
చర్చల్లో పాల్గొన్న అమెరికా, రష్యా, సౌదీ మంత్రులు
అమెరికా, రష్యా చర్చల బాట
రియాద్‌లో మంత్రుల స్థాయి మంతనాలు
ద్వైపాక్షిక బంధాల పునరుద్ధరణకు నిర్ణయం
ఉక్రెయిన్ యుద్ధంపైనా కీలక చర్చలు
త్వరలో భేటీ కానున్న ట్రంప్, పుతిన్!
జెలెన్‌స్కీతో భేటీకీ పుతిన్ సిద్ధం: రష్యా
మేం లేకుండా మాపై చర్చలా: జెలెన్‌స్కీ
రియాద్: డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టగానే అమెరికా విదేశాంగ విధానంలో కీలక మార్పుచేర్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగా అన్నిరకాలుగానూ మూడేళ్లుగా దాదాపుగా వెలి వేసిన రష్యాతో ఏకంగా ఉన్నతస్థాయి చర్చలకు అమెరికా తెర తీసింది. దాని మిత్ర దేశం సౌదీ అరేబియా వేదికగా మంగళవారం జరిగిన ఈ చర్చలకు అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, సెర్గీ లవ్రోవ్ స్వయంగా సారథ్యం వహించడం విశేషం.
సౌదీ విదేశాంగ మంత్రి యువరాజు ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్, అమెరికా, సౌదీ ఆ దేశ జాతీయ భద్రతా సలహాదార్లు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ద్వైపాక్షిక బంధాలను మెరుగు పరుచుకోవడంతో పాటు ఉక్రెయిన్ యుద్ధానికి తెర దించడం ప్రధాన ఎజెండాగా చర్చలు జరిగాయి. కానీ ఈ కీలక చర్చల్లో ఉక్రెయిన్‌కే ప్రాతినిధ్యం కల్పించకపోవడం విశేషం. దీనిపై ఆ దేశం తీవ్ర అసంతృప్తి వెలిగక్కింది. తమ భాగస్వామ్యం లేకుండా తీసుకునే ఎలాంటి నిర్ణయాలనూ అంగీకరించబోయేది లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ కుండబద్దలు కొట్టారు.
ఉక్రెయిన్‌పై జరుపుతున్న చర్చల్లో తమను పక్కన పెట్టడం ఏమేరకు సబబంటూ పలు యూరప్ దేశాలు కూడా నొసలు విరుస్తున్నాయి. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు అమెరికా దన్ను పూర్తిగా తగ్గిపోతున్న నేపథ్యంలో భావి కార్యాచరణపై యూరప్ దేశాలన్నీ సోమవారం కీలక సమావేశం జరపడం తెలిసిందే. ఈ పరిణామాలన్నీ అంతర్జాతీయంగా సరికొత్త సమీకరణాలకు, పునరేకీకరణలకు దారితీసేలా కనిపిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.
త్వరలో ట్రంప్, పుతిన్ భేటీ
ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో అమెరికాతో పాటు పలు యూరప్ దేశాలు రష్యాపై తీవ్ర ఆంక్షలు విధించడం, ఆ దేశాన్ని అంతర్జాతీయంగా దాదాపుగా ఏకాకిని చేయడం తెలిసిందే. అలా మూడేళ్లుగా అట్టడుగుకు దిగజారిన అమెరికా, రష్యా సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా రూబియో, లవ్రోవ్ భేటీలో పలు నిర్ణయాలు జరిగాయి. వాషింగ్టన్, మాస్కో రాయబార కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను పెంచాలని నిర్ణయించినట్టు రూబియో మీడియాకు తెలిపారు.
‘‘అలాగే ఇరు దేశాల అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ వీలైనంత త్వరగా భేటీ కానున్నారు. తేదీ తదితరాలు ఖరారు కావాల్సి ఉంది’’ అని వివరించారు. అధినేతలిద్దరూ గత వారం సుదీర్ఘంగా ఫోన్లో సంభాషించుకోవడం తెలిసిందే. ఈ పరిణామం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఆ వెంటనే రష్యాపై యుద్ధంలో ఇప్పటిదాకా ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తూ వస్తున్న సహాయ సహకారాలకు చాలావరకు తెర దించుతూ ట్రంప్ వరుస నిర్ణయాలు తీసుకున్నారు.
ఈయూలో ఉక్రెయిన్ చేరికకు... అభ్యంతరం లేదు: రష్యా
శాంతి చర్చలకు రష్యా ఎప్పుడూ సిద్ధమేనని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీడియా కార్యదర్శి ద్మిత్రీ పెస్కోవ్ స్పష్టం చేశారు. అందులో భాగంగా అవసరమైతే జెలెన్‌స్కీతో చర్చలకు కూడా పుతిన్ సిద్ధమేనన్నారు. అయితే, ఉక్రెయిన్ అధ్యక్షునిగా జెలెన్‌స్కీ చట్టబద్ధతపైనే తమకు అభ్యంతరాలున్నాయంటూ మెలిక పెట్టారు. ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్‌లో చేరడంపై తమకు అభ్యంతరాలు లేవన్నారు. ‘‘ఇలాంటివి ఒక దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన నిర్ణయాలు. వాటిలో వేలు పెట్టే ఉద్దేశం మాకు లేదు’’ అని చెప్పుకొచ్చారు. కానీ రష్యా భద్రత తదితరాల దృష్ట్యా ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment