new life
-
బాబోయ్.. ఈ తరం స్మార్ట్‌నెస్‌ను భరించడం కష్టమే!
మనిషి జీవన గమనంలో.. ప్రతీ పదిహేనేళ్లకొకసారి తరం మారుతుంటుంది. మారుతున్న పరిస్థితులను కూడా ఆ తరం ఆకలింపు చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఓ తరం కథ కంచికి చేరింది. కొత్త ఏడాది 2025.. మరో తరానికి ఆహ్వానం పలికేందుకు సిద్ధమైంది. అదే బీటా జనరేషన్(Generation Beta). అయితే ఇది మామూలు జనరేషన్గా మాత్రం మిగిలిపోదని నిపుణులు తేల్చేస్తున్నారు.2025, జనవరి 1 నుంచి కొత్త తరం ఆధారంగానే జనాభాను లెక్కిస్తారు. 2025 నుంచి 2039 మధ్యకాలంలో పుట్టినవాళ్లంతా ఈ తరం కిందకే వస్తారు. 2035 కల్లా ఈ తరం జనాభానే 16 శాతంగా ఉండొచ్చనే ఓ అంచనా నెలకొంది. అంతేకాదు.. 22వ శతాబ్దాన్ని ఎక్కువగా చూడబోయే తరం కూడా ఇదే కానుందని పాపులర్ సోషల్ రీసెర్చర్ మార్క్ మెక్‌క్రిండిల్ అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం టెక్ యుగంలో(Tech Era) మనిషి బతుకుతున్నాడు. అయితే ‘బీటా’ తరానికి మాత్రం రోజూవారీ జీవితంలో అత్యాధునిక సాంకేతికత భాగంకానుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఏఐ, ఆటోమేషన్ హవా నడుస్తోంది కదా!. అలాంటి సాంకేతికత బీటా జనరేషన్ విషయంలో నెక్ట్స్ లెవల్లో ఉండబోతుందన్నమాట!.జనరేషన్ ఆల్ఫా.. మనిషి జీవితంలో స్మార్ట్ టెక్నాలజీ, ఏఐలాంటి సాంకేతికత ఎదుగుదలను మాత్రమే చూడగలిగింది. అయితే జనరేషన్ బీటా రోజువారీ జీవితంలో ఆ సాంకేతికతను అనుభవించబోతోంది. చదువు, ఆరోగ్యం, పని ప్రాంతం, ఆఖరికి వినోదం విషయంలోనూ అది తర్వాతి స్థాయిలో ఉండబోతోందని మెక్‌క్రిండిల్ చెబుతున్నారు. ఉదాహరణకు.. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, హెల్త్ ట్రాకింగ్ డివైజ్‌లను ధరించడం, వర్చువల్ వాతావరణాన్ని ఆస్వాదించడం లాంటివన్నమాట.మిలెన్నియల్స్ (1981-1996)జనరేషన్ జెడ్(Z) 1996-2010జనరేషన్ ఆల్ఫా (2010-2024)జనరేషన్ బేటా (2025-2039)జనరేషన్ గామా (2040-2054)*గ్రీకు ఆల్ఫాబెట్ల ప్రకారమే జనరేషన్లకు పేర్లు పెడతూ వస్తున్నారు.టఫ్ జనరేషన్!ఈరోజుల్లో పిల్లల పెంపకంలో టెక్నాలజీ కూడా భాగమైంది. 1981-1996 పేరెంట్స్.. పిల్లల పెంపకం విషయంలో బ్యాలెన్సింగ్‌గా ఉండడానికి ప్రయత్నించారు. జనరేషన్ Z తల్లిదండ్రులు టెక్నాలజీతో జరిగే గుడ్-బ్యాడ్లను గుర్తించి.. పిల్లల విషయంలో ఆంక్షలతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేశారు. అయితే తర్వాతి తరం తల్లిదండ్రుల విషయంలో ఇది ముమ్మాటికీ ఛాలెంజింగానే ఉండనుందట!.బీటా జనరేషన్‌కు టెక్నాలజీ అనేది మునివేళ్ల మీద ఉండబోతోంది. అదే సమయంలో.. ఈ జనరేషన్‌ను అర్థం చేసుకోవడం అంతేకష్టతరంగా మారనుంది. సాంకేతికత అనేది వాళ్ల జీవన శైలి(Life Style)ని, కెరీర్‌ను, తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేయనుంది. తద్వారా వాళ్ల ప్రవర్తన కూడా అందుకు తగ్గట్లే మారే అవకాశం ఉంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో.. ఈ జనరేషన్ కొన్ని సవాళ్లను ఎదుర్కొనుందట. ‘‘ఈ పిల్లలు పెరిగేకొద్దీ, వారు అనేక సామాజిక సవాళ్లతో పోరాడుతున్న ప్రపంచాన్ని చూడాల్సి వస్తుంది. వాతావరణ మార్పులు, ప్రపంచ జనాభా మార్పులు, వేగవంతమైన పట్టణీకరణ(Urbanization) వారి జీవితాలను ప్రభావితం చేసే ముఖ్యమైన సమస్యలయ్యే అవకాశం ఉంది. పర్యావరణ స్పృహ, స్థిరమైన జీవనశైలికి జనరేషన్ బీటా చిన్న వయస్సు నుంచే అలవాటు పడొచ్చు. 21వ శతాబ్దం తీవ్రమైన పర్యావరణ సమస్యలకు పరిష్కారాలను కనుగొనే పనిలో ఉంటారు. ఈ ఓవర్ స్మార్ట్‌నెస్‌కు ముందు తరాలు ఎంతవరకు భరించగలవనేది అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది ’’ అని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ‘జెన్ జెడ్’.. ఎందుకంత భిన్నమో తెలుసా? -
Russia-Ukraine war: ‘ఖైదీ’ సైనికులు
వాళ్లంతా కొన్ని నెలల క్రితం దాకా ఖైదీలు. పలు నేరాలకు శిక్షను అనుభవిస్తున్న వారు. కానీ ఇప్పుడు మాత్రం దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి మరీ పోరాడుతున్న సైనిక వీరులు! రష్యాతో రెండేళ్లకు పైగా సాగుతున్న యుద్ధంలో నానాటికీ పెరుగుతున్న సైనికుల కొరతను అధిగమించేందుకు ఉక్రెయిన్ తీసుకున్న వినూత్న నిర్ణయం వారినిలా హీరోలను చేసింది. ఎంతోమంది ఖైదీలు పాత జీవితానికి ముగింపు పలికి సైనికులుగా కొత్త జీవితం ప్రారంభించారు. ఫ్రంట్ లైన్లో పోరాడుతూ, కందకాలు తవ్వడం వంటి సహాయక పనులు చేస్తూ యుద్ధభూమిలో దేశం కోసం చెమటోడుస్తున్నారు.రష్యాతో రెండున్నరేళ్ల యుద్ధం ఉక్రెయిన్ను సైనికంగా చాలా బలహీనపరిచింది. ఈ లోటును భర్తీ చేసుకుని రష్యా సైన్యాన్ని దీటుగా ఎదుర్కోవడానికి ఖైదీల వైపు మొగ్గు చూపింది. ఇందుకోసం ఉక్రెయిన్ కొత్త చట్టం చేసింది. దాని ప్రకారం వాళ్లను యుద్ధంలో సైనికులుగా ఉపయోగించుకుంటారు. అందుకు ప్రతిగా యుద్ధం ముగిశాక వారందరినీ విడుదల చేస్తారు. అంతేకాదు, వారిపై ఎలాంటి క్రిమినల్ రికార్డూ ఉండబోదు! దీనికి తోడు ఫ్రంట్లైన్లో గడిపే సమయాన్ని బట్టి నెలకు 500 నుంచి 4,000 డాలర్ల దాకా వేతనం కూడా అందుతుంది!! అయితే శారీరక, మానసిక పరీక్షలు చేసి, కనీసం మూడేళ్లు, అంతకు మించి శిక్ష మిగిలి ఉండి, 57 ఏళ్ల లోపున్న ఖైదీలను మాత్రమే ఎంచుకున్నారు. ఈ లెక్కన 27,000 మంది ఖైదీలు పథకానికి అర్హులని ఉక్రెయిన్ న్యాయ శాఖ తేలి్చంది. కనీసం 20,000 మంది ఖైదీలన్నా సైనికులుగా మారతారని అంచనా వేయగా ఇప్పటికే 5,764 మంది ముందుకొచ్చారు. వారిలో 4,650 మంది ఖైదీలు సైనికులుగా అవతారమెత్తారు. ఈ ‘ఖైదీ సైనికు’ల్లో 31 మంది మహిళలున్నారు! 21 రోజుల శిక్షణ తర్వాత వీరు విధుల్లో చేరారు. గట్టి రూల్సే ఖైదీలను ఇలా సైన్యంలోకి తీసుకునేందుకు కఠినమైన నిబంధనలే ఉన్నాయి. హత్య, అత్యాచారం, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల నేరాలు, దేశద్రోహం, ఇతర తీవ్ర నేరాలకు పాల్పడిన వారికి పథకం వర్తించబోదు. నేరాలకు పాల్పడిన ఎంపీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా అనర్హులే. అయితే హత్యకు పాల్పడిన ఖైదీలను తమతో చేర్చుకునేందుకు అనుమతివ్వాలని ష్క్వాల్ బెటాలియన్ కోరుతోంది. ఫ్రంట్ లైన్లో అవసరమైన నైపుణ్యాలు వారికి బాగా ఉంటాయని వాదిస్తోంది. కొన్ని కేసుల్లో డ్రగ్స్ నేరాలకు పాల్పడ్డ వారినీ తీసుకుంటున్నారు. జైలరే వారి కమాండర్! తూర్పు ఉక్రెయిన్‌లోని పోక్రోవ్స్్కలో 59 బ్రిగేడ్‌లో 15 మందితో కూడిన పదాతి దళ సిబ్బంది విభాగానికి ఓ గమ్మత్తైన ప్రత్యేకత ఉంది. బ్రిగేడ్ కమాండర్ ఒలెగ్జాండర్ వాళ్లకు కొత్త కాదు. ఆయన గతంలో జైలు గార్డుగా చేశారు. 2022 ఫిబ్రవరిలో యుద్ధం మొదలవగానే సైనిక కమాండర్‌గా మారారు. ఇప్పుడు అదే జైల్లోని ఖైదీలు వచ్చి ఈ బ్రిగేడ్‌లో సైనికులుగా చేరారు. ఆయన కిందే పని చేస్తున్నారు! ‘‘యుద్ధభూమిలో వారు నన్ను మాజీ జైలు గార్డుగా కాక అన్నదమ్ములుగా, కమాండర్‌గా చూస్తారు. అంతా ఒకే కుటుంబంలా జీవిస్తాం. వీరికి తండ్రి, తల్లి, ఫిలాసఫర్... ఇలా ప్రతీదీ నేనే’’ అంటారాయన. సదరు జైలు నుంచి మరో పాతిక మంది దాకా ఈ బ్రిగేడ్‌లో చేరే అవకాశముందట.మట్టి రుణం తీర్చుకునే చాన్స్ జైల్లో మగ్గడానికి బదులుగా సైనికునిగా దేశానికి సేవ చేసే అవకాశం దక్కడం గర్వంగా ఉందని 41 ఏళ్ల విటాలీ అంటున్నాడు. అతనిది డ్రగ్ బానిసగా మారి నేరాలకు పాల్పడ్డ నేపథ్యం. నాలుగు నేరాల్లో పదేళ్ల శిక్ష అనుభవించాడు. ‘‘మా ఏరియాలో అందరు కుర్రాళ్లలా నేనూ బందిపోట్ల సావాసం నడుమ పెరిగాను. ఇప్పటిదాకా గడిపిన జీవితంలో చెప్పుకోవడానికంటూ ఏమీ లేదు. అలాంటి నాకు సైన్యంలో చేరి దేశం రుణం తీర్చుకునే గొప్ప అవకాశం దక్కింది. ఇలాగైనా మాతృభూమికి ఉపయోగపడుతున్నాననే తృప్తి ఉంది. కానీ సైనిక జీవితం ఇంత కష్టంగా ఉంటుందని మాత్రం అనుకోలేదు. కాకపోతే బాగా సరదాగా కూడా ఉంది’’ అని చెప్పుకొచ్చాడు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Empty nest syndrome: పిల్లలు ఎగిరెళ్లాక ఒకరికి ఒకరై
చదువుల కోసమో.. ఉద్యోగాల కోసమో పెళ్లయ్యాక వేరొక చోట ఉండేందుకో పిల్లలు తల్లిదండ్రులను విడిచి వెళతారు. ఆ సమయంలో ఇల్లు ఖాళీ అవుతుంది.. బోసి పోతుంది. తల్లిదండ్రుల జీవితంలో నైరాశ్యం వచ్చే అవకాశం ఉంటుంది. దీనినే ‘ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్’ అంటారు. ఈ సమయంలో భార్యను భర్త, భర్తను భార్య పట్టించుకోకపోతే, కొత్త జీవితం మొదలుపెట్టకపోతే అనేక సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులు ఏం చేయాలి? కేస్ స్టడీ 1: దీపావళి పండగ వచ్చింది. అపార్ట్మెంట్లో అందరూ టపాకాయలు కాలుస్తున్నారు. కాని మూర్తి గారు, ఆయన భార్య సరళ గారు మాత్రం కిందకు రాలేదు. సరదాకైనా నిలబడలేదు. మామూలుగా ప్రతి సంవత్సరం వాళ్లు బోలెడన్ని టపాకాయలు కాలుస్తారు. సందడి చేస్తారు. ఈసారి అస్సలు తలుపులే తీయలేదు. కారణం? ఆరు నెలల క్రితమే వాళ్ల ఒక్కగానొక్క కొడుకు ఎం.ఎస్. చేయడానికి యు.ఎస్. వెళ్లాడు. అప్పటి నుంచి వారిలో ఒక రకమైన నిర్లిప్తతను అపార్ట్మెంట్ వాసులు గమనిస్తున్నారు. చివరకు ఆ నిర్లిప్తత పండగల మీద కూడా ఆసక్తిని కోల్పోయేలా చేసింది. కేస్ స్టడీ 2: యాభై ఏళ్ల సీతాదేవికి విపరీతంగా కాలు నొప్పి వస్తోంది. భర్త జానకిరామ్ ఆమెను అన్ని హాస్పిటళ్లకు తిప్పాడు. కాల్లో ఏ సమస్యా లేదు. ఏదైనా ఆందోళన వల్ల వస్తున్న సైకలాజికల్ నొప్పేమోనని డాక్టర్లు అంటున్నారు. సీతాదేవి, జానకిరామ్‌లకు కూతురు, కొడుకు. మొదట కూతురు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లింది. కొడుకు చదువుకుంటానని స్వీడన్ వెళ్లాడు. అప్పటి నుంచి ఆమెకు తెలియని ఆందోళన. ఒంటరితనం. దిగులు. భర్త ఏదైనా కాలక్షేపం కోసం బయటకు వెళ్లినా ఆమెకు దిగులు ముంచుకొస్తోంది. పిల్లలు లేని ఇల్లు ఆమెకు ఎంతకాలానికీ అలవాటు కావడం లేదు. ‘నెస్ట్’ అంటే గూడు. పిల్లలు లేని గూడు ఎంత లేదన్నా బోసి పోతుంది. తల్లిదండ్రులు... వారు లేని వెలితితో ఇంట్లో మిగులుతారు. ఆ సమయంలో వారిలో అనేక రకాలైన మానసిక సంచలనాలు వస్తాయి. అటువంటి సందర్భాన్ని మానసిక నిపుణులు ‘ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్’ అంటున్నారు. పాశ్చాత్య దేశాలలో పిల్లలను విడి గదుల్లో ఉంచి పెంచడం అలవాటు. 18 ఏళ్లు రాగానే వారు దూరమవుతారనే మానసిక సంసిద్ధతతో ఉంటారు. భారతీయులు మాత్రం పిల్లలను తమ వద్దే పడుకోబెట్టుకుంటారు. వారికి ఎంత వయసొచ్చినా వారు తమతో లేదా వారి వెంట తాము ఉండాలనుకుంటారు. అలాంటిది చదువు, ఉద్యోగాలు, పెళ్లి చేసుకొని విడి కాపురం పెట్టడాలు లేదా వేరే చోట స్థిరపడటాలు జరిగినప్పుడు ఒక ఖాళీతనం వారిని ఇబ్బంది పెడుతుంది. దానికి అడ్జస్ట్ కావడానికి టైమ్ పడుతుంది. అలాంటి సందర్భంలో తల్లిదండ్రులు కాస్తా భార్యాభర్తలుగా మారి ఒకరికి ఒకరై కనిపెట్టుకోవాలని నిపుణులు అంటున్నారు. ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ ప్రతికూలతలు: ⇒ పిల్లల గురించి ఆందోళన... వారితో మానసిక ఎడబాటు వస్తుందేమోనన్న భయం ⇒ ఒంటరితనం ఫీల్ కావడం ⇒ సంతోషంగా ఉండలేకపోవడం ⇒ కలత నిద్ర ⇒ జీవితానికి అర్థమేమిటి అనే సందేహం ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ అనుకూలతలు: ⇒ బోలెడంత ఖాళీ టైమ్ రావడం ⇒ బాధ్యతలు లేని స్వేచ్ఛ ⇒ స్వీయ ఇష్టాలు నెరవేర్చుకునే వీలు ⇒ కొత్తగా ఏదైనా చేద్దాం అనే ఉత్సాహం అయితే తమ మానసిక సామర్థ్యాన్ని బట్టి అనుకూలతలను తీసుకోవాలా ప్రతికూలతలతో కుంగిపోవాలా అనేది తేల్చుకుని ప్రతికూలతలను జయించి ముందుకు సాగాలి. కొత్త జీవితం: అన్నింటి కంటే మించి అంతవరకూ తల్లిదండ్రులుగా ఎక్కువ మసలినవారు పిల్లలు స్థిరపడ్డాక మళ్లీ భార్యాభర్తలుగా మారతారు. ఆ సమయంలో ఇద్దరూ ఇంట్లో ఎక్కువ సేపు గడిపే వీలు చిక్కుతుంది. దాంతో ఒకరితో ఒకరు అనుబంధం పెంచుకోవచ్చు. కాని సాధారణంగా ఒకరిని మరొకరు భూతద్ధంలో చూస్తూ పాత నష్టాలనూ, తొక్కిపెట్టిన పాత ఫిర్యాదులనూ బయటకు తీస్తే జీవితం దారుణంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ సమయంలోనే భార్యను భర్త, భర్తను భార్య ఎక్కువగా అర్థం చేసుకోవాలి... స్నేహంగా ఉండాలి... పరస్పరం కలిసి యాత్రలు, విహారాలు, బంధుమిత్రులను కలవడం, ఏదైనా హాబీని అలవర్చుకోవడం, వాకింగ్ గ్రూపుల్లో చేరడం, ఇష్టమైన సినిమాలు చూడటం, జీవితంలో గడిచిన మంచి విషయాలు గుర్తుకు చేసుకోవడం, ఒకప్పుడు ఇవ్వలేని సమయాన్ని ఇప్పుడు ఇవ్వడం చేయాలి. ఈ సమయంలో పరస్పర భద్రత కూడా ముఖ్యమే కాబట్టి దానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆర్థికపరమైన సౌలభ్యం ఉంటే అందాక తీరని ముచ్చట్లను తీర్చుకోవడం కూడా మంచి వ్యాపకమే. జీవితంలో పిల్ల లకు ఇవ్వదగ్గ ప్రేమంతా ఇచ్చాం... ఇప్పుడు పరస్పరం ప్రేమను పంచుకుందాం అనే భావన అత్యంత ముఖ్యమైనది ఈ ‘ఎంప్టీ నెస్ట్’ కాలంలో. ఈ జాగ్రత్తలు తీసుకుంటే బెంగ ఉండదు. పిల్లలు ఫోన్ చేసినప్పుడు అలాంటి తల్లిదండ్రుల గొంతులో తప్పక సంతోషాన్ని వింటారు. ఆ సంతోషమే పిల్లలకు గొప్ప కానుక. -
సార్... దిస్ అబ్బాయి బీట్ మీ... బట్ ఐయామ్ నాట్ తిరిగి బీట్!
అస్సాంలోని పచిమ్ నగామ్ గ్రామంలోని ‘న్యూ లైఫ్ హైస్కూల్’లో పిల్లలు ఇంగ్లిష్‌లో మాత్రమే మాట్లాడాలనే నిబంధన ఉంది. ఒకరోజు ఇద్దరు పిల్లలు గొడవ పడ్డారు. క్లాస్ టీచర్ వారిని పిలిపించి ‘టెల్ మీ, వాట్ హ్యాపెన్డ్?’ అని అడిగారు. ‘ఇతడు నా మెడ పట్టుకున్నాడు’ అని ఒకరు చెప్పాలనుకున్నారు. ‘ఇతడు నా తలపై పంచ్ ఇచ్చాడు’ అని మరొకరు చెప్పాలనుకున్నారు. అట్టి విషయాన్ని పూర్తిగా ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో చెప్పలేక సైన్ లాంగ్వేజ్‌ను కూడా అప్పు తెచ్చుకొని కాస్తో కూస్తో ఇంగ్లిష్‌లో ఆ పిల్లలు చెబుతున్న మాటలు నెటిజనులను నవ్వుల్లో ముంచెత్తాయి. -
యవ్వనానికి ఆక్సిజన్ గది
అమృతం తాగితే జరామరణాలు ఉండవని అంటారు. అయితే, కోల్పోయిన యవ్వనాన్ని తిరిగి పొందటానికి అమృతమే తాగాల్సిన పనిలేదు. ఈ గదిలో రోజుకు ఓ గంట పడుకుంటే చాలు. కేవలం సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండే ‘హెచ్‌బీఓటీ (హైపర్బ్యారిక్ ఆక్సిజన్ థెరపీ)’ నేడు తక్కువ ధరల్లోనే దొరకనుంది. దీనికోసం అమెరికాకు చెందిన హెచ్ఓబీఓ2 అనే సంస్థ ప్రత్యేకమైన ఓ మెటల్ చాంబర్‌ను రూపొందించింది. సాధారణంగా మన వాతావరణంలో 21 శాతం ఆక్సిజన్, 79 శాతం నైట్రోజన్, ఇతర వాయువులు ఉంటాయి. అదే ఈ చాంబర్లో 95 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుంది. ఇక ఇందులోని ప్రత్యేకమైన కొల్లాజెన్ ఫైబర్స్, లైటింగ్ సిస్టమ్ ముడతలను తొలగించి, చర్మాన్ని కాంతిమంతగానూ, మృదువుగా చేస్తుంది. కావాల్సిన వారు వీరి అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. అద్దెకు కూడా తీసుకోవచ్చు. నెలకు రూ.80 వేల నుంచి, రూ. లక్ష తీసుకుంటారు. ఒక్క రోజుకు కూడా అద్దెకు ఇస్తారు. అయితే, ప్రస్తుతం విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. -
అనుకున్న పని చేసేసిన నిహారిక.. కంగ్రాట్స్ అంటూ కామెంట్స్
గత కొంతకాలంగా మెగాడాటర్ నిహారిక కొణిదెల నిత్యం వార్తల్లో నిలుస్తోంది. భర్త చైతన్య జొన్నలగడ్డతో మనస్పర్థల కారణంగా వీరి విడాకులు తీసుకోనున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఇంతవరకు మెగా ఫ్యామిలీలో ఎవరూ స్పందించలేదు. ఇప్పటికే చైతన్య నిహారికను అన్‌ఫాలో చేయడమే కాకుండా పెళ్లి ఫోటోలన్నింటినీ డిలీట్ చేశాడు. ఇప్పుడు భర్త బాటలోనే నిహారిక కూడా ఇప్పటికే అతన్ని ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేయగా ఇప్పుడు చైతన్యతో దిగిన ఫోటోలన్నింటినీ డిలీట్ చేసేసింది. దీంతో విడాకుల విషయంలో వీరిద్దరూ పరోక్షంగా హింట్ ఇచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే నటనకు గుడ్‌బై చెప్పి నిర్మాతగా మారిన నిహారిక సొంతంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ను నెలకొల్పిన సంగతి తెలిసిందే. తాజాగా నిహారిక మరో ముందడుగు వేసింది. తన ప్రొడక్షన్ బ్యానర్‌కు ఒక ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకుంది. ఎప్పటినుంచో సొంతంగా ఆఫీస్ నెలకొల్పాలని కలలు కన్న నిహారిక తాజాగా ఆ పని పూర్తిచేసింది.దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. దీంతో పలువురు నిహారికకు కంగ్రాట్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. -
మనసు కుదిరింది.. పెళ్లి జరిగింది
‘పెళ్లి కుదిరితే పిచ్చి కుదురుతుంది పిచ్చి కుదిరితే పెళ్లి జరుగుతుంది’ అని సామెత. అంటే పిచ్చి కుదరదు... పెళ్లి జరగదు అని అర్థం. కాని ఆ సామెతను తప్పు చేశారు ఇద్దరు ప్రేమికులు. మానసిక అస్వస్థతతో చెన్నై పిచ్చాసుపత్రిలో విడివిడిగా చేరిన ఈ ఇరువురుకి అక్కడ పరిచయమైంది. వ్యాధి నయం కావడంతో పెళ్లి నిర్ణయానికి వచ్చారు. 200 ఏళ్ల చరిత్రగల ఆ ఆస్పత్రిలో ఈ ఘటన మొదటిసారి. మానసిక అస్వస్థత కూడా జ్వరం, కామెర్లులా నయం కాదగ్గదే. గమనించి వైద్యం చేయిస్తే పూర్వ జీవితం గడపొచ్చు. చెన్నైలో జరిగిన ఈ పెళ్లి ఆశలు వదులుకునే మానసిక అస్వస్థులకు గొప్ప శుభవార్త. శుభమస్తు వార్త. మానసిక అస్వస్థత వస్తే ఈ సమాజంలో ఎన్నో అపోహలు, భయాలు, ఆందోళనలు, హేళనలు ఆపై బహిష్కరణలు. ‘పిచ్చివారు’ అని ముద్ర వేసి వారికి వైద్యం చేయించాలనే ఆలోచన కూడా చేయరు. అదే జ్వరం వస్తే జ్వరం అని చూపిస్తారు. కాని మనసు చలిస్తే ఏదో దెయ్యం పట్టిందని వదిలేస్తారు. మానసిక ఆరోగ్యం గురించి ప్రభుత్వాలు, సేవా సంస్థలు ఎంతో ప్రచారం చేస్తున్నా వైద్యం అందాల్సిన వారు, వైద్యం చేయించాల్సిన వారు కూడా అవగాహన లోపంతో వున్నారు. డాక్టర్ దగ్గరకు వెళ్దామంటే ‘నాకేమైనా పిచ్చా’ అని ఎదురు తిరుగుతారు పేషెంట్లు. ‘పిచ్చి’ ముద్ర వేస్తారని. ‘పిచ్చికి మందు లేదు’ అని వదిలేస్తారు బంధువులు. ఇద్దరూ ఓర్పు వహిస్తే గొప్ప ఫలితాలు వస్తాయి అనడానికి ఇదిగో ఇదే ఉదాహరణ. చెన్నైలోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్’ (ఐ.ఎం.హెచ్.) బ్రిటిష్ కాలం నాటిది. దేశంలోనే రెండవ అతి పెద్ద మానసిక చికిత్సాలయం. అందులో కొంత కాలం కిందట వైద్యం కోసం చేరారు మహేంద్ర (42), దీప (38). కుటుంబాలు వారిని చేర్పించి చేతులు దులుపుకున్నాయి. కాని వారు బాగయ్యారు. కొత్త జీవితం గడపాలనుకున్నారు. కాని బయటకు వెళితే ‘నయమై వచ్చినా’ అమ్మో పిచ్చోళ్లు అనే వివక్షతో చూస్తారు జనం. ఆ భయంతో మళ్లీ హాస్పిటల్‌కు వచ్చేశారు. దాంతో హాస్పిటల్ వారే వారికి లోపల ఉద్యోగాలు కల్పించారు. మహేంద్ర డేకేర్ సెంటర్లో పని చేస్తుంటే దీప కేంటిన్లో పని చేస్తోంది. మెల్లగా ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ సంగతి అడ్మినిస్ట్రేషన్‌కు తెలియగానే హడలిపోయారు. ఎందుకంటే ఇలాంటిది ఇంతకు మునుపు ఎరగరు. ఇదేమైనా ఇష్యూ అవుతుందా అనుకున్నారు. కాని హాస్పిటల్ డైరెక్టర్ అయిన డాక్టర్ పూర్ణ దగ్గరకు వచ్చిన దీప ‘నేను అతనితో నా జీవితం పంచుకోవాలనుకుంటున్నానమ్మా’ అని చెప్పే సరికి ఆమెకు ఆ స్త్రీ హృదయం అర్థమైంది. అంతే. హాస్పిటల్లో పని చేసే అందరూ తలా ఒక చేయి వేసి వారి పెళ్లికి ఆర్భాటంగా ఏర్పాట్లు చేశారు. తాళిబొట్టు ఆ ఏరియా ఎం.ఎల్.ఏ. ఏర్పాటు చేశాడు. అంతేనా హెల్త్ మినిస్టర్ శేఖర్ బాబు, ఎం.పి. దయానిధి మారన్ ఏ బందోబస్తు లేకుండా సగటు బంధువుల్లా పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి ఎంతో వేడుకగా జరిగింది. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటే జీవితం ముగిసినట్టు కాదు. స్వల్ప కాలం ఇబ్బంది పడ్డా నయమయ్యి కొత్త జీవితం గడపవచ్చు. అందుకు ఉచిత వైద్యం దొరుకుతుంది. కనుక ఆరోగ్యాన్ని గమనించి సమస్య వస్తే జయించండి. కొత్త జీవితాన్ని కళకళలాడించండి. ఎవరికి తెలుసు... ఇప్పుడు కష్టం వచ్చినా భవిష్యత్తు ఎన్ని సంతోషాలను దాచిపెట్టి ఉందో! -
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం: యోగా ఒక విస్మయ శక్తి
ఇవాళ ఆసనాలు వేస్తూ శరీరాన్ని చురుగ్గా కదిలిస్తున్న నివేదితా జోషి ఒకప్పుడు డిస్క్–సర్వికల్ స్పాండిలోసిస్‌తో 8 ఏళ్లు మంచం పట్టింది. వీల్‌చైర్‌లో తప్ప బయటకు రాలేకపోయింది. ఆమెను లేపి నిలబెట్టే మందే లేదు. కాని యోగా మహా గురువు అయ్యంగార్ ఆమెను కేవలం ఒక సంవత్సరకాలంలో యోగా ద్వారా నార్మల్ చేశారు. కొత్త జీవితం ఇచ్చారు. ఆమె యోగా శక్తిని తెలుసుకుంది. జీవితాన్ని యోగాకి అంకితం చేసింది. అయ్యంగార్ యోగా విధానాల ద్వారా యోగా కేంద్రాన్ని నడుపుతూ మొండి రోగాలను దారికి తెస్తోంది. ఆమె పరిచయం... యోగా అవసరం... ‘యోగా ఒక జీవన విధానం. మంచి ఆరోగ్యం కోసం యోగా చేయాలని చాలామంది అనుకుంటారు. కాని మంచి ఆరోగ్యం అనేది యోగా వల్ల వచ్చే ఒక ఫలితం మాత్రమే. యోగాను జీవన విధానం గా చేసుకుంటే మనసుకు శాంతి, సంతృప్తి, సోదర భావన, విశ్వ మానవ దృష్టి అలవడతాయి’ అంటుంది నివేదితా జోషి. ఢిల్లీలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్‌లో ఆమె యోగా కేంద్రం ‘యోగక్షేమ’ ఎప్పుడూ యోగ సాధకులతో కిటకిటలాడుతుంటుంది. దేశంలో యోగా గురువులు ఎందరో ఉన్నారు. కాని నివేదితా జోషి ప్రత్యేకత మరొకటి ఉంది. ఆమె సాధన చేసేది అయ్యంగార్ యోగ. మన దేశంలో యోగాకు విశేష ప్రచారం కల్పించిన గురువు బి.కె.ఎస్ అయ్యంగార్ ప్రియ శిష్యురాలు నివేదితా. మహా మహా మొండి సమస్యలను కూడా అయ్యంగార్ యోగా ద్వారా జయించవచ్చు అని గురువుకు మల్లే నిరూపిస్తోందామె. తానే ఒక పేషెంట్‌గా వెళ్లి అలహాబాద్‌లో పుట్టి పెరగిన నివేదితా జోషి సీనియర్ బిజెపి నేత మురళీ మనోహర్ జోషి కుమార్తె. 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇంట్లో 3 గంటల పాటు పూజలో కూచొని లేవలేకపోయింది. ఆ రోజుల్లో ఎంఆర్ఐలు లేవు. డాక్టర్ మజిల్ వీక్నెస్ అని భావించాడు. నిజానికి ఆమెకు వచ్చిన సమస్య స్లిప్డ్ డిస్క్. ఆ సమస్య ఆమెను వదల్లేదు. బాధ పడుతూనే మైక్రోబయాలజీ చేసింది. మైక్రోబయాలజిస్ ్టగా కెరీర్ మొదలెట్టే సమయానికి ఇక పూర్తిగా కదల్లేని స్థితికి వెళ్లింది. అప్పటికి ఆమె వయసు 27 సంవత్సరాలు. ‘నా చేతులతో నేను జుట్టు కూడా ముడి వేసుకోలేకపోయేదాన్ని’ అందామె. తీవ్రమైన డిప్రెషన్లోకి వచ్చింది. ఆ సమయంలోనే ఎవరో పూణెలోని అయ్యంగార్ యోగా కేంద్రం గురించి చెప్పారు. ‘నేను ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు నా సమస్యను చెప్పలేదు. నా రిపోర్టులు చూపించలేదు. కాని కంఠం దగ్గర ఉన్న నా చర్మం ధోరణిని బట్టి ఆయన నాకున్న సమస్య ఏమిటో ఇట్టే చెప్పేశారు. రేపటి నుంచే పని మొదలెడుతున్నాం అన్నారు.’ అందామె. ఆ తర్వాత అయ్యంగార్ ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకూ కఠోరంగా ఆసనాలు సాధన చేయించారు. మామూలుగా యోగాలో అన్ని అవయవాలు సరిగా ఉన్నవారే అన్ని ఆసనాలు వేయగలరు. కాని అయ్యంగార్ యోగాలో ఏ శారీరక ఇబ్బంది ఉన్నా కొన్ని వస్తువుల, ఉపకరణాల సాయం తో ప్రతి ఆసనం వేయొచ్చు. అలా కదల్లేని మెదల్లేని స్థితిలో ఉన్న నివేదితాతో అన్ని ఆసనాలు వేయిస్తూ కేవలం సంవత్సర కాలంలో ఆమెను కాళ్ల మీద నిలబెట్టాడాయన. ఒక రకంగా ఇది మిరాకిల్. అద్భుతం. అందుకే నివేదితా యోగాకే తన జీవితం అంకితం చేసింది. మరో 18 ఏళ్ల పాటు అయ్యంగార్‌కు శిష్యరికం చేసింది. ‘నా పేరుతో నువ్వు ఢిల్లీలో అధికారిక యోగా కేంద్రం తెరువు’ అని అయ్యంగార్ చేతే ఆమె చెప్పించుకోగలింది. గురువు చేతుల మీదుగానే 2008లో ఢిల్లీలో ‘యోగక్షేమ’ కేంద్రాన్ని తెరిచింది. నిద్ర – మెలుకువ ‘ఇవాళ్టి రోజుల్లో యువతీ యువకులు అనారోగ్య బారిన పడటానికి కారణం వారు నిద్ర పోవాల్సిన టైమ్‌లో నిద్రపోయి మేల్కొనాల్సిన టైములో మేల్కొనకపోవడం. దానివల్ల బాడీ క్లాక్ దెబ్బ తింటుంది. చేసే క్రియలన్నీ తప్పి జబ్బులొస్తాయి’ అంటుంది నివేదితా. ఆ అలవాటు సరి చేసుకోకుండా యోగా చేస్తే ఉపయోగం లేదంటుంది ఆమె. నివేదితా తన దగ్గరకు వచ్చే వారిలో నిద్రలేమి సమస్యలు, అంతర్గత ఆరోగ్య సమస్యలు, అశాంతి, డిప్రెషన్, మానసిక సమస్యలు... వీటన్నింటిని యోగా ద్వారా అదుపులోకి తెస్తోంది. ‘మీ శరీరం ఒక దిక్కు మనసు ఒక దిక్కు ఉంటే ఎలా? శరీరం మనసు ఒక సమతలంలోకి రావాలి. అప్పుడే ఆరోగ్యం. ధ్యానం చాలా అవసరం. అది మనసును శుభ్రపరుస్తుంది’ అంటుందామె. మానవత్వం కోసం యోగా ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022’కు థీమ్‌గా ‘మానవత్వం కోసం యోగా’ ఎంచుకున్నారు. మానవత్వం కోసం యోగా ఎలా? జగాన ఈ కసి, పగ, శతృత్వం, అసహనం, యుద్ధలాలస, ఆక్రమణ, వేధింపు ఇవన్నీ మనసు ఆడే గేమ్‌లో నుంచి వచ్చేవే. మనసు శాంతంగా ఉంటే సగం సమస్యలు తీరుతాయి. మనసును శాంత పరిచేదే, దాని అలజడిని తగ్గించేది, ఒక అద్దంలాగా మారి మనల్ని మనకు చూపించేదే యోగా. ఈ మార్గంలో ధ్యానం చేసే కొద్దీ ఈ భూగోళాన్ని శాంతివైపు మళ్లించాలనే భావన కలుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ యోగసాధనలో ప్రశాంతత పొందాలి ముందు. అది మానవాళికి మేలు చేస్తుంది. ‘అయితే యోగా అంటే గుడ్డిగా చేయడం కాదు. ఏ వరుసలో ఆసనాలు వేయాలి, ఎంతసేపు ఆసనాలు వేయాలి అనేది ప్రధానం. మీరు సరైన ఫలితాలు పొందాలంటే ఈ రెండూ జాగ్రత్తగా తెలుసుకోండి. లేకుంటే మీ శ్రమ వృధా’ అంటుందామె. యోగా దినోత్సవం సందర్భంగా అందరూ యోగసాధకులవుదామని కోరకుందాం. -
మనసు కుదుట పడింది కాఫీ తాగండి
ఆ కేఫ్‌కి కష్టమర్లు మంచి రేటింగే ఇచ్చారు. ఫేస్బుక్ 5కు 5 పాయింట్లు ఇచ్చింది. కోల్‌కతా ప్రజలకు తెలుసు తమకు ఆ కేఫ్‌ను ప్రోత్సహించాలని. అందుకే అక్కడకు వెళతారు. మాక్టైల్స్ తాగుతారు. పఫ్‌లు తింటారు. బేకరి ఐటమ్స్ పార్శిల్ కట్టించుకుంటారు. 7 నుంచి 9 మంది స్త్రీలు ఎప్పుడూ అక్కడ చిరునవ్వుతో పని చేస్తూ ఉంటారు. కూర్చోవడానికి అనువుగా ఉండి ప్రశాంతంగా ఉండే బేకరి కేఫ్ పేరు ‘క్రస్ట్ అండ్ కోర్’. దక్షిణ కోల్‌కతాలోని ‘చేట్ల’ ప్రాంతంలో ఉంటుంది. ఏమిటి దాని విశేషం? మానసిక సమస్యల నుంచి బయటపడిన ఏ ఆధారం లేని స్త్రీలు అక్కడ పని చేస్తారు. ఇలా వారి కోసమే నడిచే బేకరి దేశంలో ఇదే కావచ్చు. మానసిక హింస భౌతిక హింసలో గాయం అయితే మందు రాస్తే తగ్గిపోవచ్చు. కాని మానసిక హింస తాలూకు దుష్ప్రభావాలు దీర్ఘకాలం ఉంటాయి. అవి క్రమేపి మానసిక రుగ్మతలుగా మారతాయి. వాటికి వైద్యం చేయించుకోవాలని చాలామంది మహిళలకు తెలియదు. ఒకవేళ తెలిసినా జ్వరం వస్తే డాక్టర్ దగ్గరకు తీసుకువెళతారు కాని సైకియాట్రిస్ట్‌ల దగ్గరకు వెళ్లరు. చివరకు ఆ రుగ్మతలు ముదిరిపోతాయి. ఏమీ తెలియని స్థితిలో ఇళ్ల నుంచి బయటపడి సమాజం దృష్టిలో ‘పిచ్చివాళ్లు’ అన్న ముద్ర పడి తిరుగుతుంటారు. ఇలా తిరిగే స్త్రీల కోసం కోలకతాలో ‘ఈశ్వర సంకల్ప’ అనే ఎన్.జి.ఓ పని చేస్తోంది. వీళ్లు ‘సర్బరి షెల్టర్’ అనే ఒక హోమ్‌ను నడుపుతున్నారు. ఇందులో అచ్చంగా మానసిక సమస్యలతో రోడ్ల మీద తిరిగే స్త్రీలను తీసుకొచ్చి ఆశ్రయం ఇస్తారు. వీరికి వైద్యం చేయించి బేకింగ్‌లో శిక్షణ ఇచ్చి ఈ బేకరిలో ఉపాధి కల్పిస్తున్నారు. 2018లో ఇలా మానసిక సమస్యల నుంచి బయటపడిన స్త్రీల కోసం ‘క్రస్ట్ అండ్ కోర్’ బేకరినీ తయారు చేశారు. గత మూడేళ్లుగా ఈ బేకరి విజయవంతంగా నడుస్తూ ఉంది. గృహహింసతో మానసిక సమస్యలు ‘సర్బరి షెల్టర్’లో ఆశ్రయం పొంది బేకరిలో పని చేస్తున్న మహిళలందరూ దారుణమైన గృహహింసకు పాల్పడిన వారే. భర్త, అత్తింటివారు పదేపదే భౌతికదాడికి పాల్పడటం, మానసికంగా భయభ్రాంతం చేయడం వల్ల అదీ ఒకరోజు రెండు రోజులు కాదు మూడునాలుగేళ్లు వరుసగా చేయడం వల్ల మతి చలించి ముఖ్యంగా ‘స్క్రిజోఫోబియా’ బారిన పడి ఇళ్లు వదిలినవాళ్లే అంతా. వీరు చాలారోజులు రైల్వేస్టేషన్లలో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ చివరకు ఈ హోమ్‌కు పోలీసుల ద్వారా చేరుతారు. ‘వాళ్లకు ఒక్కొక్కరికి సంవత్సరం నుంచి రెండేళ్ల పాటు వైద్యం చేయిస్తాం. అప్పుడు నార్మల్ అవుతారు. ఆ తర్వాత కూడా మందులు తప్పనిసరిగా కొనసాగిస్తూ పని చేసుకోవాల్సి ఉంటుంది’ అని హోమ్ నిర్వాహకులు చెప్పారు. కొత్త జీవితం ‘నేను బిస్కెట్లు బాగా చేస్తాను. కేక్‌లు అవీ చేయడం రాదు’ అని ఈ కేఫ్‌లో పని చేసే ఒక మహిళ చెప్పింది. ‘నేను కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటున్నాను. నాదంటూ ఒక ఇల్లు ఉండాలి’ అందామె. మిగిలిన వారిలో ముంబై నుంచి తప్పిపోయి వచ్చినవారు, అస్సాం వైపు నుంచి వచ్చిన వారు ఉన్నారు. వీరి వయసులో 26 నుంచి 45 వరకూ ఉన్నాయి. ‘మీ కేఫ్‌లో ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి’ అనే చిన్న మాటకు వాళ్లు చాలా బ్రైట్‌గా నవ్వుతారు. ఆ చిన్న ప్రశంస వారికి పెద్ద ఆరోగ్యహేతువుతో సమానం. ‘మానసిక సమస్యల నుంచి బయటపడిన వారు కొంత బెరుకుగా, ఎదుటివారి మీద ఆధారపడేలా ఉంటారు. వీరిని సమాజం కలుపుకుని మద్దతు ఇవ్వకపోతే తమలో తాము ముడుచుకుపోతారు. నలుగురిలో కలవడానికే భయపడిపోతారు. కేఫ్ పెట్టడం ద్వారా వీరు నలుగురినీ కలిసేలా చేసి వీరి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాం’ అని కేఫ్‌లో సూపర్వైజర్గా పని చేసే మహిళ చెప్పారు. ఈ సూపర్వైజర్ మాత్రం ‘నార్మల్’ నేపథ్యం నుంచి వచ్చిన మహిళ. ఈమె తనతో పని చేసే ఈ మహిళలను కనిపెట్టుకుని ఉంటుంది. ఈ కేఫ్‌కు వెళితే బయట ‘మేము ప్రతికూలతలను జయించాం. మేము చాంపియన్స్’ అని ఉంటుంది. నిజమే. వారు చాంపియన్స్ మనసు చీకటి గుయ్యారాల్లో జారి పడిపోయినా తిరిగి వెలుతురు వెతుక్కుంటూ దానిని దారికి తెచ్చుకున్నారు. సమస్యలు, సవాళ్లు తద్వారా మానసిక బలహీనత ఎవరికైనా సహజం. దానికి వైద్యం తీసుకోవాలి. స్నేహితుల సపోర్ట్ తీసుకోవాలి. అన్నింటిని దాటి కొత్త జీవితం మొదలెట్టాలి. క్రస్ట్ అండ్ కోర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. – సాక్షి ఫ్యామిలీ -
కొత్త జీవితానికి శుభాకాంక్షలు
కొత్త సంవత్సరం వచ్చేది పాతవి వదిలిపెట్టడానికి.12 నెలల– 52 వారాల– 365 రోజుల గత జీవితాన్ని అందులోని అప్రియమైన సంగతులను వదిలి ముందుకు సాగడానికి.కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకోవడం అంటే ఉన్న బంధాన్ని కొత్తగా నిర్వచించుకోవడమే.గొడవలున్న తేదీలను మార్క్ చేసిన పాత కేలండర్‌ని పారేద్దాం.సంతోషాలను ప్లాన్ చేసుకున్న కొత్త కేలండర్‌ను స్వాగతిద్దాం.హ్యాపీ న్యూ ఇయర్. భార్యతో టైమ్ స్పెండ్ చేయలేని సక్సెస్ అది ఎంత పెద్దదైనా కాని సక్సెస్ కాదు. ఎప్పుడో వస్తాయనుకునే కంఫర్ట్స్ కోసం ఇప్పటి లైఫ్‌లోని కంఫర్ట్‌ను పాడుచేసుకుంటున్నారు. లైఫ్ పార్టనర్‌ను టేకెన్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటే కలిగే నష్టం చాలా ఎక్కువ. జనవరి 1 మరో రెండు వారాలు ఉందనగా ఆమె ఫోన్ చేయడం మొదలుపెట్టింది. ‘చూడండి. ఏదైనా ఉంటే మీరు క్లినిక్‌కు వచ్చి మాట్లాడండి. ఫోన్లో మీ కేస్‌ను అసెస్ చేయడం కుదరదు’ అన్నాడు సైకియాట్రిస్ట్. ‘కాదు డాక్టర్. నాకు మీ దగ్గరకు రావాలంటే భయం. సైకియాట్రి క్లినిక్‌లకు వచ్చేంతగా నేనింకా ప్రిపేర్ కాలేదు. మిమ్మల్ని కలవాలి అనుకున్న వెంటనే నా మనసు నీకేమైనా పిచ్చా.. సైకియాట్రిస్ట్‌లను పిచ్చివాళ్లే కలుస్తారు అనడం మొదలెట్టింది’ సైకియాట్రిస్ట్‌కు నవ్వు వచ్చింది. ‘మీరు సినిమాలు ఎక్కువ చూస్తారులాగుంది’ అన్నాడు. ‘అవును. మీకెలా తెలుసు’ ‘సినిమాల్లో పిచ్చివాళ్లను రకరకాలుగా చూపిస్తుంటారు. పిచ్చి అంటే చెట్టెక్కి కూచుని వింత చేష్టలు చేయడం మాత్రమే అని వారి అవగాహన. చూడండి... జలుబు అనారోగ్యమే. కేన్సర్ అనారోగ్యమే. రెండూ శరీరానికి వస్తాయి. మనసు విషయంలో కూడా జలుబు స్థాయి ఉంటుంది... కేన్సర్ అంత తీవ్రస్థాయి ఉంటుంది. జలుబుకు టేబ్లెట్ వేసుకునే మనం మనసులో చిన్న గుబులు వచ్చినప్పుడో, వ్యాకులత పెరిగినప్పుడో, నిర్ణయాల్లో నిలకడ లేనప్పుడో, మనసుకు తగిలిన గాయాలు ఎంతకీ మానలేకపోయినప్పుడో ఎందుకు మందులు వాడము? ఎందుకు సైకియాట్రిస్ట్ సలహా తీసుకోము? చెప్పండి’ అటువైపు నిశ్శబ్దం ఆవహించింది. ఆ మరుసటి రోజే ఆమె క్లినిక్‌కు వచ్చింది. ‘నా భర్తకు జనవరి 1న గుడ్‌బై చెప్దామనుకుంటున్నాను డాక్టర్’ అందామె. ముప్పై ఐదేళ్లుంటాయి. చామనఛాయలో కొద్దిపాటి బొద్దుగా ఉంది. ఇద్దరు పిల్లలట. అమ్మాయిలు. ‘ఏమిటి.. ఆ డేట్ ప్రత్యేకత?’ ‘ఏం లేదు.. కొత్త సంవత్సరం కదా. లైఫ్‌ను కొత్తగా స్టార్ట్ చేద్దామని’ ‘అంటే ఇంకో రెండువారాల్లో’ ‘రెండు వారాల్లోనే’ ‘ఆలోచిద్దాం. ముందు మీ సమస్య ఏమిటో చెప్పండి’ అన్నాడు సైకియాట్రిస్ట్ సర్దుకుని కూచుంటూ. ఆమె పేరు రాధ. ఊరు కొత్తగూడెం. డెంటిస్ట్రీ చేసింది. పెళ్లయ్యాక హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యింది. అతని పేరు మహేంద్ర. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. నల్గొండ సొంత ఊరు. పెద్దలు కుదిర్చిన ఈ పెళ్లిలో మహేంద్ర చదువు, ఉద్యోగం మొదటి నుంచి పై చేయి అయ్యాయి. అతను, అత్తామామలు రాధ చదువు గురించి గొప్ప భావనలో లేరు. డెంటిస్ట్రీ చేసినవాళ్లు చాలామంది ఉంటారని, డాక్టరు కాలేనివారు పంటి డాక్టర్లు అవుతారని, ఆ ప్రొఫెషన్లో పెద్ద ఎదుగుదల ఉండదని వారు అందరూ కల్పించిన అభిప్రాయంలో ఉన్నారు. రాధకు డెంటిస్ట్‌గా రాణించాలన్న కోరిక మొదట్లోనే దెబ్బతిన్నట్టయ్యింది. అప్పటికే తను కొత్తగూడెంలో రెండేళ్లు జూనియర్ డెంటిస్ట్‌గా ఒక క్లినిక్‌లో పని చేసింది. కాని ఆమె పని తీరు సీనియర్ కంటే బాగుండేదని పేషెంట్లు అనేవారు. ఆమె ప్రాక్టీసు విషయం తేలకముందే– ‘నేను చేసుకోవడమే ఆలస్యంగా చేసుకున్నాను. పిల్లలను పోస్ట్‌పోన్ చేయొద్దు’ అన్నాడు మహేంద్ర. ఇద్దరు పిల్లలు వెంటవెంటనే పుట్టారు. వారి బాగోగుల్లో ఏడెనిమిదేళ్లు గడిచిపోయాయి. రాధకు అంతా బాగున్నట్టే అనిపిస్తోంది కానీ ఏమిటో అసౌకర్యం. మహేంద్ర చెడ్డవాడు కాదు. అతనికి పని పిచ్చి. సాఫ్ట్వేర్ రంగంలో సీనియర్ లెవల్లో ఉండటం వల్ల టీమ్‌ను మేనేజ్ చేయడం ఒక సమస్యగా, తన పైవారిని హ్యాండిల్ చేయడం మరో సమస్యగా సతమతం అయ్యేవాడు. ఉదయం ఎనిమిదిన్నరకు క్యాబ్ ఎక్కితే రాత్రి పదికి వచ్చేవాడు. వచ్చినా మళ్లీ ల్యాప్‌టాప్‌ను ముందు పెట్టుకునేవాడు. అత్తామామలు నల్గొండలోనే ఉండిపోవడం వల్ల ఈ మొత్తం వ్యవహారంలో రాధకు తోడు మిగిలింది పనిమనిషే. ఆ పనిమనిషి కూడా సరిగ్గా వచ్చేది కాదు. ఒక ఇల్లు కాకపోతే మరో ఇల్లు సులభంగా దొరుకుతుందని లెక్కలేనితనం. పిల్లలకు నలతగా ఉన్నా, చటుక్కున హాస్పిటల్‌కు తీసుకువెళ్లాలన్నా, వాళ్లను సముదాయించాలన్నా రాధకు చాలా కష్టమయ్యేది. వారికి వండటం, తనకు వండుకోవడం, భర్తకు వండిపెట్టడం... ఇవన్నీ చిన్నగా కనిపించే పెద్ద పనులు. ‘నాకు కష్టంగా ఉంది’ అని మహేంద్రతో అంటే ‘ఓపిక పట్టు’ అని అంటాడు. ‘నా కెరీర్ కూడా వదులుకున్నాను. ఇంట్లో ఉండి మాత్రం ఏమి బావుకున్నాను’ అని ఆమెకు అనిపించసాగింది. ఫలితంగా తీవ్రమైన డిప్రెషన్. చిరాకు. మూడీనెస్. కళ్లకింద వలయాలు. పిల్లలను గదమాయించడం. అసలేమిటో అర్థం కానంత హైరానా. చీటికిమాటికి ఏడుపు ముంచుకురావడం. పోయిన జనవరి 1న ‘నెక్ట్స్ జనవరి1 నాటికి నువ్వు మన లైఫ్‌ను సెట్ చేయాలి’ అని భర్తతో అంది. అతను ‘అలాగే’ అనగలిగాడు కానీ అలా చేయలేకపోయాడు. మళ్లీ జనవరి 1 వచ్చింది. అతనితో అలాగే ఉండిపోతే ఇంకో జనవరి వచ్చాక కూడా పరిస్థితి అలాగే ఉంటుందని ఆమెకు అనిపించింది. ‘అందుకని వదిలేద్దామనుకుంటున్నాను డాక్టర్. పేషెంట్ల పళ్లు రిపేర్ చేస్తూ నా బతుకు నేను బాగు చేసుకుంటాను’ అందామె. సైకియాట్రిస్ట్ పొడుగ్గా ఊపిరి వదిలాడు. జనవరి 1 రావడానికి ఉన్న రెండు వారాల్లో మహేంద్రను మూడుసార్లు పిలిపించాడు సైకియాట్రిస్ట్. ‘భార్యతో టైమ్ స్పెండ్ చేయలేని సక్సెస్ అది ఎంత పెద్దదైనా కాని సక్సెస్ కాదు. కుటుంబం కోసం కష్టపడుతున్నాననుకుంటున్నారు మీరు. కాని కుటుంబాన్ని కోల్పోయేంతగా పడే కష్టంలో అర్థం లేదు. మీ పని తగ్గించుకోవాలి. మీ వైఫ్‌కు ఆమె పని ఆమెను చేయనివ్వాలి. ఎప్పుడో వస్తాయనుకునే కంఫర్ట్స్ కోసం ఇప్పటి లైఫ్‌లోని కంఫర్ట్‌ను పాడు చేసుకుంటున్నారు. లైఫ్ పార్టనర్‌ను టేకెన్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటే కలిగే నష్టం చాలా ఎక్కువ’ అని రాధ తీసుకోవాలనుకుంటున్న నిర్ణయం చెప్పాడు అతనితో. మహేంద్ర మొదట షాక్ తిన్నా మెల్లగా సర్దుకున్నాడు. అతను తీసుకున్న కొత్త సంవత్సర నిర్ణయాల్లో ప్రధానమైనది భార్యను గౌరవించే ఇల్లుగా తన ఇంటిని మార్చుకోవడం. అది అతను రాధకు చెప్పాడు. అందుకు సైకియాట్రిస్ట్ కూడా బలం చేకూర్చాడు. రాధ డిసెంబర్ 31 రాత్రిని తన అపార్ట్మెంట్లో అందరితో కలిసి భర్తా పిల్లల తోడుగా జరుపుకుంది. కొత్త సంవత్సరం ఆమెకు నిజంగానే కొత్తది. హ్యాపీ న్యూ ఇయర్. కథనం: సాక్షి ఫ్యామిలి -
ఇక ఆ రోజు నుంచి...
పెద్దల మాట చద్ది మూట...అంటారు. నేను మాత్రం చద్ది మూట కాదు.... చాదస్తపు మూట అనుకునేవాడిని. ఎవరు ఏది చెప్పినా పెద్దగా ఖాతరు చేసేవాడిని కాదు. నాకు విపరీతంగా ఖర్చు చేసే అలవాటు ఉండేది. కేవలం ఆడంబరం కోసం, హడావిడి కోసం అవసరం ఉన్నా లేకపోయినా ఖర్చు చేసేవాడిని. ఈ అలవాటు ఎంత ముదిరిపోయిందంటే... ‘ఛీ... ఇవ్వాళ ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు’ అంటూ అవసరం లేకపో యినా ఏదో ఒక వస్తువు కొనేసేంతగా. నా ఫ్రెండ్స్‌లో శ్రీను అని ఉండేవాడు. వాడేమో ఆచి తూచి ఖర్చు చేసే టైప్. దాంతో వాడిని బాగా ఆటపట్టించేవాడిని. ‘‘జీవితం అంటేనే ఆనందం. నీ పీనాసి తనంతో ఆ ఆనందాన్ని కోల్పోతున్నావ్. నీ లైఫ్ వేస్ట్’’ అంటూ ఉండేవాడిని. ‘‘అనరా అను. ఏదో ఒకరోజు నీకు డబ్బు విలువ తప్పకుండా తెలుస్తుంది’’ అనేవాడు శ్రీను. ఆ మాట నిజమైంది. నా విచ్చలవిడి తనానికి మా ఆస్తి హారతయ్యింది. ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది. పని చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి వచ్చింది. దాంతో హైదరాబాద్ చేరుకొని ఒక ప్రైవేట్ కంపెనీలో చేరాను. కానీ అప్పటికీ నాలోని విలాస పురుషుడు బుద్ధి తెచ్చు కోలేదు. జీతం చేతిలో పడగానే ఆకర్షణలు లాగేసేవి. దాంతో జీతం సరిపోయేది కాదు. అయిదేళ్లు గిర్రున తిరిగాయి. సంక్రాంతి పండక్కి చాలా కాలం తరు వాత సొంత ఊరికి వెళ్లాను. వీధిలో శ్రీను కనిపించాడు. వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు. అది తన సొంత ఇల్లట. ఎంత బాగా కట్టుకున్నాడో! ‘‘ఏరా నిధి ఏమైనా దొరి కిందా?’’ అన్నాను నవ్వుతూ. ‘‘అవును... ఆ నిధి పేరు పొదుపు. నువ్వు కూడా పొదుపు విలువ తెలుసుకొని ఉంటే ఇలాం టివి నాలుగిళ్లు కట్టేవాడివి’’ అన్నాడు. మనసు చివుక్కుమంది. నిజమే. నేనేమీ సంపాదించుకోలేదు సరికదా కనీ పెంచిన అమ్మా నాన్నలకు కూడా ఒక్క రూపాయి పెట్టలేదు. కానీ శ్రీను.. తన ఇంట్లో తన తల్లిదండ్రుల్ని పెట్టుకుని సేవ చేస్తున్నాడు. ఇక ఆ రోజు నుంచి నేను ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాను. డబ్బు విలువ తెలుసుకున్నాను. పొదుపు చేస్తున్నాను. ఇప్పుడు జీతం సరిపోవడమే కాదు... మిగులుతోంది కూడా. వాటిలో కొంత దాస్తున్నాను. కొంత అమ్మానాన్నలకు పంపుతున్నాను. ఏదో తృప్తి. ఒక రూపాయి ఖర్చు చేయకపోతే...ఒక రూపాయిని సంపాదించినట్లే కదా! - వి.ఉమామహేశ్వర్రావు, నెల్లూరు -
సతియే దైవం
అతని పేరు శివకృష్ణ. వృత్తిరీత్యా డ్యాన్సర్. అక్కడే రాధతో అరుున పరిచయం కాస్తా స్నేహంగా చిగురించి..ఆపై ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామని ఇద్దరూ నిశ్చయించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోయినా మూడు ముళ్లతో...ఏడడుగులతో అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు. జీవితాంతం ఒకరినొకరు తోడూనీడగా ఉంటామంటూ బాస చేసుకున్నారు.ఆనందంగా.. అరమరికలు లేకుండా జీవితం ప్రారంభించారు. వీరి ప్రేమకు గురుతులుగా ముగ్గురు పిల్లలు కలిగారు. ఇలా సాఫీగా సాగుతున్న వీరి జీవితంపై విధి చిన్నచూపు చూసింది. ఓ రోజు రోడ్డు ప్రమాదంలో రాధ మృతిచెందింది. అంతే రాధలేని జీవితాన్ని ఊహించుకుని కృష్ణ తల్లడిల్లిపోయాడు. కొన్ని రోజులకు బాధ నుంచి తేరుకున్నాడు. జీవితాంతం ప్రేమను పంచుతానన్న పెళ్లినాటి ప్రమాణాన్ని గుర్తు చేసుకున్నాడు. అంతే రాధ చిత్రపటానికి ప్రతి రోజూ పూలమాల వేస్తూ.... పిల్లలతో కలిసి పూజ చేస్తూ.. కొత్త జీవితం ఆరంభించాడు. మరోపెళ్లి చేసుకోవాలని బంధువులు ఒత్తిడి తెచ్చినా.. పిల్లలను తమకు అప్పగించాలని ఎవరెన్ని చెప్పినా వినలేదు. పిల్లలను అపురూపంగా పెంచుతూ.. ఆ రూపాల్లోనే భార్యను చూసుకుంటూ గడుపుతూ.. అసలైన ప్రేమకు సిసలైన నిర్వచనమిస్తున్నాడు. అవును.. కట్టుకున్న భార్య పుట్టింటి నుంచి కట్నకానుకలు తేలేదని చావబాదే భర్తలకు.. భార్య చనిపోతే నెల తిరక్కుండానే పెళ్లిళ్లు చేసుకునే ప్రబుద్ధులకు ఈ శివకృష్ణ ఓ కనువిప్పే కదూ.. సాక్షి, కడప/జమ్మలమడుగు: భార్య జ్ఞాపకంగా షాజహాన్ తాజ్‌మహల్ కట్టిస్తే.. తన భార్య తనువు చాలించినా తన గుండెల్లో గుడికట్టి.. ఆ దేవతకు రోజూ పూజలు చేస్తున్నాడు ఈ రిక్షావాలా శివ కృష్ణ. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యను మర్చిపోలేక గుండెలపై పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నాడు. పిల్లలను తల్లికంటే మిన్నగా సాకుతూ నలుగురికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు. చిన్నారుల్లో సతీమణిని చూసుకుంటూ.... జమ్మలమడుగులోని గూడెంచెరువు చెందిన శివకృష్ణ. వృత్తిరీత్యా రికార్డింగ్ డ్యాన్సర్.. అక్కడే పరిచయమైన రాధతో ప్రేమలో పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత ఓ రోజు రికార్డింగ్ డ్యాన్స్ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా భార్య రాధ రాజంపేట వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఆ ప్రమాదంలో పెద్ద కుమార్తెకి కాలికి గాయమైంది. అయితే ఆమె తీపి గుర్తుగా ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడ్ని ఇచ్చి వెళ్లింది. సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న శివకృష్ణ అందరికంటే ఉత్తమంగా ఆలోచించాడు. అందరూ పిల్లల్ని ఎక్కడో ఒక చోట వదిలి రెండో పెళ్లి చేసుకోమన్నారు. రికార్డింగ్ డ్యాన్సులు చేస్తే ఊళ్లు పట్టుకొని తిరగాలి.. పిల్లల్ని ఎలా పోషించగలవు అని భయపెట్టారు. కానీ పిల్లల్లోనే భార్యను చూసుకుంటున్న శివ ఆమెను తన గుండెల్లో నింపుకున్నాడు. పిల్లలకు తల్లితండ్రీ తానై నొప్పి తగలకుండా పెంచుతున్నాడు. డ్యాన్స్ వదిలేసి..రిక్షా తొక్కుతూ..! భార్య రాధ మరణంతో శివకు పిల్లల బెంగ పట్టుకుంది. కొంతమంది వచ్చి వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశారు. సున్నితంగా తిరస్కరించాడు. పిల్లలను ఇక్కడ వదిలేసి రికార్డింగ్ డ్యాన్స్ నేపధ్యంలో ఎక్కడికైనా వెళితే వారి పరిస్థితి ఏమిటని ఆలోచన చేశాడు. పిల్లలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే పనిచేసుకోవాలని నిర్ణయించుకుని రిక్షా తొక్కేందుకు సిద్దమయ్యా డు. ఇక పొద్దున లేవగానే ఆయన దినచర్య భార్యకు పూజ చేయడంతోనే ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పిల్లలకి స్నానం చేయించడం, స్కూల్‌కి వెళ్లేందుకు సిద్ధం చేయడం.. సాయంత్రంకాగానే మళ్లీ తీసుకురావడం ఇలా అన్నీ ఆడవాళ్లకంటే మిన్నగా చేస్తున్నాడు. అలసటలోనే ఆనందం ఉందంటూనే చిన్నారులకు చిన్ని సమస్య కూడారాకుండా అల్లారుముద్దుగా పోషి స్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అప్పుడప్పు డు శివ తరపు బంధువులు పిల్లల్ని తీసుకెళ్లినా.. తాను కష్టపడి పిల్లల్ని మంచి చదువులు చదివించాలని జమ్మలమడుగులోనే ఉం టూ బతుకు బండి లాగుతున్నా డు. చనిపోయినా తన భార్యకు హృదయంలో గుడికట్టి.. ఆ దేవతకు రోజూ పూజలు చేస్తూ.. ఆమె ప్రతి రూపాలుగా మిగిలిన పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న శివకృష్ణ ఈ తరం యువతకు స్ఫూర్తిదాయకమే కదూ. -
పెళ్లికి బాజా మోగింది
మళ్లీ పెళ్లిళ్ల సీజన్ వచ్చింది. మూడు నెలల విరామం తర్వాత మార్గశిర మాసం మంచి ముహూర్తాలు తీసుకువచ్చింది. ఆకాశాన్ని పందిరిగా మార్చి.. .భూలోకాన్ని పీటగా చేసి వధూవరులు కొత్త జీవితం ప్రారంభించేందుకు శుభ ఘడియలు రానే వచ్చాయి. శుభ కార్యాల కోసం మండపాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. వధూవరుల కోసం వస్త్ర దుకాణాలు, జువెలరీ షాపులు సందడిగా మారాయి. జిల్లాలోని ముఖ్యపట్టణాలు, మండలకేంద్రాలు, గ్రామాలు పెళ్లి వేడుకలకు సర్వం సిద్ధమయ్యాయి. మార్గశిర మాసం...మంచి ముహుర్తాలు తెచ్చింది. జిల్లాకు పెళ్లి కళ వచ్చింది. బంధుమిత్రుల రాకతో కోలాహలం పెరిగింది. కల్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. షాపింగ్ కాంప్లెక్స్‌లు సందడిగా మారాయి. ఆకాశాన్ని పందిరిగా మార్చి...భూలోకాన్ని పీఠగా పేర్చి వధూవరులు కొత్త జీవితం ప్రారంభించేందుకు శుభ ఘడియలు మొదలయ్యాయి. మౌఢ్యాల మూలంగా ఈ ఏడాది భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక మాసాల్లో పెళ్లిళ్లు జరగలేదు. ఈసారి వివాహ మహోత్సవ వేడుకలకు ముహూర్తాలు తక్కువగా ఉండటంతో ముందస్తుగానే జాగ్రత్త పడి ఏర్పాట్లు చేసుకున్నారు. జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో వివాహ వేడుకలకు సర్వం సిద్ధమైంది. - మహబూబ్‌నగర్ కల్చరల్ ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మరుపురాని ఘట్టం. మూడు ముళ్లు, ఏడడుగులతో ఏకమయ్యే అపూర్వమైన సుదినం. ఆ రోజు కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. వివాహానికి సుముహూర్తమే కొండంత బలం. దివ్యమైన ముహూర్తం లేకపోతే వివాహం జరిగే అవకాశాలు తక్కువే. ఈ ఏడాది భాద్రపద, అశ్వీయుజ, కార్తీక మాసాల్లో మంచి ముహూర్తాలు లేకపోవడంతో పెళ్లిళ్లు లేవు. మార్గశిర మాసం మాత్రమే పెళ్లిముహూర్తాలను మోసుకొచ్చింది. ఈ నెల 6, 7, 10, 12, 13, 17, 18 తేదీల్లో వివాహ శుభ ముహూర్తాలున్నాయి. ఇందులో 13, 18 తేదీల్లో అత్యంత బలమైన ముహూర్తాలు ఉన్నట్లు అర్చకులు చెబుతున్నారు. ఈ నెల 18వ తేదీ దాటితే 2015 జనవరి 22వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు మరో దఫా పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. తక్కువ రోజులు శుభఘడియలు ఉండటంతో ఇప్పటికే సంబంధాలు కుదుర్చుకున్న కుటుంబాలు బిడ్డలు, కొడుకుల పెళ్లి చేయడానికి తహతహలాడుతున్నారు. ఆ ముహూర్తం కోసం ఎంతో ఆతృతగా నిరీక్షిస్తున్నారు. శుభఘడియలు ఆరంభమై పెళ్లి ముహూర్తాలు దగ్గరపడటంతో వివాహ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వందలాది వివాహాలు జిల్లాకు పెళ్లి కళ వచ్చేసింది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, గద్వాల, నారాయణపేట, వనపర్తి, జడ్చర్ల, షాద్‌నగర్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకు ర్తి, అయిజ, కొత్తకోట, దేవరకద్ర, మక్తల్, ఆత్మకూర్, అలంపూర్ తదితర ప్రధాన పట్టణాల్లో ఎక్కడ చూసిన పెళ్లి సందడి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. జిల్లావ్యాప్తంగా మార్గశిర మాసంలో వందలాది పెళ్లిళ్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెళ్లిలు జరిగే కుటుంబాలు వివాహ వేడుకల్లో తల మునకలయ్యారు. పెళ్లిళ్లు నిర్వహించడానికి కల్యాణ మండపాలు, గార్డెన్లు, ఫంక్షన్‌హా ళ్లు, ప్రింటింగ్ ప్రెస్, బ్యాండ్, టెంట్‌హౌజ్, ఫొటో, వీడియోగ్రాఫర్లు, క్యాటరింగ్ నిర్వాహకులు, పురోహితులకు ఎనలేని డిమాండ్ ఏర్పడింది. చాలావరకు పెళ్లి ముహూర్తంతోనే ముందస్తుగా ఎక్కడికక్కడ బుక్ చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో హోటళ్లను, లాడ్జీలను కూడా రిజర్వు చేసుకున్నారు. బస్సులను మాట్లాడుకున్నారు. రెండు నెలల ముందే బుకింగ్ కార్తీక మాసంలో పెళ్లిల్లు లేకపోవడంతో మార్గశిరంలో ఎక్కువగా జరుగుతాయని గ్రహించిన వారంతా రెండు నెలల ముందే ఫంక్షన్‌హాళ్లను బుక్ చేసుకున్నారు. ఒకే ముహుర్తంలో ఎ క్కువ సంఖ్యలో వివాహాలు జరుగుతుండటంతో ఉన్న ఫంక్షన్‌హాళ్లలోనే పార్టిషన్లు చేసి సుందరంగా తీర్చిదిద్ది కస్టమర్లకు అందుబాటులో ఉంచుతున్నాం. రిసెప్షన్లు రాత్రిపూట జరుగుతుండడంతో పెళ్లి ముహుర్తాలకు కొంత వెసులుబాట్లు లభిస్తున్నది. - మద్ది అనంతరెడ్డి, బృందావన్ గార్డెన్స్ యజమాని వేదికలు ముస్తాబు... వివాహ మహోత్సవ వేడుకలు నిర్వహించే కల్యాణ మండపాలు, ఫంక్షన్‌హా ళ్లు సర్వాంగసుందరంగా ముస్తాబవుతున్నాయి. ఖరీదైన పెళ్లి జరిపించే వారి కోసం నిర్వాహకులు తగిన రీతిలో ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా కల్యాణ మండపాల్లో ప్రత్యేకంగా డెకరేషన్ చేస్తున్నారు. కొన్నిచోట్ల సెట్టింగ్‌లు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి ఆర్ట్ డెరైక్టర్లను రప్పిస్తున్నారు. వివాహ వేడుకను అతిథులంతా వీక్షించేందుకు వీలుగా పలుచోట్ల ఎల్ఈడీలు, స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. పెళ్లి నిర్వాహకుల ఆర్థికస్థోమతను బట్టి ఫంక్షన్‌హాళ్లు రెడీ అవుతున్నాయి. జీవితంలో మరుపురాని రోజు కావడంతో ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా పెళ్లి చేయడానికి కుటుంబాలు సిద్ధమవుతున్నాయి. ఖరీదైన పెళ్లిళ్లు... మారిన కాలంలో పెళ్లిళ్లు ఖరీదైపోయాయి. సాదాసీదాగా పెళ్లి నిర్వహించే పరిస్థితులు కరువయ్యాయి. ఇక కట్నకానుకలు సరేసరి. పెళ్లి నిర్వహించడానికి రూ.లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి దాపురించాయి. పెళ్లి ముహూర్తాలు ఖరారు కావడంతో అందుకు సంబంధించిన రంగాలు ధరలను ఏకంగా పెంచేశాయి. కల్యాణ మండలం అద్దెను పెంచేశారు. ఇతర రోజుల కన్నా సుమారు 20 నుంచి 25 శాతం అద్దె పెంచారు. బ్యాండ్ నిర్వాహకులు పెళ్లికి రూ.10-15 వేలకు తక్కువ కాకుండా తీసుకుంటున్నారు. ముఖ్యపట్టణాల్లో రూ.20 వేల వరకు కూడా వసూలు చేస్తున్నారు. క్యాటరింగ్, ఫొటో, వీడియోగ్రాఫర్లు కూడా తమదైన శైలిలో అధిక మొత్తాన్ని ఆశిస్తున్నారు. గతం కన్నా రూ.3వేల వరకు పెంచేశారు. పురోహితులు కూడా డిమాండ్‌ను బట్టి అడుగుతున్నారు. ఒక్కో పురోహితుడు రెండు, మూడు పెళ్లిళ్లు ఏకకాలంలో నిర్వహించడానికి నిర్వాహకులతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రింటింగ్ ప్రెస్‌ల యజమానులు కూడా పెరిగిన ముడి సరుకుధరలను బేరీజు వేసుకుని తీసుకుంటున్నారు. ఈ రకంగా పెళ్లికి రూ. లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బంగారం ధరలు పెరుగుతుండటంతో ముందుగానే బంగారం కొనేందు కు ఎగబడుతున్నారు. నవంబర్‌లో 10 గ్రాముల బంగారం రూ.26 వేలకు తగ్గినా, పెళ్లిళ్ల సీజన్‌తో మళ్లీ పుంజుకుని రూ.27వేలకు పైగా పలుకుతోంది. ఆ రెండు రోజుల్లో సుముహూర్తాలు కార్తీక మాసంలో శుక్లమౌఢ్యమి ఉన్నందున పెళ్లిల్లు తదితర శుభాకార్యాలు జరగలేదు. అందుకే ఈనెల 6, 7, 10, 12, 13, 17, 18 తేదీల్లో ముహూర్తాలు ఉం డడంతో జిల్లాలో వేలాది పెళ్లిల్లు జరగనున్నాయి. ఒకేసారి పెళ్లిల్లు ఉండడం వల్ల పురోహితుల కొరత ఏర్పడినప్పటికీ వధూవరుల జన్మనక్షత్రాల ప్రకారం వేర్వే రు సమయాల్లో శుభ లగ్నాలు జరుగుతుండడం వల్ల కొంత వెసులుబా టు కుదురుతున్నది. 17, 18 తేదీల్లో సుముహూర్తాలు ఉండడం వల్ల ఆ రెండు రోజుల్లో అత్యధికంగా వివాహాలు జరగనున్నాయి. - రామాచారి, టీటీడీ జిల్లా సహాయకులు -
మృత్యువు దుర్‘మార్గం’!
=విద్యుదాఘాతంతో కింద పడిపోయిన యువకుడు =రహదారి లేక వైద్యం ఆలస్యం =ఆస్పత్రికి తరలించేలోగా మృతి మూడు ముళ్ల బంధం మూన్నాళ్లయినా లేదు. కొత్త జీవితం మాధుర్యాన్ని పూర్తిగా అనుభవించనే లేదు. మృత్యువు విద్యుత్ తీగ రూపంలో దాడి చేసింది. ఆస్పత్రికి తీసుకెళ్దామంటే రహదారి లేదు. రవాణా సదుపాయం అసలే లేదు. డోలీ కట్టి ఏడు కిలోమీటర్ల దూరం మోసుకుపోయారు. అష్టకష్టాలు పడి ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికే ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. పాతికేళ్ల యువకుని జీవితానికి నూరేళ్లు నిండిపోయాయి. పాడేరు మండలం వంజంగి పంచాయతీ కొత్తవలస గ్రామంలో శుక్రవారం జరిగిందీ విషాదం. పాడేరు రూరల్, న్యూస్‌లైన్: రోడ్డు, రవాణా సదుపాయం లేక, సకాలంలో ఆస్పత్రికి తరలించలేకపోవడంతో విద్యుదాఘాతానికి గురైన ఓ గిరిజనుడు ప్రాణం కోల్పోయాడు. మృతుని భార్య మల్లమ్మ కథనం ప్రకారం ఒడిశా ప్రాంతంలోని కాదేడి గ్రామానికి చెందిన గిరిజనుడు పాంగి వెంకటరావు (25) పాడేరు మండలం వ ంజంగి పంచాయతీ కొత్తవలస గ్రామానికి చెందిన మల్లమ్మను గత ఏడాది వివాహం చేసుకున్నాడు. రెండు వారాల క్రితం భార్యభర్తలిద్దరు కొత్తవలస గ్రామానికి వచ్చారు. మల్లమ్మ ఇంటికి విద్యుత్ సరఫరా చేసేందుకు వెంకటరావు శుక్రవారం ఉదయం గ్రామంలోని ఓ విద్యుత్ స్తంభం ఎక్కాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గుైరె కిందనున్న బండరాయిపై పడ్డాడు. తీవ్రంగా గాయపడిన వెంకటరావును ఆస్పత్రికి తరలించేందుకు రోడ్డు, రవాణా సదుపాయం లేకపోవటంతో గ్రామస్తులు డోలీ కట్టుకొని గ్రామం నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలోని వంజంగి గ్రామానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఓ ప్రయివేటు జీపులో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకొస్తే భర్త దక్కేవాడని మృతుని భార్య క న్నీటిపర్యంతమైంది. ఈ సంఘటనపై పాడేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒడిశా నుంచి మృతుని కుటుంబ సభ్యులు రావలసి ఉన్నందున మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు.