
బందీల విషయంలో హమాస్‌కు ఇజ్రాయెల్
ప్రధాని నెతన్యాహు హెచ్చరిక
అమెరికా విదేశాంగ మంత్రి రూబియోతో నెతన్యాహు భేటీ
గాజా, ఇరాన్ సహా పలు అంశాలపై చర్చలు
జెరూసలెం: గాజాలో బందీలుగా ఉన్న వారందరినీ హమాస్ విడుదల చేయకపోతే నరక ద్వారాలు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. ‘‘గాజా విషయంలో ఇజ్రాయెల్, అమెరికాలకు ఉమ్మడి వ్యూహం ఉంది. ఈ వ్యూహం వివరాలను ప్రజలతో పంచుకోలేం. హమాస్ సైనిక, రాజకీయ ఉనికిని నిర్మూలించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నరకం గేట్లు ఎప్పుడు తెరుచుకుంటాయో వివరాలను తాము చెప్పలేం. బందీలందరినీ విడుదల చేయకపోతే మాత్రం అవి ఖచ్చితంగా తెరుచుకుంటాయి.
గాజాలో హమాస్ సైనిక సామర్థ్యాన్ని, దాని రాజకీయ పాలనను అంతమొందిస్తాం. బందీలందరినీ స్వదేశానికి తీసుకొస్తాం. గాజా నుంచి మరోసారి ఇజ్రాయెల్‌కు ముప్పు వాటిల్లకుండా చూస్తాం’’అని నెతన్యాహూ వ్యాఖ్యానించారు. పశ్చిమాసియా పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆదివారం జెరూసలెం నగరానికి చేరుకుని అక్కడ నెతన్యాహుతో సమావేశమయ్యారు.
అధ్యక్షుడు ట్రంప్ గాజా స్వా«దీన ప్రతిపాదనపై అరబ్ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు కొనసాగుతుందని రూబియో పునరుద్ఘాటించారు. ‘‘హమాస్ సైనిక లేదా ప్రభుత్వ శక్తిగా కొనసాగదు. హమాస్ అధికారంలో ఉన్నంత కాలం శాంతి అసాధ్యం. దానిని నిర్మూలించలేదు’’అని ఆయన ఉద్ఘాటించారు. రూబియో గానీ, నెతన్యాహు గానీ గాజా కాల్పుల విరమణ నిబంధనలను ప్రస్తావించలేదు.
ఇరాన్‌పై ప్రత్యేక దృష్టి..
గాజా పరిస్థితితోపాటు ఇరాన్ గురించి నెతన్యాహు, రూబియో ప్రత్యేకంగా చర్చించారు. పశ్చిమాసియా మొత్తం సంక్షోభానికి ఇరాన్ కారణమని రూబియో, నెతన్యాహు ఆరోపించారు. టెహ్రాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా ఆపాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. పశ్చిమాసియాలోని ప్రతి ఉగ్రవాద సంస్థ వెనుక, ప్రతి హింసాత్మక చర్య వెనుక, ఈ ప్రాంతంలో లక్షలాదిమంది ప్రజల శాంతి, సుస్థిరతకు ముప్పు కలిగించే ప్రతి ఘటన వెనుక ఇరాన్ ఉంది’’అని రూబియో వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పటికే ఇరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ మద్దతుతో మిగిలిన పనిని పూర్తి చేస్తాం’’అని నెతన్యాహు అన్నారు.
ఇజ్రాయెల్ దాడి
బందీల మార్పిడి కొనసాగుతుండగా ఆదివారం ఈజిప్టు సరిహద్దులోని రఫా సమీపంలో ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపింది. దాడిలో ముగ్గురు హమాస్ సాయుధులు మరణించారు. ఈ దాడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, ఒప్పందాన్ని విచ్చిన్నం చేసేందుకు నెతన్యాహు ప్రయత్నిస్తున్నారని హమాస్ ఆరోపించింది. కాల్పుల విరమణ మొదటి దశ మరో రెండు వారాల్లో ముగియనుంది. రెండవ దశ కోసం చర్చలు ప్రారంభం కావాల్సి ఉంది.త్వరలో పాలస్తీనియన్ల
తరలింపు: ఇజ్రాయెల్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా నుంచి పాలస్తీనియన్ల సామూహిక తరలింపు త్వరలో ప్రారంభమవుతుందని తాను ఆశిస్తున్నట్లు ఇజ్రాయెల్ అతివాద ఆర్థిక మంత్రి బెజాలెల్ స్మోట్రిచ్ శనివారం రాత్రి చెప్పారు. రాబోయే వారాల్లో ఇది ప్రారంభమవుతుందని ఆశిస్తున్నానన్నారు. ‘‘వచ్చే 10 నుంచి 15 ఏళ్ల వరకు గాజాలో పాలస్తీనియన్లకు ఏమీ ఉండదు. హమాస్ తిరిగి యుద్ధానికి ప్రయతి్నస్తే గాజా అంతా జబాలియా లాగా మరుభూమిగా మారడం ఖాయం’’అని మంత్రి బజాలెల వ్యాఖ్యానించారు.
గాజా నుంచి పాలస్తీనియన్లను ఉద్దేశపూర్వకంగా తరలించడం మానవాళికి వ్యతిరేకంగా జరిగే నేరమని పలు అంతర్జాతీయ సంస్థలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్‌పై మారణహోమం ఆరోపణలను అంతర్జాతీయ న్యాయస్థానం ఇప్పటికే పరిశీలిస్తోంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు గాజాలో యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్‌పై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. కాగా, రెండు అంతర్జాతీయ ట్రిబ్యునళ్లను నెతన్యాహు తప్పుబట్టారు. అంతర్జాతీయ న్యాయస్థానంపై ఆంక్షలు విధించినందుకు ట్రంప్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన అంతర్జాతీయ న్యాయ సంస్థలపై మరిన్ని సంయుక్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment