China Xian Lockdown People Relief With Barter System Viral - Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌తో ఆగమాగం .. చైనీయుల ఆకలి కేకలు, అయినా తగ్గేదే లే!

Published Wed, Jan 5 2022 10:06 AM | Last Updated on Wed, Jan 5 2022 10:48 AM

China Xian Lockdown People Relief With Barter System Viral - Sakshi

ప్రపంచానికి కరోనా వైరస్‌ను అంటగట్టిందన్న అపవాదును మోస్తున్న డ్రాగన్‌ కంట్రీ.. వైరస్‌ కట్టడికి చేపడుతున్న చర్యలు ఊహాతీతంగా ఉంటున్నాయి. ఓవైపు కేసులు, మరణాల సంఖ్యను దాస్తూనే.. మరోవైపు జీరో కేసులంటూ ప్రకటనలు చేసుకుంటోంది. ఈ క్రమంలో ఒక్క కేసు కూడా బయటపడలేదంటూనే జియాన్‌ నగరంలో భారీ లాక్‌డౌన్‌ అమలు చేస్తోంది. ఈ పరిణామాలతో జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. 


డిసెంబర్‌ 23వ తేదీ నుంచి కోటికి పైగా జనాభా ఉన్న జియాన్‌ మహానగరంలో లాక్‌డౌన్‌ అమలు అవుతోంది. కఠిన ఆంక్షలతో జనాలు అడుగు బయటవేయని పరిస్థితి నెలకొందక్కడ. మీడియా ఎలాగూ ప్రభుత్వ ఆధీనంలో ఉంది. కాబట్టే, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ వేదికగా జనాలు తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. ఆకలి కేకలతో సాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. 


ఓవైపు ప్రభుత్వమేమో.. తాము ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నామని ప్రకటించుకుంటోంది. కానీ, సోషల్‌ మీడియాలో జనాల ఆవేదన మరోలా ఉంటోంది.  అసలు సహాయమే అందట్లేదని వాపోతున్నారు జియాన్‌ నగర వాసులు. ఈ మేరకు చైనా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ వెయిబోలో ఫొటోలు, వీడియోలు పెడుతున్నారు. క్యాబేజీకి సిగరెట్‌, యాపిల్స్‌కు బదులుగా పాత్రలుతోమే లిక్విడ్‌, కూరగాయలకు బదులుగా శానిటరీ ప్యాడ్స్‌, రొట్టెలకు బదులు నూడుల్స్‌.. ఇలా వస్తు మార్పిడి ఇది అక్కడ కనిపిస్తోంది అక్కడ. ఎక్కువగా అపార్ట్‌మెంట్‌లలో ప్రజలు ఇలా వస్తు మార్పిడితో పొట్ట నింపుకుంటున్నారు. 



ఎమర్జెన్సీ అవసరాలకు సైతం..
 లాక్‌డౌన్‌ ద్వారా ఎదుర్కొంటున్న పరిస్థితులపై రేడియో ఛానెల్స్‌ ఇంటర్వ్యూల ద్వారా పలువురు వాపోతుండడం విశేషం. బియ్యం కోసం ఏకంగా స్మార్ట్‌ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లను అమ్మేయడం, తాకట్టుపెట్టడం లాంటి పరిస్థితులు జియాన్‌ నగరంలో కనిపిస్తున్నాయి. కొందరు వయసుపైబడిన వాళ్లు.. పాత రోజుల్ని చూస్తున్నట్లు ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఓవైపు లాక్‌డౌన్‌ ఎప్పటిదాకా ఉంటుందో అనే గ్యారెంటీ లేకపోవడంతో.. ఫ్రిడ్జ్‌లను నింపేస్తున్నారు. మరికొందరు మాత్రం జాలి పడి.. ఇతరుకు దానం చేస్తున్న దృశ్యాలు సైతం కనిపిస్తున్నాయి.  

జియాన్‌ నగరంలో కరోనా కట్టడి సంగతి ఎలా ఉన్నా.. అధికారులు, ప్రభుత్వ తీరుపై మాత్రం విరుచుకుపడుతున్నారు జనాలు.  తిండి కోసం క్వారంటైన్‌ సెంటర్‌లకు వెళ్తున్నారన్న కథనాలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. మరో వైపు ఈ-కామర్స్‌ డెలివరీలకు, ఎమర్జెన్సీ వాహనాలకు సైతం అనుమతి ఇవ్వకపోవడంతో పరిస్థితి మరింత క్షీణిస్తోంది. గుండెపోటు, ఇతరత్ర ఆరోగ్య కారణాలతో ఇప్పటిదాకా ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు వెయిబో అప్‌డేట్స్‌ ద్వారా తెలుస్తోంది. 


కఠిన లాక్‌డౌన్‌తో చైనాలోని ఒక్కో ప్రాంతాన్ని బంధించుకుంటూ పోతోంది చైనా ప్రభుత్వం. కొన్ని ప్రాంతాలకే ఉచితంగా సరుకుల చేరివేత పరిమితంకాగా, కరోనా పరీక్షలకు సైతం సిబ్బంది వెనుకడుగు వేస్తుండడం విశేషం. మరోవైపు పోలీసులు జనాల్ని అడుగు తీసి బయటపెట్టనివ్వడం లేదు.  చివరికి ఆస్పత్రులకు, అవసరాలకు సైతం బయట అడుగుపెట్టనివ్వడం లేదు. తాజాగా మూడే కేసులు వచ్చాయంటూ ప్రకటిస్తూ..   11 లక్షల జనాభా ఉన్న యుజౌవు నగరాన్ని రాత్రికి రాత్రే లాక్‌డౌన్‌ పేరిట మూసేశారు. కొత్త సంవత్సర వేడుకలు, ఆ వెంటనే శీతాకాల ఒలింపిక్స్‌ ఉన్నందున ఈ తరహా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

సంబంధిత వార్త: వుహాన్‌ను మించిన లాక్‌డౌన్‌.. చైనా తీరుపై సంభ్రమాశ్చర్యాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement