చేనేత గురించి చెబుతుంటే నా హృదయం ఉప్పొంగేది | Dr Sharmila Nagaraj Nandula Worked For Handlooms | Sakshi
Sakshi News home page

Sharmila Nagraj Nandula: చేనేతకు కళలద్దింది

Published Wed, Aug 25 2021 12:22 AM | Last Updated on Thu, Aug 26 2021 7:13 PM

Dr Sharmila Nagaraj Nandula Worked For Handlooms - Sakshi

డాక్టర్‌ షర్మిలా నాగరాజ్

చేనేత ఉత్పత్తులలో నాణ్యతను కాపాడటం.. చేనేతల్లో జనాకర్షణీయ పద్ధతులు తీసుకురావడం.. చేనేత కార్మికుల వారసులను తిరిగి వారి వృత్తి వైపుగా మళ్లించడానికి కృషి చేస్తున్నారు డాక్టర షర్మిలా నాగరాజ్‌ నందుల. తెలంగాణ రాష్ట్రంలో చేనేత అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వ్యక్తు లలో ‘ప్రముఖ వ్యక్తి’ పురస్కారం ఈ యేడాది డాక్టర్‌ షర్మిలా నాగరాజ్‌ అందుకున్నారు. హైదరాబాద్‌ వాసి అయిన ఈ హ్యాండ్లూమ్‌ లవర్‌ హారోస్కోప్‌ వీవింగ్, వర్డ్స్‌ వీవింగ్, సహజరంగులు, పాత సాంకేతిక నైపుణ్యాలతో చేనేతల అభివృద్ధికి పాటుపడుతున్నారు. ‘నెలలో ఒక్కరోజు అందరం ఖాదీ ధరిద్దాం. చేనేతల వృద్ధికి పాటుపడదాం’ అంటున్నారు. 

అమెరికా వాసి బోనీ టెర్సెస్‌తో కలిసి చేసిన హారోస్కోప్‌ టెక్నిక్స్‌

నేత కార్మికుల ప్రాచీన సాంకేతిక వ్యవస్థ, లెక్చరర్‌గా విద్యార్థులకు తన అనుభవాలను పంచడం వంటి అంశాల్లో దాదాపు 30 సంవత్సరాల అనుభవం షర్మిలా నాగరాజ్‌ సొంతం. పదేళ్లపాటు నిఫ్ట్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌  టెక్నాలజీ)లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధులను నిర్వర్తించిన షర్మిల తన టీనేజ్‌ నుంచే చేనేతలపై పెరిగిన మక్కువ గురించి ఈ విధంగా వివరించారు.
 
‘‘చిన్నతనంలో అమ్మ నుంచి నేర్చుకున్న చేనేతల రీసైక్లింగ్‌ మెథడ్స్‌ కూడా నన్ను ఈ వైపుగా నడిపించేలా చేశాయి. ఎమ్మెస్సీ చేసేటప్పుడు మా లెక్చరర్‌ తన నేత దుస్తులు, అందులో వాడే టెక్నిక్స్‌ గురించి చెబుతున్నప్పుడు నా హృదయం ఉప్పొంగేది. ఆ ఇష్టమే హ్యాండ్లూమ్స్, నేచరల్‌ డైస్‌ మీద పీహెచ్‌డీ వైపుగా నడిపించిది. పదేళ్ల పాటు అమెరికాలో కోల్డ్‌వాటర్‌ క్రీక్, కోహ్ల్సి రీటైలర్‌లతో కలిసి పనిచేసే అనుభవాన్ని తెచ్చిపెట్టింది. 

పరిశోధనల వైపుగా..
పరిశోధనల్లో భాగంగా చేనేతలు, వాటి సహజరంగులు ఆరోగ్యానికి మేలు చేసేవిధానంపై ఐదేళ్ల పాటు విస్తృత పరిశోధనలు చేశాను. దీంతో మన ప్రాచీన పద్ధతులు, పాత సాంకేతిక నైపుణ్యాల పట్ల చాలా ఇష్టం ఏర్పడింది. చేనేతలను ధరించడం వల్ల వచ్చే శక్తి గురించి తెలిసింది.


హారోస్కోప్‌ వీవింగ్‌
గ్రహాల పనితీరు మన జీవన విధానంపై ఎలా ఉంటుందో తెలియజేసే శాస్త్రం జ్యోతిష్యం. అమెరికాలో ఉన్నప్పుడు శ్రీమతి బోనీ టెర్సెస్‌ అనే ఆవిడ పరిచయమయ్యింది. ఆమె సూర్యరాశుల ఆధారంగా తన హ్యాండ్లూమ్స్‌ను స్వయంగా డిజైన్‌ చేసేవారు. ప్రతి మనిషికీ నక్షత్రాలు, గ్రహాల స్థితిని అనుసరించి వారికి నప్పే రంగులను కలుపుతూ బట్టలను నేసేవారు. ఆ నైపుణ్యాలను శ్రీమతి బోనీ నుండి నేర్చుకున్నాను. చేనేతల్లో ఫ్యాషన్‌–ఆస్ట్రాలజీ తీసుకురావాలనే ఆలోచనతో హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత నా డిజైన్స్‌లో ఆ టెక్నిక్స్‌ ప్రవేశపెట్టాను. అలాగే, థెరప్యూటిక్‌ వీవింగ్‌  కూడా. అంటే చేనేతలను ధరిస్తే మనకు వచ్చే పాజిటివ్‌ శక్తి, మనలో సంతోషం ఎంత పెరుగుతుందో అనే అంశాల్లో కూడా పరిశోధనలు చేశాను. పదాలను ఉపయోగిస్తూ చేసే వర్డ్‌ వీవింగ్‌కు సంబంధించిన టెక్నిక్స్‌ కూడా ఇందులో తీసుకుచ్చి, నేత కారులచే వర్క్‌షాప్‌లను ఏర్పాటు చేశాను. ‘గిరిజనుల కాస్ట్యూమ్స్‌లో మారుతున్న ట్రెండ్స్‌’పై మాస్టర్‌ థీసిస్‌ చేశాను. 

కౌముది స్టూడియో.. 
త్రిబుల్‌ ఆర్‌ ప్రాతిపదికన నడుస్తుంది కౌముది. రిస్టోర్, రిట్రివ్, రిసాల్వ్‌.. జాతీయ హస్తకళలను పునరుద్ధరించడం, చేనేత కార్మికులను పునరుజ్జీవింపచేయడం, చేనేత దుస్తుల కళను నిలుపుకోవడం.. ఈ మూడింటివైపుగా అభివృద్ధి చేయడానికి కౌముది స్టూడియోను ఆరేళ్ల క్రితం ఏర్పాటు చేశాను. 

బలమైన కారణం
చేనేత కార్మికుల పరిస్థితులే నేనీ రంగంలో రావడానికి ప్రధాన కారణం. ప్రతి రంగంలోనూ మనం చాలా అభివృద్ధి సాధిస్తున్నాం. కానీ, చేనేత కార్మికుల విషయం వచ్చేసరికి ఇంకా వెనుకంజలోనే ఉన్నాం. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, డిజైనర్లు చేనేతలను తీసుకుంటున్నారు. కానీ, వారి జీవితాల్లో సరైన వృద్ధి లేదు. నెల వారి వేతనం ఎంత అనేది ఇప్పటికీ నిర్ధారణ లేకపోవడం కూడా ఒక కారణం. మన దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఆయా ప్రాంతానికి తగ్గ కళ ఉంది. కలంకారీ, బాతిక్, గుజరాతీ ప్రింటర్లు ఉన్నారు. వారిని బృందాలుగా ముందుకు తీసుకెళ్లాలనేది నా ఆలోచన. 

అల్మరాలో 25 శాతం..
నా బట్టల అల్మరాలో పూర్తిగా హ్యాండ్లూమ్స్‌ మాత్రమే ఉంటాయి. మనం చెప్పేది ఆచరణలో పెడితేనే దానిలో వృద్ధి కనపడుతుందని నా నమ్మకం. అలాగే, ఎక్కడ వర్క్‌షాప్స్‌ పెట్టినా అందరికీ ఒకటే మాట చెబుతుంటాను. ‘మీ బీరువాల్లో 25 శాతం చేనేతలకు స్థానం ఇవ్వండి’ అని. విద్యార్థిగా ఉన్నప్పుడు టెక్స్‌టైల్స్‌ ఆఫ్‌ ఇండియా మొత్తం తిరిగాను. కశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు గుజరాత్‌ నుండి వెస్ట్‌ బెంగాల్‌ వరకు అన్ని చోట్లా హ్యాండ్లూమ్స్‌ ఉన్నాయి. వీరంతా వృద్ధిలోకి రావాలంటే మన చేనేతలను మనం ధరించాలి. దీంతో పాటు విదేశాలకూ మన కళలను విస్తరింపజేయాలన్నది నా కల. చేనేతల నుంచి దూరమైన పిల్లలను తిరిగి చేనేతలకు దగ్గర చేయాలన్నదే నా ఆలోచన’’ అని వివరించారు డాక్టర్‌ షర్మిలా నాగరాజ్‌ నందుల. చేనేతల్లో వాడే రంగులు సహజసిద్ధమైనవి. ఆకులు, విత్తనాలు, పువ్వులు, బెరడు, వేళ్ల నుంచి వాటిని తీస్తారు. వీటి వల్ల చేనేతకారుడే కాదు రైతు కూడా బాగుపడతాడు. ఫలితంగా పర్యావరణమూ బాగుంటుంది అనే ఆలోచనను మన ముందుంచారు ఈ చేనేత ప్రేమిక.
– నిర్మలారెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement