israeli prime minister
-
విడుదల చేయకుంటే నరకమే
జెరూసలెం: గాజాలో బందీలుగా ఉన్న వారందరినీ హమాస్ విడుదల చేయకపోతే నరక ద్వారాలు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. ‘‘గాజా విషయంలో ఇజ్రాయెల్, అమెరికాలకు ఉమ్మడి వ్యూహం ఉంది. ఈ వ్యూహం వివరాలను ప్రజలతో పంచుకోలేం. హమాస్ సైనిక, రాజకీయ ఉనికిని నిర్మూలించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నరకం గేట్లు ఎప్పుడు తెరుచుకుంటాయో వివరాలను తాము చెప్పలేం. బందీలందరినీ విడుదల చేయకపోతే మాత్రం అవి ఖచ్చితంగా తెరుచుకుంటాయి. గాజాలో హమాస్ సైనిక సామర్థ్యాన్ని, దాని రాజకీయ పాలనను అంతమొందిస్తాం. బందీలందరినీ స్వదేశానికి తీసుకొస్తాం. గాజా నుంచి మరోసారి ఇజ్రాయెల్‌కు ముప్పు వాటిల్లకుండా చూస్తాం’’అని నెతన్యాహూ వ్యాఖ్యానించారు. పశ్చిమాసియా పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆదివారం జెరూసలెం నగరానికి చేరుకుని అక్కడ నెతన్యాహుతో సమావేశమయ్యారు. అధ్యక్షుడు ట్రంప్ గాజా స్వా«దీన ప్రతిపాదనపై అరబ్ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు కొనసాగుతుందని రూబియో పునరుద్ఘాటించారు. ‘‘హమాస్ సైనిక లేదా ప్రభుత్వ శక్తిగా కొనసాగదు. హమాస్ అధికారంలో ఉన్నంత కాలం శాంతి అసాధ్యం. దానిని నిర్మూలించలేదు’’అని ఆయన ఉద్ఘాటించారు. రూబియో గానీ, నెతన్యాహు గానీ గాజా కాల్పుల విరమణ నిబంధనలను ప్రస్తావించలేదు. ఇరాన్‌పై ప్రత్యేక దృష్టి.. గాజా పరిస్థితితోపాటు ఇరాన్ గురించి నెతన్యాహు, రూబియో ప్రత్యేకంగా చర్చించారు. పశ్చిమాసియా మొత్తం సంక్షోభానికి ఇరాన్ కారణమని రూబియో, నెతన్యాహు ఆరోపించారు. టెహ్రాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా ఆపాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. పశ్చిమాసియాలోని ప్రతి ఉగ్రవాద సంస్థ వెనుక, ప్రతి హింసాత్మక చర్య వెనుక, ఈ ప్రాంతంలో లక్షలాదిమంది ప్రజల శాంతి, సుస్థిరతకు ముప్పు కలిగించే ప్రతి ఘటన వెనుక ఇరాన్ ఉంది’’అని రూబియో వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పటికే ఇరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ మద్దతుతో మిగిలిన పనిని పూర్తి చేస్తాం’’అని నెతన్యాహు అన్నారు. ఇజ్రాయెల్ దాడి బందీల మార్పిడి కొనసాగుతుండగా ఆదివారం ఈజిప్టు సరిహద్దులోని రఫా సమీపంలో ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపింది. దాడిలో ముగ్గురు హమాస్ సాయుధులు మరణించారు. ఈ దాడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, ఒప్పందాన్ని విచ్చిన్నం చేసేందుకు నెతన్యాహు ప్రయత్నిస్తున్నారని హమాస్ ఆరోపించింది. కాల్పుల విరమణ మొదటి దశ మరో రెండు వారాల్లో ముగియనుంది. రెండవ దశ కోసం చర్చలు ప్రారంభం కావాల్సి ఉంది.త్వరలో పాలస్తీనియన్ల తరలింపు: ఇజ్రాయెల్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా నుంచి పాలస్తీనియన్ల సామూహిక తరలింపు త్వరలో ప్రారంభమవుతుందని తాను ఆశిస్తున్నట్లు ఇజ్రాయెల్ అతివాద ఆర్థిక మంత్రి బెజాలెల్ స్మోట్రిచ్ శనివారం రాత్రి చెప్పారు. రాబోయే వారాల్లో ఇది ప్రారంభమవుతుందని ఆశిస్తున్నానన్నారు. ‘‘వచ్చే 10 నుంచి 15 ఏళ్ల వరకు గాజాలో పాలస్తీనియన్లకు ఏమీ ఉండదు. హమాస్ తిరిగి యుద్ధానికి ప్రయతి్నస్తే గాజా అంతా జబాలియా లాగా మరుభూమిగా మారడం ఖాయం’’అని మంత్రి బజాలెల వ్యాఖ్యానించారు. గాజా నుంచి పాలస్తీనియన్లను ఉద్దేశపూర్వకంగా తరలించడం మానవాళికి వ్యతిరేకంగా జరిగే నేరమని పలు అంతర్జాతీయ సంస్థలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్‌పై మారణహోమం ఆరోపణలను అంతర్జాతీయ న్యాయస్థానం ఇప్పటికే పరిశీలిస్తోంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు గాజాలో యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్పై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. కాగా, రెండు అంతర్జాతీయ ట్రిబ్యునళ్లను నెతన్యాహు తప్పుబట్టారు. అంతర్జాతీయ న్యాయస్థానంపై ఆంక్షలు విధించినందుకు ట్రంప్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన అంతర్జాతీయ న్యాయ సంస్థలపై మరిన్ని సంయుక్త చర్యలు తీసుకోవాలని సూచించారు. -
గాజాపై ట్రంప్ కన్ను
వాషింగ్టన్: సంచలనాల ట్రంప్ మరో అంతర్జాతీయ సమాజంపై మరో బాంబు విసిరారు. గాజాను అమెరికా పూర్తిగా స్వా«దీనం చేసుకుంటుందని ప్రకటించారు. ‘‘ఇజ్రాయెల్‌తో యుద్ధంలో శ్మశానసదృశంగా మారిన గాజాను అత్యంత సుందర పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. ఆర్థికాభివృద్ధి కార్యకలాపాలు చేపడతాం. భారీగా ఆవాస, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’’ అని అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. గాజాలో ఉంటున్న దాదాపు 20 లక్షల మంది పాలస్తీనావాసులు ఆ ప్రాంతాన్ని వీడాల్సిందేనని స్పష్టం చేశారు. వారిని గాజా నుంచి శాశ్వతంగా తరలించి పునరావాసం కల్పిస్తామన్నారు. అయితే, పశ్చిమాసియాలోని పొరుగు దేశాలే వారిని అక్కున చేర్చుకోవాలని తేల్చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సమక్షంలోనే ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేయడం విశేషం. పాలస్తీనావాసులను గాజా నుంచి తరలించేందుకు, ఆ ప్రాంతాన్ని స్వా«దీనం చేసుకునేందుకు అమెరికాకు ఏం అధికారముందని ప్రశ్నించగా తన చర్య గాజా, ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియా అంతటికీ గొప్ప స్థిరత్వాన్ని తెస్తుందని ఆయన బదులిచ్చారు. గాజా స్వా«దీనానికి సైన్యాన్ని రంగంలోకి దించుతారా అని ప్రశ్నించగా, అన్ని అవకాశాలనూ పరిశీలిస్తామని బదులిచ్చారు. ఈ సందర్భంగా నెతన్యాహూ పదేపదే చిరునవ్వులు చిందిస్తూ కన్పించారు. ట్రంప్ ప్రకటనకు పూర్తి మద్దతు తెలిపారు. ‘‘ఈ నిర్ణయం చరిత్రను మార్చేస్తుంది. గాజాకు అద్భుతమైన భవిష్యత్తు అందిస్తుంది. ఇజ్రాయెల్‌కు ముప్పును శాశ్వతంగా తొలగిస్తుంది’’ అని ప్రకటించారు. ట్రంప్ ప్రకటన అంతర్జాతీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. పశ్చిమాసియా భౌగోళిక, రాజకీయ పరిస్థితులను అల్లకల్లోలం చేసేలా కనిపిస్తున్న ఈ ప్రతిపాదనను అక్కడి దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. పాలస్తీనా, సౌదీ అరేబియా, ఈజిప్‌్ట, తుర్కియేతో పాటు చైనా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ కూడా దీన్ని ఖండించాయి. అమెరికాలో విపక్ష నేతలు కూడా ట్రంప్ ప్రకటనను దుయ్యబడుతున్నారు. గాజావాసులకు తమ దేశంలో ఆశ్రయం కల్పించాలన్న ట్రంప్ ప్రతిపాదనను ఈజిప్‌్ట, జోర్డాన్, తుర్కియే తదితర అమెరికా మిత్ర దేశాలన్నీ ఇప్పటికే ముక్త కంఠంతో తిరస్కరించడం తెలిసిందే. గ్రీన్‌లాండ్‌ను, పనామా కాల్వను స్వా«దీనం చేసుకుంటానని, కెనడాను అమెరికాలో కలిపేస్తానని ట్రంప్ ఇప్పటికే పలు వివాదాస్పద ప్రకటనలు చేశారు. అంతర్జాతీయ ప్రాంతంగా గాజా అమెరికా పర్యటనలో ఉన్న నెతన్యాహూతో ట్రంప్ మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో ఆకస్మికంగా గాజా స్వా«దీన ప్రకటన చేశారు. దీన్ని పశ్చిమాసియా గర్వించదగ్గ విషయంగా అభివరి్ణంచారు. ‘‘పశ్చిమాసియా నమ్మశక్యం కానంత గొప్ప ప్రదేశం. అద్భుతమైన తీర ప్రాంతం. గొప్ప వ్యక్తులతో నిండిన అందమైన ప్రదేశాల్లో ఒకటి. గాజాలో త్వరలో పర్యటిస్తా. ఇజ్రాయెల్ అంటే నాకిష్టం. అక్కడ, సౌదీ అరేబియాలో, పశ్చిమాసియా అంతటా పర్యటిస్తా. గాజాలో ఇప్పుడేమీ మిగల్లేదు. ఆ ప్రాంతమంతా మృత్యువుకు, విధ్వంసానికి చిరునామాగా, నరకకూపంగా మారింది. ప్రతి భవనమూ నేలమట్టమైంది. చిరకాలంగా శప్తభూమిగా ఉన్న గాజాను పూర్తిగా పునరి్నరి్మస్తాం. పేలని బాంబులు, ఆయుధాలను తొలగిస్తాం. ధ్వంసమైన భవనాలను తొలగించి ఆ ప్రాంతాన్నంతా చదును చేస్తాం. అక్కడ అపరిమితమైన ఉద్యోగాలందించేలా అద్భుతమైన ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తాం. గాజావాసుల జీవన స్థితిగతులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాం. ఏ ఒక్క సమూహానికో కాకుండా అందరికీ అద్భుతమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పాలస్తీనావాసులతో పాటు ప్రపంచం నలుమూలలకు చెందిన ప్రజలు అక్కడ నివసిస్తారు. లేదంటే ఆ ప్రాంతం వందల ఏళ్లుగా ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఏదైనా డిఫరెంట్‌గా చేయాలి. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అది పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఏదైనా అద్భుతం చేయడానికి మాకు అవకాశముంది’’ అని చెప్పుకొచ్చారు. ‘‘ఇదేమీ అల్లాటప్పగా తీసుకున్న నిర్ణయం కాదు. దీనిపై చాలా ప్రముఖులు, ముఖ్యులతో లోతుగా చర్చించా. వారంతా నా ప్రతిపాదనను అమితంగా ఇష్టపడ్డారు. గాజాను సొంతం చేసుకుని అభివృద్ధి చేసి అపారమైన ఉపాధి అవకాశాలు సృష్టించాలన్న అమెరికా ఆలోచనలను ఇష్టపడుతున్నారు’’ అని చెప్పారు. ‘‘గాజాలో దశాబ్దాలుగా మరణమృదంగం కొనసాగుతోంది. చంపుకోవడాలు లేకుండా ఆనందంగా ఉండగలిగే అందమైన ప్రదేశంలో వారికి శాశ్వతంగా పునరావాసం కల్పించగలిగితే చాలు. మరో దారి లేకే వారు గాజాకు తిరిగి వెళ్తున్నారు. ఎప్పుడు కూలతాయో తెలియని పై కప్పుల కింద బతుకీడుస్తున్నారు. దానికి బదులుగా అందమైన ఇళ్లలో సురక్షితంగా, స్వేచ్ఛగా, శాంతియుతంగా జీవించే అవకాశం వారి ముందుంది. ఆ మేరకు చక్కని పునరావాసం పొందగలరని, ఇప్పుడు వద్దంటున్న దేశాల్లోనే వారికి ఆ సదుపాయం ఏర్పాటు చేయగలనని నమ్ముతున్నా’’ అని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనుసరించదగ్గ మార్గం ఇదేనని నెతన్యాహూ అభిప్రాయపడ్డారు. ‘‘హమాస్‌ను నిర్మూలించాలన్న మా లక్ష్యాలను సాధించడానికి ట్రంప్ కొత్త ఆలోచనలతో ముందుకొచ్చారు. ఇది యూదు జాతికి సాయపడుతుంది’’ అని చెప్పారు. ‘‘ఉగ్రవాదానికి కేంద్రబిందువుగా ఉన్న గాజాకు భిన్నమైన భవిష్యత్తును ట్రంప్ కాంక్షిస్తున్నారు. హంతక సంస్థ (హమాస్)ను నిర్మూలిస్తే అక్కడ శాంతి సాధ్యమే’’ అన్నారు. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందో లేదో చెప్పలేనన్నారు. బైడెన్ ప్రభుత్వం తమకు పెద్దగా సాయం చేయలేదని నెతన్యాహూ ఆక్షేపించారు. గాజాను వీడబోం: స్థానికులు ట్రంప్ ప్రతిపాదనపై గాజా పౌరులు మండిపడుతున్నారు. ‘‘ఇన్నాళ్లకు కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత సొంత గూటికి తిరిగి వెళ్తున్నాం. మా ఇళ్లను విడిచిపెట్టబోం. గౌరవప్రదమైన జీవితం కోరుకుంటున్నాం. మా నేతలను వీడాలనుకోవడం లేదు’’ అని చెబుతున్నారు. ట్రంప్ ప్రతిపాదన గాజాతో పాటు పరిసర దేశాల్లో మరింత విధ్వంసానికి, ఘర్షణకు కారణమవుతుందని వారంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయకుండా ఇజ్రాయెల్‌తో ఎలాంటి సంబంధాలను కొనసాగించబోమని స్పష్టం చేసింది. గాజన్లు తమ ఇళ్లకు తిరిగి వచ్చి పునరి్నరి్మంచాలని కోరుకుంటున్నారని ఐరాసలో పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ అన్నారు. వారి ఆకాంక్షలను గౌరవించాలన్నారు. ట్రంప్‌ది హాస్యాస్పద, అసంబద్ధ ప్రకటన అని హమాస్ దుయ్యబట్టింది. ‘‘ఈ తరహా ఆలోచనలు పశ్చిమాసియాలో మరిన్ని ఘర్షణలకు దారితీస్తాయి. గాజావాసులకు సమీప దేశాల్లో పునరావాసం కల్పించాలన్న ట్రంప్ ప్రతిపాదన మరింత గందరగోళం, ఉద్రిక్తతలకు కారణమవుతుంది. గాజావాసులు దీనికి ఒప్పుకోరు’’ అని హమాస్ అధికారి సమీ అబు స్పష్టం చేశారు.అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగాట్రంప్ గాజా ప్రణాళిక గాజాను పునరి్నర్మించాలంటూ పది రోజుల క్రితమే పిలుపునిచ్చిన ట్రంప్ ఆ విషయమై ఎంత సీరియస్‌గా ఉన్నారో తాజా ప్రకటనతో ప్రపంచానికి తెలిసొచి్చంది. కానీ అంతర్జాతీయ చట్టాలకు పూర్తిగా విరుద్ధమైన ఆయన గాజా ప్రణాళిక పశ్చిమాసియాను అతలాకుతలం చేయడమే గాక ప్రపంచ శాంతికి గొడ్డలిపెట్టుగా మారేలా కనిపిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం, ఇజ్రాయెల్–హమాస్ పరస్పర బందీల విడుదల ప్రక్రియపైనా ప్రభావం చూపేలా ఉంది. ఒక దేశ జనాభాను బలవంతంగా నిరాశ్రయులను చేయడం అంతర్జాతీయ చట్టం ప్రకారం నిషేధం. ఇజ్రాయెల్ మాత్రం పాలస్తీనియన్లను తరిమేసి గాజాను యూదు స్థావరంగా మార్చుకోవాలని ఆశపడుతోంది. ట్రంప్ ప్రకటన కార్యరూపం దాలిస్తే 20 లక్షల మంది పాలస్తీనావాసులు శాశ్వత శరణార్థులుగా మారిపోతారు. -
అమల్లోకి కాల్పుల విరమణ
డెయిర్ అల్ బాలాహ్ (గాజా): పదిహేను నెలల భీకర యుద్ధానికి తాత్కాలికంగా తెర పడింది. శ్మశాన సదృశంగా కన్పిస్తున్న గాజా వీధుల్లో ఎట్టకేలకు శాంతిపవనాలు వీచాయి. (Israel),ఇజ్రాయెల్, (Hamas)హమాస్ మధ్య విరమణ ఒప్పందం మూడు గంటలు ఆలస్యంగా ఆదివారం ఉదయం 11.30కు అమల్లోకి వచ్చింది. విడుదల చేయబోయే తమ బందీల జాబితాను హమాస్ వెల్లడించేదాకా (ceasefire agreement)కాల్పుల విరమణ అమల్లోకి రాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కుండబద్దలు కొట్టడంతో తొలుత ఆందోళన నెలకొంది. జాబితా విడుదలను హమాస్ ఆలస్యం చేయడం ఉత్కంఠకు దారితీసింది. ఉదయం 11.15కు రోమీ గోనెన్ (24), ఎమిలీ దమారీ (28), డోరోన్ స్టెయిన్బ్రీచర్ (31) అనే ముగ్గురు మహిళలను హమాస్ వదిలేస్తున్నట్టు హమాస్ ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇజ్రాయెల్ బలగాలు వారిని సురక్షితంగా స్వదేశానికి తరలించాయి. బదులుగా ఇజ్రాయెల్ కూడా తొలి దఫాలో 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది. వారిని సురక్షితంగా గాజా చేర్చేందుకు రెడ్‌క్రాస్ వాహనశ్రేణి ఇజ్రాయెల్‌లోని ఓఫెర్ కారాగానికి చేరుకుంది. ఆరువారాల్లో హమాస్ 33 మంది, ఇజ్రాయెల్ దాదాపు 2,000 మంది ఖైదీలను విడుదల చేయనున్నాయి. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని నెతన్యాహూ ప్రభుత్వ భాగస్వామి ఓజ్మా యేహూదిత్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వం నుంచి వైదొలగింది. ఆ పారీ్టకి చెందిన ముగ్గురు నేతలు మంత్రి పదవులకు రాజీనామా చేశారు.గాజాలో ఆనందోత్సాహాలు కాల్పుల విరమణతో గాజా స్ట్రిప్‌లో ఆనందం వెల్లివిరిసింది. వలస వెళ్లిన పాలస్తీనియన్లు భారీగా గాజాకు తిరిగొస్తున్నారు. అయితే ఆదివారం ఉదయం దాకా ఇజ్రాయెల్ సైన్యం గాజాపై దాడులు కొనసాగింది. దాంతో ఆదివారం ఒక్క రోజే 26 మంది మరణించారు. -
నెతన్యాహుపై అరెస్టు వారెంట్
ద హేగ్: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) గురువారం అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అలాగే ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాజీ మంత్రి యోవ్ గల్లాంట్‌తోపాటు పలువురు హమాస్ నేతలపైనా వారెంట్లు జారీ చేసింది. బెంజమిన్, గల్లాంట్ గాజాలో మారణహోమం సాగించారని, మానవత్వంతో దాడి చేశారని ఐసీసీ ఆక్షేపించింది. హత్యలు చేయడం, సాధారణ ప్రజలను వేధించడం వంటి అమానవీయ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించింది. గాజాలో ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు, విద్యుత్, ఇంధనం, ఇతర నిత్యావసరాలు అందకుండా ఆంక్షలు విధించారని, అమాయకుల మరణానికి కారకులయ్యారని మండిపడింది. నెతన్యాహు, గల్లాంట్ చర్యల వల్ల ఎంతోమంది మహిళలు, చిన్నారులు బలయ్యారని ఉద్ఘాటించింది. పౌష్టికాహారం, నీరు అందక, డీహైడ్రేషన్‌తో పసిబిడ్డలు మరణించారని పేర్కొంది. నెతన్యాహు, గల్లాంట్ ఉద్దేశపూర్వకంగానే సామాన్య ప్రజలపై వైమానిక దాడులు చేసినట్లు చెప్పడానికి సహేతుకమైన ఆధారాలను గుర్తించామని వివరించింది. గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభానికి నెతన్యాహు, గల్లాంట్ బాధ్యత వహించాలని తేల్చిచెప్పింది. యుద్ధ నేరాల్లో నెతన్యాహు నిందితుడని స్పష్టం చేసింది. గాజాలో 2023 అక్టోబర్ 8 నుంచి 2024 మే 20వ తేదీ దాకా నెలకొన్న పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నెతన్యాహు, గల్లాంట్‌పై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అలాగే గాజాలో భీకర యుద్ధానికి, సంక్షోభానికి కారణమయ్యారంటూ హమాస్ నేతలపైనా అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. హమాస్ అగ్రనేతలు మొహమ్మద్ డెయిఫ్, యహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియేను అరెస్టు చేయాలని ఐసీసీ స్పష్టంచేసింది. అయితే, యహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియే ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఇప్పుడేం జరగొచ్చు? ఇజ్రాయెల్ ప్రధానమంత్రి, రక్షణ శాఖ మాజీ మంత్రిపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేయడంతో ఇప్పుడేం జరుగుతుందన్న చర్చ మొదలైంది. ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయడంతో నెతన్యాహు, గల్లాంట్ ఇప్పుడు అంతర్జాతీయంగా వాంటెడ్ నిందితులుగా మారారు. ప్రపంచ దేశాల అధినేతలు వారికి మద్దతు ఇవ్వడానికి వీల్లేదు. అదే జరిగితే అంతర్జాతీయంగా నెతన్యాహు, గల్లాంట్ ఒంటరవుతారు. చివరకు గాజాలో కాల్పుల విరమణ ప్రక్రియ ప్రారంభించే ప్రయత్నాలు మరింత సంక్లిష్టంగా మారుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
మీకూ గాజా గతే!
బీరుట్: లెబనాన్‌కూ గాజా గతి పట్టిస్తామని, మునుపెన్నడూ లేనంతగా పెనుదాడులకు పాల్పడతామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం లెబనాన్ పౌరులనుద్దేశిస్తూ ఆయన ఒక వీడియో సందేశం వినిపించారు. ‘‘ హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను అంతంచేశాం. అతని స్థానంలో హెజ్బొల్లా కాబోయే చీఫ్‌ను, ఆ తర్వాతి వారసుడు, తదుపరి నేతనూ చంపేశాం.గతంలో ఎన్నడూలేనంతగా హెజ్బొల్లా ఇప్పుడు బలహీనపడింది’ అని నెతన్యాహూ అన్నారు. నెతన్యాహూ వ్యాఖ్యలపై లెబనాన్ ఇంకా స్పందించలేదు. మరోవైపు దక్షిణ లెబనాన్‌లోని కుగ్రామంలో రెసిడెన్షియల్ భవంతి భూగర్భంలో హెజ్బొల్లా స్థావరాన్ని ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. అక్కడి భారీ స్థాయిలో ఆయుధాలను స్వా«దీనం చేసుకుంది.ఈ క్రమంలో హెజ్బొల్లా మిలిటెంట్లతో జరిగిన పరస్పర కాల్పుల్లో ఇజ్రాయెల్ సైన్యాధికారి కెప్టెన్ బెంజిన్ ఫాలక్ చనిపోయాడు. కాగా, లెబనాన్‌లోని పావువంతు భాగం ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం అధీనంలోకి వెళ్లిపోయిందని ఐక్యరాజ్యసమితి మానవతా సంబంధాల విభాగం తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో 1,400 మంది పౌరులు మరణించగా, 12 లక్షల మంది వలసపోయారని పేర్కొంది. -
నెతన్యాహూతో ఇజ్రాయెల్‌కు నష్టమే: బైడెన్
విలి్మంగ్టన్: గాజాలో హమాస్‌పై యుద్ధం పేరిట ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తన సొంత దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శించారు. నెతన్యాహూ అనాలోచిత చర్యల వల్ల ఇజ్రాయెల్‌కు లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోందని అన్నారు. గాజాలో సాధారణ పౌరుల మరణాలను నియంత్రించడంలో నెతన్యాహూ దారుణంగా విఫలమవుతున్నారని ఆక్షేపించారు. బైడెన్ శనివారం మీడియాతో మాట్లాడారు. తిరుగుబాటుతో సంబంధం లేని పాలస్తీనియన్ల ప్రాణాలు కాపాడాలని, ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్‌కు సూచించారు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు చేసిన దాడిని తాము ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. హమాస్‌ను వేటాడే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని వెల్లడించారు. కానీ, సాధారణ ప్రజలపై దాడి చేయడం సరైంది కాదని తేల్చిచెప్పారు. గాజాలో మరణాల సంఖ్య ఇజ్రాయెల్ చెబుతున్నదానికంటే ఎక్కువగానే ఉన్నట్లు తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. గాజాలో అమాయకుల మరణాలు ఇంకా పెరిగితే ఇజ్రాయెల్ అంతర్జాతీయ మద్దతును కోల్పోతుందని బైడెన్ కొన్ని రోజుల క్రితం హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
దాడులతో చెలరేగిన ఇజ్రాయెల్
డెయిర్ అల్–బాలాహ్(గాజా స్ట్రిప్): హమాస్ మెరుపుదాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ మొదలుపెట్టిన దాడులు భీకర రూపం దాలుస్తున్నాయి. గాజాలో కాల్పుల విరమణ కోరుతూ ఐక్యరాజ్యసమితి తెచ్చిన తీర్మానాన్ని అమెరికా తన వీటో అధికారంతో కాలదన్నిన దరిమిలా ఇజ్రాయెల్ ఆదివారం మరింత రెచ్చిపోయింది. అమెరికా నుంచి తాజాగా మరింతగా ఆయుధ సంపత్తి అందుతుండటంతో ఇజ్రాయెల్ భీకర గగనతల దాడులతో చెలరేగిపోతోంది. 23 లక్షల గాజా జనాభాలో దాదాపు 85 శాతం మంది బతుకుజీవుడా అంటూ స్వస్థలాలను వదిలిపోయినా సరే ఆదివారం ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను తగ్గించకపోవడం గమనార్హం. దాదాపు రూ.834 కోట్ల విలువైన యుద్ధట్యాంక్ ఆయుధాలను ఇజ్రాయెల్‌కు అమ్మేందుకు అమెరికా అంగీకరించడం చూస్తుంటే ఇజ్రాయెల్ సేనల దూకుడు ఇప్పట్లో ఆగేట్లు కనిపించడం లేదు. ‘ఐరాస భద్రతా మండలిలో మాకు బాసటగా అమెరికా నిర్ణయాలు తీసుకుంటోంది. యుద్ధం కొనసాగింపునకు వీలుగా కీలక ఆయుధాలు అందేందుకు సహకరిస్తున్న అమెరికాకు నా కృతజ్ఞతలు’ అని ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. యుద్ధం ఆగదు: ఇజ్రాయెల్ ‘హమాస్‌ను ఈలోపే అంతంచేయాలని అమెరికా మాకు ఎలాంటి గడువు విధించలేదు. హమాస్ నిర్మూలన దాకా యుద్ధం కొనసాగుతుంది. హమాస్ అంతానికి వారాలు కాదు నెలలు పట్టొచ్చు. బం«దీలందర్నీ విడిపిస్తాం’’ అని ఇజ్రాయెల్ జాతీయ భద్రతా సలహాదారు టజాచీ హెనెగ్బీ శనివారం అర్ధరాత్రి తేలి్చచెప్పారు. ‘‘ గాజాలో సరైన సాయం అందక సరిదిద్దుకోలేని స్థాయిలో అక్కడ మానవ విపత్తు తీవ్రతరమవుతోంది. ఇది పశ్చిమాసియా శాంతికి విఘాతకరం’’ అని ఖతార్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తంచేశారు. షిజాయాహ్, జబాలియా శరణార్థి శిబిరాల వద్ద నిరంతరం దాడుల కొనసాగుతున్నాయి. ‘‘కదిలే ప్రతి వాహనంపైనా దాడి జరుగుతోంది. శిథిలాలతో నిండిన మా ప్రాంతాలకు అంబులెన్స్‌లు రాలేకపోతున్నాయి’’ అని జబాలియా ప్రాంత స్థానికురాలు ఒకరు ఏడుస్తూ చెప్పారు. ఖాన్ యూనిస్ పట్టణ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ హమాస్, ఇజ్రాయెల్ సేనల మధ్య పరస్పర దాడులు జరుగుతున్నాయి. గంటలు నిలబడినా పిండి దొరకట్లేదు సెంట్రల్ గాజాలో ఆహార సంక్షోభం నెలకొంది. ‘‘ ఇంట్లో ఏడుగురం ఉన్నాం. ఐరాస ఆహార కేంద్రానికి రోజూ వస్తున్నా. ఆరేడు గంటలు నిలబడ్డా రొట్టెల పిండి దొరకట్లేదు. రెండు వారాలుగా ఇదే పరిస్థితి. పిండి కరువై ఉట్టిచేతుల్తో ఇంటికెళ్తున్నా’’ అని అబ్దుల్లాసలాం అల్–మజ్దాలా వాలా చెప్పారు. ఇప్పటిదాకా 17,700 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. -
Israel-Hamas war: గాజాలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
జెరూసలేం: గాజా స్ట్రిప్‌పై పట్టుబిగించేందుకు ఇజ్రాయెల్ ప్రయతి్నస్తోందన్న వాదనకు బలం చేకూరుస్తూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం అక్కడ అడుగుపెట్టారు. యుద్ధంలో మునిగి తేలుతున్న తమ సైనికుల్లో నైతిక స్థైర్యం పెంచేందుకే వచ్చానని చెప్పారు. ఇజ్రాయెల్ బయట పెట్టిన హమాస్ సొరంగం వద్ద తమ కమాండర్లు, సైనికులతో మాట్లాడారు. ‘‘మనవి మూడే లక్ష్యాలు. హమాస్ అంతం. బందీలందరినీ క్షేమంగా విడిపించడం. భవిష్యత్తులో మరెన్నడూ ఇజ్రాయెల్‌కు ముప్పుగా మారకుండా గాజాను ‘సరిచేయడం’’ అని అన్నారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి, చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉత్తర గాజాలో పర్యటించారు. -
సంస్కరణలు నెలపాటు వాయిదా
జెరూసలేం: ప్రజాగ్రహానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తలొగ్గారు. న్యాయ వ్యవస్థలో సంస్కరణల ప్రణాళికను నెల పాటు వాయిదా వేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘ఇజ్రాయెల్‌ను చీల్చడానికి శత్రువులు ప్రయత్నిస్తున్నారు. వారికి అవకాశం ఇవ్వొద్దు. ఆందోళనలు విరమించండి. హింసకు దూరంగా ఉండండి’’ అని ప్రజలకు సూచించారు. పార్లమెంట్ వేసవి సమావేశాలు ఏప్రిల్ 30న పునఃప్రారంభం కానున్నాయి. సంస్కరణలపై బిల్లును వాటిలో ప్రవేశపెట్టాలని నెతన్యాహూ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. అయితే సంస్కరణలను శాశ్వతంగా పక్కన పెట్టాలని నిరసనకారులు తేల్చిచెప్పారు. అప్పటిదాకా పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. సోమవారం వేలాదిగా పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించారు. సంస్కరణలపై పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించాలన్నదే నెతన్యాహూ ఉద్దేశమని తెలుస్తోంది. -
కరోనాకు 35,349 మంది బలి
ప్యారిస్/మాస్కో/జెరూసలెం/వాషింగ్టన్: కరోనా మహమ్మారికి బలవుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. సోమవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 7,43,190 మంది ఈ వ్యాధి బారిన పడగా 35,349 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, మొత్తం 183 దేశాల్లో చికిత్స తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,57,069 వరకూ ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం. తాజాగా అగ్రరాజ్యం అమెరికా కరోనా క్రోధానికి బలవుతోంది. న్యూయార్క్, న్యూజెర్సీలతో కలిపి అమెరికా మొత్తమ్మీద 1.45 లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. మొత్తం 2,606 మంది ప్రాణాలు కోల్పోగా 4,574 మంది కోలుకున్నారు. ఇటలీలో కరోనాతో 10,779 మంది మరణించగా లక్ష మంది బాధితులుగా మారారు. కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు 13,030 మంది ఉన్నారు. స్పెయిన్‌లో మొత్తం 7,340 మంది కరోనాకు బలికాగా వీరిలో గత 24 గంటల్లో మరణించిన వారు 812 మంది కావడం గమనార్హం. మొత్తమ్మీద చూస్తే ఈ వైరస్ యూరప్‌లో 25 వేల మందిని పొట్టనబెట్టుకుంది. సుమారు నాలుగు లక్షల మంది వ్యాధి కోరల్లో చిక్కుకున్నారు. చైనాలో 81,470 మంది ఈ వ్యాధికి గురికాగా, 3,304 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కొత్తగా 31 కేసులు నమోదు కాగా, నలుగురు మరణించారు. ఇరాన్లో 41,495 మందికి వైరస్ సోకగా ఇప్పటివరకు 2,757 మంది ప్రాణాలు కోల్పోయారు. క్వారంటైన్లోకి ఇజ్రాయెల్ ప్రధాని సహాయకుడు ఒకరికి కరోనా సోకిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ముందు జాగ్రత్తగా సోమవారం క్వారంటైన్లోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్‌లో కరోనా బాధితుల సంఖ్య సోమవారానికి 4347కు చేరుకోగా 16 మంది మరణించారు. అమెరికాలో ఏప్రిల్ 30 వరకూ భౌతిక దూరం కరోనా నుంచి అమెరికా జూన్ ఒకటో తేదీకల్లా తప్పించుకుంటుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈలోగా వచ్చే రెండు వారాల్లో కేసులు, మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతాయని, లక్ష మంది వరకు ప్రాణాలు కోల్పోవచ్చునని ఆయన హెచ్చరించారు. అందుకే ఏప్రిల్ 30 వరకూ భౌతిక దూరం(సోషల్ డిస్టెన్సింగ్) నిబంధనలను పొడిగిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఇప్పటికే 1.45 లక్షల మంది వైరస్ బారిన పడగా, 2,606 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. రష్యాలో లాక్డౌన్ రష్యా రాజధాని మాస్కోలో సోమవారం లాక్డౌన్ ప్రకటించారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తరహా చర్యలకు ప్రయత్నాలు మొదలయ్యాయి. మాస్కో జనాభా కోటీ 20 లక్షలు. రష్యాలో ఇప్పటివరకూ 1,835 మంది కోవిడ్ బారిన పడగా 9 మంది మరణించారు. -
అటు షూటింగ్...
ఇటు అసలుసిసలు హైజాక్! నలభయ్యేళ్ల కిందట... 1976లో ఎయిర్‌ఫ్రాన్స్‌కు చెందిన విమానం ఒకటి టెల్ అవీవ్ నుంచి పారిస్‌కు బయలుదేరింది. 250 మంది ప్రయాణికుల్లో అత్యధికులు ఇజ్రాయిల్ దేశస్థులు. పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు. ఈ విమానాన్ని పాలస్తీనా హైజాకర్లు ఉగాండాలోని ఎంటెబేకు మళ్లించారు. ప్రయాణికులను, సిబ్బందిని బందీలుగా చేసుకుని... ఇజ్రాయిల్ సహా మరో నాలుగు దేశాల్లో బందీలుగా ఉన్న 54 మంది పాలస్తీనా మిలిటెంట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐదు మిలియన్ డాలర్ల నగదు కూడా ఇవ్వాలని షరతు పెట్టారు. వారం రోజులు హైడ్రామా నడిచింది. శత్రు దేశాల రాడార్లకు అందకుండా... ప్రతికూల వాతావరణంలో ఇజ్రాయిల్ కమెండోల బృందం ఏకబిగిన ఎనిమిదిన్నర గంటలు... నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ బృందానికి ప్రస్తుత ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సోదరుడు యోనాథన్ నెతన్యాహు నేతృత్వం వహించారు. ఉగాండాలోని ఎంటెబేలో దిగిన ఈ కమెండో బృందం మెరుపుదాడి చేసి ఎనిమిది మంది హైజాకర్లను మట్టుబెట్టింది. 20 మంది ఉగాండా సైనిక సిబ్బందిని కూడా చంపింది. బందీలుగా ఉన్న ప్రయాణికుల్లో ముగ్గురు ఈ ఆపరేషన్‌లో చనిపోగా... మిగతా అందరినీ సురక్షితంగా విడిపించారు. అయితే ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన యోనాథన్ అమరుడయ్యాడు. కట్ చేస్తే... సస్పెన్స్ థ్రిల్లర్‌ను మరిపించే ఈ హైజాక్ ఉదంతం ఆధారంగా ‘ఎంటెబే’పేరుతో సినిమా తెరకెక్కుతోంది. ఈ నెల 23న (శుక్రవారం) మాల్టా ఎయిర్‌పోర్టులో దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఇంతలో హైజాక్‌కు గురైన లిబియా విమానం మాల్టా ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. తాము హైజాక్‌పై షూటింగ్ చేస్తుండగా... నిజంగానే హైజాక్‌కు గురైన లిబియా విమానం సీన్లోకి రావడంతో సినిమా బృందం విస్తుపోయింది. వెంటనే షూటింగ్‌ను నిలిపివేసిందని లిజా నగర మేయర్ మాగ్దా మాగ్రి వెల్లడించారు. కాగా, లిబియా విమాన హైజాక్ కథ సుఖాంతమైన విషయం తెలిసిందే. 118 మందిని విడుదల చేసిన ఇద్దరు హైజాకర్లు... తర్వాత లొంగిపోయారు.