అంటాలె: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేందుకు టర్కీలో ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల్లో ఈసారీ ఎలాంటి ఫలితం తేలలేదు. కాల్పుల విరమణ, మానవతా కారిడార్లపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్‌తో గురువారం టర్కీలో చర్చించామని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిత్రో కులేబా తెలిపారు. కాల్పుల విరమణపై 24 గంటలకు పైగా చర్చించామని, కానీ ఎలాంటి పురోగతి లేదని అన్నారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి రష్యాలో వేరే అధికారులున్నారని తెలుస్తోందన్నారు. వాళ్లు ఉక్రెయిన్ లొంగిపోవాలని అంటున్నారని, ఇది జరగబోదని స్పష్టం చేశారు.
మరియూపోల్‌లో చిక్కుకున్న వందలాది మందిని తరలించేందుకు మానవతా కారిడార్ల ఏర్పాటు పైనా చర్చించామని, దీనిపైనా లావ్రోవ్ సరైన నిర్ణయం చెప్పలేదని అన్నారు. సమస్యలకు పరిష్కారం కోసం మళ్లీ చర్చలకు సిద్ధమని చెప్పారు. మరోవైపు లావ్రోవ్ మాట్లాడుతూ.. రష్యాతో దౌత్య చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని, ఈ విషయంలో ప్రెసిడెంట్ పుతిన్ కూడా సానుకూలంగానే ఉన్నారని తెలిపారు. సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని అనుకుంటున్నామని చెప్పారు.
ఉక్రెయిన్‌పై రష్యా జీవాయుధాల దాడి చేయొచ్చు: అమెరికా
ఉక్రెయిన్‌లో అమెరికా అక్రమంగా రసాయన ఆయుధాలను అభివృద్ధి చేస్తోందన్న రష్యా ఆరోపణలను బైడెన్ యంత్రాంగం కొట్టిపారేసింది. తాము అలాంటి పనులేం చేయట్లేదని స్పష్టం చేసింది. రష్యా వ్యాఖ్యలు చూస్తుంటే మున్ముందు ఉక్రెయిన్‌పై జీవ, రసాయన ఆయుధాలతో ఆ దేశమే దాడి చేసేలా కనిపిస్తోందని హెచ్చరించింది. వాళ్ల దాడులను సమర్థించుకోవడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేసింది. జీవ, రసాయన ఆయుధాలను ఉక్రెయిన్ తమ భూభాగంలో అమెరికా సాయంతో అభివృద్ధి చేస్తోందని ఆధారాలు చూపించకుండా రష్యా ఆరోపించిన విషయం తెలిసిందే.
అమెరికన్లు సాయం చేస్తామంటున్నారు: ఉక్రెయిన్
ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ప్రజల సాయం తీసుకోవడానికి అమెరికాలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ప్రయత్నాలు చేస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా పోరాడే వలంటీర్ల కోసం రకరకాల ఆఫర్లు ప్రకటిస్తోంది. ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధం అన్యాయమైనదని అమెరికా ప్రజలు భావిస్తున్నారని చెప్పింది. ఉక్రెయిన్‌కు మద్దతుగా వలంటీర్లుగా పని చేసేందుకు వాషింగ్టన్‌లోని తమ ఎంబసీలో దాదాపు 6 వేల మందికి పైగా వివరాలు అడిగారని, వీళ్లలో ఎక్కువ మంది అమెరికన్లేనని ఉక్రెయిన్ మిలటరీ అధికారి మేజర్ జనరల్ బోరిస్ క్రెమెనెట్స్‌క్యి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment