లీసీచాన్‌స్క్‌లో రిఫైనరీపై దాడితో అలుముకున్న పొగలు
కీవ్/లండన్: నల్ల సముద్రంలో తమ కీలక యుద్ధనౌక మాస్క్‌వాను కోల్పోయిన రష్యా తీవ్ర ప్రతీకారంతో రగిలిపోతోంది. శనివారం ఉక్రెయిన్‌పై క్షిపణి దాడులను ఉధృతం చేసింది. తీర్పు ప్రాంతంతోపాటు రాజధాని కీవ్‌పై దృష్టి పెట్టింది. కీవ్ పరిసరాలపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. కీవ్ చుట్టుపక్కల ఇప్పటివరకు 1,000కి పైగా మరణించారని ఉక్రెయిన్ చెప్పింది. యుద్ధంలో 3,000 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారని, 10,000 మందికిపైగా గాయపడ్డారని వెల్లడించింది. గత 24 గంటల్లో 8 ప్రాంతాలపై రష్యా విరుచుకుపడినట్లు చెప్పింది.
తూర్పున డొనెట్‌స్క్, లుహాన్‌స్క్, ఖర్కీవ్, సెంట్రల్ ఉక్రెయిన్‌లోని డినిప్రోపెట్రోవ్‌స్క్, పొల్టావా, కిరోవోహ్రాడ్, దక్షిణాన మైకోలైవ్, ఖేర్సన్‌పై దాడులకు పాల్పడినట్లు వెల్లడించింది. కీవ్ సమీపంలోని డార్నియిట్‌స్కీపై భారీగా దాడులు జరిగాయి. ఎస్‌యూ–35 ఎయిర్‌క్రాఫ్ట్ బాంబుల వర్షం కురిపించింది. ఖర్కీవ్‌పై రాకెట్ దాడుల్లో ఏడు నెలల చిన్నారి సహా ఏడుగురు మరణించారు. ఒలెగ్జాండ్రియాలోని ఎయిర్‌ఫీల్డ్‌పై శుక్రవారం రాత్రి రష్యా క్షిపణిని ప్రయోగించిందని నగర మేయర్ చెప్పారు. లుహాన్స్‌క్‌లో దాడుల్లో ఒకరు మరణించారు. సెవెరోండోన్‌టెస్క్, లీసీచాన్‌స్క్‌లో దాడుల్లో గ్యాస్ పైప్‌లైన్లు దెబ్బతిన్నాయి. ఒక చమురు శుద్ధి కర్మాగారం ధ్వంసమయ్యింది.
రష్యాకు పరాభవం తప్పదు: జెలెన్‌స్కీ
రష్యా దాడుల నుంచి దేశ ప్రజలను కాపాడుకొనేందుకు చేయాల్సిందంతా చేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పునరుద్ఘాటించారు. ఆక్రమణదారులకు పరాభవం తప్పదన్నారు. తమ దేశం ఎన్నటికీ రష్యా వశం కాబోదని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు.
ఈ ఆంక్షలు చాలవు
రష్యాపై విధించిన ఆంక్షలు చాలవని జెలెన్‌స్కీ అన్నారు. రష్యా చమురును నిషేధించాలని ప్రపంచ దేశాలను కోరారు. యుద్ధం ఆగాలంటే అన్ని దేశాలు రష్యాతో ఆర్థిక సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని చెప్పారు.
► మారియూపోల్ పునర్నిర్మాణానికి సాయమందిస్తానని ఉక్రెయిన్ కుబేరుడు రినాట్ అఖ్‌మెటోవ్ ప్రకటించారు. దేశంలో అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థ ‘మెటిన్‌వెస్ట్’ యజమాని అయిన అఖ్‌మెటోవ్‌కు మారియూపోల్‌లో రెండు ఉక్కు పరిశ్రమలున్నాయి.
► సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో వందలాది మంది రష్యాకు అనుకూలంగా భారీ ప్రదర్శన చేపట్టారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని సూచించే ‘జెడ్’ అక్షరమున్న టీ షర్టులు ధరించారు. పుతిన్ చిత్రాలతో కూడిన ప్లకార్డులను చేబూనారు. ఐరాస మానవ హక్కుల మండలి నుంచి రష్యాను బహిష్కరించే తీర్మానానికి మద్దతుగా సెర్బియా ఓటేయడాన్ని జనం వ్యతిరేకిస్తున్నారు. రష్యాపై ఎలాంటి ఆంక్షలు విధించని ఒకే ఒక్క యూరప్ దేశం సెర్బియా.
యూకే ప్రధాని, మంత్రులపై రష్యా నిషేధం
ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆయన మంత్రివర్గ సహచరులతో పాటు పలువురు నేతలపై నిషేధం విధిస్తున్నట్టు రష్యా విదేశాంగ మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో యూకే ప్రభుత్వం రష్యాపై ఆంక్షలు విధించినందుకు ప్రతిచర్యగా ఈ నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. నిషేధానికి గురైన వారిలో భారత సంతతికి చెందిన ఆర్థిక మంత్రి రిషి సునక్, హోంమంత్రి ప్రీతీ పటేల్ కూడా ఉన్నారు. రష్యా ప్రభుత్వం ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై కూడా ఇలాంటి నిషేధమే విధించింది.
Comments
Please login to add a commentAdd a comment