బెర్లిన్: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆహార కొరతపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి సంక్షోభం లాంటి సమస్యలకు తోడు ఉక్రెయిన్ యుద్ధంతో తలెత్తిన పరిస్థితుల కారణంగా గ్లోబల్ ఆహార విపత్తు పొంచి ఉందని ఆయన హెచ్చరించారు.
అమెరికాలో ఇప్పటికే వందల మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తున్న తీవ్ర ప్రపంచ ఆకలి సంక్షోభం 2022 లో ప్రపంచవ్యాప్తంగా మరిన్ని కుటుంబాల్లో ఆకలి కేకల్ని రగిలించనుందని యూఎన్ చీఫ్ చెప్పారు. 2023లో పరిస్థితి మరింత దారుణంగా ఉండవచ్చన్నారు. బెర్లిన్‌లో ధనిక, అభివృద్ధి చెందుతున్న దేశాల అధికారుల కిచ్చిన వీడియో సందేశంలో ఈ విషయాలను వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఎరువుల ధరలు, ఇంధన ధరలతో రైతులు సతమతమవుతున్నందున ఆసియా, ఆఫ్రికా, అమెరికా అంతటా పంటలు దెబ్బ తింటాయని గుటెర్రెస్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఆహార ఉత్పత్తిలో ఎదురయ్యే సమస్యలే వచ్చే ఏడాది ప్రపంచ ఆహార కొరతకు సంక్షోభానికి కారణం కానున్నాయని తెలిపారు. ఈ సంక్షోభం, ఆకలి విపత్తుతో ఉత్పన్నమయ్యే సామాజిక, ఆర్థిక పరిణామాలను తట్టుకునే శక్తి ఏ దేశానికి లేదన్నారు.
అలాగే ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై విధించిన పాశ్చాత్య ఆంక్షలు ఆహార కొరతకు కారణమని మాస్కో చేసిన వాదన "పూర్తిగా ఆమోదయోగ్యం కాదు" అని బెర్లిన్ సమావేశంలో పాల్గొన్న జర్మన్ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్‌బాక్ అన్నారు. 2021 అదే నెలల్లో రష్యా ఈ సంవత్సరం మే, జూన్‌లలో ఎక్కువ గోధుమలను ఎగుమతి చేసిందని బేర్‌బాక్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆకలి సంక్షోభానికి అనేక అంశాలు కారణమన్న గుటెర్రెస్ చేసిన వ్యాఖ్యలకు ఆమె మద్దతిచ్చారు. కానీ ఉక్రెయిన్‌పై రష్యా దాడి సునామీగా పరిణమించిందన్నారు.
మరోవైపు ప్రపంచ మార్కెట్ల నుండి కీలకమైన వస్తువులను వెనక్కి తీసుకున్న రష్యాను క్షమించలేమంటూ అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ మండిపడ్డారు. అనేక ఇతర దేశాలతో కలిపి రష్యాపై తాము విధించిన ఆంక్షల్లో ఆహారం, ఆహార ఉత్పత్తులు, ఎరువులు, తదితరాలకు మినహాయింపు ఇచ్చినట్టు గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment