ప్రకటన చేశారు. టైగర్‌జోన్ పరిధిలోనే ఉన్న శ్రీశైలంను కూడా కూల్చివేస్తామనే ఉద్దేశం ఆ శాఖ మంత్రి మాటల్లో అర్థమవుతోంది. టైగర్‌జోన్ పరిధిలో ఉన్న అన్ని దేవాలయాలను కూల్చివేయాలన్నదే ఈ కూటమి ప్రభుత్వ అసలు లక్ష్యం. కూటమి పాలనలో హిందూ దేవాలయాలకు దిక్కులేకుండా పోయింది.
ఆలయాల పరిరక్షణకు ఎటువంటి చర్యలు లేవు. రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉన్న కాశీనాయన క్షేత్రంకు ఉన్న ఆధ్యాత్మిక విలువల దృష్ట్యా దీనిని అటవీ చట్టాల పరిధి నుంచి మినహాయించాలని ఆనాడే సీఎం హోదాలో వైఎస్ జగన్ కేంద్ర అటవీశాఖకు లేఖ రాశారు. ఇప్పుడు సనాతన సారధి పవన్ కళ్యాణ్ పరిధిలోని అటవీశాఖ అధికారులు కేంద్ర అటవీశాఖ నుంచి ఎటువంటి ఉత్తర్వులు, ఆదేశాలు లేకుండానే ఈ క్షేత్రంలోని నిర్మాణాలను కూల్చివేశారు.
పవన్ కళ్యాణ్ ఆదేశాలు లేకుండానే ఈ కూల్చివేతలు జరిగాయా? వీటిని కూల్చివేస్తున్నారని తెలిసి కూడా ఎందుకు పవన్ దానిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఎంతసేపు బీజేపీకి కొమ్ముగాయడం, మోయడంలో తనమునకలు అయ్యి ఉండటం వల్లే ఇటువంటి ఘోరమైన సంఘటనను పట్టించుకోలేదా? బొట్లు పెట్టడం, మెట్లు కడగడం మినహా ఆలయాలను పరిరక్షించాలనే విషయాన్ని విస్మరించారు. బీజేపీ కూడా ఎందుకు స్పందించడం లేదు. కాశీనాయన క్షేత్రంను కులం కోణంలో చూస్తున్నారా అనే అనుమానాలు, అది అసలు ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు అనే భావనను కలిగిస్తున్నారా అనుమానం భక్తుల్లో కలుగుతోంది.
కూటమి పాలనలో హిందూధర్మంకు గడ్డుకాలం
కూటమి పాలనలో హిందూధర్మంకు గడ్డుకాలం దాపురించింది. కూటమి ప్రభుత్వానికి వైయస్‌ఆర్‌సీపీపై అభాండాలు మోపి పబ్బం గడుపుకోవడమే తెలుసు. తిరుయల లడ్డూలో కల్తీనెయ్యి అంటూ ఒక పచ్చి అబద్దాన్ని తెరమీదికి తీసుకువచ్చి ఆనాడు వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై దుర్మార్గమైన నిందలు మోపారు. ఆవుకొవ్వు, పందికొవ్వు కలిపారంటే సాక్షాత్తూ సీఎం ఒక ప్రకటన చేయడం, వారి రాజకీయం కోసం ఎంత దూరమైన సరే దిగజారిపోతారనడానికి నిదర్శనం.
జనం దీనిని నిజమని నమ్మేలా శతవిధాల ప్రయత్నించారు. దీనిపై సుప్రీంకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక అత్యున్నత పదవిలో ఉన్నవారు బాధ్యతారహితంగా ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. ఇదంతా ఒక కుట్ర అంటూ వైఎస్సార్‌సీపీ ధైర్యంగా ఎదుర్కోవడంతో ఈ కూటమి ప్రభుత్వం సిగ్గుతో వెనక్కి తగ్గింది.
అలాగే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లలో కూటమి ప్రభుత్వం బాధ్యతారాహిత్యం కారణంగా తొక్కిసాలకు గురై ఆరుగురు మృతి చెందడం, 45 మందికి పైగా గాయపడ్డారు. వైఎస్సార్‌సీపీ పాలనలో చిన్నచిన్న పొరపాట్లను కూడా అత్యంత దారుణంగా చిత్రీకరించారు. అదే కూటమి పాలనలో జరుగుతున్న అరాచకాలను ఏదో పొరపాటున జరిగిన చిన్న అంశంగా సమర్థించుకుంటున్నారు. తాజాగా ఒక తాగుబోతు నేరుగా శ్రీవారి ఆలయ ప్రాంగణం బయట మద్యం మత్తులో పెద్ద ఎత్తున గొడవ చేశాడు. శ్రీవారి కొండపై మద్యం ఎంతైనా దొరుకుతుందంటూ వీరంగం సృష్టించారు. ఇప్పటి వరకు నాలుగుసార్లు ఎర్రచందనం కొండపై పట్టుబడింది. దానిపై ఎటువంటి చర్యలు లేవు.
ఎన్టీఆర్‌ను మానసికంగా చంపి పుట్టిన పార్టీ టీడీపీ
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శవాలపైన పుట్టిన పార్టీ అంటూ మాట్లాడారు. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఎన్టీఆర్‌ను మానసికంగా చంపి, ఆయన శవాన్ని అడ్డం పెట్టుకుని, అధికారాన్ని లాక్కుని అనే విషయం లోకేష్ గుర్తించాలి. తెలుగుదేశం అధికారపీఠం కింద విగతజీవులైన పింగళి దశరథ్‌రామ్, వంగవీటి మోహనరంగా వంటి వారు ఉన్నారని లోకేష్ తెలుసుకోవాలి.
గిల్లి జోల పాడటం, చంపి మాలవేయడం, వెన్నుపోటు పొడిచి పీఠమెక్కడం టీడీపీ లక్షణం. కూటమి ప్రభుత్వంలో కూర్చున్నందుకే కాషాయదళం నోరువిప్పడం మానేసింది. ఏపీలో సనాతన ధర్మానికి జరుగుతున్న అన్యాయం, ఆలయాల విధ్వంసం, శ్రీవారి క్షేత్రంలో జరుగుతున్న అనాచారం, దళారీల మయంగా మారిన పవిత్రక్షేత్రం కాషాయదళానికి కనిపించడం లేదు. అమరావతిలో శ్రీవారి కళ్యాణం జరిపామంటూ ఎంతో ఆర్భాటంగా ప్రకటించుకున్న సీఎం చంద్రబాబు.. గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు స్వామివారి కళ్యాణాలను గ్రామాల్లోకి తీసుకువచ్చాం. 2004 డిసెంబర్ నుంచే నేను టీటీడీ బోర్డ్ సభ్యుడగా ఉన్నప్పుడే మొట్టమొదటి సూళ్ళూరిపేట దళితవాడలో స్వామివారి కళ్యాణంను అద్భుతంగా నిర్వహించాం. తరువాత కొన్ని పదుల సంఖ్యలో శ్రీవారి కళ్యాణాలు చేయించాం’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు.

Comments
Please login to add a commentAdd a comment