న్యూఢిల్లీ: దేశ రక్షణ విషయంలో భారత సాయుధ దళాలు సదా సిద్ధంగా ఉంటాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. అవసరమైనప్పుడు తక్షణమే స్పందించేందుకు సరైన సమన్వయంతో సాయుధ దళాలు సర్వ సన్నద్ధంగా ఉంటాయని తెలిపారు. గత సంవత్సరం తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా విస్తరణ వాద ప్రయత్నాన్ని భారతీయ జవాన్లు సాహసోపేతంగా తిప్పికొట్టిన విషయాన్ని రాష్ట్రపతి గుర్తు చేశారు. నేటి 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి సోమవారం రాష్ట్రపతి ప్రసంగించారు.
దేశ రక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఆహారోత్పత్తిలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించడానికి కారణమైన రైతులకు దేశవాసులంతా సెల్యూట్ చేస్తారన్నారు. నూతన వ్యవసాయ చట్టాలపై రైతుల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. సాధారణంగా సంస్కరణ మార్గం తొలి దశలో అపార్థాల పాలవుతుందని, అయితే, రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రపతి కోవింద్ వ్యాఖ్యానించారు.
దేశ ప్రజల్లో నెలకొన్న, రాజ్యాంగ విలువల్లో భాగమైన సౌభ్రాతృత్వ భావన కారణంగానే ఇది సాధ్యమైందన్నారు. కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు భారత్ ఔషధాలను సరఫరా చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. భారత్‌ను ‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’గా ఆయన అభివర్ణించారు. అనూహ్య సంక్షోభాన్ని ఎదుర్కొని కూడా భారత్ నిరాశను దరి చేరనీకుండా, ఆత్మ విశ్వాసంతో సుదృఢంగా నిలిచిందన్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కూడా ప్రారంభమైందన్నారు. నిబంధనల ప్రకారం కరోనా టీకాను తీసుకోవాలని దేశ ప్రజలకు రాష్ట్రపతి సూచించారు.టీకా కోసం కృషి చేసిన శాస్త్రవేత్తలను అభినందించారు.
ఈ పెరేడ్ చాలా ప్రత్యేకం!
భారత్ డెబ్భైరెండో రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే పెరేడ్‌కు పలు ప్రత్యేకతలున్నాయి. కొన్ని అంశాలు తొలిసారి పెరేడ్‌లో దర్శనమిస్తుండగా, కొన్ని అంశాలు తొలిసారి పెరేడ్‌లో మిస్సవుతున్నాయి. అండమాన్ నికోబార్ ద్వీపాలకు చెందిన ట్రూప్స్, తొలి మహిళా ఫైటర్ పైలెట్, కొత్తగా ఏర్పడ్డ లడఖ్ శకటం, కొత్తగా కొన్న రఫేల్ జెట్స్ ప్రదర్శన తొలిమారు రిపబ్లిక్‌డే పెరేడ్‌లో దర్శనం ఇవ్వనున్నాయి. మరోవైపు గణతంత్ర దినోత్సవ పెరేడ్‌లో చీఫ్ గెస్ట్ లేకపోవడం ఇదే తొలిసారి. అలాగే మిలటరీ వెటరన్స్ ప్రదర్శన, మోటర్‌సైకిల్ డేర్‌డేవిల్స్ ప్రదర్శన కూడా ఈ దఫా లేవు.
Comments
Please login to add a commentAdd a comment