Empty nest syndrome: పిల్లలు ఎగిరెళ్లాక ఒకరికి ఒకరై | Empty nest syndrome: Moving from an Empty Nest to Post-Parental Growth | Sakshi
Sakshi News home page

Empty nest syndrome: పిల్లలు ఎగిరెళ్లాక ఒకరికి ఒకరై

Published Tue, Nov 21 2023 12:34 AM | Last Updated on Tue, Nov 21 2023 8:37 AM

Empty nest syndrome: Moving from an Empty Nest to Post-Parental Growth - Sakshi

చదువుల కోసమో.. ఉద్యోగాల కోసమో పెళ్లయ్యాక వేరొక చోట ఉండేందుకో పిల్లలు తల్లిదండ్రులను విడిచి వెళతారు. ఆ సమయంలో ఇల్లు ఖాళీ అవుతుంది.. బోసి పోతుంది. తల్లిదండ్రుల జీవితంలో నైరాశ్యం వచ్చే అవకాశం ఉంటుంది. దీనినే ‘ఎంప్టీ నెస్ట్‌ సిండ్రోమ్‌’ అంటారు. ఈ సమయంలో భార్యను భర్త, భర్తను భార్య పట్టించుకోకపోతే, కొత్త జీవితం మొదలుపెట్టకపోతే అనేక సమస్యలు వస్తాయంటున్నారు  నిపుణులు. తల్లిదండ్రులు ఏం చేయాలి?

కేస్‌ స్టడీ 1: దీపావళి పండగ వచ్చింది. అపార్ట్‌మెంట్‌లో అందరూ టపాకాయలు కాలుస్తున్నారు. కాని మూర్తి గారు, ఆయన భార్య సరళ గారు మాత్రం కిందకు రాలేదు. సరదాకైనా నిలబడలేదు. మామూలుగా ప్రతి సంవత్సరం వాళ్లు బోలెడన్ని టపాకాయలు కాలుస్తారు. సందడి చేస్తారు. ఈసారి అస్సలు తలుపులే తీయలేదు. కారణం?

ఆరు నెలల క్రితమే వాళ్ల ఒక్కగానొక్క కొడుకు ఎం.ఎస్‌. చేయడానికి యు.ఎస్‌. వెళ్లాడు. అప్పటి నుంచి వారిలో ఒక రకమైన నిర్లిప్తతను అపార్ట్‌మెంట్‌ వాసులు గమనిస్తున్నారు. చివరకు ఆ నిర్లిప్తత పండగల మీద కూడా ఆసక్తిని కోల్పోయేలా చేసింది.

కేస్‌ స్టడీ 2: యాభై ఏళ్ల సీతాదేవికి విపరీతంగా కాలు నొప్పి వస్తోంది. భర్త జానకిరామ్‌ ఆమెను అన్ని హాస్పిటళ్లకు తిప్పాడు. కాల్లో ఏ సమస్యా లేదు. ఏదైనా ఆందోళన వల్ల వస్తున్న సైకలాజికల్‌ నొప్పేమోనని డాక్టర్లు అంటున్నారు.

సీతాదేవి, జానకిరామ్‌లకు కూతురు, కొడుకు. మొదట కూతురు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లింది. కొడుకు చదువుకుంటానని స్వీడన్‌ వెళ్లాడు. అప్పటి నుంచి ఆమెకు తెలియని ఆందోళన. ఒంటరితనం. దిగులు. భర్త ఏదైనా కాలక్షేపం కోసం బయటకు వెళ్లినా ఆమెకు దిగులు ముంచుకొస్తోంది. పిల్లలు లేని ఇల్లు ఆమెకు ఎంతకాలానికీ అలవాటు కావడం లేదు.

‘నెస్ట్‌’ అంటే గూడు. పిల్లలు లేని గూడు ఎంత లేదన్నా బోసి పోతుంది. తల్లిదండ్రులు... వారు లేని వెలితితో ఇంట్లో మిగులుతారు. ఆ సమయంలో వారిలో అనేక రకాలైన మానసిక సంచలనాలు వస్తాయి. అటువంటి సందర్భాన్ని మానసిక నిపుణులు ‘ఎంప్టీ నెస్ట్‌ సిండ్రోమ్‌’ అంటున్నారు. పాశ్చాత్య దేశాలలో పిల్లలను విడి గదుల్లో ఉంచి పెంచడం అలవాటు. 18 ఏళ్లు రాగానే వారు దూరమవుతారనే మానసిక సంసిద్ధతతో ఉంటారు. భారతీయులు మాత్రం పిల్లలను తమ వద్దే పడుకోబెట్టుకుంటారు.

వారికి ఎంత వయసొచ్చినా వారు తమతో లేదా వారి వెంట తాము ఉండాలనుకుంటారు. అలాంటిది చదువు, ఉద్యోగాలు, పెళ్లి చేసుకొని విడి కాపురం పెట్టడాలు లేదా వేరే చోట స్థిరపడటాలు జరిగినప్పుడు ఒక ఖాళీతనం వారిని ఇబ్బంది పెడుతుంది. దానికి అడ్జస్ట్‌ కావడానికి టైమ్‌ పడుతుంది. అలాంటి సందర్భంలో తల్లిదండ్రులు కాస్తా భార్యాభర్తలుగా మారి ఒకరికి ఒకరై కనిపెట్టుకోవాలని నిపుణులు అంటున్నారు.

ఎంప్టీ నెస్ట్‌ సిండ్రోమ్‌ ప్రతికూలతలు:
⇒ పిల్లల గురించి ఆందోళన... వారితో మానసిక ఎడబాటు వస్తుందేమోనన్న భయం
⇒ ఒంటరితనం ఫీల్‌ కావడం
⇒ సంతోషంగా ఉండలేకపోవడం
⇒ కలత నిద్ర
⇒ జీవితానికి అర్థమేమిటి అనే సందేహం


ఎంప్టీ నెస్ట్‌ సిండ్రోమ్‌ అనుకూలతలు:
⇒ బోలెడంత ఖాళీ టైమ్‌ రావడం
⇒ బాధ్యతలు లేని స్వేచ్ఛ
⇒ స్వీయ ఇష్టాలు నెరవేర్చుకునే వీలు
⇒ కొత్తగా ఏదైనా చేద్దాం అనే ఉత్సాహం


అయితే తమ మానసిక సామర్థ్యాన్ని బట్టి అనుకూలతలను తీసుకోవాలా ప్రతికూలతలతో కుంగిపోవాలా అనేది తేల్చుకుని ప్రతికూలతలను జయించి ముందుకు సాగాలి.

కొత్త జీవితం: అన్నింటి కంటే మించి అంతవరకూ తల్లిదండ్రులుగా ఎక్కువ మసలినవారు పిల్లలు స్థిరపడ్డాక మళ్లీ భార్యాభర్తలుగా మారతారు. ఆ సమయంలో ఇద్దరూ ఇంట్లో ఎక్కువ సేపు గడిపే వీలు చిక్కుతుంది. దాంతో ఒకరితో ఒకరు అనుబంధం పెంచుకోవచ్చు. కాని సాధారణంగా ఒకరిని మరొకరు భూతద్ధంలో చూస్తూ పాత నష్టాలనూ, తొక్కిపెట్టిన పాత ఫిర్యాదులనూ బయటకు తీస్తే జీవితం దారుణంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

ఈ సమయంలోనే భార్యను భర్త, భర్తను భార్య ఎక్కువగా అర్థం చేసుకోవాలి... స్నేహంగా ఉండాలి... పరస్పరం కలిసి యాత్రలు, విహారాలు, బంధుమిత్రులను కలవడం, ఏదైనా హాబీని అలవర్చుకోవడం, వాకింగ్‌ గ్రూపుల్లో చేరడం, ఇష్టమైన సినిమాలు చూడటం, జీవితంలో గడిచిన మంచి విషయాలు గుర్తుకు చేసుకోవడం, ఒకప్పుడు ఇవ్వలేని సమయాన్ని ఇప్పుడు ఇవ్వడం చేయాలి.

ఈ సమయంలో పరస్పర భద్రత కూడా ముఖ్యమే కాబట్టి దానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆర్థికపరమైన సౌలభ్యం ఉంటే అందాక తీరని ముచ్చట్లను తీర్చుకోవడం కూడా మంచి వ్యాపకమే. జీవితంలో పిల్ల లకు ఇవ్వదగ్గ ప్రేమంతా ఇచ్చాం... ఇప్పుడు పరస్పరం ప్రేమను పంచుకుందాం అనే భావన అత్యంత ముఖ్యమైనది ఈ ‘ఎంప్టీ నెస్ట్‌’ కాలంలో. ఈ జాగ్రత్తలు తీసుకుంటే బెంగ ఉండదు. పిల్లలు ఫోన్‌ చేసినప్పుడు అలాంటి తల్లిదండ్రుల గొంతులో తప్పక సంతోషాన్ని వింటారు. ఆ సంతోషమే పిల్లలకు గొప్ప కానుక.        

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement