Mental condition
-
పేకాట కూడా మానసిక జబ్బేనా!
విజయ్ ఒక సేల్స్ రిప్రజెంటేటివ్. 35 సంవత్సరాల వయసు. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత రెండేళ్లుగా విపరీతంగా పేక ఆడుతున్నాడు. దానివల్ల ఆర్థిక సమస్యలతో పాటు, కుటుంబంలో గొడవలూ వస్తున్నాయి. భార్య ఎంత వారించినా పట్టించుకోవడం లేదు. విడాకుల వరకూ వచ్చింది. చివరకు భార్య, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు కౌన్సెలింగ్ కోసం వచ్చాడు. విజయ్ బాల్యం నుంచీ అతని తల్లిదండ్రులు వీకెండ్లో సరదాగా పేక ఆడతారని అతనితో మాట్లాడినప్పుడు తెలిసింది. విజయ్, అతని సోదరుడు పెద్దయ్యాక నలుగురూ కలసి ఆడేవారు. అలా పేకాట అలవాటుగా మారింది. అన్నదమ్ములిద్దరూ అప్పుడప్పుడూ క్రికెట్ బెట్టింగ్ కూడా చేసేవారు. సేల్స్ రిప్రజేంటేటివ్గా మారాక ప్రతి నెలా టార్గెట్‌ను అందుకోవడం, కొలీగ్స్‌తో పోటీపడాల్సి రావడంతో విజయ్ జీవితంలోకి ఒత్తిడి చేరింది. పెళ్లి చేసుకుని, పిల్లలు పుట్టాక కుటుంబ బాధ్యతలతో ఒత్తిడి మరింత పెరిగింది. వీటన్నిటినీ తట్టుకోవడానికి అతను పేకాటను ఒక మార్గంగా మార్చుకున్నాడు. ఏ ఏటికి ఆ ఏడు అందులో కూరుకుపోసాగాడు. చివరకు పేక ఆడకుండా ఉండలేని స్థితికి చేరుకున్నాడు. దీన్ని గాంబ్లింగ్ డిజార్డర్ లేదా కంపల్సివ్ గాంబ్లింగ్ అంటారు. ఇదో మానసిక రుగ్మత. అదొక సంక్లిష్ట పరిస్థితి గాంబ్లింగ్ డిజార్డర్ అనేది జీవ, మానసిక, పర్యావరణ కారకాల కలయికతో ప్రభావితమైన సంక్లిష్ట పరిస్థితి. డోపమైన్, సెరటోనిన్, నోర్ ఎపినెఫ్రిన్ వంటి కొన్ని న్యూరోట్రాన్స్మిటర్లలో అసాధారణతలు దీనికి కారణం కావచ్చు. జన్యువులు కూడా కారణమని అధ్యయనాలు సూచిస్తున్నాయి జూదం ఆడే వాతావరణంలో పెరగడం దానిపట్ల సానుకూల ధోరణికి దోహదపడవచ్చు. విజయ్ విషయంలో అదే జరిగింది విజయ్ జీవితంలోలా అధిక స్థాయి ఒత్తిడి, ప్రధాన జీవన మార్పులు లేదా బాధాకరమైన సంఘటనలు జూదం రుగ్మతలను ప్రేరేపించవచ్చు డిప్రెషన్, యాంగ్జయిటీ లేదా అఈఏఈ వంటి మానసిక ఆరోగ్య పరిస్థితులున్న వ్యక్తులు వారి లక్షణాలను ఎదుర్కోవడానికి జూదానికి అలవాటు పడవచ్చు రిస్క్ తీసుకునే ధోరణి, ఇంపల్సివిటీ, సెన్సేషన్ సీకింగ్ లాంటి వ్యక్తిత్వ లక్షణాలు జూదానికి అలవాటు చేయవచ్చు క్లబ్బులు, కాసినోలు, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉండటం కూడా కారణమవుతుంది ఒత్తిళ్లకు ప్రతిస్పందనగా జూదం ఒక దుర్వినియోగమైన కోపింగ్ మెకానిజంగా మారుతుంది అప్పుడప్పుడూ గెలుపొందడం వల్ల వచ్చే ఆనందం మెదడులో డోపమైన్‌ను విడుదల చేస్తుంది. దానికోసం మళ్లీ మళ్లీ ఆడతారు. ఆడకుండా ఉండలేరు గాంబ్లింగ్ డిజార్డర్ ఒక బిహేవియరల్ అడిక్షన్. జూదం ఆడకుండా ఉండలేకపోవడం దీని ప్రధాన లక్షణం. నిరంతరం జూదం గురించి లేదా జూదానికి డబ్బు ఎలా సంపాదించాలనే దానిగురించి ఆలోచిస్తుంటారు. ఈ రుగ్మత ఉన్న వ్యక్తులు... తమకు కావల్సిన స్థాయి ఎగ్జయిట్మెంట్ కోసం పెద్ద మొత్తంలో పందేలు కాస్తుంటారు. జూదం వల్ల సమస్యలు వస్తున్నాయని తెలిసి ఆపేయాలని ప్రయత్నించినా ఆపలేకపోతారు. జూదం తగ్గించినప్పుడు లేదా ఆపేసినప్పుడు చిరాకు, అసౌకర్యం, ఉద్రిక్తత.. జూదం వల్ల గతంలో వచ్చిన నష్టాలను మళ్లీ జూదంతోనే భర్తీ చేయాలనే ప్రయత్నం.. జూదం ఆడుతున్నామనే విషయాన్ని దాచడానికి అబద్ధాలు చెప్పడం, మోసం చెయ్యడం.. విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నా.. జీవితంలో, కెరీర్లో సమస్యలు ఎదురవుతున్నా గుర్తించలేకపోవడం.. జూదం వల్ల వచ్చే నష్టాల నుంచి బయటపడేందుకు అప్పులు చేయడం, ఆస్తులు అమ్మడం.. జూదం రుణాలను చెల్లించడానికి మోసం, దొంగతనం లాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొనడం.. ఆర్థిక, మానసిక, వైవాహిక సమస్యలు వచ్చినా జూదం కొనసాగించడం.. సీబీటీతో తప్పించుకోవచ్చు.. జూదం వ్యసనం వల్ల ఏర్పడిన ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడానికి బాధ్యతాయుతమైన ఆర్థిక నిర్వహణ నేర్చుకోవడం అవసరం. వాస్తవిక బడ్జెట్ వేసుకోవడానికి, జూదం వల్ల వచ్చిన అప్పులు తీర్చడానికి ఆర్థిక సలహాదారుతో కలసి ప్రణాళిక రూపొందించుకోవాలి. గాంబ్లర్స్ అనానిమస్, సపోర్ట్ గ్రూపుల్లో చేరడం ద్వారా సమస్యను మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు · ఒత్తిడిని తప్పించుకోవడానికి జూదం వైపు వెళ్లకుండా మైండ్‌ఫుల్‌నెస్, వ్యాయామం, హాబీస్ లాంటి ప్రత్యామ్నాయ కోపింగ్ మెకానిజమ్స్‌ను ప్రాక్టీస్ చేయాలి ·గుర్తించడం, అభ్యాసం చేయడం, జూదాన్ని ఆశ్రయించకుండా ఒత్తిడిని జయించడానికి సహాయపడుతుంది జూదానికి సంబంధించిన అహేతుక ఆలోచనలు, నమ్మకాలను గుర్తించడానికి, సవాలు చేయడానికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఉపయోగపడుతుంది కోపింగ్ స్ట్రాటజీస్‌ను అభివృద్ధి చేయడంలో, కోరికలను నియంత్రించుకోవడానికి సీబీటీ సహాయపడుతుంది కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడం, నమ్మకాన్ని పునర్నిర్మించడం, కుటుంబ మద్దతును పొందడానికి ఫ్యామిలీ థెరపీ ఉపయోగపడుతుంది · జూదం వల్ల వచ్చే మానసిక రుగ్మతలను తగ్గించడానికి మందులు సహాయపడతాయి. --సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com (చదవండి: ఏళ్ల తరబడి వదలని దిగులు.. పరిష్కారం ఏమిటి?) -
డొనాల్డ్ ట్రంప్ మానసికస్థితిపై నిక్కీ హేలీ విమర్శలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీదారుగా ఉన్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. ఆమె శనివారం మాట్లాడుతూ ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ మానసిక స్థితిపై నిక్కీ హేలీ మండిపడ్డారు. జనవరి 6,2021న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన హింసాత్మక దాడిని ఆపటంలో తీవ్రంగా విఫలమయ్యారని విమర్శించారు. శుక్రవారం రాత్రి ట్రంప్ ఓ ర్యాలీలో పాల్గొన్నారని.. జనవరి 6, 2021న అమెరికా క్యాపిటల్ భవనంపైన జరిగిన దాడి విషయంలో తాను భద్రత కల్పించలేకపోయానని పార్టీ శ్రేణులు చేస్తున్న విమర్శలను పదే పదే ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. తాను ఎందుకు ఆ హింసాత్యక ఘటనకు తాను బాధ్యత వహిస్తావని ప్రశ్నించారు. కనీసం అప్పుడు తాను ఆఫీసులో కూడా లేనని పేర్కొన్నారు. ట్రంప్ అప్పటి అమెరికన్ హౌజ్( ప్రతినిధుల సభ) స్పీకర్ అయిన నాన్సీ పెలోసీని దృష్టిలో పెట్టుకొని పొరపాటుపడుతూ తనపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దీంతో ఆయన మానసికస్థితి ఏంటో తెలుస్తోందని మండిపడ్డారు. ట్రంప్ మానసిక ఆరోగ్యం దిగజారుతోందని తెలపడానికి ఇదే నిదర్శమని అన్నారు తాను ఎటువంటి అవమానకర వ్యాఖ్యలు చేయటం లేదన్నారు. కానీ, ఎంతో ఒత్తిడితో కూడుకున్న అగ్రరాజ్యం అధ్యక్ష పదవి చేపట్టడానికి ట్రంప్ మానసిక స్థితి సరిపోతుందా? అని సూటిగా ప్రశ్నించారు. ఇటువంటి సమయంలో ప్రజలు మరో వ్యక్తిని అమెరికా అధ్యక్షుడిగా కోరుకుంటారని నిక్కీ హేలీ తెలిపారు. చదవండి: US presidential election 2024: నిక్కీ హేలీ నా రన్నింగ్ మేట్ కాదు: ట్రంప్ -
Empty nest syndrome: పిల్లలు ఎగిరెళ్లాక ఒకరికి ఒకరై
చదువుల కోసమో.. ఉద్యోగాల కోసమో పెళ్లయ్యాక వేరొక చోట ఉండేందుకో పిల్లలు తల్లిదండ్రులను విడిచి వెళతారు. ఆ సమయంలో ఇల్లు ఖాళీ అవుతుంది.. బోసి పోతుంది. తల్లిదండ్రుల జీవితంలో నైరాశ్యం వచ్చే అవకాశం ఉంటుంది. దీనినే ‘ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్’ అంటారు. ఈ సమయంలో భార్యను భర్త, భర్తను భార్య పట్టించుకోకపోతే, కొత్త జీవితం మొదలుపెట్టకపోతే అనేక సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులు ఏం చేయాలి? కేస్ స్టడీ 1: దీపావళి పండగ వచ్చింది. అపార్ట్మెంట్లో అందరూ టపాకాయలు కాలుస్తున్నారు. కాని మూర్తి గారు, ఆయన భార్య సరళ గారు మాత్రం కిందకు రాలేదు. సరదాకైనా నిలబడలేదు. మామూలుగా ప్రతి సంవత్సరం వాళ్లు బోలెడన్ని టపాకాయలు కాలుస్తారు. సందడి చేస్తారు. ఈసారి అస్సలు తలుపులే తీయలేదు. కారణం? ఆరు నెలల క్రితమే వాళ్ల ఒక్కగానొక్క కొడుకు ఎం.ఎస్. చేయడానికి యు.ఎస్. వెళ్లాడు. అప్పటి నుంచి వారిలో ఒక రకమైన నిర్లిప్తతను అపార్ట్మెంట్ వాసులు గమనిస్తున్నారు. చివరకు ఆ నిర్లిప్తత పండగల మీద కూడా ఆసక్తిని కోల్పోయేలా చేసింది. కేస్ స్టడీ 2: యాభై ఏళ్ల సీతాదేవికి విపరీతంగా కాలు నొప్పి వస్తోంది. భర్త జానకిరామ్ ఆమెను అన్ని హాస్పిటళ్లకు తిప్పాడు. కాల్లో ఏ సమస్యా లేదు. ఏదైనా ఆందోళన వల్ల వస్తున్న సైకలాజికల్ నొప్పేమోనని డాక్టర్లు అంటున్నారు. సీతాదేవి, జానకిరామ్‌లకు కూతురు, కొడుకు. మొదట కూతురు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లింది. కొడుకు చదువుకుంటానని స్వీడన్ వెళ్లాడు. అప్పటి నుంచి ఆమెకు తెలియని ఆందోళన. ఒంటరితనం. దిగులు. భర్త ఏదైనా కాలక్షేపం కోసం బయటకు వెళ్లినా ఆమెకు దిగులు ముంచుకొస్తోంది. పిల్లలు లేని ఇల్లు ఆమెకు ఎంతకాలానికీ అలవాటు కావడం లేదు. ‘నెస్ట్’ అంటే గూడు. పిల్లలు లేని గూడు ఎంత లేదన్నా బోసి పోతుంది. తల్లిదండ్రులు... వారు లేని వెలితితో ఇంట్లో మిగులుతారు. ఆ సమయంలో వారిలో అనేక రకాలైన మానసిక సంచలనాలు వస్తాయి. అటువంటి సందర్భాన్ని మానసిక నిపుణులు ‘ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్’ అంటున్నారు. పాశ్చాత్య దేశాలలో పిల్లలను విడి గదుల్లో ఉంచి పెంచడం అలవాటు. 18 ఏళ్లు రాగానే వారు దూరమవుతారనే మానసిక సంసిద్ధతతో ఉంటారు. భారతీయులు మాత్రం పిల్లలను తమ వద్దే పడుకోబెట్టుకుంటారు. వారికి ఎంత వయసొచ్చినా వారు తమతో లేదా వారి వెంట తాము ఉండాలనుకుంటారు. అలాంటిది చదువు, ఉద్యోగాలు, పెళ్లి చేసుకొని విడి కాపురం పెట్టడాలు లేదా వేరే చోట స్థిరపడటాలు జరిగినప్పుడు ఒక ఖాళీతనం వారిని ఇబ్బంది పెడుతుంది. దానికి అడ్జస్ట్ కావడానికి టైమ్ పడుతుంది. అలాంటి సందర్భంలో తల్లిదండ్రులు కాస్తా భార్యాభర్తలుగా మారి ఒకరికి ఒకరై కనిపెట్టుకోవాలని నిపుణులు అంటున్నారు. ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ ప్రతికూలతలు: ⇒ పిల్లల గురించి ఆందోళన... వారితో మానసిక ఎడబాటు వస్తుందేమోనన్న భయం ⇒ ఒంటరితనం ఫీల్ కావడం ⇒ సంతోషంగా ఉండలేకపోవడం ⇒ కలత నిద్ర ⇒ జీవితానికి అర్థమేమిటి అనే సందేహం ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ అనుకూలతలు: ⇒ బోలెడంత ఖాళీ టైమ్ రావడం ⇒ బాధ్యతలు లేని స్వేచ్ఛ ⇒ స్వీయ ఇష్టాలు నెరవేర్చుకునే వీలు ⇒ కొత్తగా ఏదైనా చేద్దాం అనే ఉత్సాహం అయితే తమ మానసిక సామర్థ్యాన్ని బట్టి అనుకూలతలను తీసుకోవాలా ప్రతికూలతలతో కుంగిపోవాలా అనేది తేల్చుకుని ప్రతికూలతలను జయించి ముందుకు సాగాలి. కొత్త జీవితం: అన్నింటి కంటే మించి అంతవరకూ తల్లిదండ్రులుగా ఎక్కువ మసలినవారు పిల్లలు స్థిరపడ్డాక మళ్లీ భార్యాభర్తలుగా మారతారు. ఆ సమయంలో ఇద్దరూ ఇంట్లో ఎక్కువ సేపు గడిపే వీలు చిక్కుతుంది. దాంతో ఒకరితో ఒకరు అనుబంధం పెంచుకోవచ్చు. కాని సాధారణంగా ఒకరిని మరొకరు భూతద్ధంలో చూస్తూ పాత నష్టాలనూ, తొక్కిపెట్టిన పాత ఫిర్యాదులనూ బయటకు తీస్తే జీవితం దారుణంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ సమయంలోనే భార్యను భర్త, భర్తను భార్య ఎక్కువగా అర్థం చేసుకోవాలి... స్నేహంగా ఉండాలి... పరస్పరం కలిసి యాత్రలు, విహారాలు, బంధుమిత్రులను కలవడం, ఏదైనా హాబీని అలవర్చుకోవడం, వాకింగ్ గ్రూపుల్లో చేరడం, ఇష్టమైన సినిమాలు చూడటం, జీవితంలో గడిచిన మంచి విషయాలు గుర్తుకు చేసుకోవడం, ఒకప్పుడు ఇవ్వలేని సమయాన్ని ఇప్పుడు ఇవ్వడం చేయాలి. ఈ సమయంలో పరస్పర భద్రత కూడా ముఖ్యమే కాబట్టి దానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆర్థికపరమైన సౌలభ్యం ఉంటే అందాక తీరని ముచ్చట్లను తీర్చుకోవడం కూడా మంచి వ్యాపకమే. జీవితంలో పిల్ల లకు ఇవ్వదగ్గ ప్రేమంతా ఇచ్చాం... ఇప్పుడు పరస్పరం ప్రేమను పంచుకుందాం అనే భావన అత్యంత ముఖ్యమైనది ఈ ‘ఎంప్టీ నెస్ట్’ కాలంలో. ఈ జాగ్రత్తలు తీసుకుంటే బెంగ ఉండదు. పిల్లలు ఫోన్ చేసినప్పుడు అలాంటి తల్లిదండ్రుల గొంతులో తప్పక సంతోషాన్ని వింటారు. ఆ సంతోషమే పిల్లలకు గొప్ప కానుక. -
తల్లి మృతదేహాన్ని నాలుగు రోజులు బెడ్ కింద దాచిన కుమారుడు
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పుర్‌లో ఓ వ్యక్తి తన తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే బెడ్ కింద దాచాడు. నాలుగు రోజుల పాటు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే ఇంట్లో నుంచి దుర్వాసన ఎక్కువగా రావడంతో చుట్టుపక్కల వాళ్లకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన వారు ఆ వ్యక్తి ఇంట్లో బెడ్ కింద అతని తల్లి శవాన్ని చూసి షాక్ అయ్యారు. ఆమె నాలుగు రోజుల క్రితమే చనిపోయిందని కుమారుడు పోలీసులకు చెప్పాడు. దుర్వాసన రాకుండా రోజూ అగరొత్తులు వెలిగించినట్లు పేర్కొన్నాడు. మృతురాలిని శాంతి దేవి(82)గా గుర్తించారు. ఆమె విశ్రాంత ఉపాధ్యాయురాలు. భర్త 10 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. కుమారుడు నిఖిల్‌తో పాటు శివ్‌పుర్ సహబాజ్‌గంజ్‌లో నివసిస్తోంది. అయితే నిఖిల్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పోలీసులు తెలిపారు. అతను డ్రగ్స్‌కు బానిస కావడంతో భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. శాంతి దేవి అనారోగ్య కారణాలతోనే మరణించి ఉంటుందని, పోస్టుమార్టం నివేదిక వచ్చాక నిజా నిజాలు తెలుస్తాయని పేర్కొన్నారు. చదవండి: శ్రద్ధ వాకర్ తరహా ఘటన..తండ్రిని చంపి 32 ముక్కలు చేసిన కుమారుడు -
మంచి మాట: మన ఆలోచనలే మన జ్ఞానం
పుట్టుక, మరణాల మధ్య జీవితం చైతన్యవంతంగా కొనసాగుతుంది. ఈ జీవితంలో మనస్సు ద్వారా అనేక అనేక ఆలోచనలతో జీవితానికి సంబంధించి కీలకమైన సమాచారం వస్తుంది. ఈ ఆలోచనలన్నీ మనిషి శారీరక మానసిక కర్మలను బట్టి వస్తుంటాయి. శరీరంలో శక్తి తక్కువగా ఉంటే భౌతికపరమైన ఆలోచనలు, శక్తిస్థాయులు పెరిగే కొద్దీ మార్పు చెంది ఆధ్యాత్మికత గురించి, ఆత్మను గురించీ ఆలోచనలు వస్తుంటాయి. మనిషికి తమోగుణంతో శరీరానికి సంబంధించిన ఆలోచనలు వస్తుంటాయి. యవ్వనంలో ఇంద్రియాలు ఉద్రేకం ఎక్కువగా ఉండి రజోగుణంకు సంబంధించిన ఆలోచనలు వస్తుంటాయి. వయసు మళ్లి వానప్రస్థంలో ప్రవేశించగానే ప్రేమ, దయ, జాలికి సంబంధించిన సత్వగుణ ఆలోచనలు వస్తుంటాయి. జ్ఞానపరంగా ఎదిగిన వారికి అత్యుత్తమమైన ఆలోచనలు వస్తాయి. మనుషులని తన మనసే నడిపిస్తుంది అసలు ఈ మనసు ఎక్కడ ఉంది, దానిని గుర్తించడం ఎలా అంటే గత జన్మల కర్మల అనుభవాల ప్రతిరూపమే మనసు. దీని యొక్క ప్రభావం సూక్ష్మ శరీరం పై పడుతుంది. మనసులో వచ్చే ఆలోచనలు ప్రతిరూపమే మానవ జీవితం. మనిషి కుటుంబం, సంఘం, సమాజంలో వివిధ రకాల వ్యక్తుల మధ్య జీవిస్తున్నప్పుడు, కొందరు పాతవారు దూరమవుతారు. వారి ఆలోచనల ప్రభావం కొంత ఉంటుంది. కొందరు కొత్తవారు దగ్గరవుతారు వీరు వీరి ఆలోచనలని జోప్పించడానికి సిద్ధంగా ఉంటారు. వీరి ద్వారా గాయాలు, ఘర్షణలు, సంఘర్షణలు, వ్యతిరేకతలు, అనుకూలతలు, మానసిక ఒత్తిడుల రూపంలో మనసులోకి ప్రవేశిస్తాయి. అప్పుడు ప్రతి వ్యక్తి ఆలోచనలు మాటలు ద్వంద్వంతో కూడి ఉంటాయి. ద్వంద్వం అంటే రెండుగా ఉన్నది. ఒకటి బయటికి వ్యక్తమౌతుంది. మరొకటి లోపల దాగి ఉంటుంది. బయటపడ్డ దాని గురించి ఆలోచిస్తే లోపల దాగి ఉన్న దాన్ని గుర్తించలేము. ఎప్పుడైతే బయటపడ్డ దాని గురించి ఆలోచిస్తామో అప్పుడు పక్షపాతంగా, ఏకపక్షంగా, పరిమితంగా ఆలోచిస్తున్నట్లే, ఎప్పుడైతే మానవుడు లోపల దాగి ఉన్న దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాడో... పరిమితంగా ఆలోచించడం నుండి అపరిమితంగా ఆలోచించడం మొదలవుతుందో అదే అప్పుడే అజ్ఞానం నుంచి బయట పడి జ్ఞానం పొందుతాడు. అనవసర విషయాలపై అతిగా ఆలోచిస్తే శారీరక శ్రమ చేసిన దానికంటే రెట్టింపు శక్తిని కోల్పోతున్నాడు. కొందరు ఎలాంటి శారీరక శ్రమ లేని పనులు చేస్తున్న సాయంకాలానికి అలసిపోతారు. కారులోనో, బస్సులోనో, ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలాంటి శారీరక శ్రమలేకున్నా అలసి పోతున్నారు అనవసరంగా అతిగా మనసు ఆలోచించటమే అందుకు కారణం.. మనస్సు ఆలోచించకుండా ఉన్నప్పుడు శూన్య స్థితికి చేరుతుంది. బాహ్య ప్రపంచంలో ఏది జరిగినా ఎలా జరిగినా అనుకూలతలకు, ప్రతికూలతలకు మనస్సు స్పందించకూడదు. ఇదే ఆధ్యాత్మిక మార్గం. అజ్ఞాని అంతరంగాన్ని విస్మరించి ప్రాపంచిక విషయాలపై ఆరాటపడుతూ ప్రపంచం నుంచి నాకేంటి అనే భావనను అతిగా పెంచుకొని ప్రపంచాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలనే భావనతో అసంతృప్తి చెంది ప్రాపంచిక విషయాల మోజులో సంబంధాలు ఏర్పరుచుకున్నాడో అప్పుడు పరిమితంగా ఆలోచిస్తాడు. జ్ఞానికి విశ్వం గురించి దైవం గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి, దైవం వైపు మళ్ళి బంధాలను విడనాడి ఏకత్వం వైపు మళ్లాలి. ఏ వ్యక్తి ఏకత్వం వైపు మళ్ళి తన మనసును సరి చేసుకుని సంపూర్ణతను పొందుతూ దైవం వైపుగా ప్రయాణం చేస్తాడో అతను జ్ఞానిగా మరి ముక్తి లేదా మోక్షం పొందే అవకాశం ఉంది. – భువనగిరి కిషన్ యోగి -
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ నటుడు
ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. చాలాకాలంగా 'ఓనోమేటోమానియా’వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పారు. ఇది ఒక మానసిక వ్యాధి అని చెప్పొచ్చు. దీని కారణంగా కొన్ని పదాలు కానీ, సంభాషణలు కానీ మళ్లీ మళ్లీ చెప్పడం చేస్తుంటారు. ప్రస్తుతం ఈ అరుదైన వ్యాధితో సావాసం చేస్తున్నానని అన్నారు 71ఏళ్ల నసీరుద్దీన్ షా. గతంలో ఎన్నో అద్భుతమైన పాత్రలతో మెప్పించిన నసీరుద్దీన్ షా ఇటీవలె గెహ్రిహాన్ మూవీలో నటించారు. ఇందులో దీపికా పదుకొణె తండ్రిలా కనిపించారు. వీటితో పాటు ‘కౌన్‌బనేగా శిఖర్వతి’ వెబ్‌సిరీస్‌లోనూ నటించిన సంగతి తెలిసిందే. -
అమ్మ మనసెరిగి ..
అమ్మాయి జీవితంలో తల్లికావడం అనేది మహత్తర ఘట్టం. గర్భం దాల్చామని తెలియగానే అమ్మాయితోపాటు, అత్తింటివారి నుంచి పుట్టింటిదాక, అంతా అంతో సంబర పడిపోతుంటారు. అయితే ‘‘ఇవి తినండి, అవి తినండి’’ అని చెప్పేవాళ్లే గానీ, గర్భిణి మానసికస్థితిగతులు ఎలా ఉన్నాయి అని ఆలోచించేవారు తక్కువ. కాబోయే తల్లి ఆనందంతోపాటు తీవ్ర మానసిక సంఘర్షణకు లోనవుతుంది. ఆ ప్రభావం పుట్టిన బిడ్డపై పడుతుంది. దీనిపై ప్రభుత్వాలు దృష్టిసారించాలని గొంతెత్తి చెబుతోంది అన్వితా నాయర్. ఇంజినీరింగ్ పూర్తి చేసిన 22 ఏళ్ల యంగ్ అండ్ డైనమిక్ మిస్ అన్విత ఇలా చెప్పడానికి తనకెదురైన ఓ దుర్ఘటనకు పడిన సంఘర్షణ, కుంగుబాటులే కారణం. బెంగళూరుకు చెందిన అన్వితా నాయర్‌కు 2017లో ఒకసారి బాగా జ్వరం వచ్చింది. ఒళ్లంతా జ్వరంతో కాలిపోతుంటే నీరసంగా పడుకుని ఉంది. ఇది చాలదన్నట్టు తనకెంతో ఇష్టమైన ప్రాణ స్నేహితురాలు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందన్న విషాదకర వార్త వినింది. ఈ విషయం తెలిసినప్పుడు అన్విత వయసు 17 ఏళ్లు. తన ప్రాణ స్నేహితురాలు అలా చనిపోవడం జీర్ణించుకోలేక పోయింది. అసలు తను ఎందుకు అలా చేసుకుంది? స్నేహితురాలు లేని లోకాన్ని ఊహించుకోలేక, బాగా కృంగిపోయింది. అలా నాలుగు నెలలపాటు సరిగా నిద్రకూడా పోలేదు. దీంతో తీవ్ర ఆవేదన చెందుతూ డిప్రెషనకు లోనైంది. అన్ని రోగాల్లా కాదు.. నెలలతరబడి డిప్రెషన్ లో ఉన్న అన్విత చదువులో బాగా వెనుబడిపోతుండేది. ఫలితంగా ఇంజినీరింగ్ సెమిస్టర్‌ను రాయలేకపోయింది. ‘‘ఇది అన్ని రోగాలలా కాదు. మానసిక వ్యాధి. దీనిలో ఉంటే మరింత దిగజారిపోతావు. మందులు వాడితే బయటపడవచ్చు’’ అని అంతా సలహా ఇవ్వడంతో సైకాలజిస్టుని కలిసి, థెరపీ తీసుకుంది. థెరపీతో త్వరగానే అన్విత మానసిక ఆరోగ్యం కుదుటపడింది. ఒకపక్క ఇంజినీరింగ్ సిలబస్ చదువుతూనే మరోపక్క మానసిక ఆరోగ్యం గురించిన పుస్తకాలు చదివేది. అలా మానసిక సమస్యలపై చక్కటి అవగాహన పెంచకున్న అన్విత..తను ఎదుర్కొన్న మానిసిక సంఘర్షణ, కుంగుబాటులను ఎవరూ ఎదుర్కోకూడదని అందరి దగ్గర డిప్రెషన్ గురించి ప్రస్తావన తీసుకొచ్చి అవగాహన కల్పిస్తుండేది. కేసు స్టడీల ద్వారా... మానసిక సమస్యలపై అవగాహన కల్పిస్తూనే, మానసిక ఆరోగ్యం గురించి మరింత లోతుగా తెలుసుకునేందుకు నెట్లో వెతికేది. ఈ క్రమంలో ‘‘12–25 శాతం మంది మహిళలు మాతృసంబంధమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో యాభైశాతంమందికి కూడా తాము మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలియదు. దీని ప్రభావం తల్లీ్లబిడ్డలపై పడుతుంది’’ అని తెలుసుకుంది. అది అలాగే కొనసాగితే పిల్లల భావోద్వేగ, శారీరక, నాడీ సంబంధిత ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని గ్రహించింది. ప్రెగ్నెంట్ మహిళ గైనకాలజిస్టుని సంప్రదించినప్పుడు తల్లీ, కడుపులో ఎదుగుతున్న బిడ్డ ఆరోగ్యంపైనే దృష్టి కేంద్రీకరిస్తారుగానీ, తల్లి మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోరు. అందువల్ల ఈ విషయం ఎవరికి తెలియదు. ఈ సమస్య గురించి వెలుగులోకి తెచ్చి అవగాహన కల్పించాలనుకుని అప్పటి నుంచి తల్లి మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతోంది. వెబ్సైట్ ద్వారా... గతేడాది ‘ప్యాట్రనస్ మెంటల్హెల్త్ డాట్‌కమ్’ పేరిట వెబ్‌సైట్‌ను ప్రారంభించి.. మానసిక ఆరోగ్యంపై కంటెంట్‌ను పోస్టు చేస్తుంది. అంతేగాక ఈ ఏడాది జూన్ లో చేంజ్‌డాట్ ఓఆర్జీ వేదికగా, మాతృ సంబంధమైన మానసిక సమస్యలను గుర్తించాలని కోరింది. అంతేగాక కర్ణాటక మానసిక ఆరోగ్యం విభాగం డిప్యూటీ డైరెక్టర్ ముందుకు ఈ విషయాన్ని తీసుకెళ్లింది. ఈ విషయంపై ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకురావాలని, మాత్ర సంబంధ మానసిక సమస్యలను ఏర్పాటు చేసి, వాటికి ప్రచారం కల్పించాలని ప్రభుత్వాలను కోరుతోంది. నేను తల్లయ్యేనాటికి.. ‘‘ఈ రోజు నేను తల్లిని కాకపోవచ్చు. భవిష్యత్‌లో తల్లినవుతాను. అప్పుడు నెలవారి చెకప్‌లలో భాగంగా ఆసుపత్రికి వెళ్లినప్పుడు డాక్టర్లు మానసిక సమస్యలపై కూడా స్పందిస్తారని ఆశిస్తున్నాను. శారీరక ఆరోగ్యంపై మానసిక సమస్యల ప్రభావం తప్పకుండా పడుతుంది. అమ్మాయిలు విషయాన్ని త్వరగా బయటకు చెప్పుకోలేరు. తమలో తామే కృంగిపోతుంటారు. ఇది అమ్మాయికి గానీ, తన భవిష్యత్ కుటుంబానికిగానీ మంచిది కాదు. అందుకే అందరూ మానసిక సమస్యలపై బాహాటంగా మాట్లాడి పరిష్కరించుకోవాలి’’ అని అన్విత చెప్పింది. అన్వితా నాయర్ -
Kavitha Natarajan: ఆప్యాయతే.. అభయం
ఇప్పుడు సమాజం ఎన్నడూ లేనంత భయాందోళనల మధ్య కొట్టుమిట్టాడుతోందని, ఆప్యాయత, అవగాహన నిండిన మాటలతో దాన్ని పోగొట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు కవితా నటరాజన్. కరోనా కల్లోలం నేపథ్యంలో సమాజంలో విజృంభిస్తున్న పలు రకాల మానసిక సమస్యలకు ఆమె తన వంతు పరిష్కారాలను స్వచ్ఛందంగా అందిస్తున్నారు. గత ఏడాది తెలంగాణలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటైన సైకోసోషల్ కౌన్సిలింగ్ సర్వీసెస్‌లో భాగంగా ఆమె కౌన్సిలింగ్ సేవలు కొనసాగిస్తున్నారు. ఐటీ ఉద్యోగినిగా పనిచేస్తూనే మరోవైపు తనకు ఇష్టమైన సోషల్ సర్వీస్‌నూ వదలకుండా కృషి చేస్తున్న కవితానటరాజన్ తన అనుభవాలను పంచుకున్నారిలా... కిందటేడాది కరోన.. ‘‘కార్పొరేట్ రంగంలో ఉన్నా, ప్రస్తుతం సిజిఐ అనే ఐటి కంపెనీలో పనిచేస్తున్నా. చిన్ననాటి నుంచీ స్వచ్ఛంద సేవ అంటే ఇష్టం. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఎన్నడూ ఎరగనంత విచిత్రమైన పరిస్థితులున్నాయి. లాక్‌డవున్ అనే మాట అంతకుముందు మనలో ఎవరమూ కనీ విననిది. ఆకలి కేకలు విని చాలా బాధపడ్డా. అయితే బయటకు వెళ్లి ఫుడ్ ప్యాకెట్స్ పంచాలి వంటి ఆలోచనలు వచ్చినా, నా వ్యక్తిగత ఇమ్యూన్ సిస్టమ్ గురించి తెలుసు కాబట్టి అలా చేయలేకపోయా. అదే సమయంలో ఎన్నడూ లేనట్టు కొన్ని నెలల పాటు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితుల వల్ల చుట్టుపక్కల పలువురిలో విభిన్న రకాల మానసిక సమస్యలను గుర్తించాను. అప్పటికే సైకాలజీలో డిగ్రీ చేశాను కాబట్టి.. స్వచ్ఛందంగా సైకలాజికల్ కౌన్సిలింగ్ ఎందుకు ఇవ్వకూడదు? అనిపించింది. ఆ ఆలోచనను పోలీసు ఉన్నతాధికారి మహేష్ భగవత్ గారితో పంచుకుని, వారి సూచనల మేరకు రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో మేం గత ఏడాది ఏప్రిల్ 2 న కౌన్సిలింగ్ సేవలు ప్రారంభించాం. ఉదయం 9గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ వచ్చిన కాల్స్ ఇంకా గుర్తున్నాయి. లాక్ డౌన్ వల్ల పెరిగిన పనిభారంతో ఇళ్లలో మహిళలు చాలా ఇబ్బందులు పడ్డారు. వర్క్ డివిజన్ తెలియక చాలా మానసికంగా ఒత్తిళ్లకు లోనయ్యారు. మహిళలపై గృహహింసకు సంబంధించిన కాల్స్ కూడా విపరీతంగా వచ్చాయి. వీరందరికీ కౌన్సిలింగ్ ఇస్తూ అలా... మూడు నెలల పాటు పని చేశాం. కోవిడ్ తగ్గటంతో ఆ కాల్స్ తగ్గిపోయాయి. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయినప్పుడు మానసిక సంఘర్షణకు లోనైన యువత నుంచి పెద్ద సంఖ్యలో కాల్స్ వచ్చాయి. సెకండ్‌వేవ్ బాధితులు మరోసారి కోవిడ్ తన ప్రతాపం చూపిస్తున్న పరిస్థితుల్లో భావోద్వేగాలు మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే మరోసారి ఈ కౌన్సిలింగ్ సేవలు ప్రారంభించాం. గతం తో పోలిస్తే ఇప్పుడు మరింత విభిన్నమైన మానసిక సమస్యలతో సంప్రదిస్తున్నారు. వీరిలో తమ వారిని పోగొట్టుకున్న మహిళల మానసిక పరిస్థితి దయనీయంగా ఉంది. అలాగే దగ్గర బంధువుల్లో చావులు ఈసారి చాలామంది మనోధైర్యాన్ని పోగొడుతున్నాయి. తాజాగా బ్లాక్ ఫంగస్ గురించి కూడా కాల్స్ వస్తున్నాయంటే... ఇప్పుడు భయం ఎంతగా జనాల్లో పేరుకుపోయిందో అర్థమవుతుంది. మా వంతుగా వారిలో ధైర్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈసారి నాతోపాటు బాగా అనుభవం ఉన్న మరో 13 మంది మహిళ కౌన్సిలర్లు తమ సేవలు అందిస్తున్నారు. పోలీసుకూ మహిళకూ మధ్య గతంలో కూడా ఈ తరహా కౌన్సిలింగ్ చేసిన అనుభవం ఉంది. ‘మార్గదర్శక్’ పేరుతో మా లాంటి కొందరు స్వచ్ఛంద సేవకులకు గృహహింస, వేధింపులు.. వంటి వాటి విషయంలో చట్టబద్ధమైన అంశాలపై పోలీసు శాఖ ఆధ్వర్యం లో శిక్షణ అందించారు. అలాగే మన సమాజంలో కొందరు మహిళలకు పోలీస్ స్టేషన్ అన్నా, పోలీసులన్నా భయం ఉండొచ్చు. ముందు వారిని మానసికంగా ధైర్యం పుంజుకునేలా చేసి, వారి సమస్య నిర్భయంగా చెప్పగలిగేలా ప్రిపేర్ చేస్తాం, షీ టీమ్‌కు అనుసంధానంగా పనిచేస్తాం’’ అని వివరించారు కవిత. – నిర్మలారెడ్డి -
వైశాలి.. ఊరెళ్లమంటే చనిపోతానంటోంది..!
సాక్షి, కర్నూలు: సి.బెళగల్ మండల పరిధిలోని ముడుమాల గ్రామంలో రెండురోజులుగా గుర్తు తెలియని బాలిక (14 ఏళ్లు) సంచరిస్తోంది. గ్రామస్తులు చేరదీసి వివరాలు అడిగితే తనది నంద్యాల అని, పేరు వైశాలి అని మాత్రమే చెబుతోంది. మీ తల్లిదండ్రులు ఎవరు..ఇంటి నుంచి ఎందుకొచ్చావు అని అడిగితే మాత్రం సమాధానం చెప్పకుండా దూరంగా వెళ్లిపోతోంది. ‘నన్ను ఇక్కడి నుంచి మా ఊరికి పంపిస్తే చేతులు కోసుకుని చనిపోతా’ అంటూ కూడా బెదిరిస్తోంది. బాలిక మానసిక స్థితి కూడా సరిగ్గా లేదని..అందుకే అలా ప్రవర్తిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. బాలికను తమ వద్ద ఉంచుకుని పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు వారు తెలిపారు. (20 నెలల తరువాత గుర్తుకొచ్చిన చిరునామా) -
‘భవిత’కు భరోసా ఏదీ?
సాక్షి, నల్లగొండ: భవిత కేంద్రాలకు ప్రభుత్వంనుంచి భరోసా కరువైంది. రెండేళ్లుగా భవిత కేంద్రాలకు నిధులు అందకపోవడంతో కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయి. బుద్ధిమాంద్యం, అంగవైకల్యం కలిగి ఉండి సొంతంగా పనులు చేసుకోలేని వారి కోసం ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా దివ్యాంగ పిల్లలను గుర్తించి వారిని పాఠశాలకు (భవితకేంద్రాలు) రప్పించాలి. విద్యాబుద్ధులు నేర్పు తూ మాట్లాడేది అర్థం చేసుకునే విధంగా వారిని తీర్చిదిద్దాలి. చివరికి సాధారణ విద్యార్థులుగా మార్చాలి. ప్రభుత్వం సౌకర్యాలు కల్పించకపోవడంతో భవిత కేంద్రాలు ఉపయోగపడుతున్నట్లు కనిపించడం లేదు. ఒక్కో మండలానికి రెండు కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా 16 మండలాల పరిధిలో ఒక్కో మండలానికి రెండు భవిత కేంద్రాలను ఏర్పా టు చేసింది. ఒక్కో కేంద్రంలో ఇద్దరు ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్(ఐఈపీఆర్)లను నియమించారు. వీరంతా వారి మండలాల పరిధిలో తిరిగి సరిగా మాటలు రాని బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలతోపాటు అంగవైకల్యం కలిగిన వారిని గుర్తించాలి. వారి తల్లిదండ్రులను ఒప్పించి పాఠశాలకు రప్పించాల్సి ఉంది. ఇక్కడ బోధన ఉచితంగా చేస్తారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 487 మంది 10 నుంచి 15 సంవత్సరాల దివ్యాంగ పిల్లలు ఉన్నారు. ఆగిన వైద్యశిబిరాలు భవిత కేంద్రాల్లో చదివే దివ్యాంగ విద్యార్థుల కోసం మండల స్థాయిలో ప్రతి జనవరి, ఫిబ్రవరి మాసాల్లో వైద్యశిబిరాలను నిర్వహించాలి. వారికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఎలాం టి ఉపకరణాలు అవసరమనేది గుర్తిం చాలి. గ్రహణమొర్రి వంటి వారికి కూడా శస్త్రచికిత్సలకు ప్రణాళికలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తారు. అదే సంవత్సరం నవంబర్, డిసెంబర్ మాసాల్లో పరికరాలు అందించడంతోపాటు శస్త్ర చికిత్సలు కూడా చేయించాలి. కానీ గత ఏడాది నిర్వహించిన పరీక్షలకు ఇంతవరకు పరికరాలు అందలేదు. ఈ సంవత్సరం జనవరిలో అసలు పరీక్షలే నిర్వహించలేదు. అంటే రెండేళ్లుగా వైద్యశిబిరాలు లేవన్నమాట. ఆగిన ట్రాన్స్‌పోర్టు చార్జీలు భవిత కేంద్రాలకు వచ్చే పిల్లలకు నెలకు రూ.250 ట్రాన్స్‌పోర్టు చార్జీలు ఇవ్వాల్సి ఉంది. గత సంవత్సరంనుంచి ట్రాన్స్‌పోర్టు చార్జీలు విడుదల కాలేదు. అసలే దివ్యాంగత్వం కారణంగా ఆర్థిక భారంతో బాధపడుతున్న కుటుం బాలు పిల్లలను భవిత కేంద్రాలకు పంపించేం దుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. రానురాను కేంద్రాల్లో పిల్లల సంఖ్య కూడా తగ్గిపోతుంది. ప్రధానంగా పిల్లలకు వీల్‌చైర్స్, ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలతో పాటు చంక కర్రలు, మానసిక బుద్ధిమాంద్యత కిట్లు, బ్రెయిలీ బుక్స్, తదితరాలు కూడా అందుబాటులో ఉం చాలి. ఆ పరిస్థితి కూడా లేకపోవడంతో పిల్లలు భవిత కేంద్రాలకు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి శుక్రవారం ఫిజియోథెరపీ చేయాలి వారంలో ప్రతి శుక్రవారం పిల్లలకు ఫిజియోథెరపిస్ట్‌తో ఫిజియోథెరపీ (ఎక్సర్సైజ్) చేయాలి. పిల్లలు ఎవరైనా పాఠశాలకు రాలేని వారు ఉంటే వారి ఇళ్లకే వెళ్లి చేయించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి కూడా ఎలాంటి నిధులూ విడుదల కాకపోవడంతో వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైతే పిల్లలు పాఠశాలకు రాలేని పరిస్థితిలో మంచానికే పరిమితమై ఉంటారో అలాంటి పిల్లల ఇంటికి వెళ్లి ఒక గంటన్నరసేపు బోధించాల్సి ఉంది. ఇలాంటి విషయంలో కూడా పెద్దగా స్పందిస్తున్నట్లు కనిపించడం లేదు. నిధులు లేకనే నీరసం భవిత కేంద్రాలకు నిధులు అందని కారణంగా అవి నీరస పడిపోతున్నాయి. ఈ కేంద్రాల్లో రెండేళ్లు మాత్రమే చదువుతారు. ఈ సమయంలో పిల్లలు బుద్ధిమాంద్యం నుంచి మాట్లాడగలిగే స్థితి వచ్చిందంటే వారిని రెగ్యులర్ పాఠశాలకు పంపాలి. కానీ భవిత కేంద్రాలే సక్రమంగా నడవకపోవడంతో రెగ్యులర్ పాఠశాలలకు కూడా వెళ్లే పరిస్థితి లేకుండాపోయింది. నల్లగొండ పట్టణంలోని భవిత కేంద్రాన్ని 'సాక్షి' సందర్శనకు వెళ్లగా 10మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. వాస్తవంగా అక్కడ 21 మంది పిల్లలు ఉండాలి. కానీ ట్రాన్స్‌పోర్టు చార్జీలు ఇవ్వని కారణంగా పిల్లల సంఖ్య తగ్గిపోతుందని చెబుతున్నారు. మధ్యాహ్న భోజనం కూడా పెడుతున్నామని, కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను భవిత కేంద్రంలో తోలిపోతుండగా, మరికొందరు ఆటోలో సొంత డబ్బులతో పంపిస్తున్నారని, కొందరు పంపించడం లేదని భవిత కేంద్రం ఐఈఆర్పీ శైలజ తెలిపారు. -
‘అలా ప్రయాణించడమే సౌకర్యం’
విమానంలో నగ్న ప్రయాణమే సౌకర్యంగా ఉంటుందని అనుకున్నాడో వింత ప్రయాణికుడు. అనుకున్నదే తడవుగా ఒంటి మీద ఎటువంటి ఆచ్ఛాదన (బట్టలు) కూడా లేకుండా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. మెల్లిగా చెక్ఇన్ అయ్యే ప్రాంతం వరకూ వెళ్లాడు. కానీ పోలీసుల కంటపడ్డాడు. అసహ్యమైన చర్యకు గాను పోలీసలు సదరు ప్రయాణికుడి వీపు విమానం మోత మోగించారు. మాస్కో: నగ్నంగా ప్రయాణించాలనే కోరికతో ఎయిర్‌పోర్ట్‌లో బట్టలు లేకుండా తిరుగుతున్న వ్యక్తి అరెస్టైన సంఘటన రష్యాలో జరిగింది. ‘శరీరంపై బట్టలు లేకుండా చేసే ప్రయాణం చాలా సుఖవంతం, సౌకర్యంగా ఉంటుంద’ని అరెస్ట్ అయిన ప్రయాణికుడు చెప్పడం విశేషం. ఆ ప్రయాణికుడిది రష్యాలోని యకుస్త్క్ ప్రాంతమని తెలుస్తోంది. అతడు మద్యం సేవించలేదని, పోలీసుల మందలింపు తర్వాత మానసిక చికిత్స కోసం ఆ ప్రయాణికుడ్ని విమానాశ్రయంలోని ఆస్పత్రిలో చేర్పించామని రష్యా అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మీడియాకు తెలిపారు. ఇటీవలే అబుదాబీ ఎయిర్‌పోర్ట్‌లో ఒక సౌదీ ప్రయాణికురాలు తన బిడ్డను అక్కడి వెయిటింగ్ రూమ్‌లోనే మరిచిపోయి వెళ్లాల్సిన ఫ్లయిట్ ఎక్కేసింది. విషయాన్ని గుర్తించిన మహిళ లబోదిబోమంటూ విమానాన్ని వెనక్కి తిప్పాల్సిందిగా పైలట్‌ను ఇబ్బందికి గురిచేసింది. మహిళ మతిమరుపు కాస్తా అధికారుల చావుకొచ్చింది. -
‘మీ నాన్నను చంపేశాను’
సాక్షి, పూడూరు: మతిస్థితిమితం కోల్పోయిన ఓ మహిళ తాను కట్టుకున్న భర్తపై గొడ్డలితో దాడి చేసి చంపేసింది. వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ అరుణ్‌కుమార్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని సోమన్గుర్తి గ్రామానికి చెందిన మంగళి యాదమ్మ, వెంకటయ్య(60) దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు, ఓ కూతురు ఉండగా వారి వివాహం జరిగింది. యాదమ్మ, వెంకటయ్య గ్రామంలో వేరుగా నివాసముంటున్నారు. అయితే, మూడేళ్లుగా యాదమ్మ మతిస్థిమితం కోల్పోయి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తోందని కుటుంబీకులు తెలిపారు. పలు ఆస్పత్రుల్లో ఆమెకు వైద్యం చేయించారు. కొంతకాలంగా యాదమ్మ మాత్రలు వాడుతోంది. అయితే, గత 15 రోజులగా వినియోగించడం లేదు. ఇదిలా ఉండగా, బుధవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో యాదమ్మ తన భర్త వెంకటయ్య మెడపై గొడ్డలితో తలపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం రక్తం మరకలు నీటితో కడిగేసింది. ఆ తర్వాత గ్రామంలో ఉంటున్న కుమారుడి వద్దకు వెళ్లిన యాదమ్మ ‘మీ నాన్నను చంపేశాను’ అని తెలిపింది. దీంతో కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పరిగి సీఐ మొగులయ్య సందర్శించి వివరాలు సేకరించారు. తానే గొడ్డలితో నరికి చంపినట్లు యాదమ్మ పోలీసులకు చెప్పింది. అయితే, నిందితురాలు భర్త హత్య అనంతరం రక్తం మరకలను శుభ్రం చేయడంతో ఆమెకు మతిస్థిమితం లేకపోవచ్చని సీఐ మొగులయ్య అనుమానం వ్యక్తం చేశారు. ఈమేరకు మృతుడి కుమారుడు మంగళి బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగొచ్చాడు!
సాక్షి, జడ్చర్ల టౌన్: ఇంటినుంచి వెళ్లిపోయిన వ్యక్తి చనిపోయాడకుని కుటుంబ సభ్యులు అతడిపై ఆశలు వదులుకున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత బతికే ఉన్నాడని తెలిసిన ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. జడ్చర్ల సీఐ బాలరాజు సమక్షంలో సత్యేశ్వర ఆశ్రమ నిర్వాహకులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివరాలిలా.. గద్వాలకు చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి ఎనిమిదేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అతడు చనిపోయాడని భావించి ఆశలు వదులుకున్నారు. అయితే బాదేపల్లి పాతబజార్‌లో మహాలక్ష్మి సేవాట్రస్టు నిర్వాహకులు ఈశ్వర్, రామకృష్ణ ఏడాదిక్రితం ప్రారంభించిన సత్యేశ్వర ఆశ్రమంలో మతిస్థిమితం తప్పిన వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇదే క్రమంలో గతేడాది ఏప్రిల్‌లో జాతీయ రహదారిపై మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న ఇబ్రహీం ఆశ్రమ నిర్వాహకుల కంటపడటంతో చేరదీశారు. ఆశ్రమంలో చేసిన సేవలు, సఫర్యలు, చికిత్సల కారణంగా ఇబ్రహీం కోలుకున్నాడు. తన కుటుంబ సభ్యుల వివరాలను ఆశ్రమ నిర్వాహకులకు తెలియజేయడంతో జడ్చర్ల పోలీసుల సహకారంతో గద్వాలలోని అతడి కుటుంబ సభ్యుల సమాచారం సేకరించారు. వారిని పిలిపించి ఆదివారం జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఇబ్రహింను అప్పగించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సీఐ బాలరాజు ఆశ్రమ నిర్వాహకుల సేవలను ప్రత్యేకంగా అభినందించారు. -
సార్ మా ఇంటి దగ్గర ఎలియన్ ఉంది!
పూణె : ఎలియన్స్ భూమికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని వాటి గ్రహానికి పంపుతున్నాయి. దానిలో భాగంగా అవి మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి. అదేంటో కనుక్కోండి సార్ అంటూ ప్రధాని కార్యాలయానికి ఈ మెయిల్ చేసాడో వ్యక్తి. ఈ విషయం గురించి విచారణ చేసిన పోలీసులు సదరు వ్యక్తి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఇలా చేశాడని తేల్చారు. ఆసక్తి రేపిన ఈ సంఘటన వివరాలు.. కొథ్రూడ్ ప్రాంతానికి చెందిన ఓ 47 ఏళ్ల వ్యక్తి కొన్నేళ్లుగా బ్రెయిన్ హ్యామరేజ్‌తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతను మానసిక పరిస్థితి క్షీణించింది. కొన్ని రోజుల క్రితం తన ఇంటి బయట మూడు లైట్లు వెలుగుతుండటం చూశాడు. దాంతో అవి ఎలియన్స్‌కు సంబంధించిన వస్తువులగా భావించాడు. ఈ విషయం గురించి విచారణ చేయాల్సిందిగా ప్రధాని ఆఫీస్‌కు ఈ- మెయిల్ చేశాడు. ‘ఎలియన్స్‌కు సంబంధించిన వస్తువు ఒకటి నా ఇంటి సమీపంలో తిరగుతుంది. అది భూమికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని వాటి గ్రహానికి చేరవేస్తుంది. దీని వల్ల మనకు అపాయం కల్గుతుంది. కాబట్టి వెంటనే ఈ విషయం గురించి విచారణ చేపట్టండి’ అంటూ ప్రధాని ఆఫీస్‌కు ఈ మెయిల్ చేశాడు. పీఎంఓ అధికారులు దీన్ని మహారాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేశారు. ప్రభుత్వ ఆదేశం మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సదరు వ్యక్తి మానసిర స్థితి సరిగా లేకపోవడంతో ఇలా చేశాడని తేల్చారు. అతను ఇలా మెయిల్ చేసిన విషయం ఇంట్లో కుటుంబ సభ్యులేవరికి తెలియదన్నారు. -
‘అమ్మా’నవీయం..
భద్రాచలంటౌన్: అయ్యో పాపం..పసివాడు. నాలుగేళ్ల పిల్లాడు. కానీ..ఆ తల్లి ఎంత కోపంతో ఉందో..ఏ బాధలో చేసిందో కానీ..కర్కశంగా వాతలు పెట్టింది. తాను కన్న బిడ్డే అయినా..ఎందుకో ఆ క్షణంలో మానవత్వం మరిచింది. శనివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని జగదీష్ కాలనీకి చెందిన పల్లపు లంకమ్మ తన నాలుగేళ్ల కుమారుడు రఘురాం మట్టి తింటున్నాడని వాతలు పెట్టింది. ఈమె భర్త ఈ ఏడాది అక్టోబర్‌లో చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె మానసిక స్థితి సరిగ్గా ఉండట్లేదు. ఆరేళ్ల కూతురితో పాటు ఈ బాబును సాకేందుకు ఆదాయం లేక, అటు భర్త మరణం తట్టుకోలేక మానసికంగా దెబ్బతిని..కోపాన్ని పిల్లలపై చూపుతుంటుందని ఐసీపీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీం) కౌన్సిలర్ యశోద తెలిపారు. ఈ క్రమంలో శనివారం పిల్లాడు రఘురాం మట్టి తింటున్నాడని కోపంతో గరిటెను కాల్చి ఎడమ బుగ్గ మీద, రెండు చేతుల మీద కాల్చింది. బాబు శరీరం కమిలి తల్లడిల్లుతుండడంతో స్థానికులు అంగన్వాడీ టీచర్ మాధవికి విషయం తెలిపారు. ఐసీడీఎస్ కౌన్సిలర్ యశోద, పోలీస్ వారు సోమవారం లంకమ్మ ఇంటికి వెళ్లి..కౌన్సెలింగ్ నిర్వహించి, బాలుడిని ఖమ్మంలోని చైల్డ్ కేర్‌లో ఉంచుతామని తెలిపారు. ఆ తల్లిపై కేసు నమోదు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
ట్రంప్‌కు చేసే పరీక్షల్లో అది లేదు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు మానసిక సామర్థ్యానికి (మెంటల్ ఫిట్నెస్ టెస్ట్) సంబంధించిన పరీక్షలు నిర్వహించడం లేదని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. ఈ వారంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో అందులో మెంటల్ ఫిట్నెస్ టెస్ట్ లేదని వెల్లడించింది. సాధారణంగా అమెరికా అధ్యక్షులుగా ఉన్నవారికి రాబోయే ఏడాదిలో పనిచేయగల సామర్థ్యం ఉందా లేదా అని తెలుసుకునేందుకు ముందుగానే వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఈ వారంలో వాషింగ్టన్‌లోని వాల్టర్ రీడ్ మిలిటరీ ఆస్పత్రిలో ట్రంప్‌కు వైద్య పరీక్షలు చేయనున్నారు. ఆ నివేదికను బహిర్గతం చేయనున్నట్లు వైట్ హౌస్ ఇది వరకే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల ట్రంప్ మానసిక పరిస్థితి బాగోలేదని, ఆయన మానసిక వ్యాధితో బాధపడుతున్నారని రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఇటీవల ఆయన ట్వీట్లను విశ్లేషిస్తూ ఓ రచయిత ప్రత్యేకంగా పుస్తకం రాస్తూ ట్రంప్ మానసిక వ్యాధితో బాధపడుతున్నారనే నిర్ణయాన్ని వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలోనే త్వరలో నిర్వహించనున్న వైద్య పరీక్షల్లో మెంటల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా నిర్వహించనున్నారా అనే విషయంపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఆ పరీక్ష లేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఆయనకు కేవలం దేహదారుఢ్య పరీక్షలు మాత్రమే నిర్వహిస్తారని వెల్లడించింది. -
మానసిక రోగులు పెరుగుతున్నారు: రాష్ట్రపతి
సాక్షి, బెంగళూరు: దేశంలో మానసిక వ్యాధుల సమస్య రోజురోజుకూ పెరుగుతూ ఉధృతమయ్యేలా కనిపిస్తోందనీ, 2022కల్లా మానసిక రోగులకు చికిత్స అందించేందుకు అవసరమైన కేంద్రాలను పూర్తిస్థాయిలో నెలకొల్పాల్సి ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి చికిత్స అందించడానికి ప్రభుత్వ ఆరోగ్య సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలు కృషి చేయాలనికోరారు. మధుమేహం బాధితుల కంటే మానసిక రుగ్మతలకు చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. మరో కార్యక్రమంలో కోవింద్ మాట్లాడుతూ ఉద్యోగాలు సంపాదించేందుకు మాత్రమే చదువు అనుకోవడం మంచిది కాదని అన్నారు. -
సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌ని. గతంలో ఒకసారి ‘ముత్యాల గర్భం’ అనే దాని గురించి విని ఉన్నాను. అయితే వివరాలేవీ సరిగా గుర్తులేవు. ఇంతకీ ‘ముత్యాల గర్భం’ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? నాలాంటి వాళ్లు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? – రమ్య, కరీంనగర్ గర్భం దాల్చినప్పుడు గర్భాశయంలో పిండంతో పాటు దానికి తల్లి నుంచి రక్తం సరఫరా అందించేందుకు మాయ ఏర్పడుతుంది. కొందరిలో సరిగా తెలియని అనేక రకాల కారణాల వల్ల పిండం పెరగకుండా, మాయ మాత్రమే గర్భాశయంలో ముత్యాల్లాంటి నీటి బుగ్గలుగా మారి, అది పెరిగిపోతూ ఉంటుంది. దీనినే ముత్యాల గర్భం అంటారు. పిండం నిర్మాణంలో లోపం, ఒక అండంలోకి రెండు శుక్రకణాలు వెళ్లి ఫలదీకరణ చెందినప్పుడు, నిర్వీర్యమైన అండంలోకి ఒక శుక్రకణం వెళ్లి, ఫలదీకరణ చెంది, అది విభజన జరిగినప్పుడు హార్మోన్ల అసమతుల్యత, వ్యాధి నిరోధక వ్యవస్థలో మార్పులు, విటమిన్ ఎ లోపం వంటి ఎన్నో కారణాల వల్ల ముత్యాల గర్భం ఏర్పడుతుంది. నెలలు పెరిగే కొద్దీ ముత్యాల నీటి బుగ్గలు రెట్టింపు అవుతూ, గర్భాశయం పెద్దగా పెరుగుతూ ఉండి, మధ్యమధ్యలో నీరు, రక్తం కలిసి కొద్దికొద్దిగా బ్లీడింగ్, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. లేకపోతే అది గర్భాశయంలోని అన్ని పొరలలోకి పాకి, లోపలే బ్లీడింగ్ ఎక్కువగా అయ్యి, మనిషి పాలిపోయినట్లుండి, బాగా ఆయాసపడిపోతూ, షాక్‌లోకి వెళ్లిపోవచ్చు. కొందరిలో ఉన్నట్లుండి రక్తస్రావం అధికంగా అయ్యి, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లవచ్చు. దీనికి చికిత్స... ముత్యాల గర్భాన్ని డి మరియు సి లేదా సక్షన్ ఎవాక్యుయేషన్ ద్వారా తీసివేయడం. ముత్యాల గర్భం రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి మన చేతిలో ఏమీ లేదు. కాకపోతే రెండు, మూడు నెలలలో స్కానింగ్ చేయించుకోవడం వల్ల ముందుగానే ఈ సమస్యను గుర్తించి కాంప్లికేషన్స్లోకి వెళ్లకముందే దానిని తొలగించవచ్చు. మా బంధువుల్లో ఒకరికి చాలాకాలం నుంచి పిల్లలు లేరు. ‘డి అండ్ సీ ఆపరేషన్’ ద్వారా మహిళలకు పిల్లలు కలిగేలా చేస్తారని చదివాను. ‘డి అండ్ సీ ఆపరేషన్’ అంటే ఏమిటి? ఈ ఆపరేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ‘కొందరు మాత్రమే ఈ ఆపరేషన్‌కు అర్హులు’ (శారీరక పరిస్థితులను బట్టి)లాంటివి ఏమైనా ఉన్నాయా? తెలియజేయగలరు? – డి.జానకి, విజయనగరం డి అండ్ సీ ఆపరేషన్ అంటే డైలటేషన్ అండ్ క్యూరెటాజ్. గర్భసంచి ద్వారమైన సర్విక్స్‌ను డైలేట్ చేసి అంటే కొద్దిగా తెరవడానికి వెడల్పు చేసి గర్భాశయంలోని పొరను క్యూరెట్ అనే పరికరం ద్వారా శుభ్రం చేయడం (గీకటం). కేవలం డి అండ్ సీ చెయ్యడం వల్లనే గర్భం దాల్చరు. అండం విడుదల అవ్వడం, సరిగా ఉండి, ట్యూబ్స్ తెరుచుకుని ఉండి, మగవారిలో వీర్య కణాలు సరిగా ఉన్నా, మిగతా హార్మోన్లలలో అసమతుల్యత వంటి ఇతర సమస్యలు ఏమీ లేకుండా ఉండి, గర్భాశయ ద్వారం చాలా సన్నగా ఉన్నప్పుడు డి అండ్ సీ ద్వారా, ఆ ద్వారాన్ని వెడల్పు చెయ్యడం వల్ల వీర్య కణాలు తేలికగా గర్భాశయంలోకి ప్రవేశించడం ద్వారా గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అంతే కాని, డి అండ్ సీ ద్వారా గర్భం కచ్చితంగా వస్తుందని చెప్పలేం. అలాగే గర్భాశయంలోని పొరను శుభ్రం చేయటం, అలానే దానిని గీకటం వల్ల కొందరిలో మళ్లీ పొర ఆరోగ్యంగా ఏర్పడి పిండం గర్భాశయంలో (అతుక్కోవడానికి) నిలబడడానికి (ఇంప్లాన్టేషన్) దోహద పడుతుంది. ఆధునిక చికిత్స లేని పాతకాలంలో పిల్లలు కలగనివారికి దాదాపుగా అందరికి డి అండ్ సీ చేసేవాళ్లు. దాంతో మిగతా ఇబ్బందులు లేనప్పుడు, చాలామందికి గర్భం రావడం జరిగేది. దీనినే వాడుక భాషలో కడుపు కడగటం, గర్భ సంచిని కడగటం అంటారు. ఈ ఆపరేషన్ ఎవరైనా చేయించుకోవచ్చు. నొప్పి తెలియకుండా మత్తు ఇచ్చి, యోని భాగంలో నుంచి డి అండ్ సీ చేస్తారు. శుభ్రత పాటించని హాస్పిటల్స్‌లో చెయ్యించుకుంటే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతకంటే వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. గర్భాశయంలో శుభ్రం చేసిన పొరను బయాప్సీకి పంపిస్తే, దానిలో ఏవైనా సమస్యలు ఉంటే తెలుస్తాయి. నాకు కొత్తగా పెళ్లయింది. అయితే నా భర్త నాకు దూరంగా ఉంటున్నారు. ‘ఆమె దగ్గర విపరీతమైన దుర్వాసన వస్తుంది’ అని నా గురించి ఎవరితోనో చెప్పారట. నిజానికి శుభ్రత విషయంలో నేను చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను. ‘అతి శుభ్రత పాటిస్తావు’ అని కూడా వెక్కిరించేవాళ్లు. అలాంటి నా దగ్గర దుర్వాసన రావడం ఏమిటో అర్థం కావడం లేదు. దీనికి సంబంధించి ఏదైనా చెబుతారని ఆశిస్తున్నాను. – డి.కె, నిర్మల్ మీ వారి దృష్టిలో దుర్వాసన అంటే ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచిస్తున్నారో. కొంతమందిలో నోటి నుంచి కూడా దుర్వాసన రావచ్చు. కొందరిలో యోనిలో ఇన్ఫెక్షన్స్ వల్ల దుర్వాసన రావచ్చు. కొంతమంది మగవారు మనసులో ఏదో పెట్టుకుని, కారణం ఏదో ఒకటి చెబుతుంటారు. నిజంగా ఆయనకి ఏదైనా నీవల్ల ఇబ్బంది అనిపిస్తే అది నీతో మాట్లాడి, సమస్యకు మార్గం ఏమిటో, డాక్టర్‌కు చూపించటమో ఏదో చెయ్యాలి కాని, బయటవాళ్లకి నీమీద చెప్పటం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు కదా! ఒకసారి నువ్వే ఆయనతో నీ వల్ల ఆయనకు ఏమి ఇబ్బందిగా ఉందో మాట్లాడి, సమస్యను నువ్వే పరిష్కరించుకోవాలి. నిజంగా ఏదైనా ఇబ్బంది ఉంటే డాక్టర్‌కి చూపించి చికిత్స తీసుకోవచ్చు. లేకపోతే ఈ దూరం పెరిగిపోయి, మనస్పర్థలు వచ్చే అవకాశాలు ఉంటాయి. -
పిల్స్ అంటేనే భయం...
నాకు కొత్తగా పెళ్లయింది. పిల్లలు అప్పుడే వద్దనుకుంటున్నాం. పిల్స్ ఎక్కువగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఎక్కడో చదివాను. అప్పటి నుంచి పిల్స్ అంటేనే భయం పట్టుకుంది. అసలు మాత్రలు వాడడం మంచిదేనా, ఏ మేరకు వాడొచ్చు అనేది చెప్పగలరు. పురుషుల కోసం కుటుంబ నియంత్రణ సాధనాలు కొత్తగా ఏమైనా వచ్చాయా తెలియజేయగలరు. – రాగిణి, చిత్తూరు తాత్కాలికంగా పిల్లలు వద్దనుకున్నప్పుడు, అనేక మార్గాలలో గర్భ నిరోధక మాత్రలు వాడటం ఒక మార్గం. ఈ మాత్రలలో ఈస్ట్రోజన్, ప్రొజస్టరాన్ హార్మోన్లు వివిధ రకాల మోతాదులో ఉంటాయి. వీటి ప్రభావం వల్ల, అండం తయారు కాకపోవడం లేదా గర్భాశయ ముఖద్వారంలోని ద్రవాలను చిక్కగా మార్చడం, వీర్య కణాలు గర్భాశయం లోపలకు వెళ్లకుండా అడ్డుకోవడం, తద్వారా గర్భం రాకుండా ఆపుతాయి. వీటిలోని హార్మోన్ల వల్ల, ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి కొందరిలో వికారం, వాంతులు, కళ్లు తిరిగినట్లు ఉండి మెల్లగా అలవాటు పడతారు. కొందరిలో తర్వాత కూడా ఈ లక్షణాలు తగ్గకపోవచ్చు. అలాంటప్పుడు మాత్రల వాడకం ఆపివేయవలసి ఉంటుంది. మాత్రలలో ఉన్న ఈస్ట్రోజన్ హార్మోన్ మోతాదును బట్టి లక్షణాలు ఉంటాయి. అధిక బరువు ఉన్నవారు, మైగ్రేన్ ఉన్నవారు, లివర్ సమస్యలు ఉన్నవారు, రక్తం త్వరగా గూడు కట్టే గుణం ఉన్నవాళ్లు ఇవి వాడకపోవటం మంచిది. ఇప్పుడు మూడు అతి తక్కువ మోతాదులో దొరికే లో డోస్ పిల్స్ రెండు, మూడు సంవత్సరాల వరకు వాడుకోవచ్చు. ఇవి డాక్టర్‌ను సంప్రదించి వారి సలహా మేరకు వాడటం మంచిది. మగవారు కుటుంబ నియంత్రణ కోసం వాడటానికి మందులు, ఇంజక్షన్లు ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయి. వారు వాడుకోవటానికి కేవలం కండోమ్స్ మాత్రమే ఉన్నాయి. కాని జాగ్రత్తగా వాడకపోతే ఫెయిల్ అయ్యి గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డాక్టరు గారు... నా వయసు 26 సంవత్సరాలు. మా ఆయన వయసు 28 సంవత్సరాలు. పెళ్లై సంవత్సరం దాటింది. మాకు సంతానం కలగలేదు. నాకు పిరియడ్స్ సక్రమంగానే వస్తుంది. వైద్య పరీక్షల్లో ఏ సమస్య లేదని చెప్పారు. మాకు పిల్లలు కలగాలంటే ఏ సమయాల్లో కలుసుకుంటే బాగుంటుంది తెలియజేయగలరు. – వి.బిందు, పాడేరు సాధారణంగా భార్య, భర్తల్లో ఏ సమస్య లేనప్పుడు, 80 శాతం మంది పెళ్లయిన సంవత్సరం లోపల గర్భం దాల్చుతారు. 15 శాతం మంది రెండు సంవత్సరాల లోపల గర్భం దాల్చుతారు. మిగతా 5 శాతం మందికి మాత్రమే, చికిత్స అవసరమవుతుంది. మీకు పెళ్లై సంవత్సరమే అయ్యింది. వైద్య పరీక్షలలో సమస్యలు ఏమీ లేవు కాబట్టి, ఇంకొక సంవత్సరం పాటు సాధారణ గర్భం కోసం ప్రయత్నించవచ్చు. వైద్య పరీక్షలు నీకు మాత్రమే చేశారా లేక మీ వారికి కూడా వీర్య పరీక్ష చేశారా అనే విషయం సరిగా తెలుపలేదు. మీ వారికి కూడా వీర్య పరీక్ష చేసి, వీర్య కణాల సంఖ్య, కదలిక సరిగా ఉంటే పర్వాలేదు. ఒకవేళ చెయ్యకపోతే, చేయించి చూడండి. అన్నీ బాగుంటే నీకు నెలనెలా పీరియడ్స్ సక్రమంగా వస్తున్నాయి కాబట్టి, బ్లీడింగ్ మొదలైన రోజు మొదటి రోజుగా లెక్కపెట్టి, 9వ రోజు నుంచి 16వ రోజు లోపల కలవడం వల్ల గర్భం నిలిచే అవకాశాలు పెరుగుతాయి. నేను చాలా బలహీనంగా ఉంటాను. బరువు కూడా చాలా తక్కువ. వైట్ డిశ్చార్జి సమస్య ఉంది. మరోవైపు మా వాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాకున్న సమస్య వల్ల పెళ్లి చేసుకోవడం సరైనదేనా? పెళ్లి వల్ల సమస్యలేమైనా వస్తాయేమోనని భయంగా ఉంది. మీ సలహా కావాలి. – డి.కె, మార్టూర్ సన్నగా, బలహీనంగా ఉన్నప్పుడు, ఎందుకు అలా ఉన్నానని విశ్లేషించుకోవాలి. ఆకలి లేకపోవటం, ఆహారం సరిగా తీసుకోకపోవటం, మానసిక, శారీరక ఒత్తిడి, హార్మోన్ల లోపం, ఆరోగ్య సమస్యలు వంటివి ఎన్నో కారణాలు కావచ్చు. రక్తహీనత వల్ల కూడా నీరసంగా ఉండటం, ఇన్ఫెక్షన్స్ ఏర్పడటం, కడుపులో నులిపురుగులు వంటి కారణాల వల్ల వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుండవచ్చు. నీ వయస్సు ఎంతో రాయలేదు. సన్నగా, బలహీనంగా ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో కూడా నీరసంగా ఉండటం, త్వరగా అలసిపోవటం వంటి ఇబ్బందులు ఏర్పడవచ్చు. వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్తో కూడినది. అయితే, పెళ్లి తర్వాత ఇంకా ఎక్కువ అయ్యి దురద, వాసన, పొత్తి కడుపులో నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. మొదట పాలు, పప్పులు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, మాంసాహారం, గుడ్లు వంటి పౌష్టికాహారం రోజూ తీసుకుని, కొద్దిగా బరువు పెరిగి, బలహీనతను పోగొట్టవచ్చు. అలా చేసినా ఉపయోగం లేనప్పుడు, డాక్టర్ని సంప్రదించి, సమస్య ఎక్కడ ఉందో పరీక్షలు చేయించుకుని దానిని బట్టి చికిత్స తీసుకోవచ్చు. -
ఎందుకిలా జరుగుతోంది?
నా వయసు 32. ఎత్తు 5.2 అడుగులు. బరువు 59 కిలోలు. ఆరేళ్ల కిందట పెళ్లయింది. నాలుగుసార్లు గర్భం దాల్చినా నిలవలేదు. నెల్లాళ్ల కిందటే నాలుగో అబార్షన్ జరిగింది. డాక్టర్ల సూచనలను పాటిస్తూనే ఉన్నాను. అయినా ఇలా ఎందుకు జరుగుతోంది? దీనికి పరిష్కారం ఏమైనా ఉందా? – రామలక్ష్మి, హోసూరు నాలుగుసార్లు అబార్షన్లు అయ్యాయి అని రాశారు. అవి ఎన్ని నెలలకు అయ్యాయి? గర్భం దాల్చిన తర్వాత స్కానింగ్ చేశారా లేదా, పిండం ఏర్పడలేదన్నారా లేదా పిండం గుండె కొట్టుకోవట్లేదన్నారా, రక్త పరీక్షలు చేశారా అనే విషయాలను తెలిపి ఉంటే బాగుండేది. ఈ విషయాల మీద, కొంతమందిలో అబార్షన్లకు గల కారణాలను అంచనా వేసుకుని, దానిని బట్టి, మరలా గర్భం దాల్చిన ముందు నుంచే చికిత్స తీసుకుని తర్వాత గర్భం కోసం ప్రయత్నిస్తే, చాలావరకు అబార్షన్లు అయ్యే అవకాశం తగ్గుతుంది. కొంతమందిలో థైరాయిడ్, ప్రొజెస్టిరాన్ వంటి హార్మోన్ల అసమతుల్యత, గర్భాశయంలో పొరలు, ఫైబ్రాయిడ్స్ అండాశయాలలో నీటి బుడగలు, జన్యుపరమైన సమస్యలు, మధుమేహ వ్యాధి, తల్లిలో శిశువుకి వ్యతిరేకంగా యాంటి ఫాస్పొలిపిడ్∙యాంటీ బాడీలు వంటి అనేక కారణాల వల్ల అబార్షన్లు మళ్లీ మళ్లీ అయ్యే అవకాశాలు ఉంటాయి. దానినే హ్యాబిట్యువల్ అబార్షన్స్ అంటారు. (భార్య, భర్త ఇద్దరూ రక్త పరీక్షలు, స్కానింగ్ చేయించుకుని, కారణాన్ని బట్టి చికిత్స తీసుకుని, మరలా ప్రయత్నించండి) భార్యభర్తల్లో జన్యు పరమైన సమస్యలు ఉంటే పిండం సరిగా ఏర్పడకుండా అబార్షన్లు అవ్వవచ్చు. అలాంటప్పుడు భార్య, భర్త ఇద్దరూ జన్యుపరమైన పరీక్షలు కోసం కారియో టైపింగ్ చేయించుకుని సమస్య ఎక్కడుందో తెలుసుకోవటం మంచిది. నా వయసు 42. బరువు 70 కిలోలు, ఎత్తు 5.2 అడుగులు. నాకు మూడేళ్ల కిందట పెళ్లి జరిగింది. ఆలస్యంగా పెళ్లి కావడం వల్ల గర్భందాల్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. సంతానం కోసం రెండుసార్లు ఐవీఎఫ్ ద్వారా చేసిన ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. మరోసారి ప్రయత్నించవచ్చా? ఒకవేళ ప్రయత్నిస్తే ఎన్నాళ్లు ఆగాల్సి ఉంటుంది? ఐవీఎఫ్ కంటే మెరుగైన ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా? – జగదాంబ, కర్నూలు మీరు గమనించవలసిన విషయాలు. ఒకటి వయసు 42 సం., మీ ఎత్తుకి 70 కిలోలు అంటే అధిక బరువు. సాధారణంగా ఆడవారిలో 35 సం.లు దాటేకొద్దీ అండాల సంఖ్య, అలాగే వాటి నాణ్యత తగ్గటం మొదలవుతాయి. అవి 40 దాటితే నాణ్యత ఇంకా క్షీణిస్తుంది. అండం నాణ్యత సరిగా లేనప్పుడు, పిండం ఏర్పడటంలో లోపాలు, పిండాన్ని గర్భాశయం స్వీకరించకపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల మీకు ఐవీఎఫ్ చేసినా ఫలితం దక్కకపోయి ఉండవచ్చు. వయసు తక్కువగా ఉండి ఉంటే మూడోసారి కూడా ప్రయత్నించి ఉండవచ్చు. మీకు ఇంకా చూడాలను కుంటే ఐవీఎఫ్ తర్వాత 6 నెలలు లేదా సంవత్సరం ఆగి ప్రయత్నించ వచ్చు. కాని మళ్లీ వయసు పెరుగుతోంది కదా. కాబట్టి మీరు ఈసారికి డోనార్ నుంచి (దాత నుంచి) స్వీకరించిన అండంతో, ఐవీఎఫ్ ప్రయత్నించ వచ్చు. దీనివల్ల, అండం నాణ్యత బాగా ఉన్నప్పుడు గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి. అలా చేసినా గర్భం నిలవకపోతే, మీ గర్భాశయం, పిండాన్ని స్వీకరించట్లేదు కాబట్టి, మీ ఆరోగ్య పరిస్థితి తెలిసిన చికిత్స ఇస్తున్న డాక్టర్ అభిప్రాయం మేరకు సరోగసీకి ప్రయత్నం చేయవచ్చు. ఈ లోపల మీరు పది కేజీల అధిక బరువు ఉన్నారు. బరువు తగ్గి చికిత్స మొదలుపెట్టడం మంచిది. లేదంటే గర్భం ఆగడానికి ఇబ్బందులు, ఒకవేళ గర్భంవచ్చిన తర్వాత 42 వయసుతో పాటు, బరువు వల్ల బీపీ, షుగర్ వంటి అనేక సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నాకు ఇటీవలే పెళ్లి జరిగింది. నా వయసు 21. ఎత్తు 5.4, బరువు 47 కిలోలు. బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతున్నాను. గత నెలలో ఊరికి వెళ్లినప్పుడు మూడు రోజులు పిల్స్ వేసుకోవడం కుదరలేదు. దీనివల్ల ఏవైనా సమస్యలు ఉంటాయా? – సుప్రియ, ఏలూరు బర్త్ కంట్రోల్ పిల్స్ వాడేటప్పుడు, అవి తప్పకుండా రోజు ఒకే సమయానికి మర్చిపోకుండా వేసుకుంటేనే అవి సరిగా పనిచేసి, గర్భం రాకుండా ఆపుతాయి. వీటిని సాధారణంగా పీరియడ్ మొదలైన మూడవ రోజు నుంచి మొదలుపెట్టి, మొత్తం ప్యాకెట్ అయిపోయేవరకు వేసుకోవాలి. కొన్ని పిల్స్ ప్యాకెట్లో హార్మోన్ల మోతాదును బట్టి, కొన్నింటిలో 21 మాత్రలు, కొన్నింటిలో 24 మాత్రలు, కొన్నింటిలో 28 మాత్రలు. వాటిలో 21 హార్మోన్ మాత్రలు తెల్ల రంగులో, మిగతా 7 ఐరన్ మాత్రలు నల్ల రంగులో ఉంటాయి. హార్మోన్ల మాత్రలను నెలలో ఒకసారి కంటే ఎక్కువ మర్చిపోతే గర్భం నిలిచే అవకాశాలు ఉంటాయి. నువ్వు 3 రోజులు ఏ రోజుల్లో ఎప్పుడు వేసుకోలేదో రాయలేదు. వీటిని ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, వారికి రెగ్యులర్ పీరియడ్స్ కాదా అనేదాని బట్టి, ఒకవేళ ఆఖరు రోజుల్లో మర్చిపోతే , గర్భం వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ ప్యాకెట్ మధ్యలోనే మాత్రలు వేసుకోకపోతే గర్భం నిలిచే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా, ట్యాబ్లెట్స్ సరిగా వేసుకోకుండా మర్చిపోవడం వల్ల, బ్లీడింగ్ తొందరగా మొదలవటం లేదా కొద్దికొద్దిగా కనిపించటం, ఆ నెలంతా బ్లీడింగ్‌లో అవకతవకలు కనిపించవచ్చు. డా‘‘ వేనాటి శోభ లీలా హాస్పిటల్ మోతీనగర్, హైదరాబాద్ -
ఆ ప్రభావం బిడ్డ మీద పడుతుందా?
నా వయసు 29 ఏళ్లు. నాకు చిన్నప్పటి నుంచి ఉబ్బసం ఉంది. డాక్టర్ల సలహాపై చాలాకాలం మందులు, ఇన్హేలర్ వాడాను. ఇప్పుడు నేను గర్భిణిని. నాలుగో నెల. ఇదివరకు నేను వాడిన మందుల ప్రభావం నాకు పుట్టబోయే బిడ్డపై ఉంటుందా? ఒకవేళ ఉంటే ముందుగానే తెలుసుకోవడానికి వీలవుతుందా? - సౌజన్య, ఇల్లెందు ఉబ్బసం వ్యాధి అంటే ఆస్తమా. కొన్ని రకాల అలర్జీల వల్ల లేదా శ్వాస నాళాలలో లేదా ఊపిరితిత్తులలో సమస్య వల్ల రావచ్చు. వీటికోసం దీర్ఘకాలం మందులు వాడవలసి ఉంటుంది. గర్భం దాల్చిన తర్వాత, ఆ సమయంలో ఏర్పడే హార్మోన్ల మార్పుల వల్ల ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, ఉబ్బసం లక్షణాల తీవ్రత ఉంటుంది. అలాంటప్పుడు తప్పనిసరిగా మందులు వాడవలసి ఉంటుంది. వాడకపోతే తల్లికి ఇబ్బందితో పాటు కడుపులో బిడ్డకు కూడా శ్వాస తగ్గడం, ఆక్సిజన్ శాతం తగ్గే అవకాశాల వల్ల, కొన్ని సార్లు బిడ్డ బరువు ఎక్కువ పెరగకపోవడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. గర్భంలో ఉన్నప్పుడు మందులు వాడవలసినప్పుడు, డాక్టర్ పర్యవేక్షణలో బిడ్డపై ప్రభావం పడని మోతాదులో మందులు వాడవచ్చు. నువ్వు మందులు గర్భం దాల్చిన తర్వాత వాడలేదు కాబట్టి, భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాడినా, మందులను డాక్టర్‌కు చూపిస్తే ఆ మందులలో మోతాదు ఎంత ఉంది, వాటివల్ల బిడ్డపై ప్రభావం ఎంత వరకు ఉండవచ్చు అనేది అంచనా వేసి చెప్తారు. ఒకసారి 5వ నెల చివరిలో టిఫా స్కానింగ్ చేయించుకుంటే, పుట్టబోయే బిడ్డలో అవయవ లోపాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది 90 శాతం వరకు గుర్తించవచ్చు. నా వయసు 33 ఏళ్లు. ఎత్తు 5.2 అడుగులు, బరువు 62 కిలోలు. ప్రస్తుతం నేను ఐదో నెల గర్భిణిని. చిన్న వయసులోనే జుట్టు నెరవడంతో నాలుగేళ్లుగా జుట్టుకు రంగు వేసుకుంటూ వస్తున్నాను. గర్భంతో ఉండగా జట్టుకు రంగు వేసుకుంటే లోపల ఉన్న పిండానికి ప్రమాదం అని కొందరు చెబుతున్నారు. నిజమేనా? - శ్రావ్య, ఖమ్మం జుట్టుకు వేసుకుని రంగు కేవలం తలమాడుకి, వెంట్రుకలకే వేయడం జరుగుతుంది. మళ్ళీ అది అరగంట, గంటలోపే కడిగేయడం జరుగుతుంది కాబట్టి అది రక్తంలోకి కలసి, పిండానికి చేరి ప్రమాదం కలిగించడం జరగదు. కాకపోతే మొదటి మూడు నెలల్లో పిండంలో అవయవాలు ఏర్పడుతాయి. కాబట్టి, రిస్క్ తీసుకోకుండా ఉండటం కోసం ఈ సమయంలో వీలైనంత వరకు హెయిర్ డై నివారించడం మంచిది. ఒకవేళ వేసుకున్నా మాడుపై జుట్టుని పైకి లాగి, మాడుకి ఎక్కువగా తగలకుండా రంగు వేసుకుని, వీలైనంత త్వరగా కడిగి వేయడం మంచిది. మా అమ్మాయికి పన్నెండు సంవత్సరాలు. ఇంకా మెచ్యూర్ కాలేదు. మెచ్యూర్ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి. ఏ విధమైన ఆహారాన్ని ఇవ్వాలో, ఎన్ని రోజుల తర్వాత స్కూలుకు పంపాలో తెలియజేయండి. - స్వర్ణ కుమారి, కాకినాడ ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, అమ్మాయిలు 11 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపల ఎప్పుడైనా మెచ్యూర్ అవ్వవచ్చు. ప్రతి తల్లి కూతురికి 10 సంవత్సరాల ముందు నుంచి శరీరంలో వచ్చే మార్పుల గురించి వివరించడం మంచిది. దీనివల్ల పిల్లలు తమ శరీరంలో జరిగే మార్పులకు ఆందోళన చెందకుండా వాటిని స్వీకరించడానికి సన్నద్ధం అవుతారు. మెచ్యూర్ అవ్వడానికి 2 సంవత్సరాల ముందు నుంచే వక్షోజాలు బుడిపెలాగా మొదలయ్యి, కొద్దికొద్దిగా పెరగడం జరుగుతుంది. అలాగే చంకలో, గజ్జలో సన్న సన్న వెంట్రుకలు పెరగడం, కొద్దికొద్దిగా వైట్ డిశ్చార్జ్ వంటి మార్పులు ఎన్నో మొదలవుతాయి. ఒకవేళ స్కూల్లో ఉన్నప్పుడు పీరియడ్స్ మొదలయినా, వారు కంగారుపడకుండా, వారి స్కూల్ బ్యాగ్‌లో న్యాప్కిన్, ప్యాంటీ వంటివి ఉండేటట్లు చూడడం మంచిది. అలాగే వారికి పెరిగే వయసు బట్టి పౌష్టికాహార విలువలు, శారీరక శుభ్రత వంటి అంశాల మీద అవగాహన పెంచటం మంచిది. మెచ్యూర్ అయ్యారని ఆహారంలో నియమాలు స్పెషల్‌గా ఏమీ ఉండవు. అందరి పిల్లల లాగానే పప్పులు, పండ్లు, పాలు, పెరుగు వంటి పౌష్టికాహారం ఇవ్వవచ్చు. దీనికోసం స్కూలుకి పంపివ్వకుండా ఇంట్లో ఉంచుకోవలసిన అవసరం లేదు. పాపకి ఎక్కువ బ్లీడింగ్; కడుపులో నొప్పి వంటివి అసౌకర్యంగా ఉంటే మూడు, నాలుగు రోజులు పంపించకండి. అన్నింటి కంటే మొదటగా, ఆ సమయంలో మీ పాపకి మానసికంగా తోడుండటం ఎంతో అవసరం. -
శాశ్వత పరిష్కారం లేదా?
నా వయసు 19 ఏళ్లు. ఎత్తు 5.5 అడుగులు, బరువు 42 కిలోలు. నాకు మూతి మీద, గడ్డం మీద పలచగా వెంట్రుకలు వస్తున్నాయి. షేవ్ చేసుకుంటే మరింత గరుగ్గా మారతాయని భయంగా ఉంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఏదైనా సూచించగలరా? - దివ్య, పొద్దుటూరు కొందరిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల అవాంఛిత రోమాలు ఏర్పడుతాయి. మగ వారిలో ఎక్కువగా ఉండే టెస్టోస్టిరాన్ అనే ఆండ్రోజన్ హార్మోన్ కొందరి ఆడవారిలో కూడా అనేక కారణాల వల్ల ఎక్కువగా స్రవిస్తుంది. దీనివల్ల పెదవులపైన, గడ్డంమీద, కొందరిలో ఛాతిపైన, కాళ్లు, చేతులుపైన ఎక్కువగా వెంట్రుకలు వస్తాయి. అండాశయాలలో ఎక్కువగా నీటిబుడగలు, అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ (పిసిఓడీ), అడ్రినల్ గ్రంథిలో కంతులు, కొన్ని జన్యుపరమైన సమస్యలు వంటి ఎన్నో సమస్యల వల్ల అవాంఛిత రోమాలు ఏర్పడు తాయి. నీకు గల కారణాన్ని తెలుసుకోవడానికి గైనకాలజిస్ట్ లేదా ఎండోక్రైనాలజిస్ట్‌ను సంప్రదించి టెస్టోస్టిరాన్, డీహెచ్ఈఎస్ వంటి అవసరమైన హార్మోన్, రక్తపరీక్షలతోపాటు, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్ చేయించుకుని, కారణాన్ని బట్టి దీర్ఘకాలంగా చికిత్స తీసుకోవలసి ఉంటుంది. శరీరంలో ఉన్న హార్మోన్లని తగ్గించడానికి చికిత్స తీసుకోవడం వల్ల కొత్తగా వచ్చే వెంట్రుకల సాంద్రత మెల్లగా తగ్గుతూ వస్తుంది. ముందు నించి వెంట్రుకలను తొలగించుకోవడానికి తాత్కాలిక పద్ధతులను పాటించవచ్చు. ఇప్పుడు ఆధునికంగా చేసే లేజర్ ట్రీట్మెంట్ ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి హార్మోన్ల అసమతుల్యతను బట్టి వాటి సిట్టింగ్స్‌కు సమయం పడుతుంది. శాశ్వత అవాంఛిత రోమాల నివారణకు చాలా సమయం పడుతుంది. ఖర్చు అవుతుంది. కాబట్టి ఓపికతో చికిత్స తీసుకోవలసి ఉంటుంది. శరీరంలో ఉన్న హార్మోన్స్‌ను నియంత్రణ చెయ్యకుండా కేవలం లేజర్ చికిత్స తీసుకోవడం వల్ల కొంత కాలం వెంట్రుకలు లేకపోయినా, మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నా వయసు 44 ఏళ్లు. ఎత్తు 5.1 అడుగులు, బరువు 66 కిలోలు. మూడు నెలలుగా నాకు నెలసరి రాలేదు. మెనోపాజ్ అనుకున్నాను. రెండు రోజుల కిందటే మళ్లీ బ్లీడింగ్ మొదలైంది. బాగా ఎక్కువగా బ్లీడింగ్ అవుతోంది. కడుపులో బాగా నొప్పిగా ఉంటోంది. కాళ్లు, చేతులు తిమ్మిర్లుగా అనిపిస్తున్నాయి. నా సమస్యకు పరిష్కారం సూచించగలరు. - జగదాంబ, అనకాపల్లి మధ్యవయసు దాటిన తర్వాత సాధారణంగా పీరియడ్స్ సంవత్సరం పాటు రాకపోతే దానిని మెనోపాజ్‌గా పరిగణిస్తాము. కొందరిలో మెనోపాజ్ వచ్చే మూడు, నాలుగు సంవత్సరాలు ఇంకా ముందు నుంచి కూడా శరీరంలో హార్మోన్లలో మార్పులు జరుగుతుంటాయి. వాటి అసమతుల్యత వల్ల పీరియడ్స్ సక్రమంగా రాకుండా, బ్లీడింగ్‌లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. ఈ వయసులో ఇది మామూలే కదా అని నిర్లక్ష్యం చెయ్య కూడదు. ఎందుకంటే ఈ వయసులో గర్భాశయంలో, అండాశయంలో కంతులు, సిస్ట్లు, క్యాన్సర్లు ఇంకా ఇతర సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో మూడు నెలల నుంచి బ్లీడింగ్ అవ్వకుండా, ఇప్పుడు ఎక్కువగా అవ్వడం వల్ల రక్తహీనత ఏర్పడి నీరసంగా ఉండడం, కాళ్ళనొప్పులు, తిమ్మిర్లు వంటివి ఉండి ఉండవచ్చు. అలాగే మూడు నెలల నుంచి బ్లీడింగ్ కానప్పుడు కొందరిలో ఎండోమెట్రియం పొర మందంగా ఏర్పడి, అతి తర్వాత బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చేటప్పుడు కొందరిలో పొత్తికడుపు, నడుం నొప్పి వస్తుంది. కాబట్టి మీరు అశ్రద్ధ చెయ్యకుండా గైనకాలజిస్ట్‌ను సంప్రదించి బ్లీడింగ్ తగ్గడానికి మందులు వాడుకుంటూ, ఈ సమస్యకు గల కారణాన్ని తెలుసుకొని దానికి తగ్గ చికిత్స తీసుకోవడం మంచిది. దీనికోసం కంప్లీట్ బ్లడ్‌కౌంట్, థైరాయిడ్ ప్రొలాక్టిన్ వంటి హార్మోన్ పరీక్షలు, అల్ట్రాసౌండ్, పాప్‌స్మియర్ వంటివి చేయించుకుంటే మంచిది. వీటిలో ఏ సమస్యా లేకపోతే మెనోపాజ్ ముందు వచ్చే మార్పులుగా అనుకుని, భయపడాల్సిన అవసరం లేదు. బ్లీడింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు అది తగ్గడానికి మందులు వాడుకుంటూ, రక్తహీనత ఉంటే సరైన పోషకాహారంతో పాటు ఐరన్‌మాత్రలు, విటమిన్స్, కాల్షియం మందులు వాడటం మంచిది. మీ ఎత్తుకి 55 కేజీల వరకు బరువు ఉండవచ్చు. మీరు 10 కేజీల అధిక బరువు ఉన్నారు. అధిక బరువు ఉన్నప్పుడు కూడా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి పీరియడ్స్ సక్రమంగా రావు. కాబట్టి బ్లీడింగ్ అరికట్టడానికి మందులు వాడుకుంటూ, బరువు తగ్గడానికి వాకింగ్, వ్యాయామాలు, పరిమితమైన పౌష్టికాహారం తీసుకోవడం మంచిది. -
ఎన్ని రోజులు ఇలా..?
మా కూతురు వయసు 17 సంవత్సరాలు. తనకు మెచ్యూర్ అయిన దగ్గరి నుంచి పీరియడ్స్ సక్రమంగా రావట్లేదు. డాక్టర్‌ను కలిస్తే టెస్టులు అన్నీ చేశారు. తనకు థైరాయిడ్ ఉందని, అలాగే పీసీఓ కూడా వచ్చిందని చెప్పారు. అప్పటి నుంచి ట్యాబ్లెట్స్ వాడుతూనే ఉంది. ఇంకా ఎన్ని రోజులకు ఈ సమస్య తగ్గుతుంది? అలాగే థైరాయిడ్ గురించి వాడుతున్న మందులు కూడా ఇంకా ఎన్ని రోజులు వేసుకోవాలి? - సుమలత, ఖమ్మం మీ పాప ఎత్తు, బరువు రాయలేదు. ఒక వేళ బరువు ఎక్కువగా ఉంటే బరువు తగ్గించడానికి ప్రయత్నించాలి. థైరాయిడ్ సమస్య ఉంటే, చాలా మందిలో ఎప్పటికీ థైరాయిడ్ మందులు వాడవలసి ఉంటుంది. చాలా కొంత మందిలో మటుకే, థైరాయిడ్ తక్కువ తీవ్రతలో ఉంటే, బరువు తగ్గి, మందులు సక్రమంగా వాడుతూ ఉంటే కొంతకాలానికి థైరాయిడ్ నియంత్రణలోకి వస్తుంది. పిసిఓ అంటే అండాశయంలో నీటిబుడగలు ఉండడం. వీటివల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, అవాంఛిత రోమాలు, మొటిమలు వంటి సమస్యలు ఏర్పడతాయి. వీటికి జీవనశైలిలో మార్పులు వ్యాయామాలు చెయ్యడంతో పాటు మందులు దీర్ఘకాలం వాడవలసి ఉంటుంది. చికిత్సలో నీటిబుడగలు మొత్తంగా తగ్గిపోవు కాని, అవి ఇంకా పెరగకుండా హార్మోన్ల అసమతుల్యత కొద్దిగా తగ్గి లక్షణాలు చాలావరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. నా వయసు 26 ఏళ్లు. పదిహేను రోజుల క్రితం సిజేరియన్ ద్వారా ఓ పాపకు జన్మనిచ్చాను. పాప చాలా ఆరోగ్యంగా మూడు కిలోల బరువుతో పుట్టింది. నేను మొదటి నుంచీ నార్మల్ డెలివరీ కావాలని కోరుకున్నాను. కానీ డెలివరీ సమయంలో డాక్టర్లు నాకు నార్మల్ కాదని చెప్పారు. ఏదో పొర అడ్డంగా ఉందని, పాప తిరగలేదని చెప్పారు. మళ్లీ ప్రెగ్నెంట్ అయినా సిజేరియన్ అవుతుందన్నారు. అసలు ఆ పొర ఎందుకు ఏర్పడుతుందో చెప్పండి ప్లీజ్. - స్వాతి, వరంగల్ పొర అనేది ఎక్కడ ఉందో సరిగా వివరించలేదు. నాకు అర్థం అయినంతవరకు కొందరిలో గర్భాశయం లోపలి భాగంలో యుటరైన్ సెప్టమ్ అనే పొర గర్భాశయంపై దాన్ని రెండుగా చీల్చినట్లు చేస్తుంది. దానివల్ల గర్భాశయంలో పెరిగే శిశువుకి తిరగడానికి సరిగా అనువుగా స్థలం లేకపోవడం వల్ల, శిశువు కాన్పు సమయానికి అడ్డంగా ఉండటం, లేక ఎదురుకాళ్ళతో ఉండటం జరుగుతుంది. బిడ్డ సరైన పొజిషన్లోకి తిరగకపోవడం వల్ల, సాధారణ కాన్పు జరగడానికి శిశువుకి ఇబ్బంది అవుతుంది కాబట్టి సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయవలసి ఉంటుంది. కొందరిలో యోనిభాగంలో వెజైనల్ సెప్టెమ్ అనే పొర ఉండి కాన్పుకి అది అడ్డుపడడం వల్ల కూడా బిడ్డ యోని నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడవచ్చు అనిపిస్తే కూడా కొన్ని సందర్భాలలో ఆపరేషన్ చెయ్యవలసి ఉంటుంది. పొర బాగా మందంగా ఉన్నప్పుడు మరలా కూడా బిడ్డకు ఇదే ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి మరలా ఆపరేషన్ అవసరం పడుతుంది. నాకు 31 సంవత్సరాలు. పీరియడ్స్ మొదటి నుంచీ నాకు సక్రమంగానే వస్తాయి. ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలూ రాలేవు. కానీ ఈ మధ్య సమస్యగా ఉండి డాక్టర్‌ను సంప్రదించాను. దాంతో నాకు ఈస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిందన్నారు. అసలు ఈ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది. అలాగే ఈస్ట్ ఇన్ఫెక్షన్కు బ్యాక్టీరియల్ వ్యాజినోసిస్కు తేడా ఏంటి? - ఓ సోదరి ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది క్యాండిడా అనే ఫంగస్ వల్ల సంక్రమిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్లో వైట్‌డిశ్చార్జి, తెల్లగా పెరుగులాగా, చిన్నచిన్న ముక్కలుగా ఉంటుంది. యోనిలో మంట, దురద, ఎర్రగా మారటం వంటి లక్షణాలు ఏర్పడతాయి. దీనికి చికిత్సగా యాంటి ఫంగల్ మందులు, క్రీములు, పౌడర్ వాడవలసి ఉంటుంది. వెజైనాలో (యోనిలో) ఉండే ్చఛిౌ్టఛ్చఛిజ్ఛీ అనే మంచి బ్యాక్టీరియా కొన్ని కారణాల వల్ల తగ్గిపోయి కొన్ని రకాల చెడ్డ బ్యాక్టీరియా వ్యాపించడం వల్ల బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అనే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇందులో వైట్‌డిశ్చార్జి కొద్దిగా పచ్చగా, చెడువాసన, దురద వంటివి ఉంటాయి. దీనికి చికిత్స యాంటిబ్యాక్టీరియల్ మందులతో ఉంటుంది. రెండింటికి లక్షణాలలో, చికిత్సలో తేడా ఉంటుంది. -
ప్రాబ్లమ్ ఇద్దరిదీ!
సందేహం నా వయసు 28. నా భర్త వయసు 31. మాకు పెళ్లై ఆరేళ్ళు అవుతోంది. ఇప్పటి వరకు పిల్లలు లేరు. రెండేళ్లుగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. సంతానం కలగడానికి ప్రాబ్లమ్ మా ఇద్దరిలోనూ ఉందన్నారు డాక్టర్లు. మా వారి స్పెర్మ్ మొటిలిటీ తక్కువగా ఉందన్నారు. దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే మా సమస్య తీరుతుంది? అలాగే ప్రతిరోజూ నేను ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ కూడా వేసుకుంటున్నాను. వయసు పెరుగుతున్న కొద్దీ నాకు పిల్లలు కలుగుతారా అన్న భయం పెరుగుతోంది. దయచేసి సూచనలివ్వండి. - రమణి, హైదరాబాద్ పిల్లలు కలగకపోవడానికి ఇద్దరిలోనూ సమస్య ఉన్నప్పుడు సమస్యకు తగ్గ చికిత్స ఇద్దరు సరిగా తీసుకుంటూ ఉంటేనే, పరిష్కారం దొరుకుతుంది. మీ వారికి వీర్యకణాలు తక్కువగా ఉన్నాయన్నారు. హార్మోన్లలో అసమతుల్యత, వీర్యకణాలు బయటకు రావటంలో అడ్డంకులు, ఇన్ఫెక్షన్లు, తాగుడు, సిగరెట్, షుగర్, మానసిక ఒత్తిడి, బీజాలలో వ్యారికోసిల్ వంటి ఎన్నో సమస్యల వల్ల వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండవచ్చు. సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి హార్మోన్ పరీక్షలు, రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ వంటి పరీక్షలు చేయించుకుని, దానికి తగ్గ మందులు కనీసం మూడు నెలలు అయినా వాడి చూడవచ్చు. మందులతో పాటు పరిమితమైన పౌష్టికాహారం, వ్యాయామాలు, యోగా, ధ్యానం వంటివి పాటించడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. మీకు ఉన్న సమస్య ఏమిటో వివరించలేదు. మీకు నెలనెలా పీరియడ్స్ సమక్రమంగా వస్తున్నాయా, అండం సరిగా విడుదల అవుతుందా లేదా? గర్భాశయంలో, అండాశయంలో సమస్య ఏమన్నా ఉందా అనే దాని బట్టి చికిత్స తీసుకోవలసి ఉంటుంది. సమస్యకు తగ్గ చికిత్స తీసుకోకుండా కేవలం ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసుకోవడం వల్ల ప్రయోజనం పెద్దగా ఉండదు. మీరు ఆందోళన చెందకుండా, ఇద్దరూ మరోసారి డాక్టర్ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం మంచిది. నా వయసు 36 ఏళ్లు. నాకిద్దరు పిల్లలు. రెండూ నార్మల్ డెలివరీలే. పీరియడ్స్ అప్పుడు కానీ డెలివరీ సమయాల్లో కానీ ఎలాంటి సమస్యలూ రాలేదు. కానీ రెండు నెలలుగా పీరియడ్స్ సమయంలో అంటే... బ్లీడింగ్ అయిపోయిన రెండూ మూడు రోజుల్లో నా మానసిక పరిస్థితి ఏమీ బాగుండటం లేదు. దేనికి ఎలా రియాక్ట్ అవుతున్నానో నాకే అర్థం కావడం లేదు. ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ‘పీఎంఎస్’ అని చూపిస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. అలాగే పీఎంఎస్ అంటే ఏమిటి? - పుష్ప, కర్నూలు ఇది పీరియడ్స్ మొదలయ్యే 10-15 రోజులు ముందు నుంచి కొందరిలో హార్మోన్లలో జరిగే మార్పుల వల్ల, మినరల్స్‌లో లోపాల వల్ల ఏర్పడుతుంది. ఇందులో వృక్షోజాలలో వాపుగా, నొప్పిగా, బరువుగా ఉండడం, ఒంట్లో నీరుచేరి బరువుగా, ఒళ్ళునొప్పులు, మానసిక మార్పులు, కోపం, చిరాకు, డిప్రెషన్ వంటి అనేక రకాల లక్షణాలు... ఒక్కొక్కరిలో ఒక్కోలాగ ఏర్పడుతుంటాయి. దీనికి చికిత్సలో భాగంగా, విటమిన్స్, మినరల్స్, ప్రైమ్రోజ్ ఆయిల్ కలిగిన మందులు దీర్ఘకాలం వాడవలసి ఉంటుంది. మందులతో పాటు, ఆ సమయంలో ఉప్పు, కాఫీలు వంటివి తక్కువ తీసుకుంటూ, యోగా, ధ్యానం, వ్యాయామాలు, క్రమంగా చెయ్యడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. ఒకసారి డాక్టర్ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం మంచిది. లేకపోతే మానసిక సమస్య పెరిగేకొద్దీ కుటుంబంలో కలహాలు, మనస్పర్థలు వంటి ఇతరత్రా సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్ మోతీనగర్, హైదరాబాద్ -
నేరెడ్‌మెట్‌లో మహిళ హల్చల్
ఇద్దరు చిన్నారులను నీటి సంపులో పడేసేందుకు యత్నించిన మహిళను స్థానికులు అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన నగరంలోని నేరెడ్మెట్ రమాబ్రహ్మంనగర్లో శుక్రవారం వెలుగుచూసింది. ఈ ప్రాంతంలో నివాసముంటున్న సౌజన్య గత కొంత కాలంగా ఉన్మాదిలా మారి తనను తాను గాయపర్చుకోవడం లేదా.. ఎవరిపైనైనా దాడి చేయడం లాంటి చర్యలకు పాల్పడుతోంది. ఈ క్రమంలో ఈ రోజు ఇద్దరు చిన్నారులను సంపులో వేయడానికి యత్నించింది. దీన్ని అడ్డుకునేందుకు చూసిన చిన్నారుల తల్లిపై కారం చల్లి ఆమెను గాయపరిచింది. గత కొన్నెళ్లుగా ఈమె బారిన పడిన స్థానికులు సౌజన్యపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. అందర్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా.. తనను హింసిస్తున్నారని తిరిగి కాలనీ వాసులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తోందని.. రోజురోజుకు సౌజన్య ఆగడాలు మితిమీరిపోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులను చుట్టుముట్టిన స్థానికులు ఆ మహిళ నుంచి రక్షణ కల్పించాలని మొర పెట్టుకుంటున్నారు.