‘దేవుడు అన్నిచోట్లా ఉండలేక..’ అని మనకో స్త్రీ–స్తుతి ఉంది. అన్నిచోట్లా ఉండలేక ఆ భగవంతుడు స్త్రీని సృష్టించాడని! నిజమే. ఈ పన్నెండు నెలలూ స్త్రీ చాలా చోట్ల ఉండవలసి వచ్చింది. ఏం చేస్తుంది మరి?! దేవుడు పరుగులు తీయలేకపోయాడు. ఆమెకంటే అధికుడిననుకునే మానవుడు ‘నేనూ అన్నిచోట్లా ఉండలేను’ అనేశాడు! ఇక ప్రతి చోటా స్త్రీనే. పనిగంటలు పెరిగిన వంటిళ్లలో అన్నపూర్ణమ్మగా.. చెత్త పేరుకుపోతున్న వీధులలో పారిశుధ్య ప్రాణదాతగా.. ఊరెంతకీ రాని ఎండ దారుల్లో వలసమాతగా.. ఊపిరులు పోస్తున్న ఆసుపత్రులలో అమృతమయిగా; ఇంటింటా గడపల్లో, ఊరూరా కూడళ్లలో ఒక్కర్నీ బయటికి రానివ్వని రక్షణనేత్రిగా ప్రతిచోటా స్త్రీనే.
అన్నమూ నీళ్లిస్తూ హైవేలలో, ఉన్నదేదో పంచి ఇస్తూ చుట్టుపక్కల్లో, విరుగుడు కనిపెడుతూ లేబరేటరీల్లో.. మనిషి ఆశ, ఆయువు తనే అయి, తిరగడం ఆగబోతున్న గ్లోబుకు గ్లూకోజ్ అందించి తిరిగే వేగాన్ని పెంచిందీ, మానవ జీవనాన్ని మళ్లీ గాడిలో పెట్టిందీ స్త్రీనే. ఎంత శక్తి, ఎంత ఓర్పు, ఎంత నేర్పు, ఎంత నిబ్బరం, ఎంత త్యాగం.. దేవుడు కూడా ఆశ్చర్యపోయి ఉంటాడు స్త్రీలోని తన ప్రతిరూపాన్ని ఇంత మల్టీటాస్కింగ్‌లో చూసి! ఐక్యరాజ్య సమితి కూడా అలాగే స్టన్ అయింది. ‘వ్వావ్ షి ఈజ్ ద లీడర్’ అంది! భద్రమైన భావి సమాజ నిర్మాణానికి మహిళే లీడర్ అని ప్రకటించింది. అటువంటి కొందరు లీడర్స్‌కి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి ‘ఫ్యామిలీ’ నమస్సులు తెలియజేస్తోంది. నమో నమామి మహిళామూర్తి.. మానవీయ స్ఫూర్తి.
క్యాన్సర్ రోగుల చివరి మజిలీకి ‘స్పర్శ్’ ద్వారా స్వస్థత కలిగిస్తున్న శారద లాక్‌డౌన్ టైమ్‌లో అందించిన సేవలు, ధైర్యం, టీమ్ లీడింగ్ అసమానమైనవి. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఈ స్వస్థత ఆలయంలోకి అడుగు పెడితే అక్కడ కనిపించే దృశ్యాలు మనసును తడి చేస్తాయి. ‘కరోనా కష్టం సామాన్యమైనది కాదు. కానీ, ఎదుర్కోవాల్సిందే అనుకున్నా’ అంటూ లాక్‌డౌన్ టైమ్‌ని వివరించారు శారద. ‘‘లాక్‌డౌన్ ప్రకటించగానే మనల్ని మనం రిస్క్‌లో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా.. అనే దశ నుంచి ఆలోచించాను. ‘నేనే ఇలా భయపడితే... రేపో మాపో చనిపోతామని తెలిసిన వాళ్లని వదిలేయచ్చా..’ అనిపించింది. దాంతో నాకేదో వస్తుందేమో అనే ఆలోచననే మానేశాను.
ధైర్యంగా ముందడుగు
నాతో పాటు నలుగురు నర్సులు, ఐదుగురు ఆయాలు క్లినిక్‌లో, బయట వాలంటీర్లు పని చేస్తున్నారు. అందరికీ కరోనా ఏ రూపంలో వస్తుందో అనే భయం. టీమ్ లీడర్‌గా జాగ్రత్తలు తీసుకుంటూ ధైర్యమిస్తూ ముందుకు తీసుకెళ్లడం పెద్ద టాస్క్. ‘మా అమ్మగారు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. మాకేం చేయాలో తెలియట్లేదు’ అంటూ విదేశాల్లో ఉండిపోయి రాలేకపోయిన పిల్లల అభ్యర్థన. అలాంటి తల్లులకు, తండ్రులకు దాదాపు 30 ఇళ్లకు వెళ్లి సేవలు అందించాం. ఇంత మంది చనిపోయారు అని రోజూ సాయంత్రం హెల్త్ బులెటెన్.. ‘మాక్కూడా కరోనా వస్తుందా? చనిపోతామా’ అనేవారు పేషెంట్లు. వారిలో మనోధైర్యం నింపడానికి ప్రతి క్షణం పనిచేశాను.
అంతిమయాత్ర మరో రిస్క్
మరణించినవారికి గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన సమయంలో ఒంటరిగా అంతిమయాత్ర కు వెళుతున్నారని వార్తలు. అలాంటిది క్యాన్సర్ పేషంట్ చనిపోతే.. అదో పెద్ద కష్టం. చనిపోతున్న తల్లికి బిడ్డలు కూడా రాలేని పరిస్థితి. విపరీతమైన క్షోభ. నెల రోజులు, రెండు నెలలు, 15 రోజుల వ్యవధిలో చనిపోయిన వారున్నారు. మనుషుల భావోద్వేగాలకు సంబంధించిన సేవ ఇది. ‘ఒకబ్బాయి ఇసిఐఎల్ నుంచి బంజారాహిల్స్‌లో మా క్లినిక్‌కి వాళ్లమ్మ కోసం రోజూ ఉదయం నడుచుకుంటూ వచ్చేవాడు. వాళ్లమ్మది చివరి స్టేజ్. అతను అమ్మకు దగ్గరగా ఉండలేడు. అంత దూరం నుంచి ఎందుకు రిస్క్.. అంటే మీ ద్వారా మా అమ్మ గురించి వినడానికైనా ఇక్కడుంటాను కదా! అనేవాడు. అలా చివరి మజిలీ పేషెంట్స్ 11 మంది ఉండేవారు. వాళ్ల పిల్లలతో వీడియో కాల్ చేసి మాట్లాడించేవాళ్లం.
అడ్డు చెప్పద్దని అడ్డుకున్నాను
నాకు 57 ఏళ్లు. మా వారు అమ్మాయిని చూడటానికని అమెరికా వెళ్లి, లాక్‌డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయారు. ఇక్కడ నేనొక్కదాన్నే. ఈ వయసు వారికి కరోనా త్వరగా ఎఫెక్ట్ అవుతుందన్న వార్తలు. మా వారు, అమ్మాయి నుంచి ఫోన్లు. కరోనా కాలం ఈ సేవలు ఆపేయమని. ‘కష్టకాలంలో ఆపేస్తే నన్ను నేను క్షమించుకోలేను, అడ్డుచెప్పద్దు’ అన్నాను.
కళ్లతో ప్రేమను పంచుతూ..
స్పర్శ అనేది శక్తిమంతమైన విధానం. ఆ స్పర్శనే వద్దనేది కరోనా నినాదం. చాలా కఠినమైన సందేశం. కళ్లతో ప్రేమను చూపుతూ, మాటల్లో ధైర్యం చెబుతూ కదిలాం. కోవిడ్ సమయంలో 24 గంటలు సేవలో ఉన్నా మాలో ఎవరికీ కోవిడ్ రాలేదు. అదంతా మా సంకల్పమే. కష్టకాలంలోనూ చివరిమజిలీకి చేరుకున్నవారికి చేయూత అందించాను అనే తృప్తి మిగిలింది’’ అని శారద వివరించారు.
క్యాన్సర్ ఇక చికిత్సకు తగ్గదని నిర్ధారించిన పేషంట్లను పాలియేటివ్ కేర్‌కు రిఫర్ చేస్తారు వైద్యులు. అలా వచ్చిన వారు కుటుంబం నుంచి దూరమయ్యామనే బాధ, నొప్పి, సామాజికం గా దూరం, ఆర్థిక సమస్యలతో పాటు ఆధ్యాత్మికంగానూ ఎన్నో బాధలు ఉంటాయి. ‘నేనేం తప్పు చేశాను. భగవంతుడా నాకెందుకీ శిక్ష వేశావు’ అని మధనపడుతుంటారు. అలాంటి వారికి స్పర్శ్‌లో స్వస్థత అందుతుంది. ఇక్కడ పేషంట్లను బతికున్నన్ని రోజులు భద్రంగా చూసుకునే ఆలయం. అలాంటి వారి మీద కరోనా పిడుగు పడినప్పుడు అండగా నిలిచారు శారద.
ఊహించని కష్టం వచ్చిపడినప్పుడు ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియని కష్టంలో ఉన్నప్పుడు చివరి మజిలీలో ఉన్న తల్లికి అసహాయ స్థితిలో ఉన్న బిడ్డకు వారధిగా నిలిచారు శారద లింగరాజు.
డాక్టర్ దణ్ణం పెట్టారు
చిత్తశుద్ధితో సేవచేసిన వైద్యదూత
మా ఆస్పత్రిని కోవిడ్ నోడల్ సెంటర్‌గా ప్రకటించారు. ప్రాణభయంతో వణికిపోతున్న కరోనా బాధితులకు సేవలు అందించడమే మహాభాగ్యం అనుకున్నా. తొమ్మిది నెలలపాటు అలుపెరుగకుండా పనిచేశాం. పీపీఈ కిట్ లోపల చెమటకు చీమలు కుట్టినట్లు శరీరమంతా చురుక్కుమనేది. నాలుక పిడచకట్టుకు పోతున్నా, డీహైడ్రేషన్‌తో చుక్క నీళ్లు కూడా తాగే అవకాశం లేదు. పంటిబిగువున అన్నిబాధలను భరిస్తూ డ్యూటీ చేశాం. కరోనా ఏడాదిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. గతేడాది మార్చిలోనే గాంధీలో మొదటి కరోనా మృతి నా ఎదురుగానే అయింది. ఆయనను కాపాడేందుకు వైద్యులు, సిబ్బంది తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు.
అప్పటినుంచి ప్రతి పేషెంట్‌కీ వైద్యసేవతోపాటు కౌన్సెలింగ్ ఇచ్చి మనోధైర్యం కల్పించే వాళ్లం. పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రి గైనకాలజిస్టు కరోనాతో గాంధీలో చేరింది. డిశ్చార్జ్ అయి వెళ్తూ ఆమె రెండు చేతులెత్తి నమస్కరించడం నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. వేలాది ప్రాణాలకు కాపాడడంలో మా సేవ ఉందని సంతృప్తి ఉంది. భారత సైనికదళాలు... గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిపై పూలవర్షం కురిపించిన తర్వాత... స్థానికులు, కుటుంబ సభ్యులు నాపై పూలవర్షం కురిపించి అభినందించడాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. వేలాది మంది కరోనా బాధితుల మధ్య విధులు నిర్వహించినా కరోనా రాకపోవడం నిజంగా అదృష్టమే.
జోజి కే అలెక్స్, స్టాఫ్‌నర్సు, గాంధీ హాస్పిటల్
సేవకు ఏటీఎమ్
స్ఫూర్తి
జీవనంలో పేదరాలే కానీ, సేవలో సంపన్నురాలు అనిపించుకుంది ఎల్‌బినగర్ రాక్‌హిల్స్ కాలనీకి చెందిన లక్ష్మమ్మ. ఒక అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేసే లక్ష్మమ్మ నెల జీతం ఆరువేల రూపాయలు. లాక్‌డౌన్ టైమ్‌లో అందులో సగం డబ్బును ఖర్చుపెట్టి, వలసకార్మికుల కోసం ఆహారం వండిపెట్టేది. ఆమె చేసిన సేవ మరికొందరికి స్ఫూర్తినిచ్చింది. లాక్‌డౌన్ సమయంలో చేసిన పని గురించి అడిగితే ‘కష్టం చూడలేక తోచిన సాయం చేశాను’ అని తెలిపింది.
వలసకార్మికులకు వండి పెడుతూ...
‘‘నేను పనిచేసే అపార్ట్‌మెంట్‌లో పది ప్లాట్లు ఉంటాయి. ఉన్న ఊరు వదిలిపెట్టి బతుకుతెరువు కోసం పట్నం వచ్చినం. రెక్కల కష్టంతో గడుపుకొస్తున్నం. కరోనా భయంతో ఎవరూ ఇళ్లు వదిలిపెట్టి రాలేని పరిస్థితి. మేమూ అదే పాటించేవాళ్లం. అయితే, మా చుట్టుపక్కల బిల్డింగ్ పనులు చేసేవారు కొందరున్నారు. వారంతా వలస వచ్చి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. అందులో పిల్లలు, చంటి పిల్లల తల్లులూ ఉన్నారు. బిల్డింగ్‌ల పనులు ఆగిపోవడంతో వారికి పనిలేదు, చేతిల పైసలు లేవు. వారి అవస్థలు చూడలేక రోజూ కొంతమందికి అన్నం వండి పెట్టేదాన్ని’ అని తన దయార్ద్ర మనసును చాటుకుంది లక్ష్మమ్మ.
ఒక అడుగుతో కదిలిన వేయి అడుగులు
లక్ష్మమ్మ చేస్తున్న సాయాన్ని స్ఫూర్తిగా తీసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాము రైస్ ఏటీఎమ్‌ను ఏర్పాటు చేసి, ఇప్పటికీ పేదలకు సాయం అందిస్తున్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచడం కోసం మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని 80 మంది మహిళలకు కుట్టుమిషన్లు పంచుతున్నారు. లాక్‌డౌన్ టైమ్ నాటి సంఘటనలను, తనలో స్ఫూర్తిని నింపిన లక్ష్మమ్మ గురించి వివరించిన రాము దోసపాటి మాట్లాడుతూ –‘ఒక రోజు మా అబ్బాయి కోసం చికెన్ షాప్‌కి వెళితే, అక్కడ 20 కేజీల చికెన్ తీసుకుంటున్న లక్ష్మమ్మను చూశాను. ఈ సమయంలో అంత చికెన్ ఎందుకని అడిగాను. ‘వలస కార్మికులు తిండి లేక అవస్థపడుతున్నారు సారు. వారి కోసం వండిపెడుతున్నాను. చాలా ఆశ్చర్యపోయాను. ఆమె చేస్తున్న సేవను స్ఫూర్తిగా తీసుకున్నాను. ఆమె చెప్పిన వివరాలతో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో భవన నిర్మాణ, వలసకార్మికులు ఎంతమంది ఉన్నారో చూశానో. వారి దయనీయ పరిస్థితికి కళ్లలో నీళ్లు వచ్చాయి. రైస్ ఏటీఎమ్ ద్వారా పేదలకు ఇప్పటికీ సాయం చేస్తున్నాను’ అని తెలిపారు.
మనసెరిగిన నేస్తం
చేయూత
ఫ్యాషన్ డిజైనర్‌గా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి నేను సైతం అంటూ ముందడుగు వేసింది నిహారికారెడ్డి. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడాలో తన డిజైనర్ స్టూడియో ద్వారా 15 మందికి ఉపాధి కల్పిస్తోంది. లాక్‌డౌన్ సమయంలో తన దగ్గర పనిచేసే వారిని వారి ఊళ్లకు, ఇళ్లకు చేర్చడమే కాకుండా చేనేత రంగానికి తన వంతు సాయం చేయడానికి ముందుకు కదిలింది. నిత్యావసర సరుకుల పంపిణీలో మరొక అడుగు ముందుకు వేసి అమ్మాయిలకు శానిటరీ న్యాప్‌కిన్స్ పంచింది.
‘‘మా వారు కణ్ణన్ సినిమా రంగంలో ఉన్నారు. ఓ రోజు మా ఇంటికి నెలకు సరిపడా సరుకులున్న బ్యాగ్ వచ్చింది. చిరంజీవిగారు అందరికీ సరుకులు పంచారని తెలిసింది. అది చూశాక ఇలాంటి పాకెట్స్ నిరుపేదలకు అందివ్వాలనే ఆలోచన వచ్చింది. దాంతోపాటు అమ్మాయిలు, అమ్మలు గుర్తుకువచ్చారు. వారి కోసం శానిటరీ ప్యాడ్స్ కొనుగోలు చేసి, సరుకులతో పాటు అందించాం. మా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో పేద ఇళ్ల ముందుకు తీసుకెళ్లి మేం సిద్ధం చేసిన ప్యాకెట్స్ పెట్టి వచ్చాం.
చేనేతకు చేరువగా..
నేను డిజైనర్ కావడంతో చేనేత కార్మికుల పరిస్థితి లాక్‌డౌన్ టైమ్‌లో ఎలా ఉందో ఊహించగలను. చీరలు అమ్ముడు పోకపోతే డబ్బు చేతికి రాదు, వారి రోజువారి జీవనం కష్టమైపోతుంది. అందుకే పర్మిషన్ తీసుకుని నేరుగా నారాయణపేట్ చేనేతకార్మికుల దగ్గరకు వెళ్లి వారి నుంచి మెటీరియల్ కొన్నాను. ఫేస్‌బుక్ లైవ్ ప్రోగ్రామ్స్ చేశాను. వారి స్థితి చూసి, కొంతమంది ఆర్డర్ మీద అప్పటికప్పుడు ఆ చీరలను తెప్పించుకున్నారు. లాక్‌డౌన్ టైమ్‌లో కొన్న చేనేతచీరలతో ఇప్పుడు రీక్రియేషన్ డిజైన్స్ చేస్తున్నాను.
బంగారం తాకట్టు
నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లు అందివ్వడానికి అప్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ ఇందుకు సంబంధించిన డబ్బును షాపుల్లో కడుతున్నాను. నా సేవకు మిత్రులు కొంత సాయంగా నిలిచారు. అయినా డబ్బు సరిపోక పోతే నా బంగారం పై లోను తీసుకున్నాను. దీంతో సరుకుల పంపిణీ కార్యక్రమం ఒక యజ్ఞంలా నడించింది. కరోనా సమయంలో సేవలు అందించినందుకు గాను చిరంజీవిగారి చేతుల మీదుగా కరోనా వారియర్ అవార్డు అందుకున్నాను. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింద’ని వివరించారు.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment