
జెరూసలేం: ప్రజాగ్రహానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తలొగ్గారు. న్యాయ వ్యవస్థలో సంస్కరణల ప్రణాళికను నెల పాటు వాయిదా వేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘ఇజ్రాయెల్‌ను చీల్చడానికి శత్రువులు ప్రయత్నిస్తున్నారు. వారికి అవకాశం ఇవ్వొద్దు. ఆందోళనలు విరమించండి. హింసకు దూరంగా ఉండండి’’ అని ప్రజలకు సూచించారు.
పార్లమెంట్ వేసవి సమావేశాలు ఏప్రిల్ 30న పునఃప్రారంభం కానున్నాయి. సంస్కరణలపై బిల్లును వాటిలో ప్రవేశపెట్టాలని నెతన్యాహూ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. అయితే సంస్కరణలను శాశ్వతంగా పక్కన పెట్టాలని నిరసనకారులు తేల్చిచెప్పారు. అప్పటిదాకా పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. సోమవారం వేలాదిగా పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించారు. సంస్కరణలపై పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించాలన్నదే నెతన్యాహూ ఉద్దేశమని తెలుస్తోంది.