ఇస్తాంబుల్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తలెత్తిన ప్రపంచ ఆహార కొరతను తీర్చే దిశగా కీలకమైన ముందడుగు పడింది. నల్ల సముద్రం మీదుగా నౌకల ద్వారా ఆహార ధాన్యాల రవాణా కొనసాగించేందుకు ఐక్యరాజ్యసమితి, తుర్కియెలతో రష్యా, ఉక్రెయిన్‌ను వేర్వేరుగా ఒప్పందాలు చేసుకున్నాయి. ఉక్రెయిన్ నౌకాశ్రయాలను రష్యా సైన్యం దిగ్బంధించింది. దీంతో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తాజా ఒప్పందం ద్వారా రష్యా, ఉక్రెయిన్‌ల నుంచి లక్షలాది టన్నుల ధాన్యంతోపాటు, రష్యా నుంచి ఎరువుల రవాణాకు మార్గం ఏర్పడింది. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, ఉక్రెయిన్ మౌలిక వనరుల మంత్రి ఒలెక్జాండర్ కుబ్రకోవ్‌లు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, తుర్కియె రక్షణ మంత్రి హులుసి అకార్‌లతో వేర్వేరు ఒప్పందాలపై సంతకాలు చేశారు.
దీని ప్రకారం..నల్ల సముద్రం మీదుగా సరుకు నౌకల రవాణా సవ్యంగా సాగేలా తుర్కియె చూసుకుంటుంది. ఈ నౌకల ద్వారా ఆయుధాల రవాణా జరగకుండా తుర్కియె తనిఖీలు చేస్తుంటుంది. ప్రపంచంలోనే అత్యధికంగా గోధుమలు, మొక్కజొన్నలు, పొద్దు తిరుగుడు నూనె ఎగుమతి చేసే దేశాల్లో ఉక్రెయిన్ ఒకటి. ఐదు నెలలుగా సాగుతున్న యుద్ధం కారణంగా ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఒప్పందంపై అమెరికా హర్షం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment