Marco Rubio
-
అగ్ర రాజ్యాల స్నేహగీతం
రియాద్: డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టగానే అమెరికా విదేశాంగ విధానంలో కీలక మార్పుచేర్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగా అన్నిరకాలుగానూ మూడేళ్లుగా దాదాపుగా వెలి వేసిన రష్యాతో ఏకంగా ఉన్నతస్థాయి చర్చలకు అమెరికా తెర తీసింది. దాని మిత్ర దేశం సౌదీ అరేబియా వేదికగా మంగళవారం జరిగిన ఈ చర్చలకు అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, సెర్గీ లవ్రోవ్ స్వయంగా సారథ్యం వహించడం విశేషం. సౌదీ విదేశాంగ మంత్రి యువరాజు ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్, అమెరికా, సౌదీ ఆ దేశ జాతీయ భద్రతా సలహాదార్లు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ద్వైపాక్షిక బంధాలను మెరుగు పరుచుకోవడంతో పాటు ఉక్రెయిన్ యుద్ధానికి తెర దించడం ప్రధాన ఎజెండాగా చర్చలు జరిగాయి. కానీ ఈ కీలక చర్చల్లో ఉక్రెయిన్‌కే ప్రాతినిధ్యం కల్పించకపోవడం విశేషం. దీనిపై ఆ దేశం తీవ్ర అసంతృప్తి వెలిగక్కింది. తమ భాగస్వామ్యం లేకుండా తీసుకునే ఎలాంటి నిర్ణయాలనూ అంగీకరించబోయేది లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ కుండబద్దలు కొట్టారు.ఉక్రెయిన్‌పై జరుపుతున్న చర్చల్లో తమను పక్కన పెట్టడం ఏమేరకు సబబంటూ పలు యూరప్ దేశాలు కూడా నొసలు విరుస్తున్నాయి. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు అమెరికా దన్ను పూర్తిగా తగ్గిపోతున్న నేపథ్యంలో భావి కార్యాచరణపై యూరప్ దేశాలన్నీ సోమవారం కీలక సమావేశం జరపడం తెలిసిందే. ఈ పరిణామాలన్నీ అంతర్జాతీయంగా సరికొత్త సమీకరణాలకు, పునరేకీకరణలకు దారితీసేలా కనిపిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. త్వరలో ట్రంప్, పుతిన్ భేటీ ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో అమెరికాతో పాటు పలు యూరప్ దేశాలు రష్యాపై తీవ్ర ఆంక్షలు విధించడం, ఆ దేశాన్ని అంతర్జాతీయంగా దాదాపుగా ఏకాకిని చేయడం తెలిసిందే. అలా మూడేళ్లుగా అట్టడుగుకు దిగజారిన అమెరికా, రష్యా సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా రూబియో, లవ్రోవ్ భేటీలో పలు నిర్ణయాలు జరిగాయి. వాషింగ్టన్, మాస్కో రాయబార కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను పెంచాలని నిర్ణయించినట్టు రూబియో మీడియాకు తెలిపారు.‘‘అలాగే ఇరు దేశాల అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ వీలైనంత త్వరగా భేటీ కానున్నారు. తేదీ తదితరాలు ఖరారు కావాల్సి ఉంది’’ అని వివరించారు. అధినేతలిద్దరూ గత వారం సుదీర్ఘంగా ఫోన్లో సంభాషించుకోవడం తెలిసిందే. ఈ పరిణామం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఆ వెంటనే రష్యాపై యుద్ధంలో ఇప్పటిదాకా ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తూ వస్తున్న సహాయ సహకారాలకు చాలావరకు తెర దించుతూ ట్రంప్ వరుస నిర్ణయాలు తీసుకున్నారు.ఈయూలో ఉక్రెయిన్ చేరికకు... అభ్యంతరం లేదు: రష్యాశాంతి చర్చలకు రష్యా ఎప్పుడూ సిద్ధమేనని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీడియా కార్యదర్శి ద్మిత్రీ పెస్కోవ్ స్పష్టం చేశారు. అందులో భాగంగా అవసరమైతే జెలెన్స్కీతో చర్చలకు కూడా పుతిన్ సిద్ధమేనన్నారు. అయితే, ఉక్రెయిన్ అధ్యక్షునిగా జెలెన్స్కీ చట్టబద్ధతపైనే తమకు అభ్యంతరాలున్నాయంటూ మెలిక పెట్టారు. ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్‌లో చేరడంపై తమకు అభ్యంతరాలు లేవన్నారు. ‘‘ఇలాంటివి ఒక దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన నిర్ణయాలు. వాటిలో వేలు పెట్టే ఉద్దేశం మాకు లేదు’’ అని చెప్పుకొచ్చారు. కానీ రష్యా భద్రత తదితరాల దృష్ట్యా ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదన్నారు. -
విడుదల చేయకుంటే నరకమే
జెరూసలెం: గాజాలో బందీలుగా ఉన్న వారందరినీ హమాస్ విడుదల చేయకపోతే నరక ద్వారాలు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. ‘‘గాజా విషయంలో ఇజ్రాయెల్, అమెరికాలకు ఉమ్మడి వ్యూహం ఉంది. ఈ వ్యూహం వివరాలను ప్రజలతో పంచుకోలేం. హమాస్ సైనిక, రాజకీయ ఉనికిని నిర్మూలించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నరకం గేట్లు ఎప్పుడు తెరుచుకుంటాయో వివరాలను తాము చెప్పలేం. బందీలందరినీ విడుదల చేయకపోతే మాత్రం అవి ఖచ్చితంగా తెరుచుకుంటాయి. గాజాలో హమాస్ సైనిక సామర్థ్యాన్ని, దాని రాజకీయ పాలనను అంతమొందిస్తాం. బందీలందరినీ స్వదేశానికి తీసుకొస్తాం. గాజా నుంచి మరోసారి ఇజ్రాయెల్‌కు ముప్పు వాటిల్లకుండా చూస్తాం’’అని నెతన్యాహూ వ్యాఖ్యానించారు. పశ్చిమాసియా పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆదివారం జెరూసలెం నగరానికి చేరుకుని అక్కడ నెతన్యాహుతో సమావేశమయ్యారు. అధ్యక్షుడు ట్రంప్ గాజా స్వా«దీన ప్రతిపాదనపై అరబ్ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు కొనసాగుతుందని రూబియో పునరుద్ఘాటించారు. ‘‘హమాస్ సైనిక లేదా ప్రభుత్వ శక్తిగా కొనసాగదు. హమాస్ అధికారంలో ఉన్నంత కాలం శాంతి అసాధ్యం. దానిని నిర్మూలించలేదు’’అని ఆయన ఉద్ఘాటించారు. రూబియో గానీ, నెతన్యాహు గానీ గాజా కాల్పుల విరమణ నిబంధనలను ప్రస్తావించలేదు. ఇరాన్‌పై ప్రత్యేక దృష్టి.. గాజా పరిస్థితితోపాటు ఇరాన్ గురించి నెతన్యాహు, రూబియో ప్రత్యేకంగా చర్చించారు. పశ్చిమాసియా మొత్తం సంక్షోభానికి ఇరాన్ కారణమని రూబియో, నెతన్యాహు ఆరోపించారు. టెహ్రాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా ఆపాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. పశ్చిమాసియాలోని ప్రతి ఉగ్రవాద సంస్థ వెనుక, ప్రతి హింసాత్మక చర్య వెనుక, ఈ ప్రాంతంలో లక్షలాదిమంది ప్రజల శాంతి, సుస్థిరతకు ముప్పు కలిగించే ప్రతి ఘటన వెనుక ఇరాన్ ఉంది’’అని రూబియో వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పటికే ఇరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ మద్దతుతో మిగిలిన పనిని పూర్తి చేస్తాం’’అని నెతన్యాహు అన్నారు. ఇజ్రాయెల్ దాడి బందీల మార్పిడి కొనసాగుతుండగా ఆదివారం ఈజిప్టు సరిహద్దులోని రఫా సమీపంలో ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపింది. దాడిలో ముగ్గురు హమాస్ సాయుధులు మరణించారు. ఈ దాడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, ఒప్పందాన్ని విచ్చిన్నం చేసేందుకు నెతన్యాహు ప్రయత్నిస్తున్నారని హమాస్ ఆరోపించింది. కాల్పుల విరమణ మొదటి దశ మరో రెండు వారాల్లో ముగియనుంది. రెండవ దశ కోసం చర్చలు ప్రారంభం కావాల్సి ఉంది.త్వరలో పాలస్తీనియన్ల తరలింపు: ఇజ్రాయెల్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా నుంచి పాలస్తీనియన్ల సామూహిక తరలింపు త్వరలో ప్రారంభమవుతుందని తాను ఆశిస్తున్నట్లు ఇజ్రాయెల్ అతివాద ఆర్థిక మంత్రి బెజాలెల్ స్మోట్రిచ్ శనివారం రాత్రి చెప్పారు. రాబోయే వారాల్లో ఇది ప్రారంభమవుతుందని ఆశిస్తున్నానన్నారు. ‘‘వచ్చే 10 నుంచి 15 ఏళ్ల వరకు గాజాలో పాలస్తీనియన్లకు ఏమీ ఉండదు. హమాస్ తిరిగి యుద్ధానికి ప్రయతి్నస్తే గాజా అంతా జబాలియా లాగా మరుభూమిగా మారడం ఖాయం’’అని మంత్రి బజాలెల వ్యాఖ్యానించారు. గాజా నుంచి పాలస్తీనియన్లను ఉద్దేశపూర్వకంగా తరలించడం మానవాళికి వ్యతిరేకంగా జరిగే నేరమని పలు అంతర్జాతీయ సంస్థలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్‌పై మారణహోమం ఆరోపణలను అంతర్జాతీయ న్యాయస్థానం ఇప్పటికే పరిశీలిస్తోంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు గాజాలో యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్పై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. కాగా, రెండు అంతర్జాతీయ ట్రిబ్యునళ్లను నెతన్యాహు తప్పుబట్టారు. అంతర్జాతీయ న్యాయస్థానంపై ఆంక్షలు విధించినందుకు ట్రంప్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన అంతర్జాతీయ న్యాయ సంస్థలపై మరిన్ని సంయుక్త చర్యలు తీసుకోవాలని సూచించారు. -
హమాస్‌ను నిర్మూలించాల్సిందే
జెరూసలేం: హమాస్‌ను గాజా నుంచి తుడిచిపెట్టాల్సిందేనని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో స్పష్టం చేశారు. సైనికపరమైన లేదా ప్రభుత్వాన్ని నడిపే శక్తిగా హమాస్ ఎంతమాత్రం కొనసాగనివ్వబోమని చెప్పారు. ఆదివారం ఆయన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వంగా, పరిపాలనా శక్తిగా, హింసకు పాల్పడతామంటూ బెదిరించే వ్యవస్థగా హమాస్ ఉన్నంత కాలం శాంతి నెలకొనడం అసాధ్యం. అందుకే హమాస్‌ను నిర్మూలించకతప్పదు’’ అని కుండబద్దలు కొట్టారు. హమాస్‌పై పోరుకు అరబ్ దేశాల సాయం కూడా కోరుతామన్నారు. ఎవరూ ముందుకు రాకుంటే సొంతంగా ఇజ్రాయెలే ఆపని పూర్తి చేస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల ఒప్పందం కొనసాగడంపై అనుమానంగా మారింది. దాని గడువు రెండు వారాల్లో ముగియనుంది. రెండో దశలో మిగతా బందీలను హమాస్ విడుదల చేయాల్సి ఉండటం తెలిసిందే. ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం గాజాపై దాడులకు దిగింది. వీటిలో తమ ముగ్గురు పోలీసులు చనిపోయినట్లు హమాస్ తెలిపింది. -
తాత్కాలికంగా ఖాళీ చేయిస్తామన్నారంతే..
గ్వాటెమాలా సిటీ: గాజా ప్రాంతాన్ని నియంత్రణలోకి తెచ్చుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మిత్ర దేశాలతోపాటు, సొంత రిపబ్లికన్ పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో, ట్రంప్ యంత్రాంగం కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. విదేశాంగ మంత్రి మార్కో రుబియో, వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ గురువారం ట్రంప్ మాటలకు మరో అర్థం చెప్పారు. గాజా పునర్నిర్మాణం చేపట్టేందుకు వీలుగా అక్కడున్న 18 లక్షల మంది పాలస్తీనియన్లకు మరో చోట తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేయాలన్నదే ట్రంప్ మాటల వెనుక అర్థమంటూ వివరించారు. విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక మార్కో రుబియో గురువారం మొట్టమొదటి విదేశీ పర్యటన కోసం గ్వాటెమాలా వెళ్లారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగిన 15 నెలల యుద్ధం ఫలితంగా గాజా ప్రాంతం శిథిలాలతో నిండిపోయింది. వాటిని తొలగించి పునర్నిర్మాణం చేపట్టాలనే సదుద్దేశంతో ట్రంప్ చాలా జాలితో పాలస్తీనియన్లకు సాయం చేయాలనే ఉద్దేశంతోనే ఆ ప్రతిపాదన చేశారు. పునర్నిర్మాణ పనులు జరిపేటప్పుడు అర్థంతరంగా వెళ్లాలన్నా వారు ఎక్కడికీ వెళ్లలేరు, అక్కడే ఉండిపోనూ లేరు’అని చెప్పుకొచ్చారు. లీవిట్ వాషింగ్టన్లో మీడియాతో సమావేశంలో.. గాజాను ధ్వంసమైన ప్రాంతంగా పేర్కొంటూ శిథిల భవనాలతో కూడిన ఫొటోను ప్రదర్శించారు. అధ్యక్షుడు అక్కడి వారిని గాజా నుంచి తాత్కాలికంగా తరలించాలని స్పష్టంగా చెప్పారు. గాజా ప్రస్తుతం మనుషులకు ఏమాత్రం నివాసయోగ్యంగా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వారిని అక్కడే ఉండిపోవాలనడం కూడా దుర్మార్గమైన సూచన అనిపించుకుంటుంది’అంటూ వివరించే ప్రయత్నం చేశారు. అయితే, గాజాకు అమెరికా బలగాలను పంపే యోచనను ఆయన కొట్టిపారేయలేదు. చర్చలు సవ్యంగా సాగాలంటే అమెరికా బలగాలు అక్కడుండాల్సిన అవసరముందని చెప్పారు. గాజా పునర్నిర్మాణానికి ఉన్న అన్ని రకాల ప్రత్యామ్నాయాలతో మిలటరీ సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ బుధవారం ప్రకటించారు. జాతి నిర్మూలన ఆలోచన వద్దు: గ్యుటెరస్ ఇజ్రాయెల్–పాలస్తీనా రెండు దేశాల పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి కట్టుబడి ఉంటుందని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరస్ పునరుద్ఘాటించారు. జాతి నిర్మూలన యోచనను నివారించడం అత్యవసరమన్నారు. పాలస్తీనియన్లను వేరే ప్రాంతానికి పంపించి, గాజా నుంచి ను స్వా«దీనం చేసుకుంటామన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘సమస్య పరిష్కారాన్ని వెదికే ప్రయత్రంలో పరిస్థితిని మరింత దిగజార్చరాదు. అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండటం అత్యావశ్యకం. ఏ రూపంలో అయినా జాతి నిర్మూలన నివారించాలి’అని పేర్కొన్నారు. ఆక్రమణలకు ముగింపు పలకాలన్నారు. గాజా అంతర్భాగంగా స్వతంత్ర పాలస్తీనా రాజ్య స్థాపనతో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అన్ని వర్గాలు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. పశి్చమాసియా శాంతి సుస్థిరతలకు ఇదే అసలైన పరిష్కారమని నొక్కిచెప్పారు.ట్రంప్ ఏమన్నారంటే.. గాజాలో పాలస్తీనియన్లందరినీ వేరే ప్రాంతానికి తరలించి, అక్కడే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేస్తామంటూ ట్రంప్ మంగళవారం ప్రకటించారు. అనంతరం అక్కడ అమెరికా బలగాలను దించి, భారీగా పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడతామన్నారు. శాశ్వతమైన మంచి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ప్రస్తుతమున్నట్లుగా కాకుండా అప్పుడు గాజాలో సంతోషంగా ఉండొచ్చు. తుపాకీ కాల్పులు, ఎవరైనా పొడుస్తారని, చంపేస్తారని భయాలుండవు. అమెరికా దీర్ఘకాల యాజమాన్యంలో మధ్యధర సముద్ర తీరంలోని ఆ ప్రాంతంలో పునర్నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఈ మాటలపై, పాలస్తీనియన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తమ సొంత భూభాగాన్ని ఒకసారి వదిలేసి వెళితే, తిరిగి రానివ్వరంటూ వారు భయాందోళనలకు గురయ్యారు. అరబ్ దేశాలు సైతం ట్రంప్ ప్రతిపాదనను తప్పుబట్టాయి. ఈజిప్టు, జోర్డాన్ వంటి మిత్ర దేశాలు సైతం పాలస్తీనియన్ల తరలింపును వ్యతిరేకించాయి. ఇటువంటి చర్యవల్ల పశి్చమాసియా సుస్థిరత ప్రమాదంలో పడుతుందని, సంక్షోభం మరింత ముదురుతుందని హెచ్చరించాయి. సౌదీ అరేబియా కూడా ట్రంప్ ప్రకటనను తప్పుబట్టింది. ట్రంప్ ప్రకటన సమస్యాత్మకంగా ఉందని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం పేర్కొన్నారు. -
కాలువపై చైనా ఆధిపత్యాన్ని తగ్గించండి
వాషింగ్టన్: పనామా కాలువపై చైనా ఆధిపత్యం, నియంత్రణను తగ్గించడానికి అత్యవసర మార్పులు చేయాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పనామా దేశాన్ని హెచ్చరించారు. ఆదివారం పనామాలో పర్యటించిన రూబియో.. పనామా దేశాధక్షుడు జోస్ రౌల్ ములినోతో భేటీ అయ్యారు. కాలువపై యథాతథ స్థితి ఆమోదయోగ్యం కాదని, తక్షణ మార్పులు లేకపోతే, ఒప్పందం ప్రకారం తన హక్కులను రక్షించడానికి అమెరికా అవసరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అయితే అమెరికా బెదిరింపులకు తాము భయపడబోమని ములినో స్పష్టం చేశారు. చైనా ఆధిపత్యం గురించి అమెరికా ఆందోళనలను పోగొట్టేందుకు చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రూబియో పర్యటన వలసలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడం వంటి ఉమ్మడి ఆసక్తులపై దృష్టి పెడుతుందని ములినో ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు నుంచి తాము వైదొలుగుతున్నట్లు పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో ప్రకటించారు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ములినో ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో చేరేందుకు 2017లో చైనాతో చేసుకున్న ఒప్పందాన్ని తాము పునరుద్ధరించబోమని ఆయన తెలిపారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యాక అక్రమ వలసదారుల ఏరివేతకు సహకారాన్ని పెంచుతామని ములినో హామీ ఇచ్చారు. రూబియో పర్యటనకు ముందు పనామాలో తీవ్ర నిరసనలు చెలరేగాయి. నిరసనకారులు ట్రంప్, రూబియో దిష్టి»ొమ్మలను దగ్ధం చేశారు. దీంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. -
భారత్‌తో అమెరికా వాణిజ్యం బలోపేతం
వాషింగ్టన్: భారత్‌తో తమ వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నట్లు అమెరికా నూతన విదేశాంగ మంత్రి మార్కో రూబియో వ్యాఖ్యానించారు. అమెరికా విదేశాంగ మంత్రిగా ప్రమాణంచేసిన కొద్దిసేపటికే ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో భేటీ అయ్యారు. 53 ఏళ్ల రూబియో బాధ్యతలు చేపట్టగానే భారత్‌తో భేటీకి సిద్ధపడటం అమెరికా భారత్‌కు ఇస్తున్న అత్యధిక ప్రాధాన్యతను చాటిచెబుతోంది. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం, తర్వాత క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు జైశంకర్ అమెరికాకు వచ్చిన విషయం తెల్సిందే. క్వాడ్ భేటీ తర్వాత అమెరికా విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయంలో రూబియో, జైశంకర్ విస్తతస్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. -
అమెరికా విదేశాంగ మంత్రిగా రూబియో
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిౖన డొనాల్డ్ ట్రంప్ కీలక పదవులకు ఎంపికలను వేగిరం చేశారు. విదేశాంగ మంత్రిగా ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియో(53)ను, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) పదవికి కాంగ్రెస్ సభ్యుడు మైక్ వాల్జ్ (50)లను ఎంపిక చేశారు. రూబియో, వాల్జ్‌ల ఎంపికను ట్రంప్ రెండో హయాంలో భారత్– అమెరికాల మధ్య సన్నిహిత సంబంధాలకు కొనసాగింపుగా భావిస్తు న్నారు. భారత్‌కు మిత్రుడిగా పేరున్న రూబియో, భారత్– అమెరికా సంబంధాలను మెరుగుపర్చడంలో కీలకంగా ఉంటున్నారు.ట్రంప్‌కు నమ్మినబంటుగా పేరున్న వాల్జ్ భారత్‌కు పాత మిత్రుడే. భారతీయ అమెరికన్ల పక్షాన మాట్లాడే వాల్జ్, ఇండియా కంగ్రెషనల్ కాకస్‌కు సహాధ్యక్షుడిగా ఉండటం గమనార్హం. వీరిద్దరితోపాటు యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్టివ్ ఏజెన్సీ(ఈపీఏ) హెడ్‌గా కాంగ్రెస్ మాజీ సభ్యుడు లీ జెల్డిన్ పేరును ట్రంప్ ప్రకటించారు. అయితే తాజా ఎంపికలపై ట్రంప్ యంత్రాంగం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఇండియా కాకస్ హెడ్‌కు ఎన్ఎస్ఏ బాధ్యతలుభారత్ కాకస్ కో–చైర్‌గా ఉన్న వాల్జ్ ఎన్ఎస్ఏ హోదాలో ట్రంప్ విధానాలకు అనుగుణంగా కఠిన విధానాలను తీసుకొస్తారని భావిస్తు న్నారు. ఈ నియామకానికి సెనేట్ ఆమోదం అవసరం లేదు. అమెరికా ఆర్మీలో కల్నల్‌గా అఫ్గానిస్తాన్, పశ్చిమాసియా, ఆఫ్రికాల్లో పనిచేశారు. వీరోచితంగా పోరాడినందుకు ప్రతిష్టాత్మక గ్రీన్ బెరెట్ గౌరవం పొందారు. వాల్జ్ 2019 నుంచి అమెరికా కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నారు.ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్‌గా 2021లో అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణపై అధ్యక్షుడు జో బైడెన్‌ను నిలదీసి వార్తల్లో కెక్కారు. ప్రాంతీయ సుస్థిరత సాధనకు చైనాపై కఠిన వైఖరి, భారత్ వంటి ప్రజాస్వామిక దేశాలతో బలమైన పొత్తులు అవసరమన్నది ఈయన వాదన. 2023లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా క్యాపిటల్ హిల్ వద్ద ప్రసంగాన్ని ఏర్పాటు చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. ఏమిటీ ఇండియా కాకస్..?అమెరికా కాంగ్రెస్‌లో భాగమైన ఇండియా కాకస్ భారత్ అనుకూల విధానాల రూప కల్పనలో చురుగ్గా వ్యవహరిస్తుంది. భారత్–అమెరికా ఆర్థిక వ్యవస్థ, భద్రతలను ప్రభావితం చేస్తుంది. 2004లో అప్పటి సెనేటర్లు, విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్, జాన్ కార్నిన్‌లు నెలకొల్పారు. ప్రస్తుతం 40 మంది సభ్యులున్న ఈ కమిటీ సెనేట్‌లో అతిపెద్ద కాకస్‌గా గుర్తింపు పొందింది. -
నిన్నటివరకు ట్రంప్‌ను తిట్టి.. ఇప్పుడు యూటర్న్!
డొనాల్డ్ ట్రంప్ ఓ మాయాగాడు. ప్రమాదకారి. భారీ అణ్వాయుధాలు ఉన్న అమెరికా లాంటి దేశానికి అధ్యక్షుడు కావడానికి ట్రంప్ అనర్హుడు. అతడికి మనిషికి ఉండే లక్షణాలు లేవు. అధ్యక్ష అభ్యర్థి నామినేషన్ ట్రంప్‌కు దక్కితే రిపబ్లికన్ పార్టీ నిలువునా చీలిపోతుంది.. అంటూ నిన్నటివరకు ట్రంప్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన మార్క్ రూబియో ఇప్పుడు మాట మార్చారు. ఫ్లోరిడా సెనెటర్ అయిన ఆయన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ట్రంప్‌తో పోరాడారు. రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై తీవ్రస్థాయిలో రుబియో ధ్వజమెత్తారు. ఒకదశలో రిపబ్లికన్ పార్టీ ఆయనకే మద్దతు ఇస్తుండటంతో తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగడం ఖాయమవ్వడంతో ఆయనకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమంటూ రుబియో స్పష్టం చేశాడు. క్లీవ్‌లాండ్‌లో జరగనున్న రిపబ్లికన్ జాతీయ సదస్సుకు హాజరవుతానని, అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు ట్రంప్‌కు అండగా నిలువడాన్ని గౌరవంగా భావిస్తానని రుబియో తాజాగా సీఎన్ఎన్ చానెల్‌కు తెలిపారు. హిల్లరీ క్లింటన్ అధక్ష్య పదవి అధిష్టించకూడదని, అందుకే ట్రంప్‌కు తాను మద్దతు ఇస్తున్నానని చెప్పారు. -
‘సూపర్ ట్యూస్డే 2.0’పై ఉత్కంఠ
తేలనున్న రూబియో, కసిచ్‌ల భవితవ్యం వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ టికెట్ కోసం పోటీపడుతున్న మార్క్ రూబియో, జాన్ కసిచ్‌ల భవితవ్యం మంగళవారం జరిగే పోరుతో తేలిపోనుంది. ‘సూపర్ ట్యూస్డే 2.0’లో భాగంగా ఐదు రాష్ట్రాల్లో రిపబ్లికన్ అభ్యర్థులు తలపడుతుండగా... కీలకమైన ఫ్లారిడా, ఒహయోలపైనే అందరి దృష్టి నెలకొంది. రూబియో ఫ్లారిడా నుంచి సెనేటర్ కాగా, కసిచ్ ఒహయో గవర్నర్‌గా ఉన్నారు. అధ్యక్ష అభ్యర్థి బరిలో నిలవాలంటే రూబియో, కసిచ్‌లు సొంత రాష్ట్రాల్లో గెలవాల్సిన అవసరముంది. మరోవైపు రేసులో ముందంజలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌కు నిరసనగా కొన్ని రోజులుగా షికాగో, ఒహయోలో ర్యాలీలు జరగడంతో ఈ ప్రైమరీలపై ఆసక్తి నెలకొంది. అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకోవాలంటే ట్రంప్ ఆ రెండు రాష్ట్రాల్లో గెలవాలి. ట్రంప్ 14 రాష్ట్రాల్లో గెలిచి 460 మంది ప్రతినిధుల మద్దతు సాధించగా... టెడ్ క్రూజ్ 7 రాష్ట్రాల్లో గెలుపొంది 360 మంది మద్దతు సాధించారు. ఫ్లారిడా, ఒహయోలతో పాటు ఇలినాయ్, మిస్సోరీ, నార్త్ కరోలినా, ఉత్తర మారియానా దీవుల్లో ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 360 మంది ప్రతినిధులు ఓటు వేస్తారు. ఒహయోలో ట్రంప్, కసిచ్‌ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంని అంచనా. కసిచ్‌కు రిపబ్లికన్ మాజీ అధ్యక్ష అభ్యర్థి మిట్ రోమ్నీ మద్దతు తెలపడంతో పాటు ప్రచారంలో కూడా పాల్గొంటానని చెప్పారు. ట్రంప్‌ను ఓడించాలంటూ ఆయన బహిరంగంగానే పిలుపునిచ్చారు. -
'అలాంటి అవకాశమే లేదు'
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్ష పదవి రేసులో తాను ఉన్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని సౌత్ కరోలినా ఇండియన్-అమెరికన్ గవర్నర్ నిక్కీ హేలీ తోసిపుచ్చారు. రిపబ్లిక్ పార్టీ తరపున ఆమెకు ఉపాధ్యక్ష పదవి లభించే అవకాశముందని వార్తలు వచ్చాయి. అలాంటి అవకాశమే లేదని ఆమె కొట్టిపారేశారు. 'నా ప్లేటు ఫుల్ గా ఉంది. గవర్నర్ బాధ్యతలతో సంతృప్తిగా ఉన్నాను. నా కుమార్తె వచ్చే ఏడాది కాలేజీలో చేరబెతోంది. నా కుమారుడు స్కూల్ మధ్యలో ఉన్నాడు. నేను ఎంతో ఇష్టపడే రాష్ట్రం ఉంది. ఇక్కడ నేను పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయ'ని ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అమెరికాకు గొప్ప వ్యక్తి అధ్యక్షుడు కాబోతున్నారని 44 ఏళ్ల హేలీ చెప్పారు. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావిస్తున్న ఫ్లోరిడా సెనేటర్ మార్ కో రుబియోకు ఆమె మద్దతు ప్రకటించారు.