food shortage
-
పసికందుల ఆకలి కేకలు ఓవైపు.. విలాసాలు మరోవైపు!
పట్టెడన్నం దొరక్క బక్కచిక్కిపోయి.. డొక్కలు ఎండుకుపోయి ఆకలితో నకనకలాడుతూ పసికందుల దృశ్యాల నడుమ.. పాలబుగ్గలతో చిరునవ్వులు చిందిస్తూ సంతోషంగా తండ్రి చెయ్యిలో చెయ్యేసి నడయాడుతున్న కిమ్ తనయ దృశ్యాలు మరోవైపు.. ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌పై ఆ దేశంలో ప్రజాగ్రహం పెల్లుబికుతోంది. ఒకవైపు ప్రజలు దీనావస్థలో కొట్టుమిట్టాడుతుంటే.. మరోవైపు విలాసవంతమైన జీవనశైలితో నిత్యం వార్తల్లో నిలిచేందుకు కిమ్ కుటుంబం ప్రయత్నిస్తోంది. నానాటికీ దిగజారిపోతున్న అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను, ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ పతనం గురించి రేడియో ఫ్రీ ఏషియా.. రహస్యంగా అక్కడి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఇందులో చాలామంది కిమ్, ఆయన కుటుంబం అనుభవిస్తున్న రాజభోగాలపై మండిపడ్డారు. నా కుటుంబం పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. పూట తిండికి చాలా కష్టంగా గడుస్తోంది. నాకూ పదేళ్ల పాప ఉంది. ఆకలితో నా బిడ్డ అల్లలాడిపోతోంది. కానీ, ఈ దేశ అధ్యక్షుడి కూతురు రంగు రంగుల బట్టలతో నిత్యం టీవీల్లో కనిపిస్తోంది. ఆమె పాల బుగ్గలే చెబుతున్నాయి.. ఆమెకు ఎలాంటి తిండి అందుతుందో!. పైగా ఈగ కూడా వాలకుండా ఆమెకు భద్రత కల్పిస్తున్నారు. మరి.. మా పిల్లలు ఏం పాపం చేశారు? లక్షల మంది ఉసురు ఊరికే తగలకుండా ఉంటుందా? అంటూ ఆ వ్యక్తి కిమ్‌కు శాపనార్థాలు పెట్టాడు. ఇదిలా ఉంటే.. మరోవ్యక్తి సైతం కిమ్ కూతురి ప్రస్తావన తెచ్చి విమర్శలు గుప్పించాడు. దేశంలో ఎంతో మంది పిల్లలు తిండి దొరక్క అల్లలాడిపోతున్నారు. వేల మంది చనిపోతున్నారు. బక్కచిక్కిపోయిన మా బిడ్డల రూపాలు చాలవా? ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పడానికి. అయినా.. ఇవేం కిమ్‌కు పట్టవు అంటూ మరో వ్యక్తి విమర్శించాడు. మొత్తం వెయ్యికి పైగా ప్రజల అభిప్రాయాలను.. వాళ్ల గుర్తింపును బయటకు రానీయకుండా జాగ్రత్త పడింది. రాజధాని ప్యాంగ్యాంగ్తో సహా చాలా చోట్ల ఆకలి మరణాలు నమోదు అవుతున్నాయి. ఈ అంకెలను బయటకు పోకుండా కఠిన వైఖరి అవలంభిస్తోంది కిమ్ ప్రభుత్వం. ఇదిలా ఉండగా.. కిమ్ గారాల కూతురు కిమ్ జు ఏ గత కొంతకాలంగా మీడియాలో హైలెట్ అవుతూ వస్తోంది. క్షిపణి పరీక్షల దగ్గరి నుంచి రకరకాల ఈవెంట్స్‌కు ఆమెను వెంటేసుకుని వెళ్తున్నాడు ఆ దేశ అధ్యక్షుడు కిమ్. దీంతో.. తదుపరి కిమ్ తర్వాత ఆ చిన్నారేనంటూ చర్చ మొదలైంది. అయితే పాలనలో పురుషాధిపత్యం ప్రదర్శించే ఉత్తర కొరియాలో ఆ అవకాశం లేదంటూ కొట్టిపారేస్తున్నారు విశ్లేషకులు. ఉత్తర కొరియా అధికారిక మీడియా ఏనాడూ కిమ్ కుటుంబ సభ్యుల వివరాలను గురించి బయటి ప్రపంచానికి తెలియజేయలేదు. అయితే సియోల్ నిఘా ఏజెన్సీలు మాత్రం ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు(13, 10, 6 వయసు) ఉన్నారని మాత్రం చెబుతోంది. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన రాజకీయ పార్టీ బీజేపీనే! -
ఆకలి కేకలు.. దయనీయ స్థితిలో ఉత్తర కొరియా
పైన పటారం, లోన లొటారం అన్నట్టుగా తయారైంది ఉత్తర కొరియా పరిస్థితి. అధ్యక్షుడు కిమ్ వరుస క్షిపణి పరీక్షలతో దాయాది దక్షిణ కొరియాకు, దాని మద్దతుదారు అమెరికాకు సవాళ్లు విసురుతుంటే దేశం మాత్రం కనీవినీ ఎరుగని కరువు కోరల్లో చిక్కి అల్లాడుతోంది. తిండికి లేక జనం అలమటిస్తున్నారు. తక్షణం దిద్దుబాటు చర్యలకు దిగకుంటే 1990ల్లో దేశం చవిచూసిన 20 లక్షల పై చిలుకు ఆకలి చావుల రికార్డు చెరిగిపోయేందుకు ఎంతోకాలం పట్టదంటూ ఆందోళన వ్యక్తమవుతోంది...! అటు కాలం కనికరించడం లేదు. తీవ్ర వరదలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో గతేడాది పంట దిగుబడులు కుదేలయ్యాయి. ఇటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అంతో ఇంతో ఆదుకుంటూ వచ్చిన ప్రజా పంపిణీ వ్యవస్థ చేతులెత్తేసింది. ఇంతకాలం మార్కెట్లో దొరుకుతూ వచ్చిన చైనా తిండి గింజలు, నిత్యావసరాలు కరోనా కట్టడి దెబ్బకు మూడేళ్లుగా అసలే అందుబాటులో లేకుండా పోయాయి. దాంతో ఉత్తర కొరియా అక్షరాలా ఆకలి కేకలు పెడుతోంది. జనాభాలో అధిక శాతం రోజుకు ఒక్క పూట కూడా తిండికి లేక అలమటిస్తున్నారు. నియంతృత్వపు ఇనుప తెరలు దాటుకుని ఏ విషయమూ బయటికి రాదు గనుక అధికారిక గణాంకాలు అందుబాటులో లేవు. కానీ ఇప్పటికే లక్షలాది మంది కరువు బారిన పడ్డట్టు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కరువు మరణాల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతున్నట్టు చె బుతున్నాయి. అస్తవ్యస్త పాలనకు మారుపేరైన కిమ్ ప్రభుత్వమే ఇందుకు ప్రధాన దోషిగా కనిపిస్తోంది. కారణాలెన్నో... ► కొరియా కరువుకు చాలా కారణాలున్నాయి. కరోనా దెబ్బకు ఆహార కొరత తీవ్రతరమైంది. ► ప్రభుత్వం తీవ్ర ఆంక్షలను విధించి అత్యంత కఠినంగా అమలు చేయడం, సరిహద్దులను పూర్తిగా మూసేయడంతో సమస్య మరింత పెరిగింది. 2.5 కోట్ల జనాభా ఆహార అవసరాలు తీర్చడానికి కనీసం 55 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు అవసరం. కాగా వార్షిక సగటు ఉత్పత్తి 45 లక్షల టన్నులే. మిగతా 10 శాతం లోటు చాలావరకు చైనాతో సాగే అనధికారిక వర్తకం ద్వారా పూడేది. తిండి గింజలు, నిత్యావసరాలతో పాటు పలు ఇతర చైనా సరుకులు 2020 దాకా దేశంలోకి భారీగా వచ్చేవి. ముఖ్యంగా గ్రామీణుల అవసరాలు చాలావరకు వీటిద్వారానే తీరేవి. కానీ మూడేళ్లుగా ఆంక్షల దెబ్బకు ఈ వర్తకం దాదాపుగా పడకేసింది. ఇది సగటు కొరియన్లకు చావుదెబ్బగా మారింది. దీనికి తోడు గతేడాది తిండి గింజల ఉత్పత్తి 35 లక్షల టన్నులకు మించకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ► ప్రభుత్వం వద్ద భారీగా ఆహార నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే చైనా నుంచి భారీగా బియ్యం, గోధుమ పిండి తదితరాలను దిగుమతి చేసుకుంది కూడా. కానీ ‘ముందుజాగ్రత్త’ చర్యల్లో భాగంగా వాటిని కావాలనే దాచి ఉంచిందని పరిశీలకులు చెబుతున్నారు. ఫలితంగా నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. ప్రజల్లో చాలామందికి కొనుగోలు శక్తి క్షీణించడంతో వారికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. కిలో బియ్యం ధర ఏకంగా 220 రూపాయలకు ఎగబాకిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! ► వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తెచ్చి దేశాన్ని స్వయంసమృద్ధంగా మార్చుకుంటామంటూ తాజాగా జరిగిన 4 రోజుల వర్కర్స్ పార్టీ సమావేశాల్లో కిమ్ గంభీరంగా ఉపన్యాసమిచ్చారు. అది ఏ మేరకు వాస్తవ రూపు దాలుస్తుందన్న దానిపైనే కొరియన్ల భవితవ్యం ఆధారపడుతుంది. తీవ్ర అసమానతలు ► ఉత్తర కొరియా ప్రపంచంలోని అత్యంత నిరుపేద దేశాల జాబితాలో ఉంది. ప్రజల తలసరి ఆదాయం కేవలం రూ.1.3 లక్షలు! ► దేశంలో సామాజిక అసమానతలు చాలా ఎక్కువ. ► అత్యధికులకు, ముఖ్యంగా గ్రామీణులకు అన్నం, కాయగూరలే ప్రధానాహారం. ► మాంసాహారం, పండ్లు వారికి అందని ద్రాక్షే. ► పట్టణాల్లో పరిస్థితి కాస్త మెరుగు. రాజధాని ప్యాంగ్యాంగ్లో స్థోమత ఉంటే అన్నిరకాల ఆహారమూ దొరుకుతుంది. ► దేశంలో ప్రైవేట్‌లో ఆహారం, ఆహార ధాన్యాల అమ్మకం నిషిద్ధం. కానీ కొన్నేళ్లుగా ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా కుదేలైంది. దాంతో ప్రైవేట్ క్రయ విక్రయాలను ప్రభుత్వం చూసీ చూడనట్టు పోతోంది. నిధులన్నీ సైన్యానికే! ► ఉత్తర కొరియా 12 లక్షల మందితో కూడిన ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద సైన్యాన్ని పోషిస్తోంది. ► ఏటా జీడీపీలో ఏకంగా నాలుగో వంతు సైన్యంపైనే వెచ్చిస్తోంది. ► 2022లోనైతే దేశ చరిత్రలోనే అత్యధికంగా దాదాపు 70 ఖండాంతర, క్రూయిజ్ క్షిపణులను పరీక్షించింది! ► తన సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు ఇటీవలే భారీ సంఖ్యలో ఖండాంతర క్షిపణులు తదితరాలతో నెల రోజుల క్రితమే అతి పెద్ద సైనిక పరేడ్‌ను నిర్వహించింది! ► ఇలా వనరులన్నీ రక్షణ రంగానికే మళ్లుతుండటంతో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం దక్కకుండా పోతోంది. ► కిమ్ అణు పరీక్షల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు విధించిన ఆంక్షలతో పరిస్థితి మరింత విషమించింది. ► కేవలం గతేడాది క్షిపణి పరీక్షలకు వెచ్చించిన నిధులతో దేశ జనాభా మొత్తానికీ ఏడాది పాటు చాలినన్ని తిండి గింజలు అందించవచ్చని అంచనా. ఆ కరువుకు 20 లక్షల మంది బలి! 1990ల్లో ఉత్తర కొరియా చవిచూసిన భయానక కరువు గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పకుంటారు. ‘ఆర్డియస్ మార్చ్’గా పిలిచే ఈ కరువుకు అస్తవ్యస్త పాలన, సోవియట్ నుంచి సాయం ఆగిపోవడంతో పాటు 1995లో వచ్చిన భారీ వరదలు తక్షణ కారణంగా మారాయి. వాటి దెబ్బకు దేశంలో వరి పంట దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. నాలుగో వంతుకు పైగా పొలాలు రోజల తరబడి అడుగుల లోతు నీటిలో మునిగిపోయాయి! జనమంతా పనీపాటా వదిలేసి కేవలం తిండి గింజల కోసం రోజుల తరబడి పొలాల వెంబడి తిరుగుతూ అలమటించిన దృశ్యాలు అప్పట్లో అందరినీ కలచివేశాయి. కనీవినీ ఎరగని ఆ కరువుకు రెండు కోట్ల జనాభాలో పదో వంతుకు పైగా, అంటే 20 లక్షల మందికి పైగా బలైనట్టు చెబుతారు. అంతేగాక ఏకంగా 62 శాతం మందికి పైగా చిన్నారులు పౌష్ఠికాహార లోపానికి గురై శాశ్వత ఆరోగ్య తదితర సమస్యల బారిన పడ్డారు. రెండు మూడేళ్ల తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చినా చిన్నారులు మాత్రం కోలుకోలేకపోయారు. నేటికీ ఉత్తర కొరియాలో 22 శాతం మంది బాలలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్టు అంచనా! – సాక్షి, నేషనల్ డెస్క్ -
Pakistan economic crisis: నిత్యావసరాలకూ కటకట
లాహోర్: పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం అంతకంతకూ తీవ్రతరమవుతోంది. ఏమీ కొనేటట్టు లేదు, ఏమి తినేటట్టు లేదు, కొందామన్నా ఏమీ దొరికేటట్టు లేదు అన్నట్టుగా పరిస్థితులు మారిపోతున్నాయి. తినే తిండికి కూడా కొరత ఏర్పడుతోంది. ప్రజలకు ప్రధాన ఆహారమైన గోధుమ పిండి లాహోర్‌లో దొరకడం లేదు. దీంతో ప్రజలు ఎనలేని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విదేశీ నిల్వలు తరిగిపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. పంచదార, నూనె, నెయ్యి వంటి ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. 15 కేజీల గోధుమ పిండి బ్యాగ్ ఖరీదు రూ.2,050గా ఉంది. దేశవ్యాప్తంగా గోధుమపిండి, పంచదార, నెయ్యి, ధరలు 25 నుంచి 62 శాతం పెరిగాయి. నిత్యావసరాలపై సబ్సిడీలన్నీ ఎత్తేయడంతో ప్రజలపై ధరల పిడుగు పడింది. ద్రవ్యోల్బణం రేటు వారానికి 1.09 % చొప్పున పెరుగుతోంది! పాకిస్తానీలు వినియోగించే వంటనూనెలో 90 శాతం దిగుమతుల ద్వారా లభిస్తోంది. విదేశీ మారక నిల్వలు కేవలం మూడు వారాలకు సరిపడా మాత్రమే ఉండటంతో వంటనూనెను అత్యవసరాల జాబితా నుంచి తొలగించారు. మార్చిలో రంజాన్ మాసం ప్రారంభమవుతున్నందున నెయ్యి, నూనెల సరఫరాను చక్కదిద్దాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. పడిపోతున్న రూపాయి విలువ అప్పుల కుప్పగా మారిపోయిన పాకిస్తాన్లో రూపాయి విలువ క్రమంగా క్షీణిస్తోంది. డాలర్‌తో పోలిస్తే పాక్ రూపాయి 227కు పడిపోయింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు 550 కోట్ల డాలర్లకు పరిమితమై ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయికి చేరాయి. పరిస్థితి ఆందోళనకరమేనని ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ అంగీకరించారు. ఒక రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారుల సమావేశంలో మాట్లాడిన ఆయన ‘‘పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్థికంగా చాలా సంక్షోభంలో ఉంది. 2016లో ప్రభుత్వం మాకు అప్పగించినప్పడు విదేశీ ద్రవ్య నిల్వలు 2,400 బిలియన్ డాలర్లు ఉండేవి. ఇప్పుడు అవి కూడా మా దగ్గర లేవు. కానీ ఈ తప్పు నాది కాదు. వ్యవస్థది’’ అని ఆయన చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 3 శాతం కంటే తక్కువగా వృద్ధి రేటు ఉంటుందనే అంచనాలున్నాయి. -
నల్ల సముద్రం మీదుగా ధాన్యం రవాణా
ఇస్తాంబుల్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తలెత్తిన ప్రపంచ ఆహార కొరతను తీర్చే దిశగా కీలకమైన ముందడుగు పడింది. నల్ల సముద్రం మీదుగా నౌకల ద్వారా ఆహార ధాన్యాల రవాణా కొనసాగించేందుకు ఐక్యరాజ్యసమితి, తుర్కియెలతో రష్యా, ఉక్రెయిన్ను వేర్వేరుగా ఒప్పందాలు చేసుకున్నాయి. ఉక్రెయిన్ నౌకాశ్రయాలను రష్యా సైన్యం దిగ్బంధించింది. దీంతో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాజా ఒప్పందం ద్వారా రష్యా, ఉక్రెయిన్ల నుంచి లక్షలాది టన్నుల ధాన్యంతోపాటు, రష్యా నుంచి ఎరువుల రవాణాకు మార్గం ఏర్పడింది. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, ఉక్రెయిన్ మౌలిక వనరుల మంత్రి ఒలెక్జాండర్ కుబ్రకోవ్‌లు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, తుర్కియె రక్షణ మంత్రి హులుసి అకార్‌లతో వేర్వేరు ఒప్పందాలపై సంతకాలు చేశారు. దీని ప్రకారం..నల్ల సముద్రం మీదుగా సరుకు నౌకల రవాణా సవ్యంగా సాగేలా తుర్కియె చూసుకుంటుంది. ఈ నౌకల ద్వారా ఆయుధాల రవాణా జరగకుండా తుర్కియె తనిఖీలు చేస్తుంటుంది. ప్రపంచంలోనే అత్యధికంగా గోధుమలు, మొక్కజొన్నలు, పొద్దు తిరుగుడు నూనె ఎగుమతి చేసే దేశాల్లో ఉక్రెయిన్ ఒకటి. ఐదు నెలలుగా సాగుతున్న యుద్ధం కారణంగా ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఒప్పందంపై అమెరికా హర్షం వ్యక్తం చేసింది. -
అడవులను పెంచేందుకు విత్తన బాంబులు
డెహ్రాడూన్: కోతులు, అడవి పందులు, ఎలుగుబంట్లు.. దేశమంతటా ఇప్పుడొక పెను సమస్య. ఆహార కొరతకు తాళలేక తమ సహజ ఆవాసాలైన అడవులను వదిలేసి ఊళ్లపై పడుతున్నాయి. తోటలు, పంట పొలాలను పాడు చేస్తున్నాయి. దాంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అటవీ జంతువుల వల్ల జరిగే నష్టాన్ని భరించలేక చాలాచోట్ల ఏకంగా సాగుకే దూరమవుతున్నారు. ఇక కోతుల వల్ల ఊళ్లలో జనం పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఉత్తరాఖండ్‌కు చెందిన ద్వారకా ప్రసాద్ సెమ్వాల్‌ను ఈ పరిస్థితి బాగా ఆలోచింపజేసింది. అడవుల్లో వృక్ష సంపద నశిస్తుండడం, జంతువులక ఆహారం దొరక్కపోవడమే సమస్యకు కారణమని గుర్తించారు. పరిష్కారానికి నడం బిగించారు. ఆ క్రమంలో ఆయన మదిలో మొలకెత్తిన ఆలోచనే... విత్తన బాంబులు. ఉత్తరాఖండ్‌లో శ్రీకారం అడవుల్లో సమృద్ధిగా ఆహారం లభిస్తే జంతువులు పంట పొలాలపై దాడి చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే వాటికి అడవుల్లోనే ఆహారం లభించే ఏర్పాటు చేయాలని ద్వారకా నిర్ణయించారు. పండ్లు, కూరగాయల మొక్కలు నాటేందుకు విత్తన బాంబులు రూపొందించారు. మట్టి, కంపోస్టు ఎరువు, విత్తనాలతో టెన్నిస్ బంతుల పరిమాణంలో తయారు చేశారు. 2017 జూలై 9న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామీ చేతుల మీదుగా ఈ బృహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో, అడవుల్లో విత్తన బాంబులు వెదజల్లారు. వర్షం పడగానే అవి మొక్కలుగా ఎదిగాయి. పండ్లు, కూరగాయలు పండి జంతువులకు ఆహార కొరత తీరింది. ఇందుకు ద్వారకా ప్రసాద్ పెద్ద యజ్ఞమే చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలు, గ్రామ పంచాయతీలను, విద్యార్థులను భాగస్వాములను చేశారు. అక్కడి వాతావరణానికి సరిపోయే విత్తనాలను స్థానికుల నుంచే సేకరించారు. ఈ యజ్ఞంలో 2 లక్షల మంది చేయూతనిస్తున్నారు. వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని ఆనందగా చెబుతున్నారు ద్వారకా! 18 రాష్ట్రాల్లో సేవలు ద్వారకా ప్రసాద్ హరిత ఉద్యమం 18 రాష్ట్రాలకు విస్తరించింది. రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, హరియాణా, పంజాబ్, చండీగఢ్, ఒడిశా, తమిళనాడు, అస్సాం, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో అడవులను పెంచే పనిలో ప్రస్తుతం ఆయన నిమగ్నమయ్యారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తనకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నాయని చెప్పారు. మిగతా రాష్ట్రాలకు సేవలను విస్తరింపజేస్తానన్నారు. -
ముందుంది పెను ముప్పు తట్టుకోలేరు: యూఎన్ చీఫ్ సంచలన హెచ్చరిక
బెర్లిన్: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆహార కొరతపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి సంక్షోభం లాంటి సమస్యలకు తోడు ఉక్రెయిన్ యుద్ధంతో తలెత్తిన పరిస్థితుల కారణంగా గ్లోబల్ ఆహార విపత్తు పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. అమెరికాలో ఇప్పటికే వందల మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తున్న తీవ్ర ప్రపంచ ఆకలి సంక్షోభం 2022 లో ప్రపంచవ్యాప్తంగా మరిన్ని కుటుంబాల్లో ఆకలి కేకల్ని రగిలించనుందని యూఎన్ చీఫ్ చెప్పారు. 2023లో పరిస్థితి మరింత దారుణంగా ఉండవచ్చన్నారు. బెర్లిన్‌లో ధనిక, అభివృద్ధి చెందుతున్న దేశాల అధికారుల కిచ్చిన వీడియో సందేశంలో ఈ విషయాలను వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఎరువుల ధరలు, ఇంధన ధరలతో రైతులు సతమతమవుతున్నందున ఆసియా, ఆఫ్రికా, అమెరికా అంతటా పంటలు దెబ్బ తింటాయని గుటెర్రెస్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఆహార ఉత్పత్తిలో ఎదురయ్యే సమస్యలే వచ్చే ఏడాది ప్రపంచ ఆహార కొరతకు సంక్షోభానికి కారణం కానున్నాయని తెలిపారు. ఈ సంక్షోభం, ఆకలి విపత్తుతో ఉత్పన్నమయ్యే సామాజిక, ఆర్థిక పరిణామాలను తట్టుకునే శక్తి ఏ దేశానికి లేదన్నారు. అలాగే ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై విధించిన పాశ్చాత్య ఆంక్షలు ఆహార కొరతకు కారణమని మాస్కో చేసిన వాదన "పూర్తిగా ఆమోదయోగ్యం కాదు" అని బెర్లిన్ సమావేశంలో పాల్గొన్న జర్మన్ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్బాక్ అన్నారు. 2021 అదే నెలల్లో రష్యా ఈ సంవత్సరం మే, జూన్లలో ఎక్కువ గోధుమలను ఎగుమతి చేసిందని బేర్బాక్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆకలి సంక్షోభానికి అనేక అంశాలు కారణమన్న గుటెర్రెస్ చేసిన వ్యాఖ్యలకు ఆమె మద్దతిచ్చారు. కానీ ఉక్రెయిన్‌పై రష్యా దాడి సునామీగా పరిణమించిందన్నారు. మరోవైపు ప్రపంచ మార్కెట్ల నుండి కీలకమైన వస్తువులను వెనక్కి తీసుకున్న రష్యాను క్షమించలేమంటూ అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ మండిపడ్డారు. అనేక ఇతర దేశాలతో కలిపి రష్యాపై తాము విధించిన ఆంక్షల్లో ఆహారం, ఆహార ఉత్పత్తులు, ఎరువులు, తదితరాలకు మినహాయింపు ఇచ్చినట్టు గుర్తు చేశారు. -
‘‘చచ్చిపోతామేమో’’.. భయాందోళనలో శ్రీలంక ప్రజలు
కొలంబో: శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే చేసిన తాజా ప్రకటన అక్కడి ప్రజల్లో గుబులు పుట్టిస్తోంది. రాబోయే రోజుల్లో ఆహార కొరత తప్పదన్న సంకేతాలు ఇచ్చారాయన. అంతేకాదు.. వచ్చే సీజన్‌కు కాకుండా ఆపై సీజన్ సమయానికే రైతులకు ప్రభుత్వం తరపున సాయం అందుతున్న ప్రకటన.. ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్నాళ్లకు చచ్చిపోతామేమో అని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంకలో ఏప్రిల్ లో ద్రవ్యోల్బణం 28 శాతానికి పెరగ్గా, రానున్న రెండు నెలల్లో అది 40 శాతానికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. దేశంలో ఆహార పదార్థాల ధరలు 46 శాతం పెరగడంతో, ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర అసహనం కనిపిస్తోంది. కాగా, ప్రధాని రణిల్ విక్రమసింఘే దేశంలో ఆహార కొరత అత్యంత తీవ్రంగా ఉందని వెల్లడించారు. అయితే, ఎటువంటి క్లిష్టపరిస్థితులు వచ్చినా దేశానికి అన్నంపెట్టే రైతన్నకు ప్రోత్సాహం అందిస్తామని, రైతులకు ఎరువుల కొరత రాకుండా చూస్తామని హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ, యాలా (మే-ఆగస్టు సీజన్) నాటికి ఎరువులు సమకూర్చుకోలేమని, మహా (సెప్టెంబరు-మార్చి) సీజన్ నాటికి ఎరువులు అందజేతకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని విక్రమసింఘే వెల్లడించారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో శ్రీలంకలో పరిస్థితులు క్షీణదశకు చేరుకున్నట్టు అర్థమవుతోంది. ప్రధానంగా టూరిజం రంగంపై ఆధారపడి మనుగడ సాగించే శ్రీలంకకు కరోనా సంక్షోభం పెనువిపత్తులా పరిణమించింది. ఎక్కడికక్కడ లాక్ డౌన్ లతో శ్రీలంక పర్యాటక రంగం కుదేలు కాగా, విదేశీ మారకద్రవ్య నిల్వలు క్రమేపీ కరిగిపోయాయి. దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశన్నంటుతుండగా, చమురు, ఔషధాలు, ఆహార పదార్థాలకు తీవ్ర కొరత ఏర్పడింది. నిత్యావసరాలు దొరక్క సామాన్యులు అల్లాడిపోతున్నారు. నిత్యావసరాలైన గ్యాస్, కిరోసిన్ కూడా దొరకని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియడంలేదని వాపోతున్నారు. -
‘చిట్టి’ తల్లి.. చనుబాలతో ఎందరో బిడ్డల ఆకలి తీర్చాలనుకుంది!
సాల్ట్ లేక్ సిటీ: బిడ్డల ఆకలిని తీర్చేందుకు అక్కడి తల్లులు పడుతున్న అవస్థలు చూసి ఓ తల్లి చలించిపోయింది. విమర్శలు ఎదురవుతాయని తెలిసినా.. ఒక అడుగు ముందుకు వేసింది. తన చనుబాలను ఇచ్చి ఎంతో మంది బిడ్డల ఆకలి తీర్చే ప్రయత్నం చేసింది. అమెరికా యూటా చెందిన అలైస్సా చిట్టి తన ఇంట్లో మూడు ఫ్రీజర్ల నిండా చనుబాలను నిల్వ చేసి ఉంచింది. మొత్తం పాల క్వాంటిటీ 118 లీటర్లు!!. తొలుత ఆమె ఉచితంగానే పాలను పంచాలని అనుకుందట. అయితే మిల్క్ బ్యాంక్‌ల నుంచి పాలు పంచే పద్ధతి సుదీర్ఘంగా ఉండడం, అదే జరిగితే ఆలస్యం అవుతుందనే ఆలోచనతో ఆమె ఈ ఉపాయం చేసింది. ఔన్స్ పాలకు డాలర్ వసూలు చేయడం మొదలుపెట్టి.. తల్లులకు పాలు పంచుతోంది. చిట్టి ఈ పని మొదలుపెట్టినప్పుడు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. తల్లి పాలతో వ్యాపారం చేస్తోందంటూ కొందరు మండిపడ్డారు. కానీ, పద్ధతి ప్రకారం వెళ్తే ఆమె అనుకున్న పని జరగదు. అందుకే ఇలా.. అమ్మకం ద్వారా పంచుతోంది. బేబీ ఫార్ములా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఇప్పుడు బేబీ ఫార్ములా(బిడ్డ ఆకలి తీర్చే ఉత్పత్తుల) కొరత కొనసాగుతోంది. అమెరికా వ్యాప్తంగా 40 శాతం బేబీ ఫార్ములా ఔట్ ఆఫ్ స్టాక్‌గా ఉంది. ఫిబ్రవరిలో ఓ ప్రముఖ ప్రొడక్షన్ ప్లాంట్ మూతపడిపోవడంతో ఈ సంక్షోభ పరిస్థితి నెలకొంది. బేబీ ఫార్ములా అనేది ఏడాది లోపు పసికందులకు ఇచ్చే అథెంటిక్ ఫుడ్. తన బిడ్డ కూడా ఆ తరహా ఫుడ్‌కు అలవాటు పడిందనేనని, ఆ కష్టాలేంటో తెలిసే ఇలా సాయం చేస్తున్నానని అలైస్సా చిట్టి అంటోంది. అయితే ఆమె ఇంటర్వ్యూ తర్వాత నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఎదురుకావడంతో.. ప్రస్తుతానికి చనుబాలను అమ్మే ప్రయత్నాన్ని తాత్కాలికంగా ఆమె ఆపేసింది. ఎందుకు అడ్డంకులు.. అమెరికాలో ఆన్లైన్లో తల్లి పాలను కొనుగోలు చేయడం, విక్రయించడం ఖచ్చితంగా చట్టబద్ధమైనదే అయినా నియంత్రణ లేని వ్యవహారం. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆదేశాల ప్రకారం.. తల్లి పాలను నేరుగా వ్యక్తుల నుంచి లేదంటే ఆన్లైన్ ద్వారా పొందినప్పుడు.. దాత అంటు వ్యాధులు లేదంటే నాణ్యత ప్రమాణాల కోసం పరీక్షించబడే అవకాశం ఉండదు. అదే ఒకవేళ పాలను మిల్క్ బ్యాంకుకు విరాళంగా ఇవ్వడం వల్ల వారాల తరబడి స్క్రీనింగ్ ఉంటుంది. అందుకే మిల్క్ బ్యాంకుల ద్వారానే పంచాలని చెప్తున్నారు వైద్య నిపుణులు. -
China: స్మార్ట్‌ఫోన్ బదులు బియ్యం! కూరగాయలకు బదులు..
ప్రపంచానికి కరోనా వైరస్‌ను అంటగట్టిందన్న అపవాదును మోస్తున్న డ్రాగన్ కంట్రీ.. వైరస్ కట్టడికి చేపడుతున్న చర్యలు ఊహాతీతంగా ఉంటున్నాయి. ఓవైపు కేసులు, మరణాల సంఖ్యను దాస్తూనే.. మరోవైపు జీరో కేసులంటూ ప్రకటనలు చేసుకుంటోంది. ఈ క్రమంలో ఒక్క కేసు కూడా బయటపడలేదంటూనే జియాన్ నగరంలో భారీ లాక్డౌన్ అమలు చేస్తోంది. ఈ పరిణామాలతో జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. డిసెంబర్ 23వ తేదీ నుంచి కోటికి పైగా జనాభా ఉన్న జియాన్ మహానగరంలో లాక్డౌన్ అమలు అవుతోంది. కఠిన ఆంక్షలతో జనాలు అడుగు బయటవేయని పరిస్థితి నెలకొందక్కడ. మీడియా ఎలాగూ ప్రభుత్వ ఆధీనంలో ఉంది. కాబట్టే, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వేదికగా జనాలు తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. ఆకలి కేకలతో సాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. Scenes from Xi’An lockdown: return of the barter economy 🚬 People can no longer leave their flats, even to shop. This resident makes light of the situation via Kuaishou, a TikTok-like social media platform pic.twitter.com/gsE9NnJnWz — Cindy Yu (@CindyXiaodanYu) January 3, 2022 ఓవైపు ప్రభుత్వమేమో.. తాము ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నామని ప్రకటించుకుంటోంది. కానీ, సోషల్ మీడియాలో జనాల ఆవేదన మరోలా ఉంటోంది. అసలు సహాయమే అందట్లేదని వాపోతున్నారు జియాన్ నగర వాసులు. ఈ మేరకు చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వెయిబోలో ఫొటోలు, వీడియోలు పెడుతున్నారు. క్యాబేజీకి సిగరెట్, యాపిల్స్‌కు బదులుగా పాత్రలుతోమే లిక్విడ్, కూరగాయలకు బదులుగా శానిటరీ ప్యాడ్స్, రొట్టెలకు బదులు నూడుల్స్.. ఇలా వస్తు మార్పిడి ఇది అక్కడ కనిపిస్తోంది అక్కడ. ఎక్కువగా అపార్ట్మెంట్లలో ప్రజలు ఇలా వస్తు మార్పిడితో పొట్ట నింపుకుంటున్నారు. ఎమర్జెన్సీ అవసరాలకు సైతం.. లాక్డౌన్ ద్వారా ఎదుర్కొంటున్న పరిస్థితులపై రేడియో ఛానెల్స్ ఇంటర్వ్యూల ద్వారా పలువురు వాపోతుండడం విశేషం. బియ్యం కోసం ఏకంగా స్మార్ట్ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లను అమ్మేయడం, తాకట్టుపెట్టడం లాంటి పరిస్థితులు జియాన్ నగరంలో కనిపిస్తున్నాయి. కొందరు వయసుపైబడిన వాళ్లు.. పాత రోజుల్ని చూస్తున్నట్లు ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఓవైపు లాక్డౌన్ ఎప్పటిదాకా ఉంటుందో అనే గ్యారెంటీ లేకపోవడంతో.. ఫ్రిడ్జ్‌లను నింపేస్తున్నారు. మరికొందరు మాత్రం జాలి పడి.. ఇతరుకు దానం చేస్తున్న దృశ్యాలు సైతం కనిపిస్తున్నాయి. జియాన్ నగరంలో కరోనా కట్టడి సంగతి ఎలా ఉన్నా.. అధికారులు, ప్రభుత్వ తీరుపై మాత్రం విరుచుకుపడుతున్నారు జనాలు. తిండి కోసం క్వారంటైన్ సెంటర్లకు వెళ్తున్నారన్న కథనాలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. మరో వైపు ఈ-కామర్స్ డెలివరీలకు, ఎమర్జెన్సీ వాహనాలకు సైతం అనుమతి ఇవ్వకపోవడంతో పరిస్థితి మరింత క్షీణిస్తోంది. గుండెపోటు, ఇతరత్ర ఆరోగ్య కారణాలతో ఇప్పటిదాకా ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు వెయిబో అప్డేట్స్ ద్వారా తెలుస్తోంది. xi'an city When apartment building's gates locked and residents can't go out for groceries shopping... People go back to barter! 2022/1/2 pic.twitter.com/0NKBHmY1uI — Songpinganq (@songpinganq) January 2, 2022 కఠిన లాక్‌డౌన్‌తో చైనాలోని ఒక్కో ప్రాంతాన్ని బంధించుకుంటూ పోతోంది చైనా ప్రభుత్వం. కొన్ని ప్రాంతాలకే ఉచితంగా సరుకుల చేరివేత పరిమితంకాగా, కరోనా పరీక్షలకు సైతం సిబ్బంది వెనుకడుగు వేస్తుండడం విశేషం. మరోవైపు పోలీసులు జనాల్ని అడుగు తీసి బయటపెట్టనివ్వడం లేదు. చివరికి ఆస్పత్రులకు, అవసరాలకు సైతం బయట అడుగుపెట్టనివ్వడం లేదు. తాజాగా మూడే కేసులు వచ్చాయంటూ ప్రకటిస్తూ.. 11 లక్షల జనాభా ఉన్న యుజౌవు నగరాన్ని రాత్రికి రాత్రే లాక్డౌన్ పేరిట మూసేశారు. కొత్త సంవత్సర వేడుకలు, ఆ వెంటనే శీతాకాల ఒలింపిక్స్ ఉన్నందున ఈ తరహా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. సంబంధిత వార్త: వుహాన్‌ను మించిన లాక్డౌన్.. చైనా తీరుపై సంభ్రమాశ్చర్యాలు -
చైనాలో ఏం జరుగుతోంది.. ఆ ప్రకటన ఉద్దేశం ఏంటి?
బీజింగ్: చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం చేసిన అరుదైన హెచ్చరిక, అక్కడి ప్రజలను ఆందోళనకు, అయోమయానికి గురిచేస్తుండగా అంతర్జాతీయంగా పలు అనుమానాలకు తావిస్తోంది. ఎన్నడూ లేనివిధంగా, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకుగాను నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకోవాలని ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగం సూచించింది. దీంతో ఆ దేశంలో ఆహార కొరత రానుందా? లేక కోవిడ్ మళ్లీ ప్రబలే అవకాశాలున్నాయా? తైవాన్ను ఆక్రమించుకునేందుకు చైనా ఆర్మీ ప్రయత్నిస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చైనా వాణిజ్యశాఖ సోమవారం ప్రజలకు పలు సూచనలు చేసింది. వచ్చే శీతాకాలంలో ప్రజలందరికీ కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులను డిమాండ్ తగినట్లు అందుబాటు ధరల్లో సరఫరా చేస్తామని ప్రకటించింది. అయితే, అత్యవసర వినియోగ నిమిత్తం కొద్దిపాటి నిత్యావసరాలను నిల్వ ఉంచుకోవాలంటూ ఆ ప్రకటన చివర్లో పేర్కొనడం ప్రజల్లో అనుమానాలకు కారణమయింది. (చదవండి: అతి పెద్ద నిధి.. 30 ఏళ్లుగా పరిశోధన!) -
తీవ్ర ఆహార సంక్షోభం.. ‘నల్లహంస మాంసం ఎంతో రుచి’
సియోల్: నియంత కిమ్ జాంగ్ ఉన్ పాలనలో ఉన్న ఉత్తర కొరియా ప్రస్తతం తీవ్ర ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం కిమ్.. ఆహార సంక్షోభం కారణంగా కొన్నేళ్లపాటు తక్కువ తినాల్సిందిగా జనాలను కోరాడు. ఇక ఈ సమస్య నుంచి బయటపడటం కోసం కిమ్ ఓ అసాధారణ పరిష్కారాన్ని కనుగొన్నాడు. అదేంటంటే.. ఆకలితో అలమటిస్తున్న తన దేశ ప్రజలను నల్ల హంసలు తినాల్సిందిగా సూచిస్తున్నాడు. దీని గురించి విపరీతమైన ప్రచారం కూడా మొదలుపెట్టాడు. ఇవి ఎంతో రుచిగా ఉండటమే కాక.. ప్రొటీన్ రిచ్ ఆహారమని ప్రకటించాడు. నల్ల హంసల సంఖ్యను పెంచడం కోసం భారీ ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించాడు. (చదవండి: నార్త్ కొరియా దీనస్థితి.. కిమ్ సంచలన వ్యాఖ్యలు) ఇప్పటికే దేశం తూర్పు తీరంలోని క్వాంగ్‌ఫో డక్ ఫామ్‌లో, ఉత్తర కొరియా ప్రావిన్స్‌లోని సౌత్ హమ్‌గ్‌యాంగ్‌లో పాలక పార్టీ వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ఉన్నత కార్యదర్శి రి జోంగ్ నామ్ నల్ల హంసల పెంపకం కోసం ఒక కేంద్రాన్ని స్థాపించారు. ఈ కార్యక్రమం ఉత్తర కొరియా జాతీయ మీడియాలో ప్రసారం అయ్యింది. అంతేకాక జనాలను నల్ల హంసలు తినేలా ప్రోత్సాహించేందుకు అనేక కార్యక్రమాలు రూపొందించారు. నల్ల హంస మాంసం రుచిగా ఉండటమే కాక.. ఎన్నో ఔషధాలు కలిగి ఉంటుందని.. ప్రజల జీవితాలను మెరుగుపరుస్తుందని జాతీయా మీడియాలో ప్రకటనలు హోరెత్తిస్తున్నారు. (చదవండి: వామ్మో.. కిలో అరటిపండ్లు రూ.3400) కరోనా మొదలైనప్పుడు విధించిన ఆంక్షలను ఉత్తర కొరియా ఇంకా అమలు చేస్తోంది. సరిహద్దులను మూసి వేసింది. ప్యాంగ్యాంగ్ పట్టాణాన్ని 2025 వరకు తిరిగి తెరిచే ప్రసక్తి లేదని ప్రకటించింది. సరిహద్దుల మూసివేత, కఠిన నియమాల కారణంగా ఈ ఆహార సంక్షోభం తలెత్తింది. ఇప్పటికే 25 మిలయన్ల దేశవాసులు ఆకలితో అల్లాడుతున్నారని అంతర్జాతీయ మీడియా వెల్లడించిది. ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ నివేదిక ప్రకారం ఉత్తర కొరియా ఈ ఏడాది 8,60,000 టన్నుల ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. చదవండి: ప్లీజ్.. 2025 వరకు తక్కువ తినండి: కిమ్ జాంగ్ ఉన్ -
ప్లీజ్.. 2025 వరకు తక్కువ తినండి: కిమ్ జాంగ్ ఉన్
సియోల్: కరోనా ఉధృతి కారణంగా సరిహద్దులు మూసివేత, ఆంక్షలు, వరుస విపత్తులతో ఉత్తర కొరియా పరిస్థితి ఆర్థికంగా దిగజారిపోయింది. ప్రస్తుతం ఆ దేశంలో భయంకరమైన ఆహార కొరత ఏర్పడింది. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సింది పోయి.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సంచలన ప్రకటన చేశారు. 2025 వరకు తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాల్సిందిగా ప్రజలను కోరారు కిమ్. ప్రస్తుతం ఉత్తర కొరియాలో డిమాండ్‌కు తగ్గ రీతిలో ఆహార పదార్థాల సరఫరా లేదు. ఈ క్రమంలో ప్రస్తుతం దేశంలో ఆహార పదార్థాల ధరలు ఆకాశనంటున్నాయి. సహజ విపత్తులు, సరైన ప్రణాళిక లేకపోవడం, వ్యవసాయ పరికరాల కొరత వంటి తదితర కారణాల వల్ల ఆహార కొరత ఏర్పడిందని నిపుణులు వెల్లడిస్తున్నారు. (చదవండి: ఉత్తర కొరియా: కిమ్ వర్సెస్ కిమ్!) ఈ సందర్భంగా కిమ్ జాంగ్ ఉన్ మాట్లాడుతూ.. దేశంలో ఏర్పడ్డ ఆహార కొరతకు దేశ వ్యవసాయ రంగమే కారణమన్నారు. ప్రజలకు సరిపడా ఆహార ధాన్యాలను అందించడంలో దేశ వ్యవసాయ రంగం పూర్తిగా విఫలయ్యిందని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ సమస్య తీవ్ర ఉద్రిక్తంగా మారింది అని తెలిపారు. గత ఏడాది సంభవించిన టైఫూన్, కరోనావైరస్ మహమ్మారి, భారీ వర్షాలు ఉత్తర కొరియా ఆహార సంక్షోభానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. (చదవండి: 'అజేయమైన' సైన్యాన్ని నిర్మిస్తా: కిమ్ ప్రతిజ్ఞ) ఈ క్రమంలో కిమ్ జాంగ్ ఉన్ పార్టీ నేతలతో భేటీ అయి.. ఆహార కొరత గురించి చర్చించారు. ఈ గండం నుంచి గట్టెకాలంటే మరో మూడేళ్లు అనగా 2025 వరకు దేశ ప్రజలు తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాలని కిమ్ సూచించారు. ప్రస్తుతం ఉత్తర కొరియా 8,60, 000 టన్నుల ఆహార పదార్థాల కొరతతో ఇబ్బంది పడుతుంది. చదవండి: కిమ్ తల వెనుక మిస్టీరియస్ స్పాట్! -
వామ్మో.. కిలో అరటిపండ్లు రూ.3400
పోంగ్యాంగ్: నేను మోనార్క్‌ని ఎవరి మాట వినే ప్రసక్తే లేదంటూ ప్రవర్తించే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశం కోసం అని కాకుండా తన కోసం అన్నట్లుగా అతని పరిపాలన చేస్తుంటాడు. ప్రపంచీకరణ తర్వాత ప్రతీ దేశం మరొక దేశం పై ఆధారపడడం సర్వ సాధారణంగా మారింది. కానీ కిమ్ మాత్రం తన చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్లు ప్రవర్తిస్తూ ఇతరు దేశాలను పక్కన పెడుతుంటాడు. ఇప్పుడు ఈ తీరు కారణంగానే ఉత్తర కొరియా తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కోంటోంది. గత కొంత కాలంగా కరోనా ఆంక్షలు అమలు చేస్తుండడంతో ఆ దేశంలోని ఆహార నిల్వలు అడుగంటి పోయాయి. ఆహార పదార్థాలు సరిపడక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అక్కడ కిలో అరటి పండ్లు 45 డాలర్లు పలుకుతోంది. అనగా మన భారత కరెన్సీ ప్రకారం..సుమారు రూ.3400. కాగా ఇది వరకు ఆహారం , చమురు, ఎరువులు, వంటివి వాటి కోసం చైనా పైనే ఎక్కువగా ఉత్తర కొరియా ఆధారపడుతుంది. చైనాతో సరిహద్దులు మూసేయడంతో ఆ దేశం నుంచి దిగుమతి తగ్గిపోయింది. దీంతో ఆహార కొరత ఏర్పడి అక్కడి ప్రజలు దయనీయమైన జీవితాన్ని గడుపుతున్నారు. మరో పక్క నిషేధిత అణు పరీక్షల జరుపుతున్న కారణంగా ఉత్తర కొరియా ఇప్పటికే పలు రకాల అంతర్జాతీయ ఆంక్షలను కూడా ఎదుర్కొంటోంది. చదవండి: ఆఫ్రికాలో దొరకిన ప్రపంచంలో మూడవ అతిపెద్ద వజ్రం -
సంక్షోభంలో ఖతార్
దుబాయ్: ఖతార్ తో వ్యాపార, దౌత్యపరంగా నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రయిన్, ఈజిప్టులు ప్రకటించాయి. నాలుగు దేశాల నిర్ణయంతో ఖతార్ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అందుకు కారణం ఆ దేశం 90 శాతం ఆహార పదార్దాలను దిగుమతి చేసుకుంటుండటం. ఒక్క సౌదీ అరేబియా నుంచే 40 శాతం ఆహారపదార్ధాలను ఖతార్ దిగుమతి చేసుకుంటోంది. నాలుగు దేశాలు ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుక పెద్ద కారణం ఉంది. ఖతార్ మిలిటెంట్ల గ్రూప్ లకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రీజనల్ పాలసీని ఉల్లంఘించినందుకు ఖతార్ పై ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ నాలుగు దేశాలు పేర్కొన్నాయి. దీనిపై మాట్లాడిన మిడిల్ ఈస్ట్ ఆహార నిపుణుడు క్రిస్టియన్ హెండర్ట్స్.. ఖతార్ లో తీవ్ర ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. నిబంధనల కఠినతరంతో డైరీ, మాంసం, కూరగాయలు తదితరాలపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. కాగా, ఆహార కొరత ఏర్పడుతుందనే భయంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆహార పదార్ధాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆహారపదార్ధాల ఖరీదు విపరీతంగా పెరిగిపోయింది. ఈ విషయంపై ప్రభుత్వం జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోకుంటే వ్యవస్ధపై తీవ్ర పరిణామాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
పొంచి ఉన్న ముప్పు
= భవిష్యత్తులో ఆహార కొరత తప్పదు = సవాల్‌ను స్వీకరించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, విద్యార్థులు సిద్ధం కావాలి = భారతరత్న డాక్టర్ సి.ఎన్.ఆర్.రావు సాక్షి, బెంగళూరు:భవిష్యత్తులో భారత దేశంలో ఆహార కొరత ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు ఆవేదనను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ సవాల్‌ను స్వీకరించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, విద్యార్థులు సన్నద్ధం కావాలని భారతరత్న డాక్టర్ సి.ఎన్.ఆర్.రావు పిలుపునిచ్చారు. నగరంలో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన 49వ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు పెంచే దిశగా యువ వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయాన్నే ప్రధాన ఉపాధిగా ఎంచుకున్న భారత్‌లో సైతం ఆహార కొరత ఎందుకు ఏర్పడనుందనే దిశగా యువ వ్యవసాయ శాస్త్రవేత్తల ఆలోచనలు సాగాలని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల పెంపుదల అంశంలో త్వరపడకపోతే రానున్న రోజుల్లో చాలా సమస్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వ్యవసాయంలో బయో, సైన్స్ అండ్ టెక్నాలజీల పూర్తి స్థాయి వినియోగం ద్వారా ఉత్పాదనలను పెంచేందుకు ఆస్కారం ఉందని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో మొత్తం 67 మంది విద్యార్థులకు పీహెచ్డీ, 174 మందికి ఎమ్మెస్సీ, 574 మందికి డిగ్రీ, 79 మందికి డిప్లొమా పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో గవర్నర్ వాజు భాయ్ రుడాభాయ్ వాలా, వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణబేరేగౌడ, వైస్ ఛాన్స్లర్ డాక్టర్ హెచ్.శివణ్ణ తది తరులు పాల్గొన్నారు. -
లాభసాటి వ్యవసాయానికి కృషి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: శాస్త్ర, సాంకేతిక రంగాల ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. ఆహార కొరత తీర్చేందుకు ఒక వైపు ప్రయత్నాలు చేస్తూనే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే దిశగా మరోవైపు కృషి జరుగుతుందని చెప్పారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, తమిళనాడుకు చెందిన డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ సంయుక్తంగా వర్సిటీలోని డైక్మెన్ హాలులో ఏర్పాటు చేసిన ఆరవ ‘అఖిల భారత యువజన సైన్స్ కాంగ్రెస్’ సమావేశాలు సోమవారం కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ విజ్ఞానం శాఖ మంత్రి వై.ఎస్. చౌదరి(సుజనా చౌదరి)జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమయ్యాయి. తొలిరోజు సమావేశంలో రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పాల్గొని మాట్లాడారు. పెరుగుతున్న సాగు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని రైతుకు 50 నుంచి 75 శాతం వరకు వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందజేస్తున్నట్టు మంత్రి చెప్పారు. బయో టెక్నాలజీతో వ్యవసాయం చేయాలని, ఈ-మార్కెటింగ్ ద్వారా పంటకు గిట్టుబాటు ధర పొందేలా రైతులు చైతన్యవంతం కావాలని కోరారు. గుంటూరులో డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేస్తే ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ సాంకేతిక పరమైన అభివృద్ధి ల్యాబ్ నుంచి ల్యాండ్‌కు సరైన విధానంలో చేరడంలేదన్నారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులను రైతులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. వ్యవసాయ రంగంలో యువత అధిక పరిశోధనలు చేయాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కోరారు. నూతన రాజధాని గుంటూరును సైన్స్ సిటీగా గుర్తించాలని కేంద్ర మంత్రి వై.ఎస్.చౌదరిని కోరారు. వ్యవసాయ రంగం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరిగితేనే ఆకలిచావుల నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. గుంటూరును కూడా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానంలా అభివృద్ధి చేయాలని రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ కోరారు. ప్రస్తుతం ఆహార ధాన్యాల దిగుబడిలో భారతదేశం అగ్రస్థానంలో ఉందని, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరగాలని కోరారు. మండలి చీఫ్‌విప్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ స్వామినాథన్ ఫౌండేషన్ వ్యవసాయాభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు. కేంద్రం నుంచి నిధులు సకాలంలో అందడం లేదని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టానికి తగిన పరిహారం రైతుకు చేరడం లేదన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ, ఆహారభద్రత, ఆకలి చావులు గురించి మాట్లాడేటప్పుడు గిట్టుబాటు ధర గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతుకు నష్టం కలిగిస్తున్నాయని చెప్పారు. వినుకొండ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ సేంద్రియ ఎరువులకు సబ్సిడీ కల్పించాలని, యువశాస్త్రవేత్తలు నూతన వంగడాలపై విస్తృత పరిశోధనలు చేయాలని కోరారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల మధ్య అంతరాన్ని తొలగించాలని కోరారు. ప్రస్తుతం భూముల ధరలకు, వాటి నుంచి లభిస్తున్న ఆదాయానికి పొంతన లేదన్నారు. ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపులు తగ్గిపోయాయన్నారు. 1997 నుంచి ఇప్పటి వరకు దేశంలో ఐదు లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వీరిలో 90 శాతం మంది కౌలురైతులే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశానికి అధ్యక్షత వహించిన నాగార్జున యూనివర్సిటీ వీసీ ఆచార్య కె. వియ్యన్నారావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఆహార కొరతపై సమావేశాలు నిర్వహించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. వ్యవసాయ అభివృద్ధి కోసం యువత విస్తృత పరిశోధనలు చేయాలన్నారు. శాస్త్ర సాంకేతిక రంగ ఫలాలను సమాజానికి మరింత చేరువచేయాలని కోరారు. ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ డెరైక్టర్ డాక్టర్ అజయ్ ఫరీదా, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ రీసెర్చ్ డెరైక్టర్ ఆచార్య డి.నారాయణరావు, ఆర్జీఎన్వైడీ డెరైక్టర్ డాక్టర్ లతాపిళ్ళై, సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్ పాల్గొన్నారు. సమావేశాలు మూడురోజులపాటు జరగనున్నాయి.