మాస్కో: యుద్ధం కొనసాగుతున్న వేళ నల్ల సముద్రం మీదుగా ఉక్రెయిన్ ధాన్యం రవాణా కారిడార్‌ను పునరుద్ధరించాలంటే పశ్చిమ దేశాలు ముందుగా తమ డిమాండ్లను అంగీకరించాల్సిందేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. దీంతో, ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆసియా దేశాలకు ఎంతో కీలకమైన ఆహార ధాన్యాల సరఫరాపై నీలినీడలు అలుముకున్నాయి. టర్కీ, ఐరాస మధ్యవర్తిత్వంతో కుదిరిన ధాన్యం రవాణా కారిడార్ ఒప్పందం నుంచి జూలైలో వైదొలిగింది. ఈ ఒప్పందం పునరుద్ధరణపై చర్చించేందుకు సోమవారం రష్యాలోని సోచిలో తుర్కియే అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్‌తో ఆయన సమావేశమయ్యారు.
రష్యా నుంచి ఆహారధాన్యాలు, ఎరువుల ఎగుమతులకు గల అవరోధాలను తొలగిస్తామన్న వాగ్దానాలను పశ్చిమదేశాలు నిర్లక్ష్యం చేశాయని ఈ సందర్భంగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది వరకు రికార్డు స్థాయిలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యం ఓడల రాకపోకలు, బీమాకు సంబంధించిన అవరోధాల కారణంగా తీవ్రంగా దెబ్బతిందన్నారు. పశి్చమదేశాలు ఇచి్చన వాగ్దానాలను నెరవేర్చిన పక్షంలో కొద్ది రోజుల్లోనే ఒప్పందంపై సంతకాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో త్వరలోనే పురోగతి సాధిస్తామని ఎర్డోగన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment