దేశ రక్షణలో రాజీపడ్డారు..
కొందరు మాజీ ప్రధానులను ఉద్దేశిస్తూ రక్షణ మంత్రి పారికర్ వ్యాఖ్యలు
ముంబై/న్యూఢిల్లీ: కొంత మంది మాజీ ప్రధానమంత్రులు దేశ రక్షణలో రాజీపడ్డారంటూ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వారి పేర్లను తాను వెల్లడించబోవడం లేదని, వారెవరో చాలా మందికి తెలుసని అన్నారు. పారికర్ నేరుగా ఎవరి పేరు చెప్పకపోయినా దివంగత మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేసినట్లు మీడియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ముంబైలో ఓ హిందీ వారపత్రిక ప్రత్యేక సంచిక విడుదల సందర్భంగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో పారికర్ మాట్లాడారు. పాక్ వైపు నుంచి భారత్‌వైపు వచ్చిన ఓ బోటుపై తీర రక్షక దళం చేపట్టిన ఆపరేషన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దురదృష్టవశాత్తూ కొందరు మాజీ ప్రధానులు దేశ రక్షణకు సంబంధించిన కొన్ని అంశాల్లో రాజీ పడ్డారని పేర్కొన్నారు. వారి పేర్లను తాను వెల్లడించబోవడం లేదని... వారెవరో చాలా మందికి తెలుసని అన్నారు.
కాగా ఆయన ఆరోపణలు చాలా దారుణమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా విమర్శించారు. పారికర్ ఆ ఆరోపణలకు ఆధారాలు చూపాలని, ఆ ప్రధానులెవరో చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. బీజేపీ నేతలు ఇటీవల తమ సాంప్రదాయంగా మార్చుకున్న ‘ఆరోపణలు చేయడం.. వెంటనే తానలా అనలేదంటూ యూటర్న్ తీసుకోవడడాన్ని’ పారికర్ అనుసరించబోరనే ఆశిస్తున్నట్లు ఎద్దేవా చేశారు.
మాజీ ప్రధానులపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని.. పారికర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ మరోనేత మనీశ్ తివారీ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను బీజేపీ తేలిగ్గా తీసుకుంది. పారికర్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని పార్టీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.