రోహిత్‌పై బాడీషేమింగ్‌ కామెంట్స్‌.. కోహ్లీని వదలని షామా! | Rohit Sharma Row: Congress Shama Mohamed Praise Kohli But Once She did This | Sakshi
Sakshi News home page

రోహిత్‌పై బాడీషేమింగ్‌ కామెంట్స్‌.. కోహ్లీని వదలని షామా!

Published Tue, Mar 4 2025 11:00 AM | Last Updated on Tue, Mar 4 2025 11:09 AM

Rohit Sharma Row: Congress Shama Mohamed Praise Kohli But Once She did This

న్యూఢిల్లీ: స్టార్‌ బ్యాటర్‌, టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma)పై బాడీ షేమింగ్‌ పోస్టుతో వివాదంలో చిక్కుకున్న కాంగ్రెస్‌ నేత షామా మహమ్మద్‌.. ఎట్టకేలకు స్పందించారు. రోహిత్‌ అభిమానులు, టీమిండియా మాజీలు, బీజేపీ, ఆఖరికి సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె‌ మాట్లాడారు.

‘‘ఓ ఆటగాడు ఎప్పుడూ ఫిట్‌గా ఉండాలన్నది నా అభిప్రాయం. అందుకే రోహిత్‌ శర్మ విషయంలో పరిశీలనపూర్వకంగానే నేను మాట్లాడా. అతను కాస్త ఓవర్‌వెయిట్‌ అనిపించాడు. అందుకే అలా ట్వీట్‌ చేశా. అందులో బాడీ షేమింగ్‌ ఏం లేదు. నేనేం తప్పు చేయలేదు’’  అని అన్నారామె. ఈ క్రమంలో.. గతంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ల పేర్లను ప్రస్తావించిన షామా.. వాళ్లతో రోహిత్‌ను బాడీని పోల్చారు.

ఇది ప్రజాస్వామ్యం.. అందులో తప్పేం ఉంది. నాకు మాట్లాడే హక్కు ఉంది అని అన్నారామె. అలాగే.. ఈ సందర్భంగా స్టార్‌ బ్యాటర్‌, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై షామా ప్రశంసలు గుప్పించారు. గతంలో పాక్‌పై ఓటమి తర్వాత మహమ్మద్‌ షమీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో షమీకి కోహ్లీ అండగా నిలిచాడు. అందుకు కోహ్లీని కూడా విమర్శించారు. తోటి ఆటగాళ్లకు అండగా ఉంటూ జట్టును ముందు ఉండి నడిపించడం, పరుగులు చేయడం, ప్రత్యర్థి జట్టు ప్రదర్శన గురించి తెలిసి ఉండడం.. ఇవన్నీ మంచి సారథికి ఉండే లక్షణాలు. ఇవన్నీకోహ్లీకి ఉన్నాయి. ప్రత్యర్థులు బాగా ఆడినా మెచ్చుకునేందుకు కోహ్లీ వెనకాడడు’’ అని షామా అన్నారు. అయితే ఇదే షామా గతంలో కోహ్లీపై చేసిన ఓ పోస్ట్‌ అంటూ ఒక స్క్రీన్‌ షాట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

2018లో కెప్టెన్‌గా ఉన్న సమయంలో కోహ్లీ ఓ ఫ్యాన్ పెట్టిన పోస్టుకు తీవ్రంగా స్పందించాడు. ‘‘నాకు భారతీయుల కంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రీడాకారుల క్రికెట్ బాగుంటుంది. ఇక కోహ్లీని అయితే జనాలు అనసవరంగా ఆకాశానికి ఎత్తేస్తుంటారు’’ అని ఓ ఫ్యాన్  చేసిన పోస్టును కోహ్లీ స్వయంగా చదివి వినిపించాడు.

‘‘నువ్వు ఇండియాలో ఉండాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. భారత్‌లో ఉంటూ ఇతర దేశాలపై అభిమానం చూపించడం ఏమిటి. నీకు నేను నచ్చకపోవడంపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే, ఇతర దేశాల వారు నచ్చినప్పుడు నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం’’ అని కోహ్లీ అన్నాడు.

అయితే.. కోహ్లీ పోస్టుపై అప్పట్లో షామా చాలా ఘాటుగా స్పందించారు. ‘‘బ్రిటిషర్లు కనిపెట్టిన ఆటను కోహ్లీ ఆడుతుంటాడు. విదేశీ బ్రాండ్లకు ప్రచారం చేస్తూ కోట్లు సంపాదిస్తుంటాడు. పెళ్లి కూడా ఇటలీలో చేసుకున్నాడు. హెర్షెల్ గిబ్స్ తన ఫేవరెట్ క్రికెటర్ అని కూడా చెబుతాడు. కెర్బర్ తన ఫేవరెట్ టెన్నిస్ ప్లేయర్ అని అంటాడు. 

కానీ ఇతర దేశాల క్రీడాకారులను అభిమానించే వారు మాత్రం దేశాన్ని విడిచిపెట్టి పోవాలని అంటాడు’’ అని షామా మండిపడ్డారు. రోహిత్‌పై ఆమె చేసిన కామెంట్లు దుమారం రేపడం, కోహ్లీని పొగడడం నేపథ్యంలో ఈ పోస్ట్‌ మళ్లీ తెరపైకి వచ్చింది.

షామా ఏమన్నారంటే..
ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయాడు.   ‘‘క్రీడాకారుడిగా రోహిత్‌ శర్మ ఫిట్‌గా లేడు. అతడు బరువు తగ్గాలి. అంతేకాదు.. గత కెప్టెన్లతో పోలిస్తే అత్యంత ఆకట్టుకోని సారథి ఇతడే’’ అని షామా  రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ కాస్తా నెట్టింట వైరల్‌గా మారడంతో దీనిపై తీవ్ర వివాదం రాజుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement