ఇప్పుడు సమాజం ఎన్నడూ లేనంత భయాందోళనల మధ్య కొట్టుమిట్టాడుతోందని, ఆప్యాయత, అవగాహన నిండిన మాటలతో దాన్ని పోగొట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు కవితా నటరాజన్. కరోనా కల్లోలం నేపథ్యంలో సమాజంలో విజృంభిస్తున్న పలు రకాల మానసిక సమస్యలకు ఆమె తన వంతు పరిష్కారాలను స్వచ్ఛందంగా అందిస్తున్నారు.
గత ఏడాది తెలంగాణలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటైన సైకోసోషల్ కౌన్సిలింగ్ సర్వీసెస్‌లో భాగంగా ఆమె కౌన్సిలింగ్ సేవలు కొనసాగిస్తున్నారు. ఐటీ ఉద్యోగినిగా పనిచేస్తూనే మరోవైపు తనకు ఇష్టమైన సోషల్ సర్వీస్‌నూ వదలకుండా కృషి చేస్తున్న కవితానటరాజన్ తన అనుభవాలను పంచుకున్నారిలా...
కిందటేడాది కరోన..
‘‘కార్పొరేట్ రంగంలో ఉన్నా, ప్రస్తుతం సిజిఐ అనే ఐటి కంపెనీలో పనిచేస్తున్నా. చిన్ననాటి నుంచీ స్వచ్ఛంద సేవ అంటే ఇష్టం. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఎన్నడూ ఎరగనంత విచిత్రమైన పరిస్థితులున్నాయి. లాక్డవున్ అనే మాట అంతకుముందు మనలో ఎవరమూ కనీ విననిది. ఆకలి కేకలు విని చాలా బాధపడ్డా. అయితే బయటకు వెళ్లి ఫుడ్ ప్యాకెట్స్ పంచాలి వంటి ఆలోచనలు వచ్చినా, నా వ్యక్తిగత ఇమ్యూన్ సిస్టమ్ గురించి తెలుసు కాబట్టి అలా చేయలేకపోయా.
అదే సమయంలో ఎన్నడూ లేనట్టు కొన్ని నెలల పాటు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితుల వల్ల చుట్టుపక్కల పలువురిలో విభిన్న రకాల మానసిక సమస్యలను గుర్తించాను. అప్పటికే సైకాలజీలో డిగ్రీ చేశాను కాబట్టి.. స్వచ్ఛందంగా సైకలాజికల్ కౌన్సిలింగ్ ఎందుకు ఇవ్వకూడదు? అనిపించింది. ఆ ఆలోచనను పోలీసు ఉన్నతాధికారి మహేష్ భగవత్ గారితో పంచుకుని, వారి సూచనల మేరకు రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో మేం గత ఏడాది ఏప్రిల్ 2 న కౌన్సిలింగ్ సేవలు ప్రారంభించాం. ఉదయం 9గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ వచ్చిన కాల్స్ ఇంకా గుర్తున్నాయి.
లాక్ డౌన్ వల్ల పెరిగిన పనిభారంతో ఇళ్లలో మహిళలు చాలా ఇబ్బందులు పడ్డారు. వర్క్ డివిజన్ తెలియక చాలా మానసికంగా ఒత్తిళ్లకు లోనయ్యారు. మహిళలపై గృహహింసకు సంబంధించిన కాల్స్ కూడా విపరీతంగా వచ్చాయి. వీరందరికీ కౌన్సిలింగ్ ఇస్తూ అలా... మూడు నెలల పాటు పని చేశాం. కోవిడ్ తగ్గటంతో ఆ కాల్స్ తగ్గిపోయాయి. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయినప్పుడు మానసిక సంఘర్షణకు లోనైన యువత నుంచి పెద్ద సంఖ్యలో కాల్స్ వచ్చాయి.
సెకండ్‌వేవ్ బాధితులు
మరోసారి కోవిడ్ తన ప్రతాపం చూపిస్తున్న పరిస్థితుల్లో భావోద్వేగాలు మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే మరోసారి ఈ కౌన్సిలింగ్ సేవలు ప్రారంభించాం. గతం తో పోలిస్తే ఇప్పుడు మరింత విభిన్నమైన మానసిక సమస్యలతో సంప్రదిస్తున్నారు. వీరిలో తమ వారిని పోగొట్టుకున్న మహిళల మానసిక పరిస్థితి దయనీయంగా ఉంది. అలాగే దగ్గర బంధువుల్లో చావులు ఈసారి చాలామంది మనోధైర్యాన్ని పోగొడుతున్నాయి. తాజాగా బ్లాక్ ఫంగస్ గురించి కూడా కాల్స్ వస్తున్నాయంటే... ఇప్పుడు భయం ఎంతగా జనాల్లో పేరుకుపోయిందో అర్థమవుతుంది. మా వంతుగా వారిలో ధైర్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈసారి నాతోపాటు బాగా అనుభవం ఉన్న మరో 13 మంది మహిళ కౌన్సిలర్లు తమ సేవలు అందిస్తున్నారు.
పోలీసుకూ మహిళకూ మధ్య
గతంలో కూడా ఈ తరహా కౌన్సిలింగ్ చేసిన అనుభవం ఉంది. ‘మార్గదర్శక్’ పేరుతో మా లాంటి కొందరు స్వచ్ఛంద సేవకులకు గృహహింస, వేధింపులు.. వంటి వాటి విషయంలో చట్టబద్ధమైన అంశాలపై పోలీసు శాఖ ఆధ్వర్యం లో శిక్షణ అందించారు. అలాగే మన సమాజంలో కొందరు మహిళలకు పోలీస్ స్టేషన్ అన్నా, పోలీసులన్నా భయం ఉండొచ్చు. ముందు వారిని మానసికంగా ధైర్యం పుంజుకునేలా చేసి, వారి సమస్య నిర్భయంగా చెప్పగలిగేలా ప్రిపేర్ చేస్తాం, షీ టీమ్‌కు అనుసంధానంగా పనిచేస్తాం’’ అని వివరించారు కవిత.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment