ఆశయం మంచిదే కావచ్చు... అది ఆచరణాత్మకం అవునో కాదో చూసుకోవడం ముఖ్యం. ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకోవడం మరీ ముఖ్యం. కోవిడ్–19కు జన్మస్థానంగా అపఖ్యాతి పాలైన అగ్రరాజ్యం చైనా అక్కడే విఫలమైంది. ఆ దేశం తలకెత్తుకున్న ‘జీరో కోవిడ్ పాలసీ’ తలవంపులు తెచ్చిపెడుతోంది. దేశంలో ఒక్క కోవిడ్ కేసూ లేకుండా ఉండేలా, ప్రతి కేసునూ తీవ్రంగా పరిగణించాలంటూ... ఎడతెగని లాక్‌డౌన్లు, ప్రజాజీవితంపై కఠోర నిర్బంధాలు విధిస్తున్న ఈ మతి లేని విధానం సహజంగానే చైనీయుల్లో అసహనాన్ని పెంచిపోషిస్తోంది. వివిధ ప్రాంతాల్లో ప్రజలు పెద్దయెత్తున నిరసనకు దిగడం, దేశాధినేత జిన్‌పింగ్ గద్దె దిగాలని నినదించడం దాని ఫలితమే. అయితే, కరోనా సమస్య పరిష్కారానికీ, ప్రభుత్వ విధానాన్ని సరిదిద్దుకొనేందుకూ ప్రయత్నించక పోగా, నిరసనల అణచివేతపై పాలకులు దృష్టి పెట్టడమే శోచనీయం.
ఉరుమ్‌కీలో బహుళ అంతస్థుల భవన అగ్నిప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోవడం తాజా నిరసనలకు ప్రేరేపించింది. ‘జీరో కోవిడ్ పాలసీ’లో భాగంగా 109 రోజులుగా ఆ నివాసం లోని వారందరినీ ఇంట్లోనే నిర్బంధించారు. ఇళ్ళకు తాళాలు వేసి మరీ ప్రభుత్వం కోవిడ్ నిర్బంధాల వల్లే అగ్నిప్రమాదంలో అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారని ప్రజాగ్రహం పెల్లుబుకింది.
దేశ రాజధాని బీజింగ్, వాణిజ్య రాజధాని షాంఘైలలో ఆదివారం శాసనోల్లంఘన ఉద్యమం సాగింది. కోవిడ్ జన్మస్థానమైన ఊహాన్‌కు సైతం నిరసన సెగ తగిలినా, ప్రభుత్వ వర్గాలు క్షేత్రస్థాయిలో అంతా బాగుందంటున్నాయి. వాస్తవాల్ని నివేదించడానికి ప్రయత్ని స్తున్న విదేశీ విలేఖరులను తిట్టి, కొట్టి, తిప్పలు పెడుతుండడం మరీ దారుణం. దేశంలో సెన్సార్‌షిప్‌తో చైనీయులు నినాదాలేమీ లేకుండా, తెల్ల కాగితాలు, తెలుపు బోర్డులు పట్టుకొని, నిరసన తెలియజేయాల్సి వస్తోంది.
కోవిడ్ వచ్చినప్పుడు 2020లో రికార్డు సమయంలో తాత్కాలిక భారీ ఆసుపత్రులను కట్టి, ప్రపంచం తలతిప్పి చూసేలా చేసిన ఘనత చైనాది. తీరా ఇప్పుడు అదే అగ్రరాజ్యం దిక్కుతోచని స్థితిలో పడింది. మరుగుదొడ్లను సైతం తాత్కాలిక క్వారంటైన్ శిబిరాలుగా మార్చి, జనాన్ని అందులో ఖైదీల కన్నా నీచంగా చూస్తున్న అపకీర్తిని మూటగట్టుకుంది.
ఇప్పటికీ చైనాలో 50కి పైగా నగరాలు, పట్నాల్లో జనం కొన్ని వారాలుగా లాక్‌డౌన్లతో ఇంటికే పరిమితమయ్యారు. అయినా, మునుపెన్నడూ లేనంతగా రోజూ 40 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయంటే ‘జీరో కోవిడ్’ విధానం ఒక విఫల ప్రయోగమని అర్థమవుతూనే ఉంది. మహమ్మారిపై గత మూడేళ్ళుగా అనుసరిస్తున్న అవకతవక విధానాలతో లాక్‌డౌన్లు, నిర్బంధాలు నిత్యకృత్యమయ్యాయి. జనజీవనంతో పాటు ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. సాధారణ జీవితం సాగించాలని ప్రాథేయపడుతున్న జనంలోని వీధినపడ్డ అసహనం అర్థం చేసుకోదగినదే.
జీవితకాలం చైనాకు తిరుగులేని నేతగా ఇటీవలే కొత్త అధికారాలు సంతరించుకున్న జిన్‌పింగ్ నెల తిరిగేసరికల్లా ఎదురైన ఈ యాంటీ కోవిడ్ నిరసనలతో జీరో కోవిడ్ పాలసీని సరళీకరిస్తారా అన్నది ప్రశ్న. ఇవి రాజకీయ నిరసనలుగా మారుతుండడం సవాలే. విద్యార్థుల సారథ్యంలోని 1989 నాటి తియానన్మెన్ స్క్వేర్ ప్రజాస్వామ్య ఉద్యమం తర్వాత మళ్ళీ అలాంటి నిరసనలు కొందరి మాట.
అప్పట్లో దాన్ని ఆర్మీతో అణిచేసిన అనుభవం ఉండనేవుంది. పైపెచ్చు, అంతర్గత సమస్యలు తలెత్తినప్పుడల్లా సరిహద్దుల్లో ఏదో ఒక రచ్చతో చైనీయుల్లో జాతీయవాదం రగిల్చి, అంతర్జాతీయ దృష్టి అంతా కొత్త అంశంపై మళ్ళేలా చేయడం డ్రాగన్ వ్యూహం. కనుక భారత్ అప్రమత్తం కావాలి.
నియంతలు ప్రజాకాంక్షలకు విలువనివ్వడం కలలో మాటే. అలాగని చైనీయులు కళ్ళు తెరిచి చూస్తుంటే, మిగతా ప్రపంచం కోవిడ్‌ను దాటి ముందుకుపోతోంది. పొరుగునే ఉన్న తైవాన్‌లో తప్పనిసరి మాస్కుల నిబంధనను సైతం తప్పిస్తుంటే, తమ వద్ద తీవ్ర ఆంక్షలు వారిని ఉక్కపోతకు గురిచేస్తున్నాయి. ఫుట్‌బాల్ ప్రపంచ కప్ వేదిక సహా అన్నిచోట్లా వేలాది జనుల ఉత్సాహం వారికి కరోనా నిర్బంధరహిత జీవితంపై కోరిక రేపుతోంది.
మిగతా ప్రపంచమంతా కరోనా నుంచి బయట కొచ్చేస్తున్నా, చైనా వేలకొద్దీ కరోనా కేసులతో కల్లోలం కావడానికి కొత్త వేరియంట్‌తో పాటు నిర్వ హణలోపాలూ కారణం. చైనాలో ఇప్పటికీ 80 ఏళ్ళు పైబడినవారిలో సగం మందికే ప్రాథమిక కరోనా టీకాకరణ జరిగింది. ఇక, బూస్టర్ డోస్ తీసుకున్నది వారిలో 20 శాతం లోపే. 60–69 ఏళ్ళ మధ్య వారిలోనూ పూర్తి టీకాకరణ జరిగింది 60 శాతంలోపే. పిల్లలకు టీకాల మాట దేవుడెరుగు.
చైనా టీకాల సత్తా తక్కువ. అక్కడి టీకాలన్నీ ప్రభుత్వ రంగ సైనోఫార్మ్, ప్రైవేట్ సంస్థ సైనోవాక్ తయారీలే. వాటి క్లినికల్ ట్రయల్స్ డేటా ప్రజాక్షేత్రంలో ఇప్పటికీ లేదు. దీనికి తోడు ఇతర దేశాల టీకాలు వాడేది లేదన్న మూర్ఖత్వం సరేసరి. నిజానికి, తాజాగా చైనాను పీడిస్తున్నది బలమైన ఒమి క్రాన్ బీఎఫ్.7 వేరియంట్. నర్సింగ్‌హోమ్‌లు, స్కూళ్ళు, భవన నిర్మాణ స్థలాలలో సామూహిక ఇన్ఫె క్షన్లకు ఇది కారణం.
చైనా విధానలోపం మాటెలా ఉన్నా, నేటికీ కరోనా పూర్తిగా వదిలివెళ్ళలేదని మిగతా దేశాలు గ్రహించాలి. సదరు వేరియంట్ అమెరికా, బ్రిటన్‌తో పాటు గత నెలలో కేరళకూ చేరింది. మన దగ్గర కేసులు తక్కువే ఉన్నా, పండుగలు దగ్గరకొస్తున్న వేళ టీకాలు, మాస్కుల లాంటి ప్రాథమిక జాగ్రత్తలే రక్ష. డ్రాగన్ సైతం భారత్ సహా ప్రపంచ దేశాల కరోనా నిర్వహణ విధానాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. భీష్మించుకు కూర్చుంటే ప్రజలకే కాదు పాలకులకూ కష్టమే!
పాలసీ తెచ్చిన ప్రజాగ్రహం
Published Tue, Nov 29 2022 12:22 AM | Last Updated on Tue, Nov 29 2022 12:22 AM
Comments
Please login to add a commentAdd a comment