National defense
-
Russia-Ukraine war: ‘ఖైదీ’ సైనికులు
వాళ్లంతా కొన్ని నెలల క్రితం దాకా ఖైదీలు. పలు నేరాలకు శిక్షను అనుభవిస్తున్న వారు. కానీ ఇప్పుడు మాత్రం దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి మరీ పోరాడుతున్న సైనిక వీరులు! రష్యాతో రెండేళ్లకు పైగా సాగుతున్న యుద్ధంలో నానాటికీ పెరుగుతున్న సైనికుల కొరతను అధిగమించేందుకు ఉక్రెయిన్ తీసుకున్న వినూత్న నిర్ణయం వారినిలా హీరోలను చేసింది. ఎంతోమంది ఖైదీలు పాత జీవితానికి ముగింపు పలికి సైనికులుగా కొత్త జీవితం ప్రారంభించారు. ఫ్రంట్ లైన్లో పోరాడుతూ, కందకాలు తవ్వడం వంటి సహాయక పనులు చేస్తూ యుద్ధభూమిలో దేశం కోసం చెమటోడుస్తున్నారు.రష్యాతో రెండున్నరేళ్ల యుద్ధం ఉక్రెయిన్ను సైనికంగా చాలా బలహీనపరిచింది. ఈ లోటును భర్తీ చేసుకుని రష్యా సైన్యాన్ని దీటుగా ఎదుర్కోవడానికి ఖైదీల వైపు మొగ్గు చూపింది. ఇందుకోసం ఉక్రెయిన్ కొత్త చట్టం చేసింది. దాని ప్రకారం వాళ్లను యుద్ధంలో సైనికులుగా ఉపయోగించుకుంటారు. అందుకు ప్రతిగా యుద్ధం ముగిశాక వారందరినీ విడుదల చేస్తారు. అంతేకాదు, వారిపై ఎలాంటి క్రిమినల్ రికార్డూ ఉండబోదు! దీనికి తోడు ఫ్రంట్లైన్లో గడిపే సమయాన్ని బట్టి నెలకు 500 నుంచి 4,000 డాలర్ల దాకా వేతనం కూడా అందుతుంది!! అయితే శారీరక, మానసిక పరీక్షలు చేసి, కనీసం మూడేళ్లు, అంతకు మించి శిక్ష మిగిలి ఉండి, 57 ఏళ్ల లోపున్న ఖైదీలను మాత్రమే ఎంచుకున్నారు. ఈ లెక్కన 27,000 మంది ఖైదీలు పథకానికి అర్హులని ఉక్రెయిన్ న్యాయ శాఖ తేలి్చంది. కనీసం 20,000 మంది ఖైదీలన్నా సైనికులుగా మారతారని అంచనా వేయగా ఇప్పటికే 5,764 మంది ముందుకొచ్చారు. వారిలో 4,650 మంది ఖైదీలు సైనికులుగా అవతారమెత్తారు. ఈ ‘ఖైదీ సైనికు’ల్లో 31 మంది మహిళలున్నారు! 21 రోజుల శిక్షణ తర్వాత వీరు విధుల్లో చేరారు. గట్టి రూల్సే ఖైదీలను ఇలా సైన్యంలోకి తీసుకునేందుకు కఠినమైన నిబంధనలే ఉన్నాయి. హత్య, అత్యాచారం, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల నేరాలు, దేశద్రోహం, ఇతర తీవ్ర నేరాలకు పాల్పడిన వారికి పథకం వర్తించబోదు. నేరాలకు పాల్పడిన ఎంపీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా అనర్హులే. అయితే హత్యకు పాల్పడిన ఖైదీలను తమతో చేర్చుకునేందుకు అనుమతివ్వాలని ష్క్వాల్ బెటాలియన్ కోరుతోంది. ఫ్రంట్ లైన్లో అవసరమైన నైపుణ్యాలు వారికి బాగా ఉంటాయని వాదిస్తోంది. కొన్ని కేసుల్లో డ్రగ్స్ నేరాలకు పాల్పడ్డ వారినీ తీసుకుంటున్నారు. జైలరే వారి కమాండర్! తూర్పు ఉక్రెయిన్‌లోని పోక్రోవ్స్్కలో 59 బ్రిగేడ్‌లో 15 మందితో కూడిన పదాతి దళ సిబ్బంది విభాగానికి ఓ గమ్మత్తైన ప్రత్యేకత ఉంది. బ్రిగేడ్ కమాండర్ ఒలెగ్జాండర్ వాళ్లకు కొత్త కాదు. ఆయన గతంలో జైలు గార్డుగా చేశారు. 2022 ఫిబ్రవరిలో యుద్ధం మొదలవగానే సైనిక కమాండర్‌గా మారారు. ఇప్పుడు అదే జైల్లోని ఖైదీలు వచ్చి ఈ బ్రిగేడ్‌లో సైనికులుగా చేరారు. ఆయన కిందే పని చేస్తున్నారు! ‘‘యుద్ధభూమిలో వారు నన్ను మాజీ జైలు గార్డుగా కాక అన్నదమ్ములుగా, కమాండర్‌గా చూస్తారు. అంతా ఒకే కుటుంబంలా జీవిస్తాం. వీరికి తండ్రి, తల్లి, ఫిలాసఫర్... ఇలా ప్రతీదీ నేనే’’ అంటారాయన. సదరు జైలు నుంచి మరో పాతిక మంది దాకా ఈ బ్రిగేడ్‌లో చేరే అవకాశముందట.మట్టి రుణం తీర్చుకునే చాన్స్ జైల్లో మగ్గడానికి బదులుగా సైనికునిగా దేశానికి సేవ చేసే అవకాశం దక్కడం గర్వంగా ఉందని 41 ఏళ్ల విటాలీ అంటున్నాడు. అతనిది డ్రగ్ బానిసగా మారి నేరాలకు పాల్పడ్డ నేపథ్యం. నాలుగు నేరాల్లో పదేళ్ల శిక్ష అనుభవించాడు. ‘‘మా ఏరియాలో అందరు కుర్రాళ్లలా నేనూ బందిపోట్ల సావాసం నడుమ పెరిగాను. ఇప్పటిదాకా గడిపిన జీవితంలో చెప్పుకోవడానికంటూ ఏమీ లేదు. అలాంటి నాకు సైన్యంలో చేరి దేశం రుణం తీర్చుకునే గొప్ప అవకాశం దక్కింది. ఇలాగైనా మాతృభూమికి ఉపయోగపడుతున్నాననే తృప్తి ఉంది. కానీ సైనిక జీవితం ఇంత కష్టంగా ఉంటుందని మాత్రం అనుకోలేదు. కాకపోతే బాగా సరదాగా కూడా ఉంది’’ అని చెప్పుకొచ్చాడు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
గఘనయానులు...
భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ మిషన్‌లో పాల్గొనబోతున్న వ్యోమగాములంతా నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థులే. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, శుభాన్షు శుక్లా వృత్తిరీత్యా యుద్ధపైలెట్లు. వీరంతా గగన్‌యాన్ కోసం ఇప్పటికే రష్యాలో వ్యోమగాములుగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. భారత్‌లోనూ ఇస్రో వీరికి కొంతకాలంగా ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. తమ నలుగురు యుద్ధవిమాన పైలెట్లు గగన్‌యాన్‌లో భాగస్వాములు కావడం తమకెంతో గర్వకారణమని భారత వాయుసేన పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ ‘సూపర్ ఫోర్’ గురించి... ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ భారత వాయుసేనలో యుద్ధవిమానాన్ని సుదీర్ఘకాలంపాటు నడిపిన అనుభవం ఉన్న పైలెట్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఈ నలుగురిలో ఒక్కడిగా ఎంపికయ్యారు. కేరళలోని తిరువజియాడ్‌లో 1976 ఆగస్ట్ 26న జన్మించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ)లో శిక్షణ పూర్తిచేసుకుని అక్కడే ‘స్క్వాడ్ ఆఫ్ హానర్’ను సాధించారు. తమిళనాడులోని వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్విసెస్ స్టాఫ్ కాలేజీలో, తాంబరం ఎఫ్‌ఐఎస్‌లో చదువుకున్నారు. తర్వాత ఈయన 1998 డిసెంబర్19న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో యుద్ధవిమాన పైలెట్‌గా విధుల్లో చేరారు. సుఖోయ్30ఎంకేఐ, మిగ్–21, మిగ్–29 ఇలా పలు రకాల యుద్ధవిమానాలు నడపడంలో ఈయన దిట్ట. మొత్తంగా 3,000 గంటలకుపైగా యుద్ధవిమానాలను నడిపారు. కీలకమైన సుఖోయ్–30 స్క్వాడ్రాన్‌కు కమాండింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ‘ఎ’ కేటగిరీ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా, టెస్ట్ పైలెట్‌గా అనుభవం గడించారు. గగన్‌యాన్‌లో ఈయన గ్రూప్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోనున్నారు. నాయర్ భార్య లీనా మలయాళ సినీపరిశ్రమలో నటిగా పేరొందారు. వీళ్లది పెద్దలు కుదిర్చిన పెళ్లి. గత నెల 17వ తేదీన వీరి వివాహం జరిగింది. ‘ మా ఆయనకు తొలి ఇండియన్ ఆస్ట్రోనాట్ వింగ్స్ దక్కడం కేరళ రాష్ట్రానికే గర్వకారణం’ అని ఆమె ఆనందం వ్యక్తంచేశారు. వీళ్ల కుటుంబం కేరళలోని పాలక్కడ్ జిల్లా నెన్‌మరలో నివసిస్తోంది. నాయర్‌ను ఆస్ట్రోనాట్‌గా ప్రధాని ప్రకటించగానే నెన్‌మరలో పండగ వాతావరణం నెలకొంది. అజిత్ కృష్ణన్ అజిత్ కృష్ణన్ 1982లో చెన్నైలో జన్మించారు. ఈయన సైతం ఎన్డీఏలో శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకుని స్వోర్డ్ ఆఫ్ ఆనర్ పొందారు. రాష్ట్రపతి బంగారు పతకాన్ని సాధించారు. ఈయన తమిళనాడులోని వెల్లింగ్టన్లోని డీఎస్‌ఎస్‌సీలోనూ చదువుకున్నారు. 2003 జూన్‌లో భారత వాయుసేనలో పైలెట్‌గా చేరారు. ఫ్లయింగ్ ఇన్‌స్టక్టర్‌గా, టెస్ట్ పైలెట్‌గా ఉంటూ 2,900 గంటలపాటు యుద్ధ విమానాలను నడిపారు. సుఖోయ్, మిగ్, జాగ్వర్, డోర్నియర్, ఏఎన్–32 రకం విమానాలను నడిపారు. ఈ మిషన్‌లో అవసరం మేరకు గ్రూప్ కెప్టెన్ గా ఉంటారు. అంగద్ ప్రతాప్ అంగద్ ప్రతాప్ 1982లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జన్మించారు. ఈయన సైతం ఎన్డీఏ పూర్వ విద్యార్ధే. 2004 డిసెంబర్లో భారత వాయుసేన దళాల్లో చేరారు. టెస్ట్ పైలెట్‌గా, ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా సేవలందించారు. దాదాపు 2,000 గంటలపాటు విమానాలు నడిపిన అనుభవం ఉంది. సుఖోయ్ 30 ఎంకేఐ, మిగ్–21, మిగ్–29, హాక్, డోర్నియర్, ఏఎన్–32సహా ఎన్నో రకాల విమానాలను సమర్థవంతంగా నడిపారు. గగన్‌యాన్ మిషన్‌లో ఈయన గ్రూప్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. శుభాన్షు శుక్లా వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో 1985లో జన్మించారు. ఎన్డీఏలో శిక్షణ పూర్తిచేసుకుని 2006 జూన్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలెట్‌గా చేరారు. ఫైటర్ కంబాట్ లీడర్‌గా, టెస్ట్ పైలెట్‌గా 2,000 గంటలపాటు యుద్ధవిమనాలు నడిపారు. భారత వాయుసేనలోని దాదాపు అన్నిరకాల యుద్ధవిమానాలు నడపడంలో ఈయన నైపుణ్యం సాధించారు. ఈ నలుగురికి రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ శిక్షణ సంస్థలో సమగ్రమైన శిక్షణ ఇచ్చారు. గగన్‌యాన్‌లో ఈయన వింగ్ కమాండర్‌గా వ్యవహరిస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈశాన్యంలో అవినీతి సంస్కృతి అంతం
నామ్సాయ్(అరుణాచల్ ప్రదేశ్): ఈశాన్య రాష్ట్రాల్లో అవినీతి సంస్కృతిని బీజేపీ అంతం చేసిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే నిధులు పక్కదారి పట్టడం లేదని, చివరి లబ్ధిదారుడి దాకా చేరుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో నిధులు మధ్యవర్తుల జేబుల్లోకి వెళ్లేవని అన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఈశాన్య రాష్ట్రాలు దారుణంగా నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆక్షేపించారు. ఆయన ఆదివారం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ(ఎన్డీయూ) మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం(ఎంఓయూ)పై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం అరుణాచల్ రాష్ట్రం ఈస్ట్ సియాంగ్ జిల్లాలోని పాసీఘాట్‌లో ఎన్డీయూ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు. ఒప్పందంపై సంతకాల అనంతరం నామ్సాయ్ జిల్లాలో భారీ ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. ఈశాన్య భారతదేశానికి మోదీ సర్కారు ఏం చేసిందంటూ ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలపై అమిత్ షా మండిపడ్డారు. కళ్లు మూసుకుంటే అభివృద్ధి ఎలా కనిపిస్తుందని నిలదీశారు. కళ్లు తెరిచి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూడాలని హితవు పలికారు. ‘‘రాహుల్ గాంధీజీ.. మీరు కళ్లు తెరవండి. ఇటలీ కళ్లద్దాలను పక్కనపెట్టండి. ఇండియా కళ్లద్దాలు ధరించండి’’ అని అమిత్ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదుల ప్రాబల్యం అధికంగా ఉండేదని, ఇప్పుడు శాంతి పవనాలు వీస్తున్నాయని ఉద్ఘాటించారు. ఇక్కడి ప్రజల్లో దేశభక్తి నిండిపోయిందని, ఒకరినొకరు ‘నమస్తే’ బదులు ‘జైహింద్’ అంటూ అభివాదం చేసుకుంటారని తెలిపారు. ఇలాంటి సన్నివేశం దేశంలో ఇంకెక్కడా చూడలేమన్నారు. -
Bavajipalem: దేశసేవలో పునీతం
సాక్షి, గుంటూరు: ఆ గ్రామం తరతరాలుగా దేశసేవలో తరిస్తోంది. భారత సైన్యంలో సేవలందించని గడపలు ఆ ఊళ్లో లేవు. ప్రతి ఇంటి నుంచి ఇద్దరు, ముగ్గురు, నలుగురు సైన్యంలో చేరి దేశానికి సేవచేసినవారు ఉంటారు. భారత సైనిక వ్యవస్థలో గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం బావాజీపాలెం గ్రామానికి ప్రత్యేక స్థానం ఉంది. బావాజీపాలెం గ్రామంలో 300 కుటుంబాలున్నాయి. గ్రామస్తులంతా ముస్లింలే. దేశ రక్షణకు ప్రాణాలు పణంగా పెట్టి సైన్యంలో చేరాలంటే చాలామంది యువకులు తటపటాయిస్తుంటారు. అయితే ఈ గ్రామంలోని తల్లిదండ్రులు మాత్రం బిడ్డలను సైన్యంలోకి పంపడాన్ని కర్తవ్యంగా భావిస్తారు. యువకులు సైతం సైన్యంలో చేరేందుకు ఉత్సాహంగా అడుగులు వేస్తారు. గ్రామంలోని 98 శాతం ఇళ్లలో సైనికులు, మాజీ సైనికులు ఉన్నారు. దీంతో బావాజీపాలెం మిలటరీ గ్రామంగా ప్రసిద్ధి చెందింది. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు గ్రామం నుంచి కొందరు యువకులు సైన్యంలో చేరారు. ఆ స్ఫూర్తితో తరువాతి తరాలు సైన్యంలో చేరడానికి ఆసక్తి చూపాయి. ఇప్పటివరకు ఈ గ్రామం నుంచి 500 మంది సైన్యంలో చేరి దేశానికి సేవలందించారు. ప్రస్తుతం గ్రామస్తులు 50 మందికి పైగా సైన్యంలో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆర్మీ 1965 చైనా యుద్ధం, 1971 పాకిస్తాన్ యుద్ధం, 1999 కార్గిల్ వార్ ఇలా సరిహద్దుల్లో భారత్ జరిపిన ప్రతి పోరాటంలో బావాజీపాలెం సైనికులు పాల్గొన్నారు. తరతరాలుగా దేశ రక్షణకు జవాన్లను అందిస్తున్న ఈ గ్రామాన్ని 1978లో భారత ఆర్మీ దత్తత తీసుకుంది. మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ సహకారంతో వాటర్ స్కీమ్‌ను చేపట్టి గ్రామంలో వాటర్ ట్యాంకు నిర్మించి తాగునీటి సమస్యను తీర్చింది. యువతకు ఆదర్శం చెడు సహవాసాలతో దురలవాట్లకు బానిసలుగా మారి, డబ్బు కోసం నేరాలకు పాల్పడి భవిష్యత్ నాశనం చేసుకుంటున్న ఎందరో యువకులకు బావాజీపాలెం యువత ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామంలో ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన ప్రతి యువకుడూ సైన్యంలో చేరడానికి ప్రయత్నిస్తాడు. మాజీ సైనికుల అనుభవాలే తమకు పాఠాలని, సైన్యంలో చేరేందుకు ప్రేరణలని గ్రామ యువకులు చెబుతారు. గ్రామానికి చెందిన మాజీ, ప్రస్తుత సైనికులు సైన్యంలోకి వెళ్లడానికి ఇష్టం ఉన్న యువతకు ఎలా సన్నద్ధం అవ్వాలనే విషయమై సలహాలు, సూచనలు ఇస్తుంటారు. కర్తవ్యంగా భావిస్తాం నేను 1988 నుంచి 2005 వరకు భారత ఆర్మీలో సేవలందించాను. మా తాత, తండ్రి, సోదరుడు కూడా సైన్యంలో పనిచేశారు. భారత సైన్యంలో సేవలందించడం కర్తవ్యంగా మా గ్రామంలోని ప్రతి ఒక్కరూ భావిస్తారు. గ్రామంలో పుట్టిన అమ్మాయిలు సైనికులను పెళ్లాడటానికి ఇష్టపడతారు. జమ్మూకశ్మీర్, త్రిపుర, అస్సాం సహా వివిధ రాష్ట్రాల్లోని దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న ప్రతి యూనిట్లో బావాజీపాలెం సైనికులు ఉంటారు. 1994లో మా గ్రామంలో ప్రత్యేకంగా బ్యాంక్ ఏర్పాటు చేశారు. ఆ బ్యాంక్‌ను ప్రస్తుతం మూసివేశారు. దీంతో మాజీ సైనికులు, ప్రస్తుతం సేవలందిస్తున్న సైనికుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. వినియోగదారుల సర్వీస్ సెంటర్‌ను బ్యాంక్ ఏర్పాటు చేసినప్పటికీ అందులో పూర్తిస్థాయిలో బ్యాంక్ సేవలు లభించడం లేదు. తిరిగి బ్యాంక్‌ను గ్రామంలో ఏర్పాటు చేసి సమస్య తీర్చాలి. – నజీర్ అహ్మద్, మాజీ సైనికుడు, బావాజీపాలెం గ్రామ సర్పంచ్ మా కుటుంబం అంతా సైనికులమే మేం ఐదుగురు సోదరులం. అందరం భారత సైన్యంలో చేరి సేవలంధించాం. సైన్యంలో చేరి దేశానికి సేవలందించడం గొప్ప వరం. ఆ వరం మా కుటుంబంలో అందరికీ లభించడం అదృష్టంగా భావిస్తాం. మా గ్రామం సహా నిజాంపట్నం మండలం, చుట్టుపక్కల గ్రామాల్లో వందలమంది మాజీ, ప్రస్తుతం సేవలందిస్తున్న సైనికులు ఉన్నారు. వీరి సౌకర్యార్థం క్యాంటీన్‌ను ఏర్పాటు చేయాలని గతంలో చాలాసార్లు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశాం. మా ప్రాంతంలో ఆర్మీ యూనిట్ లేకపోవడం వల్ల క్యాంటీన్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని చెప్పారు. మొబైల్ క్యాంటీన్‌ను ఏర్పాటు చేసినా మాకు ఎంతో ఉపయోగపడుతుంది. – ఎండీ అయూబ్, మాజీ సైనికుడు, బావాజీపాలెం -
దేశ రక్షణలో రాజీ లేదు
సాక్షి, విశాఖపట్నం: తూర్పు నౌకాదళంలో గణతంత్ర వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. తూర్పు నౌకాదళం నేవల్ బేస్ పరేడ్ గ్రౌండ్లో ఈఎన్సీ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆర్మ్డ్ గార్డ్స్, నౌకాదళ సిబ్బంది, డిఫెన్స్ సెక్యూరిటీ సిబ్బంది, సబ్‌మెరైన్, యుద్ధనౌకల సిబ్బంది, సీ కేడెట్ కార్ప్స్ మార్చ్ పాస్ట్, రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ అడ్మిరల్ జైన్ మాట్లాడుతూ విద్రోహుల్ని ఎదుర్కొనేందుకు నిరంతరం కృషిచేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. దేశ తీర భద్రత విషయంలో అవసరమైన నౌకలు, సబ్మెరైన్లు, యుద్ధవిమానాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. భారత సముద్ర భాగంలో భద్రత పెంచేందుకు అత్యాధునిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. రక్షణ విషయంలో నౌకాదళం రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కోవిడ్–19 సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన వారిని అభినందించారు. ఈ వేడుకల్లో అధికారులు, సిబ్బంది, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
సాగు చట్టాలపై ఆందోళన తొలగించాలి
న్యూఢిల్లీ: దేశ రక్షణ విషయంలో భారత సాయుధ దళాలు సదా సిద్ధంగా ఉంటాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. అవసరమైనప్పుడు తక్షణమే స్పందించేందుకు సరైన సమన్వయంతో సాయుధ దళాలు సర్వ సన్నద్ధంగా ఉంటాయని తెలిపారు. గత సంవత్సరం తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా విస్తరణ వాద ప్రయత్నాన్ని భారతీయ జవాన్లు సాహసోపేతంగా తిప్పికొట్టిన విషయాన్ని రాష్ట్రపతి గుర్తు చేశారు. నేటి 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి సోమవారం రాష్ట్రపతి ప్రసంగించారు. దేశ రక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఆహారోత్పత్తిలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించడానికి కారణమైన రైతులకు దేశవాసులంతా సెల్యూట్ చేస్తారన్నారు. నూతన వ్యవసాయ చట్టాలపై రైతుల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. సాధారణంగా సంస్కరణ మార్గం తొలి దశలో అపార్థాల పాలవుతుందని, అయితే, రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రపతి కోవింద్ వ్యాఖ్యానించారు. దేశ ప్రజల్లో నెలకొన్న, రాజ్యాంగ విలువల్లో భాగమైన సౌభ్రాతృత్వ భావన కారణంగానే ఇది సాధ్యమైందన్నారు. కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు భారత్ ఔషధాలను సరఫరా చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. భారత్‌ను ‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’గా ఆయన అభివర్ణించారు. అనూహ్య సంక్షోభాన్ని ఎదుర్కొని కూడా భారత్ నిరాశను దరి చేరనీకుండా, ఆత్మ విశ్వాసంతో సుదృఢంగా నిలిచిందన్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కూడా ప్రారంభమైందన్నారు. నిబంధనల ప్రకారం కరోనా టీకాను తీసుకోవాలని దేశ ప్రజలకు రాష్ట్రపతి సూచించారు.టీకా కోసం కృషి చేసిన శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ పెరేడ్ చాలా ప్రత్యేకం! భారత్ డెబ్భైరెండో రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే పెరేడ్‌కు పలు ప్రత్యేకతలున్నాయి. కొన్ని అంశాలు తొలిసారి పెరేడ్లో దర్శనమిస్తుండగా, కొన్ని అంశాలు తొలిసారి పెరేడ్లో మిస్సవుతున్నాయి. అండమాన్ నికోబార్ ద్వీపాలకు చెందిన ట్రూప్స్, తొలి మహిళా ఫైటర్ పైలెట్, కొత్తగా ఏర్పడ్డ లడఖ్ శకటం, కొత్తగా కొన్న రఫేల్ జెట్స్ ప్రదర్శన తొలిమారు రిపబ్లిక్‌డే పెరేడ్లో దర్శనం ఇవ్వనున్నాయి. మరోవైపు గణతంత్ర దినోత్సవ పెరేడ్లో చీఫ్ గెస్ట్ లేకపోవడం ఇదే తొలిసారి. అలాగే మిలటరీ వెటరన్స్ ప్రదర్శన, మోటర్‌సైకిల్ డేర్‌డేవిల్స్ ప్రదర్శన కూడా ఈ దఫా లేవు. -
దేశ రక్షణలో రాజీ లేదు!
న్యూఢిల్లీ: భారత్ శాంతికాముక దేశమే అయినా.. దేశ రక్షణ విషయంలో రాజీ పడబోదని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. యుద్ధ విమానాలు, సాయుధ దళాల ఆధునీకరణలకు సంబంధించి దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రక్షణ రంగ ప్రాజెక్టులకు తాము అధికారంలోకి వచ్చాకే మోక్షం వచ్చిందని మోదీ గుర్తు చేశారు. దేశీయంగా క్షిపణులు, యుద్ధ ట్యాంకులు, హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించి మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఆరోపణల నేపథ్యంలో మోదీ స్పందించారు. తాను స్వప్నిస్తున్న ‘నవ భారత్’లో అవినీతికి చోటు లేదన్న మోదీ.. అవినీతికి పాల్పడిన వారిని ఎంతవారైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఎన్సీసీ క్యాడెట్లను ఉద్దేశించి సోమవారం ఆయన ప్రసంగించారు. ‘మీ భవిష్యత్తును నిర్దేశించేవి మీ కుటుంబం, మీ ఆర్థిక నేపథ్యం కాదు.. మీ పట్టుదల, మీ నైపుణ్యం, మీ ఆత్మవిశ్వాసమే బంగారు భవితకు బాటలు వేస్తుంది’ అని అన్నారు. వీఐపీ సంస్కృతి స్థానంలో తన ప్రభుత్వం ఈపీఐ(ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్– ప్రతీ వ్యక్తి ప్రముఖుడే) సంస్కృతిని చేర్చిందన్నారు. గ్రామాల నుంచి వచ్చి ఎన్సీసీలో శిక్షణ పొందుతున్న వారిని ప్రధాని ఈ సందర్భంగా అభినందించారు. తమ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లుగా రక్షణ శాఖలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ భవిష్యత్‌లో దేశ భద్రతకు తోడ్పడతాయని ధీమా వ్యక్తం చేశారు. అప్పటివరకు దేశ ప్రజలు తమపై భరోసా ఉంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని.. రాబోయే ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటు వేసేలా యువతను ప్రోత్సహించాలని వారికి సూచించారు. ఇక తమ ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమానికి యువత భారీగా మద్దతు ఇస్తున్నట్లు ప్రధాని తెలిపారు. లింగ వివక్షకు తావీయకుండా స్త్రీ, పురుషులిద్దరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మోదీ ఉద్ఘాటించారు. మహిళలను యుద్ధ విమానాలకు పైలట్లుగా నియమించామని, నేవీలోని మహిళా దళాలు ప్రపంచాన్ని చుట్టివచ్చాయని తెలిపారు. మిలటరీ సహా పలు కీలక విభాగాల్లో మహిళలను భాగస్వామ్యం చేసేలా తమ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. బెంగాల్లో ప్రధాని ర్యాలీ ప్రాంతం మార్పు పశ్చిమ బెంగాల్లో ఫిబ్రవరి 2న ప్రధాని మోదీ పాల్గొననున్న బహిరంగ సభ స్థలాన్ని మార్చినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వెల్లడించారు. ముందుగా అనుకున్నట్లు నార్త్ 24 పరగణా జిల్లాలోని థాకూర్‌నగర్‌లో కాకుండా దానికి సమీపంలోని మరో స్థలంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
ఆమె భౌతికాయాన్ని చూసి ఈ దేశం తట్టుకోగలదా?
‘‘యుద్ధం చేస్తూ మహిళ చనిపోతే, గుడ్డల్లో చుట్టి తెచ్చిన ఆమె మృతదేహాన్ని చూసేందుకు మన దేశం సిద్ధంగా ఉందా? ఫ్రంట్‌లైన్ కంబాట్‌లోకి మహిళల్ని తీసుకోవడం నాకు ఇష్టమే. అలాగని ఆర్మీకి ఇష్టం లేదని కాదు. కొన్ని చెయ్యలేం’’.. అన్నది మన ఆర్మీ చీఫ్ మనసులోని మాట. నిజమే, చెయ్యలేకపోవచ్చు. కానీ చెయ్యగలిగినప్పుడే ‘చెయ్యగలం’ అని చెప్పి ఉండాల్సింది. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ భారత సైన్యంలోకి వచ్చి ఈ డిసెంబర్ 16కి సరిగ్గా నలభై ఏళ్లు. ఇప్పుడు ఆయన జనరల్. ఆర్మీలో చేరినప్పుడు సోల్జర్. ఆర్మీ చీఫ్‌ల పదవీ కాలం మూడేళ్లు. మూడేళ్లకు ముందే వాళ్లకు 62 ఏళ్ల వయసు నిండితే కనుక ముందే పదవీ విరమణ చెయ్యవలసి ఉంటుంది. 2016 డిసెంబర్ 31న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు రావత్. ఇంకో ఏడాదికి గానీ ఆయన పదవీకాలం పూర్తవదు. ఆ తర్వాత కూడా ఆర్మీలో సేవలు అందించడానికి వయసు రీత్యా ఆయనకు ఇంకో రెండేళ్లు అవకాశం ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎంపిక చేసుకుని మరీ రావత్‌ని తెచ్చుకున్నారు. తన పదవీ కాలం నిండే వరకు ఆర్మీ చీఫ్.. చైర్లోంచి లేవకూడదని! రావత్ ఆర్మీ చీఫ్ అవడానికి రెండున్నర నెలల ముందే నియంత్రణ రేఖ దగ్గర ‘సర్జికల్ స్ట్రయిక్స్’ జరిగాయి. ఆ సమయంలో రావత్ వైస్ చీఫ్‌గా ఉన్నారు. భారత్ మీద పాక్ ‘ప్రాక్సీ వార్’ జరుపుతున్న ప్రస్తుత కీలక తరుణంలో రావత్ కూడా మోదీ అంతటి వారే అనుకోవాలి. అంత మాత్రాన రావత్.. జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి లేదు. మోదీలా ‘మన్ కీ బాత్’ని చెప్పడానికీ లేదు. ఏదైనా లోపలే ఉంచుకోవాలి. లేదంటే రిటైర్ అయ్యేంత వరకు ఆగి, అప్పుడు బయట పెట్టుకోవాలి. నలభై ఏళ్ల సర్వీసులో ఏడు యుద్ధాలను చూసిన రావత్‌కు ఈ సంగతి తెలియకుండా ఉంటుందా? అయినప్పటికీ ఆయన తన ఉద్దేశాలను దాచుకోలేకపోయారు! ఆర్మీలో ‘ఫ్రంట్‌లైన్ కంబాట్’లోకి మహిళల్ని తీసుకోలేమని చెబుతూ, అందుకు ఆయన చూపిన కారణాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ‘ఆయన ఆ పదవికి తగనివారు’ అని ట్రోలింగ్ మొదలైంది. ఫ్రంట్‌లైన్ కంబాట్ అంటే.. ప్రత్యక్ష యుద్ధక్షేత్రం. శత్రువు యుద్ధట్యాంకు పేలిస్తే ముందుగా గాలిలోకి ఎగిరిపడే దేహాలు ఫ్రంట్‌లైన్ కంబాట్‌లో ఉన్నవాళ్లవే. బందీగా శత్రువు చేతికి చిక్కే ప్రమాదం ఉండేది ఫ్రంట్‌లైన్ కంబాట్‌లో ఉన్నవాళ్లకే. అందుకే మహిళల్ని కంబాట్‌లోకి తీసుకోలేమని రావత్ చెప్పారు. చెప్పి, అక్కడితో ఆగి ఉంటే కొంత నయంగా ఉండేది. తన మనసులోని భయాలన్నీ బయట పెట్టేసుకున్నారు. ‘‘ప్రాక్సీ – వార్ (దొంగ దాడి) నడుస్తున్నప్పుడు మహిళల్ని యుద్ధవిధుల్లోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. అయినా మహిళల్ని తీసుకోకుండా ఏమీ లేము. మందుపాతర్లని ఏర్పాటు చేయడానికి, ఏరిపారేయడానికి మన దగ్గర మహిళా ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. ప్రతిభ, నైపుణ్యం అవసరమైన మిగతా ముఖ్య విభాగాల్లోనూ మహిళలు ఉన్నారు. ఒక్క యుద్ధవిధుల్లోకే వారిని తీసుకోవడం లేదు. తీసుకుంటే కొన్ని సమస్యలు వస్తాయి. ఫ్రంట్లైన్లో మహిళా అధికారిని కమాండర్‌గా పెడితే ఆమె కింద ఉన్న మగ సోల్జర్లు ఆమె మాట వినకపోవచ్చు. ఎందుకంటే వారంతా గ్రామాల నుంచి వచ్చినవారు. ఆడమనిషి చెబితే చెయ్యడం ఏంటనే భావన వారిలో ఉంటుంది. మరో సమస్య.. మహిళలు బట్టలు మార్చుకునేటప్పుడు వస్తుంది. మగవాళ్లు చూస్తున్నారని కంప్లైంట్ చేస్తారు వాళ్లు. విశ్రమ, విరామాలలోనూ మహిళలకు వేరుగా గుడారం వెయ్యాలి. గుడారం చుట్టూ గుడ్డ కప్పాలి. ఇక అత్యవసర సమయాల్లో ఆరు నెలలు మెటర్నిటీ లీవు ఇవ్వడానికి ఉండదు. ఇవ్వనందుకు రాద్ధాంతం అవుతుంది. ఇవన్నీ కాదు.. యుద్ధంలో మహిళా కమాండర్ చనిపోతే, గుడ్డల్లో చుట్టి తెచ్చిన ఆమె భౌతికాయాన్ని చూసి ఈ దేశం తట్టుకోగలదా? ఫ్రంట్‌లైన్ కంబాట్‌లోకి మహిళల్ని తీసుకోవడం నాకు ఇష్టమే. అలాగని ఆర్మీకి ఇష్టం లేదని కాదు. కొన్ని చెయ్యలేం’’ అన్నారు రావత్. ఇదంతా ఏకబిగిన చెప్పుకుంటూ రాలేదు ఆయన. సి.ఎన్.ఎన్. న్యూస్ 18 చానల్ సీనియర్ ఎడిటర్ శ్రేయా దౌండియాల్‌తో సంభాషణలో ఆమె ప్రశ్నలకు సమాధానంగా మాత్రమే చెప్పారు. ఆయనేం ఆమెను పిలిచి ఇవన్నీ మాట్లాడలేదు. ఆమె వచ్చి అడిగితే మనసు విప్పారు. అదీ తన ఆఫీస్‌లో కాదు. పిచ్చాపాటీగా, పచ్చిక బయళ్లలో! పూర్తి ఇంటర్వ్యూలో ఇది కొంతభాగం మాత్రమే. మిగతా విషయాలు గాల్లో కొట్టుకుపోయాయి. కంబాట్‌లోకి ఆడవాళ్లను తీసుకోవడంపై ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రం వాయుగుండం అయ్యాయి. అందులోనూ.. ‘బట్టలు మార్చుకోడానికి ఇబ్బంది’ అవుతుంది అనే పాయింట్ చుట్టూ సిటిజన్స్ ప్రదక్షిణ చేస్తున్నారు. ‘దేశం పరువు తీసేశాడు రావత్’ అని విరుచుకు పడుతున్నారు. కొన్నాళ్ల క్రితం కూడా రావత్ పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ ‘పాసింగ్ అవుట్ పరేడ్’లో ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ, ‘మహిళల్ని యుద్ధక్షేత్రంలోకి తీసుకోడానికి ఇప్పటికైతే ఆర్మీ సిద్ధంగా లేదు. పాశ్చాత్య దేశాలతో మనం పోల్చుకోకూడదు. వాళ్లు ఓపెన్ ఉంటారు’ అన్నారు. కానీ అవకాశం వస్తే ఫ్రంట్‌లైన్ కంబాట్‌లోకి వెళ్లేందుకు యువతులు సిద్ధంగా ఉన్నారన్నది నిజం. అంటే వాళ్లు ఓపెన్ గానే ఉన్నారు. ఆర్మీనే ఓపెన్ అవ్వాలి. ఒకవేళ ఆర్మీ ఓపెన్‌గా లేకపోయినా, పనిగట్టుకుని ఓపెన్‌గా లేమన్న విషయాన్ని చెప్పాల్సిన సమయం, సందర్భం ఏముంటుందని?! ఓపెన్ అయినప్పుడే ఓపెన్ అయ్యాం అని చెబితే సరిపోదా?దేశ రక్షణదళంలోని అత్యున్నత స్థానాలలో ఉన్నవారు దేశ రహస్యాలను దాచినట్లే వ్యక్తిగత అభిప్రాయాలను దాచుకోలేకపోతే జాతిని ఉద్దేశించి ప్రసంగించినట్లే. అది ప్రమాదం. మీడియా ప్రతినిధులు కూడా జాతిని ఉద్దేశించి ప్రసారం చేస్తున్నామేమో గమనించుకోవాలి. రావత్ మాట్లాడితే మాట్లాడారు, ఆ రెండు ముక్కల్ని మీడియా బహిర్గతం చేయకపోతే దేశ ప్రజలకు వచ్చే నష్టం ఏముంటుంది? చేస్తే వచ్చిన లాభం ఏముంది? - మాధవ్ శింగరాజు -
దేశ ఆర్థిక వ్యవస్థలో నేవీది కీలక పాత్ర
విశాఖ సిటీ: భారత నౌకాదళమంటే దేశ రక్షణకు మాత్రమే పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇస్తున్న సహ కారం ప్రముఖమైనదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. ఇండియన్ నేవీలో సబ్‌మెరైన్ సేవలు ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రమైన విశాఖలో సబ్‌మెరైన్ స్వర్ణోత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి త్రివిధ దళాధిపతి రాష్ట్రపతి కోవింద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. కల్వరి నుంచి కల్వరి ప్రత్యేక శకం భారత నౌకాదళంలో ఐఎన్ఎస్ కల్వరి సబ్‌మెరైన్ సేవలు 1967లో ప్రారంభించి తీర ప్రాంత రక్షణ రంగంలో నూతన శకానికి నాంది పలికిందని అభిప్రాయపడ్డారు. అదే పేరుతో నూతన సబ్‌మెరైన్ సిద్ధం చెయ్యడంతో కల్వరి నుంచి కల్వరి వరకూ జరిగిన ప్రయాణం ఇండియన్ నేవీకి ప్రత్యేకమైన శకంగా అభివర్ణించారు. 50 ఏళ్లలో 25 సబ్మెరైన్లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. జలాంత ర్గాముల్లో పనిచెయ్యడం క్లిష్టమైనప్పటికీ కీలకంగా వ్యవహరిస్తున్న నేవీ సిబ్బంది సేవల్ని అభినందించారు. మేక్ ఇన్ ఇండియా లో భాగంగా సబ్మెరైన్ల తయారీలోనూ స్వదేశీ సాంకేతి కతను అందిపుచ్చుకోవడం గర్వించదగ్గ విషయమని చెప్పారు. సబ్‌మెరైన్ విభాగానికి రాష్ట్రపతి పతాకం సబ్‌మెరైన్ స్వర్ణోత్సవాల్లో భాగంగా రాష్ట్రపతి తొలుత నేవీ సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. రక్షణ రంగంలో విశిష్ట సేవలందించే విభాగానికి అందించే అరుదైన పురస్కారం ప్రెసిడెంట్ ఆఫ్ కలర్స్ పతాకాన్ని ఇండియన్నేవీ సబ్‌మెరైన్ విభాగానికి రాష్ట్రపతి అందించారు. నేవీ బ్యాండ్ నడుమ సబ్‌మెరైన్ లెఫ్టినెంట్ కమాండర్ తేజేందర్ సింగ్ ఈ పతాకాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. త్రివిధ దళాల అధిపతి కోవింద్ నుంచి రాష్ట్రపతి పతాకం స్వీకరిస్తున్న సబ్‌మెరైన్ లెఫ్టినెంట్ కమాండర్ తేజేందర్ సింగ్, చిత్రంలో ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్‌లాంబా -
దేశ రక్షణలో రాజీపడ్డారు..
కొందరు మాజీ ప్రధానులను ఉద్దేశిస్తూ రక్షణ మంత్రి పారికర్ వ్యాఖ్యలు ముంబై/న్యూఢిల్లీ: కొంత మంది మాజీ ప్రధానమంత్రులు దేశ రక్షణలో రాజీపడ్డారంటూ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వారి పేర్లను తాను వెల్లడించబోవడం లేదని, వారెవరో చాలా మందికి తెలుసని అన్నారు. పారికర్ నేరుగా ఎవరి పేరు చెప్పకపోయినా దివంగత మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేసినట్లు మీడియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముంబైలో ఓ హిందీ వారపత్రిక ప్రత్యేక సంచిక విడుదల సందర్భంగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో పారికర్ మాట్లాడారు. పాక్ వైపు నుంచి భారత్‌వైపు వచ్చిన ఓ బోటుపై తీర రక్షక దళం చేపట్టిన ఆపరేషన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దురదృష్టవశాత్తూ కొందరు మాజీ ప్రధానులు దేశ రక్షణకు సంబంధించిన కొన్ని అంశాల్లో రాజీ పడ్డారని పేర్కొన్నారు. వారి పేర్లను తాను వెల్లడించబోవడం లేదని... వారెవరో చాలా మందికి తెలుసని అన్నారు. కాగా ఆయన ఆరోపణలు చాలా దారుణమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా విమర్శించారు. పారికర్ ఆ ఆరోపణలకు ఆధారాలు చూపాలని, ఆ ప్రధానులెవరో చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. బీజేపీ నేతలు ఇటీవల తమ సాంప్రదాయంగా మార్చుకున్న ‘ఆరోపణలు చేయడం.. వెంటనే తానలా అనలేదంటూ యూటర్న్ తీసుకోవడడాన్ని’ పారికర్ అనుసరించబోరనే ఆశిస్తున్నట్లు ఎద్దేవా చేశారు. మాజీ ప్రధానులపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని.. పారికర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ మరోనేత మనీశ్ తివారీ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను బీజేపీ తేలిగ్గా తీసుకుంది. పారికర్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని పార్టీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.