రష్యాతో యుద్ధానికి పంపుతున్న ఉక్రెయిన్.. సైనికుల కొరత నేపథ్యంలో వినూత్న నిర్ణయం
వాళ్లంతా కొన్ని నెలల క్రితం దాకా ఖైదీలు. పలు నేరాలకు శిక్షను అనుభవిస్తున్న వారు. కానీ ఇప్పుడు మాత్రం దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి మరీ పోరాడుతున్న సైనిక వీరులు! రష్యాతో రెండేళ్లకు పైగా సాగుతున్న యుద్ధంలో నానాటికీ పెరుగుతున్న సైనికుల కొరతను అధిగమించేందుకు ఉక్రెయిన్ తీసుకున్న వినూత్న నిర్ణయం వారినిలా హీరోలను చేసింది. ఎంతోమంది ఖైదీలు పాత జీవితానికి ముగింపు పలికి సైనికులుగా కొత్త జీవితం ప్రారంభించారు. ఫ్రంట్ లైన్‌లో పోరాడుతూ, కందకాలు తవ్వడం వంటి సహాయక పనులు చేస్తూ యుద్ధభూమిలో దేశం కోసం చెమటోడుస్తున్నారు.
రష్యాతో రెండున్నరేళ్ల యుద్ధం ఉక్రెయిన్‌ను సైనికంగా చాలా బలహీనపరిచింది. ఈ లోటును భర్తీ చేసుకుని రష్యా సైన్యాన్ని దీటుగా ఎదుర్కోవడానికి ఖైదీల వైపు మొగ్గు చూపింది. ఇందుకోసం ఉక్రెయిన్ కొత్త చట్టం చేసింది. దాని ప్రకారం వాళ్లను యుద్ధంలో సైనికులుగా ఉపయోగించుకుంటారు. అందుకు ప్రతిగా యుద్ధం ముగిశాక వారందరినీ విడుదల చేస్తారు. అంతేకాదు, వారిపై ఎలాంటి క్రిమినల్ రికార్డూ ఉండబోదు!
దీనికి తోడు ఫ్రంట్‌లైన్లో గడిపే సమయాన్ని బట్టి నెలకు 500 నుంచి 4,000 డాలర్ల దాకా వేతనం కూడా అందుతుంది!! అయితే శారీరక, మానసిక పరీక్షలు చేసి, కనీసం మూడేళ్లు, అంతకు మించి శిక్ష మిగిలి ఉండి, 57 ఏళ్ల లోపున్న ఖైదీలను మాత్రమే ఎంచుకున్నారు. ఈ లెక్కన 27,000 మంది ఖైదీలు పథకానికి అర్హులని ఉక్రెయిన్ న్యాయ శాఖ తేలి్చంది. కనీసం 20,000 మంది ఖైదీలన్నా సైనికులుగా మారతారని అంచనా వేయగా ఇప్పటికే 5,764 మంది ముందుకొచ్చారు. వారిలో 4,650 మంది ఖైదీలు సైనికులుగా అవతారమెత్తారు. ఈ ‘ఖైదీ సైనికు’ల్లో 31 మంది మహిళలున్నారు! 21 రోజుల శిక్షణ తర్వాత వీరు విధుల్లో చేరారు.
గట్టి రూల్సే
ఖైదీలను ఇలా సైన్యంలోకి తీసుకునేందుకు కఠినమైన నిబంధనలే ఉన్నాయి. హత్య, అత్యాచారం, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల నేరాలు, దేశద్రోహం, ఇతర తీవ్ర నేరాలకు పాల్పడిన వారికి పథకం వర్తించబోదు. నేరాలకు పాల్పడిన ఎంపీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా అనర్హులే. అయితే హత్యకు పాల్పడిన ఖైదీలను తమతో చేర్చుకునేందుకు అనుమతివ్వాలని ష్క్వాల్ బెటాలియన్ కోరుతోంది. ఫ్రంట్ లైన్‌లో అవసరమైన నైపుణ్యాలు వారికి బాగా ఉంటాయని వాదిస్తోంది. కొన్ని కేసుల్లో డ్రగ్స్ నేరాలకు పాల్పడ్డ వారినీ తీసుకుంటున్నారు.
జైలరే వారి కమాండర్!
తూర్పు ఉక్రెయిన్‌లోని పోక్రోవ్‌స్‌్కలో 59 బ్రిగేడ్‌లో 15 మందితో కూడిన పదాతి దళ సిబ్బంది విభాగానికి ఓ గమ్మత్తైన ప్రత్యేకత ఉంది. బ్రిగేడ్ కమాండర్ ఒలెగ్జాండర్ వాళ్లకు కొత్త కాదు. ఆయన గతంలో జైలు గార్డుగా చేశారు. 2022 ఫిబ్రవరిలో యుద్ధం మొదలవగానే సైనిక కమాండర్‌గా మారారు. ఇప్పుడు అదే జైల్లోని ఖైదీలు వచ్చి ఈ బ్రిగేడ్‌లో సైనికులుగా చేరారు. ఆయన కిందే పని చేస్తున్నారు! ‘‘యుద్ధభూమిలో వారు నన్ను మాజీ జైలు గార్డుగా కాక అన్నదమ్ములుగా, కమాండర్‌గా చూస్తారు. అంతా ఒకే కుటుంబంలా జీవిస్తాం. వీరికి తండ్రి, తల్లి, ఫిలాసఫర్... ఇలా ప్రతీదీ నేనే’’ అంటారాయన. సదరు జైలు నుంచి మరో పాతిక మంది దాకా ఈ బ్రిగేడ్‌లో చేరే అవకాశముందట.
మట్టి రుణం తీర్చుకునే చాన్స్
జైల్లో మగ్గడానికి బదులుగా సైనికునిగా దేశానికి సేవ చేసే అవకాశం దక్కడం గర్వంగా ఉందని 41 ఏళ్ల విటాలీ అంటున్నాడు. అతనిది డ్రగ్ బానిసగా మారి నేరాలకు పాల్పడ్డ నేపథ్యం. నాలుగు నేరాల్లో పదేళ్ల శిక్ష అనుభవించాడు. ‘‘మా ఏరియాలో అందరు కుర్రాళ్లలా నేనూ బందిపోట్ల సావాసం నడుమ పెరిగాను. ఇప్పటిదాకా గడిపిన జీవితంలో చెప్పుకోవడానికంటూ ఏమీ లేదు. అలాంటి నాకు సైన్యంలో చేరి దేశం రుణం తీర్చుకునే గొప్ప అవకాశం దక్కింది. ఇలాగైనా మాతృభూమికి ఉపయోగపడుతున్నాననే తృప్తి ఉంది. కానీ సైనిక జీవితం ఇంత కష్టంగా ఉంటుందని మాత్రం అనుకోలేదు. కాకపోతే బాగా సరదాగా కూడా ఉంది’’ అని చెప్పుకొచ్చాడు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment