nirmala reddy
-
సముద్రమంత ఆత్మవిశ్వాసం
‘ఎగిసే అలలతో పోరాటం.. అమ్మాయిలకు సాధ్యమయ్యే పనేనా’ అనే చిన్నపాటి ఆలోచనలను కూడా దరిచేరనివ్వడం లేదు నవతరం. ఆకాశమే హద్దుగా నీటి మీదనే తమ కలలను సాకారం చేసుకుంటున్నారు. క్లిష్టమైన సెయిలింగ్ క్రీడా పోటీలలో తమ సత్తా చాటుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. హైదరాబాద్ వాసులైన ఈ యువ సెయిలర్ల సాహసం ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తుంది.హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉండే పూతన మాన్య రెడ్డి మొదట స్కూల్ స్థాయిలో స్విమ్మింగ్ నేర్చుకుంది. స్విమ్మింగ్ పోటీలో పాల్గొంటూ సెయిలింగ్‌పై ఆసక్తి కలిగి, శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. సెయిలింగ్‌కి అనుకూలమైన వాతావరణం కోసం గోవా, మైసూర్..లలో ప్రాక్టీస్ చేసింది. సీనియర్లు ఉపయోగించే బోటుకు మారి, జాతీయ స్థాయిలో ఇప్పటికే 5 పతకాలు సొంతం చేసుకుంది. షిల్లాంగ్ నేషనల్ ర్యాంకింగ్ రెగెట్టా, తెలంగాణ జాతీయ జూనియర్ రెగెట్టాలోనూ కాంస్యాలను సాధించింది. థాయ్‌లాండ్, పోర్చుగల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్ నుంచిప్రాతినిధ్యం వహించింది. ఇటీవల మలేషియాలోని లంకాగ్వి అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలో పాల్గొని, బంగారు పతకాన్ని సాధించింది.సాహసాలు చేసే శక్తిని ఇస్తుంది ఈ క్రీడల్లో పాల్గొనడానికి చాలా శక్తి కావాలని, ఆరోగ్యసమస్యలు వస్తాయని, ఆడపిల్లలకు సరైనది కాదని చాలామంది నిరాశ పరిచారు. కానీ, సెయిలింగ్ ఎంత ఉత్సాహవంతమైన క్రీడనో, సాహసాన్ని ప్రదర్శించడమే కాదు సముద్రమంత ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తుందని తెలిసింది. అంతేకాదు భవిష్యత్తు ఎంతో ఉత్తమంగా మార్చుకునే అవకాశాలనూ ఇస్తుంది. ఒలింపిక్స్ సెయిలింగ్ పోటీలో పాల్గొని పతకాలని సాధించేందుకు కృషి చేస్తున్నాను. ట్రైనింగ్, పోటీలు.. అంటూ నీళ్లతోనే మా సావాసం కాబట్టి అందుకు తగిన వ్యాయామం, సమతుల ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకుంటాను. లెవన్త్ గ్రేడ్ చదువుతున్నాను. వాయిలెన్ మరో ఇష్టమైన హాబీ, స్కూల్ ఎన్జీవోలో యాక్టివ్ మెంబర్ని.– పూతన మాన్యరెడ్డినీళ్లు చూస్తే భయం వేసిందినాలుగేళ్ల క్రితం మా స్కూల్లో ‘సెయిలింగ్‌లో శిక్షణ ఇస్తున్నార’ని చెబితే, ఆసక్తితో నా పేరు ఇచ్చాను. మొదట నీళ్లను చూస్తే భయం వేసింది. కానీ, ఒక్కసారి నీటిలో ప్రయాణించాక, మరోసారి పాల్గొనేలా ఆసక్తి కలిగింది. సెయిలింగ్ ఖర్చుతో కూడుకున్న క్రీడ. యాట్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మాకు సపోర్ట్ చేస్తోంది. మా అమ్మ వంటలు చేస్తూ మమ్మల్ని చదివిస్తోంది. మా చదువుకు క్రీడలు కూడా తోడయితే మరిన్ని విజయాలు సాధించవచ్చు.. అని తెలుసుకున్నాం. అందుకే ధైర్యంగా నీటి అలలపై మమ్మల్ని మేం నిరూపించుకుంటున్నాం.– కొమరవెల్లి దీక్షితఅక్కను చూసి...అక్కను చూసి నేనూ సెయిలింగ్ స్పోర్ట్స్‌లోకి వచ్చేశాను. అండర్–15 కేటగిరీలో పాల్గొంటున్నాను. మలేషియాలో జరిగిన సెయిలింగ్ పోటీలో వివిధ దేశాల నుంచి వచ్చిన 102 మంది సెయిలర్స్ పాల్గొన్నారు. ఒమన్‌లో జరిగిన పోటీలో రజత పతకం సాధించాను. – కొమరవెల్లి లహరిభారత్తో పాటు సౌత్కొరియాలలో జరిగిన అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలో పాల్గొని స్వర్ణ, ర జిత పతకాలు సాధించిన ఈ అక్కాచెల్లెళ్లకు హైదరాబాద్‌లోని సెయిలింగ్ యాట్ క్లబ్ మద్దతునిస్తోంది.హైదరాబాద్ ఈస్ట్మారేడ్పల్లిలో ఉంటున్న ప్రీతి కొంగర ఓపెన్ డిగ్రీ చేస్తూ సీనియర్ సెయిలింగ్ స్పోర్ట్స్‌లో సంచనాలు సృష్టిస్తోంది. చైనాలో జరిగిన ఏషియన్ క్రీడలో పాల్గొంది. హైదరాబాద్, ముంబైలలో జరిగిన నేషనల్ ఛాంపియన్‌షిప్‌లలో రజత, స్వర్ణ పతకాలు సాధించింది.పేదరికం అడ్డుకాదు‘11 ఏళ్ల వయసులో సెయిలింగ్‌లోకి అడుగుపెట్టాను. సెయిలింగ్ అనేది చాలా ఓర్పుతో కూడుకున్న క్రీడ. దీనికి ఫిట్నెస్ చాలా అవసరం. ట్రైనింగ్‌లో భాగంగా రోజూ 4–5 గంటలుప్రాక్టీస్ చేస్తాను. ఈ క్రీడలో అబ్బాయిలు ఎంత కష్టపడాలో, అమ్మాయిలూ అంత కష్టపడాల్సిందే. అన్ని స్పోర్ట్స్ కన్నా ఇది చాలా భిన్నమైంది. సవాల్‌తో కూడుకున్నది. అందుకే సెయిలింగ్ని ఎంచుకున్నాను. ఏప్రిల్‌లో జరగబోయే ఒలింపిక్ సెయిలింగ్‌లో పాల్గొనడానికి శిక్షణ తీసుకుంటున్నాను.– ప్రీతి కొంగర– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Pratima Raparthi: ధోతీ కట్టు.. మూడు రంగుల్లో ముగ్గు!
హస్త కళలపై ఇష్టంతో చిత్రలేఖనం, బ్లాక్ప్రింటింగ్ నేర్చుకుంది. చదివింది ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్. చేనేతకారులకు అండగా ఉండాలని చర్ఖా సంస్థను ప్రారంభిం చింది. మువ్వన్నెల జెండా రంగులు... మధ్యన మన సంస్కృతికి చిహ్నమైన ముగ్గును చిత్రించి, చేనేత వస్త్రంతో కండువాను డిజైన్ చేసింది. పేటెంట్ హక్కునూ పొందింది. తన హ్యాండ్లూమ్ చీరలను ధోతీ కట్టులా డిజైన్ చేసి, వాటినే తన రోజువారీ డ్రెస్‌గా మార్చుకుంది. సికింద్రాబాద్ మారేడుపల్లిలో ఉంటున్న ప్రతిమ రాపర్తి తన వార్డ్రోబ్ను సరికొత్తగా మార్చుకుంది.‘ప్రపంచానికి కాటన్ దుస్తులను మన దేశమే పరిచయం చేసింది. మనదైన సంస్కృతిని మనమే పరిచయం చేసుకోవాలి. అలాగే మనల్ని అందరూ గుర్తించాలి. ఈ ఆలోచనే చేనేతలకు దగ్గరగా ఉండేలా చేసింది. 2018లో ‘చర్ఖా’ పేరుతో చేనేతలకు మద్దతుగా నిలవాలని సంస్థను ప్రారంభించాను.ట్రై కలర్స్‌లో ముగ్గు..స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ట్రై కలర్స్ డ్రెస్ ధరించి వెళ్లడానికి చాలా కష్టపడేదాన్ని. ఆరెంజ్, బ్లూ, గ్రీన్ కలర్స్ ఉండేలా డ్రెస్సింగ్ చేసుకునేదాన్ని. అలా కాకుండా ఆ రోజుకి ఏదైనా ప్రత్యేకమైన యునిఫామ్ ఉంటే బాగుంటుంది అనుకున్నాను. చేనేత క్లాత్‌ను ఎంపిక చేసుకొని, అంచుగా వాటికి నేచురల్ కలర్స్‌ని జత చేశాను. మూడు రంగుల మధ్యలో ఉండే ధర్మచక్ర మన అడ్మినిస్ట్రేషన్‌కి, విజ్డమ్కి ప్రతీక. ధర్మచక్రను మన డ్రెస్సుల్లో వాడకూడదని, దాని బదులుగా ముగ్గు డిజైన్ చేశాను. ముగ్గు అనేది మన సంస్కృతికి, స్త్రీల కళా హృదయానికి ప్రతీక.25 చుక్కలు..మధ్య చుక్క ఈ డ్రెస్ ఎవరు ధరిస్తారో వారికి ప్రతీక. మిగతా 24 చుక్కలు మన పూర్వీకులు, కాలానికి ప్రతీకగా అనుకోవచ్చు. అలాగే, ఆ చుక్కలన్నీ కలుపుతూ వెళితే మన సమాజ వృద్ధికి, రాబోయే తరానికి సూచికగానూ ఉంటాయి. ఈ డిజైన్ని కండువా, శారీ, ధోతీ, ఘాఘ్రా చోళీకి తీసుకున్నాను. దీనికి పేటెంట్ రైట్ కూడా తీసుకున్నాను. ఈ డిజైన్ కండువాను ఎవరైనా ధరించవచ్చు.చేనేత చీరలతో ధోతీ కట్టు..నా దగ్గర ఎక్కువగా ఉన్న హ్యాండ్లూమ్ చీరలని ప్రత్యేక కట్టుగా మార్చుకోవాలనుకున్నాను. సౌకర్యంగా ఉండేలా చీరలను ధోతీగా కన్వర్ట్ చేసుకున్నాను. సెల్, మనీ, కార్డ్స్ పెట్టుకోవడానికి ఈ ధోతీకి పాకెట్స్ కూడా ఉంటాయి. పూర్వం రోజుల్లో గోచీకట్టు చీరలను వాడేవారు. ఆ డిజైన్ ప్రతిఫలించేలా నాకు నేను కొత్తగా డిజైన్ చేసుకున్న డ్రెస్సులివి. టూర్లకు, బయటకు ఎక్కడకు వెళ్లినా ఇలాంటి డ్రెస్‌తోనే వెళతాను. నాకు నేను ప్రత్యేకంగా ఉండాలనుకుంటాను. వీవర్స్, టైలర్స్, బ్లాక్‌ప్రింట్, హ్యాండ్‌క్రాఫ్ట్స్ వారితో కలిసి వర్క్ చేస్తాను. ఇకో ఫ్రెండ్లీ హ్యాండీ క్రాఫ్ట్, టైలరింగ్, పెయింటింగ్... వంటివి గృహిణులకు నేర్పిస్తుంటాను’’ అని వివరించారు ప్రతిమ. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
మంచి ఫిటింగ్, డిజైన్, ప్రింట్లతో.. ఈ తరం మెచ్చేలా డ్రెస్ డిజైనింగ్..
ఇంటి పనులతోనే రోజంతా గడిచిపోతుంటుంది. అభిరుచిని మెరుగుపరుచుకోవాలన్నా సమయమే సరిపోదనిపిస్తుంది. కానీ, కొందరు మాత్రమే ఉన్న కాస్త సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమతోపాటు మరికొందరికి ఉపాధి అవకాశాలను అందిస్తుంటారు. ఈ కోవకే చెందుతారు సవిత ఆలంపల్లి. తెలంగాణలోని జహీరాబాద్ వాసి అయిన సవిత కాటన్ ఫ్యాబ్రిక్‌పైన సహజసిద్ధమైన పువ్వులు, ఆకులతో సహజమైన ప్రింట్లను తీసుకువస్తుంది. అదే ఫ్యాబ్రిక్‌ని ఉపయోగిస్తూ మోడ్రన్ డ్రెస్సులను డిజైన్ చేస్తోంది. వర్క్‌షాప్స్ నిర్వహిస్తూ, బెంగళూరులో స్టూడియో ఏర్పాటు చేసి, సెల్ఫ్ మేడ్ బిజినెస్ ఉమన్‌గా తనని తాను నిరూపించుకుంటుంది. ఆసక్తిని ఉపాధిగా మలుచుకునేందుకు చేసిన ప్రయాణంలో తాను వేసిన అడుగుల గురించి ఆనందంగా వివరించింది.‘‘డిగ్రీ వరకు చదువుకున్న నేను పెళ్లయ్యాక మావారు రామకృష్ణతో కలిసి అమెరికాకు వెళ్లాను. గృహిణిగానే కొన్నాళ్లు ఉండిపోయాను. న్యూయార్క్ ఎఫ్ఐటిలో ఫ్యాషన్ డిజైనింగ్‌కి సంబంధించిన కోర్స్ చేశాను. పదేళ్ల క్రితం ఇండియా వచ్చి బెంగళూరులో స్థిరపడ్డాం. రోజంతా ఇంటిపనులు, పిల్లల పనులు ఉన్నా నా కోసం కొంత సమయాన్ని కేటాయించుకునేదాన్ని.ఫాస్ట్ ఫ్యాషన్‌లో ఉపయోగించే ఫ్యాబ్రిక్ తీవ్రమైన కాలుష్యానికి గురి చేస్తుందని తెలుసుకున్నాను. అప్పటినుంచి నా వంతుగా ఏదైనా చేయాలనుకుని ప్రయత్నాలు చేస్తుండేదాన్ని. ఫ్లోర్ క్లీనర్స్, సుగంధ ద్రవ్యాలు వంటివి ఇంట్లో తయారు చేస్తుండేదాన్ని. వాటివల్ల ఇంట్లో వాళ్లు కూడా చాలా మెచ్చుకునేవారు. ఎకో ప్రింటింగ్, సస్టెయిన్‌బుల్ ఫ్యాబ్రిక్స్ పైన వర్క్ చేయడం మొదలుపెట్టాను. ప్రకృతి ద్వారా లభించే వస్తువులతో రోజూ ఏదో ఒక ప్రయోగం చేస్తుండేదాన్ని. ఆకులు – పువ్వులు..పూజలు, ఇతర సంప్రదాయ వేడుకలలో పువ్వులు, ఆకులను కూడా ఉపయోగిస్తుంటాం. సాధారణంగా వాటిని ఉడకబెట్టి, టై అండ్ డై చేస్తుంటారు. నేను వాటిని ఎండబెట్టి, కొన్నింటిని తాజాగా ఉన్నప్పుడే ఫ్యాబ్రిక్ మీద చల్లి, దగ్గరగా చుట్టి, కొన్ని రోజులు అలాగే ఉంచి ప్రయోగాలు చేసేదాన్ని. ప్రయత్నాలు చేయగా చేయగా ఫ్యాబ్రిక్‌పైన రకరకాల డిజైన్స్ అమితంగా నన్ను ఆకట్టుకున్నాయి. మోదుగ, శంఖపుష్ప, పారిజాత.. వంటివే కాదు అరుదుగా పూసే పువ్వులనూ సేకరిస్తాను. వాటిని ఎండబెట్టి నిల్వ ఉంచుతాను. మామిడి, జామ, మందార ఆకులనూ డిజైన్‌కు వాడుతుంటాను. ఏ మాత్రం రసాయనాలు లేని ప్రయోగం ఇది.ఇంటి నుంచి స్టూడియో వరకు..రసాయనాలతో పండించే పత్తి కాకుండా వర్షాధార పంటద్వారా వచ్చే కాటన్ ఫ్యాబ్రిక్‌ను కలెక్ట్ చేసి, నా ప్రయత్నాలను ఇంకా విరివిగా చేయడం మొదలుపెట్టాను. సస్టెయిన్‌బుల్ డ్రెస్సులు అంటే చాలావరకు వదులుగా ఉండే దుస్తులు అనుకుంటారు. కానీ, మంచి ఫిటింగ్, డిజైన్, ప్రింట్లతో ఈ తరం మెచ్చేలా డ్రెస్ డిజైనింగ్ చేయాలనుకున్నాను.కార్పొరేట్ ఉమెన్‌కు నప్పే విధంగా, అలాగే టీనేజ్ కలెక్షన్స్ కూడా ప్రిపేర్ చేస్తుంటాను. ఎకో ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్, ప్రింటింగ్.. డ్రెస్సులు ధరిస్తే ఒంటికి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. ప్రకృతికి దగ్గరగా ఉన్నామన్న అనుభూతి సొంతం అవుతుంది. ఏడెనిమిదేళ్లుగా సస్టెయినబిలిటీ మీద రకరకాల ప్రయోగాలు చేసి, ఐదేళ్ల క్రితం ‘టింక్టోరియా’ పేరుతో బెంగళూరులో స్టూడియో ఏర్పాటు చేశాను. ఆకులలో ఉండే జీవాన్ని టింక్టోరియా అంటారు.దానిని ఫ్యాబ్రిక్ మీదకు తీసుకురావాలని చేసిన ప్రయత్నం కాబట్టి అదే పేరును నా డిజైన్స్‌కు పెట్టాను. ఇంటినుంచి స్టూడియోదాకా మారేందుకు చేసిన రకరకాల ప్రయోగాల వల్ల ఇప్పుడు నాతోపాటు మరో ఐదుగురు మహిళలకు ఉపాధి అవకాశాలు లభించాయి. మేమంతా కలిసి ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌కు వచ్చిన ఆర్డర్స్ ప్రకారం పని చేస్తుంటాం.అవగాహనకు వర్క్‌షాప్స్..ఎకోప్రింటింగ్ పట్ల ప్రజలలో అవగాహన కల్పించడానికి హైదరాబాద్, బెంగళూరు ఇతర క్రాఫ్ట్ ఎగ్జిబిషన్స్లలో ఉచితంగా వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాను. స్టాల్స్ ఏర్పాటు చేస్తుంటాను. అక్కడి వచ్చి, ఆసక్తితో నేర్చుకుంటాను అనేవారు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి ప్రింటింగ్ ్రపాసెస్ అడుగుతుంటారు. చాలా మందికి ఆకులతోనూ, పువ్వులతోనూ డిజైన్ చేస్తారని తెలియదు. ఈ డిజైన్ ఉతికితే పోతుందేమో అనుకుంటారు. కానీ, సరైన విధంగా చేస్తే రంగు ఏ మాత్రం పోదు.ముందు కుంకుడుకాయ రసంతో ఫ్యాబ్రిక్‌ను శుభ్రం చేస్తాం. ఆ తర్వాత ఆకులను, పువ్వులను అనుకున్న డిజైన్స్‌లో అమర్చి, దగ్గరగా చుట్టి, ఆవిరిమీద ఉంచుతాం. ఆ తర్వాత బయటకు తీసి, ఒకరోజంతా అలాగే ఉంచుతాం. ఆ తర్వాత పూర్తిగా విప్పి, క్లాత్‌ని శుభ్రం చేస్తాం. సరైన డిజైన్ రావడానికి 3 నుంచి 4 రోజుల సమయం పడుతుంది. షిబోరి, టై అండ్ డై, కలంకారీ డిజైన్స్‌తోపాటు నేతకారులతో ముందే మాట్లాడి ఫ్యాబ్రిక్ డిజైన్‌లో మోటిఫ్ ప్రింట్స్ వచ్చేలా గైడెన్స్ ఇస్తుంటాను.కొన్ని రకాల ఆకులు, పువ్వుల ప్రింటింగ్‌లో థ్రెడ్ వర్క్ కూడా ఉంటుంది. ప్రకృతిపైన ప్రేమ, ఇష్టంతో నన్ను నేను కొత్తగా మార్చుకునే క్రమంలో ఎంచుకున్న మార్గం ఇది. ఇంట్లో వాడాల్సిన కెమికల్స్ స్థానంలో ఏ మాత్రం రసాయనాలు లేని వస్తువులను తయారు చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటాను. ఈ విధానం వల్ల ఐదారేళ్లలో నాదైన ఓ కొత్త ప్రపంచాన్ని నిర్మించుకున్నాను అనిపిస్తుంది’ అని ఆనందంగా వివరిస్తారు సవిత. – నిర్మలారెడ్డిఇవి చదవండి: Devika Manchandani: పాకశాస్త్ర ప్రవీణ! వంటలపై ఇష్టం ఎక్కడిదాకా వెళ్లిందంటే? -
Abhaya Foundation: పేదలకు అభయం బాలచంద్రుని ఆనంద నిలయం
పరాన్న జీవులుగా కాదు.. పరమాత్మ జీవులుగా మనమంతా ఎదగాలి’ అంటారు సుంకు బాలచంద్ర. పదిహేడేళ్లుగా సేవారంగంలో వేలాది మందికి అండగా ఉంటున్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉంటున్న యాభై ఏళ్ల బాలచంద్ర. అభయ ఆనంద నిలయం పేరుతో నిరుపేదలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఉద్యోగం చేస్తూ వచ్చిన ఆదాయాన్ని పేదలకు పంచుతూ మొదలుపెట్టిన సేవామార్గం ఇప్పుడు ఎంతో మందికి నీడనిస్తుంది. అనాథ వృద్ధులను చేరదీస్తూ, విద్యార్థుల చదువుకు అవసరాలను సమకూరుస్తూ, రోగులకు వైద్యచికిత్సను అందజేస్తూ, నిరుద్యోగుల ఉపాధికి కావల్సిన నైపుణ్యాలను అందిస్తున్నారు. స్కూల్ పిల్లలను కలుస్తూ, వారి ప్రశ్నలకు సమాధానాలను పుస్తక రూపంలో తీసుకువచ్చారు. పది వేల రూపాయలతో మొదలుపెట్టిన సేవా మార్గం నేడు ఎంత మందికి చేరవయ్యిందో తెలియజేస్తూ మనం తలుచుకుంటే సమాజంలో పేదరికం, కష్టాలు, కన్నీళ్లు లేకుండా చేయచ్చు అని వివరిస్తున్నారు. పద్దెనిమిదవ వసంతంలోకి అడుగు పెడుతున్న తన సేవా ప్రస్థానాన్ని ఇలా ముందుంచారు. ‘‘ఎనిమిదేళ్ల క్రితం ఓ రోజు నాగర్‌కర్నూలు నుంచి ఫోన్ వస్తే అక్కడకు వెళ్లాను. ఎనభై ఏళ్ల ముసలాయన బాగోగులు చూడలేక వారి పిల్లలు ఇంటి నుంచి అతన్ని రోడ్డు మీదకు తోసేస్తే కొన్ని రోజులుగా చెత్త కుప్ప వద్ద ఉన్నాడు. అతన్ని ఆశ్రమానికి తీసుకువచ్చిన ఆరునెలలకు ఆయన భార్య కూడా వచ్చింది. ఇద్దరూ ఎనిమిదేళ్లపాటు నాతోనే ఉన్నారు. నాకు కరోనా వచ్చి ఆసుపత్రిలో ఉంటే ఆవిడ బెంబేలెత్తిపోయి తన మెడలో ఉన్న మంగళసూత్రాలు, కమ్మలు ఇచ్చి ‘అమ్మి, ఆ బాబును బతికించడయ్యా’ అని వేడుకుంది. కోలుకుని వచ్చాక విషయం తెలిసి కళ్ల నీళ్లు వచ్చాయి. పన్నెండేళ్ల క్రితం పాతికేళ్లమ్మాయి రోడ్డు ప్రమాదంలో హిప్బాల్ దెబ్బతిని మంచానికి పరిమితం అయ్యింది. హైదరాబాద్ గాంధీ నగర్లో ఉండే ఆమెను గుండె నొప్పితో బాధపడే తల్లి తప్ప చూసుకునేవారు ఎవరూ లేరు. నాలుౖగైదేళ్లు ఆ అమ్మాయి బెడ్‌మీదే ఉండిపోయింది. ఆమెకు పలుమార్లు ఆపరేషన్ చేయిస్తే ఏడెనిమిదేళ్లకు కోలుకుంది. ఇప్పుడు పెళ్లి చేసుకొని కుటుంబంతో సంతోషంగా ఉంది. మా అమ్మాయి బాగా చదువుకుంటుంది. డాక్టర్ కావాలన్నది తన కల. కానీ, చదివించే స్థోమత మాకు లేదని బాధపడుతూ వచ్చారు ఒకమ్మాయి తల్లిదండ్రులు. ఆ బిడ్డ ఈ రోజు డాక్టర్ అయి పేదలకు సేవలందిస్తోంది. ఈ పదిహేడేళ్లలో ఇలాంటి కథనాలు ఎన్నో... స్వచ్ఛందంగా ఎంతో మంది కదిలివచ్చి ‘అభయ ఫౌండేషన్’తో చేయీ చేయీ కలిపారు. ఉపనయనం డబ్బులతో... పుట్టి పెరిగింది అనంతపురం జిల్లా తాడిపత్రిలో. బీఎస్సీ ఎల్ఎల్బీ చేశాను. ఇరవై నాలుగేళ్ల క్రితం నాకు ఉపనయనం చేసినప్పుడు బంధువుల ద్వారా పది వేల రూపాయలు వచ్చాయి. ఆ డబ్బుతో నలుగురికి మేలు కలిగే పని చేయాలనుకుంటున్నాను అని మా కుటుంబంలో అందరికీ చెప్పాను. అందరూ సరే అన్నాను. వారందరి మధ్యనే ‘అభయ’ అనే పేరుతో ఫౌండేషన్‌ను ఏర్పాటు చేస్తున్నాను అని, తమకు తోచిన సాయం అందిస్తూ ఉండమని కోరాను. అక్కణ్ణుంచి హైదరాబాద్ వచ్చి, ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు చేశాను. నా ఖర్చులకు పోను మిగతా జీతం డబ్బులు, బంధుమిత్రులు ఇచ్చినదానితో ఫుట్‌పాత్‌ల మీద ఉండే నిరాశ్రయులకు సాయం చేస్తూ ఉండేవాణ్ణి. నైపుణ్యాల వెలికితీత.. ఏ మనిషి అయినా ఎవ్వరి మీదా ఆధారపడకుండా బతకాలి. అందుకు తగిన నైపుణ్యం కూడా ఉండాలి. దీంతో వారాంతాలు స్కిల్ ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేస్తుండేవాడిని. చదువుకున్న రోజుల్లో నేను మా బంధువుల నుంచి పుస్తకాలు, ఫీజులు, బట్టల రూపంలో సాయం పొందాను. వారందరిలోనూ ఒక ఎఫెక్షన్ చూశాను. నాలాగే ఎంతో మంది సాయం కోసం ఎదురుచూస్తుండవచ్చు అనే ఆలోచనతో విద్యార్థుల చదువుకు ఊతంగా ఉండాలనుకున్నాను. పుట్టి పెరిగిన జిల్లాతో పాటు ఇప్పుడు దాదాపు 17 రాష్ట్రాలలో నిరుపేద విద్యార్థుల చదువుకు అండగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు రాష్ట్రాలతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో 12 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలకు శిక్షణ ఇస్తున్నాం. వీరిలో మహిళలూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. కర్ణాటక రాష్ట్రంలో నాదస్వరం స్కూల్‌ను కూడా ఏర్పాటు చేశాం. ఏ వృత్తుల వారికి ఆ వృత్తులలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారి కాళ్ల మీద వారు నిలబడేలా సాయంగా ఉంటున్నాం. సేవకు చేయూత ఒక మంచి పని చేస్తే ఎంత దూరమున్నవారినైనా ఆకట్టుకుంటుందని ఓ సంఘటన నాకు అర్థమయ్యేలా చేసింది. పదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో ఒక సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అక్కడకు 75 ఏళ్ల ఆవిడ వచ్చి ‘నేనూ మీ సేవలో పాలు పంచుకుంటాను, నెలకు 5వేల రూపాయలు ఇవ్వగలను’ అంది. ఆశ్చర్యంగా చూస్తే ‘నేను రిటైర్డ్ ప్రిన్సిపాల్‌ను. 20 వేల రూపాయల పెన్షన్ వస్తుంది. ప్రతి నెలా ఐదు వేల రూపాయలు సేవకు నా జమ’ అంది. నోటమాటరాలేదు. ఎక్కడ సేవ రూపంలో వెళితే అక్కడకు పది, వంద రూపాయలు సాయం అందించినవారున్నారు. ఇంతమందిలో మానవత్వం ఉంటే ఇక మనకు కొరతేముంది అనుకున్నాను. ఎవరికి సాయం అందిందో తిరిగి వాళ్లు ఎంతో కొంత సాయం అందిస్తూ వచ్చారు. కొంతమంది పిల్లలు తమ కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బును కూడా సాయంగా ఇచ్చారు. స్వచ్ఛందంగా ముందుకు.. నేపాల్ కరువైనా, ఉత్తరాఖండ్ వరదలైనా, ఆంధ్ర, తమిళనాడు, కేరళలలో అకాల వర్షాలు ముంచెత్తినా.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సాయం అవసరమున్నవారికి అండగా ఉంటే చాలు అన్న తపన నన్ను చాలా మందికి చేరువ చేసింది. నాతో పాటు ఎలాంటి స్టాఫ్ లేదు. ప్రత్యేకించి ఆఫీసు లేదు. అందరూ స్వచ్ఛందంగా తమ చేయూతను ఇస్తున్నారు. దీనికి నేను చేస్తున్నదల్లా సాయం చేసే చేతులను కలపడం. ఈ సేవా ప్రస్థానంలో ఇప్పుడు వేల మంది జమ కూడారు. అంతా నా కుటుంబమే! సేవ మార్గమే నా ప్రయాణం కాబట్టి, పెళ్లి, కుటుంబం వద్దనుకున్నాను. హైదరాబాద్‌లో ఒక ప్లాట్ ఉంది. ఇటీవల ఆ ఇంటిని అభయ ఫౌండేషన్‌కు ఇచ్చేశాను. ఆరేళ్ల క్రితం ఇబ్రహీంపట్నంలో వృద్ధులకు, వైద్య సాయం అవసరమైన పేదలకు అభయ ఆనంద నిలయం ఏర్పాటు చేశాను. నేను మరణించేదాకా, మరణించాక కూడా నలుగురిని బతికించే ప్రయత్నం చేయాలన్నది తపన. ఈ ప్రయాణంలో ఎన్నో ఆవేదనలు చుట్టుముట్టాయి. ఎందరి కష్టాలనో దగ్గరుండి చూసి, దుఃఖం కలిగేది. చేసే ప్రతి పనినీ దైవాంశగా భావిస్తూ వచ్చాను. పిల్లల కోసం కంపాస్ రేపటి తరం బాగుండాలంటే విద్యార్థుల్లో మానవతా స్పృహ కలగాలి. అందుకే, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చిన్నారులకు మన దేశ నాయకుల గురించి, సంస్కార పాఠాలు అందించే ప్రయత్నం చేస్తున్నాను. పిల్లలు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా ‘కంపాస్’అనే పేరుతో పుస్తకం తీసుకువచ్చాను. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతి రోజూ ఉదయం నుంచి 10 వేల మందికి టచ్‌లో ఉంటాం. నేను కోరేది ఒక్కటే ... వాలంటీర్లుగా వారంలో ఒక్క రోజు మాకివ్వండి. సేవా మార్గంలో తోడవ్వండి. అంకితభావంతో ఉన్న యువత ఇలాంటి సంస్థలలో పనిచేయడం వల్ల వారిలో జీవన నైపుణ్యాలు పెరుగుతాయి. సమాజం బాగుండాలంటే యువత చేతులు ఏకమవ్వాలి’’ అని తెలియజేస్తున్నారు బాలచంద్ర. – నిర్మలారెడ్డి -
National Animal Rights Day: జంతువులను ప్రేమిద్దాం..
మన కాలనీలో ఓ కుక్క కాలు విరిగి ఈడ్చుకుంటూ వెళుతుంటుంది... చూసి, పట్టనట్టు వెళ్లిపోతుంటాం. ఓ చిన్న సందులో పిల్లి ఇరుక్కుని గిలగిల్లాడుతుంటుంది ... దానిని కాపాడటం మన పని కాదులే అని తప్పుకుంటాం. వాటికి ఆకలేసినా, ప్రమాదాలు జరిగినా మనసున్న మనుషులుగా మనమెంతవరకు పట్టించుకుంటున్నాం? మనతో పాటు మూగజీవాలకూ బతికే హక్కు ఉందని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిది అని అంటున్నారు హైదరాబాద్‌లో ఉంటున్న జంతుప్రేమికులు సాయిశ్రీ, పంచ్, శారద, డాక్టర్ కృష్ణప్రియ. ప్రజలలో మూగ జీవాల పట్ల అవగాహన కలిగించేందుకు, సురక్షితంగా ఉంచేందుకు నార్డ్ గ్లోబల్ ఆర్గనైజేషన్‌తో కలిసి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నేషనల్ యానిమల్ రైట్స్ డే సందర్భంగా జంతు ప్రేమికులు చెబుతున్న విషయాలు. స్కూల్, కాలేజీలకు వెళ్లి.. జంతువులకు కూడా జీవించే హక్కు ఉంది అని చెప్పడానికి నార్డ్ అనే సంస్థ అంతర్జాతీయంగా వర్క్ చేస్తుంది. కొన్ని ఆర్గనైజేషన్స్‌తో కలిసి వర్క్ చేస్తాం. ప్రజల్లో అవగాహన కల్పించడమే ఉద్దేశంగా ఈ కార్యక్రమాలు ఉంటాయి. మూడేళ్లుగా యానిమల్ సేవలో పాల్గొంటున్నాను. మనిషి కారణంగా ఏ జంతువూ బాధపడకూడదు. ఎవరూ వాటిని హింసించకూడదు. నేను ఒక స్ట్రీట్ డాగ్‌ను దత్తత తీసుకున్నా. అప్పటి నుంచి నాకు ఈ సేవ పట్ల ఆసక్తి పెరిగింది. స్కూల్, కాలేజీలకు వెళ్లి కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తుంటాం. జంతు ఆధారిత ఉత్పత్తులను ఏవీ ఉపయోగించం. – పంచ్, యానిమల్ యాక్టివిస్ట్, సైనిక్‌పురి పూర్తి సమయం కేటాయింపు.. మన వీధిలో ఒక కుక్క ఉందంటే అది ఆ కాలనీవారందరి బాధ్యతగా ఉండాలి. దానికి ఏదైనా దెబ్బ తగిలినా, తిండి లేకుండా పడి ఉన్నా ఎవరూ పట్టించుకోరు. అలాంటి కుక్కలు, పిల్లలు, గోవులు... వీధుల్లో తిరిగేవాటిని తీసుకొచ్చి, సేవ చేస్తాం. వీధుల్లో ఉండే కుక్కలకు బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ చేయిస్తాం. ఐదేళ్లయ్యింది ఈ వర్క్ చేయబట్టి. ఎనిమిదేళ్ల క్రితం మా ఫ్రెండ్ అక్కవాళ్ల దగ్గర నుంచి ఒక కుక్కను తీసుకున్నాను. స్ట్రీట్ డాగ్స్‌కు దెబ్బలు తగిలినప్పుడు ట్రీట్మెంట్ చేసేదాన్ని, చేయించేదాన్ని. ఆ తర్వాత షెల్టర్ స్టార్ట్ చేశాను. దీనికి మరొక ఫౌండర్ జత కలవడంతో ఇప్పుడు ఇక్కడ రెండు వందల వరకు యానిమల్స్ ఉన్నాయి. గోవులు ఆరున్నాయి. ఇప్పటి వరకు నాలుగు వేల స్ట్రీట్ యానిమల్స్‌కి సేవలందించాను. నేషనల్ బాక్సర్‌గా ఉన్న నేను ఈ వైపుగా ఆసక్తి పెరగడంతో పూర్తి సమయాన్ని జంతువుల సేవకే కేటాయిస్తున్నాను. వీగన్ పదార్థాల తయారీ, ప్రొడక్ట్స్ బిజినెస్ కూడా చేస్తుంటాను. వీటి వల్ల వచ్చే ఆదాయంలో 15 శాతం జంతు సేవలకే ఉపయోగిస్తుంటాను. – సాయి శ్రీ, బోరంపేట్, దుండిగల్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చింది.. మా అపార్ట్మెంట్ దగ్గర 20 కుక్కలను సేవ్ చేసి, వాటికి షెల్టర్ ఏర్పాటు చేశాను. ఇందుకు చాలా మందితో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కుక్కలకు ఆహారం పెడుతుంటే, పై నుంచి బాటిల్స్ వేసినవారున్నారు. అవే కుక్కల మీద పడితే, వాటికి ఎంత ప్రమాదం జరిగేదో అస్సలు ఆలోచించరు. న్యూసెన్స్ అవుతుందని కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాల్సి వచ్చింది. యానిమల్ రైట్స్ గురించి చెప్పినప్పుడు, అందరూ తగ్గారు. మొదట్లో స్ట్రీట్ డాగ్‌ని దత్తత తీసుకొని, పెంచేదాన్ని. ఆ తర్వాత ఆ కాలనీలో తిరుగుతున్నవాటిని రెస్క్యూ చేయడం మొదలుపెట్టాను. అక్కడి నుంచి మా ఫ్రెండ్ షెల్టర్‌కి పంపిస్తుంటాను. – శారద, యానిమల్ యాక్టివిస్ట్, ప్రగతినగర్ బ్లడ్ అవసరమైతే.. నేను డెంటిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. అలాగే, అవసరమైన డాగ్స్‌కి బ్లడ్ అందేలా చూస్తుంటాను. నాకు కుక్కలు అంటే చాలా ఇష్టం. ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ల కుక్కకు ప్రమాదం జరిగి, బ్లడ్ అవసరమైంది. ఆ సమయంలో మరో కుక్క నుంచి బ్లడ్ తీసి, మ్యాచ్ చేసి ప్రమాదం నుంచి గట్టెక్కించారు. అప్పటి నుంచి కుక్కలకు కూడా బ్లడ్ అవసరం అని భావించి, రికార్డ్ చేస్తున్నాను. ఇందుకు సంబంధించి వెటర్నరీ డాక్టర్స్‌ని, వారి ద్వారా అవసరమైన కుక్కలకు మరో పెట్ పేరెంట్ ద్వారా బ్లడ్ అందేలా చూస్తుంటాను. – డాక్టర్ కృష్ణప్రియ, మలక్‌పేట – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Saraswati Kavula: చేనేతకు చేరువలో..
చేనేతకారులకు సాయం చేయాలనే ఆలోచనతో ఎగ్జిబిషన్స్ పెట్టి, ఆ పేరుతో పవర్‌లూమ్స్ అమ్ముతుంటారు. దీనివల్ల చేనేతకారులకు అన్యాయం జరుగుతుంటుంది. ఈ సమస్యల గురించి తెలిసి, ఆరేళ్ల నుంచి చేనేత సంత పేరుతో యాభై ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి, వీవర్స్‌కు సాయం చేస్తోంది హైదరాబాద్ విద్యానగర్‌లో ఉంటున్న సరస్వతి కవుల. వ్యవసాయం మీద ఉన్న ప్రేమతో యాచారం దగ్గర నందివనపర్తిలో రైతుగానూ తన సేవలను అందిస్తున్నారు. పర్యావరణ ఉద్యమకారిణిగానూ పనిచేసే సరస్వతి చేనేతకారుల సమస్యలు, వారికి అందించాల్సిన తోడ్పాటు గురించి వివరించారు. ‘‘ప్రభుత్వాలు పవర్లూమ్నే ప్రమోట్ చేస్తున్నంత కాలం చేనేతకారుల వెతలు తీరవని ఇన్నాళ్లుగా వాళ్లతో నేను చేసిన ప్రయాణం వల్ల అర్ధమైంది. దాదాపు పదిహేనేళ్లుగా వ్యవసాయం, చేనేతకారులకు సంబంధించిన విషయాలపై స్టడీ చేస్తూనే ఉన్నాను. మొదట్లో పర్యావరణానికి సంబంధించిన డాక్యుమెంటరీలు చేసేదాన్ని. అప్పట్లో రసాయన మందులతో వ్యవసాయం చేసే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టే చేనేతకారులు కూడా అదేబాట పట్టారు. కుటుంబం అంతా కలిసి చేసే హస్తకళల్లోకి చాపకింద నీరులాగ పెద్ద కంపెనీలు వచ్చి చేరుతున్నాయి. దీనివల్లే వీవర్స్‌కి సమస్యలు వచ్చాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కు ఉన్న గ్యారంటీ చేనేతకారుల ఉత్పత్తులకు మార్కెట్ ఉండదు. ఇంకా హ్యాండ్లూమ్ బతికుంది అంటే మన చేనేతకారుల పట్టుదల వల్లనే. సమాజంలో బాధ్యతగలవారిగా మనమే వారికి సపోర్ట్‌గా నిలవాలి. ఇప్పటికే చేనేతకారులు వారి పిల్లలకు తమ వారసత్వ విద్యను నేర్పించడం లేదు. పెద్ద చదువులు, కంపెనీల్లో ఉద్యోగాలు అంటూ పంపిస్తున్నారు. దీంతో నేతపని రోజురోజుకూ కుంటుపడుతుంది. మనదేశంలో నైపుణ్యాలు కల కళాకారులు ఉన్నారు. కానీ, పెద్ద పెద్ద టెక్స్టైల్ పరిశ్రమలు వస్తాయి. వాటికి రాయితీలు పెద్దఎత్తున ఉంటాయి. కానీ, వీవర్స్‌కి ఇవ్వచ్చు. పాలిస్టర్ దారానికి సబ్సిడీ ఉంటుంది, కాటన్‌కి టాక్స్ పెంచుతారు. కరోనా సమయంలో వీవర్స్ చాలా దెబ్బతిన్నారు. సేల్స్ తగ్గిపోయి, పూట గడవడమే కష్టపడిన సందర్భాలున్నాయి. ► దిగులును చూశాను.. మొదట్లో రూరల్ ఇండియాకు సంబంధించి డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేస్తుండేదాన్ని. వ్యవసాయదారులతోనూ చేసేదాన్ని. ఎన్జీవోలతో కలిసి చేనేతకారులకు సపోర్ట్ చేసేదాన్ని. వాళ్లకు సపోర్ట్ చేసే సంస్థ మూతపడినప్పుడు ఏం చేయాలో తోచక దిగాలు పడటం చూశాను. డైరెక్ట్ మార్కెటింగ్ ఉంటే వారు తయారు చేసినదానికి సరైన ధర వస్తుంది.దానివల్ల ఆ వస్తువు తయారీదారునికి, కొనుగోలు దారికీ నేరుగా లాభం కలుగుతుంది. ఈ ఆలోచన వచ్చినప్పుడు చేనేతకారులకు డైరెక్ట్ మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలనుకున్నాను. కానీ, కొన్నాళ్లు నేనది చేయలేకపోయాను. కొంతమంది చేనేతకారుల దగ్గరకు వచ్చి ఎలాంటి సాయం కావాలి అని అడిగేవారు. వాళ్లు ‘మా సరుకును కొనండి చాలు, మాకేం చేయద్దు’ అనేవారు. ఇవన్నీ చూశాక మా ఫ్రెండ్స్‌తో కలిసి చర్చించాను. వారు కొంత ఆర్థిక సహాయం చేస్తామన్నారు. అప్పుడు హైదరాబాద్‌లో కమ్యూనిటీ హాల్స్ లాంటి చోట్ల ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేశాం. 2015 నుంచి 2017 వరకు ఫ్రెండ్స్ సాయం చేశారు. ఆ తర్వాత సేల్స్ నుంచి 2 శాతం ఇవ్వాలని చేనేతకారులకు చెప్పాం. ఇప్పుడు వారికి వచ్చిన దాంట్లో 5 శాతం ఇస్తున్నారు. పెద్ద పెద్ద హాల్స్ తీసుకొని పెట్టాలంటే ఆ హాల్స్‌కి అమౌంట్ కట్టాలి. దానివల్ల మళ్లీ వీవర్ తన వస్తువుల ధర పెంచాలి. అది కూడా మళ్లీ ధర పెరిగినట్టే కదా! అందుకే, తక్కువ ఖర్చుతో పూర్తయ్యే సంతలను ఏర్పాటు చేస్తున్నాం. స్వయంసమృద్ధిగా ఉంటే ఏ సమస్యలూ ఉండవు. ఇప్పుడైతే ప్రయాణ ఖర్చులూ పెరుగుతున్నాయి. మెటీరియల్ తీసుకొని, రైళ్లలో రావాల్సి ఉంటుంది. అలా వచ్చే ఖర్చు కూడా గతంలో వందల్లో ఉంటే, ఇప్పుడు వేలకు చేరింది. అందుకే, వసతి సదుపాయాలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం రాకుండా చూస్తుంటాం. అందుకు ఇప్పటికీ సాయం చేసేవారున్నారు. ► అన్ని చేనేతలు ఒక దగ్గర ఆరేళ్ల క్రితం రెండు–మూడు స్టాల్స్‌తో ఎగ్జిబిషన్ మొదలుపెట్టాం. తర్వాత కొంతమందిని నేరుగా కలిసి చెబితే, కొంతమందికి నోటిమాట ద్వారా తెలిసి వచ్చారు. ఇప్పుడు 25 నుంచి 30 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. చిన్న వీవర్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వారు రావాలనుకుంటాం. అందుకు చాలా ప్రయత్నం చేశాం. మాస్టర్ వీవర్స్, కో ఆపరేటివ్ సొసైటీ, తూర్పుగోదావరి నుంచి మోరీ సొసైటీ, ఇంకొంతమంది ఇండివిడ్యువల్ వీవర్స్ ఉన్నారు. పొందూరు, పెన్‌కలంకారీ, కలంకారీ, గుంటూరు, చీరాల, మంగళగిరి, వెంకటగిరి, ఒరిస్సా నుంచి కూడా చేనేతకారులు తమ ఉత్పత్తులతో వస్తుంటారు. వరంగల్ నుంచి మ్యాట్స్, చందేరీ, కర్నాటక నుంచి ఇల్కల్ వీవింగ్, సిద్ధిపేట్ గొల్లభామ, ముత్యంగడి చీరలు... మొత్తం దీనిమీద ఆసక్తి కొద్దీ, కళను బతికించాలని ఆలోచనతో చేస్తున్న వర్క్ ఉన్నవాళ్లు ఒకచోట చేరుతుంటారు. కొంతమంది చదువుకున్నవారు, ఉద్యోగాలు చేస్తూ ఆసక్తితో తిరిగి చేనేతలకు వస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, గుజరాత్ నుంచి అజ్రక్, కలకత్తా, బెంగాల్ నుంచి చేనేతకారులు ఈ సంతకు వస్తున్నారు. అయితే, ఇక్కడకు వచ్చే కొంతమంది ధర పెట్టడానికి చాలాసేపు బేరం ఆడుతుంటారు. అది బాధనిపిస్తుంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కి వెళ్లి, అక్కడి వస్తువులకి ఎంత డబ్బయినా ఖర్చు పెడతారు. కానీ, మనవైన చేనేతల కష్టాన్ని మాత్రం విపరీతంగా బేరం ఆడుతుంటారు. మనలో ఆర్థిక మార్పు కాదు, సామాజిక మార్పు రావాలి. ► రైతుగానూ.. మా అమ్మనాన్నలు నాకు మంచి సపోర్ట్. పర్యావరణ సంబంధిత ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా తమవంతు తోడ్పాటును అందించారు. ఎన్నిరోజుల వీవర్స్ వారు తమ శక్తిని నమ్ముకుంటారో అంతవరకు ఇలాంటి సంతలు ఏర్పాటు చేస్తూనే ఉంటాను. ఇప్పటివరకు రెండు నెలలకు ఒకసారి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మూడు – ఆరు నెలలకు ఒకసారి చేయాలనుకుంటున్నాం. ఇందుకు కారణం కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా తగ్గిపోతుండటమే. ఫలితంగా చేనేతకారులు ఆశించినంత ఆదాయం వారికి రావడం లేదు. నేటి తరం మన హస్తకళల గొప్పతనాన్ని అర్ధం చేసుకోవాలి, చేయూతనివ్వాలి. ప్రకృతితో మమేకం అవడం నాకు ఇష్టమైన పని. అందుకే, వ్యవసాయం చేస్తూ రైతులకు దగ్గరగా, చేనేతలకు చేరువలో ఉండటంలోని సంతోషాన్ని పొందుతుంటాను’’ అని వివరించారు సరస్వతి. మద్దతు ముఖ్యం క్రమం తప్పకుండా ఇలాంటి సంతలను ఏర్పాటు చేయడం వల్ల వినియోగదారులకు సులువుగా అర్ధమైపోతుంది ఫలానాచోట హ్యాండ్లూమ్స్ లభిస్తాయి అని. దీనికి డిజిటల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తున్నాం. ఈ నెల వరకు 50 చేనేత సంతలు ఏర్పాటుచేశాం. ఇకముందు కూడా ఎన్ని వీలైతే అన్ని చేద్దామనుకుంటున్నాను. మనవంతు సాయంగా సపోర్ట్ చేయగలిగితే సరిపోతుంది. ఇది ఒక వాలంటీర్‌గా చేసే సాయం. – నిర్మలారెడ్డి -
ఇల్లే సేవా కేంద్రం
కావల్సినన్ని వనరులు సమకూరినప్పుడు కూర్చుని సేద తీరుదామనుకుంటారు చాలామంది. తమ చుట్టూ ఉన్న నలుగురికైనా వారి స్వశక్తిని నమ్ముకునేలా చేయూతనిద్దాం అనుకుంటారు అతి కొద్దిమంది. అలాంటివారిలో కొత్తమాసు కృష్ణవేణి ఒకరు. సికింద్రాబాద్‌లోని టెలికాం కాలనీ, కానాజీగూడలో ఉంటున్న ఈ గృహిణి తన ఇంటినే సేవాకేంద్రంగా మలిచి పదేళ్లుగా మహిళలకు ఉపాధి శిక్షణా కార్యక్రమాలను ఉచితంగా అందిస్తున్నారు. మహిళలకు శిక్షణ ఇస్తూ బిజీగా ఉన్న కృష్ణవేణిని కలిసినప్పుడు, ఆమె సేవామార్గం వివరాలను ఇలా పంచుకున్నారు.. ‘‘పదిహేనేళ్ల క్రితం మావారు రంగారావు సత్యసాయి సేవాకార్యక్రమాలలో పాల్గొనేవారు. నేనూ ఆ కార్యక్రమాలకు వారి వెంట వెళ్లేదాన్ని. ఆ సమయంలోనే గ్రామాలలోని మహిళలకు స్వయం ఉపాధికి పనికి వచ్చే కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనుకున్నాను. అప్పుడే మల్లాపూర్ గ్రామంలో మొట్ట మొదటిసారిగా నాకు వచ్చిన కుట్టు పనులను అక్కడి మహిళలకు నేర్పించి, వారికి ఆదాయ మార్గం చూపటం సంతృప్తినిచ్చింది. ఇంటి వద్ద నుంచి.. సేవా కార్యక్రమాలు ఎలా చేయచ్చో ఆ ఆడుగులు ఎలాగూ నేర్పించాయి. ఇంట్లో మా వారికి చెప్పి పైన ఓ గదిని ఏర్పాటు చేశాను. ఇంట్లోనే ఉంటాను కాబట్టి మహిళలకు టైలరింగ్, సాయంకాలాలు పేద పిల్లలకు ట్యూషన్లు చెప్పేదాన్ని. ఇక్కడ ఒక్కచోటే సేవ చేస్తూ ఉంటే కాదు, మరికొందరికి ఉపాధిని అందిస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో గ్రామాలకి వెళ్లడం ్రపారంభించాను. వెళ్లిన ఊళ్లో ముందుగా అక్కడ అనువైన స్థలం చూసుకొని, ఒక టీచర్ని ఏర్పాటు చేసి, నేర్చుకునేవారిని ఎంపిక చేసేదాన్ని. సాయిసంస్థ ద్వారానే రెండు నెలల పాటు 200 మందిని 10 బృందాలుగా చేసి, స్వయంగా శిక్షణ ఇచ్చాను. గృహిణిగా ఇంటి పనులు చేసుకుంటూ ఉండే నేను అలా ఒక్కో ఏడాది దాటుతూ సేవాకార్యక్రమాల్లో తీరికలేకుండా అయిపోవడం ఎంతో సంతృప్తినిచ్చింది. స్వచ్ఛంద సంస్థలతో కలిసి.. ఈ 10 ఏళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలోని 300 గ్రామాలలో దాదాపు çపన్నెండు వేల మంది గ్రామీణ మహిళలకు కుట్టు మిషను, మెహెందీ, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, పేపర్ వర్క్, ఫ్యాషన్ జ్యువెలరీ తయారీ, బ్యూటీషియన్ .. వంటి శిక్షణా కార్యక్రమాలను ఉచితంగా నిర్వహించాం. ఆ తర్వాత ఈ సేవామార్గంలో కొన్ని స్వచ్ఛంద సంస్థల వాళ్లు పరిచయమయ్యారు. అలా మేధా చారిటీ, అభయ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థలతోనూ కలిసి గ్రామీణ మహిళలకు ఎనిమిది వేల కుట్టుమిషన్లు, ఇతర ఉపాధులకు అవసరమయ్యే పని ముట్లను ఏర్పాటు చేశాం. పిల్లలకు ఫ్రీ ట్యూషన్లు కరోనా తర్వాత పిల్లలకు చదువులు బాగా తగ్గిపోయాయి. డల్‌గా ఉన్న స్టూడెంట్స్ మరీ వెనకబడిపోకుండా ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు ఫ్రీ ట్యూషన్స్ ఏర్పాటు చేశాం. ఇందుకు ప్రభుత్వ స్కూల్ విద్యార్థులనే ఎంచుకుంటాం. ఉపాధికి దారులు అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో తెలిసినవారి నుంచి ఇక్కడి మహిళలకు ఆర్డర్ మీద వర్క్స్ ఇప్పిస్తుంటాను. ఈ ఆర్డర్లు తెచ్చుకోవడానికి ఈ బృందంలోని వారి నుంచి కొందరిని నియమిస్తాను. అమెరికాలో, దూర్రపాంతాల్లో తెలిసినవారుంటే వారికి మావాళ్లు చేసిన వర్క్స్ ఫోన్ల ద్వారా చూపించి, ఆర్డర్స్ తెప్పిస్తుంటాం. వారికి కొరియర్ ద్వారా పంపిస్తుంటాం. దీని ద్వారా ఈ మహిళలకు కొంత ఆదాయం లభిస్తుంది. కోర్సు తర్వాత వారి ఇంటి వద్దనే నేర్చుకున్న పనిని కొనసాగించేలా కూడా చూస్తున్నాం’’ అని కృష్ణవేణి వివరించారు. – నిర్మలారెడ్డి -
సేద్య కళ
చదువుకుంటూ పార్ట్‌టైమ్ జాబ్స్ చేసే యువత గురించి మనకు తెలుసు. అలాగే, చదువుకుంటూనే తమ అభిరుచులకు పదును పెట్టుకునేవారినీ మనం చూస్తుంటాం. అయితే, నెల్లూరు జిల్లా కలువాయి మండలం, పెన్న బద్వేల్‌వాసి అయిన చాట్ల అఖిల మాత్రం హాస్టల్లో ఉండి బయోటెక్నాలజీలో డిగ్రీ చేస్తూనే, ఖాళీ సమయంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తోంది. తనకున్న ఇష్టం వల్ల సేద్యంలో రకరకాల ప్రయోగాలు సొంతంగా చేయగలుగుతున్నాను అని చెబుతున్న అఖిల తన కలనే కాదు కళను కూడా పండిస్తోంది. ‘‘మాది వ్యవసాయ కుటుంబం అవడంతో చిన్నప్పటి నుంచి ఇంటి పనులతో పా టు పొలం పనులు కూడా తెలుసు. అమ్మ పద్మ, నాన్న గురువయ్య. అమ్మానాన్నలకు అన్న, నేను సంతానం. డిగ్రీ మూడవ సంవత్సరం నెల్లూరు టౌన్లోనే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. డిగ్రీ పూర్తయిన తర్వాత నాకు నేనుగా స్థిరపడాలంటే ఏది ఎంచుకుంటే బాగుంటుంది అని చాలా ఆలోచించాను. కరోనా కాలంలో రెండేళ్లు ఇంటి వద్దే ఉన్నప్పుడు ఎక్కువ సమయం పొలంలోనే గడిపేదాన్ని. అలా వ్యవసాయంలోని కష్టం, ఇష్టం రెండూ అలవాటయ్యాయి. అయితే, ఊళ్లో వ్యవసాయం చేస్తూ, కాలేజీకి వెళ్లి చదువుకోలేను. ఇంటి వద్దే ఉండి నాకు నచ్చిన రీతిలో వ్యవసాయం చేయాలంటే అందుకు అమ్మానాన్నలను ఒప్పించడం కష్టమనుకున్నాను. ‘చదువుకుంటున్నావు కదా ఎందుకింత కష్టం’ అంటారు. అందుకే అమ్మానాన్నలకు చెప్పకుండానే ఎక్కడైనా కొంత భూమి కౌలుకు తీసుకోవాలని వ్యవసాయం చేయాలని, కరోనా టైమ్‌లోనే తెలిసివారి ద్వారా చాలా వెతికాను. సాగులో లేని భూమి.. నేనున్న హాస్టల్‌కి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లిపా డులో ఒక ఎన్ఆర్ఐ భూమి ఉందని తెలిసింది. వారి వివరాలు కనుక్కొని, ఫోన్లో సంప్రదించి, రెండెకరాల భూమి కౌలుకు తీసుకున్నాను. అది ఏ మాత్రం సాగులో లేని భూమి. అందుకు చాలా కష్టపడాలి. మొదట కష్టమవుతుందేమో అనుకున్నాను. కానీ, ఇష్టమైన పని కావడంతో సాగు చేయాలనే నిశ్చయించుకున్నాను. మట్టితో పిచికారి భూమిని చదును చేయించాను. ఆకు కూరలు, కూరగాయల సాగు చేస్తున్నాను. సాగులో వచ్చే ఇబ్బందులు స్వయంగా తెలుసుకుంటూ, వాటికి పరిష్కారాలు వెదుక్కుంటూ నా ఎఫర్ట్‌ను పెడుతున్నాను. ఓ వయసుపైబడిన వ్యక్తి ఉంటే, అతనికి అవసరాలకు డబ్బు ఇచ్చి పొలానికి కాపలాకు పెట్టాను. శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజులు ఈ పనికి ఎంచుకున్నాను. ఉదయం ఫార్మ్ దగ్గరకు వెళతాను. సాయంత్రం వరకు అక్కడే ఉంటాను. మొక్కల ఏపుగా పెరగడానికి మట్టి ద్రావకంతో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాను. పెన్నానది పక్కన ఉండటంతో అక్కణ్ణుంచి మోటార్ ద్వారా నీటి సదుపా యాన్ని ఏర్పాటు చేసుకున్నాను. తక్కువ పెట్టుబడితో.. ఇప్పుడు పా లకూర, చుక్కకూర, తోటకూర, గోంగూర, బెండ, చిక్కుడు, స్వీట్‌కార్న్, వంగ, దోస, సొరకాయ వంటివి సాగుచేస్తున్నాను. ఆకుకూరలు 15 రోజులకొకసారి కోతకు వస్తాయి. వీటన్నింటిని వాతావరణం బట్టి నా పనిలో మార్పులు చేసుకుంటాను. తెలిసినవాళ్లే వాటిని స్వయంగా వచ్చి తీసుకెళుతుంటారు. భూమిని చదును చేయించడానికి రూ.5 వేల వరకు పెట్టుబడి పెట్టాను. అన్ని ఖర్చులు పోను రూ. 15 వేల వరకు ఆదాయం వచ్చింది. అయితే, ఈ మొత్తాన్ని కూడా భూమిలో సేంద్రీయ పద్ధతులను అమలు చేయడానికి ఖర్చు పెడుతున్నాను. మా ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు వచ్చి సరదాగా వర్క్ చేస్తుంటారు. సొంతంగా వ్యవసాయం చేస్తున్నానని ఎవరికైనా చెబితే ‘చదువుకుంటున్నావు కదా, ఆడపిల్లవు కదా! ఎందుకంత కష్టం, ఇంకేం పని దొరకలేదా’ అని నవ్వుతున్నారు. అందుకే ఎవరికీ చెప్పడం లేదు. ఇంకొంత భూమి తీసుకుని సాగు చేయాలనేది తర్వాతి ప్లాన్. ‘మా భూమిలో కూడా ఇలా మట్టిని కాపా డుతూ సేద్యం చేయండి..’ అని అడిగేవాళ్లున్నారు. ఏషియన్, మిల్లెట్ ఫార్మింగ్‌ను పెద్ద ఎత్తున చేయాలనే ఆలోచన ఉంది’’ అని వివరించింది అఖిల. – నిర్మలారెడ్డి -
Highway to Swades: మనలోనే సూపర్శక్తి
భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరుగా పేరొందారు భైరవి జానీ. లాజిస్టిక్ సప్లై చైన్ వ్యవస్థాపకురాలైన భైరవి జానీ దేశం అంతటా పద్ధెనిమిది వేల కిలోమీటర్లకు పైగ పర్యటించి, తన అనుభవాలతోపాటు, ఎంతోమంది అభిప్రాయాలను పొందుపరిచి, ‘హైవే టు స్వదేశ్’ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన భైరవి జానీ మనదేశంలోనే సూపర్ శక్తి ఉందంటూ తన పర్యటన విశేషాలను, అనుభవాలను పంచుకున్నారు. ‘‘భారతదేశపు నాగరికతపై దృష్టి సారించినప్పుడు మనవారిలో ఉన్న సూపర్ పవర్స్ ఏంటో అర్దమైంది. నాగాలాండ్‌లోని మారుమూల ప్రాంతాల నుంచి రాన్ అఫ్ కచ్ వరకు, దక్కన్ పీఠభూమిలోని వివిధ ప్రాంతాలన్నీ 51 రోజుల పాటు 18,181 కిలోమీటర్లు ప్రయాణించాను. వీటితోపాటు రెండు దశాబ్దాల కాలంలో దేశవ్యాప్తంగా చేసిన వివిధ ప్రయాణాలలో పరిశీలనల విశ్లేషణ కూడా ఇందుకు దోహదపడింది. ► స్వయంగా తెలుసుకుని... 2014లో ఒక రోజు రోడ్ ట్రిప్‌లో ఉన్నప్పుడు దేశ ఆర్థికాభివృద్దిపై సమగ్ర పుస్తకం తీసుకురావాలనే ఆలోచన వచ్చింది. అప్పటి నుంచే నా వ్యాపార పనులతో పాటు రోడ్ ట్రిప్స్ కూడా ప్లాన్ చేసుకునేదాన్ని. అన్ని చోట్లా ప్రజల జీవన స్థితిగతులను స్వయంగా అడిగి తెలుసుకున్నాను. చాలా భిన్నమైన పరిస్థితులు, అతి సాధారణ విషయాలు కూడా స్వయంగా చూసి తెలుసుకున్నాను. అలాగే, పెద్ద యెత్తున వ్యాపారాలు చేస్తున్న వారినీ కలిశాను. హిమాలయాల్లో ఉన్న భిన్న కమ్యూనిటీ ప్రజలను కలుసుకున్నాను. వారి సామాజిక, ఆర్థిక, అభివృద్ధి స్థితిగతులన్నింటిపైన ఒక అవగాహన తెచ్చుకున్నాను. కోవిడ్ లాక్డౌన్ టైమ్‌లో ఈ పుస్తకం రాయడం ప్రారంభించాను. హైదరాబాద్ విషయాలనూ ఇందులో పొందుపరిచాను. ఇక్కడి వంటకాలు, దుస్తులు, భాష,. సాహిత్యం, కళలు, ఆర్కిటెక్చర్, పండగలు, వ్యాపారం.. ప్రతిదీ సమ్మేళన సంస్కృతిగా ఉంటుంది. పాత నగరం నుంచి ఇప్పుడు ఆధునిక మహానగరంగా టెక్నాలజీ హబ్‌గా మారింది. ఇదంతా ప్రజల విజ్ఞానశక్తి, వ్యాపార శక్తిని సూచిస్తుంది. ‘హైవే టు స్వదేశ్’ అనేది భారతదేశంలోని పన్నెండు సూపర్ పవర్లకు అద్భుతమైన ప్రతిబింబం అని చెప్పవచ్చు. ► సమయపాలన చాలా మంది ‘మీరు 20 వేర్వేరు కంపెనీలలో బోర్డు మెంబర్‌గా ఉండి, ట్రావెలర్‌గా, రచయితగా సమయాన్ని ఎలా సర్దుబాటు చేసుకుంటున్నారు’ అని అడుగుతుంటారు. ఏదైనా పని ప్రారంభించాలనుకున్నప్పుడు, ఆ పని పూర్తిచేయనిదే నాకు నిద్ర పట్టదు. నేను తిరిగిన నేల, అక్కడి ప్రజల అనుభవాలను తెలుసుకుంటున్నప్పుడు జరిగింది అదే. టైమ్ విషయంలో చాలా కచ్చితమైన నిర్ణయం ఉంటుంది. రాజు అయినా కూలీ అయినా మనకు ఉండేది 24 గంటలు మాత్రమే. అందుకనే సమయాన్ని పనులవారీగా విభజించుకొని, ప్లాన్ చేసుకుంటాను. ముందుగా ఏ పని ముఖ్యమో దానిపైనే దృష్టి పెడతాను. ప్రతి విషయంలో ముందే ప్లానింగ్‌తో ఉంటాను. అనుకున్న సమయానికల్లా పనులు పూర్తి చేస్తాను. కుటుంబం, వ్యాపారం, రచనలు .. ఇలా టైమ్‌ని విభజించుకుంటాను. ► రోడ్ ట్రిప్స్.. మన దేశం చాలా అందమైనది. ఎంతో విజ్ఞానం ఇక్కడ ప్రజల మధ్య, సంస్కృతుల్లో భాగంగా ఉంది. ప్రతిచోటా ఆసక్తికరమైన కథనాలెన్నో. ఈ దేశంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం, కంపెనీ, ఏదో ఒకదానిపైన ఆధారపడకుండా ప్రజలు తమ మధ్య ఉన్న సూపర్ పవర్స్‌పై నమ్మకంతో ముందడుగు వేయాలి. మనకి మనమే ఒక అద్భుతమైనవారిగా విశ్వసిస్తే ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చు. రోడ్డు ట్రిప్స్‌లో పాల్గొనాలి. జనంతో మాట్లాడాలి. దేశం అభివృద్ధికి సంబంధించి లోతైన విశ్లేషణ చేసి, అందులో మనకున్న కలల సాధనకు కృషి చేయాలి’ అని వివరించారు భైరవి జానీ. 1896లో స్థాపించిన ఎస్.సి.ఏ. గ్రూప్ ఆఫ్ కంపెనీలకు దశాబ్ద కాలం నుంచి చైర్‌పర్సన్‌గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలందిస్తోంది భైరవి. ఈ క్రమంలో అనేక వెంచర్లను ప్రారంభించడంతో పాటు వాటిని అభివృద్ధి చేస్తూ వచ్చారు. ముంబై వాసి అయిన భైరవి జానీ యుఎస్ఎలో చదివి, అక్కడే వ్యాపారలావాదేవీలు కొనసాగించి 2001లో తన స్వంత వెంచర్‌ను ప్రారంభించేందుకు భారతదేశానికి తిరిగి వచ్చారు. దేశ, విదేశాల్లో బిజినెస్ ఉమన్‌గా తన సత్తా చాటుతున్నారు. శిక్షణ పొందిన శాస్త్రీయ నృత్యకారిణిగానూ ఆమెకు పేరుంది. హిమాలయాల్లో ఉన్న వివిధ కమ్యూనిటీ ప్రజలకు స్థిరమైన జీవనోపాధిని సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. – నిర్మలారెడ్డి -
Singer Parvathy: నా అదృష్టం.. సినిమాల్లో పాడే అవకాశాలూ వస్తున్నాయి: పార్వతి
వసంతకాలం అనగానే విరబూసిన పూలు, లేలేత మావి చిగుళ్లు కోయిలమ్మల రాగాలు మదిలో మెదులుతాయి. అలాగే, ఈ సీజన్లో తమ గానామృతంతో మనల్ని అలరిస్తూ సందడి చేస్తున్నారు దాసరి పార్వతి, దివ్యజ్యోతి, దుర్గవ్వలు. టాలెంట్ ఉంటే ఏ మూలన ఉన్నా అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి అనే మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. పని కష్టం మర్చిపోవడానికి నోటినుండి వెలువడే పదాలే పాటలుగా ఆకట్టుకుంటాయి. అవే జానపదాలై గ్రామీణుల గొంతుల్లో విరాజిల్లుతాయి. అలా మట్టిపరిమళం నుంచి వచ్చిన గొంతుక దుర్గవ్వది. తను పాట పాడితే వెన్నెల చల్లదనమంతా కురుస్తుందా అనిపించే గొంతుక పార్వతిది. అలసిన వేళ పాటే తోడు అంటూ విరిసిన గొంతుక జ్యోతి ది. తెలుగువారి హృదయాలను గెలుచుకున్న ఈ కోయిలమ్మలు తమ కమ్మటి రాగాల వెనక దాగి ఉన్న కష్టాన్ని, తమ పాట తమను నిలబెట్టిన తీరును సాక్షితో పంచుకున్నారు. ఊరంతా వెన్నెల... పార్వతి ఓ టీవీ కార్యక్రమంలో ‘ఊరంతా వెన్నెల మనసంతా చీకటి...’ పాటతో యావత్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది దాసరి పార్వతి. తమ ఊరికి బస్సు రావాలని కోరిన ఆమె మంచి మనసుకు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. తెలుగునాట నెట్టింట పార్వతి పాడిన పాటను సెర్చ్ చేయని వాళ్లు లేరు అనేంతగా గుర్తింపు పొందింది. పార్వతి స్వస్థలం కర్నూల్ జిల్లా, లక్కసాగర గ్రామం. వ్యవసాయ కుటుంబం. ‘చిన్నప్పటి నుంచి పాటలు పాడుతుండేదాన్ని. ఊళ్లో అందరూ గొంతు కోయిలలా ఉందని మెచ్చుకుంటుండేవారు. స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా నా పాట ఉండేది. చదువుకుంటూనే పొలం పనులకు వెళ్లేదాన్ని. పొలం పనులకు వచ్చేవాళ్లు కూడా నా చేత పాటలు పాడించుకునేవారు. ఇంటర్మీడియెట్ తర్వాత ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు మా అన్నయ్యల స్నేహితులు మ్యూజిక్ కాలేజీలో చేరమన్నారు. అలా ఇప్పుడు తిరుపతి మ్యూజిక్ కాలేజీలో ఎం.ఎ చేస్తున్నాను. టీవీ ప్రోగ్రామ్ వాళ్లు పెట్టిన ఆడిషన్స్‌లో సెలక్ట్ అయ్యాను. ఆ సందర్భంగా పాడిన పాటకు మంచి గుర్తింపు వచ్చింది. ఎంతో మంది ప్రశంసిస్తున్నారు. సినిమాల్లో పాడే అవకాశాలూ వస్తున్నాయి. ఇంత గుర్తింపు రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అలనాటి జ్ఞాపకాలను ఆనందంగా పంచుకుంది పార్వతి. మట్టిగొంతుక... దుర్గవ్వ పల్లె పాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి దుర్గవ్వ. కూలిపనులు చేసుకుని, జీవనం సాగించే దుర్గవ్వకు ఇటీవల ఓ స్టార్ హీరో సినిమాలో పాట పాడే అవకాశం దక్కింది. ఆమె పాడిన ‘అడవి తల్లి..’ పాట రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మార్మోగింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. పల్లె పాటను ప్రాణం పెట్టి పాడిన ఈ సింగర్ కోసం నెటిజన్లు తీవ్రంగా వెతుకుతున్నారు. దుర్గవ్వ పాటకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. కొడుకు, కూతురు ఉన్న దుర్గవ్వ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటుంది. కాయకష్టంలో వచ్చే పల్లె పదాలు ఎన్నో. ‘‘చిన్నతనం నుంచి పాటెన్నడూ నన్ను వీడలేదు. ఓ రోజు నా బిడ్డ నా చేత నాలుగు పాటలు పాడించి చానళ్లలో పెట్టింది. ముందు వద్దన్న. కానీ, పిల్లలు వినలేదు. ఆ పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో మా దగ్గర కొంతమంది జానపద కళాకారులు నా చేత ఇంకొన్ని పాటలు పాడించారు. అక్కడి నుంచి సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ఎక్కడో కూలి చేసుకుని బతికే నేను ఇలా అందరి ముందు పాటలు పాడటం, పేరు రావడం ఆనందంగా ఉంది’ అని వివరిస్తుంది దుర్గవ్వ. ప్రైవేట్ ఆల్బమ్‌లలో దుర్గవ్వ పాడిన పాటల్లో ‘సిరిసిల్ల చిన్నది..’, ‘నాయితల్లే.., ఉంగురమే.. రంగైనా రాములాల టుంగూరమే’ అనే పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. ఊరటనిచ్చిన పాట.. అనుకోకుండా ఎగిసిన గొంతుకలా నెట్టింట వైరల్ అయ్యింది దివ్యజ్యోతి. కరీంనగర్ జిల్లా నర్సింగపురం నుంచి పొట్ట చేతపట్టుకొని హైదరాబాద్ చేరిన కుటుంబం జ్యోతిది. భర్త కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. జ్యోతి ప్రైవేట్ కంపెనీలలో హౌస్ కీపర్‌గా ఉద్యోగం చేస్తుంది. ఇద్దరు కూతుళ్లు చదువుకుంటున్నారు. యాక్సిడెంట్ అయ్యి భర్త కాలు తీసేయడంతో కుటుబానికి జ్యోతి సంపాదనే ఆదరవు అవుతోంది. ‘‘కష్టంలో నాతో పాటు ఎప్పుడూ తోడుండేది పాటనే. ఆనందమేసినా నోటికొచ్చిన పాటలు పాడుకునేదాన్ని. చాలాసార్లు మాటలే పాటలవుతుంటాయి. నేను పనిచేసే చోట నాగవల్లి మేడం నాచేత పాట పాడించింది. ఆ పాటను సోషల్ మీడియాలో పెట్టడంతో నా గొంతుకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్‌లలో పాటలు పాడుతున్నాను. ఉదయం పూట డ్యూటీ చేస్తున్నాను. రాత్రిపూట పాటలు ప్రాక్టీస్ చేసుకుంటున్నా. నీ గొంతు చాలా బాగుంది. సినిమాల్లోనూ నీ చేత పాటలు పాడిస్తామని పెద్దోళ్లు చెబుతున్నరు’’ అని ఆనందంగా వివరిస్తుంది జ్యోతి. మనసు పెట్టి వినాలే కానీ, మన ఇరుగు పొరుగు, మనతోపాటు పని చేసేవారి గొంతుకలలో గమకాలు పలుకుతుంటాయి. గుర్తించి ఆస్వాదించాలి. పదిమందికీ వినిపించాలి. అప్పుడే పాటకు పట్టాభిషేకం జరుగుతుంది. – నిర్మలారెడ్డి -
కాకతీయం.. చారిత్రక నృత్య సౌరభం
ప్రజల్లో చైతన్యం నింపేలా కూచిపూడి నృత్యకళకు ఆధునికతను జోడించారామె. కాలం పరిచయం చేస్తున్న నృత్యరీతులను కళ్లకు అద్దుకున్నారు. మన సంస్కృతిని రాబోయే తరాలకు తెలియజేయాలనే తపనతో నృత్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. చారిత్రక అద్భుత కళా సౌందర్యాన్ని మన ముందుకు అంచెలంచెలుగా తీసుకువస్తున్నారు ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి, తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అవార్డు గ్రహీత డాక్టర్ జి.పద్మజారెడ్డి. కాకతీయుల కాలంలో తెలుగు నేలను అసమాన ధైర్య సాహసాలతో, అత్యంత సమర్థ వంతంగా పరిపాలించిన రాణి రుద్రమదేవి మేనమామ జాయపసేనాని. ఆయన రచించిన ‘నృత్యరత్నావళి’ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ‘కాకతీయం’ అనే నృత్య దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించి, 2017లో ప్రదర్శించారు పద్మజారెడ్డి. ఆ తరువాయి భాగం నేటి సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో కాకతీయం–2 పేరుతో ప్రదర్శన ఇస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఆమె నృత్య అకాడమీకి వెళ్లినప్పుడు శిష్యబృందంతో సాధన చేస్తూ కనిపించారు. ‘సాక్షి’తో ముచ్చటించారు. ‘‘శాస్త్రీయ నృత్యరీతులు అనగానే మనకు కూచిపూడి, భరతనాట్యం వంటివి కళ్లముందు నిలుస్తాయి. కానీ, తెలంగాణ రాష్ట్రానికి ఓ ప్రత్యేకమైన నృత్యరీతి ఉంది. అదే కాకతీయం. కాకతీయుల నృత్యకళ అనగానే మనకు సాధారణంగా పేరిణి నృత్యం గుర్తుకు వస్తుంది. కానీ, జాయపసేనాని రచించిన ‘నృత్యరత్నావళి’లోని నృత్యరీతులను చూస్తే వాటిని పరిచయం చేయడానికి ఒక జీవితకాలం సరిపోదేమో అనిపిస్తుంది. సముద్రమంతటి ఆ కళను నేను ఏ కొద్దిగానైనా పరిచయం చేయగలిగితే అదే పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఏడేళ్ల కృషి కూచిపూడి నృత్యకారిణిగా ఐదు దశాబ్దాలుగా ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ వచ్చాను. సత్కారాలు పొందాను. ఒకానొక సందర్భం లో రచయిత పప్పు వేణుగోపాలరావు ఆంగ్లంలోకి అనువదించిన ‘నృత్యరత్నావళి’ పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు ఇంత మంచి కళారీతిని పరిచయం చేయకుండా ఉండగలమా?! అంతటి సమర్థత నాలో ఉందా?! అనే ఎన్నో సందేహాలు తలెత్తాయి. విజయదుంధుభి వేళ ఆనందహేల, శృంగార, క్రోధ, కరుణ.. ఇలా నవరసాల కాకతీయ సౌరభాలు ఈ నృత్యరీతుల్లో కనిపిస్తాయి. ఇదొక సవాల్. నేను గతంలో చేసిన నృత్యరీతులన్నీ సవాల్‌గా తీసుకుని చేసినవే. ఈ కళారూపాన్ని కూడా నేటి ప్రజలకు పరిచేయాల్సిందే అనుకున్నాను. దీంట్లో భాగంగా వరంగల్లోతో పాటు ఎన్నో గ్రంథాలయాలు, కాకతీయుల గుడులన్నీ సందర్శించాను. గైడ్స్‌తో మాట్లాడాను. పరిశోధకులను కలిశాను. ఏడేళ్లుగా ‘కాకతీయం’ తప్ప నా మనసులో మరో ఆలోచన లేదు. అంతగా ఈ కళలో మమేకం అయిపోయాను. ఆన్‌లైన్‌లోనూ సాధన పదిహేనేళ్లుగా ప్రణవ్ నృత్య అకాడమీ ద్వారా దాదాపు 700 మంది శిష్యులు నృత్యంలో ప్రావీణ్యం సాధించారు. నా దగ్గరకు వచ్చే శిష్యుల్లో ఆరేళ్ల వయసు నుంచి పాతికేళ్ల వయసు వారి వరకు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం చేసిన కాకతీయం పార్ట్ 1 కి విశేష స్పందన వచ్చింది. ఆ తర్వాత రెండవభాగాన్ని తీసుకువద్దామని రెండేళ్ల క్రితమే సాధనకు శ్రీకారం చుట్టాను. అయితే, కరోనా కారణంగా నృత్యక్లాసులు ఆన్లైన్లో తీసుకోవాల్సి వచ్చింది. పిల్లలు కూడా చురుకుదనం, ఆసక్తితో నేర్చుకున్నారు కాబట్టి ఈ నృత్యరీతుల్లో నిష్ణాతులు అయ్యారు. ప్రస్తుతం కొన్ని రోజులుగా అకాడమీలోనే శిక్షణ జరుగుతోంది. సామాజిక సమస్యలపై అవగాహన శాస్త్రీయ నృత్యం అనగానే పురాణేతిహాస ఘట్టాలే ప్రదర్శిస్తారు అనుకుంటారు. కానీ, ఈ నృత్యం ద్వారా సమాజ సమస్యలను అద్దంలా చూపుతూ, వాటికి పరిష్కారం కూడా సూచించే కళారీతులను ప్రదర్శించాను. వాటిలో భ్రూణహత్యలు, ఎయిడ్స్ పై అవగాహన, నమస్తే ఇండియా, సీజన్ ఆఫ్ ఫ్లవర్స్‌తో పాటు పురాణేతిహాసాలను నృత్యరూపకాల్లో ప్రదర్శించాను. మనకు కూచిపూడి అనగానే సిద్ధేంద్రయోగి, భరతనాట్యం అనగానే భరతముని పేరు గుర్తుకు వస్తాయి. అలాగే, కాకతీయం అనగానే జాయప పేరు గుర్తు రావాలన్నదే నా తపన’’ అంటూ శిష్యులవైపు కదిలారు ఈ నృత్యకారిణి. వందమంది శిష్య బృందంతో నృత్యరత్నావళిలోని పిండి, గొండలి, రాసకం, పేరిణి, శివప్రియం, కందుక, లాస్యాంగం, చాలన.. నృత్యరీతులను కాయతీయంలో ప్రదర్శిస్తున్నారు పద్మజారెడ్డి. కాల ప్రవాహంలో కళలు కనుమరుగు కాకుండా కాపాడేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్క కళాహృదయానికి ఈ సందర్భంగా అభివాదం చెబుదాం. నృత్యరూపకంలో... – నిర్మలారెడ్డి -
Himansee Katragadda: టెంపుల్ డ్యాన్స్ వీడియోలతో .. ప్రాచీన ఆలయాలకు నూతన శోభ!!
గణపురం కోటగుళ్లు .. గండికోట మాధవరాయ ఓరుగళ్లు రామప్ప.. జాకారం శివయ్య ఏ ఊళ్లో చూసినా ‘కొలువై ఉన్నాడే దేవ దేవుడు... కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే..’ అంటూ ఆనందపరవశంతో తమ నాట్య ప్రయాణాన్ని వివరిస్తుంది హిమాన్సీ కాట్రగడ్డ. నెమలికి నేర్పిన నడకలివీ .. అంటూ తన పాదాల మువ్వలతో అలరిస్తుంది. తెలంగాణలోని వరంగల్లు వాసి అయిన హిమాన్సీ కూచిపూడి నృత్యకారిణి. తెలుగు రాష్ట్రాలలోని దేవాలయాలు, శిథిలావస్థలో ఉన్న ఆలయ ప్రాంగణాల్లో నృత్యం చేస్తూ, వాటిని వీడియోలుగా రూపుకట్టి ‘టెంపుల్ డ్యాన్స్’ పేరిట అలనాటి వైభవాన్ని మన కళ్లకు కడుతోంది. ఆలయ ప్రాంగణంలో నృత్యాన్ని దృశ్యీకరిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డులు, దేశ వ్యాప్త నృత్య ప్రదర్శనలతో పాటు టాలీవుడ్‌లోనూ, కోలీవుడ్‌లోనూ నటిగా గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తోంది హిమాన్సీ. తెలుగులో ఇటీవల సూర్యాస్తమయం, కోలీవుడ్‌లో నవిలా కిన్నరి సినిమాలలో నటించి, నటిగా విమర్శకుల మెప్పు పొందింది. ఎనిమిదేళ్ల వయసు నుంచి కూచిపూడి నృత్యసాధన చేస్తూ దేశవ్యాప్తంగా నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న హిమాన్సీ ప్రస్తుతం బి.టెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. టెంపుల్ డ్యాన్స్ ఆలోచనను, అందుకు తన కృషిని ఇలా వివరించింది. ‘‘నేను చేసిన ‘టెంపుల్ డ్యాన్స్’ వీడియోలకు కళాతపస్వి విశ్వనాథ్, సిరివెన్నెల సీతారామశాస్త్రి, సప్తపది సినిమా నటీమణి సబిత తమ ప్రశంసలు అందించారు. మా దేవాలయ నృత్యాలను ఆశీర్వదించారు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక దేవాలయాలను ఒక్కొక్కటిగా చేరుకోవడం, వాటిని మా నృత్యం ద్వారా ప్రజల్లోకి తీసుకురావడం మేం చేయాలనుకున్న పని. నాకు మద్దతుగా మా గురువు సుధీర్ గారు నిలవడంతో నా ఆలోచనను అమలులో పెట్టడం మరింత సులువు అయ్యింది. కట్టిపడేసే మార్మికత చిన్ననాటి నుంచి చారిత్రక రహస్యాల పట్ల అమితమైన ఆసక్తి. వాటి శోధనల్లో ఉన్నానంటే నన్ను నేను మర్చిపోతాను. వరంగల్‌లో కాకతీయ రాజులు కట్టించిన ఎన్నో గుళ్లు, వాటి వైభవం చూస్తూ పెరిగాను. ఆ శిల్పకళలో ఏదో తెలియని మార్మికత కట్టిపడేస్తుంటుంది. ఎక్కడ ఆలయాన్ని సందర్శించినా నా నాట్యకళతో ముడిపెట్టినట్టుగా అనిపించేది. ప్రతీ ఆలయంలో నాట్య మండపాలు ఉన్నాయంటే, నాడు కళలకు ఎంత ప్రాధాన్యమిచ్చేవారో దీనిని బట్టే తెలిసిపోతుంది. కళల ద్వారా విద్యను జనాల్లోకి తీసుకువెళ్లేవారు. వీటన్నింటినీ తెలుసుకుంటూ ఏ ఆలయానికి వెళ్లినా వీడియోలు, ఫొటోలు తీస్తుండేదాన్ని. కళ ఎప్పటికీ సజీవం కాకతీయు రాజుల చరిత్ర చదివినప్పుడు, ఆలయ నిర్మాణాల పట్ల వారికున్న దూరదృష్టి నన్ను అమితంగా ఆకర్షించింది. అదే, నన్ను అనేక ఆలయాలను దర్శించేలా చేసింది. మనకు తెలిసినంతవరకు హంపి, ఖజరహో ఆలయాల గురించి, వాటి శిల్ప కళ గురించి గొప్పగా ప్రస్తావిస్తుంటాం. కానీ, ఒక్క తెలంగాణలోనే వెయ్యికి పైగా శివాలయాలున్నాయని, అంతకుమించి శిల్పకళ ఉందని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. ఆ ఆలయాలు నేడు చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయని తెలుసుకున్నాను. కొన్నింటిని ప్రభుత్వం గుర్తించి, వాటిని బాగు చేసే ప్రయత్నం చేస్తోంది. రేపటి తరాలకు నాటి కళను అందించాల్సిన అవసరం ఉంది. సామాజిక మాధ్యమంతో వెలుగులోకి.. ప్రాచీన ఆలయాల గురించి శోధిస్తున్నప్పుడు పుస్తకాల్లో చదివి, వాటి చరిత్ర గురించి తెలుసుకున్నాను. అవేవీ దృశ్యరూపంలో లేవని తెలుసుకున్నాను. ఇదే విషయాన్ని మా గురువుగారితో చర్చించి, ‘టెంపుల్ డ్యాన్స్’ పేరుతో వీడియోలు తీస్తూ, మా నాట్యకళాకారులచేత కూడా ప్రదర్శనలు ఇస్తూ, వాటిని సామాజిక మాధ్యమం ద్వారా జనంలోకి తీసుకువస్తున్నాం. ఇటీవల తెలంగాణలోని కోటగుళ్లు, రామప్ప, వారణాసిలో చేసిన నృత్యాలకు మంచి స్పందన వచ్చింది. ఏ ఊళ్లో శిథిలావస్థలో ఉన్న గుడి అయినా, వెలుగులోకి రావాలని, తిరిగి ఆ గుడికి కళాకాంతులు తీసుకురావాలన్నది నా తాపత్రయం. అలా వరంగల్‌లోని అన్ని గుళ్ల వద్ద టెంపుల్ డ్యాన్స్ వీడియోలు చిత్రించాం. మా నాట్య అకాడమీ నుంచి బృందాన్ని తీసుకెళ్లి, తగిన పాటను ఎంపిక చేసుకొని, డ్రెస్సింగ్, వీడియో, ఎడిటింగ్.. అన్ని బాధ్యతలు చూసుకుంటాను. ఇది ఒక తపస్సులాగా చేస్తున్నాను. ఇందుకు మా అమ్మ శ్రీలక్ష్మి, నాన్న శ్రీనివాస్‌లు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఊరే ముందుకు వచ్చి... తెలంగాణలోని జాకారం ఊళ్లో శివయ్య ఆలయం చూసి ఆశ్చర్యపోయాం. ఆ ఆలయానికి పై కప్పు ఎప్పుడో పడిపోయింది. లోపలంతా చెత్త పేరుకుపోయింది. అద్భుత కళా సంపద గల ఆ ఆలయం గురించి ఆ ఊరి పెద్దలు ఎన్నో విషయాలు వివరించారు. ఆ గుడిని బాగు చేయడానికి గతంలో ఆ ఊరి వారు చందాలు పోగేశారు. ప్రభుత్వం కూడా అందుకు తగిన మద్ధతు ఇచ్చింది. కానీ, ఆ తర్వాత ఆచరణలోకి రాకుండానే ఆగిపోయింది. మేం అక్కడ ప్రస్తుతం ఉన్న సమస్యను రికార్డ్ చేయడంతో పాటు, మా నృత్యరీతులను ప్రదర్శించాం. వాటిని వీడియోగా తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ గుడిని బాగుచేసే పనులు మళ్లీ మొదలయ్యాయి’’ అని ఆనందంగా వివరించింది హిమాన్సీ. ‘ఆలయంలో ఒక్క దీపమైనా వెలిగించాలని ఎంతోమంది భావిస్తారు. మా నృత్యాల వల్ల ఒక్క ఆలయం బాగు పడినా చాలు’ అంటున్న హిమాన్సీ ఆలోచన జనం గుండెల్లోకి చేరాలని, ప్రాచీన కళావైభవం రేపటి తరాలకు అందాలని కోరుకుందాం. – నిర్మలారెడ్డి -
నా పిల్లలే నా తొలి విద్యార్థులు – మేఘన మనోగతం
ఈ ఏడాది 1 మిలియన్ డాలర్ల గ్లోబల్ టీచర్ ప్రైజ్‌కు మన దేశం నుంచి ఇద్దరు టీచర్లు టాప్–50 షార్ట్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు బీహార్‌వాసి సత్యం మిశ్రా కాగా మరొకరు హైదరాబాద్ టీచర్ మేఘనా ముసునూరి. ఈ సందర్భంగా ‘సాక్షి’ మేఘన ముసునూరితో ముచ్చటించింది. ‘‘వాస్తవాన్ని పిల్లలకు చిన్ననాటి నుంచే పరిచయం చేస్తే వారిలో జీవన నైపుణ్యాలు పెరిగి, కోరుకున్నదాంట్లో విజయం సాధిస్తారు’’ అంటూ తను నేర్చుకున్న విషయాలు, పిల్లలకు నేర్పుతున్న నైపుణ్యాల గురించి వివరించారు ఈ టీచర్. ‘‘మనది అభివృద్ధి చెందుతున్న దేశంగా కాదు పిల్లలకు పరిచయం చేయాల్సింది. మన దేశ చారిత్రక, సాంస్కృతిక గొప్పదనం అన్ని దేశాలకన్నా ఎంత ఘనమైనదో తెలియజేయాలి. దీనివల్ల పిల్లల్లో ఆత్మస్థైర్యం వృద్ధి చెందుతుంది. అదే నేను ఇప్పుడు చేస్తున్న పని. అందులో భాగంగా విద్యావిధానంలో నేను తీసుకు వచ్చిన మార్పులు, చేస్తున్న టీచింగ్ పద్ధతులు గ్లోబల్ టీచర్ ప్రైజ్ షార్ట్ లిస్ట్‌కు ఎంపికయ్యేలా చేసింది. 121 దేశాల నుంచి వచ్చిన 8 వేల దరఖాస్తులలో నేను టాప్‌లిస్ట్‌లో ఉండటం చాలా సంతోషంగా ఉంది. నేను పుట్టి పెరిగింది మెదక్ జిల్లా మాచవరం అనే పల్లెటూరులో. చిన్ననాటి నుంచి స్కూల్లో వచ్చిన రకరకాల సందేహాలకు సరైన సమాధాలు దొరికేవి కావు. సమాధానాలు వెతికే ఉద్దేశ్యంతోనే, పిల్లలంతా నాలాగే ఆలోచిస్తారు, వాటిని ఎప్పటికైనా నివృత్తి చేయాలంటే టీచర్ని అవాలనుకునేదాన్ని. నాదైన ప్రత్యేకత తో పిల్లలను తీర్చిదిద్దాలనుకునేదాన్ని. అందుకే, బీఈడీ చేశాను. ప్రత్యేక శిక్షణ పెళ్లి తర్వాత మా వారి ఉద్యోగరీత్యా లండన్ వెళ్లిపోయాం. అక్కడ కూడా పిల్లల సైకాలజీకి సంబంధించిన రకరకాల కోర్సులు పూర్తి చేశాను. శిక్షణ తీసుకున్నాను. స్పెషల్ చిల్డ్రన్స్ని ఎలా చూసుకోవాలో తెలుసుకోవడానికి అందులోనూ శిక్షణ తీసుకున్నాను. పిల్లలకు తొలి గురువు తల్లే అవుతుంది. అందుకే, పిల్లలు చంటిబిడ్డలుగా ఉన్ననాటి నుంచే వారిని ఎలా పెంచాలో క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పిల్లలను కనాలనుకున్నాను. మా ఇద్దరు కూతుళ్లను పెంచడానికి తీసుకున్న శిక్షణ నన్ను తిరిగి ఇండియా వచ్చేలా చేసింది. 2007 లో కుటుంబంతో పాటు ఇండియాకు వచ్చి మియాపూర్‌లో ‘ఫౌంటెయిన్‌హెడ్ గ్లోబల్ స్కూల్’ పేరుతో ప్లే స్కూల్ ప్రారంభించాను. ప్రత్యేక సిలబస్.. మనమింకా ఎప్పటివో పాత బోధనా పద్ధతులను అవలంబిస్తున్నాము. భవిష్యత్తు తరాలు చాలా ముందుండాలి. అందుకే, నేను నేర్చుకున్న శిక్షణతో పిల్లలకు నాకు నేనుగా ప్రత్యేక సిలబస్ రూపొందించాను. మొదట నా ఇద్దరు పిల్లలే నా స్కూల్లో విద్యార్థులు. ఆ తర్వాత ఒకరొకరుగా వచ్చి చేరారు. చాలా మంది తల్లిదండ్రులకు నా బోధనా పద్ధతులు నచ్చలేదు. తిరిగి వెళ్లిపోయారు కూడా. అయినా వెనకంజ వేయదలుచుకోలేదు. తీసుకున్న టీచర్లకు నేనకున్న విధంగా శిక్షణ ఇచ్చాను. వాస్తవం తప్పనిసరి ‘భయం ఎక్కడుండాలి, ఎక్కడ ఉండకూడదు’ అనేది కూడా నా సిలబస్‌లో భాగమే. స్కూల్లో ఒకే తరహా సిలబస్ కన్నా జీవన నైపుణ్యాలకే ప్రాధాన్యత ఎక్కువ. రోజువారీ జీవన విధానంలో ఉండే ప్రతీ అవసరం తెలియజేసేందుకు కృషి చేస్తాం. పిల్లల కమిటీల ద్వారా గ్రూప్ డిస్కషన్లు ఏర్పాటు చేస్తుంటాం. ఉదాహరణకు.. కూరగాయల సంతను స్కూల్లోనే ఏర్పాటు చేసి, వాటిద్వారా అమ్మడం కొనడమనే ప్రక్రియలు తెలియజేయడం, అలా సంపాదించిన డబ్బును ఎలా ఉపయోగించాలో చెప్పడం, వారు సంపాదించిన మొత్తానికి స్కూల్ నుంచి అంతే డబ్బును జత చేసి, అవసరమైన వారికి దానం చేయడం. ఇలాంటివన్నీ వాస్తవ పద్ధతులతో బోధన చేస్తుంటాం. మొదట ఇంగ్లిషు, గణితం చెప్పేదాన్ని. నాలుగేళ్ల క్రితం పిల్లలకు చైల్డ్ రైట్స్ గురించి పరిచయం చేయాలనుకున్నప్పుడు సోషల్ స్టడీస్ వారికి అర్థమయ్యే విధంగా చెప్పడం మొదలుపెట్టాను. ఆ విధంగా ఇంగ్లిషు, గణితం, సోషల్ టీచర్ని నేనే. పిల్లలు బాగు చేసిన చెరువు... పర్యావరణం గురించి పరిచయం చేయాలనుకున్నప్పుడు కొంచెం కష్టమే అయ్యింది. మొక్కలు, పక్షులు, జంతుజాలమే కాదు. ఒక చెరువును కూడా చూపిస్తే బాగుంటుందనుకున్నాను. మేముండే ప్రాంతం మియాపూర్‌లో ‘మీదికుంట’ చెరువు ఏ మాత్రం అనువుగా లేదని, పిల్లలకు అర్థమయ్యేలా చెబితే, అంత చిన్నపిల్లలు చెరువును శుభ్రం చేయడానికి ముందుకొచ్చారు. అంత చిన్నపిల్లల్లో సమాజం పట్ల అవగాహన కలిగించడం చాలా ఆనందాన్నిచ్చింది. ఆ చెరువు శుభ్రతకు అందరం కలిసి పాటుపడిన సంఘటనలను ఎప్పటికీ మరవలేం. మా పెద్దమ్మాయి ఇంటర్మీడియెట్‌కు వచ్చే సమయానికి జూనియర్ కాలేజీ కూడా ఈ స్కూల్లోనే ఏర్పాటు చేశాను. ప్రతి యేటా దేశంలో 30 రాష్ట్రాల నుంచి సంవత్సరానికి ఒకసారి సమావేశాలు జరుగుతుంటాయి. వాటిలో బోధనా పద్ధతుల గురించి, భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే ప్రక్రియలపైనా చర్చలు జరుగుతుంటాయి. ఈ ప్రపంచంలో అత్యుత్తమమైనవాడు గురువు. భవిష్యత్తు తరాలను తీర్చేదిద్దాలన్న సంకల్పంతోనే ఈ వృత్తిలోకి వచ్చాను. ఇక ముందూ నా బోధనలో ఇదే విధానాన్ని కొనసాగిస్తాను’’ అని వివరించారు ఈ గ్లోబల్ టీచర్. – నిర్మలారెడ్డి -
చేనేత గురించి చెబుతుంటే నా హృదయం ఉప్పొంగేది
చేనేత ఉత్పత్తులలో నాణ్యతను కాపాడటం.. చేనేతల్లో జనాకర్షణీయ పద్ధతులు తీసుకురావడం.. చేనేత కార్మికుల వారసులను తిరిగి వారి వృత్తి వైపుగా మళ్లించడానికి కృషి చేస్తున్నారు డాక్టర షర్మిలా నాగరాజ్ నందుల. తెలంగాణ రాష్ట్రంలో చేనేత అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వ్యక్తు లలో ‘ప్రముఖ వ్యక్తి’ పురస్కారం ఈ యేడాది డాక్టర్ షర్మిలా నాగరాజ్ అందుకున్నారు. హైదరాబాద్ వాసి అయిన ఈ హ్యాండ్లూమ్ లవర్ హారోస్కోప్ వీవింగ్, వర్డ్స్ వీవింగ్, సహజరంగులు, పాత సాంకేతిక నైపుణ్యాలతో చేనేతల అభివృద్ధికి పాటుపడుతున్నారు. ‘నెలలో ఒక్కరోజు అందరం ఖాదీ ధరిద్దాం. చేనేతల వృద్ధికి పాటుపడదాం’ అంటున్నారు. అమెరికా వాసి బోనీ టెర్సెస్తో కలిసి చేసిన హారోస్కోప్ టెక్నిక్స్ నేత కార్మికుల ప్రాచీన సాంకేతిక వ్యవస్థ, లెక్చరర్‌గా విద్యార్థులకు తన అనుభవాలను పంచడం వంటి అంశాల్లో దాదాపు 30 సంవత్సరాల అనుభవం షర్మిలా నాగరాజ్ సొంతం. పదేళ్లపాటు నిఫ్ట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులను నిర్వర్తించిన షర్మిల తన టీనేజ్ నుంచే చేనేతలపై పెరిగిన మక్కువ గురించి ఈ విధంగా వివరించారు. ‘‘చిన్నతనంలో అమ్మ నుంచి నేర్చుకున్న చేనేతల రీసైక్లింగ్ మెథడ్స్ కూడా నన్ను ఈ వైపుగా నడిపించేలా చేశాయి. ఎమ్మెస్సీ చేసేటప్పుడు మా లెక్చరర్ తన నేత దుస్తులు, అందులో వాడే టెక్నిక్స్ గురించి చెబుతున్నప్పుడు నా హృదయం ఉప్పొంగేది. ఆ ఇష్టమే హ్యాండ్లూమ్స్, నేచరల్ డైస్ మీద పీహెచ్డీ వైపుగా నడిపించిది. పదేళ్ల పాటు అమెరికాలో కోల్డ్‌వాటర్ క్రీక్, కోహ్ల్సి రీటైలర్లతో కలిసి పనిచేసే అనుభవాన్ని తెచ్చిపెట్టింది. పరిశోధనల వైపుగా.. పరిశోధనల్లో భాగంగా చేనేతలు, వాటి సహజరంగులు ఆరోగ్యానికి మేలు చేసేవిధానంపై ఐదేళ్ల పాటు విస్తృత పరిశోధనలు చేశాను. దీంతో మన ప్రాచీన పద్ధతులు, పాత సాంకేతిక నైపుణ్యాల పట్ల చాలా ఇష్టం ఏర్పడింది. చేనేతలను ధరించడం వల్ల వచ్చే శక్తి గురించి తెలిసింది. హారోస్కోప్ వీవింగ్ గ్రహాల పనితీరు మన జీవన విధానంపై ఎలా ఉంటుందో తెలియజేసే శాస్త్రం జ్యోతిష్యం. అమెరికాలో ఉన్నప్పుడు శ్రీమతి బోనీ టెర్సెస్ అనే ఆవిడ పరిచయమయ్యింది. ఆమె సూర్యరాశుల ఆధారంగా తన హ్యాండ్లూమ్స్ను స్వయంగా డిజైన్ చేసేవారు. ప్రతి మనిషికీ నక్షత్రాలు, గ్రహాల స్థితిని అనుసరించి వారికి నప్పే రంగులను కలుపుతూ బట్టలను నేసేవారు. ఆ నైపుణ్యాలను శ్రీమతి బోనీ నుండి నేర్చుకున్నాను. చేనేతల్లో ఫ్యాషన్–ఆస్ట్రాలజీ తీసుకురావాలనే ఆలోచనతో హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత నా డిజైన్స్‌లో ఆ టెక్నిక్స్ ప్రవేశపెట్టాను. అలాగే, థెరప్యూటిక్ వీవింగ్ కూడా. అంటే చేనేతలను ధరిస్తే మనకు వచ్చే పాజిటివ్ శక్తి, మనలో సంతోషం ఎంత పెరుగుతుందో అనే అంశాల్లో కూడా పరిశోధనలు చేశాను. పదాలను ఉపయోగిస్తూ చేసే వర్డ్ వీవింగ్‌కు సంబంధించిన టెక్నిక్స్ కూడా ఇందులో తీసుకుచ్చి, నేత కారులచే వర్క్‌షాప్‌లను ఏర్పాటు చేశాను. ‘గిరిజనుల కాస్ట్యూమ్స్‌లో మారుతున్న ట్రెండ్స్’పై మాస్టర్ థీసిస్ చేశాను. కౌముది స్టూడియో.. త్రిబుల్ ఆర్ ప్రాతిపదికన నడుస్తుంది కౌముది. రిస్టోర్, రిట్రివ్, రిసాల్వ్.. జాతీయ హస్తకళలను పునరుద్ధరించడం, చేనేత కార్మికులను పునరుజ్జీవింపచేయడం, చేనేత దుస్తుల కళను నిలుపుకోవడం.. ఈ మూడింటివైపుగా అభివృద్ధి చేయడానికి కౌముది స్టూడియోను ఆరేళ్ల క్రితం ఏర్పాటు చేశాను. బలమైన కారణం చేనేత కార్మికుల పరిస్థితులే నేనీ రంగంలో రావడానికి ప్రధాన కారణం. ప్రతి రంగంలోనూ మనం చాలా అభివృద్ధి సాధిస్తున్నాం. కానీ, చేనేత కార్మికుల విషయం వచ్చేసరికి ఇంకా వెనుకంజలోనే ఉన్నాం. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, డిజైనర్లు చేనేతలను తీసుకుంటున్నారు. కానీ, వారి జీవితాల్లో సరైన వృద్ధి లేదు. నెల వారి వేతనం ఎంత అనేది ఇప్పటికీ నిర్ధారణ లేకపోవడం కూడా ఒక కారణం. మన దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఆయా ప్రాంతానికి తగ్గ కళ ఉంది. కలంకారీ, బాతిక్, గుజరాతీ ప్రింటర్లు ఉన్నారు. వారిని బృందాలుగా ముందుకు తీసుకెళ్లాలనేది నా ఆలోచన. అల్మరాలో 25 శాతం.. నా బట్టల అల్మరాలో పూర్తిగా హ్యాండ్లూమ్స్ మాత్రమే ఉంటాయి. మనం చెప్పేది ఆచరణలో పెడితేనే దానిలో వృద్ధి కనపడుతుందని నా నమ్మకం. అలాగే, ఎక్కడ వర్క్‌షాప్స్ పెట్టినా అందరికీ ఒకటే మాట చెబుతుంటాను. ‘మీ బీరువాల్లో 25 శాతం చేనేతలకు స్థానం ఇవ్వండి’ అని. విద్యార్థిగా ఉన్నప్పుడు టెక్స్టైల్స్ ఆఫ్ ఇండియా మొత్తం తిరిగాను. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గుజరాత్ నుండి వెస్ట్ బెంగాల్ వరకు అన్ని చోట్లా హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. వీరంతా వృద్ధిలోకి రావాలంటే మన చేనేతలను మనం ధరించాలి. దీంతో పాటు విదేశాలకూ మన కళలను విస్తరింపజేయాలన్నది నా కల. చేనేతల నుంచి దూరమైన పిల్లలను తిరిగి చేనేతలకు దగ్గర చేయాలన్నదే నా ఆలోచన’’ అని వివరించారు డాక్టర్ షర్మిలా నాగరాజ్ నందుల. చేనేతల్లో వాడే రంగులు సహజసిద్ధమైనవి. ఆకులు, విత్తనాలు, పువ్వులు, బెరడు, వేళ్ల నుంచి వాటిని తీస్తారు. వీటి వల్ల చేనేతకారుడే కాదు రైతు కూడా బాగుపడతాడు. ఫలితంగా పర్యావరణమూ బాగుంటుంది అనే ఆలోచనను మన ముందుంచారు ఈ చేనేత ప్రేమిక. – నిర్మలారెడ్డి -
Ayesha Charugulla: విజయవాడ టు అమెరికా
పై చదువుల కోసం విదేశాలకు వెళ్లినవారు అక్కడే ఉద్యోగం చూసుకొని, స్థిరపడిపోతారు. ఎప్పుడైనా ఒకసారి స్వదేశానికి వచ్చి, తల్లిదండ్రులను కలిసివెళ్లిపోతారు. ఆయేషా చారుగుళ్ల విజయవాడ నుంచి వెళ్లి అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. అయితే, కొన్నాళ్లకు తను పుట్టి పెరిగిన ప్రాంతానికి ఏదైనా సాయం చేయాలనుకున్నారు. నిరుపేద, వికలాంగబాలల చదువులు, ఆటిజమ్ చిన్నారులకు సెంటర్లు, ట్రాఫికింగ్‌కు గురైన మైనర్ అమ్మాయిల భవిష్యత్తు కోసం కృషి చేసే ఆయేషా ఇప్పుడు మహమ్మారి కష్టకాలంలో తనూ ఓ చేయూతగా మారారు. తెలుగు రాష్ట్రాల్లో తను అందిస్తున్న సేవల గురించి ఆయేషా ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు. ‘‘పాతికేళ్ల క్రితం విజయవాడ నుంచి అమెరికా వెళ్లాను. భర్త, ఇద్దరు పిల్లలు, సాఫ్ట్వేర్ ఉద్యోగం.. రోజులు సాఫీగా సాగిపోతున్నాయి. ఐదేళ్ల క్రితం మా ఇద్దరు పిల్లలతోపాటు, కమ్యూనిటీ లో ఉన్న పిల్లలను సెలవుల సమయం లో గమనించాను. అంతా ఒకే మూస పద్ధతిలో పెరుగుతున్నారనిపించింది. లగ్జరీ జీవనం కాకుండా మెరుగైన జీవన విలువలు తెలియజేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అలా, వారాంతాల్లో పిల్లలను కూడగట్టుకొని వర్క్‌షాప్స్ ఏర్పాటు చేసేదాన్ని. మంచి స్పందన వచ్చింది. బాగానే స్థిరపడ్డాం కదా అనే ఆలోచనతో ఉద్యోగం మానేసి పిల్లలందరినీ కూడగట్టుకొని వారిచేత రకరకాల ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం మొదలుపెట్టాను. పిల్లలు కూడా నేను చేస్తున్న కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం మొదలు పెట్టారు. ఈ పనిలో కొంతమంది స్నేహితులు, పిల్లల తల్లిదండ్రులు జత కలిశారు. దీంతో స్నేహితుల సలహా మేరకు 2015లో ఆరుగురు పిల్లలతో ‘ఎంపవర్ అండ్ ఎక్సెల్’ అనే పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాను. ఇప్పుడు 500 మంది పిల్లలే స్వచ్ఛందంగా కార్యక్రమాలను నిర్వహించే దశకు చేరుకున్నారు. వారాంతాల్లో ఓల్డేజీహోమ్లకు వెళ్లడం, తామే స్వయంగా వంట చేసి, ఆహారాన్ని పంచడం, వారికన్నా చిన్న పిల్లలకు వర్క్‌షాప్స్ కండక్ట్ చేయడం.. ఎంతగా మారిపోయారు పిల్లలు అనిపిస్తుంది వారిని చూస్తుంటే. ప్రతి యేటా వేసవి సమయం మా అమ్మానాన్నలు ఆంధ్రాలోనే ఉన్నారు. వారిని చూడటం కోసం మొదట మా పిల్లలను తీసుకొని ఇండియాకు వచ్చేదాన్ని. మారుమూల గ్రామాల్లోని పాఠశాల పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి, ఆ స్కూళ్లలో లైబ్రరీలను ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. స్వచ్ఛందంగా పనిచేసే మిత్రులు కొందరు పరిచయమయ్యారు. వారితో నిరంతరం కాంటాక్ట్‌లో ఉంటూ అమెరికాలో మేమున్న ప్రాంతంలో సేకరించిన పుస్తకాలను ఆంధ్రాలోని గ్రామాల స్కూళ్లకు అందజేసేవాళ్లం. ఈ కార్యక్రమం ప్రతి యేటా నిర్వహించేవాళ్లం. నాతో పాటు ప్రతి యేటా వలెంటీర్లుగా వర్క్ చేసే పిల్లలు కనీసం పది మందైనా ఇండియాకు వచ్చేవారు. వారితో ఇక్కడి స్కూల్ పిల్లలకు ఇంగ్లిషు వర్క్‌షాప్స్ కండక్ట్ చేసేదాన్ని. నాతోపాటు వచ్చిన స్టూడెంట్స్‌లో స్ఫూర్తి వెల్లంకొండ అనే అమ్మాయి ఇండియాకి ఆమె తల్లితో కలిసి వచ్చి ఇండియా చాప్టర్ ఆధ్వర్యంలో అడపిల్లలకి శరీర శుభ్రత, నెలసరి గురించి 50 సెషన్స్ నడిపించింది. ఆ విద్యార్థిని హైజీన్ మీద స్వయంగా రాసిన ’జాగృతి’ అనే బుక్ కూడా రిలీజ్ చేశాం. ఆ తర్వాత సమస్యలు తెలుస్తున్న కొద్దీ వాటి మీద దృష్టి పెడుతూ వచ్చాను. మరిన్ని అడుగులు.. ప్రకాశం జిల్లా మాచవరంలో ఆశాసదన్ ట్రాఫికింగ్ మైనర్ విక్టిమ్స్ గురించి తెలిసినప్పుడు చాలా బాధగా అనిపించింది. దాదాపు 70 మంది పిల్లలు. ఒక విధంగా సమాజం నుంచి దూరమైన పిల్లలు అనుకోవచ్చు. వారికి అండగా ఉండాలని ఏడాది పొడవునా ఆహారంతోపాటు వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని, వారికి బేకింగ్ సామాను అమెరికా నుంచి తెచ్చి ప్రొఫెషనల్స్‌తో ట్రైనింగ్ ఇప్పించాం. జూట్ బ్యాగ్ తయారీ నేర్పించి, ఆ బ్యాగులను అమెరికాలో మార్కెట్ చేసి ఆ సొమ్ము మొత్తాన్ని వారికి అందించాం. సెల్ఫ్‌డిఫెన్స్‌లో అమ్మాయిలకు శిక్షణ ఇప్పించాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆశా జ్యోతి అనే సంస్థ మానసిక – భౌతిక వికలాంగులకు సర్వీస్ చేస్తుంటుంది. అక్కడి పిల్లల పరిస్థితి చూసి, చలించిపోయాం. వారికి కావాల్సిన భోజన సదుపాయాలు, సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. వికలాంగ బాలలకు వీల్ చైర్స్తోపాటు హైడ్రోథెరపీకి సంబంధించిన పూల్‌ని ఏర్పాటు చేశాం. పిల్లలకి పాల కోసం పాడి గేదెలను, ఆవులను కొనిచ్చాం. కృష్ణాజిల్లా నూజివీడులోని ఓ హెచ్ఐవి పాజిటివ్ సంస్థలోని చిన్నారులకు దుస్తులు, భోజన సదుపాయం, ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు కాలేజ్ ఫీజు ఏర్పాటు చేశాం. ముంబాయ్‌కి చెందిన ‘లిటిల్ హార్ట్స్’ అనే ఆటిజం సెంటర్ లో చిన్నారులకు అమెరికాలోని స్పెషలిస్ట్స్ ద్వారా టెలీ మెడిసిన్ థెరపీ ఇప్పించాం. తెలంగాణలోని ఖమ్మంలో చేగొమ్మ, కనికెళ్ల గ్రామాల్లోని స్కూల్ టీచర్లు వలంటీర్ల ద్వారా లైబ్రరీ ఏర్పాటుకు సంప్రదించడంతో వారికి ఆ ఏర్పాటు చేశాం. సాయానికి సిద్ధం 2020లో మేమంతా కరోనా సృష్టించిన దారుణాలను చవిచూశాం. ఇప్పుడు కాస్త కుదుటపడ్డాం. కాని, భారత్ పరిస్థితి మమ్మల్ని కలచివేస్తోంది. ఏదోవిధంగా మనవాళ్లకి సహకరించాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికి ఆంధ్రలో విజయవాడ, వినుకొండ, నరసరావుపేట, తెనాలిలో 500, తెలంగాణలో 300 బెడ్స్, ఆక్సిజన్ ఫ్లోమీటర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందించాం. గుంటూరు ఫీవర్ హాస్పిటల్‌కి మరిన్ని బెడ్స్ అందించనున్నాం. మహమ్మారి నుంచి అందరూ పూర్తిగా కోలుకున్న తర్వాత ఈ బెడ్స్‌ను ఓల్డేజీ హోమ్స్‌కు ఇవ్వాలనుకుంటున్నాం. తెలంగాణలో హైదరాబాద్ జవహర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన క్యాంప్‌కి, ఖమ్మంలోని బివికే భవన్లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్‌కి బెడ్స్ అందించాం. మరిన్ని బెడ్స్ అవసరం గురించి తెలిసింది. వాటి ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితిలో ఒక సర్వీస్ వెహికిల్‌ను ఏర్పాటు చేశాం. తాడేపల్లి నుంచి మంగళగిరి చుట్టుపక్కల ఊళ్లలో ఉన్న కరోనా పేషెంట్స్‌ను ఉచితంగా ఆసుపత్రికి చేర్చాలనేది మా ఉద్దేశ్యం. ఈ వెహికిల్ డ్రైవర్స్, అటెండర్స్కి పీపీఈ కిట్లు, మాస్కులు ఇతరత్రా జాగ్రత్తలు తీసుకున్నాం. మా హస్బెండ్ సంజయ్ చారుగుళ్ల 50 బెడ్స్ స్పాన్సర్ చేశారు. ఇదే విధంగా ఫండ్ రైజింగ్ మొత్తం మా మిత్రులు, మా వలంటీర్ కుటుంబాల నుంచే ఉంటుంది. రాబోయే రోజుల్లో థర్డ్ వేవ్ అంటున్నారు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనే ఆందోళన ఓ వైపు ఉన్నా, తట్టుకొని నిలబడానికి మా వంతుగా ఇవ్వదగ్గ సహకారానికి సమాయత్తం అవుతున్నాం’’ అంటూ వివరించారు ఆయేషా. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Kavitha Natarajan: ఆప్యాయతే.. అభయం
ఇప్పుడు సమాజం ఎన్నడూ లేనంత భయాందోళనల మధ్య కొట్టుమిట్టాడుతోందని, ఆప్యాయత, అవగాహన నిండిన మాటలతో దాన్ని పోగొట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు కవితా నటరాజన్. కరోనా కల్లోలం నేపథ్యంలో సమాజంలో విజృంభిస్తున్న పలు రకాల మానసిక సమస్యలకు ఆమె తన వంతు పరిష్కారాలను స్వచ్ఛందంగా అందిస్తున్నారు. గత ఏడాది తెలంగాణలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటైన సైకోసోషల్ కౌన్సిలింగ్ సర్వీసెస్‌లో భాగంగా ఆమె కౌన్సిలింగ్ సేవలు కొనసాగిస్తున్నారు. ఐటీ ఉద్యోగినిగా పనిచేస్తూనే మరోవైపు తనకు ఇష్టమైన సోషల్ సర్వీస్‌నూ వదలకుండా కృషి చేస్తున్న కవితానటరాజన్ తన అనుభవాలను పంచుకున్నారిలా... కిందటేడాది కరోన.. ‘‘కార్పొరేట్ రంగంలో ఉన్నా, ప్రస్తుతం సిజిఐ అనే ఐటి కంపెనీలో పనిచేస్తున్నా. చిన్ననాటి నుంచీ స్వచ్ఛంద సేవ అంటే ఇష్టం. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఎన్నడూ ఎరగనంత విచిత్రమైన పరిస్థితులున్నాయి. లాక్‌డవున్ అనే మాట అంతకుముందు మనలో ఎవరమూ కనీ విననిది. ఆకలి కేకలు విని చాలా బాధపడ్డా. అయితే బయటకు వెళ్లి ఫుడ్ ప్యాకెట్స్ పంచాలి వంటి ఆలోచనలు వచ్చినా, నా వ్యక్తిగత ఇమ్యూన్ సిస్టమ్ గురించి తెలుసు కాబట్టి అలా చేయలేకపోయా. అదే సమయంలో ఎన్నడూ లేనట్టు కొన్ని నెలల పాటు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితుల వల్ల చుట్టుపక్కల పలువురిలో విభిన్న రకాల మానసిక సమస్యలను గుర్తించాను. అప్పటికే సైకాలజీలో డిగ్రీ చేశాను కాబట్టి.. స్వచ్ఛందంగా సైకలాజికల్ కౌన్సిలింగ్ ఎందుకు ఇవ్వకూడదు? అనిపించింది. ఆ ఆలోచనను పోలీసు ఉన్నతాధికారి మహేష్ భగవత్ గారితో పంచుకుని, వారి సూచనల మేరకు రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో మేం గత ఏడాది ఏప్రిల్ 2 న కౌన్సిలింగ్ సేవలు ప్రారంభించాం. ఉదయం 9గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ వచ్చిన కాల్స్ ఇంకా గుర్తున్నాయి. లాక్ డౌన్ వల్ల పెరిగిన పనిభారంతో ఇళ్లలో మహిళలు చాలా ఇబ్బందులు పడ్డారు. వర్క్ డివిజన్ తెలియక చాలా మానసికంగా ఒత్తిళ్లకు లోనయ్యారు. మహిళలపై గృహహింసకు సంబంధించిన కాల్స్ కూడా విపరీతంగా వచ్చాయి. వీరందరికీ కౌన్సిలింగ్ ఇస్తూ అలా... మూడు నెలల పాటు పని చేశాం. కోవిడ్ తగ్గటంతో ఆ కాల్స్ తగ్గిపోయాయి. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయినప్పుడు మానసిక సంఘర్షణకు లోనైన యువత నుంచి పెద్ద సంఖ్యలో కాల్స్ వచ్చాయి. సెకండ్‌వేవ్ బాధితులు మరోసారి కోవిడ్ తన ప్రతాపం చూపిస్తున్న పరిస్థితుల్లో భావోద్వేగాలు మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే మరోసారి ఈ కౌన్సిలింగ్ సేవలు ప్రారంభించాం. గతం తో పోలిస్తే ఇప్పుడు మరింత విభిన్నమైన మానసిక సమస్యలతో సంప్రదిస్తున్నారు. వీరిలో తమ వారిని పోగొట్టుకున్న మహిళల మానసిక పరిస్థితి దయనీయంగా ఉంది. అలాగే దగ్గర బంధువుల్లో చావులు ఈసారి చాలామంది మనోధైర్యాన్ని పోగొడుతున్నాయి. తాజాగా బ్లాక్ ఫంగస్ గురించి కూడా కాల్స్ వస్తున్నాయంటే... ఇప్పుడు భయం ఎంతగా జనాల్లో పేరుకుపోయిందో అర్థమవుతుంది. మా వంతుగా వారిలో ధైర్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈసారి నాతోపాటు బాగా అనుభవం ఉన్న మరో 13 మంది మహిళ కౌన్సిలర్లు తమ సేవలు అందిస్తున్నారు. పోలీసుకూ మహిళకూ మధ్య గతంలో కూడా ఈ తరహా కౌన్సిలింగ్ చేసిన అనుభవం ఉంది. ‘మార్గదర్శక్’ పేరుతో మా లాంటి కొందరు స్వచ్ఛంద సేవకులకు గృహహింస, వేధింపులు.. వంటి వాటి విషయంలో చట్టబద్ధమైన అంశాలపై పోలీసు శాఖ ఆధ్వర్యం లో శిక్షణ అందించారు. అలాగే మన సమాజంలో కొందరు మహిళలకు పోలీస్ స్టేషన్ అన్నా, పోలీసులన్నా భయం ఉండొచ్చు. ముందు వారిని మానసికంగా ధైర్యం పుంజుకునేలా చేసి, వారి సమస్య నిర్భయంగా చెప్పగలిగేలా ప్రిపేర్ చేస్తాం, షీ టీమ్‌కు అనుసంధానంగా పనిచేస్తాం’’ అని వివరించారు కవిత. – నిర్మలారెడ్డి -
నా శ్వాస.. ధ్యాస.. సంద్రమే!
దేన్ని చూసి భయపడతామో దానితోనే తలపడితే... ధైర్యం విజయసోపానాలతో స్వాగత సత్కారం చేస్తుంది. నీళ్లను చూసి భయపడిన ఆ నీళ్లతోనే ఫైట్ చేసింది రికార్డులను కొల్లలుగా కొల్లగొడుతోంది. ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన ఈ నీటి మెరుపుతో ముచ్చటించిన విశేషాలు ఇవి. వయసు మీద పడుతున్నకొద్దీ ఆడవారిలో సహజంగా ఓ భయం ఉంటుంది. అనారోగ్య సమస్యలు వస్తాయేమో అనేది ఆ భయం వెనక దాగున్న వాస్తవం. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ, అందుకు తగిన సాధన విషయంలో అంతగా శ్రద్ధ ఉండదు. ఈ విషయాన్ని తన సంభాషణలో తొలుతగా ప్రస్తావించిన శ్యామల పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో. సోషియాలజీ విభాగంలో పట్టభద్రురాలైన శ్యామల నీళ్లు తనతో స్నేహం చేసిన తొలినాళ్ల గురించి చెబుతూ– ‘‘నేను యానిమేషన్ మూవీస్ కి ప్రొడ్యూసర్, డైరెక్టర్, రైటర్‌గా ఉండేదాన్ని. దీంట్లో నష్టాలు రావడంతో ఒత్తిడికి లోనయ్యాను. బిజినెస్ క్లోజ్ చేశాను. మైండ్‌ను మరోవైపుకు మళ్లించాల్సిన అవసరం అది. అప్పుడు స్విమ్మింగ్ ఎంచుకున్నాను. ఎవరైనా నీళ్లలో ఈత నేర్చుకోవాలనుకున్నప్పుడు ముందు వెయిట్‌లాస్, ఫిట్నెస్ గురించో ఆలోచిస్తారు. కానీ, నేను ఒక లక్ష్యం ఉండాలనుకున్నాను. అయితే, నీళ్లంటే విపరీతమైన భయం ఉండేది. నాలుగేళ్ల క్రితం సమ్మర్ టైమ్‌లోనే మొదటిసారి స్విమ్మింగ్‌పూల్‌కి వెళ్లాను. ఆ రోజు నీళ్లలో దిగినప్పుడు వచ్చిన వణుకు నాకు ఇప్పటికీ గుర్తే. కొన్ని రోజుల్లో ఏడు అడుగుల దూరం డైవింగ్ బోర్డ్ నుంచి జంప్ చేసినప్పుడు వణికిపోయాను. కానీ, మూడు నెలల్లోనే పోటీలో పాల్గొనేంతగా సాధన చేశాను. మొదటిసారే కాంస్య పతకం వచ్చింది’’ అని తెలిపిన శ్యామల యుద్ధంలో దిగేంతవరకే భయం. దిగితే ఎంతటివారినైనా ఓడించాల్సిందేననే తపనను కనబర్చింది. సంద్రంవైపు గురి నాటి నుంచి పాల్గొన్న ప్రతీ పోటీలో మెడల్స్, అవార్డ్స్ వరిస్తూనే ఉన్నాయి. అప్పుడే ఇంగ్లిష్ ఛానెల్‌ను ఈదిన వారి గురించిన వార్తలు కంటబడ్డాయి. ఆ విషయాన్ని శ్యామల ప్రస్తావిస్తూ ‘నేనూ సముద్రాన్ని ఈదుతాను.. అని స్నేహితులతో మాట్లాడినప్పుడు వాళ్లు నా వయసు గురించి ప్రస్తావించారు. పాతికేళ్లలోపైతే ఓకే కానీ, నలభై ఏళ్లు దాటాక చాలా కష్టం అన్నారు. ఆ కష్టాన్ని నేను ఛాలెంజింగ్‌గా తీసుకోవాలనుకున్నాను. వయసు అనే అడ్డంకిని దాటాలనుకున్నాను. అయితే, ఇంగ్లిష్ ఛానెల్ కన్నా మన దేశంతో కలిసి ఉన్న సముద్రం అయితే బాగుంటుందనుకున్నాను. అప్పుడే నాకు రామసేతు దృష్టిలోకి వచ్చింది. అక్కణ్ణుంచి నా ప్రయత్నం, ప్రయాణం ఆగలేదు. నిరంతరం సాధన. దానికి తోడు ఇప్పటి వరకు ఎవరైనా రామసేతును క్రాస్ చేశారా.. అనే శోధన. అలాంటి వారి కోసం అన్వేషణ.. నిరంతరం సాగుతూనే ఉంది. అప్పుడే రామసేతును క్రాస్ చేసిన రాజా త్రివేది గురించి తెలిసింది. ఆయన్ని సంప్రదించినప్పుడు ప్రోత్సహించి, తగు సూచనలు ఇచ్చారు. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ ఆలోచన, ఏడాది క్రితమే పూర్తి చేయాలనుకున్నాను. కానీ, కోవిడ్ కారణంగా మరో ఏడాది పట్టింది’ అంటూ సముద్రంపై తను గురిపెట్టిన లక్ష్యాన్ని వివరించారు. సముద్రమంత సాధన! స్త్రీ, పురుషులు ఎవరైనా వారు చేసే పనుల ప్రభావం ఆ కుటుంబం మీద ఉంటుంది. ఈ విషయం గురించి అడిగితే.. ‘నిజమే, కానీ జీవితంలో మనకంటూ ఓ లక్ష్యం ఉండాలి’ అంటారు శ్యామల. మా వారు ‘ఏం ఫర్వాలేదు. నువ్వు తిరిగి వస్తావు. నాకు ఆ నమ్మకం ఉంది’ అన్నారు. స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి వచ్చింది. ఈ ప్రోగ్రామ్‌కి ‘ఇండియా,–శ్రీలంక ఫ్రెండ్షిప్ స్విమ్మింగ్’ అని పేరు పెట్టాం. ఫెడరేషన్ వాళ్లు ఒక అబ్జర్వేటర్, మహారాష్ట్ర నుంచి ఒక అబ్జర్వేటర్ వచ్చారు. కుటుంబ సభ్యులతో శ్యామల క్రూలో 14 మందిమి వెళ్లాం. ఒక డాక్టర్, ఫీడింగ్‌కి సాయం చేయడానికి ఫ్రెండ్‌ని తీసుకెళ్లాను. ఉదయం 4 గంటలకు స్విమ్మింగ్ స్టార్ట్ అయ్యింది. రీచ్ అయ్యేసరికి సాయంకాలం 5:35 గంటలు అయ్యింది. స్విమ్మింగ్ మొదలయ్యే క్షణం నుంచి ధనుష్కోటికి చేరుకునే క్షణం వరకు నా మదిలో ఒకటే ఆలోచన స్విమ్.. స్విమ్.. అంతే! 13 గంటల 43 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకున్నాను. ఈ పాక్ జలసంధి ని బులా చౌదరి 13 గంటలు 55 నిమిషాల్లో ఈది రికార్డ్‌లో ఉన్నారు. ఆ రికార్డ్‌కి దరిదాపుల్లో వెళ్లగలనా అనుకున్నాను. కానీ, ఆ రికార్డ్‌ను ్ర»ే క్ చేయాలనే సంకల్పం నన్ను ముందు నిలబెట్టింది’ అని వివరిస్తున్నప్పుడు విజయం తాలూకు ఆనందం ఆ కళ్లలో కనిపించింది. ధైర్యం వెన్నుదన్ను సముద్రాన్ని దూరం నుంచి చూడటం ఓ ఆహ్లాదం. కానీ, సముద్రాన్ని ఈదడం అంటే.. ‘షార్క్స్ ఉంటాయి. ఏ క్షణమైనా అవి దాడి చేయవచ్చు. మింగేయచ్చు. ఇలా వీటి గురించి భయపెట్టి కొందరు కిందటేడాది స్విమ్మర్స్ ఆలోచనను మార్చేశారు. కానీ, చావో రేవో తేల్చుకోవాలనుకున్నాను. ఏమీ సాధించకుండా ఉండేదానికన్నా ఒక ధీరలాగా పోరాడైన పోవాలనుకున్నాను. అందుకే భయానికి ఏ మాత్రం తావివ్వలేదు. నేను గమనించిందేంటంటే స్విమ్మర్స్ని షార్క్స్ దాడి చేసిన ఘటనలైతే ఏమీ లేవు. ఈ రికార్డ్‌లో భాగంగా నీళ్లలో ఉన్నంతసేపు ఏదీ పట్టుకోకూడదు, దేనినీ ముట్టుకోకూడదు. శ్రీలంక నుంచి స్విమ్ చేస్తున్నప్పుడు అక్కడి నీళ్లలో సులువు అనిపించింది. అది క్రాస్ చేసి ఇండియాలోకి ఎంటరయ్యేటప్పుడు ముఖ్యంగా చివరి 3 గంటలు చాలా కష్టమనిపించింది. గట్టి అలలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడా కష్టమంతా మర్చిపోయాను. సక్సెస్ ను ఆనందిస్తున్నాను’ అని స్విమ్మింగ్ పూల్ నుంచి సముద్రాన్ని జయించిన విజయ ప్రవాహం గురించి వివరిస్తూనే ఉన్నారు శ్యామల. ఒక దారి మూసుకుపోతే దేవుడు వేయి అవకాశాల దారులను మన ముందుంచుతాడు. ఏ దారిలో వెళ్లినా లక్ష్యం వైపుగా గురి ఉంటే విజయం వరించి తీరుతుంది. 47 ఏళ్ల వయసులో 30 మైళ్ల పాక్ జలసంధిని 13 గంటల 43 నిమిషాల్లో ఈది రికార్డు సృష్టించిన శ్యామల విజయం ఒక్కనాటితో కాదు నిరంతర సాధనతో, పట్టుదలతో ఆమె సొంతమైంది. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
మహిళా నమామి వారధి
‘దేవుడు అన్నిచోట్లా ఉండలేక..’ అని మనకో స్త్రీ–స్తుతి ఉంది. అన్నిచోట్లా ఉండలేక ఆ భగవంతుడు స్త్రీని సృష్టించాడని! నిజమే. ఈ పన్నెండు నెలలూ స్త్రీ చాలా చోట్ల ఉండవలసి వచ్చింది. ఏం చేస్తుంది మరి?! దేవుడు పరుగులు తీయలేకపోయాడు. ఆమెకంటే అధికుడిననుకునే మానవుడు ‘నేనూ అన్నిచోట్లా ఉండలేను’ అనేశాడు! ఇక ప్రతి చోటా స్త్రీనే. పనిగంటలు పెరిగిన వంటిళ్లలో అన్నపూర్ణమ్మగా.. చెత్త పేరుకుపోతున్న వీధులలో పారిశుధ్య ప్రాణదాతగా.. ఊరెంతకీ రాని ఎండ దారుల్లో వలసమాతగా.. ఊపిరులు పోస్తున్న ఆసుపత్రులలో అమృతమయిగా; ఇంటింటా గడపల్లో, ఊరూరా కూడళ్లలో ఒక్కర్నీ బయటికి రానివ్వని రక్షణనేత్రిగా ప్రతిచోటా స్త్రీనే. అన్నమూ నీళ్లిస్తూ హైవేలలో, ఉన్నదేదో పంచి ఇస్తూ చుట్టుపక్కల్లో, విరుగుడు కనిపెడుతూ లేబరేటరీల్లో.. మనిషి ఆశ, ఆయువు తనే అయి, తిరగడం ఆగబోతున్న గ్లోబుకు గ్లూకోజ్ అందించి తిరిగే వేగాన్ని పెంచిందీ, మానవ జీవనాన్ని మళ్లీ గాడిలో పెట్టిందీ స్త్రీనే. ఎంత శక్తి, ఎంత ఓర్పు, ఎంత నేర్పు, ఎంత నిబ్బరం, ఎంత త్యాగం.. దేవుడు కూడా ఆశ్చర్యపోయి ఉంటాడు స్త్రీలోని తన ప్రతిరూపాన్ని ఇంత మల్టీటాస్కింగ్‌లో చూసి! ఐక్యరాజ్య సమితి కూడా అలాగే స్టన్ అయింది. ‘వ్వావ్ షి ఈజ్ ద లీడర్’ అంది! భద్రమైన భావి సమాజ నిర్మాణానికి మహిళే లీడర్ అని ప్రకటించింది. అటువంటి కొందరు లీడర్స్‌కి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి ‘ఫ్యామిలీ’ నమస్సులు తెలియజేస్తోంది. నమో నమామి మహిళామూర్తి.. మానవీయ స్ఫూర్తి. క్యాన్సర్ రోగుల చివరి మజిలీకి ‘స్పర్శ్’ ద్వారా స్వస్థత కలిగిస్తున్న శారద లాక్డౌన్ టైమ్‌లో అందించిన సేవలు, ధైర్యం, టీమ్ లీడింగ్ అసమానమైనవి. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఈ స్వస్థత ఆలయంలోకి అడుగు పెడితే అక్కడ కనిపించే దృశ్యాలు మనసును తడి చేస్తాయి. ‘కరోనా కష్టం సామాన్యమైనది కాదు. కానీ, ఎదుర్కోవాల్సిందే అనుకున్నా’ అంటూ లాక్డౌన్ టైమ్‌ని వివరించారు శారద. ‘‘లాక్డౌన్ ప్రకటించగానే మనల్ని మనం రిస్క్‌లో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా.. అనే దశ నుంచి ఆలోచించాను. ‘నేనే ఇలా భయపడితే... రేపో మాపో చనిపోతామని తెలిసిన వాళ్లని వదిలేయచ్చా..’ అనిపించింది. దాంతో నాకేదో వస్తుందేమో అనే ఆలోచననే మానేశాను. ధైర్యంగా ముందడుగు నాతో పాటు నలుగురు నర్సులు, ఐదుగురు ఆయాలు క్లినిక్‌లో, బయట వాలంటీర్లు పని చేస్తున్నారు. అందరికీ కరోనా ఏ రూపంలో వస్తుందో అనే భయం. టీమ్ లీడర్‌గా జాగ్రత్తలు తీసుకుంటూ ధైర్యమిస్తూ ముందుకు తీసుకెళ్లడం పెద్ద టాస్క్. ‘మా అమ్మగారు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. మాకేం చేయాలో తెలియట్లేదు’ అంటూ విదేశాల్లో ఉండిపోయి రాలేకపోయిన పిల్లల అభ్యర్థన. అలాంటి తల్లులకు, తండ్రులకు దాదాపు 30 ఇళ్లకు వెళ్లి సేవలు అందించాం. ఇంత మంది చనిపోయారు అని రోజూ సాయంత్రం హెల్త్ బులెటెన్.. ‘మాక్కూడా కరోనా వస్తుందా? చనిపోతామా’ అనేవారు పేషెంట్లు. వారిలో మనోధైర్యం నింపడానికి ప్రతి క్షణం పనిచేశాను. అంతిమయాత్ర మరో రిస్క్ మరణించినవారికి గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన సమయంలో ఒంటరిగా అంతిమయాత్ర కు వెళుతున్నారని వార్తలు. అలాంటిది క్యాన్సర్ పేషంట్ చనిపోతే.. అదో పెద్ద కష్టం. చనిపోతున్న తల్లికి బిడ్డలు కూడా రాలేని పరిస్థితి. విపరీతమైన క్షోభ. నెల రోజులు, రెండు నెలలు, 15 రోజుల వ్యవధిలో చనిపోయిన వారున్నారు. మనుషుల భావోద్వేగాలకు సంబంధించిన సేవ ఇది. ‘ఒకబ్బాయి ఇసిఐఎల్ నుంచి బంజారాహిల్స్‌లో మా క్లినిక్‌కి వాళ్లమ్మ కోసం రోజూ ఉదయం నడుచుకుంటూ వచ్చేవాడు. వాళ్లమ్మది చివరి స్టేజ్. అతను అమ్మకు దగ్గరగా ఉండలేడు. అంత దూరం నుంచి ఎందుకు రిస్క్.. అంటే మీ ద్వారా మా అమ్మ గురించి వినడానికైనా ఇక్కడుంటాను కదా! అనేవాడు. అలా చివరి మజిలీ పేషెంట్స్ 11 మంది ఉండేవారు. వాళ్ల పిల్లలతో వీడియో కాల్ చేసి మాట్లాడించేవాళ్లం. అడ్డు చెప్పద్దని అడ్డుకున్నాను నాకు 57 ఏళ్లు. మా వారు అమ్మాయిని చూడటానికని అమెరికా వెళ్లి, లాక్డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయారు. ఇక్కడ నేనొక్కదాన్నే. ఈ వయసు వారికి కరోనా త్వరగా ఎఫెక్ట్ అవుతుందన్న వార్తలు. మా వారు, అమ్మాయి నుంచి ఫోన్లు. కరోనా కాలం ఈ సేవలు ఆపేయమని. ‘కష్టకాలంలో ఆపేస్తే నన్ను నేను క్షమించుకోలేను, అడ్డుచెప్పద్దు’ అన్నాను. కళ్లతో ప్రేమను పంచుతూ.. స్పర్శ అనేది శక్తిమంతమైన విధానం. ఆ స్పర్శనే వద్దనేది కరోనా నినాదం. చాలా కఠినమైన సందేశం. కళ్లతో ప్రేమను చూపుతూ, మాటల్లో ధైర్యం చెబుతూ కదిలాం. కోవిడ్ సమయంలో 24 గంటలు సేవలో ఉన్నా మాలో ఎవరికీ కోవిడ్ రాలేదు. అదంతా మా సంకల్పమే. కష్టకాలంలోనూ చివరిమజిలీకి చేరుకున్నవారికి చేయూత అందించాను అనే తృప్తి మిగిలింది’’ అని శారద వివరించారు. క్యాన్సర్ ఇక చికిత్సకు తగ్గదని నిర్ధారించిన పేషంట్లను పాలియేటివ్ కేర్‌కు రిఫర్ చేస్తారు వైద్యులు. అలా వచ్చిన వారు కుటుంబం నుంచి దూరమయ్యామనే బాధ, నొప్పి, సామాజికం గా దూరం, ఆర్థిక సమస్యలతో పాటు ఆధ్యాత్మికంగానూ ఎన్నో బాధలు ఉంటాయి. ‘నేనేం తప్పు చేశాను. భగవంతుడా నాకెందుకీ శిక్ష వేశావు’ అని మధనపడుతుంటారు. అలాంటి వారికి స్పర్శ్‌లో స్వస్థత అందుతుంది. ఇక్కడ పేషంట్లను బతికున్నన్ని రోజులు భద్రంగా చూసుకునే ఆలయం. అలాంటి వారి మీద కరోనా పిడుగు పడినప్పుడు అండగా నిలిచారు శారద. ఊహించని కష్టం వచ్చిపడినప్పుడు ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియని కష్టంలో ఉన్నప్పుడు చివరి మజిలీలో ఉన్న తల్లికి అసహాయ స్థితిలో ఉన్న బిడ్డకు వారధిగా నిలిచారు శారద లింగరాజు. డాక్టర్ దణ్ణం పెట్టారు చిత్తశుద్ధితో సేవచేసిన వైద్యదూత మా ఆస్పత్రిని కోవిడ్ నోడల్ సెంటర్‌గా ప్రకటించారు. ప్రాణభయంతో వణికిపోతున్న కరోనా బాధితులకు సేవలు అందించడమే మహాభాగ్యం అనుకున్నా. తొమ్మిది నెలలపాటు అలుపెరుగకుండా పనిచేశాం. పీపీఈ కిట్ లోపల చెమటకు చీమలు కుట్టినట్లు శరీరమంతా చురుక్కుమనేది. నాలుక పిడచకట్టుకు పోతున్నా, డీహైడ్రేషన్‌తో చుక్క నీళ్లు కూడా తాగే అవకాశం లేదు. పంటిబిగువున అన్నిబాధలను భరిస్తూ డ్యూటీ చేశాం. కరోనా ఏడాదిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. గతేడాది మార్చిలోనే గాంధీలో మొదటి కరోనా మృతి నా ఎదురుగానే అయింది. ఆయనను కాపాడేందుకు వైద్యులు, సిబ్బంది తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. అప్పటినుంచి ప్రతి పేషెంట్‌కీ వైద్యసేవతోపాటు కౌన్సెలింగ్ ఇచ్చి మనోధైర్యం కల్పించే వాళ్లం. పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రి గైనకాలజిస్టు కరోనాతో గాంధీలో చేరింది. డిశ్చార్జ్ అయి వెళ్తూ ఆమె రెండు చేతులెత్తి నమస్కరించడం నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. వేలాది ప్రాణాలకు కాపాడడంలో మా సేవ ఉందని సంతృప్తి ఉంది. భారత సైనికదళాలు... గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిపై పూలవర్షం కురిపించిన తర్వాత... స్థానికులు, కుటుంబ సభ్యులు నాపై పూలవర్షం కురిపించి అభినందించడాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. వేలాది మంది కరోనా బాధితుల మధ్య విధులు నిర్వహించినా కరోనా రాకపోవడం నిజంగా అదృష్టమే. జోజి కే అలెక్స్, స్టాఫ్‌నర్సు, గాంధీ హాస్పిటల్ సేవకు ఏటీఎమ్ స్ఫూర్తి జీవనంలో పేదరాలే కానీ, సేవలో సంపన్నురాలు అనిపించుకుంది ఎల్బినగర్ రాక్హిల్స్ కాలనీకి చెందిన లక్ష్మమ్మ. ఒక అపార్ట్మెంట్లో వాచ్‌మన్‌గా పనిచేసే లక్ష్మమ్మ నెల జీతం ఆరువేల రూపాయలు. లాక్డౌన్ టైమ్‌లో అందులో సగం డబ్బును ఖర్చుపెట్టి, వలసకార్మికుల కోసం ఆహారం వండిపెట్టేది. ఆమె చేసిన సేవ మరికొందరికి స్ఫూర్తినిచ్చింది. లాక్డౌన్ సమయంలో చేసిన పని గురించి అడిగితే ‘కష్టం చూడలేక తోచిన సాయం చేశాను’ అని తెలిపింది. వలసకార్మికులకు వండి పెడుతూ... ‘‘నేను పనిచేసే అపార్ట్మెంట్లో పది ప్లాట్లు ఉంటాయి. ఉన్న ఊరు వదిలిపెట్టి బతుకుతెరువు కోసం పట్నం వచ్చినం. రెక్కల కష్టంతో గడుపుకొస్తున్నం. కరోనా భయంతో ఎవరూ ఇళ్లు వదిలిపెట్టి రాలేని పరిస్థితి. మేమూ అదే పాటించేవాళ్లం. అయితే, మా చుట్టుపక్కల బిల్డింగ్ పనులు చేసేవారు కొందరున్నారు. వారంతా వలస వచ్చి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. అందులో పిల్లలు, చంటి పిల్లల తల్లులూ ఉన్నారు. బిల్డింగ్‌ల పనులు ఆగిపోవడంతో వారికి పనిలేదు, చేతిల పైసలు లేవు. వారి అవస్థలు చూడలేక రోజూ కొంతమందికి అన్నం వండి పెట్టేదాన్ని’ అని తన దయార్ద్ర మనసును చాటుకుంది లక్ష్మమ్మ. ఒక అడుగుతో కదిలిన వేయి అడుగులు లక్ష్మమ్మ చేస్తున్న సాయాన్ని స్ఫూర్తిగా తీసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాము రైస్ ఏటీఎమ్‌ను ఏర్పాటు చేసి, ఇప్పటికీ పేదలకు సాయం అందిస్తున్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచడం కోసం మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని 80 మంది మహిళలకు కుట్టుమిషన్లు పంచుతున్నారు. లాక్డౌన్ టైమ్ నాటి సంఘటనలను, తనలో స్ఫూర్తిని నింపిన లక్ష్మమ్మ గురించి వివరించిన రాము దోసపాటి మాట్లాడుతూ –‘ఒక రోజు మా అబ్బాయి కోసం చికెన్ షాప్‌కి వెళితే, అక్కడ 20 కేజీల చికెన్ తీసుకుంటున్న లక్ష్మమ్మను చూశాను. ఈ సమయంలో అంత చికెన్ ఎందుకని అడిగాను. ‘వలస కార్మికులు తిండి లేక అవస్థపడుతున్నారు సారు. వారి కోసం వండిపెడుతున్నాను. చాలా ఆశ్చర్యపోయాను. ఆమె చేస్తున్న సేవను స్ఫూర్తిగా తీసుకున్నాను. ఆమె చెప్పిన వివరాలతో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో భవన నిర్మాణ, వలసకార్మికులు ఎంతమంది ఉన్నారో చూశానో. వారి దయనీయ పరిస్థితికి కళ్లలో నీళ్లు వచ్చాయి. రైస్ ఏటీఎమ్ ద్వారా పేదలకు ఇప్పటికీ సాయం చేస్తున్నాను’ అని తెలిపారు. మనసెరిగిన నేస్తం చేయూత ఫ్యాషన్ డిజైనర్‌గా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి నేను సైతం అంటూ ముందడుగు వేసింది నిహారికారెడ్డి. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడాలో తన డిజైనర్ స్టూడియో ద్వారా 15 మందికి ఉపాధి కల్పిస్తోంది. లాక్డౌన్ సమయంలో తన దగ్గర పనిచేసే వారిని వారి ఊళ్లకు, ఇళ్లకు చేర్చడమే కాకుండా చేనేత రంగానికి తన వంతు సాయం చేయడానికి ముందుకు కదిలింది. నిత్యావసర సరుకుల పంపిణీలో మరొక అడుగు ముందుకు వేసి అమ్మాయిలకు శానిటరీ న్యాప్కిన్స్ పంచింది. ‘‘మా వారు కణ్ణన్ సినిమా రంగంలో ఉన్నారు. ఓ రోజు మా ఇంటికి నెలకు సరిపడా సరుకులున్న బ్యాగ్ వచ్చింది. చిరంజీవిగారు అందరికీ సరుకులు పంచారని తెలిసింది. అది చూశాక ఇలాంటి పాకెట్స్ నిరుపేదలకు అందివ్వాలనే ఆలోచన వచ్చింది. దాంతోపాటు అమ్మాయిలు, అమ్మలు గుర్తుకువచ్చారు. వారి కోసం శానిటరీ ప్యాడ్స్ కొనుగోలు చేసి, సరుకులతో పాటు అందించాం. మా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో పేద ఇళ్ల ముందుకు తీసుకెళ్లి మేం సిద్ధం చేసిన ప్యాకెట్స్ పెట్టి వచ్చాం. చేనేతకు చేరువగా.. నేను డిజైనర్ కావడంతో చేనేత కార్మికుల పరిస్థితి లాక్డౌన్ టైమ్‌లో ఎలా ఉందో ఊహించగలను. చీరలు అమ్ముడు పోకపోతే డబ్బు చేతికి రాదు, వారి రోజువారి జీవనం కష్టమైపోతుంది. అందుకే పర్మిషన్ తీసుకుని నేరుగా నారాయణపేట్ చేనేతకార్మికుల దగ్గరకు వెళ్లి వారి నుంచి మెటీరియల్ కొన్నాను. ఫేస్బుక్ లైవ్ ప్రోగ్రామ్స్ చేశాను. వారి స్థితి చూసి, కొంతమంది ఆర్డర్ మీద అప్పటికప్పుడు ఆ చీరలను తెప్పించుకున్నారు. లాక్డౌన్ టైమ్‌లో కొన్న చేనేతచీరలతో ఇప్పుడు రీక్రియేషన్ డిజైన్స్ చేస్తున్నాను. బంగారం తాకట్టు నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లు అందివ్వడానికి అప్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ ఇందుకు సంబంధించిన డబ్బును షాపుల్లో కడుతున్నాను. నా సేవకు మిత్రులు కొంత సాయంగా నిలిచారు. అయినా డబ్బు సరిపోక పోతే నా బంగారం పై లోను తీసుకున్నాను. దీంతో సరుకుల పంపిణీ కార్యక్రమం ఒక యజ్ఞంలా నడించింది. కరోనా సమయంలో సేవలు అందించినందుకు గాను చిరంజీవిగారి చేతుల మీదుగా కరోనా వారియర్ అవార్డు అందుకున్నాను. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింద’ని వివరించారు. – నిర్మలారెడ్డి -
నమ్మకమే ముఖ్యం కొంచెం నిఘా కూడా..
ప్రీతీ నిగమ్, నగేష్ కర్రా ఇద్దరూ టీవీ, సినిమా ఆర్టిస్టులు. వీరి కొడుకు ఆర్యన్ కర్రా వరల్డ్ రోలర్ ఇన్లైన్ హాకీ 2019కి తెలంగాణ నుంచి పాల్గొన్న ఏకైక ప్లేయర్. కూతురు అదితి ‘లా’ చదువుతోంది. భార్య టాలెంట్‌ను ప్రోత్సహించడంతో పాటు కొడుకు అథ్లెటిక్స్‌లో రాణించడానికి వెన్నుదన్నుగా ఉండాలని నగేష్ తను చేస్తున్న ఐటీ జాబ్‌ను వదులుకున్నారు. పిల్లలపైన ఎప్పుడూ నమ్మకం ఉంచడంతో పాటు కొద్దిగా నిఘా కూడా అవసరం అంటారు తల్లిగా ప్రీతీ. తల్లిదండ్రులిద్దరూ గ్లామర్ ప్రపంచంలో ఉంటూ పిల్లలిద్దరినీ వారికిష్టమైన రంగంలో ప్రోత్సహిస్తున్న ప్రీతీ నిగమ్, నగేష్ కర్రా పేరెంటింగ్ గురించి అడిగితే ఇలా ఎన్నో విషయాలు పంచుకున్నారు. యాక్టింగ్, పేరెంటింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? నగేష్ కర్రా: యాక్టింగ్ నా ప్యాషన్. మొదట సీరియల్స్ లో నటిస్తుండేవాడిని. కార్వి గ్రూప్‌లో ఐటీ జాబ్ చేసేవాడిని. ఆర్యన్ మూడేళ్ల వయసు నుంచి టీవీలో ఒలంపిక్ గేమ్స్ వచ్చినప్పుడు చాలా ఆసక్తిగా చూసేవాడు. అది గమనించి స్పోర్ట్స్‌లో ప్రోత్సహించాలనుకున్నాం. అలా, జిమ్నాస్టిక్స్ స్కూల్లో జాయిన్ చేశాం. బ్యాడ్మింటన్‌లో శిక్షణ ఇప్పించాం. ఎనిమిదేళ్ల వయసులో జిమ్నాస్టిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించాడు. అప్పుడనుకున్నాను జాబ్, యాక్టింగ్ అంటూ బిజీగా ఉంటే పిల్లల టాలెంట్‌కి సపోర్ట్ ఉండదని, ముఖ్యంగా కొన్నాళ్లు ఆర్యన్ వెన్నంటే ఉండటం అవసరం అనుకున్నాను. ఇదే విషయం ప్రీతికి చెప్పాను. మంచి జాబ్ వదులుకోవడం ఎందుకు, యాక్టింగ్ మానేస్తాను అంది. తనకు నటనలో మంచి టాలెంట్ ఉంది. మానుకోవద్దని చెప్పాను. మాది మధ్య తరగతి కుటుంబం. డబ్బు ఇబ్బందులు రాకుండా ఎలా చూసుకోవాలో ఇద్దరం చర్చించుకున్నాం. అన్నీ ఓకే అనుకున్నాక పదేళ్ల క్రితం జాబ్‌కి రిజైన్ చేశాను. పాప స్కూల్ ఏజ్‌లోనే తన గోల్ ఏంటో చెప్పేసింది. అలా తనని ‘లా’ వైపు ప్రోత్సహించాం. ప్రీతీ నిగమ్: 14 ఏళ్ల వయసులోనే ఆర్యన్ ఇండియన్ ఇన్లైన్ హాకీ టీమ్‌లో పాల్గొన్నాడు. వాడి కృషి వెనక వాళ్ల నాన్న సపోర్ట్ ఎక్కువ. ఇప్పుడంటే పిల్లలు కొద్దిగా పెద్దవారయ్యారు. వాళ్లను వాళ్లు చూసుకోగలరనే ౖధైర్యం మా ఇద్దరికీ వచ్చేసింది. చిన్నప్పుడు కొంచెం కష్టంగానే ఉండేది. మా అమ్మనాన్న ఇద్దరూ టీచర్లుగా చేసి, రిటైర్ అయ్యారు. వారితో మేం ఉండటం వల్ల పిల్లలకు మంచి క్రమశిక్షణ అలవడింది. ఆ విధంగా మేం ఎంతో అదృష్టవంతులం. ► ఇద్దరూ బిజీగా ఉంటారు, టైమ్ ప్లానింగ్ ఎలా ఉంటుంది? నగేష్: ఉదయం ఐదు గంటలకల్లా అందరం నిద్ర లేస్తాం. ఆర్యన్ మా కన్నా ఎక్కువ కష్టపడతాడు. ఉదయం 4:30 కి నిద్రలేస్తే తిరిగి పడుకోవడానికి రాత్రి 11 అవుతుంది. రోజూ ఉదయం ఐదారు కిలోమీటర్లు జాగింగ్ చేస్తాడు. తర్వాత జిమ్. ఆ తర్వాత కాలేజీ. ఇంటికి వస్తూనే తిరిగి 4కి మళ్లీ ప్రాక్టీస్‌కి వెళతాడు. ప్రీతి: ముందే రాత్రే షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటాను. దానిని బట్టి పనులు అవుతూ ఉంటాయి. ఇంట్లో అందరం బిజీ అవడంతో పిల్లలు వారి పనులు వారు చేసుకునేలా అలవాటయ్యారు. ► పిల్లలకు సంబంధించిన విషయాల్లో వారి ఫుడ్ హ్యాబిట్స్ ప్రధానంగా ఉంటాయి. వీటి గురించి.. నగేష్: ఆర్యన్ స్పోర్ట్స్ వైపుగా ఉండటం వల్ల ఇంట్లో అందరికీ పోషకాహారం పట్ల అవగాహన ఉంది. ఆర్యన్ డైట్ చార్ట్ ఫాలో అవుతాడు. ఎనర్జీ లెవల్స్ పడిపోకుండా బ్యాలెన్స్ చేస్తాడు. ప్రీతి: చిన్నప్పుడు పిల్లలిద్దరూ జంక్‌ఫుడ్ తినేవాళ్లు. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ మూడేళ్ల నుంచి ఇద్దరూ మానేశారు వాటి సైడ్ ఎఫెక్ట్ అర్ధమై. ఆర్యన్ తన టీమ్ లో మిగతా వారికి ఫుడ్ విషయంలోనూ రోల్ మోడల్‌గా ఉండాలని చెబుతుంటాడు. ► అమ్మాయి.. అబ్బాయి అనే తేడాలు చూపడం గురించి.. ప్రీతి: ‘అమ్మాయివి నువ్వు ఈ పనులే చేయాలి, అబ్బాయి ఫలానా పనులే చేయాలి’ అని చెప్పను. మా అమ్మనాన్నలు కూడా అలాంటి తేడాలు చూపలేదు. కానీ, అక్కను బాగా చూసుకోవాలని మాత్రం ఆర్యన్‌కి చెబుతుంటాను. నగేష్: వేరు వేరుగా చూడాలనే ఆలోచన మా పెద్దల నుంచే రాలేదనుకుంటాను. సేవా గుణంలోనూ ఇద్దరూ ముందుంటారు. ఈ గుణం కూడా మా పెద్దల నుంచి వచ్చిందనుకుంటాం. ► మనీ మేనేజ్మెంట్ గురించి పిల్లలకు సూచనలు ఏమైనా..? నగేష్: మా కష్టాన్ని పిల్లలిద్దరూ అర్ధం చేసుకుంటారు. ఆర్యన్ స్పోర్ట్ కొంచెం ఖర్చుతో కూడుకున్నదే. నేషనల్ ఇంటర్నేషనల్ లెవల్స్‌కి వెళ్లాలంటే రాష్ట్రాలు, దేశాలు దాటాలి. కానీ, అన్నీ బడ్జెట్లోనే చూసుకుంటాడు. వెళ్లాల్సిన చోటు, టికెట్, రూమ్ బుకింగ్ అన్నీ మ్యానేజ్ చేసుకుంటాడు. ఈ గేమ్‌కి గవర్నమెంట్ ఫండింగ్ లేకపోవడంతో వాళ్ల టీమ్‌లో ఉన్నవారితో ఖర్చులు కలిసి వచ్చేలా షేర్ చేసుకుంటాడు. దీనివల్ల ఖర్చు ఎంత, అమ్మనాన్నలు ఎలా కష్టపడుతున్నారు అనే విషయాల మీద అవగాహన వచ్చేసింది. అదితి కూడా అంతే. చాలా బాగా అర్థం చేసుకుంటుంది. ప్రీతి: మా పిల్లలు రూపాయి ఖర్చు చేయాల్సి వచ్చినా మాకు చెప్పనిదే చేయరు. పిల్లల ముందు డబ్బు విషయాలు కూడా చర్చకు వస్తాయి. ఖర్చు పెట్టాలనుకునే ప్రతీ రూపాయి విలువ తెలుసుకోవాలని చెబుతుంటాను. ► స్పోర్ట్స్ .. చదువు బ్యాలెన్స్ ఎలా? ప్రీతి: పిల్లలిద్దరూ చదువులో ముందుంటారు. ఆర్యన్ గేమ్స్ అంటూ వేరే స్టేట్స్‌కి వెళ్లినా, వస్తూనే క్లాస్‌కి వెళ్లిపోతాడు. వాడిని వాళ్ల లెక్చరర్లు బాగా అభిమానిస్తారు. క్రమశిక్షణ గురించి చెప్పడం కన్నా మనం ఆచరిస్తూ పిల్లలను ఆచరించేలా చేయాలనేది మా పద్ధతి. కొంతమంది టీనేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు యాక్టింగ్ పీల్డ్లోకి వస్తాం అంటుంటారు. అలాంటప్పుడు ముందు డిగ్రీ పూర్తి చే యండి, దాంతో పాటు ఏదైనా ఒక అంశంలో నైపుణ్యం సాధించమని చెబుతాను. అదితి లా చేస్తుంటే.. ఆర్యన్ బిబిఎ చేస్తున్నాడు. నగేష్: టాలెంట్ ఉండాలి. దీంతో పాటు చదువూ ఉండాలి. అప్పుడే, మరింత ఉన్నతంగా ఎదగలరు. స్పోర్ట్స్‌లో ఉన్నాం కదా అని చదువుని నిర్లక్ష్యం చేయకూడదు. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. లక్కీగా ఆర్యన్‌కి చదువుపై మంచి ఇంట్రస్ట్ ఉంది. వాళ్ల ఇండియన్ టీమ్ కెప్టెన్ డిఎస్పి కూడా. దీంతో చదువులో కూడా రాణించాలనేది ఆర్యన్ పట్టుదల. పిల్లలు బయటి ప్రపంచాన్ని కూడా చూస్తుంటారు కాబట్టి, వారేం కావాలో కూడా వారే డిసైడ్ చేసుకుంటారు. పేరెంట్స్‌గా మన గైడెన్స్, సపోర్ట్ ఉంటే చాలు. ► టీనేజ్ పిల్లల తల్లిదండ్రులుగా మీ పెంపకం? నగేష్: నేను కొంచెం స్ట్రిక్ట్‌గానే ఉంటాను. వాళ్లమ్మ దగ్గర మాత్రం గారాలు పోతుంటారు. ఆర్యన్‌ది చాలా సాఫ్ట్ నేచర్. చెప్పింది అర్ధం చేసుకుంటాడు. ఇప్పుడు ఆర్యన్ వయసు 18. అదితి టీనేజ్ కంప్లీట్ అయ్యింది. వాడిలో నచ్చే మరో గుణం అహంకారం అస్సలు చూపకపోవడం. ఇది వాళ్ల అమ్మను చూసి నేర్చుకున్నాడని అనిపిస్తుంది నాకు. ప్రీతికి యాక్టింగ్‌లో నేషనల్ అవార్డులూ వచ్చాయి. అమితాబచ్చన్, శ్యామ్‌బెనగల్... వంటి వారితో వర్క్ చేసింది. అయినా తను ఎక్కడా అహం చూపదు. పెద్దలను గమనిస్తూ ఉంటారు కాబట్టి పిల్లలు కూడా అలాగే ఉంటారు. పిల్లల కెరియర్‌కు ఉపయోగపడేలా వారి సబ్జెక్ట్స్‌కు సంబంధించిన చర్చలు కూడా ఇంట్లో ఉంటుంటాయి. ప్రీతి: నా చిన్నతనంలో అమ్మనాన్నలు, ఇప్పుడు నగేష్ నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. నా మీద నమ్మకం ఉంచారు. అదే నమ్మకం నేను పిల్లల మీద ఉంచుతాను. స్వేచ్ఛను ఇస్తూనే గమనింపు కూడా ఉండాలి. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. ఒకసారి వదిలేయాలి. ఇంకొసారి తెలియజేసేలా చెప్పాలి. పట్టుకొని పీడించి, వాదిస్తే మొండితనం మొదలవుతుంది. ఎనిమిదేళ్ల వయసు నుంచి ఆర్యన్ రోజూ గాయత్రి చేస్తాడు. దీని వల్ల ఆధ్యాత్మిక భావన కూడా ఎక్కువే. కొంచెం కామ్ మెంటాలిటీ. అక్కాతమ్ముడికి షేరింగ్, కేరింగ్ కూడా ఎక్కువే కాబట్టి ఈజీగా బ్యాలెన్స్ అవుతుంటుంది. అబ్బాయిలు ముందు ఇంట్లో ఆడవాళ్లను గౌరవిస్తే బయటా అలాగే ఉంటారనే విషయాలు మాత్రం తరచూ చెబుతుంటాను. – సంభాషణ: నిర్మలారెడ్డి -
యంగ్ టాలెంట్ విభిన్న ఆకాశం
కాసేపు కేఫ్‌లో పాప్ మ్యూజిక్‌తో కచేరీ ఇస్తుంది. ఇంకాసేపు ఓ ప్రసిద్ధ బ్రాండ్ కోసం మోడలింగ్ చేస్తుంది. ఆ తర్వాత కిక్ బాక్సింగ్‌తో దడదడలాడిస్తుంది. థియేటర్ ఆర్టిస్టుగా వేదికపై అదరగొడుతుంది. గుర్రపు స్వారీలో గాలితో పోటీపడుతుంది. తాను కన్న కలలను కళాత్మకంగా మలచుకుని పంతొమ్మిదేళ్ల వయసులో విభిన్న రంగాల్లో రాణిస్తున్న సంజన ఆకాశం హైదరాబాద్‌లో ఎల్ఎల్బి చేస్తోంది. ఒకేరంగంలో ప్రతిభ చూపితేనే సరైన అవకాశాలు వస్తాయనుకునేవారి ఆలోచనలకు సంజన కళ్లెం వేస్తోంది. విభిన్నరంగాల్లో ప్రతిభను చూపుతూ తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్న సంజన ఇన్ని కళలను ఎలా సుసాధ్యం చేసుకుంటున్నదో వివరించింది. ‘‘జీవితం ‘కళ’వంతంగా గడవాలంటే ఎక్కడా బోర్ అనిపించకూడదు. మెదడు చురుగ్గా ఉండాలంటే నచ్చిన వాటిని ఇష్టంగా ఎంచుకుంటూనే, నచ్చని వాటితోనూ పోటీ పడాలి. అప్పుడే విజయతీరాలను చేరుకోవచ్చు. నాలో నటి ఉందనే విషయం మూడేళ్ల క్రితం వరకు తెలియదు. ‘మూడేళ్ల క్రితం సమాహార థియేటర్ వర్క్‌షాప్ చూసినప్పుడు నేనూ వారితో కలిసి పని చేయాలనుకున్నాను. సమాహార థియేటర్ వర్క్‌షాప్‌లో పాల్గొని, నటన నేర్చుకున్నాను. ‘పంచ్లైడ్’ అనే బిహారీ హిందీ నాటకంలో చేశాను. ఛాలెంజింగ్‌గా అనిపించే అందులోని స్త్రీ పాత్ర నన్ను మరిన్ని నాటకరంగ పాత్రల్లో ఒదిగిపోయేలా చేసింది. అప్పటికప్పుడు లైవ్‌లో ప్రదర్శన ఉంటుంది. ఎంతో నేర్చుకోవచ్చు. ప్రజెంటేషన్, పంక్చువాలిటీ.. అన్నీ థియేటర్ నేర్పిస్తుంది. హుషారు నింపిన పాప్ అండ్ రాక్ ఆరవ తరగతి నుంచి పాప్ అండ్ రాక్ సాంగ్స్ పాడుతూ వచ్చాను. లండన్ ట్రినిటీ మ్యూజిక్ కాలేజీ టీమ్ మెంబర్స్‌తోనూ కలిసి వర్క్ చేశాను. ఇప్పుడు సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆల్బమ్స్ విడుదల చేస్తున్నాను. లాక్డౌన్ ముందు వరకు రాక్ అండ్ పాప్ బ్యాండ్స్‌తో కలిసి షోలు చేసేదాన్ని. లాక్డౌన్ సమయం నా కళల సాధనకు మరింత ఉపయోగపడింది. ప్రొఫెషనల్ వీడియోలు చేయడం, ఆ¯Œ లై¯Œ లో పోస్ట్ చేయడం ద్వారా సోషల్‌మీడియా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నాను. భయం పోగొట్టిన ర్యాంప్‌వాక్ ‘వేదవస్త్రం’ అనే బ్రాండ్ ఫ్యాబ్రిక్‌కు మోడలింగ్ చేస్తున్నాను. అమ్మ ఫ్యాషన్ డిజైనర్. తను బొటిక్ నడుపుతుంది. తను డిజైన్ చేసిన డ్రెస్సులు అమ్మ నా మీద ప్రయోగించేది. అలా మోడలింగ్ వైపు వచ్చాను. ర్యాంప్‌వ్యాక్ బాగా ఇష్టం. మొదట్లో నలుగురిలోకి వెళ్లాలంటే కొంచెం బెరుకుగా ఉండేది. మోడలింగ్‌తో ఇప్పుడా భయం పోయింది. సాహసాల స్వారీ కళల నుండి అడ్వంచర్స్ వైపు దృష్టి మొదట్లో టీవీ ప్రోగ్రాముల్లో చూసినప్పుడు మళ్లింది. అమ్మానాన్న అనుమతితో హార్స్‌రైడింగ్ నేర్చుకున్నాను. అక్కడి ట్రెయినర్ మంచి లాయర్ కూడా. ఆమెలా నేనూ అడ్వకేట్‌గా రాణించాలనుకున్నాను. అందుకే, లా చదువుతున్నాను. అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్య అవసరమనుకున్నాను. అంతేకాదు, ఆత్మవిశ్వాసానికీ కిక్‌బాక్సింగ్ బాగా పనిచేస్తుంది. అందుకే, కిక్‌బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. నా వయసువారికి కిక్‌బాక్సింగ్‌లో శిక్షణ ఇస్తున్నాను. అటు కళలు .. ఇటు చదువూ థియేటర్ రిహార్సల్స్ ఉన్నప్పుడల్లా, బ్రేక్ టైమ్‌లో చదువుకోవడానికి స్కూల్ బుక్స్ తీసుకువెళ్లేదాన్ని. అలా ఇటు చదువు, అటు కళలను రెండింటినీ బ్యాలెన్స్ చేయగలిగాను. 14 ఏళ్ల వయసు నుంచి నా గొంతును కాపాడుకోవాలనే ధ్యాస పెరిగింది. దీంతో ఐస్‌క్రీమ్‌లు తినడం, కూల్ డ్రింక్స్ తాగడం మానేశాను. స్కూల్ చదువులో అంతగా రాణించేదాన్ని కాదు. కళలపై ఇంట్రస్ట్ చూపేదాన్ని. దీంతో మా నాన్న రఘునాథ్ నన్ను ఆ దిశగా ప్రోత్సహించారు. అమ్మ భార్గవి నాకు మేకప్ నేర్పించింది. మేకప్ క్లాసులకు కూడా తీసుకెళ్లేది. దీంతో సహనం అబ్బింది’ అని వివరించింది సంజన. మిగతావన్నీ ప్యాషన్. ‘లా’ నా ప్రొఫెషన్ అని వివరించిన సంజన ఇప్పుడు ఎంబీబిఎస్ రెండవ సంవత్సరం చదువుతోంది. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన తండ్రి రఘునాథ్ ఆకాశం, తల్లి భార్గవి లు తాను కళల్లో రాణించడానికి ఎంతో సహకారం అందించారని తెలిపిన సంజన తాను పఠించే మంత్రాల గురించి తెలిపింది. మొదటిది చొరవ. రెండవది కఠోర శ్రమ. మూడవది స్థిరత్వం. నాల్గవది సహనం. ఎవరైనా సరే కోరుకున్నది సాధించాలనుకునే వారందరికీ ఇవి మంత్రాల్లా పనిచేస్తాయి. – నిర్మలారెడ్డి -
‘బిగ్‌బాస్ 4 రికార్డ్ చేసి నా పిల్లలకు చూపిస్తా’
ఇద్దరమ్మాయిలు.. అలేఖ్య హారిక, అరియానా గ్లోరి. ఇద్దరూ బిగ్‌బాస్ సీజన్ 4లో ఫైనల్స్‌కు చేరుకున్నారు. అందరి దృష్టిని తమ వైపు నిలుపుకున్నారు. ఇద్దరూ జీవితంలోని ఒడిదొడుకులను చిన్ననాటి నుంచీ చూస్తూ పెరిగారు. జీవితం నేర్పిన పాఠాలతోనే తమకు తాము ధైర్యం చెప్పుకున్నారు. గెలుపు ఓటముల ప్రసక్తి లేకుండా ముందుకు సాగాలనుకున్నారు. నవతరం అమ్మాయిలకు ప్రతీకగా నిలుస్తున్నారు. ►‘దేత్తడి’ అంటూ యూట్యూబ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అలేఖ్య హారిక. డిగ్రీ చదువుతూ పాకెట్ మనీ కోసం పార్ట్‌టైమ్ జాబ్ చేసింది. జాబ్ పోతే ఎలా అనే ఆలోచనతో కొత్త ఆలోచనలకి పదును పెట్టింది. ►యాంకరింగ్ ద్వారా టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది అరియానా గ్లోరీ. కాలేజీ రోజుల నుంచే యాంకరింగ్ అంటే ఇష్టం పెంచుకుని తనకు అభిరుచి ఉన్న రంగం వైపే అడుగులు వేసింది. కొద్ది రోజుల్లోనే కుటుంబం మెప్పుతో పాటు ప్రేక్షకుల అభిమానాన్నీ పొందుతోంది. ఇంటిని వదిలి 105 రోజులు వేరే చోట ఉన్నారు. అంత ధైర్యం ఎలా వచ్చింది? హారిక: ఎలా వచ్చిందో నాకూ తెలియదు. ముందు మా అమ్మ, అన్న కోసం ఒప్పుకున్నాను. మా ఇంటి నుంచి బిగ్‌బాస్ ఇంటిలోకి అడుగుపెట్టాక అక్కడంతా వేరే ప్రపంచం. వెళ్లకముందు కొంత భయం అనిపించింది. వెళ్లాక, అక్కడున్నన్ని రోజులు చాలా ఎంజాయ్ చేశాను. ఒక నిర్ణయానికి వచ్చామంటే ధైర్యం ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది. ఎప్పుడైనా డౌన్ అయిపోతున్నానా అనిపించినప్పుడు కళ్లు మూసుకొని రెండు నిమిషాలు కూర్చొనేదాన్ని. ‘మా అమ్మ, అన్నయ్య కళ్లముందు కనిపించేవారు. హారికా.. డౌన్ అయిపోవద్దు. ఏదైనా నీకు అండగా కుటుంబం ఉంది. ఇది కేవలం ఒక గేమ్. లాక్డౌన్ టైమ్‌లో నీకు వచ్చిన ఒక గొప్ప అవకాశం ఇది. దీనిని బాగా ఉపయోగించుకో..’ అని నాకు నేను చెప్పుకునేదాన్ని. మా అమ్మ సమస్యలను ఎదుర్కొన్న విధానం వల్ల కూడా నాకు ధైర్యం వచ్చి ఉంటుంది. అరియానా: చిన్నప్పటి నుంచీ నేనూ, చెల్లి ఏ సమస్య అయినా ఫేస్ చేసేవాళ్లం. మా మమ్మీ జాబ్ చేసేది. తను వెళ్లిపోయాక మేమిద్దరమే ఇంట్లో ఉండేవాళ్లం. తనకూ క్లాస్ ఉంటే నేనొక్కదాన్నే ఇంట్లో ఉండేదాన్ని. నేను బయటకు వెళితే చెల్లి కూడా అంతే. అలా ఇండిపెండెంట్‌గా ఉండటం మాకు ఎప్పుడో అలవాటైపోయింది. హౌజ్‌లో ఉన్నప్పుడు ఒకసారి 104 జ్వరం వచ్చింది. తట్టుకోలేక ఏడ్చేశాను. అక్కడ అందరూ నన్ను బాగా చూసుకున్నారు. ఎంతో ధైర్యం చెప్పారు. బిగ్‌బాస్‌కి కూడా చెప్పాను. నాకు ఒంట్లో బాగోలేదు, ఇంటికి పంపించేస్తే మా ఇంటి ఫుడ్ తిని, త్వరగా కోలుకుంటాను అని. కానీ, బిగ్‌బాస్ ‘స్పెషల్ కేర్ తీసుకుంటామ’ని చెప్పారు. అవినాష్ నన్ను బాగా చూసుకున్నారు. ఆ వారం రోజులు మాత్రం కొంచెం లోన్లీగా అనిపించింది. బిగ్‌బాస్ హౌస్‌లో మీ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంది? హారిక: బయట రంగులరాట్నంలో తిరిగితే ఎంత సంబరంగా ఉంటుందో బిగ్‌బాస్ హౌజ్‌లో అలాంటి ఎక్స్‌పీరియెన్స్. భలేగుంది. ముందు భయపడ్డా... ఎలా ఉంటుందో ఏమో అని. కానీ, లోపలకు వెళ్లినప్పుడు చిల్... మస్తుంది. టాస్క్ మీదనే నా దృష్టి అంతా. ఇదో హ్యూమన్ ఎక్స్పరిమెంట్. టైమ్ కనుక్కోకముందు సూర్యుడిని చూసి పాతకాలం నాటి వాళ్లు ఎలా అంచనా వేసుకునేవారో మేం అలా చేసేవాళ్లం. ఫోన్లు లేవు, టీవీ లేదు, వాచీలు లేవు. అదో లోకం.. ఆ లోకంలో అడుగుపెట్టడం చాలా థ్రిల్లింగ్‌గా భావిస్తాను. అరియానా: బిగ్‌బాస్ సీజన్ 4 అంతా రికార్డ్ చేసి పెట్టి, భవిష్యత్తులో నా పిల్లలకు చూపిస్తాను. అన్ని రోజుల పాటు బిగ్‌బాస్ హౌజ్‌లో ఎప్పుడెలా ఉన్నానో నాకే చాలా వింతగా, ఆశ్చర్యంగా ఉంటోంది. కోపం వస్తే ఎలా ఉంటాను, బాధ వస్తే, సంతోషం కలిగితే ఎలా ఉంటాను.. అనేవన్నీ నాకు నేనే ఎక్స్‌పీరియెన్స్ చేశాను. బిగ్‌బాస్ తర్వాత మీకు మీరుగా మార్చుకోవాలనుకున్నవి? హారిక: సహజంగా నాకు కోపం ఎక్కువ. ప్రతి చిన్నదానికి బాగా చిరాకుపడేదాన్ని. ఎలాంటి పరిస్థితుల్లో కోపం చూపాలి... ఎలాంటి స్థితిలో మౌనంగా ఉండాలనే విషయం నేర్చుకున్నాను. అరియానా: ముక్కుమీది కోపం. చిన్న చిన్న వాటికి కోపం వస్తుంది. మా చెల్లితో అలాగే గొడవ పడేదాన్ని. అదే, పెద్ద పెద్ద విషయాల్లో అయితే మౌనంగా ఉండిపోతాను. బిగ్‌బాస్‌లో బాధ కలిగించినది... అత్యంత సంతోషాన్నిచ్చిన ఇన్సిడెంట్స్..? హారిక: అన్ని రోజులు కెప్టెన్సీకి వర్క్ చేసినా బెస్ట్ కెప్టెన్సీ రాలేదు. అది చాలా బాధ అనిపించింది. హాపీ మూమెంట్స్ అయితే లెక్కలేనన్ని. నాకెవ్వరితోనూ లొల్లి లేదు. పర్సనల్‌గా ఎవ్వరిమీదా కోపం లేదు. అంతా హ్యాపీ. అరియానా: మా ఫ్రెండ్స్ ఎలిమినేట్ అవడం బాధగా అనిపించింది. ఒకసారి గిఫ్ట్‌లు ఎవరికి ఇవ్వాలో నోట్ చేయమన్నారు. అందులో ఇద్దరికి రాయాలనుకున్నాను. కానీ, ఎవరికి రాయాలి..? అనేది సందేహం. దాంతో ఎవరికీ రాయలేదు. నాకూ ఎవరూ గిఫ్ట్ ఇవ్వలేదు. అయినా ఏమీ బాధనిపించలేదు. అప్పుడు బిగ్‌బాస్ నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఆ కన్సర్న్కి ఆ రోజు కళ్లలో నీళ్లు వచ్చేశాయి ఆనందంతో. రూమర్స్ గురించి.. ఏమనుకుంటారు? హారిక: వాటి గురించి పట్టించుకుంటే మనం అస్సలు నడవను కూడా నడవలేం. అరియానా: ఏం వచ్చినా పట్టించుకోను. నాది నాకు తెలుసు. అందరికీ ఎక్స్ప్లనేషన్ ఇవ్వలేం. అందరూ ఫ్రెండ్స్‌గా ఉంటారు. కానీ, ఒక పర్సన్‌కే కనెక్ట్ అవుతాం. నా సిచ్యుయేషన్ ఏంటో నాకు తెలుసు కాబట్టి పట్టించుకోను. సింగిల్ పేరెంటింగ్‌లో పెరిగినట్లున్నారు కదా... మీకు ఎలా అనిపించింది? హారిక: పిల్లలకు కానీ, పేరెంట్స్ కానీ అన్ని సౌకర్యాలు ఉంటే బాధ్యత రాకపోవచ్చు. అలా లేకపోవడం వల్లే నాలో ఒక బాధ్యత పెరిగిందనుకుంటాను. అమ్మ బొటీక్ ద్వారా కష్టపడుతుంది... తనను డబ్బులు అడగకూడదు అనుకున్నాను. అమెజాన్‌లో పార్ట్‌టైమ్‌గా జాబ్‌లో చేరాను. ‘కానీ, ఈ రోజున్న జాబ్ రేపు ఉండకపోవచ్చు. ఇంకేదైనా చేయాలి..’ అనుకున్నాను. అప్పుడే ఫ్రెండ్ ద్వారా క్రియేటివ్ థాట్స్‌ని మీడియా ద్వారా చూపవచ్చు అని తెలిసింది. అప్పటికి ఫుల్‌టైమ్ జాబ్ చేస్తున్నా. వీకెండ్లో స్కిట్లు ప్లాన్ చేసుకున్నా. ఎలాగైనా ఫర్వాలేదు.. అడవిలో ఉన్నా, ఎడారిలో ఉన్నా బతికేయాలని డిసైడ్ అయ్యాను. అరియానా: లైఫ్‌లో భార్య, భర్త, పిల్లలు అనే బంధం ఉండాలి. దీనితో పాటు మనకు మనంగా లైఫ్‌లో ఏదో సాధించాలనే పట్టుదల కూడా ఉండాలనే విషయం నేర్చుకున్నాను. అమ్మాయిల్లో టు షేడ్స్ ఉండాలి. కోడి తన పిల్లలను కాపాడుకున్నట్టుగా కుటుంబాన్ని కాపాడుకోవాలి. కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేయకుండా వ్యక్తిగతంగా ఏం సాధించాలనుకుంటామో ఆ దిశగా ప్రయత్నాలూ చేయాలి. కుటుంబం కుటుంబమే. నాకు నేనుగా ఎదగడమూ ముఖ్యమే. వర్క్‌లో అధిగమించిన సమస్యల గురించి.. హారిక: నాకు జీవితంలో ఎదిగే అవకాశం ఇచ్చింది ‘దేత్తడి.’ దేవుడు.. పాపా నువ్వు ఇందులో ఉంటే సెట్ అవుతావు. నీ కుటుంబానికి హెల్ప్ అవుతావు.. అని పెట్టాడేమో అనిపిస్తుంది. ముందు 7–8 వీడియోలు చేసేవరకు నాకు వాటిలో చాలా విషయాలు తెలియవు. తర్వాత అన్నీ నేనే చేయాల్సి వచ్చింది. ఆర్టిస్టులను పిక్ చేసుకోవడానికి టైమ్ పట్టేది. ఆర్టిస్టుల కోసం టిక్‌టాక్ వీడియోలు చూసి, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ పదిమందిని కాంటాక్ట్ చేశాను. ఎడిటింగ్, డబ్బింగ్ అంటూ స్టూడియోలు వెతుక్కొని వెళ్లాను. రిలీజ్ అప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. మంచి రిజల్ట్ వచ్చింది. ముందు దీనిలో ఓనమాలు తెలియవు. అందుకే, జాబ్ చేస్తూనే ఈ వర్క్ వీకెండ్లో చేసేదాన్ని. ఆఫీస్ షూట్.. షూట్.. ఆఫీస్ అన్నట్టుగా చేసేదాన్ని. అరియానా: కాలేజీ రోజుల నుంచి ఒకే ఆలోచన.. ఒక్కరోజు టీవీలో కనిపించినా పాప్యులర్ అయిపోతాను అనుకునేదాన్ని. చాలా ప్రయత్నాలు చేశాను. అమ్మ వద్దంది. ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా ఓ మెయిల్ క్రియేట్ చేసి, టీవీలకి బోలెడన్ని ఫొటోలు పంపించాను. తర్వాత అడిషన్స్‌కి వెళ్లాను. సెలక్ట్ అయ్యాను. ఐదేళ్లుగా యాంకరింగ్ చేస్తున్నాను. ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ చేశాను. మొదట్లో ఏవీ తెలియవు. అన్నీ తెలుసుకుంటూ వెళ్లడమే. నేను యాంకర్ కావాలి అనుకున్నాను. నేర్చుకునే క్రమంలో ప్రతిచోటా ప్రతిరోజూ ఇష్యూస్ ఉంటాయి. వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలి. మీ ముందున్న లక్ష్యం? హారిక: గొప్ప నటిగా ఎదగాలి. క్రేజీ క్యారెక్టర్ చేయాలి. అది సినిమా లేదా వెబ్‌సీరీస్. సినిమా ఏది వస్తుందో తెలియదు. ఇంట్లో టీవీలో సినిమా చూస్తున్నప్పుడు అందులోని నటీనటుల యాక్టింగ్ గురించి మాట్లాడుతుంటాం. అలా నా యాక్టింగ్ గురించి కూడా చాలా మంది మెచ్చుకోవాలని ఉంది. అలా నేనూ చేయాలి అదే నా యాంబిషన్. అరియానా: మంచి యాంకర్ అవ్వాలి. క్రికెట్లో కామెంటరీ చేయాలి. ఒక పెద్ద నేషనల్ ఛానెల్లో ఇంటర్వ్యూస్ చేయాలి. ఈ అమ్మాయి ఎవరో భలే మాట్లాడింది.. అనుకోవాలి. ఆ రోజు రావడానికి టైమ్ పట్టచ్చు. కానీ, తప్పక వస్తుంది అనుకుంటాను. – నిర్మలారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కథ చెబుతా... ఊ కొడతారా!
వేసవి కాలం అనగానే పల్లె గుర్తుకు రావడానికి కారణం మన బాల్యంలో పెరిగిన ఊరు. అక్కడి వాతావరణం. ఆడుకున్న ఆటలు, అమ్మమ్మ–తాతయ్య కథలు చెబుతుంటే ‘ఊ..’ కొడుతూ విన్నాం. ఇప్పుడు కుటుంబాలు చిన్నవైపోయాయి. అమ్మ, నాన్న పిల్లలవరకే అవి పరిమితం అయ్యాయి. అమ్మానాన్న పిల్లలకు కథలు చెప్పడమే తగ్గిపోయింది. దీంతో పిల్లల్లో సామాజిక విలువలు, జీవన నైపుణ్యాలు తగ్గిపోతున్నాయనేది నమ్మలేని నిజం. ఈ కాన్సెప్ట్‌ను దృష్టిలో పెట్టుకొని చైల్డ్ సైకాలజిస్ట్ డాక్టర్ గీతా చల్లా ఈ లాక్డౌన్ కాలాన్ని కథల వర్క్‌షాప్‌కి కేటాయించారు. ‘బాలమిత్ర’ పేరుతో ఆన్లైన్ ద్వారా రోజుకో కథ చెబుతున్నారు. ఆ కథ చివరలో పిల్లలకు రకరకాల టాస్క్‌లు ఇచ్చి ఆ రోజంతా వారిని బిజీ బిజీగా ఉంచుతున్నారు. ‘బాలమిత్ర’ కథలు పిల్లల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంచే కథలు ఎన్నో మన భారతీయ జ్ఞాన సంపదలో మెండుగా ఉన్నాయి. అయితే వీటిని వినియోగించుకోవడంలో ఇటీవల కాలంలో బాగా వెనకబడ్డాం అంటారు డాక్టర్ గీత. రోజూ 500 మంది పిల్లలకు మధ్యాహ్నం 12 గంటలకు ఆంగ్లంలో, 12:30 కు తెలుగు లో కథ చెబుతారు గీత. హైదరాబాద్‌లో ఉంటున్న గీతాచల్లా పిల్లల మానసిక సమస్యలకు, వారి పరిణితికి ‘మనోజాగృతి’ పేరుతో కౌన్సెలింగ్స్ ఇస్తున్నారు. ‘ఈ లాక్డౌన్ కాలంలో రోజంతా పిల్లలను ఇంట్లోనే ఉండేలా చూడటం తల్లులకు పెద్ద టాస్క్. పిల్లల పెంపకానికి సంబంధించిన అంశాల్లో తల్లులూ టాస్క్‌ల్లో పాలు పంచుకుంటున్నారు. పిల్లలతో ఆ టాస్క్‌లను చేయిస్తూ వారి ఫొటోలు, వీడియోలు మాకు షేర్ చేస్తుంటారు. గ్రూప్‌లో అందరికన్నా తమ పిల్లలు ముందుండాలని కూడా తపన పడుతుంటారు. పిల్లలకు వచ్చే ప్రశంసలు చూసి పేరెంట్స్ చాలా ఆనందపడుతుంటారు. ఈ విషయాలు వాళ్లు మాతో పంచుకున్నప్పుడు ఈ పని చేస్తున్నందుకు చాలా ఆనందిస్తుంటాను’ అని తెలిపారు ఈ డాక్టర్. రోజుకో కొత్త టాస్క్ ఇంట్లో ఉన్న వనరులతోనే టాస్క్‌లను పూరించమంటారు గీత. ఒక రోజు నచ్చిన పాటకు డ్యాన్స్, మరో రోజు ఏదైనా రంగును పోలిన వస్తువులన్నీ సెట్ చేయడం, ఇంకోరోజు మంట అవసరం లేని వంట, రోజూ వాడే దినుసులు, ఒక రోజు పెయింటింగ్.. ఇలా రోజుకో టాస్క్ ఇస్తూ పిల్లల్లో యాక్టివిటీని పెంచుతున్నారు. మధ్యాహ్నం ఇచ్చిన టాస్క్ సాయంకాలం 7 గంటల లోపు పోస్ట్ చేయాలి, ఇలాంటి అంశాలతో డాక్టర్ గీత ఇళ్లలో ఉన్న పిల్లలను గడప దాటనివ్వకుండా అట్రాక్ట్ చేస్తున్నారు. – నిర్మలారెడ్డి లైవ్ సెషన్స్.. రోజూ రెండు గంటలు తెలుగు, ఇంగ్లిషులో ఆన్లైన్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాను. దీంట్లో పిల్లలకే కాకుండా తల్లిదండ్రులకూ పాజిటివ్ పేరెంటింగ్ గురించి సూచనలు, కౌన్సెలింగ్ పద్ధతులూ ఉంటాయి. ఈ లాక్డౌన్ టైమ్‌లో పిల్లలు క్వాలిటీ టైమ్‌ను బద్ధకంగా గడపడం, లేదంటే పేరెంట్స్‌ను విసిగించడం వంటివి చేస్తున్నారనే కంప్లైంట్స్ ఎక్కువగా వినడం వల్ల వారికోసం ఏదైనా చేయాలనే ఆలోచన కలిగింది. చైల్డ్ సైకాలజిస్ట్‌గా పిల్లల్లో నైపుణ్యాలను వెలికి తీయడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. ఈ ఆన్లైన్ వర్క్‌షాప్‌లో 500 మందికి పైగా పిల్లలు, తల్లిదండ్రులు చేరడం చాలా ఆనందంగా ఉంది. – గీతా చల్లా, చైల్డ్ సైకాలజిస్ట్, స్టోరీ టెల్లర్ హైదరాబాద్ -
నిర్మలారెడ్డికి అభినందనలు..
సాక్షి, హైదరాబాద్: సాక్షి’ దినపత్రిక చీఫ్ రిపోర్టర్ నిర్మలారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉత్తమ మహిళా జర్నలిస్ట్ అవార్డును అందుకున్నారు. మహిళాదినోత్సవం సందర్భంగా ఆదివారం రాత్రి రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాధోడ్ ఆమెకు పురస్కారాన్ని అందజేశారు. దీనిని పురస్కరించుకుని ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ వర్ధెల్లి మురళి, డిప్యూటీ ఎడిటర్ రమణమూర్తి, అసిస్టెంట్ ఎడిటర్ ఖదీర్‌బాబు పలువురు సీనియర్ పాత్రికేయులు సోమవారం ఆమెకు అభినందనలు తెలిపారు. నల్లగొండ జిల్లా, పెద్ద అడిశర్ల మండలం, చిలకమర్రి గ్రామానికి చెందిన నిర్మలారెడ్డి గత 20 ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారు. మహిళల ఆదరణ పొందిన ‘సాక్షి’ ఫ్యామిలీ విభాగంలో ఫీచర్ జర్నలిస్ట్‌గా పలువురు మహిళల స్ఫూర్తిదాయక విజయాలను వెలుగులోకి తెచ్చారు. మానవీయ కథనాల ద్వారా ఎందరో ఆపన్నులకు చేయూత అందేలా చేశారు. కథా రచయిత్రిగానూ తనదైన ముద్రవేసుకున్న ఆమె గతంలో ప్రతిష్టాత్మక డీఎన్‌ఎఫ్ ఉత్తమ మహిళా జర్నలిస్ట్ అవార్డును సైతం అందుకున్నారు. అవార్డు గ్రహీత నిర్మలను అభినందిస్తున్న ‘సాక్షి’ ఎడిటర్ వర్దెల్లి మురళి తదితరులు -
కేసీఆర్, హరీష్‌ను అరెస్ట్ చేయాలి : జగ్గారెడ్డి భార్య
సాక్షి, హైదరాబాద్ : నకిలీ పాస్‌పోర్టు కుంభకోణం కేసులో అసలు నిందితులైన కేసీఆర్, హరీష్ రావులను వదిలేసి తన భర్తను అక్రమంగా ఇరికించారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మలారెడ్డి ఆరోపించారు. బుధవారం చంచల్‌గూడ జైల్లో ఉన్న జగ్గారెడ్డిని ఆయన కుటుంబసభ్యులు ములాఖత్‌లో కలిశారు. జైలు అధికారులు మాత్రం కేవలం జాలీ ములాఖత్‌కు మాత్రమే అవకాశం కల్పించారు. అనంతరం నిర్మలారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జగ్గారెడ్డి చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసని ఆయన మచ్చలేని మనిషి అని పేర్కొన్నారు. అధికార దాహంతోనే జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారని ఆగ్రహించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన కేసీఆర్, హరీష్‌రావులను ఎందుకు అరెస్ట్ చేయటం లేదని ప్రశ్నించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా అధికారులు సాధారణ ములాఖత్ ఇచ్చారని, జాలీ మధ్యలోనుంచి మాటలు స్పష్టంగా వినిపించటంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
మంచిని విత్తండి
వీధి చివర కుక్కపిల్లకు దెబ్బతగిలితే సుధాకర్రావుగారి అబ్బాయికి అయిదేళ్లు ఉంటాయేమో దాన్ని తీసుకెళ్లి కట్టుకట్టించాడు. టీ కొట్టు అతను అక్కడ పనిచేసే కుర్రాడిని బాదుతుంటే రమణిగారి అమ్మాయి ఏడేళ్లు కూడా ఉండవు అతనికి అడ్డం పడిందట. చూశారా... పిల్లల పేర్లు ఎవరికీ తెలియవు. కాని, పిల్లలు చేసిన మంచి పనితో ఆ తల్లిదండ్రులకు ఎంత మంచి పేరు వచ్చిందో. నిజానికి దీనికి రివర్సే కరెక్ట్. ఆ తల్లిదండ్రుల పెంపకంలో ఆ పిల్లలు నేర్చుకున్న మంచితనం అది. తల్లిదండ్రుల ఉపదేశాలకన్నా వారి చేతలను చూసే పిల్లలు మంచి తనాన్ని నేర్చుకుంటారు. అందుకేనేమో పుట్టినప్పుడు అమ్మపోలికో, నాన్నపోలికో అంటారు. పెరిగేటప్పుడు అమ్మ మంచితనమో, నాన్న మంచితనమో అంటారు. ‘ఎందుకు నాన్నా ఆ గింజలన్నీ అలా భూమిలో నాటుతున్నావు?’ ఆశ్చర్యంగా అడిగాడు కొడుకు. ‘ఇవి మొలకెత్తి, పెద్ద మొక్కలై మరిన్ని గింజలు వస్తాయి. వాటిని విత్తితే ఇంకా ఎక్కువ గింజలు వస్తాయి.. అలా అలా మన ఊళ్లో అందరికీ సరిపోయినన్ని గింజలను పండించుకోవచ్చు’ తండ్రి సమాధానం. ‘వీటిలాగే మన దగ్గర ఉన్న బుల్లెట్లను నాటితే ఇంకా బోలెడన్ని బుల్లెట్లు వస్తాయా! వాటితో మనల్ని పీడించే ఆంగ్లేయులందరినీ చంపేయచ్చా?’ ఆవేశంగా అడిగాడు కొడుకు. బ్రిటీష్ ఆధిపత్యం నుంచి భారతీయులను కాపాడుకోవాలనే ఆలోచన ఆ చిట్టి మెదడులో అప్పుడే రూపుదిద్దుకుంది. ఆ పిల్లాడే భగత్‌సింగ్. ఆ పేరే ఆంగ్లేయులను పరుగులు పెట్టించింది. ‘ఏంటి, స్కూల్ టైమ్ అయిపోయింది, ఇప్పుడా నువ్వు వచ్చేది’ బెత్తం ఆ విద్యార్థినిపై నాట్యం చేసింది. శిక్ష పూర్తయ్యాక... ‘ఇంతకీ ఎందుకు లేటయింది?’ అడిగింది టీచర్. ‘రోడ్డు దాటలేక అవస్థపడుతున్న ముసలి అవ్వను దగ్గరుండి రోడ్డు దాటించి వచ్చాను, అందుకే లేటయింది’ బదులిచ్చిందా విద్యార్థిని. బాధించిన బెత్తం చిన్నబోయింది. ఆ చిన్నారి పాఠాలకన్నా గొప్పగా ఎదిగిపోయింది. విశ్వమంతా విస్తరించింది. ప్రపంచాన్నే సేవా మార్గం పట్టించింది. చిన్నవయసులోనే ఎంతో మానవత్వాన్ని చూపిన ఆ మానవతామూర్తే ఆగ్నస్. ప్రపంచ జనులందరూ అమ్మగా ఆరాధించే మదర్ థెరిస్సా. ‘మనిషి సంఘజీవి’ అన్నాడు అరిస్టాటిల్. అందరూ ఆనందంగా, సుఖసంతోషాలతో జీవించాలంటే అందరూ అందరికోసం అన్నట్టుగా జీవించాలి. అక్కడే భద్రత ఉంటుంది, అక్కడే శాంతి ఉంటుంది. అక్కడే ఇరుకు గోడలు విశాలమై రేపటి భావి జీవితాన్ని సుసంపన్నం చేస్తాయి. సామాజిక బాధ్యత నుంచే సేవాతత్పరత, మానసిక వికాసం నుంచే మానవత్వం జనించాలి. దీనికి ఇల్లే సరైన పాఠశాల. మొక్కదశలోనే మానవత్వాన్ని, సేవాతత్పరతను పెంపొందించడానికి తల్లిదండ్రులే ఉపాధ్యాయులు కావాలి. చుట్టూ ఏం జరుగుతోంది? నా వంతు సాయం ఎంత వరకు చేయగలను? అనే భావనను వారి మెదళ్లలో నాటుకుపోయేలా చేయడం పెద్దల బాధ్యతే. ఇంట్లో వున్న చెత్తను వీధి బయట పడేస్తే కేవలం మన ఇల్లే శుభ్రమౌతుంది. అదే వీధి చివర్లో ఉన్న చెత్తకుండీ దాకా తీసుకెళ్లి పారబోస్తే? ఆ వీధి మొత్తం పరిశుభ్రంగా ఉంటుంది. ఆ వీధిలో ఉన్న వారికి అసౌకర్యాన్ని దూరం చేయడం దగ్గర్నుంచే మొదలుపెట్టచ్చు. చేసే పనికి సామాజిక బాధ్యత జోడిస్తే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయనేది పిల్లలకు బాల్యదశలో ఇంటి వద్ద నేర్పే పాఠాలుగా మారాలి. చిన్న మార్గం... సమాజసేవ అనగానే ‘డబ్బుతో ముడిపడి ఉంది, అది బాగా సంపన్నులు మాత్రమే చేసే పని అని, సాయం చేయాలంటే మన స్థాయి సరిపోదు’ అనే ఆలోచన సరికాదు. మీరలాంటి భావాలతో ఉంటే అది మీ పిల్లలపై కూడా ప్రభావం చూపిస్తుంది. తనకు నిరుపయోగంగా మిగిలినవి, తోటివారికి ఉపకరించేవి ఉంటే వాటిని పిల్లల చేతులమీదుగానే అవసరంలో ఉన్న వారికి అందజేయచ్చు. నేటి బాలలే రేపటి సంఘసేవకులు కావడానికి ఓ చిరు మార్గం చూపినట్టుంటుంది. స్కూళ్లు మొదలయ్యే నాటికి పిల్లలు వాడేసిన దుస్తులు, పుస్తకాలు బీదపిల్లలకు ఇప్పించవచ్చు. టీచర్లు తమకు నేర్పిన విద్యని ఎవరికైనా చెప్పాలని విద్యార్థులు ఉబలాటపడుతుంటారు. దీనిని అనుకూలంగా మార్చుకుని వారిచేత నిరుపేద పిల్లలకు చదువు చెప్పిస్తే ఆ కళ్లల్లో కనిపించే ఆనందం దేనితోను సరితూగదు. పసిపిల్లవాడు తప్పటడుగులు వేస్తున్నప్పుడు ఆ అడుగులను చూసి ఆనందిస్తూ, వాటిని సరిదిద్దుతాం. అలాగే వారు జీవితంలో ఎదగడానికి, సమాజం గురించి అవగాహన కలగడానికి, చేతనైనంత సేవచేయడానికి పొరపాట్లను దిద్దుతూ మార్గనిర్దేశకం చేసేది తల్లిదండ్రులే. పిల్లలు పెద్దయ్యాక తమ తల్లిదండ్రుల్లా కావాలనుకునే విధంగా ఆదర్శంగా నిలవాలి. అలా చేయగలిగితే తల్లిదండ్రులు తమ బాధ్యత సక్రమంగా నిర్వర్తించినట్టే. చెప్పకుండా చెప్పే విషయాలు పెద్దలు ఏ పని చేస్తే పిల్లలు అది చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. అమ్మ వంట చేస్తే తామూ చేయాలని ఉబలాటపడే పిల్లలు, నాన్నలా మోటార్‌బైక్ నడపాలని ఉత్సాహపడతారు. వారికి మంచేదో, చెడేదో తెలియదు. ఇంట్లో పెద్దల ప్రవర్తన ఎలా ఉంటే పిల్లలు అదే నేర్చుకుంటారు. ఇవేవీ పుస్తకాల్లో ఉండవు, చదివి నేర్చుకోవడానికి. తమ చుట్టూ ఉన్న పరిసరాలను, వ్యక్తులను ప్రాక్టికల్‌గా చూసి నేర్చుకుంటారు. తామూ పెద్దయ్యాక అలాగే అవ్వాలని కోరుకుంటారు. తండ్రి తన తల్లిని గౌరవిస్తే అది చూసి పిల్లవాడు నేర్చుకుంటాడు. అమ్మను ఎంత బాగా చూసుకోవాలో తెలుసుకుంటాడు. దేశాన్ని కూడా కన్నతల్లిలా చూసుకోవాలన్న భావన పెరిగేది కూడా ఇక్కడే. ఇంటి నుంచే సమాజసేవ చేయాలన్న ఆలోచన పుడుతుందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.కూరగాయల తొక్కలు తీసుకెళ్లి మొక్కలకు వేయండి. దీనివల్ల పిల్లలు మొక్కలకు వేస్టేజ్ ఎరువుగా పనిచేస్తుందన్న మాట అని అర్థం చేసుకొని అదేవిధంగా చేస్తారు. ట్యాప్ విప్పి పనులు చేయడం కాకుండా బకెట్లోనో, గిన్నెలోనో నీటిని పట్టి అవసరమైనంతే వాడుకోవాలి. ఇది చూసి పిల్లలు కూడా నీటి విలువ తెలుసుకుంటారు. ఇంట్లో ఎక్కడ తీసిన వస్తువులను అక్కడ పెడుతూ ఉంటే పిల్లలు కూడా అలా చేయడం అలవర్చుకుంటారు. గదిలో నుంచి బయటకు వెళ్లేటప్పుడు కరెంట్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్లాలి. అది చూసి పిల్లలకు కరెంట్ ఆదా చేయాలని తెలుస్తుంది. పొట్టిగా అయిపోయిన దుస్తులు, చెప్పులు, షూస్, బ్యాగులు... మొదలైనవి బాగుచేసి పనివాళ్లకు ఇవ్వడం, లేదంటే పేదవాళ్లకు ఇవ్వడం చేయాలి. ఇది చూసి పిల్లలకు ‘లేనివాళ్లకు సహాయపడాలి’ అన్న ఆలోచన కలుగుతుంది. పిక్నిక్, సినిమా, పార్కులకు వెళ్లినప్పుడు చాక్లెట్ రాపర్లు, ఐస్‌క్రీమ్ కప్పులు లాంటివి తప్పకుండా డస్ట్‌బిన్‌లో వేయాలి. పెద్దలను పిల్లలు అనుసరిస్తుంటారని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.బస్సులో వెళ్లినప్పుడు, ఏదైనా బిల్లు కడుతున్నప్పుడు వయసులో పెద్దవాళ్లు, అంగవికలురు, గర్భవతులు ఉంటే వారికి సీట్ ఇవ్వడం, దారి ఇవ్వడం వంటివి చేయాలి. పిల్లలకు అలాంటి వాళ్లకు హెల్ప్ చేయాలనే ఆలోచన కలుగుతుంది.అంగవైకల్యంతో ఎవరైనా బాధపడుతుంటే మనం వారి గురించి చులకనగా, జాలిగా మాట్లడం చేయకూడదు. వాళ్లని మనుషుల్లానే భావించి సరైన గౌరవం ఇస్తే పిల్లలు కూడా అదేవిధంగా గౌరవించడం నేర్చుకుంటారు. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
జంటపూల నవ్వు
రాజీవము వికసించింది. సుమము పరిమళించింది. పూలు రెండయినా పండు ఒక్కటే. పండంటి కాపురం ఒక్కటే. ఇద్దరూ పని చేస్తారు. ఇద్దరూ సర్దుబాటు చేసుకుంటారు. ప్రేమ బంధమైంది. బంధం బాధ్యతైంది. బాధ్యత లేని ప్రేమ... ప్రేమ లేని బంధమవుతుందని... అహం లేని బంధం... ప్రేమ ఉన్న అనుబంధమవుతుందని... తప్పు చేయకపోయినా క్షమించమని అడిగే నిస్వార్థం ఉంటే... తప్పు చేస్తే ఎత్తి చూపగల చనువు ఉంటే... మేరేజస్ ఆర్ హెవెన్ అని ఈ జంటపూలు చెబుతున్నాయి. హాయ్... నమస్తే... రాజీవ్- సుమ: హాయ్ (నవ్వుతూ) ♦ ఇద్దరిదీ ఒకే ఫీల్డ్ కదా. జనరల్‌గా వచ్చే సమస్యలు ఏమైనా ఉంటాయా? సుమ: బేస్ ఎంటర్టైన్మెంటే అయినా ఇద్దరివీ డిఫరెంట్ ప్రొఫెషన్స్. తనది ఫిల్మ్. నాది టెలివిజన్. సినిమాల్లో వీళ్లదంతా షార్ట్ షార్ట్ వర్క్ (నవ్వుతూ)... నా వర్క్ మాత్రం తరతరాలుగా (ఎపిసోడ్స్...) సాగుతూనే ఉంటుంది. ముందే అనుకున్నాను తన సినిమాల్లో నేను నేను జోక్యం చేసుకోకూడదు అని. నా షోకి మాత్రం తను గెస్ట్గానైనా రావచ్చు. రాజీవ్: అదే బెస్ట్. ఇంట్లో ఎలాగూ పరస్పర ప్రమేయం ఉంటుంది. ఇక ప్రొఫెషన్స్‌లో కూడా ఎందుకు అనుకున్నాం. ఆమె చికాకులు ఆమెవి. నా తల నొప్పులు నావి. ♦ అవునా... అలాంటి చికాకులు ఉంటాయా? రాజీవ్: ఎందుకుండవండీ... వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలు ఉన్నా ఈ ప్రొఫెషన్లో స్క్రీన్ మీద మాత్రం నవ్వుతూ కనిపించాలి. చలాకీగా ఉండాలి. రెండేళ్ల కిందట మా మామగారు (సుమ తండ్రి) చనిపోయారు. ఆ మరుసటి రోజు తనో ఎపిసోడ్ నవ్వుతూ చేయాల్సిన పరిస్థితి. ఎవరు చేయగలరు? కాని తను చేసింది. చాలా బాధనిపించింది. సుమ: మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ ఆపేయగలిగాం. కానీ ‘క్యాష్’ ప్రోగ్రామ్‌కి మరో ఎపిసోడ్ లేదు. షెడ్యూల్ టైమ్‌కి కొత్త ఎపిసోడ్ పడాల్సిందే. అందుకని లోపల ఎంత బాధ ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ... ఇప్పటికీ తలుచుకుంటూనే కన్నీళ్లు వచ్చేస్తాయి. ♦ మరి ఇవి ఇంటి దాకా రావా?... సుమ: వస్తాయి. కాని కాన్షియస్గా బయటి పని బయటే ఇంటి పని ఇంటికే అనుకోవాలి. నేను ఇంటికి వచ్చేసరికి మా ఇద్దరు పిల్లలు చేయని పనులు, చేసిన పనులతో దాడి చేయడానికి రెడీగా ఉంటారు. మదర్ డ్యూటీయే ఫస్ట్... అనుకుని వాళ్ల లోకంలో పడిపోతాను. రాజీవ్: అది నిజమే. ఇంకా చెప్పాలంటే ఈ ఐదేళ్లుగా మా పనుల్లో మేముండిపోయి మాట్లాడ్డమే బాగా తగ్గిపోయింది. ఈవెనింగ్ కాస్త టైమ్ ఉంటే ‘నీ ప్రోగ్రామ్‌కి ఫలానా సెలబ్రిటీ వచ్చారట...’ అంటాను. ‘ఆ.. వచ్చారనుకుంటాను.. గుర్తులేదు’ అంటుంది ఆవులిస్తూ. ఇంకో వన్ ఇయర్ ఇలాగే ఉంటే ‘రాజీవ్ ఎవరు?!’ అని అడుగుతుందేమో అని అప్పుడప్పుడు భయం వేస్తుంది కూడా ... (ఇద్దరూ నవ్వులు) ♦ మరి మీ మధ్య సారీ చెప్పుకునే సందర్భాలు లేవా? రాజీవ్: ఎందుకండవ్? సారీ... అనేది ఆలుమగల మధ్య కచ్చితంగా ఉండి తీరాల్సిన పదం. నాకు విరివిగా అలవాటైపోయిన పదం (నవ్వులు). ఈ మధ్య 20-30 రోజులు షూటింగ్ కోసం వేరే వేరే ఊళ్లలో ఉండాల్సి వస్తోంది. అనుకున్న సమయానికి ఇంటికి రాలేకపోతే చటుక్కున వచ్చే పదం సారీనే...! ఒక్కోసారి అనాలోచితంగా కూడా తనను హర్ట్ చేసి సారీ చెబుతుంటాను. సుమ: అలాంటి ఓ విషయం చెబుతాను. ప్రొడక్షన్ పనిలో భాగంగా కథలు వినడం, ఆర్టిస్ట్‌లను సెలక్ట్ చేయడం మామూలే. అలా ఒకసారి బెంగుళూరు మోడల్ అట... నాకు మాట మాత్రం కూడా చెప్పకుండా రాత్రి టైమ్‌లో ఇంటికి తీసుకొచ్చారు. రాజీవ్: ఆ అమ్మాయి అలా ఇంటికి వస్తుందని ముందు నాకే తెలియలేదు. తనకు కేటాయించిన హోటల్ రూమ్ బాలేదన్నారు. నాకేం చేయాలో తోచక ఇంటికి తీసుకొచ్చేశాను. సుమ: మొత్తానికి ఆ రోజు బాగా ఇరిటేట్ అయ్యాను. ఎప్పుడైనా అలా తీసుకురావాలంటే నా పర్మిషన్ కాస్త తీసుకో... అని చెప్పాను. ఆ తర్వాత ‘సారీ’ చెప్పారు. ♦ ఇద్దరిలో ఎవరు సెన్సిటివ్? సుమ: నేనే. (రాజీవ్నుద్దేశించి) నువ్వు సెన్సిబుల్ కదా! అందుకని. రాజీవ్: సిచ్యుయేషన్ బట్టి ఉంటుంది. ♦ గొడవలు వచ్చినప్పుడు.... సుమ: మా నాన్నకు అమ్మకు కూడా గొడవలవుతుండేవి. ఆ విధంగా భార్యాభర్తలు అన్నప్పుడు ఇవి చాలా సాధారణం అని తెలుసు. ఈయన మాట్లాడితే వాయిస్ గంటకొట్టినట్టు ఉంటుంది. చెప్పాల్సిన పాయింట్ గట్టిగా చెప్పేసరికి మొదట్లో భయపడిపోయేదాన్ని. మాట్లాడకుండా ఫోన్లో మెసేజ్‌లు పంపించేదాన్ని. కొన్నిసార్లు స్లిప్ రాసి బాత్రూమ్లో అద్దం మీద అతికించేదాన్ని. ఇలా చాలా ట్రిక్స్ ఉన్నాయిలెండి... ఇప్పుడు అలాంటి సందర్భాలు చాలా తక్కువ. రాజీవ్: అయ్యో, తనూ అరుస్తుంది ఎప్పుడైనా! అయితే ....(ముసి ముసిగా నవ్వుతూ) సుమ: ఇప్పటి నా అరుపులో కొంచెం బెటర్మెంట్ ఉందిలెండి. కానీ, నా అరుపు ఈయనకు కామెడీగా ఉంటుంది... బాగా కోపం వచ్చి అరిచేస్తే.. ఈయన హహహ... అని నవ్వేస్తారు. ఈయన నవ్వు చూసి నాకు నవ్వొస్తుంది. రాజీవ్: రెండు పులులు సింహాలు కొట్టుకుంటుంటే.. అది వేరే... కానీ, నా అరుపుకి- తన అరుపుకి ఎప్పుడు మ్యాచ్ అవ్వాలి?! ♦ ఇద్దరిలో మనీ మేనేజ్మెంట్ ఎవరి చేతుల్లో ఉంటుంది? రాజీవ్: వితౌట్ డిస్కషన్ సుమదే. హోమ్మినిస్టరూ తనే, ఫైనాన్స్ మినిస్టరూ తనే. నేనేదైనా ఖర్చుపెడితే సుమకు చెప్పే చేస్తాను. సుమ: మొదటి నుంచీ రాజీవ్ ఈ విషయంలో ఆ బాధ్యతను నాకే అప్పజెప్పారు. వందరూపాయలు సంపాదించుకొచ్చినా తెచ్చిస్తారు. మొదట్లో ఖర్చులు, అప్పులు, రాబడి అన్నీ రాసుకునేవాళ్లం. ఇప్పుడా పద్ధతి పాటించడం లేదు. నీ మనీ, నా మనీ అనే డిఫరెన్స్ మా మధ్య ఎప్పుడూ లేదు. అలా ఉంటే సమస్యలు తప్పవు. ♦ పిల్లల పెంపకం... రాజీవ్: ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనల్ని మనం తప్పించుకోవడానికి ‘నీ పెంపకమే తప్పు’ అని ఎదుటివారిని హర్ట్ చేయడం ఇద్దరిలోనూ ఉంటుంది. మా వరకు ఆ సందర్భం రాలేదు. ♦ ఇన్ని పనుల్లో సుమకు మీ (రాజీవ్ కనకాల) సాయం... రాజీవ్: తెలియని పనుల జోలికెళితే అది కిచిడీ అవుతుంది. అందుకే అటువైపుగా వెళ్లనుగాక వెళ్లను. ఎప్పుడైనా ఒక్కొక్కసారి చేస్తుంటాను. ♦ సుమకు బయట యాంకర్‌గా చాలా పేరు వచ్చింది కదా! మీరు ఎప్పుడైనా జెలసీగా ఫీలయ్యారా? రాజీవ్: బయట అంతా ఇదే మాటంటుంటారు. కానీ అలాంటిదేమీ లేదు. తను యాంకరింగ్ బాగా చేస్తుంది. సుమ: రాజీవ్ ప్రొడక్షన్ వర్క్, ఐడియాస్ చాలా క్రియేటివ్‌గా ఉంటాయి. ♦ ఇరువైపులా బంధుత్వాలను ఎలా నిలబెట్టుకుంటున్నారు...? సుమ: బేసిక్‌గా వీళ్ల బాబాయిని నా బాబాయి అనుకొని వీళ్ల అత్తను మా అత్త అనుకొని ఇలా ఎక్కువగా పట్టించుకుంటాను. మా నాన్నతోడ పది మంది అమ్మతోడ ఏడుగురు. పెద్ద ఫ్యామిలీ. రెండువైపులా ఎక్కడుంటే అక్కడ అంతా నన్ను చాలా చాలా ఇష్టపడతారు. రాజీవ్: వీళ్లంతా డౌన్ టు ఎర్త్. అందరూ ఒక రేంజ్లో ఉంటారు. కానీ చాలా మామూలుగా ఉంటారు. అది నాకు బాగా నచ్చుతుంది. వీళ్ల బంధువుల ఇళ్లకు ఫంక్షన్లప్పుడు వెళతాను. కానీ, మాట్లాడటం తక్కువ. బేసిక్‌గా లాంగ్వేజ్ ప్రాబ్లమ్. ఆ మలయాళం నాకు రాదు. వెళ్లినా ఎవరితోనూ కలవలేను. సుమ: కేరళకు వెళ్లి రెండేళ్లు అవుతుంది. ఈ మంత్‌లో వాయినాడ్ వెళుతున్నాం. తీసుకెళ్లి రాజీవ్‌ని అక్కడి అడవుల్లో వదిలేసొస్తాను.. (నవ్వులు) రాజీవ్: నేనే వదిలి వెళ్లాలనుకుంటున్నా... (నవ్వులు).. ఇద్దరూ: ఊరికే అంటున్నామండి... పేపర్లో నోట్ చేయకండి. ♦ బయట సుమ తన వాక్ప్రవాహంతో హడలెత్తిస్తుంటుంది.. మరి ఇంట్లో... సుమ: అబ్బే అస్సలు లేదండి. చూస్తున్నారుగా... ఈయన మాటల ముందు నా మాటలెంత. వినడమే తప్ప అస్సలు మాట్లాడలేను. నోట్లో నుంచి మాటే రాదు... రాజీవ్: ... తను చాలా స్పాంటేనియస్‌గా మాట్లాడుతుంది. లాజిక్‌గా లా పాయింట్స్ లాగుతుంది. కానీ ఇక్కడ రిసీవింగ్ ఉంటే కదా (నవ్వులు)! ♦ ఎప్పుడైనా ఈ ఫలానా షోకి యాంకరింగ్ చేయమని మీరు(రాజీవ్) సుమని రిక్వెస్ట్ చేశారా? రాజీవ్: అయ్యో, చాలా సార్లు. మామూలు రిక్వెస్ట్ కాదు.... కుందనపు బొమ్మ సినిమా ఆడియో లాంచ్కైతే ఎంత రిక్వెస్ట్ చేశానో మాటల్లో చెప్పలే ను. రోజూ తను ఎంతో అలసిపోయి వస్తుంది నిజమే. కాని అటు చూస్తే డెరైక్టర్ నా క్లోజ్ ఫ్రెండ్. వాడికీ కాదని చెప్పలేను. ‘ప్లీజ్, ఒక్క పదినిమిషాలు వచ్చి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి వెళ్ల’మని ఎంత రిక్వెస్ట్ చేశానో. అక్కడ నా తెలివంతా ప్రదర్శించాననుకోండి! మొత్తానికి ‘సరే’ అంది. ప్రోగ్రామ్ ఓకే చేసుకున్నాం. పెద్ద పెద్ద సెలబ్రిటీలంతా వచ్చారు. కానీ, సుమ టైమ్‌కి రాలేకపోయింది. అప్పుడు నా టెన్షన్ చూడాలి. ప్రేమలో ఉన్నప్పుడు తొలి రోజుల్లో వెయిట్ చేసిన దాని కన్నా ఎక్కువ టెన్షన్‌తో వెయిట్ చేశా. మరి షో సక్సెస్ కావాలంటే సుమ ఉండాల్సిందే కదా. ♦ మీరు దేనికి రిక్వెస్ట్ చేస్తుంటారు? సుమ: ఊర్లు అయినా టూర్లు అయినా అందరం కలిసి ఎక్కడికైనా వెళ్దామా అని గతంలో అడిగేదాన్ని. ‘చెబుతాను...’ అనేవాడు. జవాబు ఉండేది కాదు. ఇప్పుడదంతా ఏమీ లేదు. ‘మనం ఫలానా రోజు అంతా కలిసి టూర్ వెళుతున్నాం’ అని చెబుతున్నా. ఏ ప్లేస్ అని కూడా చెప్పడం లేదు. గతంలో స్కూల్ నుంచి పాపను కాస్త పికప్ చేసుకుంటారా... అని అడిగేదాన్ని. ఇప్పుడు- పాప డ్యాన్స్ క్లాస్‌లో ఉంది... పూర్తవగానే తీసుకు రండి అంటున్నాను. ప్రస్తుతం అలాంటి ఫేజ్‌లో ఉన్నాను. (నవ్వులు) ♦ ఇంటి పనులు వంట పనుల్లో వంకలు పెడుతుంటారా? సుమ: ఈ విషయంలో నేను చాలా లక్కీ అండి. మావారు, మా అబ్బాయి నా వంటలు తెగ మెచ్చేసుకుంటారు. వంకలు పెట్టే డ్యూటీ మా అమ్మాయిది. రాజీవ్: బాగుంది అంటే బాగుందని చెబుతాం. లేదంటే లేదు. ♦ ఆ సంగతి ఏమోకానీ మీతో ఈ సంభాషణ మాత్రం నిజంగానే బాగుంది. సుమ: థాంక్యూ రాజీవ్: నాదీ సేమ్ డైలాగ్ (నవ్వుతూ) - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇద్దరూ సంపాదనాపరులైతే... ఆలూమగల జీవననౌక సాఫీగా సాగాలంటే ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు తలె త్తినా సమాన బాధ్యత తీసుకోవాలి. ఇద్దరూ సంపాదనాపరులు (వర్కింగ్ పీపుల్) అయినప్పుడు ఈ బాధ్యత ఇంకాస్త పెరుగుతుంది అంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్ వాణీమూర్తి. * ఇద్దరూ ఒకరిపట్ల ఒకరు కృతజ్ఞతతో ఉండాలి. నాకు ‘ఈమె’, నాకు ‘ఈయన’ దొరకడం అదృష్టం అని భావించాలి. * పొరపాట్లు కావు ఇద్దరి మధ్య ఉన్న బంధం ముఖ్యం అని గుర్తించాలి. * ఇద్దరికిద్దరూ ఏ చిన్న పొరపాటు దొర్లినా ‘సారీ’ చెప్పుకోగలగాలి. అలాగే ‘థాంక్యూ’లకు కూడా స్పేస్ ఇవ్వాలి. * ‘ప్రేమగా, ఆనందంగా ఉండటానికే పెళ్ళి చేసుకున్నాం’ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. * ఎదుటివాళ్లే నన్ను అర్థం చేసుకోవాలి అనే దృక్ఫధం ఉండకూడదు. * ఇప్పుడు చాలా మంది ప్రేమలో ఉన్నామనే భ్రమలో ఉంటున్నారు. ప్రేమ ఉంటే గొడవలు వచ్చినా వెంటనే సర్దుకుపోతాయి. * ఇది నా కుటుంబం. ఈ కుటుంబం కోసం ‘నేను ఇవి పాటించాలి’ అనే నియమం ఇద్దరికిద్దరూ పెట్టుకోవాలి. * ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకరి వర్క్‌ని ఇంకొకరు కించపరచకూడదు. గౌరవం లేని చోట బంధాలు బీటలు వారుతాయి. * ఇద్దరూ బయటి పనులతో అలసిపోయి ఉంటారు కాబట్టి, ఇంటి పనులూ పంచుకోవాలి. * ఇద్దరిలోనూ ఒకే ఇంట్రస్ట్ జీవితాంతం ఉండదు. పెళ్లి ఎప్పటికీ ఉండాల్సిన బంధం కాబట్టి, ఇద్దరికీ నచ్చే అంశాలకు ప్రాముఖ్యం ఇవ్వాలి. * ఇద్దరిలో ఒకరికి బలహీనతలు ఎక్కువ ఉండచ్చు. ఆ బలహీనతల నుంచి బయటపడటానికి మరొకరు వెన్నుదన్నుగా ఉండాలి. * నా సంపాదన, నీ సంపాదన అనే తేడా చూడకూడదు. * ఏదైనా చెబితే తప్పుగా అర్థం చేసుకోవడం, లేకపోతే అస్సలు అర్థం చేసుకోకపోవడం ఉండకూడదు. - వాణీమూర్తి, ఫ్యామిలీ కౌన్సిలర్ -
పక్కింటి కుర్రాడు!
వీడికి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కావాలి... ఆపిల్ ల్యాప్‌టాప్ చూపించుకోవాలి. రాడో రిస్ట్‌వాచ్ ఉండాలి... కాస్ట్లీ బైక్ మీద షికార్లు కొట్టాలి. పబ్‌లో పార్టీ ఇవ్వాలి... లేదా గోవాలో రేవ్ పార్టీకి వెళ్లాలి. మరి ఇవన్నీ కావాలంటే బిగ్ మనీ కావాలి. అబద్ధాలు... మోసాలు... దొంగతనాలు... కిడ్నాప్‌లు... డ్రగ్స్... డ్రగ్ ట్రాఫికింగ్... ఏదైనా చేయాలి. వీడు ఎవడో కాకపోవచ్చు... మీవాడి ఫ్రెండు, లేదా... స్టూడెంట్స్ అనగానే మార్కులు గుర్తుకు రావాలి. కాని ఇవాళ నేరాలు గుర్తుకొస్తున్నాయి.గతంలో పుస్తకాలు లేవనో పెన్నులు లేవనో బాధ పడేవారు. ఇవాళ పర్సుల్లో పెద్ద పెద్ద అమౌంట్లు లేవని ఫీలై, డబ్బు కోసం నేరాలకు పాల్పడుతు న్నారు. ఇటీవలే ఢిల్లీలో మాస్ కమ్యూని కేషన్స్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్లు చేసిన నేరం... పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేయడం. ఎందుకు చేశారు అనడిగితే జవాబు: అవసరాల కోసం. కాని ఇవి అవసరాలు కావు... విలాసాలు. ఈ జాడ్యం ఢిల్లీ, ముంబై వంటి పాత మెట్రోలకే కాక హైదరాబాద్ వంటి కొత్త మెట్రోలకు కూడా వ్యాపిస్తోంది. ఇటీవలే ఐదుగురు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఓ కొత్త ఇన్నోవా కారు దొంగలించి, పోలీసులకు పట్టుబడ్డారు. సూర్యతేజ (పేరుమార్చాం) అనే ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ వేరొకరి డెబిట్ కార్డ్ దొంగిలించి రూ.15 వేల రూపాయలకు పైగా బ్రాండెడ్ దుస్తులు కొనుగోలు చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్న యువతిని బెదిరించి ఆమె వద్ద డబ్బులు, నగలు లాక్కొని పారిపోయిన యువకుడు కూడా ఇంజనీరింగ్ స్టూడెంటే. 24 గంటల్లో పట్టుబడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఈ నేరాల్లో పాల్గొన్న విద్యార్థుల ముఖాలు చూడటానికి కూడా తల్లిదండ్రులు ఇష్టపడ ట్లేదు. వాళ్లను కాపాడటానికి ప్రయత్నించడం లేదు. కష్టపడి డబ్బు సంపాదించి చదువుకోవడానికి పంపిస్తే తమ సంతానం చేస్తున్న పని ఇదా అని వాళ్లు తీవ్రంగా మనస్తాపం చెందుతున్నారు. తలిదండ్రులకు తలవంపులు తెచ్చే ఇలాంటి పనులు పిల్లలు ఎందుకు ఎంచుకుంటున్నట్టు?! దొంగతనం చేస్తే దొరికిపోతాం అని భయం లేదా? భవిష్యత్తు గురించి ఆందోళన లేదా? కొత్త కొత్త గ్యాడ్జెట్స్, బైక్స్, పబ్స్, బ్రాండెడ్ దుస్తులు... అవి ఇవి అని లేకుండా సహజంగానే యుక్తవయసులో కలిగే ఎన్నో రకాల ఆకర్షణలను నేటి యువత తప్పించుకోలేకపోతోందా?! ఈ వయసులో కలిగే ‘టెంప్టేషన్స్’ను యూత్ ఎలా డీల్ చేయాలి?! పేపర్‌బాయ్‌గా పనిచేస్తూ చదువుకుని గొప్ప సైంటిస్ట్ ఆ తర్వాత రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలామ్ ఒక ఉదాహరణ గా ఉన్నారు. పదహారేళ్ల వయసులో డెహరాడూన్ నుంచి ఢిల్లీకి వచ్చి తల్లిదండ్రుల పాకెట్ మనీని కూడా నిరాకరించి మొదట మోడల్‌గా ఇవాళ జాతీయ ఉత్తమనటిగా ఎదిగిన కంగనా రనౌత్ వంటి ఈతరం విజేతలు ఉన్నారు. అలాంటివారి గురించి తెలుసుకునే అవకాశం, వారి మార్గంలో పయనించాలనే సంకల్పం నేటి యువతకు లేకుండా పోతోంది. కొండలనైనా పిండిచేయగల సత్తువ యువతకు మాత్రమే ఉందని చెప్పిన స్వామి వివేకానంద వీరికి కేవలం నాలుగు రోడ్ల కూడళ్లలో కనిపించే విగ్రహం మాత్రమే. షార్ట్కట్స్పై మోజు... ఈ ధోరణికి కారణం ఏమిటనే దానికి మానసిక నిపుణులు ఇలా చెబుతున్నారు: ‘కోరికలు కలిగినప్పుడు కొందరు కన్స్ట్రక్టివ్, మరికొందరు డిస్ట్రక్టివ్ యాక్షన్‌లోకి వెళతారు. కన్స్ట్రక్టివ్ యాక్షన్‌లోకి వెళ్లినవారు ఏదో ఒక పని చేసి సంపాదిస్తారు. తమ బర్త్‌డేకి అమ్మానాన్నలు చేసే ఖర్చు తగ్గించి, దాంట్లో నుంచి కావల్సినవి కొనుక్కోవాలనుకుంటారు. డిస్ట్రక్టివ్ యాక్షన్‌లోకి వెళ్లినవారు అడ్డదారులు ఎంచుకుంటారు. ముఖ్యంగా దొంగతనాలు చేస్తారు. ఈ ప్రవృత్తి హైస్కూల్ నుంచి మొదలై, అలవాటుగా మారి తప్పు చేయడం తప్పు కాదు అనే దశకు చేరిపోతుంది’... కుళ్లిన మామిడిపండు... మామిడిపండ్లలో ఒక కుళ్లిన మామిడిపండు ఉంటే మిగతా పండ్లు కూడా త్వరగా కుళ్లిపోతాయి. యువతలో కొంతమందికి రోజూ కొత్తగా ఉండాలి. కొత్త వస్తువుల వాడకంలోనే కాదు ‘కిక్’ ఇచ్చే అంశాల్లోనూ తలదూర్చుతారు. ‘రిస్క్’ ఉందని తెలిసినా దొంగతనం చేయడంలో మజా అనుభవిద్దాం అని కూడా ఆలోచిస్తారు. గ్రూప్‌లో ఒకరి ఈ ‘కిక్’ మిగతా వారినీ నేరస్తులుగా మార్చుతుంది. కనుక ఈ వయసులో స్నేహితుల ప్రలోభాలకు, ప్రభావాలకు లోనుకాకుండా జాగ్రత్తవహించాలి. ఆకర్షణలను మేనేజ్ చేయడం సాధ్యమే... ♦ ఏదైనా కావాలనే ‘కోరిక’ కలగగానే ‘భవిష్యత్తులో తీసుకుంటాను’ అని వాయిదా వేస్తూ మనసుకు నచ్చచెప్పాలి. అవి.. ఫోన్, బైక్, ప్రేమలు.. ఏవైనా సరే! ♦ ‘కోరిక’ అనేది పెద్ద గీత అనుకుంటే దాని పక్కనే ‘కాంప్రమైజ్’ అనే మరో పెద్ద గీతను గీసుకోగలిగితే ఆకర్షణ శక్తి సన్నగిల్లుతుంది. ♦ ‘హాబీస్’ వైపు దృష్టి పెడితే ఆకర్షణల శాతం తగ్గుతుంది. వివేకం అనే పడవ మన దగ్గర ఉంటే ఆకర్షణల సముద్రం ఎంత పెద్దదైనా సులువుగా ఒడ్డును చేరగలం. విజేతలుగా నిలవగలం. - నిర్మలారెడ్డి ఇలాంటి పక్కింటి కుర్రాడైతే భేష్! ఇంట్లో ట్యూబ్ లైట్ వెలుతురు కూడా కరువే. చిన్న బల్బులోనే చదువుకోవాలి. అలాంటి పేదరికంలో పుట్టిన నారు వెంకటరామిరెడ్డి ఐసెట్‌లో 153 మార్కులతో రాష్ట్రస్థాయిలో 7వ ర్యాంక్ సాధించాడు. తల్లి వెంకటసుబ్బమ్మ వ్యవసాయపనులకు వెళుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. తండ్రి పెరాలసిస్‌తో పదేళ్లుగా ఇంటిపట్టునే ఉంటున్నాడు. రూ.350ల అద్దె చెల్లిస్తూ ప్రొద్దుటూరు సమీపాన కొర్రపాడు గ్రామంలో నివసిస్తున్న ఈ ఐసెట్ ర్యాంకర్ కూడా ఎన్నో ఆకర్షణల నడుమనే ఉన్నాడు. ఆకర్షణలకు ఆకర్షితుడవకుండా చదువులో రాణిస్తూ భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుకుంటున్నాడు. ‘అలా మనమెందుకు కాలేకపోతున్నాం...’ అనే ప్రశ్న ప్రతి విద్యార్థి తమకు తాము వేసుకోవాలి. దృష్టి మళ్లించుకుంటాను మాది వ్యవసాయ కుటుంబం. ఇంటి పరిస్థితులు ఏంటో నాకు తెలుసు. అందుకే పెద్ద కోరికల జాబితా పెట్టుకోను. మా స్నేహితులకు మంచి మంచి ఫోన్లు, బైక్స్ ఉన్నా.. అవి నాకు లేవే అని బాధపడను. అలాగని వాటికి మరీ దూరంగా ఉండను. ఫోన్లో ఖరీదు తక్కువ ఉన్నది చూసి ఇంట్లో చెబుతాను. నా అవసరాన్ని బట్టి కొనిస్తారు. బైక్ మాత్రం ఇప్పుడే అడగను. ఇంకో ఏడాదిలో చదువు పూర్తయితే, ఉద్యోగం చేసి కొనుక్కుంటాను. ఎంతైనా నా సంపాదనతో కొనుక్కున్న బైక్ అంటే ఆ మజాయే వేరు కదా! - శ్రీనివాస్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ పునాది స్కూల్లోనే! 7వ తరగతిలోనే స్మార్ట్ ఫోన్లు, 10వ తరగతిలోనే బైక్‌లు... ఏ వస్తువు ఏ వయసులో ఉపయోగించాలి అనేదానికి ఈ రోజుల్లో ఒక రూల్ లేదు. పెద్దలు కూడా పిల్లలకు కావల్సినవి కొనివ్వడమే ‘పేరెంటింగ్’ అని అనుకుంటున్నారు. వందలో పదిశాతం మంది పిల్లలు కొత్త వస్తువులను ఉపయోగిస్తూ ఆనందించడం స్కూల్లో మిగతా పిల్లలందరినీ ఆలోచనలో పడేస్తుంది. ఈ ఆలోచనే అడ్డదారిలో ఆనందాలను వెతుక్కునేలా ప్రేరేపిస్తుంది. - బండారు విశ్వరూపిణి ఇంగ్లిష్ టీచర్, విశాఖపట్టణం నల్లకుక్క-తెల్లకుక్క ప్రతి మనిషిలోనూ ఒక నల్లకుక్క, ఒక తెల్లకుక్క ఉంటాయి. ఒకటి చెడు. ఒకటి మంచి. మనం దేనికి తిండి పెడితే అదే గెలుస్తుంది. ఏదైనా ‘కావాలి’ అనే కోరిక కలిగినప్పుడు ‘ఇంకొన్నాళ్లు’ అని మనసుకు చెబుతూ వాయిదా వేసుకోవాలి. షార్ట్ కట్స్ వల్ల నష్టాలే ఎక్కువ అని సమాజంలో జరుగుతున్న కేస్‌స్టడీస్ చూసి తెలుసుకోవాలి. కష్టపడి సాధించుకున్న వాటిని పొందినప్పుడు కలిగే ఆనందం షార్ట్‌కట్‌లో సాధించినదానికంటే ఎక్కువని తెలుసుకోవాలి. - డా. గీతా చల్లా, సైకాలజిస్ట్ క్రీడలు టెంప్టేషన్స్‌ను తగ్గిస్తాయి నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే వాటిమీదే ఎక్కువ దృష్టి పెడతాను. స్పోర్ట్స్ వల్లే ఇంటర్నెట్, ఫోన్లలో గేమ్స్ ఆడాలనీ అనిపించదు. ఫోన్ కావాలనీ ఉండదు. ఇంట్లో టీవీ కూడా ఎవరమూ చూడం. ఉదయం, సాయంత్రం ప్రాక్టీస్‌కి వెళ్లిపోతాను. మధ్యలో చదువు. తమ్ముడితో ఆడుకోవడం.. అస్సలు టైమే ఉండదు. ఎప్పుడైనా సినిమాలు కూడా స్ఫూర్తిదాయకమైనవి అయితేనే చూస్తాను. అమ్మానాన్నా మా ఎదుగుదల కోసం ఎంతో కష్టపడుతున్నారు. అందుకే ఇంకాస్త కష్టపడి వారిని ఇంకా ఆనందపరచాలని ఉంటుంది. - నైనా జైస్వాల్, ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ పెద్ద లక్ష్యం అవసరం... ఒక పెద్ద ఎయిమ్ పెట్టుకున్నప్పుడు ఏ అట్రాక్షన్ ఏమీ చేయదు. నేను ఉన్నది సినీరంగంలో. ఎంతోమంది పెద్దవాళ్లను కలుస్తుంటాను. నేనూ వారంత ఎదగాలి... అని నా గోల్. చిన్న చిన్న లక్ష్యాలు కాకుండా చాలా పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడు దాన్ని రీచ్ అవడానికి బాధ్యతగా కూడా నడుచుకుంటాం. మన ఎదుగుదల పదిమందికి ఆదర్శంగా ఉంటూ, అందరూ కీర్తిస్తుంటే అన్ని ఆనందాలు అందులోనే పొందుతాం. అందుకే, నా చుట్టూ ఎన్ని ఆకర్షణలు ఉన్నా వాటికి లొంగిపోను. - నాగశౌర్య,సినీ నటుడు -
కూతురు పరాయిదా?
ఒక మొక్కను తీసి మరో చోట నాటిన తోటమాలి దాని బతుకేదో అది బతుకుతుందిలే అని వదిలేస్తాడా?! ఒకటికి వెయ్యిసార్లు సరి చూస్తాడు. వేర్లకు నీళ్లు ఎంత అందాలో చూసి చూసి జాగ్రత్తపడతాడు. ఆ మొక్క కొత్త ప్రదేశంలో నాటుకునేంతవరకు రక్షణగా ఉంటాడు. మరి, ఇరవై ఏళ్లకు పైగా మన ఇంట పెరిగిన ఆడపిల్లను ఓ ఇంటికిస్తే తల్లిదండ్రులుగా మనం ఎంత జాగ్రత్త పడాలి? మెట్టినింటిలో ఇమడక పుట్టినింటిలో గడవక ఒక అమ్మాయి మరణానికి గురైన ఒక కథ... ముందే కష్టం పసిగట్టి తల్లిదండ్రుల భరోసాతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన మరో కూతురి కథ... పెళ్లి చేసి పంపించేసినా... మన కూతురిని మనం ఓ కంటకనిపెట్టి ఉండటం చాలా అవసరం. అది మన బిడ్డకు భరోసా ఇవ్వడమే కాకుండా ఎలాంటి అఘాయిత్యమూ జరగకుండా కాపాడుతుంది. మన బిడ్డకు కూడా ఇలా అనిపించవచ్చు. ఎప్పుడెప్పుడు కన్నవారిని చూస్తానా, అని వేగిరపడుతూ పుట్టింటి గుమ్మంలో అడుగుపెట్టింది పూర్ణ. అమ్మ ఎదురొచ్చి ‘బాగున్నావా పూర్ణా!’ అంటూ చేతిలో బ్యాగ్ అందుకుంది. మర్యాదతో కూడిన ఆ ఆహ్వానం ఏదో కొత్తగా అనిపించింది. చూడగానే అల్లుకుపోయే తోబుట్టువు‘హాయ్ అక్కా!’ అంటూ అమ్మ పక్కన చేరింది. ఆ ‘దూరమే’దో కొత్తగా ఉంది. ‘ప్రయాణం బాగా జరిగిందా?!’ అని అడిగిన నాన్న ప్రశ్నలో ‘ఏ ఉపద్రవమూ లేదు కదా!’ అనే ధ్వని కొత్తగా వినిపించింది. అమ్మ, నాన్న, చెల్లి... ఇరవై ఏళ్లుగా వీళ్లతోనే... వీళ్లమధ్యే పెరిగాను కదా! మధ్యలో కొన్ని రోజులు... పెళ్లి పేరుతో అత్తవారింటికి వెళ్లొచ్చాను. అంతలోనే ఇంత మార్పేమిటి?! వీరి మధ్య ఈ ‘హుందాతనం’ కొత్తగా ఎప్పుడు చేరింది?! పరాయి ఇంటికి వచ్చినట్టుగా... ఒక్కసారిగా ప్రయాణ అలసట రెట్టింపైనట్టుగా ఉందేమిటి?! ‘గుమ్మంలోనే నిలబెట్టారేంటి?’ అంటూ అమ్మ లోపలికి దారితీసింది. ఆమెతో పాటూ అందరూ... స్నానానికి బయల్దేరుతూ తన షెల్ఫ్ వైపు వెళితే... అక్కడన్నీ చెల్లి బట్టలే! తన పాత బట్టలు పనివాళ్లు అడిగితే ఇచ్చేసిందట అమ్మ, ఇక వాటి అవసరం ఏముందని... నోటి వెంట వచ్చిన నిట్టూర్పు.. చాలా చాలా కొత్తగా ఉంది. వెంట తెచ్చుకున్న సూట్‌కేస్ తెరవక తప్పలేదు. బయటకు వస్తూనే వంటకాల ఘుమఘుమలు పాత ఆకలిని కొత్తగా నిద్రలేపాయి. ఒక్క కూర అదనంగా చేయమంటే ‘అప్పులు చేయాల్సిందే’ అని క్లాస్ పీకే అమ్మేనా ఇన్ని వంటలు చేసింది. అంటే, నేను ఈ ఇంటికి అతిథినా?! ఈ సందేహం కొత్తగా ఉంది. అమ్మ-నాన్నలు చూపులతోనే మాట్లాడుకునే మాటలు మరీ కొత్తగా ఉన్నాయి. రెండు రోజులైనా కాకముందే ‘ఎప్పుడెళుతున్నావమ్మా!’ అని అమ్మ అడిగిన మాటలు కొత్తగా ఉన్నాయి. ఈ దూరాన్ని ఎలా చెరిపేయడం?! జీవితకాల వేదనను ఎక్కడ దించడం?! అప్పగింతల వేళ కన్నకూతురి చేతులను పాలలో ముంచి అత్తింటికి అందించే అమ్మానాన్న ఆలోచన చేయాల్సింది ఇక్కడే. పాలలాంటి మనసున్న తమ బిడ్డ బాగోగులను కడదాకా తామూ ఓ కంట కనిపెడుతూనే ఉంటామనే ‘హెచ్చరిక’ను అత్తింటికి అరణం ఇవ్వాలి. ‘మేం ఎప్పుడూ నీ వెన్నంటే ఉంటాం’ అని పుట్టింటి నుంచే భరోసాను అమ్మాయికి ఇవ్వాలి. వెళ్లబోతున్న కొత్త ప్రదేశంలో ఒంటరిగా వేళ్లూనేకునేందుకు కావల్సిన శక్తి కోసం ఆమె వెన్నంటే ఉండాలి.ఆడపిల్ల వచ్చీపోయే అతిథిగా కాదు. పుట్టినింటి వెలుగు. మెట్టినింటి కాంతి. ఇరు కుటుంబాలకూ ప్రేమను పంచే హృదయవారధి. మన హృదయాలను విశాలం చేసుకుంటే అంతటా సంతోషాల సుమాలు విరుస్తాయి. - నిర్మలారెడ్డి యధార్థ కథ:1 ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు నా కూతురు... మా అమ్మాయి లాస్యప్రియ. పెళ్లై ఏడాది గడవకముందే మా నుంచి దూరమైంది. అత్తింటి వారు హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారు. చిన్ననాటి నుండి అందరిలోనూ చాలా ధైర్యస్తురాలు అని పేరు తెచ్చుకుంది. చదువులో చురుకుగా ఉండేది. ఎంబీఏ చేసి, ఉద్యోగం సంపాదించుకుంది. తను ఇష్టపడ్డ వ్యక్తితోనే ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేశాం. అబ్బాయికి సరైన ఉద్యోగం లేకపోయినా ఉన్నట్టుగా, ఆస్తిపాస్తులు భారీగా ఉన్నట్టు నమ్మించి పెళ్లి చేసుకున్నారు. కట్నం రూపంలో ఐదు లక్షల రూపాయల నగదు, కానుకలు అందజేశాం. ఈ నెల 2న మా అబ్బాయి పెళ్లి జరిగింది. ఆడపడుచుగా పది రోజుల ముందుగానే రమ్మని చెప్పాం. కానీ, అత్తింటివారు అన్న పెళ్లికి ఒక్క రోజు ముందు పంపించారు. పెళ్లి కాగానే ఇంకా లాంఛనాలు పూర్తి కాకముందే లాస్య అత్తింటి వారు వెళ్లిపోయారు. లాస్యనూ రమ్మని ఒత్తిడి చేశారు. కానీ, తను ఓ నాలుగు రోజులు ఉండి వస్తానని చెప్పింది. వాళ్లు వెళ్లిపోయి.. షిర్డీ వెళ్తున్నామని, టికెట్ బుక్‌చేశామని అర్జెంట్ రమ్మని ఫోన్ చేయడంతో తప్పక ఈ నెల 5న వెళ్లింది. అత్తింటికి వెళ్లిన తరువాత ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందని చెప్పారట. మరుసటి రోజు రాత్రి లాస్య ఆత్మహత్య చేసుకుందని, మాకు మధ్యాహ్నం చెప్పారు. కానీ, అది నిజం కాదు. అదే రోజు రాత్రి గొడవ జరిగి, చంపి ఉరి వేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించారు. లాస్య అత్త బంగారు నగలు ఇమ్మంటోందని, భర్త కూడా అందుకు వత్తాసు పలుకుతున్నాడని తన స్నేహితురాలితో చెబుతూ ఉండేదట. పెళ్లయినప్పటి నుంచే అదనపు కట్నం కోసం వేధించేవారని తెలిసింది. ఈ విషయాలు మా లాస్య చనిపోయిన తర్వాతే మాకు తెలిసింది. మేం బాధపడతామని ఏనాడూ నా బిడ్డ ఈ విషయాన్ని మాకు తెలియనివ్వలేదు. అంత కష్టాన్ని గుండెలో పెట్టుకొని ఎలా తిరిగిందో... ముందే ఈ విషయాలు తెలిసి ఉంటే బంగారం పోయినా, బంగారం లాంటి నా బిడ్డను పోగొట్టుకునేదాన్ని కాదు. ఇన్నేళ్లు పెంచి, పెద్ద చేసి గౌరవంగా పెళ్లి చేసి పంపితే రాక్షసులు నా కూతురును పొట్టన పెట్టుకున్నారు. వారికి సరైన శిక్షపడాలి. - మోహిని (లాస్యప్రియ తల్లి ) యధార్థ కథ:2 భరోసా ఇస్తే.. ఈ కూతురు కథ అవుతుంది... కొత్తజీవితం అవుతుంది... పెళ్లై రెండేళ్లు అయ్యింది. ఇంకా పిల్లలు పుట్టడం లేదని, పైగా కట్నం తక్కువ తెచ్చానని అత్తింటిలో రోజూ పోరు ఉండేది. ఏదో రూపంలో ఇంట్లో అందరూ తమ విసుగును చూపించేవారు. నా భర్తా తల్లిదండ్రుల మాటలే వినేవాడు. ప్రతి చిన్న విషయానికీ నాపై చేయి చేసుకునేవాడు. కొన్నాళ్లు పుట్టింట్లో చెప్పలేదు అమ్మానాన్న బాధపడతారని. కానీ, భరించలేక అమ్మనాన్నలకు ఈ విషయం చెప్పాను. ఇప్పుడు ఏడాదిగా పుట్టింట్లోనే ఉంటున్నా! ఉన్న ఊళ్లోనే చిన్న ఉద్యోగం చూసుకొని నా బతుకు నేను బతుకుతున్నా. - బబిత (అభ్యర్థన మేరకు పేరు మార్చాం), తూర్పుగోదావరి సమస్యను ఎదుర్కొనే సాయం తప్పనిసరి... ‘అమ్మాయిని చదివించాం, ఉద్యోగం చేస్తోంది. తనకు అన్నీ తెలుసు. తనే పరిష్కరించుకోగలదు అనే అభిప్రాయాన్ని తల్లిదండ్రుల మార్చుకోవాలి. ధైర్యంగా ఉండటం వేరు. సమస్యను ఎదుర్కోవడం వేరు. పెళ్లికి ముందు జీవితం వేరు, పెళ్లి తర్వాత జీవితం వేరు. మంచి సంబంధం అని భారీగా ఖర్చు పెట్టి పెళ్ళి చేయడం కాదు, ముందుగానే అమ్మాయికి మ్యారేజ్ కౌన్సెలింగ్ ఇవ్వాలి. అత్తింటి వారికి అమ్మాయి గురించి అన్ని జాగ్రత్తలు చెప్పాలి. నీకేం భయం లేదు మేం ఉన్నామనే ధైర్యాన్ని అమ్మాయి పుట్టినింటివారు ఇవ్వాలి. అలాగని, అమ్మాయిలు ప్రతి చిన్న విషయాన్నీ పుట్టింటిలో చెప్పాలని కాదు. తట్టుకోలేనంత సమస్య వచ్చినప్పుడు అఘాయిత్యాలు చేసుకోకుండా దానిని ఎదుర్కోవడానికి పుట్టింటి సాయం తప్పనిసరిగా తీసుకోవాలి. - సి. వాణీమూర్తి, ఫ్యామిలీ కౌన్సెలర్ -
పెంచుకున్న ప్రేమను పంచిపెట్టిన అమ్మ
కన్నీటితో కూడా చెట్టుకు ప్రాణం పోయొచ్చు అనుకున్నది ఈ అమ్మ. సేవను మాటల్లోకన్నా చేతల్లోనే చూపించాలనుకుంది ఈ అమ్మ. దండ వేసి పరిమళాల్ని తనకే పరిమితం చేయకూడదనుకుంది ఈ అమ్మ. దీపం పెట్టి ఆ వెలుగుని తన ఇంటి గోడల్లోనే బంధించకూడదనుకుంది ఈ అమ్మ. కొడుకైనా సరే మట్టిపాలు చేయకూడదని... వాడి ఉనికి బూడిదలో పోసిన పన్నీరు కాకూడదని...పెంచుకున్న మమకారాన్ని పంచిపెట్టింది ఈ అమ్మ. ‘‘నా ఆయుష్షు 60 ఏళ్లే. కానీ నా కొడుకు ఆయుష్షు 480 ఏళ్లు’’ అని చెప్పారు రత్నమాల. కొడుకు గొప్పతనాన్ని తెలియజేస్తుంటే ఆమె కంఠం జీరబోయింది. కనుకొలుకుల్లో నీరు నిలిచింది. ఎనిమిది మందికి పునర్జన్మను తన కొడుకు ప్రతీన్ కుమార్ ద్వారా ఇచ్చిన రత్నమాల వరంగల్ జిల్లా వాసి. రత్నమాల భర్త ఏడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఇద్దరు పిల్లల పెంపకం కోసం తను ఓ చిన్న ఉద్యోగంలో చేరింది. పిల్లలే లోకంగా బతికింది. వారిని చదివించింది. ‘నాన్నలేడని బాధపడకమ్మా! నిన్నూ, చెల్లిని బాగా చూసుకుంటాను’ అని చెప్పిన కొడుకు అర్ధంతరంగా దూరమయ్యాడు. సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పిన వాడు మరణాన్నే తన కానుకగా ఇచ్చాడు. ‘వస్తానమ్మా’ అని చెప్పాడు... కొడుకు బి.టెక్, కూతురు బి.డి.ఎస్ చదువుతున్నారు. ఇంకో ఏడాది కష్టపడితే చాలు బిడ్డలిద్దరూ ఉద్యోగాల్లో స్థిరపడతారు అనుకుంది. కానీ, దేవుడు మరొకటి తలచాడు. కిందటేడాది నవంబర్ 25న స్నేహితున్ని కలవడానికని వెళ్లిన ప్రతీన్ అర్థరాత్రి ఫోన్ చేసి అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ‘ఇంకా మేల్కొనే ఉన్నావా, ఇంటికి ఎప్పుడు వస్తున్నావ్’ అని అడిగితే ‘నీకు విషెష్ చెప్పడానికే మేల్కొన్నాను. ఇప్పుడు పడుకుంటానమ్మా! ఈ రోజు ఫ్రెండ్ ఇంట్లోనే ఉంటున్నాగా. రేపు పొద్దున్నే వచ్చేస్తాను. నీకో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను..’ అన్నాడు. ‘నీకన్నా నాకు గిఫ్ట్‌లు ఏముంటాయిరా’ అంటే ‘థాంక్యూ అమ్మా’ అంటూ ఫోన్లో అమ్మకు ముద్దిచ్చాడు. ఆమె నవ్వుతూనే గుడ్‌నైట్ చెప్పి ఫోన్ పెట్టేసింది. సర్ప్రైజ్ ఇస్తానన్నాడు... ఉదయాన్నే రత్నమాలకు ఫోన్ వచ్చింది ‘మీ అబ్బాయికి రోడ్డు ప్రమాదం జరిగింద’ని. హతాశురాలైంది రత్నమాల. ఉన్నఫళాన ఆసుపత్రికి చేరుకుంది. అయ్యప్పదుస్తుల్లో రక్తసిక్తమైన ప్రతీన్. మాట మాత్రమైనా చెప్పకుండా మాల వేసుకున్నాడు. ‘‘పై చదువులకు అమెరికా వెళ్లడానికి పరీక్షకు సిద్ధపడుతున్నాడు. కుదురుగా కూర్చోని చదవడానికి దీక్ష అవసరం అనేవాడు. తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్న దైవభక్తి, చదువుకు ఎక్కడా ఆటంకం కలగకూడదని తీసుకున్న నిర్ణయమ’’దని తర్వాత తెలిసింది. ఏమీ మాట్లాడలేని స్థితి నాది. ప్రతీన్‌ను పరీక్షించిన వైద్యులు వెంటనే హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రతీన్ బ్రెయిన్ డెడ్ అయ్యాడని చెప్పారు. పుట్టిన రోజుకు తన మరణాన్ని సర్ప్రైజ్ గిఫ్ట్‌గా ఇస్తాడని ఊహించని నా ... జీవితంలో ఎన్ని ఒడిదొడుకులనైనా తట్టుకోవచ్చు. కానీ, కన్నబిడ్డను కోల్పోవడం అంటేనే...’’ వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ వివరించారు రత్నమాల. సేవే పరమావధిగా.... నలుగురికి సాయపడటం అంటే ఎప్పుడూ ముందుండే ప్రతీన్ తల్లి పుట్టిన రోజున తప్పక రక్తదానం చేసేవాడు. తన స్నేహితులచేతనూ రక్తదానం చేయించేవాడు. ‘‘23 ఏళ్ల కొడుకు... ఎంతో జీవితం చూడాల్సిన వాడు. అంతలోనే కనుమరుగైపోతున్నాడు. ఎంతో ఆపురూపంగా ఈ చేతులతో పెంచుకున్నాను. అలాంటిది, ఆ శరీరాన్ని నిప్పు పాల్జేయ్యాలా, మట్టిలో కలిపేయాలా.. ఆ ఆలోచన నన్ను కుదురుగా ఉండనివ్వలేదు. వాడు ఈ లోకంలో బతికే ఉండాలి... అందుకే అక్కడి వైద్యులతో మాట్లాడాను. నా కొడుకు అవయవాలు మరొకరికి ఉపయోగపడితే వాడి సేవా నిరతికి ఓ అర్థం చేకూరుతుందని చెప్పాను. అంగీకార పత్రాలతోపాటు అన్ని ఏర్పాట్లూ సిద్ధమయ్యాయి. గుండె, కాలేయం, కళ్లు.... ఇలా ఎనిమిది అవయవాలు మరో ఎనిమిది మంది చావుబతుకులతో పోరాడుతున్నవారికి కొత్త జన్మను ఇచ్చాయి. వారెవరో నాకు తెలియదు. కానీ, నా కొడుకు ఎనిమిది అవతారాలు దాల్చి ఈ ప్రపంచంలో ఇప్పటికీ ఉన్నాడు. ఒక్క జన్మలోనే 8 జన్మలు... అంటే 480 ఏళ్లు అన్నట్టే కదా! గతంలో నేను ఇద్దరు బిడ్డలకు తల్లిని మాత్రమే. ఇప్పుడు మరో ఎనిమిది మందికీ తల్లినయ్యాను. వారెక్కడ ఉన్నా నన్నూ, నా కొడుకును తలుచుకుంటూనే ఉంటారు’’ అంటూ ఉబికివస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ చెప్పారు రత్నమాల. అమ్మ గొప్పతనాన్ని, ఆమె త్యాగనిరతిని చాటి చెప్పాలని మళ్ళీ మళ్లీ ఆమె కడుపున పుడుతూనే ఉన్నాడు దేవుడు. ఒక బిడ్డగా ఆమెకు పుట్టి, మనందరికి దారి చూపిస్తున్నాడు. ఆ దారిలో మనమూ వెళదాం. అవయవదానం అంగీకారపత్రంపై నేడే సంతకం చేద్దాం. - నిర్మలారెడ్డి ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ అవగాహనలో ముందంజ... ⇒ మొట్టమొదటి అవయవదానం (కార్నియల్ ట్రాన్స్‌ప్లాంట్) 1905లో జరిగింది. ⇒ ప్రపంచ దేశాల్లో అవయవదానం అవగాహనలో స్పెయిన్ ముందంజలో ఉంది. ఇక్కడ కోటికి 34 మంది అవయదాతలుగా ఉన్నారు. ⇒ అమెరికాలో కిందటేడాది 18 ఏళ్ల వయసున్న వారు 5,538 మంది అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు. ⇒ మనదేశంలో ప్రతియేటా 90 శాతం మంది అవయవదాతలు లేని కారణంగా మరణిస్తున్నారు. ⇒ మనదేశంలో 25,000 వేల మందికి కాలేయ మార్పిడి అవసరం ఉంటే ప్రస్తుతం 800 మందికే ఆ అవకాశం ఉంది. ⇒ మనదేశంలో అవయవదానం చేసేవారి జాబితాలో వరుసగా ముందు వరసలో తమిళనాడు ఉండగా ఐదో స్థానంలో తెలుగురాష్ట్రాలు ఉన్నాయి. ⇒ ఆర్థిక, అవగాహన లేమి కారణంగా భారత్, ఆఫ్రికాలు చివరిస్థానంలోఉన్నాయి. ⇒ ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం (2013) భారతదేశంలో కోటికి 10 మంది మాత్రమే అవయవదానం చేశారు. కానీ యేటా 5 లక్షల మంది అవయవలోపం కారణంగా మరణిస్తున్నారు. ప్రతి ఏడు సంవత్సరాలకు మన శరీరంలోని కణాలన్నీ కొత్తవిగా మారిపోయినంత మాత్రాన మన అస్థిత్వం ఒరిజినాలిటీ కోల్పోతుందా? ‘షిప్ ఆఫ్ థీసియస్’లో పాడైపోయిన చెక్కల్ని తొలగించి కొత్త చెక్కల్ని అమర్చినంతమాత్రాన దాని ఉనికి లేకుండా పోతుందా? అవయవదానం థీమ్‌తో ఆమిర్‌ఖాన్ భార్య కిరణ్‌రావు సమర్పించిన సినిమానే ‘షిప్ ఆఫ్ థీసియస్’. 2013లో ఈ సినిమా బ్రోచర్ విడుదల సందర్భంగా అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, దీపికపదుకొనె, షారూఖ్‌ఖాన్.. మొదలైన 15 మంది బాలీవుడ్ నటీ నటులు అవయవదానం పత్రాలపై తమ అంగీకారం తెలుపుతూ సంతకాలు చేశారు. అక్కినేని నాగార్జున, అక్కినేని అమల ఎయిడ్స్ అవగాహనకు భారీ ప్రచారం కల్పించారు. అదేవిధంగా అవయవదానం పట్ల అంగీకారాన్ని తెలుపుతూ పత్రాలపై సంతకం చేశారు. మరణానంతరం నా శరీరంలోని అవయవాలన్నీ దానం చేసేలా, ఇప్పటికే వాగ్దానపత్రంపై సంతకాలు చేశాను. అలాగే, మా ఇంట్లో అందరూ ఆర్గాన్ డొనేషన్ చేస్తూ, పత్రాలు రాసిచ్చారు. - త్రిష, నటి మోహన్‌ఫౌండేషన్ 10వ వార్షికోత్సవ సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న నేనూ అవయవదానం చేశాను. మానవత్వంగల ప్రతి ఒక్కరూ అవయవదానం తప్పనిసరిగా చేయాలి. - నవదీప్, నటుడు -
ఓణీ కట్టిన వసంతం
ప్రకృతి కొత్త చిగుళ్లు తొడుగుతోంది. పరిమళం పూత దిగుతోంది.రంగులు సింగారాలౌతున్నాయి. వయ్యారాలు విహంగాలౌతున్నాయి. ఏం జరుగుతోంది?!వసంతం లంగావోణీతో ముస్తాబవుతోంది. అయ్యో... మన్మథా... నిన్నిక మళ్లీ ఆ రతీదేవే రక్షించాలి. ‘‘ఈ ఉగాది నాదే కదా’’ అని భువికి దిగి వచ్చావా...గుండె గల్లంతే. అమ్మాయ్, నువ్వే కనికరం చూపాలి.చూపు తిప్పుకోనందుకు సార్‌ని.. చూసీ చూడనట్టు పోనివ్వాలి! - నిర్మలారెడ్డి ఇటీవలి కాలంలో అమ్మాయిలనే కాదు, అమ్మలనూ అందంగా అలంకరిస్తున్నాయి డిజైనర్ లంగా ఓణీలు. అంతముచ్చటగా ఉండటం వల్లనేనేమో అమ్మల వార్డ్‌రోబ్‌లోనూ లంగా ఓణీలు హుందాగా చేరిపోతున్నాయి. పెళ్లి, పేరంటమే కాదు ఏ చిన్న వేడుకైనా సందడి చేయడానికి రెడీ అంటున్నాయి. ఇక తెలుగింటి పండగలలైతే ఆధునిక వస్త్రరాశులన్నింటినీ పక్కకు నెట్టేసి మరీ ముందుకు వచ్చేశాయి లంగాఓణీలు. పాశ్చాత్య వస్త్రధారణ అంటేనే విసుగుపుట్టింది అనుకునే నిన్నమొన్నటి తరాలు నేటి సంప్రదాయ వస్త్ర వైభవానికి మెటికలు విరిచి మరీ మురిసిపోతున్నాయి. అందుకే ఈ ఉగాది వేళ పచ్చని గడపల్లో పువ్వుల్లా విరియడానికి సిద్ధం అంటున్నాయి లంగాఓణీలు. ప్రకృతితో పోటా పోటీ... కాంక్రీట్ జనారణ్యానికీ పచ్చని శోభను నింపడానికి పండగవేళ ముస్తాబు సరైన సమాధానం. ఉగాది ప్రకృతి పండగ.. అందుకే సప్తవర్ణాల సోయగాలను ముంగిట్లోకి తేవాలంటే కాంతిమంతమైన రంగులే సరైన ఆప్షన్. కాబట్టి పండగకు లంగాఓణీలను ఎంచుకునేటప్పుడు పసుపు, ఎరుపు, పచ్చ, మెరూన్... రంగులను దృష్టిలో పెట్టుకోవాలి. సంప్రదాయంగా ఉంటూనే ఆధునిక మగువ ఇష్టపడేలా ఆ డిజైన్స్ ఉండాలి. ఇందుకు లెహంగా, ఓణీల అంచుల డిజైన్లు ఆకట్టుకునేలా ఉండాలి. చర్మ రంగు కాస్త చామనఛాయగా ఉన్నా తెలుపురంగు దుస్తులు ధరించినప్పుడు మరింత నలుపుగా కనిపిస్తారు. అందుకని హాఫ్‌వైట్ లెహంగా ధరిస్తే, ముదురు రంగు ఓణీ, బ్లౌజ్ ఎంచుకోవాలి. ఒక వేళ గ్రాండ్‌గా ఎంబ్రాయిడరీ, స్టోన్, కుందన్, జరీ వర్క్ ఉన్న లెహంగా ఎంపిక చేసుకుంటే.. సింపుల్‌గా ఉండే చున్నీని ధరించాలి. మేలైన ఎంపిక.. డిజైనర్ లంగాఓణీలలో నేటి వరకు నెటెడ్ మెటీరియలే ప్రధానంగా ఉంటూ వస్తోంది. ఇప్పుడీ స్థానాన్ని బెనారస్, పట్టుతోపాటు ఉప్పాడ వంటి చేనేతలూ భర్తీ చేశాయి. మనదైన వైభవాన్ని తెలియజేస్తున్నాయి. కొన్నాళ్లు ఉత్తరాది గాగ్రాచోళీలు సందడి చేశాయి. ఇప్పుడు నిన్నటి తెలుగింటి కళ మళ్లీ కనువిందుచేసేలా షిఫాన్ ఓణీలు, పట్టు పరికిణీలదే పైచేయిగా ఉంటోంది. శరీరాకృతికి తగిన విధంగా... లంగా ఓణీ డిజైన్ చేసుకునేటప్పుడు ముందుగా క్లాత్, కలర్ కాంబినేషన్ చూసుకోవాలి. ఎంత ఖర్చు పెట్టగలమో లెక్కేసుకొని, దానికి తగిన మెటీరియల్‌ను ఎంచుకోవాలి. సన్నగా ఉన్నవారు నెటెడ్ లెహంగా కావాలనుకుంటే కింది భాగంలో (ఇన్నర్) ‘క్యాన్క్యాన్’ మెటీరియల్‌ను వేయాలి. దీని వల్ల కింది భాగం ఉబ్బెత్తుగా వస్తుంది. లంగా ఓణీపై డిజైన్ ఎక్కువగా ఉంటే జాకెట్టు సింపుల్‌గా ఉండాలి. లంగా వోణీల డిజైన్ సాధారణంగా ఉంటే జాకెట్టు పై వర్క్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. లావుగా ఉన్నవారు ఎక్కువ వర్క్ ఉన్నవి కాకుండా, సింపుల్‌గా ఉండే లంగాఓణీలను ఎంచుకోవాలి. -
పంచభూతాలతో... నేస్తమే... వాస్తు
కూడలి అవీ ఇవీ ‘‘పక్షులు ఆనందంగా జీవించడానికే ప్రకృతితో మమేకమై గూళ్లు కట్టుకుంటాయి, మరి మనిషెందుకు కాంక్రీట్ భవనాలనే నమ్ముకుని దుఃఖాన్ని కొనితెచ్చుకుంటున్నాడు? ’’ అని ప్రశ్నిస్తారు సుద్దాల సుధాకర్ తేజ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక వాస్తు సలహాదారుగా ఇటీవలే నియమితులైన సుధాకర్ తేజ... శ్రమ, ప్రకృతి... ఇవే నా వాస్తు విధానాలు అంటున్నారు. -నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఙ్ట్చఛగ్రామం, పట్టణం, భవనం, పరిశ్రమ.. ఇవన్నీ వాస్తు నియమానుసారం ఉండి తీరాలా? లేకపోతే అభివృద్ధి అసాధ్యమా? వాస్తు అంటే నివసించదగిన చోటు అని అర్థం. తినలేని తిండి అని ఆహారం గురించి ఎలా మాట్లాడుకుంటామో.. నివాసానికి యోగ్యం కాని ప్రాంతం, గృహం అని కూడా ఉంటాయి. ప్రభుత్వాధినేతలు చేసే ప్రతి ఆలోచన, తీసుకునే నిర్ణయాలు సాధారణ పౌరుడికి చేరాలంటే అతను కూర్చునే చోటు, ఉండే చోట తప్పక బాగుండాలి. నగరాలలో ఖాళీ స్థలం అనేదే ఉండదు. అలాంటప్పుడు వాస్తు నియమాలు ఎలా పాటించాలి? జబ్బు చేస్తే వైద్యుడు రోజూ ఆపిల్ తినమంటాడు. అయితే కూలివాడు తినేవి పచ్చడి మెతుకులు. శరీరానికి పేదరికంతో సంబంధం లేదు. ఆరోగ్యకరమైన జీవనానికి ఆరోగ్యకరమైన పదార్థాలు కావాల్సిందే! చేతకాదు అంటే అనారోగ్యం ఇంకా బాధిస్తూనే ఉంటుంది. ఇంత ఆధునిక సమాజంలో కూడా పట్టణాలకన్నా పల్లెలే మనిషిని లీడ్ చేస్తున్నాయి అంటే కారణం... అక్కడ ఆప్యాయమైన ప్రకృతి కౌగిలి ఉంది. అందుకే మనిషి వందంతస్తుల భవనం కట్టినా, చెట్టు కిందకు వెళ్లడానికి ఉత్సుకత చూపుతాడు. పల్లెజీవనంలోని ఆ మాధుర్యాన్ని పట్టణానికి మళ్లించమంటాను. కుదరదు అంటారు. ఎందుకు కుదరదు? ప్రకృతి ఇచ్చిన మన శరీరాన్ని ప్రకృతితోనే బాగుపరుచుకోవాలి కదా! కొన్ని గ్రామాలు పూర్తిగా నశించడం, కొన్ని గ్రామాలు ఎంతో అభివృద్ధిలో ఉండటం చూస్తాం.. ఇక్కడా వాస్తు వర్తిస్తుందా? ఎక్కడైనా సరే గాలి, వెలుతురు ధారాళంగా ఉండాలి. ఉత్తర దక్షిణ దిక్కులను బ్యాలెన్స్ చేస్తూ నిర్మాణాలు చేపట్టాలి. గ్రామం ఏర్పడినప్పుడు కొండకోనల మధ్యన ప్రాంతాన్ని ఎంచుకోవాలి. నైరుతిన చెరువు, ఈశాన్యం నుంచి వీచే గాలి.. ఇవన్నీ సరైన విధంగా అక్కడ నివసించే ప్రజానీకానికి అందుతూ ఉండాలి. అప్పుడే ఆ ప్రాంత ప్రగతి బాగుంటుంది. భూమి గుండ్రంగా తిరుగుతుంది కాబట్టి, దిశలు ఎలా ఉంటాయి అని ప్రశ్నిస్తుంటారు. మన ముక్కు ముందుకు వుంది. మనతో పాటు మన ముక్కు వేరే చోటుకు ఎందుకు మారడం లేదు? ఇక్కడ దిశ తిరగడం లేదు. భూమి తిరుగుతుంది. ఉత్తరం-దక్షిణం ఈ రెండింటిని బట్టే మిగతా దిక్కులను చూసుకోవాలి. నీలోపల చైతన్యం ఎలా ఉందో బయట కూడా అదే చైతన్యం ఉండాలి. వాస్తును విమర్శనాత్మకంగా చూడవలసిన అవసరం లేదా? వేదాలలోనే వాస్తుశాస్త్రం గురించిన వివరణ ఉంది అత్రి, జమదగ్ని... వంటి పద్దెనిమిది మంది మహర్షులు ఈ శాస్త్రంలో ఎంతో కృషి చేశారు. నేటి కన్నా నాడు అద్భుతమైన వాస్తును పాటించారు. కంపాస్ పుట్టని కాలంలోనే నిర్మాణాలలో అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించారు. నేటికీ చెక్కుచెదరని ఎన్నోనిర్మాణాలను పరిశీలిస్తే ఈ నిజాలు మనకు అవగతమవుతాయి. వాటి చిన్న అంశ పట్టుకొని నేడు మనం నడుస్తున్నాం. అయితే దానిని కూడా విమర్శనాత్మకంగా చూస్తున్నాం. త్రేతాయుగంలోనే ఏడంతస్తుల భవనాలు ఉన్నట్టుగా తెలుసుకున్నాం. అద్భుతమైన లంకానగరం, ద్వాపరయుగంలో లక్కాగృహం, మయ సభ... వంటి అద్భుత నిర్మాణాల గురించి విన్నాం కదా! వాస్తు తత్వం ఏమిటి? మనిషి ఎన్నో కలలు కంటాడు. మంచి చదువు, అపారమైన సంపద, అందమైన కుటుంబజీవనం.. ఇలా ఎన్నో కలలు. ఆ కలలన్నింటికీ ప్రకృతి సహాయం తప్పనిసరి. ప్రకృతిలో ఏముందో తెలుసుకోవడానికి బయల్దేరినవారు సైంటిస్టులు అయ్యారు. ప్రకృతి జన్మనిచ్చిన తనలో ఏముంది అని తెలుసుకునే ప్రయత్నం చేసినవారు మహర్షులు అయ్యారు. ఆ మహర్షులే ఈ వాస్తును తెలియజేశారు. దుఃఖం ఎవరికీ ఇష్టం లేదు. అందరికీ ఆనందం కావాలి. ఆనందంగా ఉండాలంటే ఉండే చోటు మనకు అనుకూలంగా ఉండాలి. అదే వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు వల్ల ప్రయోజనం ఏమిటి? పది సంవత్సరాల వయసులో ఆడుకోలేనివాడు, ఇరవై ఏళ్ల వయసులో అందంగా లేనివాడు, నలభై ఏళ్ల వయసులో స్థిరపడనివాడు, యాభై ఏళ్ల వయసులో దానం చేయనివాడు, అరవై ఏళ్ల వయసులో సలహా ఇవ్వనివాడు శాపగ్రస్తుడనిపించుకుంటాడు. ప్రకృతి చట్ట ప్రకారం గృహనిర్మాణం చేసుకుంటే అలాంటి శాపాలనుంచి విముక్తి లభిస్తుంది. ఆనందం ప్రాప్తిస్తుంది. పేరును బట్టి ఫలానా దిక్కే కలిసొస్తుందనే మాటలో నిజముందా? శాస్త్రాన్ని వ్యాపారకోణంలో తీసుకున్నవారు రకరకాలుగా చెబుతున్నారు. ప్రకృతికి ఆ భేదాలు లేవు. దేవుడు భూమిని సృష్టించాడు. మనిషి పరిమితులు ఏర్పరుచుకున్నాడు. పంచభూతాలు అందరికీ సమానమే! నేల, గాలి, నీరు.. ప్రధానంగా చూసుకోవాలి. కానీ, పేరును బట్టి కాదు. భారతదేశ భౌగోళిక పరిస్థితులను బట్టే వాస్తు! కూర్చుంటే డబ్బులు వచ్చి పడవు. శ్రమ తప్పనిసరి. అయితే ఆ శ్రమకు ప్రకృతి దోహదం చేయాలంటాను. మన దగ్గర చైనీస్ వాస్తు కూడా బాగా ప్రభావం చూపుతోంది. ఆ ప్రాంత వాస్తు సిద్ధాంతాలు మనకూ ఉపకరిస్తాయా? సూర్యుని ఎండ ఇంటి ముంగిట్లో పడాలి. ఆ కాంతి ప్రసరణ ఇంటిలోపలికి రావాలి. అంతేగాని గోడకు ఓ రంగేసి, లైట్ పెడితే.. ప్రయోజనం ఏముంటుంది? అద్భుతమైన వాస్తుజ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే సృష్టిలోని ప్రాణికోటి జీవనాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ భారత, రామాయణాలు విరాజిల్లుతున్నాయి. ఎందుకు? అవి గుడిసెల్లోనుంచే అంటే ఆశ్రమాల్లో నుంచే పుట్టుకువచ్చాయి. మహా మేధావులు అనుకున్నవారంతా అరణ్యాల నుంచి వచ్చినవారే! ప్రపంచమనే పిండానికి భారతదేశం బొడ్డుతాడు. వీటన్నింటి వెనక ప్రకృతి ఒడి ఉంది. నవమాసాలు మోసి కనేది అమ్మ, తొంైభై తొమ్మిదేళ్లు మోసేది ప్రకృతి. అలాంటప్పుడు ఆ ప్రకృతిని వీడితే మనిషికి జీవితం ఉంటుందా? ఫొటోలు: జి.రాజేశ్ ప్రతి నిర్మాణానికీ ఓ హృదయం ఉంటుంది ఎన్నో నిర్మాణాలు చూశాను. పతనమైనవాటినీ, బాగున్నవాటినీ గమనించాను. ప్రతీ నిర్మాణానికి ఓ హృదయం ఉంటుందని తెలుసుకున్నాను. దాదాపు పాతికేళ్ల నా జీవనప్రయాణమే నాకు ఈ శాస్త్రం అబ్బడానికి ఉపకరించింది. ఇంకా ఉపకరిస్తూ వస్తోంది. నేడు చాలామంది వ్యాపారదృక్కోణంలో వాస్తును చూస్తున్నారే తప్ప ఈ శాస్త్రంలోని అద్భుతాలను తెలుసుకోలేకపోతున్నారు. మనకు కావల్సింది డబ్బులు కాదు.. జబ్బులు రాకుండా ఉండాలి. వాస్తు నిపుణుడు అలాంటి జ్ఞానాన్ని తనను నమ్ముకుని వచ్చినవారికి ఇవ్వాలే తప్ప గందరగోళానికి లోను చేయకూడదు. రుషుల రుణం కొంతైనా తీర్చుకోవాలంటే నాకు తెలిసిన జ్ఞానాన్ని కొంతమందికి పరిచయం చేయాలి. అందుకే వ్యక్తిగతంగా పరిశోధిస్తున్నాను. వాటిని వ్యాసాలుగా పొందుపరుస్తున్నాను. డబ్బు కోసం వ్యక్తిత్వాన్ని, విద్యను అమ్ముకోకూడదన్నది నా అభిమతం. మహర్షులు ప్రసాదించిన జ్ఞానం పదిమందికి ఉపయోగపడాలని నేను కోరుకుంటాను. వ్యాపారంలో పడ్డాక విలువలు ఉండవు. వాస్తు బాగోలేదని దేవుడి బొమ్మ పెట్టినంత మాత్రాన పరిస్థితులు బాగుపడవు. శాస్త్రాన్ని ఉపయోగించుకో... దాని వల్ల కలిగే ఆనందకరమైన ఫలితాన్ని అనుభవించు. ఇదే నేను చెప్పేది. -
వారి సంక్షేమమే ఊపిరిగా...
అవిశ్రాంతం : అరవై తర్వాత ఆయన పోలీస్ శాఖలో డిఎస్పీగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. నిరంతర కృషి, కార్యదీక్ష, దక్షతలతో అడిషనల్ ఎస్పీగా, డిఐజీగా... ఐజిగా ఎదిగి విధుల నుంచి విశ్రాంతి తీసుకున్నారు. అయితే ఈ విశ్రాంతి ఉద్యోగవిధులకే తప్ప, తాను చేస్తున్న పనులకు, సంక్షేమ కార్యక్రమాలకు కాదంటారాయన. ఎంత ఎదిగినా, తన మూలాలను మరువలేనని, బంజారాల సంక్షేమమే తన జీవిత ధ్యేయంగా కృషి చేస్తున్నానని వివరించారు. ఇప్పుడు ఆయన వయస్సు 74. ఉద్యోగం కన్నా విశ్రాంత జీవితం ఎన్నో పాఠాలను నేర్పిస్తుందంటున్న ఈ విశ్రాంత పోలీస్ ఉన్నతాధికారి కొర్రా జగన్నాథరావు ఇప్పుడు ఏమి చేస్తున్నారో ఆయన మాట ల్లోనే! ‘‘ఎప్పుడూ ఉరుకుల పరుగుల మీద ఉండే విధుల నుంచి ఒక్కసారిగా విశ్రాంతి లభించేసరికి ఉక్కిరిబిక్కిరియ్యాను. ఈ పరిస్థితిని అధిగమించడం కోసం నాకు బాగా తెలిసిన ఒక మల్టీనేషనల్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో నాలుగేళ్లు పనిచేశాను. ఏ పనికైనా త్వరగా అలవాటుపడిపోయే నా నైజంతో మెల్లగా విధులనుంచి సేవాకార్యక్రమాల వైపుగా దృష్టి కేంద్రీకరించాను. చెక్కుచెదరని జ్ఞాపకాలు... పోలీసు శాఖలో 1963లో డిఎస్పీగా మొదలైన నా ఉద్యోగ జీవితం ఎన్నో అనుభవాలను నేర్పింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా కాకినాడ, విశాఖ, శ్రీకాకుళం, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాలలో విధులు నిర్వర్తించాను. వాటన్నిటినీ తలుచుకుంటూ కాలక్షేపం చేస్తే ఈ రోజు ఇంత చురుగ్గా ఉండేవాడిని కాదు. పని అనేది వయసుకు కాదు, మనసుకు ఉండాలి. ఖాళీగా ఉన్నామంటే జీవితం ‘ఖాళీ’ అయిపోనట్టే. ఆరోగ్యమే ధీమా... వయసు పైబడుతున్నకొద్దీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కృషి చేయాలి. లేదంటే ఓ మూలన కూర్చోవాల్సిందే. అందుకే, ఉదయాన్నే మూడున్నరకల్లా మేల్కొంటాను. గంటసేపు వాకింగ్, గంటసేపు యోగ సాధన... ఆ తర్వాత అల్పాహారం చేసి 9:30 కల్లా జూబ్లీహిల్స్‌లో ఉన్న మా ఇంటి నుంచి నాంపల్లిలో ఉన్న బంజారా సేవా సమితి కార్యాలయానికి చేరుకుంటాను. సాయంత్రం వరకు అక్కడే గడుపుతాను! ఎందుకంటే ఎన్ని రిజర్వేషన్లు, మరెన్ని సంక్షేమ పథకాలు అందుబాటులోకి వచ్చినా బంజారా(లంబాడ)లు ఇంకా అట్టడుగుస్థాయిలోనే ఉన్నారు. ఆచార వ్యవరాలు గతి తప్పుతున్నాయి. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బంజారా సంస్కృతికి కొత్త ఊపిరి ఊదడానికి నా వంతుగా ఆలిండియా బంజారా సేవాసంఘ్, సేవాలాల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడి (తెలుగు రాష్ట్రాలలో)గా సేవలు అందిస్తున్నాను. అందులో భాగంగా బంజారా విద్యార్థుల చదువుల మీద చర్చించడం, వచ్చిన అర్జీలను పరిశీలించి, అర్హత గల వారికి స్కాలర్షిప్లు మంజూరుచేయడం, ప్రభుత్వ పథకాలు నిరుపేద బంజారాలకు అందించే ఏర్పాట్లు చూస్తుంటాను. ఏడాదికి ఒకసారి ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా జరిగే ‘సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల’ ఏర్పాట్లు పర్యవేక్షిస్తాను. నిరక్షరాస్యత కారణంగా బంజారాలలో చోటు చేసుకుంటున్న దుర్వ్యసనాలు, వరకట్నభయంతో ఆడపిల్లలను దూరం చేసుకోవడం వంటి సమస్యలను ప్రధానంగా తీసుకొని బంజారాల సంక్షేమానికి కృషి చేస్తున్నాను. విధుల్లో ఉన్నప్పుడు చేయలేని పనులను విశ్రాంత జీవనంలో చేయడానికి కావల్సినంత సమయం ఉంది. దానిని సద్వినియోగం చేయడానికే తపిస్తున్నాను’’ అని వివరించారు జగన్నాథరావు. - నిర్మలారెడ్డి ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
చార్మినార్‌కే.. కినారే
వందల ఏళ్ల నాటి చార్మినార్‌ను మనం ఒక వారసత్వ సంపదగా మాత్రమే చూస్తాం. కానీ, చార్మినార్ చుట్టూ ఎన్నో జీవితాలు ఆ చారిత్రక కట్టడమంత ఠీవీగా సాగుతున్నాయి. చెట్టును అల్లుకున్న లతలా చార్మినార్‌తో పెనవేసుకున్న అక్కడి ప్రజల జీవన శైలిని దృశ్యంగా కళ్లకు కట్టాలనుకున్నారు శ్రీలక్ష్మి. ఆ దృశ్యానికి అక్షరాన్ని కూర్చి.. అనుకున్నది సాధించారు. డాక్యుమెంటరీని డాక్యుపోయెమ్గా తీర్చిదిద్దిన ప్రయోగానికి ప్రముఖుల ప్రశంసలతో పాటు జాతీయస్థాయిలో జరిగే పాలపిట్ట అవార్డూ వరించింది. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి హైదరాబాద్ ఆలిండియా రేడియోలో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా విధుల్లో ఉన్నారు అయినంపూడి శ్రీలక్ష్మి. తనలోని సృజనాత్మకతను పెంచే వేదికలు వెతుక్కుంటూ ప్రవృత్తిలోనూ రాణిస్తున్నారు. యాంకర్‌గా, ఈవెంట్ ఆర్గనైజర్‌గా, కవయిత్రిగా, రచయిత్రిగా, డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్‌గా తన లోని సృజనను పలు రూపాల్లో ఆవిష్కరిస్తున్నారు. లైఫ్ ఎట్ చార్మినార్ డాక్యుమెంటరీ కూడా ఆ సృజన నుంచి పుట్టిందే. మూడేళ్ల కిందట.. హైదరాబాద్ అంటే చార్మినార్, చార్మినార్ అంటే హైదరాబాద్. ఈ అపురూప నిర్మాణం లేని హైదరాబాద్‌ను ఊహించలేం. చార్మినార్‌ను కథా వస్తువుగా ఎంచుకుని.. ఒక డాక్యుమెంటరీ రూపొందించాలని భావించారు శ్రీలక్ష్మి. అందుకోసం ఎన్నో పుస్తకాలు తిరగేశారు. ఎందరినో కలిశారు. ‘చాలా కష్టం’ అని ఉత్సాహం మీద నీళ్లు చల్లినవారూ ఉన్నారు. ఆ కష్టం ఎలా ఉంటుందో చూడాలనుకుని మరీ ఆమె రంగంలోకి దిగారు. చార్మినార్ నీడలో కులమతాలకు అతీతంగా జీవనం సాగిస్తున్న వర్తకులు, వ్యక్తుల జీవితాలను కలగలిపి తన డాక్యుమెంటరీలో మినీ భారతాన్ని ఆవిష్కరించాలని అనుకున్నారు. శ్రీలక్ష్మి ఆలోచనకు ఆమె కూతుళ్లు సాయినవ్యత, సాయివర్షిత అండగా నిలిచారు. వారి స్నేహితులు చంద్రలేఖ, సుమశ్రీలను వెంట తీసుకొచ్చారు. ఐదుగురూ కలిసి డాక్యుమెంటరీకి బడ్జెట్‌ను తయారు చేశారు. ఇంట్లో ఉన్న హ్యాండీకామ్, శ్రీలక్ష్మి రూపొందించిన స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నాయి. డాక్యుమెంటరీ రూపకల్పనకు అయ్యే ఖర్చును తను భరిస్తానని చిన్నకూతురు చెప్పింది. రంజాన్ మాసంలో జిలుగు వెలుగుల చార్మినార్ ఎంతో అందంగా ఉంటుంది. అందుకే ఆ రోజులను ఎంచుకున్నారు. అంతా కలిసి చార్మినార్ వైపుగా పయనమయ్యారు. 24 రోజులు... 4 గంటలు... ఒక మినార్ చారిత్రక వారసత్వం ఒక మినార్ సమకాలీన జీవనం ఒక మినార్ పర్యాటక చేతనం ఒక మినార్ వ్యథాభరిత హృదయం నాలుగు దిక్కులు ఒకే చోట కలుస్తున్న సజీవ దృశ్యం చార్మినార్! ‘చార్మినార్ చుట్టూ అల్లుకుపోయిన జీవితాలను పరికిస్తే ఎవరిలోనూ చిన్న నిరాశ కూడా కనిపించదు’ అంటారు శ్రీలక్ష్మి. ‘వారిలోని ఆ ఆశాభావాన్ని చిత్రంగా రూపొందించాలనుకున్నాను. ముందుగా డీజీపీ అనుమతి తీసుకొని వెళ్లినా, డాక్యుమెంటరీ పూర్తయ్యేంతవరకు ఇబ్బందులు తప్పలేదు. ఎప్పుడూ బిజీగా ఉండే ఆ ప్రాంతంలో షాపుల యజమానులను ఒప్పించి, నచ్చజెప్పి బైట్స్ తీసుకున్నాం. కొన్ని సార్లు షాపింగ్ చేసి, ఎంతో కొంత వదిలించుకుంటే తప్ప సరిపడినంత ఫుటేజీ రాలేదు. బెగ్గర్స్ కూడా డబ్బులిస్తేనే బైట్స్ ఇచ్చేవారు. అలా మొత్తం షూట్ చేయడానికి 24 రోజులు పట్టింది. షూట్ చేసిందంతా చూసుకుంటే 4 గంటల పుటేజీ వచ్చింది. దాంతో 16 నిమిషాల నిడివిగల ఫిల్మ్‌ని తయారుచేయడానికి ఎడిటింగ్ తెలిసిన సుమనశ్రీ సాయం చేసింది. డాక్యుమెంటరీ చూశాక పడిన కష్టమంతా దూదిపింజలా తేలిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఆత్మసంతృప్తి, అవార్డులు, ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు.’ అంటూ ఆనందంగా వివరించారు శ్రీలక్ష్మి. ప్రయోగాత్మకంగా తీసిన లైఫ్ ఎట్ చార్మినార్ పాలపిట్ట నేషనల్ షార్ట్ అండ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్ న్యాయ నిర్ణేతలను ఆకర్షించింది. ఈ డాక్యుపోయెం స్పెషల్ జ్యూరీ అవార్డును గెలుచుకుంది. మానవీయ కోణం... సాహిత్య ప్రక్రియలో కూడా శ్రీలక్ష్మి ఎప్పటికప్పుడూ ప్రయోగాలు చేస్తున్నారు. ‘హెచ్ఐవీ/ఎయిడ్స్. ‘ఆశాదీపం’ పేరిట వచ్చిన కథాసంకలనానికి సంపాదకవర్గంలో ప్రధాన భూమిక పోషించారు. రొమ్ము క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు, వారికి కొంత ఓదార్పుగా నిలిచేందుకు కవితా థెరపీని ‘వూండెడ్ హార్ట్’పేరుతో తీసుకొచ్చారు. సిండికేట్ బ్యాంక్ ఉద్యోగి అయిన భర్త నాగేశ్వరరావు సహకారంతోనే ఇవన్నీ చేయగలుగుతున్నానని చెబుతారామె. అవగాహన సదస్సులు.. రచయిత రావూరి భరద్వాజతో కలసి ‘ఏకాంతవాసి’, సినీప్రముఖులను సంప్రదించి ‘భారతీయ సినిమా’ ఎపిసోడ్స్‌కి పనిచేసిన శ్రీలక్ష్మి, అడ్వకేట్స్ వరల్డ్‌కప్, హెచ్ఐవీ/ఎయిడ్స్ వర్క్‌షాప్.. వంటి మెగా ఈవెంట్లను నిర్వహించారు. శ్రీహరిచంద్రా క్రియేషన్స్ బ్యానర్ మీద లైఫ్ ఇన్ కార్పొరేట్, లైఫ్ ఇన్ స్లమ్, లైఫ్ ఇన్ రెయిన్ల మీద డాక్యుమెంటరీలను రూపొందిస్తున్నారు. ‘సృజన ఒక్కటే ఉంటే సరిపోదు. దాన్ని చూపించేందుకు అవసరమైన వేదికను కూడా మనమే వెతుక్కోవాలి. అది తెలిస్తే చాలు విజేతలుగా నిలుస్తాం’ అంటూ ముగించారు శ్రీలక్ష్మి. -
స్వచ్ఛభారత్ కోసం ఉద్యోగాన్నే వదిలేశాడు..!
23 ఏళ్ల యువకుడు... చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేశాడు. దేశానికి వెన్నెముకగా నిలిచే రైతులపై దృష్టి సారించాడు. రైతులు సేంద్రియ పద్ధతిలో తామే ఎరువులను తయారు చేసుకునేలా, విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునేలా చేయాలని సంకల్పించాడు. భారత ప్రధాని నరేంద్రమోడి స్వచ్ఛభారత్ అభియాన్‌ను ఎందుకు ప్రారంభించారు అంటూ చాలామంది తమ పరిసరాలను గమనించడం మొదలుపెట్టారు. అయితే హైదరాబాద్ వాస్తవ్యులైన సుజిత్‌రెడ్డి మాత్రం తను చేస్తున్న బి.పి.ఓ. ఉద్యోగానికి రాజీనామా చేసి, 150 కి.మీ. స్వచ్ఛభారత్ క్యాంపెయిన్ని నగరంలో నిర్వహించి మరో అడుగు ముందుకు వేశారు. పదిహేను రోజులుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నాందిగా నిలిచిన విషయం చెబుతూ -‘‘మూడు నెలల క్రితం, కరీంనగర్ జిల్లాలోని మా తాతగారి ఊరైన వేములవాడలో ఓ రైతు పంటనష్టం కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త విని చాలా బాధపడ్డాను. గడచిన పదేళ్ళలో మన దేశంలో 3 లక్షల 50 వేల మంది రైతులు పంటనష్టం, అప్పుల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నారని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్నాను. వారికోసం ఏదైనా చేయాలనిపించింది. ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో వ్యర్థపదార్థాల నుంచి తయారు చేసిన విద్యుత్, బయోగ్యాస్ వంటివి రైతులకు ఎంతో ఉపయోగడుతున్నాయి. మన దేశంలోని ఒక రోజు చెత్తనంతా సేకరించి బయోగ్యాస్‌గా మారిస్తే కనీసం 2 లక్షల సిలిండర్లను నింపవచ్చు అని అర్థమైంది’’ అని తెలిపారు ఈ పట్టభద్రుడు. అనుకున్నదే తడవుగా తన ఆలోచనను ఆచరణలో పెట్టాలనుకున్నారు. రైతుల క్షేమం కోసం పోరాడాలనుకున్నారు. చెత్తను సేకరించి దానిని విద్యుత్తుగానూ, ఎరువులుగానూ మార్చి స్వచ్ఛభారత్ కార్యక్రమానికి మొదటి అడుగు అవ్వాలని నిశ్చయించుకున్నారు. ‘‘మొదటిరోజు చెత్తను సేకరించడానికి శస్త్రచికిత్స సమయంలో వైద్యులు వాడే గ్లౌజులను ఇచ్చి మా కజిన్ మనోజ్‌రెడ్డి మద్దతు తెలిపారు. ఆ తర్వాత రోజుకు నలుగురు, ఐదుగురు చొప్పున ఈ సంఖ్య పెరుగుతూ వచ్చింది’’ అని తెలిపారు సుజిత్. వీరంతా బస్టాప్‌లు, స్కూళ్లు, కళాశాలలు, షాప్‌లు సందర్శిస్తారు. అలాగే ప్రతి ఇంటి నుంచి, షాపుల నుంచి తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి, సేకరించడానికి పూనుకున్నారు. సేకరించిన చేత్తను మున్సిపాలిటీ కుండీలకు చేరుస్తారు. నిండిన కుండీల గురించి మున్సిపాలిటీ వారికి సమాచారం ఇస్తారు. డంప్‌యార్డ్ వద్ద విద్యుదుత్పాదన చేయవచ్చని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీనితో పాటు పరి శుభ్రత గురించి అందరికీ అవగాహన కల్పించేందుకు పూను కున్నారు. చెత్తను వీధుల్లో కాకుండా కుండీలలోనే వేస్తున్నారా అంటూ ప్రతి దుకాణదారుడి దగ్గరకు వెళ్లి అడుగుతున్నారు.అంతేకాదు వారు తాము చెప్పిన విధంగా చేస్తున్నారా, లేదా? అనేదీ పరిశీలిస్తున్నారు. తొంభై శాతం దుకాణదారులు చెప్పినట్టుగా చేయడం గర్వంగా ఉంటోంది అంటున్నారు సుజిత్. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. అయితే, కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు చేయి కలిపితే మరిన్ని మెరుగైన ఫలితాలను తీసుకురావచ్చు అంటున్న సుజిత్ తన కార్యక్రమానికి ‘వి ఆర్ ఫౌడ్ టు బి ఎ హైదరాబాదీ’ అని ప్రింట్ చేసిన యూనిఫామ్‌ను రూపొందించారు. ‘‘మేం బేగంపేటలోని ట్రాఫిక్ పోలీస్‌లను కలిశాం. వారు చాలా సంతోషంగా, ఈ కార్యక్రమానికి ప్రోత్సహమిచ్చారు. ముక్కుకు అడ్డుగా కట్టుకోవడానికి మాకు పొల్యూషన్ మాస్క్‌లను ఇచ్చి, మరీ ప్రోత్సహించారు. ఎవరికైనా మంచి పని చేయాలని ఉంటే, అందుకు తప్పక మరికొంతమంది సాయపడతారు’’ అని నవ్వుతూ తెలిపారు సుజిత్. మరో ముందడుగు గురించి సుజిత్ చెబుతూ- ‘‘త్వరలో గ్రామాలకు వెళ్లి, రైతులతో మాట్లాడతాను. వారికి సేంద్రియ ఎరువులను సొంతంగా ఎలా తయారుచేసుకోవచ్చో, చెత్త నుంచి వంట గ్యాస్‌ను ఎలా తయారుచేసుకోవచ్చో తెలియజేస్తాను. ఇదే నా కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం’’ అంటున్నారు. త్వరలోనే సుజిత్ దాన్ని సాధిస్తారు. అతనికళ్లలో, మాటల్లో కనిపిస్తోన్న ఆత్మవిశ్వాసమే అందుకు సాక్ష్యం! - నిర్మలారెడ్డి ఈ కార్యక్రమంలో మీరూ పాల్గొనాలనుకుంటే... facebook:sujithreddyswachhbarath, we are proud to be a hyderabadi కు వెళ్లి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. స్ఫూర్తిమంతమైన ఇటువంటి కథనాలను మాతో పంచుకోవాలనుకుంటున్నారా? మేము సైతం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34. email:swachhbharat.sakshi@gmail.com, swachhbharat@sakshi.com కు పంపండి. బాగున్న వాటిని ప్రచురిస్తాం. -
తేడా తెలియకనే...
యువ కల్లోలం ప్రేమించామని ఇంట్లో వారికి తెలియకుండా వెళ్లిపోవడం, విలువైన విద్యా సమయాలను కోల్పోవడం, పెద్దలంటే పడకపోవడం యుక్తవయసు పిల్లలున్న ప్రతి ఇంట్లోనూ పరిపాటిగా మారిపోయింది. పెద్దలకు పిల్లల గొడవ ఏంటో అర్థం కాదు. పిల్లలకు తమలో కలిగే గందరగోళాన్ని పెద్దలకు ఎలా చెప్పాలో తెలియదు. పిల్లల గురించిన ‘చేదు నిజాలు’ ఎప్పటికో తెలిసి పెద్దలు నిర్ఘాంతపోతారు. తమ నమ్మకం పోగొట్టారని పరువు ప్రతిష్టలు మంటకలిపారని కోపంతో విరుచుకుపడతారు. గృహనిర్బంధం చేస్తారు. ఈ పరిణామాలు వారిని మరింత గందరగోళంలో పడేస్తాయి. పెద్దలు తమను ఎప్పుడూ అర్థం చేసుకోరని, తమ ప్రేమ గొప్పదని ఇంకా బలంగా నమ్ముతారు. లేదంటే తాము అల్లుకున్న బంధాన్ని తుంచేసి పెద్దలు చెప్పినదానికి తలవంచుతారు. ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలు సమాజానికే సవాల్‌గా నిలుస్తున్నాయి. మీ ఇంట్లోనూ టీనేజర్ ఉన్నారా? అయితే ఇది మీకోసమే... ‘ఒక అబ్బాయి/అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారంటే అది ప్రేమ అని పొరబడుతున్నారు’ అంటారు సైకాలజిస్ట్ డా.సి.వీరేందర్. ఈయన ‘టీనేజ్ టెంప్టేషన్స్’పై 8 ఏళ్లుగా 200 కళాశాలల్లో సదస్సులు ఏర్పాటు చేశారు. యువతీ, యువకులు, తల్లితండ్రుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇదే అంశంపై ఎన్నో ఉపన్యాసాలు ఇస్తూ వచ్చారు. యుక్త వయసులో ప్రేమ, ఆకర్షణల పట్ల కలిగే ఆందోళ నలను ఎలా చక్కబెట్టుకోవాలో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఆకర్షణను ప్రేమ అనుకుంటున్నారు... ‘‘యుక్తవయసులో పిల్లలకు ప్రేమకు - ఆకర్షణకు తేడా తెలియడం లేదు. తాత్కాలిక ఆనందాలు, స్నేహితుల ముందు గొప్ప అనిపించుకోవడాలు, సినిమాల్లో చూపిన ప్రేమ సన్నివేశాలు జీవితంలోనూ నిజమని నమ్మడాలు.. జరుగుతున్నాయి. కొన్నాళ్లకు ఇద్దరిలో ఎవరో ఒకరిలో ఆకర్షణ తగ్గిపోతుంది. ఆ ఒక్కరు ప్రేమ నుంచి డ్రాప్ అవుతారు. అప్పుడు సదరు వ్యక్తి తనను మోసం చేశాడు/చేసింది అనే భావనకు వచ్చేస్తారు. ఆ భావనను భరించలేరు. ఆ బాధలో అవతలివారిని హింసిస్తేనో, తమను తాము హింసించుకుంటేనో ఉపశమనం లభిస్తుందని భావిస్తారు. అలాంటి ఉద్రేకంలోనే దారుణాలు జరుగుతుంటాయి. ఎక్కువ సమయం తరగతిలోనే... పిల్లలు రోజులో ఎక్కువ గంటలు ఉండేది తరగతి గదిలోనే! లెక్చరర్లు ‘చదువు’ ఒత్తిడి పెడతారు. ఇంటి దగ్గర ఇదే ఒత్తిడి ఉంటుంది. ఇలాంటప్పుడు తాత్కాలిక ఆనందాలను ఇచ్చే వాటి కోసం పిల్లలు వెతుకుతారు. అందులో ఫోన్, ఇంటర్నెట్ ప్రధానమైనవి. తమ పరిధిలో ఉన్న తోటి విద్యార్థులతో స్నేహం చేయడం మొదలుపెడతారు. అందులో అమ్మాయి-అబ్బాయి స్నేహం చేస్తే తొందరగా అవతలి వ్యక్తితో తమ భావాలను పంచుకోవడం సహజాతి సహజంగా జరిగిపోతుంటాయి. వీటికి తోడు వారి స్నేహితులే ‘ఇది ప్రేమ’ అంటూ ప్రోత్సహిస్తుంటారు. దీనివల్ల స్నేహం-ప్రేమ తేడాలు తెలియక గందరగోళానికి లోనవుతుంటారు. తాత్కాలిక ఆనందాల కోసం... ఒత్తిడి నుంచి బయటపడటానికి ఆనందం కోసం వెతుకుతారు. ఆనందం కోసం ఆకర్షి తులవుతారు. ఆకర్షణను ప్రేమ అనుకుం టారు. దీంట్లో.. యుక్తవయసు పిల్లలు.. చాలా మంది లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ప్రేమ సందేశాల్లో బయటకు చెప్పడానికి వీలులేని అసభ్యపదాలను వాడుతున్నారు. ఫోన్లు, ఇంటర్నెట్లలో థర్డ్ గ్రేడ్ సినిమాలు ఎక్కువగా చూస్తున్నారు. చివరికి ఇంట్లో చెప్పకుండా పారిపోతున్నారు, లేదా ఇంట్లో వారికి తెలిస్తే గొడవలు జరుగుతాయని భయపడి ప్రాణాలు తీసుకుంటున్నారు. పరిస్థితి అంతవరకూ తెచ్చుకోకూడదంటే... తల్లితండ్రులూ మాట్లాడండి... పిల్లల్ని మాట్లాడనివ్వండి..! ఈ రోజుల్లో కుటుంబంలో అందరూ ఎవరి పనుల్లో వారు తీరిక లేకుండా ఉంటున్నారు. పిల్లలకు కావల్సిన అవసరాలు మాత్రమే పెద్దవాళ్లు చూస్తున్నారు తప్ప, వారు ఏం చేస్తున్నారో పట్టించుకోవడం లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకునేకంటే ముందే జాగ్రత్తపడటం మేలు. యుక్తవయసులో సాధారణంగా తటస్థపడే ప్రేమ-ఆకర్షణల గురించి, సమాజ తీరుతెన్నుల గురించి పిల్లలతో మాట్లాడాలి. చర్చించాలి. పిల్లలూ ఆ చర్చలో పాల్గొనేలా చూడాలి. ఎన్నో సమస్యలకు ఈ అవగాహన చర్చలే పరిష్కార మార్గాలు అవుతాయి. అర్థం చేసుకోండి... పిల్లలు ఏ పరిస్థితిలో ‘టెంప్టేషన్స్’కు లోనవుతున్నారో గమనించండి. మీ అబ్బాయి/ అమ్మాయి ప్రేమలో ఉన్నారనుకుంటే అదొక సహజమైన పరిణామంగా పరిగణించండి. పిల్లలతో స్నేహపూర్వకంగా సంభాషించండి. వారి లోపాలను సున్నితంగా తెలియజేయండి. అప్పటికీ మార్పు రాకపోతే నిపుణుల సలహా తీసుకోవడంలో అలక్ష్యం చేయవద్దు’’ అని తెలియజేస్తున్నారు డా. వీరేందర్. ప్రేమ-ఆకర్షణ.. దేని దారి దానిదే! రెండింటినీ కలిపి జీవితాలను హింసకు గురిచేయకూడదు. యుక్తవయసు వచ్చాక ఈ విషయం పిల్లలకు అర్థమయ్యేలా తెలియజెప్పడం పెద్దల బాధ్యత. పెద్దల సూచనలు తమ మంచికే అనే విషయాన్ని పిల్లలూ గ్రహిస్తే సమాజంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోవు. ఎవరి జీవితాలూ ఛిద్రం కావు. - నిర్మలారెడ్డి, సాక్షి ఫ్యామిలీ టీనేజర్లూ... గందరగోళంలో ఉన్నారా?! ఇది మీ వేదిక... టీనేజ్‌లో ‘ప్రేమ’పట్ల ఉండే అవరోధాలు, ఆందోళనలు, ఎదుయ్యే అవమానాలు, ఛీత్కారాలు, భయాలు.. ఇలాంటి సంశయాలన్నీ తీర్చుకోవడం చాలా అవసరం. అందుకోసం ‘యు అండ్ మి టీ క్లబ్’ ద్వారా వేదికను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటివరకు 200 కళాశాలల్లో ‘టీనేజ్ టెంప్టేషన్స్’ అనే అంశంపై సదస్సులు ఏర్పాటు చేశాం. ప్రేమంటే ఏమిటి, ప్రేమలో ఉండే ‘కిక్’, దాంట్లో ఉండే అన్ని రకాల లక్షణాలు, ఆకర్షణలు, సంశయాలు, స్నేహాల గురించి చర్చించి ఒక పారదర్శక నమూనాను నేటి యువతీ యువకులకు అందించాలనేది ఈ ప్రయత్నం. 10వ తరగతి నుంచే పిల్లలకు ‘టెంప్టేషన్స్’పై అవగాహన పెంచితే యుక్తవయసులో వచ్చే రకరకాల ఆందోళనలు ఆలోచనగా రూపుదిద్దుకుంటాయి. అప్పుడు వారు అభివృద్ధి దిశగా దృష్టి పెడతారు. ఈ 12, 13 తేదీల్లో కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయంలో ‘టీనేజ్ టెంప్టేషన్స్’ అనే అంశంపై సెమినార్ నిర్వహిస్తున్నాం. మరిన్ని వివరాలను ఠీఠీఠీ.డౌఠఝ్ఛ.జీజౌ కు లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు. - డా. సి.వీరేందర్, సైకాలజిస్ట్, హైదరాబాద్ వర్ష రోజూ కాలేజీకి వెళుతోంది. కానీ, ఆమె ఏడాదిగా క్లాస్‌లకు హాజరవడంలేదని పరీక్షల ముందు కాలేజీ వారు సమాచారం ఇవ్వడంతో ఇంట్లోవారు నిర్ఘాంతపోయారు. *** సురేశ్ కిందటేడాది వరకు ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు. తన క్లాస్మేట్ని ప్రేమించి, క్లాస్‌లు ఎగ్గొట్టి ఆమెతో తిరిగాడు. ఏడాది తిరిగేసరికల్లా ఆమె ‘సారీ’ చెప్పి పెద్దలు చూసిన సంబంధం చేసుకుని వెళ్లిపోయింది. తట్టుకోలేని సురేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. -
ముగ్ధ...మనోహరమైన కల!
చాలా మంది యువతీ యువకులే కాదు వారి తల్లిదండ్రులూ తమ పిల్లల విషయంలో కంటున్న కల సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం. పెద్ద పెద్ద కంపెనీలలో లక్షల సంపాదన!! అయితే అవన్నీ అందిపుచ్చుకున్న పాతికేళ్ల్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ శశి మాత్రం చేస్తున్న ఉద్యోగం వద్దనుకున్నారు. తనకెంతో ఇష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్‌లో రాణించడానికి కృషి చేస్తున్నారు. ‘కంప్యూటర్ ముందు ఓ యంత్రంలా చేసే పనికన్నా దుస్తులపై మనసుపెట్టి చేసే డిజైన్లు నాకు ఎంతో సంతృప్తినిస్తాయి’అంటారు శశి. నేడు సినీస్టార్స్ చేత ర్యాంప్‌పై ఆమె డిజైన్స్‌తో హొయలొలికిస్తున్న శశి ఉంటున్నది హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో. ‘ముగ్ధ ఆర్ట్ స్టూడియో’ పేరుతో ఆమె ఓ బొటిక్‌ను నడుపుతున్నారు. రెండు వేల రూపాయలతో మొదలైన తన ప్రయాణం ఇప్పుడు వంద మందికి పైగా ఉపాధిని ఇవ్వగల స్థాయికి చేర్చింది. అతివలు ముచ్చటపడే దుస్తుల డిజైనర్‌గా ప్రశంసలు అందుకుంటున్న ఈ సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయగాథే ఇది. స్వశక్తే పెట్టుబడి రెండేళ్ల క్రితం వరకు ఇంజినీర్‌గా శశి నెల జీతం 50 వేలు. ఇప్పుడూ అదే ఉద్యోగంలో ఉంటే లక్ష రూపాయలు దాటేదే! ‘కానీ, నాకు రాత్రీ పగలూ ఒకటే ఆలోచన... అద్భుతమైన దుస్తులను తయారు చేయాలి. పది మందికి నేనే ఉపాధి ఇవ్వాలి. ఆ కలను గత రెండేళ్లుగా నిజం చేసుకుంటున్నాను’ అన్నారు ‘ముగ్ధ’ పేరుతో సంప్రదాయ దుస్తులను డిజైన్ చేసే శశి. ‘సాఫ్ట్వేర్ ఇంజినీర్ అంటే పెళ్లికి మంచి సంబంధాలు వస్తాయి కాని, ఫలానా వారి అమ్మాయి బట్టలు కుడుతుంది అంటే ఎవరూ ముందుకు రారు. ఈ పని మానుకో!’ అని శశి అమ్మ అంజలీదేవి, నాన్న సత్యనారాయణ హెచ్చరించారు. ఆమె ఇష్టాన్ని కాదన్నారు. ‘కుటుంబంలో ఎవరికీ లేని ఈ పిచ్చి నీకెందుకు పట్టుకుంది’ అని బాధపడ్డారు. వారిని ఒప్పించలేక తన స్వశక్తిని నమ్ముకుని ఇంటి నుంచి ఒంటరిగా బయటకు వచ్చేశారు శశి. అలా ఉప్పల్‌లో అమ్మానాన్నల చెంత ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే ఆమె, బంజారాహిల్స్‌లోని ఓ స్లమ్ ఏరియాలో రూ.2,000 పెట్టి ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నారు. అక్కడే రేయింబవళ్లూ తన మదిలో మెదిలో ఆలోచనలతో డిజైన్స్ మొదలుపెట్టారు. ‘ఫ్యాషన్ డిజైనింగ్‌లో రాణించడానికి నేనేమీ ప్రత్యేకమైన కోర్సులు చేయలేదు. ఎవరి దగ్గరా శిక్షణ పొందలేదు. ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే నైట్ డ్యూటీకి వెళుతూ పగలు డిజైన్స్ పరిశీలించడానికి నగరమంతా తిరిగేదాన్ని. రకరకాల వారపత్రికలు తిరగేసేదాన్ని. విడి విడిగా క్లాత్‌లు తీసుకొచ్చి కాంబినేషన్స్ చూసుకునేదాన్ని. ఆ ప్రయత్నానికి ఓ చిన్నగదిలో ఊపిరిపోయడం మొదలుపెట్టాను. వదిలి పెట్టకుండా తొమ్మిది నెలలు రకరకాల ప్రయోగాలు చేసి, ఆరు ప్రత్యేకమైన లంగా ఓణీలను డిజైన్ చేశాను. తర్వాత సొంతంగా ఒక ఎంబ్రాయిడరీ మిషన్, మగ్గం వర్క్ పరికరాలను కొన్నాను’ అని శశి చెబుతుంటే కృషి చేస్తే మేరు పర్వతాన్నైనా సింహాసనంగా చేసుకోవచ్చు అనిపించకమానదు. ప్రశంసలతో ఉత్సాహం ‘నేను డిజైన్ చేసిన లంగా ఓణీలను చూసినవారు అమితంగా మెచ్చుకున్నారు. వారి ఇంట్లో వేడుకలకు ఆర్డర్లు ఇవ్వడం మొద లుపెట్టారు. ఒకరిని చూసి మరొకరు.. డిజైనింగ్ బాగుందని, కలర్ కాంబినేషన్స్ సూపర్ అని మెచ్చుకోళ్లు.. వాటికి తగ్గట్టే ఆర్డర్లూ పెరిగాయి. ప్రశంసల జాబితా పెరుగుతున్న కొద్దీ నాలో ఉత్సాహమూ రెట్టింపు అయ్యింది. దానికి తోడు ఆదాయమూ పెరిగింది. ఇంకా డిజైనింగ్‌లో కొత్త కొత్త అంశాలు జోడించడం, నాణ్యతను పెంచడం.. వంటి జాగ్రత్తలు తీసుకున్నాను’ అంటూ వ్యాపార రహస్యాలను తెలిపారు శశి. ఉపాధి వైపుగా అడుగులు ఉద్యోగం మానేయాలనే ఆలోచనను శశి తన స్నేహితుల ముందుంచినప్పుడు వారు ‘నీకేమైనా పిచ్చా’ అన్నారు. బంధువులూ అదే మాట. అమ్మనాన్నలూ అదే మాట. ‘ఆ పిచ్చి ఉండబట్టే ఈ రోజు వంద మందికి ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి చేరుకోగలిగాను. మరో రెండుమూడు నెలల్లో విజయవాడ, విశాఖపట్నం, అమెరికాలోనూ ‘ముగ్ధ ఆర్ట్ స్టూడియో’ ను లాంచ్ చేయబోతున్నాను. పురుషుల డిజైన్స్‌నూ పరిచయం చేయబోతున్నాను. పాతికమంది నిరుపేద అమ్మాయిలకు ఉచితంగా డిజైనింగ్‌లో మెలకువలు నేర్పగలుగుతున్నాను. ఇంకా పేదపిల్లల చదువు కోసం కొంత ఆదాయాన్ని విరాళంగా ఇవ్వగలుగుతున్నాను. సినీ స్టార్ల చేత ర్యాంప్‌షోలు చేయించగలుగుతున్నాను’అంటూ తన కల గురించి, ఆ కలను సాకారం చేసుకున్న విధం గురించి, ఫ్యాషన్ డిజైనింగ్ ఉపాధి కల్పనల గురించి తెలిపారు ఈ నవతరం డిజైనర్. మొదట ‘నీ కల సరైంది’ కాదు అని తిట్టిన అమ్మనాన్నలే నేడు కూతురు స్వశక్తితో ఎదిగినందుకు సంతోషిస్తున్నారు. ‘మా అమ్మాయి ఫ్యాషన్ డిజైనర్, అందంగా దుస్తులను రూపొందిస్తుంది. ఇంకొంతమందికి ఉపాధి కల్పిస్తోంది’ అని గొప్పగా చెబుతున్నారు. స్నేహితులు అభినందిస్తున్నారు. ఆమె డిజైన్ చేసిన దుస్తులు తమకూ కావాలని పోటీపడుతున్నారు. సృజనకు స్వశక్తి పెట్టుబడిగా మారి, పట్టుదలతో కృషి చేస్తే ప్రశంసలు వాటి వెంటే వస్తాయి. అవే అందరిలోనూ ఉన్నతంగా నిలబెడతాయి. అందుకు శశి ఓ చక్కని ఉదాహరణ. - నిర్మలారెడ్డి, ఫొటోలు: శివ మల్లాల ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఎలైట్ ఫ్యాషన్ షోలో హీరోయిన్ తాప్సీ కోసం ప్రత్యేకంగా లంగా ఓణీని డిజైన్ చేశాను. తన చర్మకాంతిని ఇంకా కాంతిమంతం చేసేలా, మహారాణి కళ వచ్చేలా గోల్డ్ జరీ మెటీరియల్ ఎంచుకున్నాను. దేశంలోని ప్రసిద్ధ డిజైనర్స్ ఈ షోకి హాజరయ్యి, నా డిజైన్స్‌ని ప్రశంసించారు. - శశి, ఫ్యాషన్ డిజైనర్ -
గోరింటా పూసిందీ...
మతాలకు అతీతమైనది. వయసు తేడా లేనిది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ మగువ మనసుకు ముచ్చట కలిగించేది... గోరింట. ఈ మాసం ఆషాఢం. ఓ వైపు రంజాన్, మరో వైపు తెలుగు పండగలు వరసగా వస్తున్నాయి. అతివ చేతుల్లో గోరింట మందారంలా పూసి, మెరిసి, మురిసిపోయే రోజులే ఇక ముందన్నీ... అందుకే ఎర్రన్ని గోరింట ముస్తాబు... ఈ వారం... గోరింట చెట్టు వర్షాకాలంలో కొత్త చిగుళ్లు తొడుక్కుంటుంది. ఈ చెట్టు లేత ఆకులను ముద్దగా నూరి, కావలసిన ఆకారంలో చేతులకు పెట్టి, రెండు నుంచి ఆరు గంటల సేపు ఉంచితే చేతులు ఎరుపు రంగులోకి మారతాయి. ఔషధ గుణాలు మెండుగా ఉండే గోరింటాకును చేతులు, పాదాలకు అలంకరించుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలు దరిచేరవని చెబుతుంటారు పెద్దలు. ప్రాచీన కాలం నుంచి సౌందర్య సాధనాలలో గోరింటాకు ప్రధాన భూమిక పోషిస్తూ వస్తోంది. చర్మసంరక్షణలో మరొకటి సాటిలేదనిపించే ఈ ఆకు నుంచి అందమైన డిజెన్లైన్నో సృష్టించారు సృజనకారులు. వీటిని మగువలతో పాటు మగవారూ తమ భుజాలు, వీపు, ఛాతీ భాగాలలో టాటూగా వేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. తెలుగింటి పల్లెపడుచు చేతుల్లో నిండుగా... క్రిస్టియన్ పెళ్లి వేడుకలలో కాంతిమంతంగా... ముస్లిమ్ మగువ ముంజేతులలో ఆకర్షణీయంగా.. గోరింట రూపురేఖలు మార్చుకొని మెహెందీ డిజైన్లుగా ఆకట్టుకుంటోంది. హిందూ, ముస్లిమ్, క్రిస్టియన్,.. ఏ మతమైనా మెహెందీ విషయంలో భేద భావం లేదు. మనసుకు నచ్చిన డిజైన్ అయితే చాలు. ప్రపంచం మొత్తమ్మీద గోరింటతో శారీరక అలంకరణలో రకరకాల ప్రయోగాలు చేసేది ఇండియా, అరబ్ దేశాలు మాత్రమే. అదృష్టానికి, ఆరోగ్యానికి ప్రతీకగా అరబ్దేశాలలో ఐదు వేల ఏళ్ల క్రితమే గోరింటను వాడినట్టు, హెన్నా పదం అక్కడి నుంచే వచ్చినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. గోరింట చెట్టు ఇంట్లో ఉంటే దుష్టశక్తులు దరిచేరవని, మంచి ఆలోచనలు వస్తాయని నమ్మేవారు. కొన్ని తరాల తర్వాత గోరింట ఆకులను ఎండబెట్టి, పొడి చేసి చేతులు, పాదాలపై రేఖాగణిత నమూనాలలో డిజైన్లు వేసుకునేవారు. వీటివల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, అండాశయాల పనితీరు మెరుగవుతుందని భావించేవారు. ఇప్పటికీ మన దేశ గ్రామీణ ప్రాంతాలలో ఈ నమ్మకం ఉంది. ఈజిప్ట్ ‘మమ్మీ’ల జుట్టు, గోళ్లు ముదురు గోధుమ రంగులోకి రావడానికి గోరింటాకును వాడేవారని ఒక వివాదాస్పద వార్త కూడా ఉంది. క్రీ.పూ 700 కాలంలో గోరింట మొక్క ఈజిప్ట్ నుంచి భారతదేశంలో అడుగుపెట్టిందని, అప్పటి నుంచి అతివల చేతులు, పాదాలపై గోరింట ఎర్రగా పూయడం మొదలుపెట్టిందని వృక్షశాస్త్రజ్ఞులు చెబుతున్నారు. చారిత్రకపరంగా చూస్తే మనుషులకు గోరింటాకు ఔషధంగా... వస్త్రం, లెదర్, కేశాలు రంగు మారడానికి ‘డై’గా వాడేవారని తెలుస్తోంది. ఉత్తరాదిన కడ్వాచౌత్, దీపావళి, దక్షిణాదిన అట్లతద్ది వంటి పండగలలో గోరింట ప్రధాన భూమిక పోషిస్తోంది. ఉత్తరభారత వివాహ సంప్రదాయం ఇటీవల దక్షిణాదినీ ఆకట్టుకుంటోంది. అందులో భాగంగానే వివాహానికి ముందు మెహిందీ కోసం ప్రత్యేకంగా వేడుకలు జరుపుతున్నారు. బాలీవుడ్ సినిమాలలో ‘మెహెందీ వేడుక’ ఒక ప్రధానాంశం. ఈ సినిమాల వల్ల నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మాల్దీవులలో వివాహవేడుకల సమయాలలో అలంకరణలో భాగంగా మెహెందీ ప్రథమస్థానంలో నిలిచింది. ఆ విధంగా 1990 నుంచి మెహెందీ అలంకరణలలో నూతన పోకడలు వచ్చి చేరాయి. నాటి నుంచి ఈ డిజైన్లను ‘హెన్నా టాటూస్’గా పిలవడం ప్రారంభించారు. ప్రస్తుత కాలంలో పాకిస్థాన్, గల్ఫ్ దేశాలు హెన్నా డిజైన్స్‌లో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఈ డిజైన్లని ముస్లిమ్ మహిళలు అలవోకగా వేయడం అక్కడి నుంచే మొదలైంది. వేదాలలో గోరింటరంగును సూర్యునికి ప్రతీకగా చె ప్పారు. అందుకే అరచేతుల్లో సూర్యుని ఆకారాన్ని పోలి ఉండే గుండ్రటి డిజైన్ వేసేవారు. మనిషి లోపల ఉన్న జ్ఞాన కాంతిని గోరింట ద్వారా మేలుకొలపడంగా భావించేవారు. డిజైన్లలో వైవిధ్యం ఇటీవల కాలంలో బ్రైడల్, ఇండియన్, అరబిక్... మెహెందీ డిజైన్లు పోటీ పడుతున్నాయి. వీటిలోనే షేడెడ్, ఫ్లోరల్, మోటిఫ్స్... ఇలా తీర్చిన డిజైన్లలో రంగురంగుల రాళ్లు, పూసలు, గ్లిట్టర్ (మెరుపుతో ఉండే పచ్చని రంగు)ను కూడా ఉపయోగిస్తున్నారు. మరికొందరు నేరుగా అచ్చులతో రంగు డిజైన్లను నిమిషాలలో ఒంటి మీద ముద్రించుకుంటున్నారు. ఇంకొందరు ప్లాస్టిక్ డిజైన్ల్లో వచ్చిన స్టిక్కర్స్నీ అతికించుకుంటున్నారు. జీవనశైలి వేగవంతంగా మారుతుండటంతో ఈ డిజైన్లలోనూ ఆధునిక పోకడలు వేగం పుంజుకుంటున్నాయి. మెహెందీ.. ఇలా మేలు.. మెహెందీ కోన్లు మార్కెట్లో విస్తృతంగా లభిస్తున్నాయి. వీటితో డిజైన్ వేసుకోవడానికి ముందు ఆ మెహెందీ మన చర్మానికి సరి పడుతుందా లేదా అనేది పరీక్షించుకోవడం తప్పనిసరి. చెవి వెనుక భాగంలో (చెవి వెనుక భాగం చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకని ఏ రియాక్షన్ అయినా త్వరగా తెలిసిపోతుంది) లేదా మోచేతి దగ్గర మెహెందీ రాసుకొని, 3-4 రోజుల తర్వాత కూడా ఎలాంటి రియాక్షన్ లేదంటే అప్పుడు డిజైన్ వేయించుకోవడం ఉత్తమం. మరీ ముఖ్యంగా బ్లాక్ మెహెందీలో ఎక్కువ అలెర్జీ కారకాలు ఉంటున్నాయి. డిజైన్ నల్లగా రావడానికి వీటిలో హానికారక రసాయనాలు కలుపుతున్నారు. మెరుపులు వచ్చే గ్లిట్టర్ తరహా మెహెందీలు సైతం చర్మానికి పడక చాలా మంది ప్రమాదకరమైన స్థితిలో ఆసుపత్రికి వస్తుంటారు. ముఖంతో పాటు గాలి పీల్చుకునే శ్వాసవాహిక కూడా ఉబ్బి పోతుంది. చేతులు, పాదాలపై మెహెందీ డిజైన్ ఉన్న చోట చర్మం ఎర్రగా కందిపోయి, పొక్కులు, చీము కనిపిస్తుంటుంది. కాబట్టి ప్రకృతి సిద్ధంగా లభించే గోరింటాకును ఉపయోగించడాన్నే ప్రోత్సహించాలి. - శైలజ సూరపనేని, కాస్మటిక్ డెర్మటాలజిస్ట్ - నిర్మలారెడ్డి -
స్వచ్ఛమైన మనసులకు ఆలంబన
‘చదివిన చదువుకు సార్థ్ధకత చేకూరాలి. అలాగే చేసే పని మనసుకు సంతృప్తినివ్వాలి. మానసికంగా ఎదగని పిల్లలకు పాఠాలు చెబుతూ అందులోనే సంతృప్తిని వెదుక్కుంటున్నాను’ అంటున్నారు హైదరాబాద్‌లోని కూకట్పల్లి ప్రగతినగర్‌కు చెందిన 35 ఏళ్ల బబిత. మానసికంగా ఎదగని, అలాగే చదువులో వెనకబడిన పిల్లల కోసం ‘శ్రేయా ఇన్స్టిట్యూట్ ఫర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్’ పేరుతో స్కూల్‌ను నడుపుతున్నారు బబిత. అదీ తన ఇంటి లోగిలిలోనే! ఫీజులతో నిమిత్తం లేకుండా సేవే పరమావధిగా సామాజిక వెలుగుకోసం నేనూ ఓ చిరుదివ్వెను వెలిగిస్తాను’ అంటున్న 35 ఏళ్ల బబిత ఏం చేస్తున్నారో ఆమె మాటల్లోనే... ఇంటింటికి వెళ్లి... ‘‘చిన్నప్పటి నుంచి టీచర్ కావాలనే ఆలోచన అమితంగా ఉండేది. అయితే ‘అన్నీ సక్రమంగా ఉన్న పిల్లలకంటే బతికినన్నాళ్లూ కుటుంబసభ్యులపై ఆధారపడే బుద్ధిమాంద్యం గల పిల్లలకు ఉపయోగపడే పని ఏదైనా చేస్తే బాగుంటుంది’అనుకునేదాన్ని. అందుకు కారణం మా మేనమామ. ఆయన మెంటల్లీ హ్యాండికాప్డ్. శారీరకంగా ఎదిగినా, మానసికంగా రెండేళ్ల పిల్లవాడిలా ఉండేవాడు. కుటుంబసభ్యులు ఎంతో ఇబ్బంది పడుతూనే ఆయనకి సేవలు చేసేవారు. చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తూ పెరగడం వల్లనేమో ఈ తరహా ఆలోచన నాతోపాటు వృద్ధి చెందింది. అందుకే స్పెషల్ చిల్డ్రన్ కోసం 2007లో ప్రత్యేక కోర్సు చేశాను. అప్పటికే నాకు పెళ్లై, ఓ పాప కూడా ఉంది. పాప బాగోగులు చూసుకుంటూనే మానసికంగా ఎదగని పిల్లలు ఉన్న ఇళ్లకు వెళ్లి వారికి క్లాసులు తీసుకునేదాన్ని. మా వారు డా.కులశేఖర్, ఇఎస్ఐ ఆసుపత్రిలో జనరల్ ఫిజిషియన్! తనకీ సమాజసేవ అంటే చాలా ఇష్టం. వారాంతంలో స్లమ్ ఏరియాలో హెల్త్‌క్యాంపులు నడుపుతుంటారు. ఆయనలో ఆ దృక్పథం ఉండటం వల్లేనేమో నా ఆలోచనకు ఊతం ఇస్తుంటారు. ఇద్దరు ముగ్గురి నుంచి ఇరవై మంది వరకు.... మానసికంగా ఎదగని ఒకరిద్దరు పిల్లలకే ఇస్తున్న ఈ శిక్షణ మరికొంత మంది పిల్లలకు కూడా అందితే బాగుంటుంది అనుకున్నాను. ఆ ఆలోచనతోనే మూడేళ్ల క్రితం శ్రేయ పేరుతో ఇంట్లోనే స్పెషల్ స్కూల్‌ను మొదలుపెట్టాను. మొదట ఇద్దరు, ముగ్గురు పిల్లలు వచ్చేవారు. ఇప్పుడు 20 మంది వరకు ఉన్నారు. వారికై వారు శుభ్రంగా ఎలా ఉండాలి? చిన్న చిన్న పనులు తమకు తామే ఎలా పూర్తి చేసుకోవాలి? వారి వస్తువులు వారే ఎలా గుర్తుపట్టాలో నేర్పిస్తూనే ఆ తర్వాత వృత్తివిద్యాకోర్సులకు అనుబంధిత సంస్థలతో కలిసి శిక్షణ ఇప్పిస్తుంటాను. వీరిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటలకు పదిమంది పిల్లలు, సాయంత్రం 5-7 వరకు మరో పదిమంది పిల్లలు వస్తారు. వీరికి శిక్షణ ఇవ్వడానికి మరొక టీచర్ సాయం కూడా తీసుకున్నాను. ఆటపాటలతో... మానసికంగా ఎదగని చిన్నారులను బుద్ధిగా కూర్చోబెట్టాలంటే వారి కళ్లకు అంతా కలర్ఫుల్గా ఉండాలి. అందుకోసం ఇంట్లోనే ఓ రెండు గదులను రంగురంగులుగా తీర్చిదిద్దాను. అలాగే వారికి బోర్ కొట్టకుండా ఉండటం కోసం వారికి ఆటపాటలను నిర్వహిస్తుంటాను. వారి పుట్టినరోజులు, ఇతర ముఖ్యమైన తేదీలు వేడుకగా జరుపుతాను. స్వచ్ఛమైన మనసులు ఉన్న చోట ఎంత మంది ఉన్నా ఇబ్బంది ఉండదు. అందుకే ఈ చిన్నారులతో ఎంత సేపు ఉన్నా సమయమే తెలియదు’’ అని తెలిపారు ఆమె. సమాజసేవలో పాలుపంచుకోవాలంటే పోగేసుకున్న డబ్బులే అవసరం లేదు. మనసులో ఓ మంచి ఆలోచన, చేయగలను అనే సంకల్పం ఉంటే చాలు ఇంటి నుంచే సేవను మొదలుపెట్టవచ్చు అని నిరూపిస్తున్నారు బబిత. - నిర్మలారెడ్డి -
అమ్మాయిలకు కర్ర సాయం
‘అమ్మాయిలకు చదువుతోపాటు కర్రసాములో మెళకువలు నేర్పించండి. ఉద్యోగం చేయడానికి చదువు ఎంత ఉపయోగపడుతుందో గాని, తమను తాము రక్షించుకోవడానికి కర్రసాము నూటికినూరుపాళ్లు సహకరిస్తుంది’ అంటున్నారు అరుణ్‌జ్యోతి.ఎస్.లోఖండే! నల్గొండ వాసి అయిన అరుణ్‌జ్యోతి స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థినులకు కర్రసాములో ఉచిత శిక్షణనిస్తున్నారు. అందుకోసం నాలుగేళ్లుగా తనూ సాధన చేస్తున్నారు. మహిళలకు ఉచిత యోగా శిక్షణ, పేపర్ క్రాఫ్ట్స్, మట్టితో విగ్రహాలు... ఇలా తన వంతుగా మహిళాభ్యుదయానికి కృషి చేస్తున్న నలభయ్యేఏళ్ల అరుణ్‌జ్యోతి ‘సమాజానికి నా వంతుగా ఏమిస్తున్నాను అనే ఆలోచనే నన్ను ఇలాంటివాటి వైపు నిరంతరం నడిపిస్తోంది’ అంటున్నారు. అభిరుచులే ఆసరాగా... ‘నాకు చిన్ననాటి నుంచి పర్యావరణం మీద ఉన్న ఇష్టంతో పేపర్ రీ సైక్లింగ్, వెజిటబుల్ అండ్ ఫ్రూట్ కార్వింగ్, మట్టి విగ్రహాల తయారీ చేసేదాన్ని. యోగా, డ్రెస్ డిజైనింగ్, డ్యాన్స్‌ల్లోనూ ప్రవేశం ఉంది. ఇప్పుడు ఎం.ఎ. చేస్తున్నాను. ఏ పని నేర్చుకున్నా అది నాతోనే ఆగిపోకూడదు. నలుగురికి పరిచయం చేయాలి అనుకుంటాను. మాకు లేడీస్ కార్నర్ షాప్ ఉంది. ఆ ఆదాయమే మా కుటుంబ పోషణ. మాకు ఓ బాబు. ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. ఇల్లు, షాప్ చూసుకుంటూనే సమయాన్ని కుదుర్చుకుని నా అభిరుచులకు పదునుపెట్టుకుంటూ, నా చుట్టూ ఉన్నవారికి శిక్షణ ఇస్తూ ఉంటాను. వీటికి మావారు సతీష్ ప్రోత్సాహం ఎంతగానో ఉంది. కర్ర పడితే... బడితె పూజే... అమ్మాయిలపై జరుగుతున్న అకృత్యాలను, దారుణాలను విన్నప్పుడల్లా ఏదో తెలియని బాధ. అలాంటి ఆవేదనేదో పురిగొల్పి... నాలుగేళ్ల క్రితం కర్రసాము నేర్చుకున్నాను. ఆ తర్వాత మా చుట్టుపక్కల అమ్మాయిలకు ఈ విద్య నేర్పిస్తే బాగుంటుందనుకున్నా. కర్రసాము మన రాష్ట్రానికే ప్రత్యేకమైన ప్రాచీన కళ. రాను రాను ఇది మరుగునపడిపోతోంది. కర్ర తిప్పడం వచ్చిన వారికి రోడ్డు మీద ఏదైనా ప్రతికూల సంఘటన ఎదురైతే ఎంత చిన్న కర్రతో అయినా తమను తాము రక్షించుకోవచ్చు. ఎదుటివారిని కూడా రక్షించవచ్చు. కర్రసాము వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంలోనూ సమతౌల్యత ఏర్పడుతుంది. నా వంతుగా పదిమంది అమ్మాయిలకైనా ఆత్మరక్షణకు పనికొచ్చే విద్యను నేర్పాలని, మాల్‌బౌలి శిశుమందిర్‌లో వారాంతంలో కర్రసాము శిక్ష ణా తరగతులు తీసుకుంటున్నా. నా దగ్గర శిక్షణ తీసుకునే అమ్మాయిలంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారే! ఇల్లిల్లూ తిరుగుతూ... మొదట్లో రోజూ ఉదయం పూట కర్రసాములో శిక్షణ ఇచ్చేదాన్ని. అమ్మాయిలు కూడా బాగా ఆసక్తి చూపేవారు. చిన్నవయసు కావడంతో వాళ్ల ఏకాగ్రత అమోఘంగా ఉంటుంది. కాని అమ్మాయిల తల్లిదండ్రులు చదువుపట్ల చూపించినంత శ్రద్ధ, కర్రసాము పై చూపించడం లేదు. దీంతో రెండు మూడు రోజులు వచ్చి, మానేసేవారు. అమ్మాయిలను సాధన కోసం రప్పించడం చాలా కష్టమవుతుంది. అలాగని వదిలేయకుండా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి ఈ విద్య గురించి, ప్రాముఖ్యత గురించి ఇప్పటికీ చెబుతున్నాను. స్టేజ్ పైన అమ్మాయిలతో కర్రసాము ప్రోగ్రామ్స్ ఇప్పించడానికైతే పెద్దయజ్ఞమే చేయాల్సి వస్తోంది. అమ్మాయిల తల్లిదండ్రుల్లో కొందరు ‘ఆడపిల్లలకు ఇదంతా ఎందుకు? అన్నట్టు కొంత చిరాగ్గా మాట్లాడుతుంటారు. బాధనిపిస్తుంది. కాని వదిలే యను. వెంటబడి మరీ ప్రోగ్రామ్‌లు ఇప్పిస్తారు. అది చూసి తర్వాత వారే సంతోషించి, మెచ్చుకుంటారు. ఇప్పటికీ చూసినవాళ్లందరూ కర్రసాము విద్యను మెచ్చుకుంటారు. కరాటేకంటే మంచి విద్య అంటారు. మా పిల్లలు కూడా నేర్చుకుంటే బాగుండు అంటారు. కాని సాధనకు పంపించడానికి వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటివరకు 30 మంది అమ్మాయిలు ఈ కళను నేర్చుకున్నారు. ఇప్పుడు మరో పదిహేను మంది శిక్షణ తీసుకుంటున్నారు. అమ్మాయిలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారు. కాని తమను తాము రక్షించుకోవడంలో మాత్రం ఇంకా వెనకబడే ఉంటున్నారు. అమ్మాయిల తల్లిదండ్రులను నేను కోరేదొక్కటే... తమకు తామే రక్షణగా ఉండేలా కూతుళ్లను తీర్చిదిద్దండి.’ - నిర్మలారెడ్డి -
మనసే జతగా: టేక్... ఓకే
లైట్స్ ఆన్ ... స్టార్ట్ కెమెరా ... యాక్షన్ ... సీన్ కంప్లీట్... ప్యాకప్! ఎవరింటికి వాళ్లు... డైరెక్టర్ ఇంటికి డైరెక్టర్. ఇంట్లో మళ్లీ ఇంకో డైరెక్షన్. మూవీ డెరైక్షన్ కాదు, ఫ్యామిలీ డైరెక్షన్. ఒకరు కాదు, ఇద్దరు డైరెక్టర్లు! ఒకర్నొకరు లీడ్ చేసుకుంటూ ఒకరి మూడ్స్ ఒకరు ఫిల్టర్ చేసుకుంటూ, ఫీడింగ్ ఇచ్చుకుంటూ పదహారేళ్లుగా... ‘ఉమ్మడి’ దర్శకత్వం! ‘మాధవిదే ప్రధానపాత్ర’ అంటారు శంకర్. ‘లేదు లేదు, ఓన్లీ సపోర్టింగ్’ అంటారామె. ఈ ఆలుమగల సమన్వయ చిత్రమే... ఈవారం ‘మనసే జతగా...’ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా చెప్పరు. కొన్నిరోజులు పోయాక తెలుస్తుంది. అలాగే ఈయనకెరియర్లో ఉండే ఒడిదొడుకులను కూడా చెప్పరు. ‘ముందే చెప్పచ్చు’ కదా అంటాను. ‘చెబితే టెన్షన్ అవుతావు, ఆ టెన్షనేదో నేనే పడతాలే’ అంటారు. - మాధవి కష్టం చెప్పకుండానే మాధవి నన్ను అర్థం చేసుకొని సపోర్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సినిమా షూటింగ్లో పాల్గొనేవారికి భోజన ఏర్పాట్ల కోసం పాట్లు పడుతుంటే అన్నిరోజులూ అందరికీ తనే దగ్గరుండి వంట చేయించింది. కాస్ట్యూమ్స్ కోసం అప్పటికప్పుడు షాపింగ్ చేసేది. - ఎన్.శంకర్ ఎన్కౌంటర్, శ్రీరాములయ్య, యమజాతకుడు, జయంమనదేరా, భద్రాచలం, ఆయుధం, రామ్, జయ్ బోలో తెలంగాణ... సినిమాల డెరైక్టర్ ఎన్.శంకర్. ‘సినిమా తీసేటప్పుడు అది పూర్తయ్యేంతవరకు అందరి బాగోగులపై దృష్టిపెడతాను. అప్పుడే ఒక టీమ్‌గా అందరి కృషి మంచి ఫలితాన్నిస్తుంది. కుటుంబంలోనూ అంతే! భార్యాభర్తలు ఒక టీమ్‌గా ఉంటేనే కుటుంబం అనే నిజ జీవిత సినిమా మంచి ఫలితాన్నిస్తుంది’అన్నారు శంకర్, ఆయన భార్య మాధవి. వీరిద్దరూ దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టి (నవంబర్ 16, 1997)16 ఏళ్లు అయ్యింది. వీరికి దినేష్, మహాలక్ష్మి ఇద్దరు సంతానం. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఉమ్మడి కుటుంబం నుంచి రెండేళ్ల క్రితం చిన్న కుటుంబంగా మారిన ఈ దంపతులు తమ జీవితానుభావాలను ఇలా వెల్లడించారు. బాధ్యతల లోగిలిలో... ఉమ్మడికుటుంబంలో భార్యాభర్తల మధ్య చోటుచేసుకునే పరిణామాలను శంకర్ వివరిస్తూ- ‘‘అమ్మ, నాన్న, ఇద్దరు తమ్ముళ్లు, చెల్లెలు... ఇంటికి పెద్ద కొడుకుగా బాధ్యతలు నిర్వర్తించడంలో సంఘర్షణ ఎక్కువే ఉండేది. పెళ్లయిన మొదట్లో ‘రేపటి పరిస్థితి ఏంటి?’ అని మాధవి తరచూ బాధపడటం గమనించాను. ‘ఇంటికి పెద్ద కొడుకు, కోడళ్లుగా మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఉన్నాయి. వాటి పైనే మనం ముందు దృష్టి పెట్టాలి. రేపు అంతా మంచే జరుగుతుంది’ అని తరచూ చెప్పేవాడిని. తనూ మెలమెల్లగా ‘నేను ఈ ఇంటికి పెద్ద కోడలిని... ఇలా ఉండాలి... ’ అని ఒక నిశ్చయానికి వచ్చింది. నాన్న చనిపోయినప్పుడు అండగా నిలిచింది. మా తమ్ముళ్ల పెళ్లిళ్లు, చెల్లెలి పెళ్లి... మాధవి ముందుండి చేసింది. ఇప్పుడు అందరూ వారి వారి కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు. బాధ్యతలను అందరూ ఒకేసారి అర్థం చేసుకోలేరు. మెల్లమెల్లగా తెలుసుకుని ముందుకు సాగడమే దాంపత్యం’ అని తెలిపారు ఈ డెరైక్టర్. సర్దుబాట్లు కేరాఫ్ సంసారం పుట్టింట్లో చిన్నకూతురుగా, నలుగురు అన్నలకు గారాల చెల్లిగా పెరిగి, అత్తింటికి పెద్దకోడలిగా వెళ్లాక చేసుకున్న సర్దుబాట్లను ప్రస్తావిస్తూ- ‘‘ఇంటి దగ్గర ఉన్నన్నాళ్లూ అమ్మ, వదినలు కాలు కింద పెట్టనిచ్చేవారు కాదు. అలాంటిది అత్తింట అడుగుపెట్టాక కొన్నాళ్లు ఉక్కిరిబిక్కిరయ్యాను. అమ్మ ఎప్పుడూ చెబుతుండేది ‘ఇంట్లో ఎన్నిసమస్యలున్నా సరే, మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి’ అని. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఉమ్మడి కుటుంబంలో ఏవో మాట పట్టింపులు వస్తూనే ఉండేవి. పెళ్లయిన మొదట్లో వాటిని ఎలా తీసుకోవాలో అర్థమయ్యేది కాదు. అలా కొన్ని సమస్యలను పుట్టింటిలో చెప్పుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఈయన షూటింగ్ అని వెళ్లిపోతే, నేను పుట్టింటికి వెళ్లడమూ ఎక్కువే ఉండేది. మెల్లగా నేనే ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలనేవి అనుభవంతో తెలుసుకున్నాను’’ అని వివరించారు హోమ్ డెరైక్టర్ మాధవి. టెలిఫోన్ ధ్వనిలా పెరిగిన చనువు ఒకచోట పెరిగిన మొక్కను తీసి మరోచోట నాటితే అక్కడి పరిస్థితులను తట్టుకుంటూ పెరగడానికి కొంత టైమ్ పడుతుంది. పెళ్లికి ముందు అమ్మాయి కూడా అంతే! అంటారు ఈ దంపతులు. తన జీవితాన్ని ఉదాహరణగా చెబుతూ మాధవి- ‘‘పదహారేళ్ల కిందట.. అమ్మ, నాన్న, అన్నయ్యలు ఈ సంబంధం బాగుంటుందని నిశ్చయం చేశారు. అప్పటికి ఇంటర్మీడియెట్ చదువుతున్న నేను నా జీవిత భాగస్వామి ‘ఇలాగే ఉండాలి’ అని లెక్కలేం వేసుకోలేదు. అయితే ఎంగేజ్మెంట్ అయినరోజు మొదలు ఈయన నుంచి ఫోన్ల తాకిడీ పెరిగింది. ముందుగా ‘ఇంతగా ఫోన్ మాట్లాడుకోవడం ఏంటి?’ అనుకున్నాను. కానీ, పోనుపోను మా మధ్య ఉన్న సందిగ్ధాలను, సందేహాలను ఫోన్ చెరిపేసింది. తరచూ మాట్లాడుకోవడం వల్ల అప్పటివరకు ఉన్న భయం స్థానంలో స్నేహం ఏర్పడింది. ఒకసారి ఈయనే ‘జీవితాంతం కలిసి ఉండబోయేవాళ్లం. ఒకరి గురించి ఒకరం ముందే తెలుసుకొని, స్నేహం పెంచుకుంటే మన బంధం ఇంకా బలపడుతుంది. అందుకే ఈ ప్లాన్’ అని చెప్పారు. నాకూ ఇది కరెక్టే అనిపించింది’’ అన్నారు ఆమె. పెళ్లి తర్వాత పని వల్ల తమ మధ్య ఏర్పడిన ఖాళీని పూరించడానికి తీసుకున్న నిర్ణయాన్ని శంకర్ చెబుతూ- ‘‘పెళ్లి అయిన మూడు రోజులకే ‘శ్రీరాములయ్య’ సినిమా సందర్భంలో కార్ బాంబ్ సంఘటన జరిగింది. ఆ సంఘటనలో మాకేం కాకపోయినా పెళ్లికాగానే ఇలాంటి సంఘటన జరగడమేంటి అని పది రోజుల దాకా మామూలు మనుషులం కాలేకపోయాం. ఆ తర్వాత కొద్దిరోజులకే నేను సినిమా షూటింగ్ అంటూ వెళ్లిపోయాను. పెళ్లయిన వాతావరణం, కార్ బాంబ్ సంఘటన వల్ల మాధవి చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీలయ్యేది. దీంతో నాతో సినిమా షూటింగ్స్‌కి రాజస్థాన్, ఢిల్లీ... ప్రాంతాలకు మాధవినీ తీసుకెళ్లాను. అది కాస్త మా ఫ్యామిలీ ట్రిప్ అయ్యింది. అప్పటివరకు కాస్త కినుకగా ఉండే ఈవిడ ప్రవర్తనలో మంచి మార్పులు చూశాను. దీంతో హమ్మయ్య అనుకున్నాను’’ అని చెబుతుంటే భాగస్వామి మనసు తెలుసుకొని భర్త ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఈ సంఘటన రుజువు చేసింది అనిపించింది. కోపం నుంచి రియలైజేషన్ కోపతాపాలు దాంపత్యం మీద చూపిన సందర్భాలు, వాటిని తమకు అనుకూలంగా మార్చుకున్న విధానాలను శంకర్ చెబుతూ-‘‘బయట ఉండే చికాకులు, కోపాలు ఎక్కడా చూపించలేక అణుచుకోవాల్సిన వృత్తి నాది. అలాంటప్పుడు ఆ కోపం మాధవి మీదకే వెళుతుంది. ఆ సమయంలో తను మౌనంగా ఉండిపోతుంది. కాసేపటికి నేను చేసిన పొరపాటేమిటో అర్థమైపోతుంది. నన్ను అర్థం చేసుకున్నది కాబట్టి మౌనంగా ఉంది. తనూ కోపగించుకుంటే ఇంటి ప్రశాంతత ఎంతగా దెబ్బతినేది, పిల్లలు ఎంత డిస్టర్బ్ అయ్యేవారు అని నాకు నేనే రియలైజ్ అవుతుంటాను’’ అన్నారు. కలల కుటీరం భవిష్యత్తు పట్ల తన తపనను మాధవి తెలియజేస్తూ- ‘‘రెండేళ్లుగా వ్యవసాయం మీద ఎక్కువగా మనసు పోతోంది. కొంచెం భూమి కొనుక్కొని, కూరగాయలు, పూల తోటలు పెట్టాలి, పిల్లలకు ప్రకృతిని పరిచయం చేయాలని చాలా ఆసక్తిగా ఉంది. ఆ విషయంలోనే ఈ మధ్య పోరుతూ ఉన్నాను. కాని వినీవిననట్టుగా ఉంటున్నారు’’ అని ఆమె కంప్లయింట్ చేస్తున్న ధోరణిలో ఉంటే - ‘‘ఆర్థికంగా అన్నీ అమరినప్పుడే ఇలాంటి కలలు సాకారం చేసుకోగలం. అంత తొందరపడవద్దు’ అని సర్దిచెబుతుంటాను’’ అన్నారు శంకర్. ‘భవిష్యత్తులో ఇలా ఉండాలి, అలా ఉండాలి’ అని కలలు కనడంలో గృహిణిగా భార్య ఒకలా ఆలోచిస్తే, ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ వాస్తవానికి దగ్గరగా అనిపించారు శంకర్. ‘లవ్, అరేంజ్... ఏ తరహా పెళ్లి అయినా నిత్యం ఎవరికి వారు తమని తాము రీ షేప్ చేసుకుంటూ ఉండాలి. వృత్తిలో ఎదిగే క్రమంలోనే బయట ఎవరెవరి దగ్గరో ఎన్నో సర్దుబాట్లు చేసుకుంటాం. అలాంటిది ఇంట్లో భార్యాభర్తల బంధం బాగుండాలంటే ఇంకెన్నో సర్దుబాట్లు చేసుకోవాలి. తప్పదు. కొంత కన్విన్స్, మరికొంత కాంప్రమైజ్ అయినప్పుడే ఆ బంధం నుంచి మంచి ఫలితాలు వస్తాయి. అందుకు ఇద్దరిలోనూ ఆ బంధాన్ని కాపాడుకోవాలనే తలంపు, ఎదురుచూసే సహనం ఉండాలి’ అని తెలిపారు శంకర్, మాధవి. మూడుముళ్ల బంధం ముచ్చటగా సాగాలంటే కన్విన్స్, కాంప్రమైజ్ కంపల్సరీ అని తమ జీవితానుభవాల ద్వారా స్పష్టం చేశారు ఈ జంట. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి