
అత్యంత విలువైన ఖనిజాలపై అజమాయిషీ ఇచ్చేందుకు సిద్ధపడ్డ జెలెన్‌స్కీ
దేశ భద్రతపై భరోసా కోసం పట్టుబడుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు
రేపు అమెరికాలో పర్యటించనున్న జెలెన్‌స్కీ !
కీవ్: సొంత భూభాగాలను కాపాడుకునేందుకు రష్యాతో యుద్ధంచేస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మూడేళ్లుగా అమెరికా చేసిన ఆయుధ, ఆర్థిక సాయానికి అత్యంత అరుదైన, విలువైన ఖనిజాల రూపంలో కృతజ్ఞత చూపేందుకు సిద్ధమయ్యారు. అయితే తమ దేశ రక్షణ, భద్రత విషయంలో అగ్రరాజ్యం అండగా ఉండాలని కీలక షరతు విధించారు. అయితే ఈ షరతుకు అమెరికా ఏ మేరకు ఒప్పుకుంటుందో శుక్రవారంకల్లా స్పష్టత వచ్చే వీలుంది.
శుక్రవారం జెలెన్‌స్కీ అమెరికాలో పర్యటించి ట్రంప్‌తో భేటీ అయి విస్తృతస్థాయిలో చర్చలు జరపనున్నారు. చర్చలు సఫలమైతే కీలకమైన ఖనిజ, ఆర్థిక ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. అరుదైన ఖనిజాల డీల్ కుదిరాక, యుద్ధంలో రష్యాకు ఎదురునిలబడి అమెరికా తమకు ఏమేరకు అండగా నిలబడుతుందనే అనుమానాలు జెలెన్‌స్కీ మదిలో అలాగే ఉన్నాయి. తాజాగా ఐక్యరాజ్యసమితి సాక్షిగా రష్యా వ్యతిరేక తీర్మానంలో తమకు మద్దతు పలకాల్సిందిపోయి రష్యాకు అనుకూలంగా అమెరికా ఓటేసిన నేపథ్యంలో భద్రతా అంశంపై జెలెన్‌స్కీ పట్టుబట్టినట్లు తెలుస్తోంది.
మూడేళ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో వందల బిలియన్ డాలర్ల ఆర్థిక, ఆయుధ సాయం పొందిన కారణంగా అగ్రరాజ్య ఖనిజ సంపద డిమాండ్‌కు జెలెన్‌స్కీ తలొగ్గక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై బుధవారం ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌లో జెలెన్‌స్కీ మీడియాతో మాట్లాడారు. ‘‘ అమెరికాలో ఆర్థిక ఒడంబడిక చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యాచరణ ఒప్పందం త్వరలో సమగ్ర ఒడంబడికకు బాటలు వేస్తుంది.
ఈ ఒప్పందంలో మా దేశ భద్రతా అంశమే అత్యంత ప్రధానమైంది. ఈ అంశాన్ని తేల్చుకునేందుకు అమెరికాలో పర్యటించి ట్రంప్‌తో భేటీ అవుతా. ఖనిజ వనరులపై పాక్షిక హక్కులు ధారాదత్తం చేయడంసహా యుద్ధంలో ఆయుధసాయంపై చర్చిస్తా. యుద్ధంలో సైనికసాయం కొనసాగించే ఉద్దేశం అమెరికాకు ఉందో లేదో తెల్సుకుంటా. నేరుగా అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు విషయమూ మాట్లాడతా. స్తంభింపజేసిన రష్యా స్థిర,చరాస్తులను మేం ఆయుధాల పెట్టుబడుల కోసం వినియోగించుకునే అంశాన్నీ ప్రస్తావిస్తా. అన్ని విషయాలు కొలిక్కివస్తే సమగ్ర ఒప్పందంపై సంతకం చేస్తా’’ అని జెలెన్‌స్కీ వివరించారు.
భారీ డీల్ కుదుర్చుకుంటాం: ట్రంప్
మూడేళ్ల సాయానికి ప్రతిఫలంగా విలువైన ఖనిజ సంపద, సహజ వనరులపై వాటా కోరుతున్న ట్రంప్ ఈ ఒప్పందంపై మాట్లాడారు. బుధవారం వాషింగ్టన్‌లో తమ మంత్రివర్గ తొలి భేటీ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘‘ జెలెన్‌స్కీ శుక్రవారం వాషింగ్టన్‌కు వస్తారు. నాతో కలిసి అతిపెద్ద ఒప్పందంపై సంతకాలు చేస్తారు.
అమెరికన్లు పన్నుల రూపంలో ప్రభుత్వానికి కట్టిన సొమ్మును మేం ఉక్రెయిన్ కోసం యుద్ధంలో సాయంగా ఖర్చుచేశాం. ఈ సొమ్ము అంతా ఇప్పుడు తిరిగిరాబోతోంది. ఖనిజాల తవ్వకంతో అమెరికా లాభపడనుంది. ఉక్రెయిన్‌తో దాదాపు 1 ట్రిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదుర్చుకోబోతున్నా’’ అని ట్రంప్ అన్నారు. ‘‘నాటోలో సభ్యత్వం ఆశను ఉక్రెయిన్ వదులుకుంటే మంచిది. నాటో కూటమి సైతం ఈ అంశాన్ని మర్చిపోతే బాగుంటుంది’’ అని ట్రంప్ అన్నారు.
ప్రాథమిక ఒప్పందం ఓకే
ఇరుదేశాల మధ్య ప్రాథమిక ఒప్పందం దాదాపు ఖరారైందని ఉక్రెయిన్ ప్రధాన మంత్రి డెనిస్ షెమిహాల్ బుధవారం వెల్లడించారు. ‘‘ యుద్ధంలో దెబ్బతిన్న కారణంగా ఉక్రెయిన్ పునర్ నిర్మాణం, శాంతి, పెట్టుబడుల ప్రాతిపదికన అమెరికాతో ఆర్థిక ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. ఉక్రెయిన్ పునర్‌నిర్మాణ క్రతువులో అమెరికా క్రియాశీలక పాత్ర పోషిస్తుందని భావి స్తున్నాం’’ అని ఉక్రెయిన్ ప్రభుత్వ టెలివిజన్‌లో ప్రధాని డెనిస్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment