legal system
-
న్యాయ వ్యవస్థపై ఏఐ ప్రభావం
కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం అన్ని రంగాలపైనా విశేషంగా పడుతోంది. అందులో భాగంగానే న్యాయ వ్యవస్థనూ అది ప్రభావితం చేస్తోంది. ఏఐతో న్యాయమూర్తుల పని సులువవుతుంది. దేశంలో లక్షల సంఖ్యలో ప్రాక్టీసు చేస్తున్న న్యాయవాదులు సాధ్యమైనంత త్వరగా ఏఐ వినియోగంలో నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. న్యాయ శాస్త్రంలోని అనేక అంశాలు చిటికెలో ఏఐ ద్వారా అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల న్యాయ వ్యవస్థలో ఉన్నవారి పని భారం తగ్గుతుంది. మొత్తం మీద ఏఐ వల్ల న్యాయవ్యవస్థ ఎలా లాభం పొందుతుందో ఇక్కడ చూద్దాం:ఏఐ కేసు డేటాను విశ్లేషించడానికీ, ఫలితా లను అంచనా వేయడానికీ, నమూనాలను గుర్తించడానికీ సాయపడుతుంది. న్యాయ మూర్తులు అదనపు సమాచారంతో నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఏఐ ఆధారిత సాధనాలు న్యాయవాదులు, న్యాయమూర్తులకు సంబంధిత చట్టాల పూర్వాపరాలు, కేస్ స్టడీస్, పరిశోధనలో సమయం ఆదా చేయడంలో సహాయ పడతాయి. ఏఐ ఆధారిత చాట్ బాట్లు వర్చువల్ కోర్టు ప్రొసీడింగ్స్‌లో సహాయ పడతాయి. షెడ్యూల్ చేయడం, రిమైండర్లు, ప్రాథమిక విచారణల వంటి పనులలో సహాయ పడతాయి. ఏఐ ఆధా రిత న్యాయ సహాయం, మద్దతును అందించడం ద్వారా... ముఖ్యంగా అట్టడుగు వర్గాలు న్యాయం పొందడంలో అంతరాన్ని తగ్గించవచ్చు. ఏఐ రొటీన్ టాస్క్‌ను ఆటోమేట్ చేయగలదు. న్యాయ మూర్తులు, న్యాయస్థాన సిబ్బందిని మరింత సంక్లిష్టమైన, అధిక విలువైన పనులపై దృష్టి పెట్టేలా చేస్తుంది. న్యాయ ప్రక్రియలను మెరుగు పరచడానికి, జాప్యాలను తగ్గించడానికి, న్యాయ వ్యవస్థకు గల మొత్తం సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది.ఏజీఐ... అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలి జెన్స్ (కృత్రిమ సాధారణ బుద్ధి) ఒక భావితర హిత ఏఐ వ్యవస్థను సూచిస్తుంది. ఇది మనుషుల మేధస్సుకు సమానంగా విభిన్న పనులను అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం జ్ఞానాన్ని అనేక విభాగాల్లో ఉపయోగించే సామర్థ్యాలు కలిగి ఉంటుంది. ఉదాహరణకు: కారణాలు చెప్పడం, సమస్యలను పరిష్కరించడం; అనుభవం నుంచి నేర్చుకోవడం; సహజ భాషను అర్థం చేసుకోవడం, వివిధ రంగాల్లో జ్ఞానాన్ని ఉపయోగించడం వంటి పనులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.ఏఐ పరిశోధనలో ఏజీఐని పవిత్ర కాంక్షగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది అపారమైన అవకా శాలను తెచ్చిపెడుతుంది. అయితే ఏజీఐ ఇంకా పరిశోధన, అభివృద్ధి దశలోనే ఉంది. ఏఐ సాధానాలతో సమర్థవంతంగా పని చేయడానికి వ్యూహం, న్యాయవాదులకు, కక్షి దారులకు కౌన్సెలింగ్ వంటి అధిక విలువ గల పనులపై దృష్టి పెట్టడానికి, న్యాయవాదులు కొత్త నైపుణ్యాలను పెంచుకోవాల్సి ఉంటుంది. న్యాయ వాద వృత్తిలో జూనియర్లు, లేదా పారాలీగల్స్ వంటి నిర్దిష్ట పాత్రలను ఏఐ స్థానభ్రంశం చేయ గలదు. సబ్స్క్రిప్షన్ ఆధారిత చట్టపరమైన సేవలు, ఏఐ ఆధారిత లీగల్ కన్సల్టింగ్ వంటి కొత్త వ్యాపార నమూనాలను ఏఐ ప్రారంభించగలదు.చట్టపరమైన ఆచరణలో ఏఐ ఉపయోగం, నిర్ణయాధికారం పారదర్శకంగా, జవాబుదారీ తనంగా ఉండేలా చూసుకోవడం వంటి నియంత్రణ సమస్యలను లేవనెత్తవచ్చు. న్యాయవాదులు ఏఐపై ఎక్కువగా ఆధారపడవచ్చు. దీని వల్ల అవ సరమైన నైపుణ్యాలను, నిర్ణయాన్ని (తీర్పును) కోల్పోయే అవకాశం ఉంది. ఏఐ ఆధారిత చట్ట పరమైన సాధనాలు డేటా చౌర్యం, ఉల్లంఘనల వంటి ప్రమాదాన్ని పెంచుతాయి.న్యాయవాదులు ఏఐని ఉపయోగించడంలో నైతికపరమైన చిక్కులను పరిగణనలోకి తీసు కోవాలి. ఏఐ తీసుకునే నిర్ణయం న్యాయంగా, నిష్పక్ష పాతంగా ఉండేలా చూసుకోవాలి. నైపుణ్యా లను సాధ్యమైనంత త్వరగా పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో ఏఐ నుంచి ఎదురయ్యే సవా ళ్లను దీటుగా ఎదుర్కోవచ్చు. వృత్తిపరంగా విజ యవంతంగా ముందుకు వెళ్లవచ్చు. అయితే ఈ వ్యస్థపై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ఉండాలి.– ఆగూరు ఉమామహేశ్వరరావు సీనియర్ న్యాయవాది -
ప్రజా న్యాయస్థానం సుప్రీంకోర్టు
పనాజీ: పార్లమెంట్లో ప్రతిపక్షాలు పోషించే పాత్రను సుప్రీంకోర్టు పోషించకూడదని అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. ప్రజల కోర్టుగా సుప్రీంకోర్టు పాత్రను ఎప్పటికీ పరిరక్షించాలని చెప్పారు. భవిష్యత్తులోనూ ప్రజల న్యాయస్థానంగానే పని చేయాలని పేర్కొన్నారు. ప్రజల కోర్టు అంటే దాని అర్థం పార్లమెంట్లో ప్రతిపక్షాలు పోషించే పాత్ర కాదని ఉద్ఘాటించారు. గోవాలో శనివారం సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్(ఎస్సీఏఓఆర్ఏ) సదస్సులో జస్టిస్ చంద్రచూడ్ ప్రసంగించారు. సుప్రీంకోర్టు నుంచి న్యాయం పొందే విషయంలో గత 75 ఏళ్లలో ఒక స్పష్టమైన విధానం అభివృద్ధి చేసుకున్నామని, అది దారితప్పకుండా జాగ్రత్తపడాలని చెప్పారు. సమాజంలో సంపద పెరుగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో ధనవంతులకే న్యాయం దక్కుతుందన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని పేర్కొన్నారు. అందులో ఎలాంటి నిజం లేదని, సుప్రీంకోర్టు అంటే ముమ్మాటికీ ప్రజల కోర్టు అని స్పష్టంచేశారు. సుప్రీంకోర్టును చూసే దృక్కోణం విషయంలో జనం మధ్య విభజన కనిపిస్తోందన్నారు. అనుకూలమైన తీర్పు వస్తే సుప్రీంకోర్టు చాలా గొప్పదని ప్రశంసించడం ప్రతికూలమైన తీర్పు వస్తే దూషించడం పరిపాటిగా మారిందన్నారు. కేవలం తీర్పుల ఆధారంగా సుప్రీంకోర్టు పనితీరు, అది పోషించే పాత్రను నిర్ణయించడం సరికాదన్నారు. కేసులో మెరిట్‌ను బట్టే న్యాయమూర్తులు తీర్పు ఇస్తుంటారని, ఇందులో వారి సొంత అభిప్రాయానికి స్థానం ఉండదని గుర్తుచేశారు. జడ్జిలు స్వతంత్రంగా వ్యవహరిస్తుంటారని చెప్పారు. ప్రజల ఇళ్లలోకి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలోఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు కేసుల ఈ–ఫైలింగ్, కేసు రికార్డుల డిజిటలైజేషన్, కోర్టు వ్యవహారం ప్రత్యక్ష ప్రసారం వంటివి తీసుకొచ్చామని గుర్తుచేశారు. ప్రత్యక్ష ప్రసారం అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు అని తెలిపారు. ఇప్పుడు కోర్టురూమ్ అనేది కొందరు లాయర్లు, జడ్జిలకు మాత్రమే పరిమితం కాదని, అది ప్రజలకు ఒక్క క్లిక్‌తో అందుబాటులోకి వచి్చందని హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నేరుగా ప్రజల ఇళ్లల్లోకి చేరిందన్నారు. కోర్టుల్లో గౌరవప్రదమైన భాష వాడుదాం మనుషులను కించపర్చే భాషకు కోర్టు ప్రాంగణాల్లో స్థానం లేదని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. ప్రధానంగా మహిళల పట్ల అభ్యంతర వ్యాఖ్యలు, దిగజారుడు భాషను సహించే ప్రసక్తే లేదని అన్నారు. మహిళలతోపాటు సమాజంలోని అణగారిన వర్గాలపై ఇష్టానుసారంగా నోరుపారేసుకోవడం కొందరికి అలవాటని చెప్పారు. అభ్యంతరకర భాష పట్ల మహిళా న్యాయవాదుల నుంచి తమకు ఫిర్యాదులు వస్తుంటాయని తెలిపారు. న్యాయ వ్యవస్థలోనూ ఇలాంటి జాడ్యం ఉందని, ఈ పరిస్థితి మారాలని తేలి్చచెప్పారు. న్యాయస్థానాల్లో ఉపయోగించే భాష పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతవాతావరణ మార్పుల దుష్పరిణామాల పట్ల జస్టిస్ చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పుల కారణంగా సమాజంలో అట్టడుగు వర్గాలే ఎక్కువగా నష్టపోతున్నాయని చెప్పారు. రైతులు, మత్స్యకారులు, పేదలకు తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. గోవా గవర్నర్ పి.ఎస్.శ్రీధరన్ పిళ్లై రాసిన ‘భారతదేశ సంప్రదాయ వృక్షాలు’ అనే పుస్తకాన్ని జస్టిస్ చంద్రచూడ్ శనివారం ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని స్పష్టంచేశారు. -
Muhammad Yunus: అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారు
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనుస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎదురు లేకుండా అధికారంలో కొనసాగేందుకు దేశంలోని అన్ని వ్యవస్థలను హసీనా నాశనం చేశారన్నారు. ‘న్యాయ వ్యవస్థ భ్రష్టు పట్టింది. దాదాపు 15 ఏళ్లపాటు సాగించిన దుర్మార్గపు పాలనలో ప్రజాస్వామిక హక్కులను ఆమె అణగదొక్కారు. ప్రభుత్వ ఖజానాను దోచుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు’అని ఆయన నిప్పులు చెరిగారు. హసీనా క్రూరమైన నియంతృత్వ విధానాల ఫలితంగా దేశంలో అన్నిరకాలుగా పూర్తి గందరగోళంలోకి నెట్టివేయబడిందని పేర్కొన్నారు. భద్రతా బలగాలు, మీడియాతోపాటు పౌర యంత్రాంగం, న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ వంటి కీలక విభాగాల్లో ముఖ్యమైన సంస్కరణలను తేవాలన్నది తమ ప్రధాన ఉద్దేశమన్నారు. జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయ సాధనకు చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలిపారు. శాంతి నెలకొనే వరకు సాయుధ బలగాలు పౌర విభాగాలకు సాయంగా పనిచేస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలు, భద్రతా బలగాల సహకారంతో అతి తక్కువ సమయంలోనే సాధారణ పరిస్థితులను తీసుకువస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలకు భద్రతను, రక్షణను కల్పించేందుకు ప్రభుత్వ కట్టుబడి ఉంటుందని ప్రకటించారు. -
న్యాయవ్యవస్థను తక్కువ చేసేందుకు ప్రయత్నాలు
న్యూఢిల్లీ: పథకం ప్రకారం ఒత్తిళ్లు తేవడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, బహిరంగ విమర్శల ద్వారా న్యాయ వ్యవస్థను చులకన చేసేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని రిటైర్డు జడ్జీల బృందం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగత లబ్ధి, రాజకీయ స్వార్థం కోసం జరిగే ఇటువంటి ప్రయత్నాల కారణంగా న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం తగ్గిపోయే ప్రమాదముందని వారు పేర్కొన్నారు. అయితే, ఏ పరిణామాలు తమను ఈ లేఖ రాసేందుకు ప్రేరేపించాయనే విషయాన్ని అందులో వారు ప్రస్తావించలేదు. అవినీతి కేసుల్లో కొందరు ప్రతిపక్ష నేతల అరెస్టుపై అధికార బీజేపీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్న సమయంలో ఈ లేఖ రాయడం గమనార్హం. ఆరోపణలెదుర్కొంటున్న నేతలు, వారి పార్టీలు కోర్టులను ఆశ్రయించడం, న్యాయవ్యవస్థ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను చూపుతూ బీజేపీ వారిపై ప్రత్యారోపణలు చేస్తుండటాన్ని లేఖలో వారు ప్రస్తావించారు. ‘ఇటువంటి చర్యలతో న్యాయవ్యవస్థ పవిత్రత దెబ్బతింటోంది. జడ్జీల నిష్పాక్షికత, సచ్ఛీలత అనే సూత్రాలకు ఇవి సవాల్‌గా మారాయి. ఇటువంటి అవాంఛిత ఒత్తిడుల నుంచి న్యాయవ్యవస్థను కాపాడు కోవాల్సిన అవసరం ఉంది’అని లేఖలో పేర్కొన్నారు. నిరాధార సిద్ధాంతాలను ప్రచారం చేయడం వంటి చర్యల ద్వారా న్యాయపరమైన ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొన్ని సమూహాలు అనుసరిస్తున్న వ్యూహం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. సుప్రీంకోర్టు నేతృత్వంలోని న్యాయవ్యవస్థను ఇటువంటి ఒత్తిళ్లకు వ్యతిరేకంగా బలోపేతం చేయాలని, న్యాయ వ్యవస్థ పవిత్రతను, స్వయంప్రతిపత్తిని పరిరక్షించాలని వారు కోరారు. న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా, అస్థిర రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. లేఖ రాసిన వారిలో సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జీలు జస్టిస్ దీపక్ వర్మ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ ఎంఆర్ షా సహా వివిధ హైకోర్టులకు చెందిన 21 మంది న్యాయమూర్తులు ఉన్నారు. -
మధ్యవర్తిత్వంతో కోర్టులపై భారం తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: ఏదైనా వ్యవస్థపై అది భరించే శక్తికి మించి ఒత్తిడి పెంచితే ఆ వ్యవస్థ దెబ్బతింటుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ భారాన్ని తగ్గించడం ‘మధ్యవర్తిత్వం’తోనే సాధ్యమని తెలిపారు. ఇంట్లోని చిన్నచిన్న తగాదాలు కూడా కోర్టుకు చేరడంతో పెండింగ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయన్నారు. ఇలాంటి కేసులన్నీ మధ్యవర్తిత్వంతోనే పరిష్కారం కావాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ–మీడియేషన్ రైటింగ్స్ (ఈఎండబ్ల్యూ) ఏర్పాటై మూడేళ్లయిన సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈఎండబ్ల్యూ మూడేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకోవడం అభినందనీయమని ప్రశంసించారు. ‘అత్తాకోడలు, భార్యాభర్తలు, అన్నదమ్ములు.. ఇలా చిన్నచిన్న వివాదాలను ఇంటి స్థాయిలోనో లేదా గ్రామ స్థాయిలోనో ఎవరో ఒకరు మధ్యవర్తిత్వంతో పరిష్కరించే ఏర్పాట్లు జరగాలి. పేదలకు కోర్టులను ఆశ్రయించి న్యాయం పొందే ఆర్థిక స్తోమత తక్కువ. అలాంటి వారి సమస్యల పరిష్కారం కోసం మధ్యవర్తులు ముందుకురావాలి’అని తమిళిసై పిలుపునిచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందన్నారు. భరించే శక్తికి మించి న్యాయవ్యవస్థ భారం మోస్తోందని చెప్పారు. గతంలో గ్రామీణ స్థాయిలో, కుటుంబాల్లో ఉన్న మధ్యవర్తిత్వ వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీని ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని, సత్వర న్యాయం అందుతుందన్నారు. కోర్టు తీర్పు తర్వాత సదరు పార్టీల మధ్య బంధం ఉండకపోవచ్చని, అదే మధ్యవర్తిత్వ పరిష్కారంలో వారి అంగీకారంతోపాటు బంధం బలహీనపడదని చెప్పారు. మీడియేటర్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందని, అది పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇరు పార్టీలకు సమ న్యాయం.. కోర్టుల్లో వివాదాల పరిష్కారంతో పోలిస్తే మధ్యవర్తిత్వ పరిష్కారం అన్నివిధాలా ఉత్తమమైనదని పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి పేర్కొన్నారు. మధ్యవర్తిత్వంలో పార్టీలు ఇద్దరూ సఫలీకృతం అవుతారని, ఇద్దరికీ సమ న్యాయం అందుతుందని చెప్పారు. ఇంట్లో, ఊరిలో, సమాజంలో మధ్యవర్తులు ఉండి ఎక్కడికక్కడే సమస్యలకు చెక్ పెడితే అది సమాజ పురోభివృద్ధికి దోహదం చేస్తుందని వివరించారు. ప్రపంచమంతా అత్యంత క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్న కోవిడ్ సమయంలో ఈఎండబ్ల్యూ ఊపిరిపోసుకుందని తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి తెలిపారు. ప్రత్యక్ష కోర్టులు లేని సమయంలో కక్షిదారులకు సేవలందించిందని, ఇలా మూడేళ్లు పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు. మధ్యవర్తిత్వం కోసం.. మధ్యవర్తిత్వం చేత.. మీడియేటర్లే నిర్వహిస్తున్న కార్యక్రమం ఈఎండబ్ల్యూ అని మీడియేషన్ ట్రైనర్ పుష్ప్ గుప్తా అన్నారు. అనంతరం మీడియేషన్ ట్రైనర్ థన్కచన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సైనిక బలగాల ట్రిబ్యునల్ చైర్పర్సన్ జస్టిస్ రాజేంద్ర మీనన్, పలు రాష్ట్రాల న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఈఎండబ్ల్యూ తెలంగాణ కో–ఆర్డినేటర్ మంజీరా వెంకటేశ్, కేఎస్ శర్మ, చిత్రా నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. -
సంస్కరణలు నెలపాటు వాయిదా
జెరూసలేం: ప్రజాగ్రహానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తలొగ్గారు. న్యాయ వ్యవస్థలో సంస్కరణల ప్రణాళికను నెల పాటు వాయిదా వేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘ఇజ్రాయెల్‌ను చీల్చడానికి శత్రువులు ప్రయత్నిస్తున్నారు. వారికి అవకాశం ఇవ్వొద్దు. ఆందోళనలు విరమించండి. హింసకు దూరంగా ఉండండి’’ అని ప్రజలకు సూచించారు. పార్లమెంట్ వేసవి సమావేశాలు ఏప్రిల్ 30న పునఃప్రారంభం కానున్నాయి. సంస్కరణలపై బిల్లును వాటిలో ప్రవేశపెట్టాలని నెతన్యాహూ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. అయితే సంస్కరణలను శాశ్వతంగా పక్కన పెట్టాలని నిరసనకారులు తేల్చిచెప్పారు. అప్పటిదాకా పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. సోమవారం వేలాదిగా పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించారు. సంస్కరణలపై పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించాలన్నదే నెతన్యాహూ ఉద్దేశమని తెలుస్తోంది. -
ఇజ్రాయెల్.. ‘సంస్కరణం’
నిరసనలు, ఆందోళనలు, సమ్మెలతో గత మూడు నెలలుగా ఇజ్రాయెల్ అట్టుడికిపోతోంది. దేశవ్యాప్తంగా వేలాది మంది జనం నిత్యం వీధుల్లోకి వస్తున్నారు. బెంజమిన్ నెతన్యాహూ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. కార్మికులు సమ్మె ప్రారంభించారు. న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడమే ఇందుకు కారణం. ఇవి గొప్ప సంస్కరణలని నెతన్యాహూ అనుకూల వర్గాలు ఊదరగొడుతున్నప్పటికీ ప్రజలు విశ్వసించడం లేదు. న్యాయ వ్యవస్థలో ప్రభుత్వం తలపెట్టిన మార్పులు దేశ ప్రజాస్వామ్య పునాదులను కదిలిస్తాయని, తాము హక్కులు కోల్పోతామని వారు ఆరోపిస్తున్నారు. మార్పులకు వ్యతిరేకంగా గళమెత్తిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోయావ్ గల్లాంట్ను ఆదివారం హఠాత్తుగా పదవి నుంచి తొలగించడం మరింత అగ్గి రాజేస్తోంది. నెతన్యాహూ సర్కారు నియంతృత్వ ధోరణిపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ న్యాయ వ్యవస్థలో ప్రభుత్వం తలపెట్టిన మార్పులు, వాటిపై ప్రజల భయాందోళన వెనుక ఉన్న కారణాలు ఏమిటో తెలుసుకుందాం.. ఏమిటీ సంస్కరణలు ► 1948లో ఆవిర్భవించిన ఇజ్రాయెల్‌లో లిఖిత రాజ్యాంగం లేదు. ► నోటిమాటగా కొన్ని రాజ్యాంగ ప్రాథమిక చట్టాలు అమలవుతూ వస్తున్నాయి. ఈ చట్టాల ప్రకారం ఇజ్రాయెల్‌లో సుప్రీంకోర్టే శక్తివంతం. ► ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన ‘నేస్సెట్’పై నియంత్రణ అధికారం సుప్రీంకోర్టుకే ఉంది. ► నెతన్యాహూ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నకొత్త సంస్కరణల ప్రకారం మొత్తం న్యాయ వ్యవస్థపై పార్లమెంట్‌కే అధికారాలు ఉంటాయి. అంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలదే అసలు పెత్తనం. ► న్యాయమూర్తులను ఎలా నియమించాలి? ఎలాంటి చట్టాలు తీసుకురావాలి? అనేది పార్లమెంటే నిర్ణయిస్తుంది. అంతేకాదు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలల్లో మార్పులు చేసే అధికారం పార్లమెంట్‌కు ఉంటుంది. ► ఇజ్రాయెల్ జ్యుడీషియరీలో ఇలాంటి భారీ మార్పులను ప్రతిపాదిస్తుండడం ఇదే మొదటిసారి. ► సుప్రీంకోర్టు అనేది ఇజ్రాయెల్ ప్రజలకు సంబంధం లేని గ్రూప్‌గా మారిపోయిందని నెతన్యాహూ మద్దతుదారులు వాదిస్తున్నారు. న్యాయస్థానం పరి ధి మీరి వ్యవహరిస్తోందని, సంబంధం లేని వ్యవహారాల్లో తలదూరుస్తోందని విమర్శిస్తున్నారు. ► ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రభుత్వంలో న్యాయస్థానం జోక్యం ఏమిటని వారు మండిపడుతున్నారు. ► అమెరికా లాంటి దేశాల్లో జడ్జీల నియామక వ్యవస్థను రాజకీయ నాయకులే నియంత్రిస్తారని నెతన్యాహూ గుర్తుచేస్తున్నారు. తద్వారా తన చర్యలను సమర్థించుకుంటున్నారు. ► ఇజ్రాయెల్‌లో జడ్జీలను నియమించే తొమ్మిది మంది సభ్యుల కమిటీలో మెజార్టీ సభ్యులు ప్రభుత్వ ప్రతినిధులే ఉండేలా ఆయన ఒక బిల్లును తీసుకొచ్చారు. ► పార్లమెంట్ చేసిన కొన్ని చట్టాలు చెల్లవంటూ సుప్రీంకోర్టు గతంలో తీర్పులు వెలువరించింది. అలాంటి చట్టాలను మళ్లీ ఆమోదించే అధికారం పార్లమెంట్‌కు ఉండాలని(ఓవర్‌రైడ్ క్లాజ్) నెతన్యాహూ ప్రతిపాదిస్తున్నారు. ► పదవిలో ఉన్న ప్రధానమంత్రిని కుర్చీ నుంచి దించేయాలంటే మంత్రివర్గంలో మూడింట రెండొంతుల మంది మద్దతు తప్పనిసరిగా ఉండాలన్నది మరో కీలక ప్రతిపాదన. ► శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా లేకపోతేనే ప్రధానమంత్రిని తొలగించాలని, ఇతర కారణాలతో కాదని ఇంకో ప్రతిపాదన చేశారు. నెతన్యాహూకు ప్రయోజనమేంటి? ► ప్రధానమంత్రి నెతన్యాహూపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. వాటిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆయనపై మోసం, లంచం తీసుకోవడం, విశ్వాస ఘాతుకానికి పాల్పడడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ► తాను ఏ తప్పూ చేయలేదని నెతన్యాహూ చెబుతున్నప్ప టికీ ఆయన పదవి నుంచి దిగిపోవాల్సిందేనని ప్రత్య ర్థులు డిమాండ్ చేస్తున్నారు. ► పదవిని కాపాడుకోవడానికే న్యాయ వ్యవస్థలో సంస్కరణల పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని ఆరోపిస్తున్నారు. ► అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటున్న నెతన్యాహూ సుప్రీంకోర్టుతో ఓ ఒప్పందానికి వచ్చి ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఆయన ప్రభుత్వం తీసుకొనే విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామి కాకూడదు. కానీ, న్యాయ వ్యవస్థలో సంస్కరణలంటూ విధానపరమైన నిర్ణయంతో ఒప్పందాన్ని ఉల్లంఘించినందున ప్రధానిగా ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలంటూ ఇజ్రాయెల్ అటార్నీ జనరల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి ఏం జరగొచ్చు? జ్యుడీషియరీలో మార్పుల ప్రతిపాదనలను ప్రభుత్వం పూర్తిగా వెనక్కి తీసుకొనేదాకా పోరాటం ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రజలు తేల్చిచెబుతున్నారు. పోరాటం మరింత ఉధృతం చేస్తామని అంటున్నారు. ప్రజలు తమను ఎన్నుకున్నది చట్టాలు చేయడానికేనని ప్రభుత్వం చెబుతుండడం ఆసక్తికరంగా మారింది. న్యాయ వ్యవస్థలో సంస్కరణలకు ప్రజామోదం లభించిందని నెతన్యాహూ అనుచరులు పేర్కొంటున్నారు. అయితే జనాందోళనకు తలొగ్గి, సంస్కరణలను నెలపాటు వాయిదా వేస్తున్నట్టు నెతన్యాహూ తాజాగా ప్రకటించారు. మరోవైపు ఈ ఉదంతంతో రాజ్యాంగ సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తోందని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు. అంతర్గత సంఘర్షణ నెలకొనే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు. ప్రత్యర్థుల అభ్యంతరాలు జడ్జీలను నియమించే అధికారం నెతన్యాహూ, ఆయన మిత్రుల చేతుల్లో ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు తప్పదని ప్రత్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుకూలంగా పనిచేసే జడ్జీలను నియమించుకొని, అవినీతికి సంబంధించిన కేసుల నుంచి బయటపడి, అధికారంలో సుదీర్ఘ కాలం కొనసాగాలన్నదే నెతన్యాహూ ఎత్తుగడ అని ఆరోపిస్తున్నారు. న్యాయ వ్యవస్థ సర్వ స్వతంత్రంగా పనిచేయాలని, అందులో ఇతరుల పాత్ర ఉండరాదని నెతన్యాహూ గతంలో గట్టిగా వాదించారు. ఇండిపెండెంట్ జ్యుడీషియరీకి మద్దతు పలికారు. ఇప్పుడు స్వప్రయోజనాల కోసం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రత్యర్థులు ఆక్షేపిస్తున్నారు. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే హద్దుల్లేని, నియంత్రణ లేని న్యాయ వ్యవస్థ కాదని నెతన్యాహూ తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రజలకు నష్టమే! ఇజ్రాయెల్ న్యాయ వ్యవస్థ బలహీనపడితే కేవలం ఇజ్రాయెల్ పౌరులకే కాదు, పాలస్తీనా ప్రజలకు సైతం నష్టమేనని నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న వెస్ట్‌బ్యాంక్‌లో పెద్ద సంఖ్యలో పాలస్తీనా పౌరులు ఉన్నారు. వారికి రెసిడెన్సీ కార్డులు ఉన్నాయి. హక్కులకు విఘాతం కలిగినప్పుడు, ప్రభుత్వం నుంచి వేధింపులు పెరిగినప్పుడు, ప్రమాదంలో ఉన్నామని భావించినప్పుడు ప్రజలు ఇకపై కోర్టులను ఆశ్రయించలేరని, ఒకవేళ కోర్టుకెళ్లినా న్యాయం జరుగుతుందన్న భరోసా ఉండదని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం చెప్పినట్లే కోర్టులు ఆడాల్సి ఉంటుందని, అవి ప్రజలకు రక్షణ కల్పించలేవని అభిప్రాయపడుతున్నారు. కోర్టులపై రాజకీయ నాయకుల పెత్తనం మొదలైతే ఇజ్రాయెల్‌లోని మైనార్టీల హక్కులకు, జీవితాలకు రక్షణ ఉండదని అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సుప్రీం స్వతంత్రతే దేశానికి రక్ష
భారత లౌకిక రాజ్యాంగ లక్ష్యాల పరిరక్షకురాలిగా సుప్రీంకోర్టు పాత్ర ఎంతో కీలకమైనది. కానీ గత 75 ఏళ్లుగా దాని మీద స్వారీ చేయాలని మొదట కాంగ్రెస్ పాలకులు, ఇప్పుడు బీజేపీ పాలకులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతతో వ్యవహరించాల్సి ఉందన్న తీర్పును శిరసా వహించవలసింది పోయి, దాన్ని తోసిపుచ్చుతూనే వచ్చారు. కానీ దానికి ఎదురు నిలిచి గట్టిగా అడ్డుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు న్యాయ స్థానానికీ, పాలక వర్గానికీ మధ్య అధికార సమతుల్యతను సాధించగలిగారు. కానీ ప్రభుత్వం మాటే చెల్లుబడి కావాలి అన్న వాదన మళ్లీ యధాతథ స్థితికే వచ్చింది. పాలకవర్గానికి అనుకూలురుగా వ్యవహరించగల వ్యవస్థను ఖరారు చేసే ప్రయత్నంలో బీజేపీ పాలకులు ఉండటం గమనార్హం. ‘‘రానున్న దశాబ్దాలలో సుప్రీంకోర్టు దేశ పాలకుల నుంచీ, ఇతర రంగాల నుంచీ పెక్కు సవాళ్లను ఎదుర్కొనవలసి ఉంటుంది. వాస్తవానికి భారత లౌకిక రాజ్యాంగ లక్ష్యాల పరిరక్షకురాలిగా సుప్రీంకోర్టు తన కర్తవ్యాన్ని తు.చ. తప్పకుండా నెరవేర్చవలసి ఉంటుంది.’’ – భారత లా కమిషన్ మాజీ అధ్యక్షులు, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ.పి. షా (20 సెప్టెంబర్ 2022) గత 75 సంవత్సరాల్లో మొదట కాంగ్రెస్ శక్తులు, ఆ పిమ్మట బీజేపీ– ఆరెస్సెస్ శక్తులు రాజ్యాంగ లౌకిక సూత్రాలకు కట్టుబడకుండా పాలకుల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ వచ్చాయి. 1971–93 మధ్య దేశ పాలకులు సుప్రీంకోర్టులో తమకు అను కూలంగా ఉండే న్యాయ మూర్తులే ఉండాలని పట్టుబట్టడంతో అలాంటి వారినే ప్రధానంగా నియమిస్తూ వచ్చారు. దాంతో ప్రధాన న్యాయమూర్తులు, న్యాయ మూర్తుల నియామకాల్లో ‘సీనియారిటీ’ ప్రశ్న తలెత్తకుండా పాలకులు జాగ్రత్త పడుతూ వచ్చారు. 1981లో ‘ఫస్ట్ జడ్జెస్’ కేసులో (ఎస్.పి. గుప్తా కేసు) వెలువరించిన న్యాయ వ్యవస్థ స్వతంత్రత తీర్పును శిరసా వహించవలసిన అవసరాన్ని పాలకులు తోసిపుచ్చుతూనే వచ్చారు. ఈ ధోరణిని 1993లో గట్టిగా అడ్డుకున్నవారు నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎన్. వెంకటాచలయ్య. దాంతో అప్పటికి న్యాయస్థానానికీ, పాలక వర్గానికీ మధ్య అధికార సమతుల్యత వచ్చినట్టు కన్పించేదిగానీ, పాలక శక్తుల నిరంకుశ ధోరణి (ప్రభుత్వం మాటే చెల్లుబడి కావాలి అన్న వాదన) మళ్లీ యధాతథ స్థితికే వచ్చింది. ఎటుతిరిగీ బలహీనమైన పాలక వర్గాలు అధికారంలో ఉన్న ప్పుడు మాత్రమే న్యాయస్థానాలు కొంత గాలి పీల్చుకోగలిగాయి. ఈ పరిణామాలు వచ్చివచ్చి నరేంద్ర మోదీ ప్రధానిగా బీజేపీ ప్రభుత్వం రాగానే ‘తీసికట్టు నాగంబొట్టు’ అన్న చందంగా తయారయ్యాయి. అయితే ఈ స్థితి ప్రధాన న్యాయమూర్తిగా మొన్నటిదాకా పనిచేసి రిటైర్ అయిన జస్టిస్ ఎన్.వి. రమణ కాలంలో కొంతవరకు ప్రజాను రంజకంగా కొనసాగింది. ఆ తరువాత ప్రధాన న్యాయమూర్తిగా వచ్చి 2024వ సంవత్సరం దాకా ఆ పదవిలో కొనసాగనున్న జస్టిస్ డి.వై. చంద్రచూడ్ తీసుకొంటున్న నిర్ణయాలు సుప్రీం పరువును, దేశ లౌకిక రాజ్యాంగ ప్రతిపత్తిని అక్షరసత్యంగా కాపాడుతున్నాయి. అయితే జస్టిస్ ఎ.పి. షా చెప్పినట్టుగా అప్పుడే ‘‘పాలకవర్గం నుంచి జస్టిస్ చంద్రచూడ్ విధానాలకు ప్రతిఘటన’’ మొదలైందని మరచిపోరాదు. ఈ సందర్భంగా ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతి రేకంగా రాష్ట్ర హైకోర్టు వెలువరించిన ప్రతికూల తీర్పులపై సుప్రీం కోర్టు ఇచ్చిన తిరుగులేని తీర్పును ఒక కనువిప్పుగా భావించాలి. ‘‘ఏపీలో ప్రభుత్వ కార్యనిర్వాహక విధుల జోలి హైకోర్టుకు ఎందుకు? హైకోర్టే ప్రభుత్వమైతే ఇక అక్కడి మంత్రి మండలి ఎందుకు? ప్రజా ప్రతినిధులెందుకు?’’ అంటూ సుప్రీం జస్టిస్ కె.ఎం. జోసఫ్, జస్టిస్ బీవీ నాగరత్నం ధర్మాసనం వ్యాఖ్యానించవలసి రావటం సుప్రీం నిర్ణయాలకు ఎంత ప్రాముఖ్యముందో అర్థమవుతోంది. పరిపాలనా వికేంద్రీకరణ అవసరం ఎంత ఉందో కూడా సుప్రీం ధర్మాసనం గుర్తిం చింది. రాజధాని ఫలానా ప్రాంతంలోనే ఉండాలని ఆదేశించే అధి కారం కోర్టుకు లేదనీ, కోర్టులకు ఆ హక్కు ఉండే పక్షంలో మంత్రి వర్గాలెందుకనీ కూడా సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. ఇలా ధర్మాసనం లేవనెత్తిన ప్రజానుకూలమైన ప్రశ్నల నేప థ్యంలో– బీఆర్ అంబేడ్కర్‌ను ఉటంకిస్తూ, భారత పాలక వర్గాలు రాజకీయంగా ఎంత పతనమయ్యాయో చెప్పిన మాటల్ని ‘శంకర్స్ వీక్లీ’ (16 ఏప్రిల్ 1949) ఒక కార్టూన్ ద్వారా ఏనాడో వెల్లడించింది. ‘‘భారతదేశంలో రాజకీయ నాయకుణ్ణి ఒక మత గురువు స్థానంలో నిలబెట్టి కొలుస్తారు. కానీ, భారతదేశం వెలుపల మాత్రం అక్కడి ప్రజలు మత గురువుల జన్మదినాలనే జరుపుకొంటారు. కానీ ఇండియాలో మత గురువుల జన్మదినాలతోపాటు రాజకీయ నాయ కుల జన్మ దినాలు జరుపుతారు. రాజకీయ నాయకుడు సత్ప్రవర్తన గలవాడయినప్పుడు ప్రేమించండి, గౌరవించండి. కానీ నాయకుణ్ణి కొలవడం అనేది ఉండకూడదు. ఆ పని కొలిపించుకునేవాడికీ, కొలిచే వాడికీ తగదు. ఉభయత్రా ఈ పని నైతిక పతనంగా భావించాలి’’ అన్నారు అంబేడ్కర్. ఈ మాటల్నే 1955లో తలచిందెల్ల ధర్మం అని భావించరాదని పార్లమెంట్లో చెప్పారు. ‘రాజు తప్పు చేయడన్న’ సంప్రదాయం బ్రిటిష్‌వాడి నమ్మిక. కానీ రాజ్యాంగాన్ని అమలుజరిపే విషయంలో రాచరిక వ్యవస్థల్లో లాగా నేటి ప్రధానమంత్రి తప్పు చేయడనీ, చేయలేడనీ చెప్పడం ఉండకూడదన్నారు. ఈ దృష్ట్యానే అంబేడ్కర్ సుప్రీంకోర్టు జడ్జీలు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి సర్వాధికారాలు ఉండాలని కోరుతూ సవరణలు ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమానా భివృద్ధి ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న ప్రాంతీయ రాజధానులు, కోర్టుల ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయాలు సబబేనన్నది సుప్రీం కోర్టు భావన. ఈ పరిణామాలకు కొన్ని ప్రతిపక్షాలు, వాటికి కొమ్ము కాసే పత్రికలు వక్రభాష్యం చెబుతున్నాయి. జగన్ ప్రభుత్వం నవ రత్నాల పథకాన్ని జయప్రదంగా అమలు కానివ్వకుండా చూసేందుకు కొన్ని ప్రతిపక్షాలు ‘జక్కాయి బుక్కాయి’తో చేతులు కలిపి పాలనా రథాన్ని కుంటుపర్చడానికి ప్రయత్నిస్తున్నాయి. సుప్రీం తాజా నిర్ణ యంతో వాటి నోళ్లు పెగలక ‘రూటు’ మార్చాయి. ప్రపంచంలో ఎక్కడా దేశానికి, రాష్ట్రాలకు రెండేసి మూడేసి రాజధానులు ఉండవని ‘కోత కోస్తూ’ వచ్చిన కొన్ని ప్రతిపక్షాలు తమ మాటలు అబద్ధాలని గుర్తించక తప్పని స్థితి వచ్చింది. సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం తీసుకున్న నిర్ణయం ఫలితంగా – జస్టిస్ కె.ఎం. జోసెఫ్ లాంటి దళిత న్యాయమూర్తి నిజాయితీ కూడా ప్రపంచానికి వెల్లడయింది. ఎందుకనంటే రాష్ట్ర గవర్నర్లు... రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి, వాటి సలహా సహకారాలతోనే రాజ్యాం గంలోని 163వ అధికరణ ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది గానీ, రాష్ట్ర ప్రభుత్వాలను ధిక్కరించి కాదని బొమ్మై కేసులో జస్టిస్ జయ చంద్రారెడ్డి తీర్పును దేశవ్యాపిత స్థాయిలోనే ప్రజాస్వామ్య నిర్ణ యంగా న్యాయ శాస్త్రవేత్తలు భావించారు. ఉత్తరాఖండ్‌లో పరిణామాలు బీజేపీ పాలకులకు వ్యతిరేకంగా ఉన్నందున అర్ధంతరంగా అక్కడ రాష్ట్రపతి పాలనను విధించేందుకు మోదీ ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని తిప్పి కొట్టడానికి జస్టిస్ జోసెఫ్ జంకనందున అప్పటికి ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న ఆయన్ని సుప్రీంకోర్టు జస్టిస్‌గా పదవీ స్వీకారం చేయనివ్వకుండా మోదీ ప్రభుత్వం అడ్డు కుంది. నేడు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలోని బీజేపీ గవర్నర్లు చేస్తున్న నిర్వాకం – దాదాపు పది రాష్ట్రాలలోని బీజేపీయేతర ప్రభు త్వాలను పడగొట్టేందుకు తోడ్పడటం. ఇలా 1960ల నుంచి నేటి దాకా పెక్కుమంది గవర్నర్లు పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలదోయడానికి తోడ్పడుతూ వచ్చినవాళ్లే! మోదీ మంత్రివర్గ సీనియర్ సభ్యుడు కిరణ్ రిజిజూ జాతీయ స్థాయి న్యాయమూర్తుల నియామకాలను ఖరారు చేసే వ్యవస్థను రద్దు చేసి, పాలకవర్గానికి అనుకూలురుగా వ్యవహరించగల వ్యవస్థను ఖరారు చేసే ప్రయత్నంలో ఉండటం ఇక్కడ గమనార్హమైన విషయం. అందుకే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్ ఒక తాజా ఇంటర్వ్యూలో ‘న్యాయ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ సంపూర్ణాధి పత్యాన్ని అనుమతిస్తే న్యాయవ్యవస్థ స్వేచ్ఛగా నిర్ణయాలు చేయగల స్థితిలో ఉండదు’ అన్నారు. అందుకేనేమో వేమన మహాకవి ఏనాడో ఇలా తీర్పు చెప్పిపోయాడు. ‘అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెను మనుజుడుండు ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా? విశ్వదాభిరామ వినుర వేమ’! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
రాజకీయ పార్టీలన్నీ ఉచితాలవైపే
న్యూఢిల్లీ: బీజేపీతో సహా రాజకీయ పార్టీలన్నీ ఉచిత హామీల పక్షమేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. అందుకే ఏవి ఉచితాలో, ఏవి సంక్షేమ పథకాలో తేల్చేందుకు న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్నారు. ఎన్నికల వేళ ఉచిత హామీలిచ్చే పార్టీల గుర్తింపును రద్దు చేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై జస్టిస్ రమణ, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ సీటీ రవికుమార్‌ల ధర్మాసనం మంగళవారం విచారించింది. ‘ఉచితాలు అందరికీ కావాల్సిందే. పార్టీలు ఈ విషయంలో ఒక్కతాటిపై ఉన్నాయి. అందుకే దీనిపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే మేం జోక్యం చేసుకున్నాం’’ అని జస్టిస్ రమణ ఈ సందర్భంగా అన్నారు. ఉచితాలపై డీఎంకే చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘వాళ్ల తీరు నిజంగా దురదృష్టకరం. ఇంకా చాలా అనాలనుకున్నా నేను సీజేఐగా ఉన్న కారణంగా ఇక్కడితో సరిపెడుతున్నా. అయితే తెలివితేటలు కేవలం ఒక్క వ్యక్తికో, పార్టీకో పరిమితం కాదని గుర్తుంచుకోండి’’ అంటూ డీఎంకే తరఫు న్యాయవాది పి.విల్సన్‌ను ఉద్దేశించి ఆగ్రహం వెలిబుచ్చారు. ప్యానల్ కావాలి: సిబల్ ఉచితాల అంశాన్ని ఒక నిర్దిష్ట వ్యవస్థ ద్వారా పరిష్కరించాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. ‘వీటి కట్టడికి కేంద్ర ఆర్థిక సంఘం పర్యవేక్షణలో చట్టబద్ధ అధికారాలతో ఓ ప్యానల్‌ను ఏర్పాటు చేయాలి. ఉచితాలు బడ్జెట్లో 3 శాతం మించకుండా చూడాలి. ఒకవేళ మించితే ఆ తర్వాత ఏడాదిలో సదరు రాష్ట్రానికి ఆర్థిక సంఘం ఆ మేరకు కేటాయింపులను తగ్గించాలి’’ అని సూచించారు. దీనిపై ఇంకా చర్చ జరిగి ఇలాంటి సూచనలు చాలా రావాలని సీజేఐ అభిప్రాయపడ్డారు. ‘కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పేదలకు సైకిళ్లు ఇస్తున్నాయి. వాటివల్ల వారి జీవన విధానం మెరుగైందని పలు నివేదికలు చెబుతున్నాయి. మారుమూల గ్రామానికి చెందిన ఓ నిరుపేద జీవనోపాధికి సైకిళ్లు, చిన్న పడవలపై ఆధారపడవచ్చు. దీనిపై మనమిక్కడ కూర్చుని వాదించి నిర్ణయించలేం’’ అన్నారు. సంక్షేమ పథకాలను ఎవరూ వద్దనరని, టీవీల వంటివాటిని ఉచితంగా పంచడంపైనే అభ్యంతరమని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ఉచిత పథకాలను నిధులెలా సమీకరిస్తారన్నది ఎన్నికల మేనిఫెస్టోలోనే పార్టీలు స్పష్టంగా చెప్పాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు అన్నారు. -
న్యాయ పాలనకు విఘాతం కలగనివ్వద్దు
సాక్షి, అమరావతి : న్యాయ వ్యవస్థను, జడ్జిలను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత, అభ్యంతరకర పోస్టులు పెట్టడం వల్ల న్యాయ పాలనకు విఘాతం కలుగుతుందని హైకోర్టు తెలిపింది. సీబీఐ కేసులు నమోదు చేసినా పోస్టులు పెట్టడం ఆగడం లేదంది. హైకోర్టు ఇటీవల పలు కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిచ్చిన నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్డడంపై విచారణ జరపాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుల్లో తదుపరి పురోగతి లేదంటూ హైకోర్టు తరఫున రిజిస్ట్రార్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యంపై జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. సీబీఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు స్పందిస్తూ, సీబీఐ దర్యాప్తునకు సంబంధించిన స్థాయీ నివేదకను సీల్డ్ కవర్లో కోర్టు ముందుంచుతున్నామని, ఇది నాలుగవదని చెప్పారు. ఐదుగురిని అరెస్ట్ చేసి వారిపై చార్జిషీట్లు వేశామని, మరో 3 నెలల్లో దర్యాప్తు పూర్తవుతుందన్నారు. సీల్డ్ కవర్లో సీబీఐ ఇచ్చిన నివేదికను ధర్మాసనం పరిశీలించింది. ఇక్కడి నిందితుల విషయంలో సీబీఐ దర్యాప్తు సంతృప్తికరంగా ఉందని, అయితే విదేశాల్లో ఉన్న నిందితుల విషయంలో మాత్రం సీబీఐ విఫలమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విదేశాల్లో ఉన్న నిందితులపై విచారణను వేగవంతం చేయడానికి ఏం చేయాలో తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. సీబీఐ కేసు కొట్టేయాలంటూ పిటిషన్ తన అరెస్ట్‌తో పాటు సీబీఐ ఎఫ్ఐఆర్లో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని గుంటూరుకు చెందిన అవుతు శ్రీధర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ బుధవారం విచారణ జరిపారు. ఐపీసీ సెక్షన్ 502(2) పిటిషనర్‌కు వర్తించదని అతని తరఫు న్యాయవాది చిన్మోయ్ ప్రదీప్ శర్మ వాదనలు వినిపించారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. -
కోర్టుల మితివీురిన జోక్యం రాజ్యాంగ అతిక్రమణే
సాక్షి, అమరావతి: శాసన వ్యవస్థ హక్కులు, అధికారాల్లో న్యాయస్థానాలు మితిమీరి జోక్యం చేసుకోవడం భారత రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు పెను ముప్పు అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆ జోక్యం అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అవరోధాలు సృష్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని వడోదరలో బుధవారం ‘అఖిల భారత స్పీకర్ల సదస్సు’ ప్రారంభమైంది. రెండు రోజులపాటు నిర్వహించే ఈ సదస్సులో మొదటి రోజు రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలతో పాటు అన్ని రాష్ట్రాల స్పీకర్లు పాల్గొన్నారు. ఈ సదస్సులో స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ.. వ్యవహారపరమైన లోపాలున్నాయనే ఆరోపణల ఆధారంగా శాసనసభ వ్యవహారాలు, నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోడానికి వీల్లేదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 212 విస్పష్టంగా పేర్కొందన్నారు. అందుకు విరుద్ధంగా ఇటీవల న్యాయస్థానాలు తరచూ శాసన వ్యవస్థ పరిధిలోకి చొచ్చుకు వస్తుండటం రాజ్యాంగ అతిక్రమణే అని స్పష్టం చేశారు. ఏపీ శాసనసభ ఆమోదించిన ‘పరిపాలన వికేంద్రీకరణ– ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, ‘సీఆర్డీయే చట్టం రద్దు బిల్లు’లపై కోర్టు స్టే ఇవ్వడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ బిల్లుల అంశంలో రాష్ట్ర శాసనసభ, మండలి మధ్య విభేదాలను పరిష్కరించేందుకు రాజ్యాంగం ప్రకారం ప్రత్యేక వ్యవస్థ, నిబంధనలు, సంప్రదాయాలు ఉన్నాయని, ఈ అంశంలో కొందరు రాజకీయ దురుద్దేశంతోనే న్యాయస్థానాలను ఆశ్రయించారని చెప్పారు. ఇలాంటి కేసులను విచారించే ముందు వాటి వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలను న్యాయస్థానాలు పరిశీలించాలని సీతారాం కోరారు. పరిపాలన ముందుకు సాగేదెలా.. కీలక, సున్నితమైన అంశాలు రాగానే వాటిపై వెంటనే వ్యాఖ్యలు చేయడానికి రాజ్యాంగ వ్యవస్థలు సిద్ధంగా ఉండటం విస్మయానికి గురి చేస్తోందని కూడా స్పీకర్ సీతారాం అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. చట్టసభల్లో కూలంకషంగా చర్చించిన తర్వాత పాస్ చేసిన బిల్లులు అమలు కాకపోవడం బాధిస్తోందని, సభ ఆమోదించిన బిల్లులు చట్టాలుగా మారి అమలుకాకపోతే పరిపాలన ముందుకు సాగదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రాజకీయ దురుద్దేశ పూర్వకంగా కోర్టులను ఆశ్రయించడంతో రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడి.. రాజ్యాంగ వ్యవస్థలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంటోందని చెప్పారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు తమ పరిధులను గుర్తించి ఒకదానిని ఒకటి గౌరవిస్తేనే రాజ్యాంగంలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించగలమని చెప్పారు. -
పేదలకు ఇకపై ఉచిత ప్రతివాద న్యాయసేవలు
అనంతపురం లీగల్: పేద, బడుగు వర్గాలపై నమోదైన క్రిమినల్ కేసుల్లో ఉచిత న్యాయ సహాయం అందించేందుకు న్యాయవాదుల నియామకానికి జాతీయ న్యాయ సేవాధికార సంస్థ శ్రీకారం చుట్టిందని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్‌కుమార్ చెప్పారు. పైలట్ ప్రాజెక్ట్ కింద అనంతపురం జిల్లాకు మంజూరైన న్యాయ సహాయ ప్రతివాద న్యాయవాది వ్యవస్థను జస్టిస్ రాకేష్‌కుమార్ శుక్రవారం డిజిటల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెషన్స్ కేసుల్లో పేదవారి తరఫున అండగా నిలిచి న్యాయసహాయం అందించటానికి ఈ వ్యవస్థ చక్కటి అవకాశమన్నారు. జిల్లా పరిపాలనా న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు మాట్లాడుతూ.. సకాలంలో సరైన న్యాయ సహాయకులు లేక ఎందరో జైళ్లలో మగ్గిపోతున్నారని, వారందరికీ అండగా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ సిస్టం నిలుస్తుందని చెప్పారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ చిన్నంశెట్టి రాజు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి గరికపాటి దీనబాబు, జాతీయ బార్ కౌన్సిల్ సభ్యుడు రావిురెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.గురుప్రసాద్, అన్ని జిల్లాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు, సీనియర్ సివిల్ జడ్జిలు పాల్గొన్నారు. -
న్యాయమూర్తుల నియామకాలపై రాజకీయ నీడ
సుప్రీంకోర్టుకి చెందిన ఒక సీనియర్ న్యాయమూర్తికి వ్యతిరేకంగా ఫిర్యాదు దాఖలు చేసేంత తీవ్ర చర్య తీసుకునేలా ఆంధ్రప్రదేశ్ శాసనవ్యవస్థను.. న్యాయవ్యవస్థే ప్రేరేపించిందని మనం భావించవచ్చా? కొందరు అంటున్నట్లు న్యాయవ్యవస్థను అపఖ్యాతి పాలు చేయడానికి మాత్రమే ఉద్దేశపూర్వకంగా ఈ అంశాన్ని బహిర్గతపరిచారని కూడా భావించలేం. ఎందుకంటే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి మధ్య ఎలాంటి ముందస్తు శత్రుత్వమూ లేదు. క్విడ్ ప్రో కో కేసులో సీబీఐ నేరారోపణ చేసి జైలుకు పంపినప్పుడు కూడా ఏ న్యాయమూర్తినీ వైఎస్ జగన్ గతంలో తప్పుపట్టలేదు. వాస్తవానికి తనను సీబీఐ కేసులో ఇరికించడంలో కాంగ్రెస్, టీడీపీ రెండూ కుమ్మక్కయ్యాయన్నదే తొలినుంచీ ఆయన భావన. తనకు వ్యతిరేకంగా మోపిన కేసులకు సంబంధించి న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా జగన్ ఎలాంటి ఫిర్యాదునూ చేయలేదు. ఏపీ ప్రజల సంక్షేమానికి సంబంధించి తాను తీసుకున్న కొన్ని చర్యల పట్ల న్యాయవ్యవస్థ వ్యతిరేకత ప్రదర్శిస్తూ వచ్చినా సరే గత 16 నెలల కాలంలో సీఎం జగన్ అనుసరించిన వైఖరి ప్రశంసనీయమైనది. తీవ్రమైన కష్టాలు ఎదుర్కొన్నప్పుడు కూడా వైఎస్ జగన్ ఆసాధారణమైన సంయమనం పాటిస్తూ వచ్చారు. అలాంటి సమయంలో కూడా ఆయన ఈ తరహా ఫిర్యాదు చేసి ఎరగరు. చివరకు రాష్ట్రప్రభుత్వంపై కొంతమంది న్యాయమూర్తులు తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఏపీ సీఎం స్పందించలేదు. చాలావరకు టీడీపీతో అంటకాగుతున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా.. న్యాయమూర్తులు చేసిన అలాంటి వ్యాఖ్యలను పండగ చేసుకుంటున్న చందాన ప్రచురిస్తూ వచ్చాయి. దీన్నంతటినీ కాస్సేపు పక్కన పెట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన ఫిర్యాదుకు సంబంధించిన న్యాయ పర్యవసానాలకేసి చూపు సారిద్దాం. కక్ష తీర్చుకోవడానికి సీఎం ఇలా వ్యక్తిగత ఫిర్యాదు చేసినట్లు మనం దీన్ని పరిగణించవచ్చా అన్నదే సమస్య. లేదా, ఏపీలో న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా శాససవ్యవస్థ యుద్ధం ప్రకటించినట్లు భావించవచ్చా? ఈ అంశంపై ప్రజాభిప్రాయాన్ని కూడా పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థ ప్రత్యేకించి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు కొందరు తాము స్వతంత్రులుగానూ, ఎవరి ప్రభావానికి గురికానివారిగానూ తమను తాము ప్రదర్శించుకోలేకపోతున్నారన్నదే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సాధారణ అభిప్రాయంగా ఉంటోంది. నిజానికి న్యాయవాదులను హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమోట్ చేసిన సందర్భాల్లో 90 శాతం నియామకాలు వ్యక్తుల న్యాయసూక్ష్మతపై కాకుండా పూర్తిగా రాజకీయ ప్రభావం ప్రాతి పదికనే తీసుకుంటున్నారన్నది వాస్తవం. న్యాయమూర్తి కావడానికి ప్రాతిపదిక ఏమిటంటే.. ఒక రాజకీయ పార్టీ అజెండాలోకి తాను దూరిపోవడమే. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటోంది అనే అంశంతో పనిలేకుండా, న్యాయవ్యవస్థలోకి ఇప్పటికే ప్రవేశించిన వారు తెలుగుదేశం పార్టీకి సహాయకారులుగా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. గత పదేళ్లకు పైగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతూ వస్తున్నది ఇదే అని చెప్పాలి. దీన్ని క్లుప్తంగా చెప్పాలంటే, ప్రస్తుత తుపానులో అందరి దృష్టికి వచ్చిన ఆ న్యాయమూర్తిని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెరవెనుక చేసిన ప్రయత్నాలతో ఏపీ హైకోర్టులో గతంలో నియమించడంతో ఈ ట్రెండ్ ప్రారంభమైంది. తర్వాత ఏపీ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తులుగా నియమితులైన వారందరూ తమ బాస్ డిమాండ్లు లేక అభ్యర్థనలకు సమ్మతిస్తూ పోయే వింత ట్రెండ్ కొనసాగుతూ వచ్చింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వ్యక్తిగతంగా, వృత్తిగతంగా తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నవారు మాత్రమే ఘనత వహించిన హైకోర్టులో న్యాయమూర్తులుగా ప్రమోషన్ పొందుతూ వచ్చారు. విశ్వాసానికి సంబంధించిన అంశాన్ని మాత్రమే ఈ వ్యవస్థలో పెంచి పోషిస్తూ వచ్చారు. వారి తీర్పుల్లో కూడా ఇదే ప్రతిబింబిస్తూ వచ్చింది. అలాంటి పాక్షిక స్వభావం కలిగిన తీర్పులు వచ్చిన ప్రతిసారీ టీడీపీతో సంబంధిత న్యాయమూర్తి లేక న్యాయమూర్తుల సంబంధంపై చర్చ ముందుపీటికి వస్తూండేది. నిజానికి, ప్రస్తుత పరిస్థితి మూలాలు కూడా ఇలాంటి అనారోగ్యకరమైన ప్రాక్టీసులోనే కనిపిస్తాయి. ఇది న్యాయవ్యవస్థ మూలాల్నే కబళించివేస్తూ, ప్రజాస్వామ్య సారంపైనే సందేహాలను రేకెత్తిస్తూ వస్తోంది. న్యాయస్థానంలో నా 30 ఏళ్ల అనుభవంలో నేను ఏ రాజకీయపార్టీతోనూ అంటకాగలేదు. రాజకీయ పార్టీల దన్నుతో ఎదగడం గురించి నేను అస్సలు ఆలోచించలేదు. న్యాయవ్యవస్థలో నేను భాగం కాబట్టి నా ఆందోళన అంతా దాని గురించే ఉండేది. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చింది మొదలుగా న్యాయవ్యవస్థ ద్వారా తెలుగుదేశం పార్టీ సమాంతర ప్రభుత్వం నడుపుతూ వస్తోందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడిపోయింది. వైఎస్సార్సీపీ చేతుల్లో టీడీపీ ఘోరపరాజయం చెందిన తర్వాత కూడా టీడీపీ ఇలాగే వ్యవహరిస్తూ వస్తోంది. ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఏపీ హైకోర్టులో కొంతమంది న్యాయమూర్తులు డజన్లకొద్దీ వ్యతిరేక తీర్పులను వెలువరిస్తూ రావడమనేది ఈ అభిప్రాయానికి మరింత బలం చేకూర్చింది. ఇటీవల ఏపీ మాజీ అడ్వొకేట్ జనరల్‌పై కేసు సందర్భంగా హైకోర్టు మీడియాపై విధించిన నిషేధం కూడా ఇదే అభిప్రాయాన్ని బలపర్చింది. పైగా అర్ధరాత్రి దాటాక అగమేఘాలపై ఏపీ హైకోర్టు ఈ నిషేధ ఉత్తర్వులను జారీ చేయడం జాతీయ స్థాయి చర్చకు దారితీసింది. ఇదే చివరకు కొందరు న్యాయమూర్తులపై ముఖ్యమంత్రి ఫిర్యాదు చేయాల్సివచ్చిన దురదృష్టకరమైన ఘటనకు దారితీసింది. ఉమ్మడి హైకోర్టు ఉన్నట్లుండి విభజనకు గురై 2019 జనవరి 1 నుంచి రెండు హైకోర్టులుగా పనిచేయాల్సి వచ్చిన సందర్భంలో నా అనుభవాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సి ఉంది. ఏపీ హైకోర్టులో పనిచేయడానికి విజయవాడ తరలిపోవాలని 3 రోజుల నోటీసుతో ప్రతి ఒక్కరినీ కోరారు. న్యాయస్థానాన్ని పక్కకు నెట్టి, న్యాయవాదుల శ్రేయస్సును పణంగా పెట్టి అధికారులు వ్యవహరించిన తీరుపై నేను ఏపీ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆనాడు అసమ్మతి లేఖలు రాసాను. ఆ కారణంగానే నాటి అడ్వకేట్ జనరల్ సమక్షంలోనే నన్ను అవమానించారు. నాపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. బార్, దాని సంస్థను పూర్తిగా పక్కన పెట్టి ఏపీ నూతన హైకోర్టును ప్రారంభించారు. చివరకు న్యాయమూర్తులు సైతం మూగ ప్రేక్షకులుగా చూస్తుండిపోవాల్సి వచ్చింది. ఆ స్థాయిలో నాటి అడ్వొకేట్ జనరల్ అసాధారణ అధికారాలు చలాయిస్తూ వచ్చాడు. ఇలా ఒకే ఒక వ్యక్తి తన సమర్థత రీత్యా కాకుండా అపెక్స్ కోర్టులో కొందరు నేరుగా తనను సమర్థిస్తూ వచ్చిన కారణంగా ఇంత అధికారాన్ని చలాయించడం చాలామందిలో అగ్రహాన్ని రగిలించింది. ఇది నిజంగా దురదృష్టకరమే కానీ ఎలాంటి తనిఖీ లేకుండానే హైకోర్టులో తమ ప్రతి నిధిగా చలాయించడానికి ఆ వ్యక్తిని అనుమతించిన కారణంగానే న్యాయవ్యవస్థకు ఇంత నష్టం జరిగిందని అందరూ గుర్తించాలి. న్యాయమూర్తులపై వచ్చిన ఆ ఫిర్యాదును నేను బలపర్చలేను, ప్రోత్సహించలేను కానీ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మనస్సుల్లో అనుమానం బలపడినప్పుడు, దాని న్యాయపరమైన పర్యవసానాలు, వ్యాఖ్యానాలతో పని లేకుండా న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ రెండూ ఈ అంశంపై తమ వైఖరిని తేల్చి చెప్పాల్సిన అవసరముంది. అలాగే ముఖ్యమంత్రి ఫిర్యాదుపై కూడా నిర్దిష్టంగా విచారించి ఇరుపక్షాలూ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక సెక్షన్ ప్రజలపైనే కేసులు, దర్యాప్తులు సాగిస్తూ మరొక సెక్షన్‌ను న్యాయవ్యవస్థ కాపాడుతోందన్న అభిప్రాయం ఏపీలో బలపడింది. ఇలాంటి పరిస్థితి ఇకపై కొనసాగదని భావిస్తాను. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోకుండా న్యాయవ్యవస్థ, శాసనవ్యవస్థ తమపై తాము పరిమితులను విధించుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. రేపటి తరం న్యాయమూర్తులు తాము నిష్పాక్షికంగా ఉంటామని, మనుషుల ముఖాలు చూసి కాకుండా కేసులనుబట్టి మాత్రమే తీర్పులు వెలువరిస్తామనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించాల్సి ఉంది. అదే సమయంలో శానసవ్యవస్థ కూడా తమ నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చిన ప్రతికూలమైన తీర్పులను కూడా స్వాగతించాలి. ఏది ఏమైనా రాజ్యాంగ పాలనపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడమే ప్రస్తుత కర్తవ్యం. కేబీ రామన్నదొర వ్యాసకర్త న్యాయవాది, మాజీ అధ్యక్షుడు, ఏపీ హైకోర్ట్ అడ్వొకేట్స్ అసోసియేషన్, అమరావతి మొబైల్ : 98495 67667 -
తీర్పు చెప్పేవాడు ‘మనవాడైతే’?
దేశంలో న్యాయ పరమైన చిక్కులు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించే బాధ్యత కూడా న్యాయ వ్యవస్థ మీదే ఉంటుంది. మారుతున్న సామాజిక పరిస్థితులను అనుసరించి ఒక్కోసారి పెను వివాదాలు చోటు చేసుకుంటాయి. వీటిని విమర్శిస్తూ ఇదేమి చోద్యం? ఇంతకు ముందు ఇలాంటి వివాదం తలెత్తిందా అనటం సబబు కాదు. అలా అనుకుంటే న్యాయ చరిత్రలో, ఆ మాటకొస్తే దేశచరిత్రలోనే ప్రజా హక్కులను కాపాడే కేసుగా కేశవానంద భారతి కేసు చరిత్రకు ఎక్కేది కాదు. చరిత్ర గతినే మలుపు తిప్పిన కేసుగా దీనిని న్యాయ కోవి దులు అభివర్ణిస్తుంటారు. 13 మంది న్యాయమూర్తులచే 68 రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిగిన ఈ కేసు తీర్పులో నలుగురు న్యాయమూర్తులు ఈ తీర్పును వ్యతిరేకించారు. అలాగే ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులకు భంగం కలిగినప్పుడు పాలించే ప్రభుత్వాలకు ఆటంకాలు, అవరోధాలు కలిగినప్పుడు సవాళ్లు, ప్రతి సవాళ్లు, సంక్షోభాలు షరా మామూలే ! ఇవి రాజకీయాల్లో అయితే ప్రజలు ఓటు ద్వారా తీర్పునిస్తారు. అయితే ప్రజలు తీర్పిచ్చిన ప్రభుత్వానికి ఈ సంకట స్థితి ఎదురైతే న్యాయస్థానం తీర్పు ఇస్తుంది. ఈ తీర్పులు చట్టాలను అనుసరించి ప్రజామోదయోగ్యంగా ఉంటాయి, అలా ఉండకపోతేనో మళ్ళీ అదొక సంక్షోభం. ఎవరైనా న్యాయస్థానానికి ఎందుకు వెళతారు? న్యాయం కోసం. కానీ అదే న్యాయస్థానం న్యాయం అందించటానికి సిద్ధంగా లేకపోతే? లేదా పక్షపాత ధోరణితోనూ, ఏకపక్ష ధోరణితోనూ వ్యవహరిస్తోంది అనిపిస్తే? అప్పుడేమిటి చేయటం? సరిగ్గా అప్పుడే సహజ న్యాయసూత్రాల ప్రస్తావన వస్తుంది. దీన్నే న్యాయ పరిభాషలో ‘ప్రిన్సిపుల్ ఆఫ్ నేచురల్ జస్టిస్’ అంటారు. కేసు విచారణలో ఏకపక్ష ధోరణులు, ఎదుటివారి వాదనను వినకపోవటం లేదా వినే అవకాశం ఇవ్వకపోవటం, తీర్పు వెలువరించటానికి ముందే ఆ తీర్పు ఎలా ఉండాలో మానసికంగా సంసిద్ధులు కావటం, అందుకు పక్షపాత వైఖరో, ద్రవ్య ప్రలోభమో, బంధుత్వమో, రాగద్వేషాలో కారణం అవటం వంటి పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడు ‘సివిల్ లా’లో ‘ప్రిన్సిపుల్ ఆఫ్ నేచురల్ జస్టిస్’ ప్రస్తావన వస్తుంది. ఏమిటీ సహజ న్యాయ సూత్రం? ఇది మన న్యాయ చట్టాల్లో ఉందా? అంటే చట్టాల్లో పొందుపరచకపోయినా భారత రాజ్యాంగం ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 అనుసరించి సంగ్రహించడమైనది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 చట్టం ముందు అంతా సమానులే అని చెప్తుంటే, ఆర్టికల్ 21 వ్యక్తి స్వేచ్ఛ, ప్రాణ రక్షణ గురించి చెప్తోంది. ‘మేనకా గాంధీ వర్సెస్ ది యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో ఆర్టికల్ 21 స్ఫూర్తి విపులీకరించడమైంది. మితిమీరిన అధికారాలు ఎప్పుడూ మితం తప్పి అక్రమాలకే దారితీస్తాయనేది నానుడి. ఈ నానుడి నుంచి న్యాయవ్యవస్థకూ మినహాయింపు ఏమీలేదు. ఎందుకంటే న్యాయవ్యవస్థ మనుగడ కూడా మన మధ్య ఉండే మనుషులతో సాగేదే..! కనుక మనుషుల్లో ఉండే సహజమైన బలహీనతలు, పక్షపాత ధోరణులు అక్కడ నిబిడీకృతం అయి ఉంటాయి. అయితే వీటి ప్రభావం పవిత్రమైన తీర్పులపై ప్రసరించకుండా కాపాడుకునే ప్రక్రియే సహజ న్యాయసూత్రాల ప్రక్రియ. ఇది ఏకపక్ష, పక్షపాత, రాగద్వేషాలకు అతీ తంగా వ్యవహరించమని కోరే హక్కు. తీర్పులలో అవాంఛనీయ ధోరణులు ఏర్పడినప్పుడు న్యాయవ్యవస్థ ప్రతిష్ట మసకబారకుండా న్యాయవ్యవస్థ ప్రతిష్టను నిలబెట్టి, ఆ వ్యవస్థపై సగటు మనిషికి విశ్వాసం కలిగించేవే సహజ న్యాయసూత్రాలు. ఇందులో రెండు అతిముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అవే, ఒకటి ‘డాక్ట్రిన్ ఆఫ్ బయాస్’, రెండు ‘డాక్ట్రిన్ ఆఫ్ ఫెయిర్ హియరింగ్’. డాక్ట్రిన్ ఆఫ్ బయాస్ (Doctrine of bios) దీన్నే ‘నెమోడెబిత్ ఎస్సేజుడెక్స్ ప్రోప్రియాకాసో’ ( Nemo debut esse judex pro pria causo) అంటారు. ఇది లాటిన్ భాష నుంచి సంగ్రహించబడింది. No man shall be judge in his own అంటే ఏ ఒక్కరూ కూడా తమ కేసులో తాము జడ్జిగా వ్యవహరించకూడదు. తమ కేసులో అంటే ప్రత్యక్షంగా తాము ‘ఇన్వాల్’ అయినట్టు కాదు. ఒక కేసును విచారించే న్యాయమూర్తికి సదరు కేసుకి ఏదైనా సంబంధం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉండవచ్చు. అలాంటప్పుడు ఆ తీర్పు సరిగా వెలువడే అవకాశం లేదు. అలాగే సహజ న్యాయసూత్రాల్లో రెండవ అతిముఖ్యమైన అంశం ‘ఆడి అల్టెరమ్ పార్థిమ్’ (Audi Alterm partem). ఇది కూడా లాటిన్ భాష నుంచి వచ్చినదే. దీన్నే ఇంగ్లిష్‌లో ‘ఫెయిర్ హియరింగ్’ అంటారు. "No man should be punished or condemned unheard" ఏ వ్యక్తిని కూడా పూర్తి విచారణ జరగకుండా లేదా తన వాదనలు వినకుండా అతడిని శిక్షించకూడదు.డాక్ట్రిన్ ఆఫ్ బయాస్‌లో మళ్లీ మూడు అంశాలు ఉన్నాయి. ‘బయాస్’ అంటే పక్షపాత ధోరణి అని మనకు తెలిసిందే! ఈ పక్షపాతం ఎన్ని విధాలు అంటే మూడు రకాలు అని పేర్కొనవచ్చు. 1. వ్యక్తిగత పక్షపాతం ( Personal bias) 2. ద్రవ్యసంబంధ పక్షపాతం (Pecuniary bias) 3. విషయానికి సంబంధించిన పక్షపాతం (Subject matter of bias). వీటికి సంబంధించిన తీర్పులు చాలా ఉన్నాయి. ‘డాక్ట్రిన్ ఆఫ్ ఫెయిర్ హియరింగ్’ సిద్ధాంతాన్ని అనుసరించి ఏ వ్యక్తికి సంబంధించి అయినా న్యాయస్థానం తీర్పు చెప్పేటప్పుడు ఉభయుల వాదనలు విన్న తర్వాతే తీర్పు వెలువరించాలి. తీర్పు సారాంశాన్ని స్పష్టంగా వెల్లడించాలి. వాదనలు వినిపించడానికి ఉభయులకు సముచితమైన అవకాశం ఇవ్వాలి. న్యాయమూర్తులకు సహజంగానే కొన్ని విషయాలలో విచక్షణాధికారాలు ఉంటాయి. కానీ అవి తీర్పులను మరింత సమర్ధంగా, సమ్మతంగా న్యాయవ్యవస్థ ప్రతిష్ట నిలబెట్టడానికి, ప్రజల హక్కులు కాపాడటానికి అప్పుడప్పుడు సహజ న్యాయసూత్రాలు తెరమీదకు వస్తాయి. కానట్లయితే ప్రజాస్వామ్య మూలస్తంభాలలో అత్యంత కీలకమైన న్యాయవ్యవస్థ ప్రతిష్ట ఏ కొద్దిమంది చర్యలవల్లో, చేష్టలవల్లో మసకబారే ప్రమాదం ఉంది. ఈ రకమైన అవాంఛనీయ చర్యల వల్ల ప్రజాస్వామ్య ఉనికికే భంగం కలిగే అవకాశం ఉంది. కనుక పవిత్రమైన న్యాయవ్యవస్థను కాపాడుకోవటంలో సగటు ప్రజలకు బాధ్యత ఉందని ‘సహజ న్యాయ సూత్రాలు’ వంటివి అప్పుడప్పుడు గుర్తుకు తెస్తుంటాయి. పి. విజయబాబు వ్యాసకర్త సీనియర్ సంపాదకులు, పూర్వ కమిషనర్, సమాచార హక్కు చట్టం, న్యాయవాది -
బజారులో వ్యవస్థల ‘బండారం’
‘ఓడిన పార్టీలు కోర్టుల ద్వారా రాజకీయా లను శాసించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ వైపుగా ఇవి పదే పదే కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తున్నాయి’ – కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ బీజేపీ(ఎన్డీఏ) కేంద్రమంత్రి ఈ ప్రకటన చేసే ముందు కాంగ్రెస్ హయాంలోనూ, బీజేపీ హయాంలోనూ పరస్పరం ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా’ అంటూ నిన్నమొన్నటిదాకా కోర్టుల ద్వారా కూడా రాజకీయాల్ని నియంత్రించడానికి శాయశక్తులా ప్రయత్నించి పబ్బం గడుపుకుంటూ వచ్చినవేనని ప్రజలు మరచిపోరు. ఎందుకంటే, అసలు దేశ ప్రజలు అనేక త్యాగాల ద్వారా సాధించుకున్న ఈ మాత్రపు సెక్యులర్ రాజ్యాంగాన్ని కూడా నిలవనివ్వకుండా తూట్లు పొడుస్తూ వచ్చిన రాజకీయ పక్షాలు కూడా ఇవేనని మరవరాదు. నేటికి 44 ఏళ్లనాడు సుప్రీంకోర్టును అధివసించిన విశిష్ట న్యాయమూర్తుల్లో ఒక రైన వీఆర్ కృష్ణయ్యర్ దేశంలో రాజ్యాంగమూ, దానికి లోబడి పని చేయాల్సిన మూడు వ్యవస్థలకు (ప్రభుత్వం, శాసనవేదిక, న్యాయ వ్యవస్థ) తమ పరిధులు దాటకుండా వ్యవహరించాలని ఎందుకు సూచించవలసి వచ్చిందో ఒక సందర్భంగా వివరించాల్సి వచ్చింది. ఆ సమయంలోనే తన కంప్యూటర్‌పై వచ్చిన ఒక ‘ఈ–మెయిల్’ సందే శాన్ని జస్టిస్ కృష్ణయ్యర్ ఉదహరించారు. ఆ ఈ–మెయిల్ సందేశం 1996 నాటిది. అది చెప్పిన వివరాల ప్రకారం... పార్లమెంటు సభ్యుల్లో 29 మందిపై భార్యల్ని హింసించిన ఆరోపణలున్నాయి. ఇక ఏడుగురు మోసాలు చేసి అరెస్టయినవారు, 19 మంది క్రిమినల్ కేసుల్లో నిందితులు, 117 మంది హత్యా నేరాలు, అత్యాచారాలు, దాడులు, దొమ్మీలు, దొంగతనాల కేసుల్లో నింది తులు, 71 మంది అప్పులు తీసుకుని జవాబుదారీ లేకుండా అయిపూ పత్తాలేని కేసుల్లో ఉన్నవారు, 21మంది అనేకానేక చట్టవిరుద్ధ లావా దేవీల్లో ఉన్నవారు, 84 మంది వివిధ దాడుల్లో పాల్గొని, జరిమానాలు చెల్లించాల్సి వచ్చిన బాపతు. పార్లమెంటులో బిలియనీర్లదే ఆధిపత్యం పార్లమెంటు దిగువసభ 545 మంది సభ్యులున్న సభ. మనందర్నీ క్రమశిక్షణలో ఉంచాల్సిన, వందలాది చట్టాల్ని రూపొందించాల్సిన ప్రతినిధుల సభ. వీరి ఈ భాగోతాన్ని సరిదిద్దడానికి మనమేమైనా చేయగలమా? అంటూ ఆనాడు జస్టిస్ కృష్ణయ్యర్‌కు ఈ–మెయిల్ పంపిన వ్యక్తి అడిగారు (‘ఫ్రమ్ ది బెంచ్ టు ది బార్’, పే.88). దాదాపు ఈ అజ్ఞాత సందేశానికి రుజువుగా బడా కోటీశ్వరుడు బిర్లా ‘మా చేతుల్లో 70 మందికి పైగా పార్లమెంట్ సభ్యులున్నార’ని ప్రకటించాడు. ఇప్పుడు 44 ఏళ్లనాటి పరిస్థితి కూడా చేయి దాటిపోయింది. దఫదఫాలుగా ‘ప్రజాస్వామ్యం’ విలసిల్లుతున్న తీరుపైన సాధికార నివేదికలు వెలువరిస్తూ వస్తున్న జాతీయ ప్రజాస్వామ్య వేదిక (ఏడీఆర్) సైతం.. నేటి పార్లమెంట్ సభ్యులలో కనీసం 150 మందికి పైగా వివిధ రకాల అవినీతిపరులతో, నేరాలతో, అత్యాచారాలతో, ఏదో రూపంలో సంబంధాలున్న సభ్యులేనని అభిప్రాయపడింది. ఇప్పుడు టాటా, బిర్లాలకు తోడు అదానీలు, అంబానీలు, విజయ్ మాల్యాలు, నీరవ్మోదీలు ఇత్యాది బిలియనీర్ల సంఖ్య పెరిగి సుమారు 200 మంది దాకా తేలుతున్నారని మరికొన్ని అంచనాలు. ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థలు మూడే కాదు, ప్రజాస్వామ్యానికి ‘నాల్గవ’ స్తంభంగా కేవలం ‘పేరు’కే భావిస్తున్న మీడియా కూడా రాజ్యాంగమూ, దాని వ్యవస్థల సరసనే ‘బతుకు జీవుడా’ అనే దశకు చేరుకుంది. చివరికి న్యాయ వ్యవస్థ చేతులు ఎలా మెలిపెట్టవచ్చునో కూడా పాలకులు ‘మతలబు’ కనిపెట్టారు. న్యాయమూర్తుల ప్రమోషన్ల ‘ఎర’తో, సరుకు లేకపోయినా తమ వృత్తిలో ఎలాంటి ప్రావీణ్యతను స్థాపించుకోలేని కొందరు న్యాయ మూర్తుల్ని పాలకవర్గాలు, అనుకూల తీర్పుల కోసం కోర్టులలో నియ మింపజేసుకోవడమూ మన దేశంలో ఇటీవల కాలంలో మరింత తెంపరితనంతో జరుగుతున్నది. కేంద్రస్థాయిలో సీబీఐ ప్రత్యేక న్యాయ మూర్తి జస్టిస్ లోయా హత్యపై విచారణను తాత్సారం చేయడంలోనే కాక ఇటీవలే పదవీ విరమణ చేసిన జస్టిస్ గొగోయ్ ఇత్యాదులను పరిరక్షించడం లోనూ పాలకవర్గాల రాజకీయ వ్యాపార ప్రయోజనాలు చాలా బాహాటంగానే బయటపడ్డాయి. ఏడాదిలోపు 57 కేసులా? ఇక ఆంధ్రప్రదేశ్‌లో వ్యవహారాలు చూద్దామా... రాష్ట్ర శాసనసభలో అస్తుబిస్తు ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు కాళ్లు తెగిపోయిన ‘ఒంటరి ఒంటె’ బతుకులా గడుపుతున్నారు. అయినా, అధికారంలో ఉన్నప్పటిలాగే అన్ని వ్యవస్థలనూ పాత పద్ధతుల్లోనే వాడుకోవాలన్న కండూతి ఆయనలో ఇంకా తొలగలేదు. దీనికి తిరుగులేని తాజా ఉదాహరణ– రాష్ట్రంలో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీని చికాకుపర్చడానికి చంద్రబాబు ‘దింపుడు కళ్లం’ ఆశ కొద్దీ చేయని ప్రయత్నమంటూ లేదు. దీని ఫలితమే జగన్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం పూర్తి కావడానికి ముందే జగన్ పాలనపై దాదాపు 50–57 కేసులు బనాయిస్తే న్యాయస్థానం ప్రశ్నించి, రుజు వుల కోసం నిలదీసినట్టు కన్పించదు. పైగా మీడియా చర్చల్లో, విశ్లేషణల్లో సహజమూ, సర్వసామాన్యమూ అయిన ఎదురు బొదురు ప్రశ్నలు–సమాధానాలూ ఆధారంగా కోర్టులు ప్రశ్నించడం వక్రమార్గం పట్టిన మన ప్రజాస్వామ్యంలో మరొక తంతు. ఆ మేరకు నోటీసులు ఇవ్వడం అనే ఈ పద్ధతులపై, నలభై రెండేళ్ల క్రితమే త్రిసభ్య అత్యున్నత ధర్మాసనం (సుప్రీం).. పత్రికాధిపతి ఎడిటర్ ముల్గావ్కర్ కేసులో చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. అది ఆ రోజుకీ, ఈ రోజుకీ పత్రికా రంగంపై పరువు నష్టం, కోర్టుధిక్కార కేసులన్నిటా శిలా శాసనంగానే అమలులోనే ఉంది (1978 సుప్రీంకోర్టు కేసులు పే.339). ఈ కేసుకు ముందు కోర్టు ధిక్కార, పరువు నష్టం తాలూకు వచ్చిన పలు కేసులను తూర్పారబడుతూ ప్రపంచ స్థాయి ఉన్నత న్యాయమూర్తుల బెంచ్‌లో అమెరికా, ఇంగ్లండ్‌లలో తిరుగులేని తీర్పులు వెలువరించి పత్రికా స్వేచ్ఛకు, మీడియా వ్యాఖ్యాతల స్వేచ్ఛకు స్వాగత తివాసీలు పరిచారు. అదే సమయంలో కనీస పరిమితులనూ ప్రతిపాదించారు. 1978 నాటి సుప్రీం తీర్పులో జస్టిస్ బేగ్, జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్, జస్టిస్ కైలాసంలతో కూడిన ఉన్నత ధర్మాసనం ఇలా స్పష్టం చేసింది. మీడియా (పత్రికలు, మాధ్యమాలు) రంగం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనివార్యమైన మధ్యంతర శక్తి. ప్రజా స్వామ్య శక్తులకు ఊతమిచ్చి బలోపేతం చేయడానికి మీడియా బలమైన సాధనం. బాధ్యతాయుతమైన పరిమితుల్లో స్వేచ్ఛగా వ్యవ హరించగల శక్తిగలది మీడియా. అత్యున్నత న్యాయస్థానం సహా అన్ని కోర్టులకు ఇది వర్తిస్తుంది. స్వేచ్ఛ తన పరిధుల్లో తాను వ్యవహరిం చడం అనివార్యం. అలాగే న్యాయమూర్తులు న్యాయం చేయడానికి జంకిపోతే ఆ న్యాయం కాస్తా ఓడిపోయినట్టేనని కోర్టు ధిక్కార నేరా రోపణల్ని సుప్రీం ఆనాడే కొట్టిపారేసింది. న్యాయవ్యవస్థ కడిగిన ముత్యంలా ఉండాలి ఇంగ్లండ్ క్వీన్ కౌన్సిల్ గౌరవ సభ్యుడు సుప్రసిద్ధ న్యాయ శాస్త్ర వేత్త డేవిడ్ పానిక్, ఇంగ్లండ్‌లో మహా గొప్ప న్యాయమూర్తి అయిన జస్టిస్ ఆలివ్ వెండెల్ హోమ్స్ చరిత్రాత్మక సందేశాన్ని ఇలా ఉదహరించారు: ‘సమాజాల నిర్వహణలో న్యాయ వ్యవస్థది కీలకపాత్ర, కేంద్రీయ స్థానం. ప్రజా జీవితానికి సంబంధించిన ఈ కీలకమైన అంశాన్ని యాసిడ్ లాంటి అత్యంత పదునైన క్షార పదార్థంతో ప్రక్షాళనం చేసి కడిగిన ముత్యంలా సిద్ధం చేయాలి. న్యాయమూర్తుల్ని నిర్దుష్టమైన మచ్చలేని మానవులుగా మనం చూడగలగాలి. అప్పుడు ప్రభుత్వం లోని ఇతర శాఖల అధికారిక ప్రవర్తనపట్ల ఎంత నిశితంగా వ్యవ హరిస్తామో అంత నిశితంగానూ న్యాయమూర్తులపట్ల వ్యవహరిం చాల్సిందే. అలా చేయనంత కాలం న్యాయమూర్తులు కూడా సమా జంలోని మిగతా సభ్యుల జీవితాల్ని శాసించే మతాధిపతుల్లో ఒకరుగా మిగిలిపోతారు. దాంతో న్యాయమూర్తులు ప్రజలనుంచి దూరమవు తారు, వారిని జనం వేరే విధంగా భావిస్తారని జడ్జీలు గుర్తించాలి. కనుక న్యాయమూర్తులు, మీడియా ఎన్నడూ స్వార్థపర వర్గాల ప్రయో జనాలకు వత్తాసు పలకరాదు, గొడుగు పట్టరాదు. ఎందుకంటే, అలాంటి వారు సామాజిక న్యాయానికి నిలబడలేరు, మానసికంగా వికలాంగులవుతారు’. అంతేగాదు సుప్రసిద్ధ బ్రిటిష్ న్యాయమూర్తులలో లబ్దప్రతిష్టుడైన లార్డ్డెన్నింగ్ ‘ఈ మా అధికారాన్ని మా సొంత పరువును, బిరుద బీరాల్ని కాపాడుకునే సాధనంగా ఎన్నడూ వినియోగించుకోజాలం’ అని కోర్టులోనే ఎలుగెత్తి చాటాడు. అంతేగాదు, ‘మాకు వ్యతిరేకంగా గళమెత్తేవారిని అణచివేయడానికి మా పద్ధతుల్ని ఉపయోగించబోము. విమర్శ అంటే మేం భయపడం, విమర్శను నిరసించం. ఎందుకంటే, ఇంతకన్నా అత్యంత ముఖ్యమైన సత్యం బలి కాకూడదు. అదే– భావ ప్రకటనా స్వేచ్ఛ. పార్లమెంటులోగానీ, పత్రికల ద్వారాగానీ– ఈ స్వేచ్ఛ ప్రతి మానవుని హక్కు’ అని లార్డ్ డెన్నింగ్ ప్రపంచ న్యాయ మూర్తులందరికీ పాఠం చెప్పాడు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో 90 మందికిపైగా నేతలకు, పాత్రికేయులకు, ఇతరులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులిచ్చిందన్న వార్త డెన్నింగ్కే కాదు, భారత న్యాయ వ్యవస్థకూ, సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుకూ కూడా అవమానంగానే భావించాలి. రాజ్యాంగంలోని మూడు వ్యవస్థలూ బజారులో చివరికి ‘చాకి రేవు’కు చేరినట్టు ప్రజలు భావించే ప్రమాదం ఉంది. ఈ చాకిరేవు వెనకాల కానరాని బహిరంగ రహస్యం పేదవర్గాల ప్రయోజనాల్ని అణగదొక్క బోవడం..! abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు -
త్వరలో ఇండియన్ జ్యుడీషియల్ సర్వీస్
-
న్యాయ వ్యవస్థలో కీలక సంస్కరణ
సాక్షి, హైదరాబాద్ : న్యాయవ్యవస్థలో కీలక సంస్కరణకు కేంద్ర ప్రభుత్వం నాంది పలుకుతోంది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)ల తరహాలో న్యాయ వ్యవస్థలో అఖిల భారత సర్వీసును తెరపైకి తెస్తోంది. ఇండియన్ జ్యుడీషియల్ సర్వీస్ (ఐజేఎస్) పేరిట జిల్లా జడ్జీలను నియమించే ప్రతిపాదనపై కసరత్తు జరుగుతోంది. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో పురుడు పోసుకున్న ఈ ప్రతిపాదనకు మోదీ సర్కారు కార్యరూపం ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రతిపాదనతో మన రాష్ట్రానికి కూడా ప్రమేయం ఉండటం, ఇక్కడే ఐజేఎస్ అధికారులకు శిక్షణనిచ్చేందుకు నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ (ఎన్‌జేఏ)ని ఏర్పాటు చేయాలని కేంద్రం ఆలోచిస్తుండటం విశేషం. ప్రస్తుతం నియామకాలు ఇలా... న్యాయమూర్తి బాధ్యతల్లో తొలి దశ అయిన జూనియర్ సివిల్ జడ్జి (మేజిస్ట్రేట్), ఆ తర్వాతి దశ అయిన జిల్లా జడ్జీల నియామకాలను హైకోర్టు చేపడుతోంది. పోటీ పరీక్షలు నిర్వహించి ఈ రెండు స్థాయిల్లో న్యాయమూర్తుల పోస్టులను హైకోర్టే భర్తీ చేస్తోంది. ఇక హైకోర్టు న్యాయమూర్తుల కోసం కొలీజియం ఏర్పాటు చేసి భర్తీ చేస్తున్నారు. ఇప్పుడు జిల్లా జడ్జీల నియామకాలను హైకోర్టు నుంచి కాకుండా ఐఏఎస్, ఐపీఎస్‌ల తరహాలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ద్వారా చేపట్టాలనేది కేంద్రం ఆలోచన. యూపీఎస్సీ నిర్వహించే ఈ పరీక్షకు న్యాయవాద డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులవుతారు. ఈ పరీక్ష రాసి ఐజేఎస్‌కు ఎంపికయ్యే విద్యార్థులకు ఐఏఎస్, ఐపీఎస్‌ల తరహాలోనే శిక్షణ ఉంటుంది. శిక్షణ అనంతరం నేరుగా వారు జిల్లా జడ్జి లేదా సమాన హోదాలో అఖిల భారత సర్వీసుల్లో చేరిపోతారు. స్వయం ప్రతిపత్తి ఎలా? ఐజేఎస్ వ్యవస్థ ఏర్పాటు ద్వారా న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తికి ఎలాంటి భంగం వాటిల్లదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. యూపీఎస్సీ ద్వారా ఐజేఎస్‌కు ఎంపిక చేసినప్పటికీ జిల్లా జడ్జీలుగా వారికి పోస్టింగ్‌లు ఇవ్వడం, బదిలీలు, సర్వీసు వ్యవహారాలు వంటివి హైకోర్టుల పరిధిలోనే ఉంటాయి. ఈ విషయంలో హైకోర్టుదే తుది నిర్ణయం అవుతుందని చెబుతున్నారు. ఇక జిల్లా జడ్జి కంటే దిగువన ఉండే జూనియర్ సివిల్ జడ్జీల నియామకాలను ఎప్పటిలాగే హైకోర్టులే చేపడతాయి. ఐజేఎస్‌కు ఎంపికై జిల్లా జడ్జిలుగా నియమితులైన వారు పదోన్నతులపై హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులవుతారు. సీనియారిటీ ప్రాతిపదికన వారి నియామకాలు ఉంటాయి. ఐజేఎస్ వ్యవస్థ ఏర్పాటుపై ఇప్పటికే జాతీయ స్థాయిలో చర్చ ఊపందుకుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నప్పటికీ సర్వీసు ఏర్పాటులో వచ్చే సానుకూల, ప్రతికూలతలపై న్యాయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. జిల్లా జడ్జీల నియామకాలను యూపీఎస్సీ ద్వారా చేపడితే జూనియర్ సివిల్ జడ్జీలుగా నియమితులయ్యే వారు సర్వీసు, పనితీరు ఆధారంగా ఐజేఎస్‌కు ఎంపికవుతారు. వారు జిల్లా జడ్జీలుగా పదోన్నతి పొందేందుకు ఐఏఎస్, ఐపీఎస్‌లలో ఉన్నట్లుగానే ఐజేఎస్లో కూడా మేజిస్ట్రేట్ల పదోన్నతుల కోసం కన్ఫర్డ్ సర్వీసు ఉంటుందని, అయితే ఎంత శాతం ఉంటుందన్నదే తేలాల్సి ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇప్పుడేం జరుగుతోంది? నేషనల్ జ్యుడీషియల్ అకాడమీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలన్నది కేంద్రం ఆలోచనగా కనిపిస్తోంది. ఐఏఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చే సంస్థ ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో ఉండగా ఐపీఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చే నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ) హైదరాబాద్‌లోనే ఉంది. జ్యుడీషియల్ శిక్షణకు కూడా దక్షిణాదిలోనే కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నది కేంద్రం భావనగా కనిపిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలకే కేంద్రం ప్రాధాన్యం ఇస్తోందన్న అపప్రథ నుంచి బయటపడటం కోసం ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థను దక్షిణాది రాష్ట్రాల్లోనే ఏర్పాటు చేయాలనే ఆలోచనతో హైదరాబాద్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహారాష్ట్ర కూడా దీని కోసం శతథా ప్రయత్నాలు చేస్తోంది. తమ రాష్ట్రంలోనే ఎన్‌జేఏ వస్తోందని, ఇందుకు స్థలం ఇచ్చేందుకు కూడా తాము సిద్ధమేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇటీవలే ప్రకటించారు. అయితే హైదరాబాద్‌లో ఈ సంస్థను ఏర్పాటు చేసేందుకు ఇటీవల స్థల పరిశీలన కూడా జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులు ఇబ్రహీంపట్నం, శంషాబాద్ మండలాల్లో అనువుగా ఉన్న రెండు చోట్ల స్థలాలను పరిశీలించారు. దీంతో ఇప్పుడు ఎన్‌జేఏ హైదరాబాద్‌లో ఏర్పాటవుతుందా లేక మహారాష్ట్ర తీసుకెళ్తుందా? అన్నది రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వాజ్‌పేయి హయాంలోనే తెరపైకి... వాస్తవానికి న్యాయ వ్యవస్థ అఖిల భారత సర్వీసు తీసుకురావాలన్న అంశం వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ హయాంలోనే తెరపైకి వచ్చింది. సుశిక్షుతులైన న్యాయ విద్యార్థులను దేశం ఉపయోగించుకోలేకపోతోందని, న్యాయ శాస్త్రాన్ని ఔపోసన పట్టిన యువతరం కార్పొరేట్లకు, విదేశాలకు సేవలందిస్తోందని, వారిని దేశ న్యాయ వ్యవస్థలో మిళితం చేయాలనే ఆలోచనతోనే ఈ ప్రతిపాదనను అప్పట్లో తీసుకువచ్చారు. అయితే సివిల్ సర్వీసెస్ ద్వారా వివిధ రాష్ట్రాల్లో నియమితులయ్యే జడ్జీలకు స్థానిక భాష సమస్యగా మారుతుందని, నిరక్షరాస్యులైన కక్షిదారులను అర్థం చేసుకోవడం, వారి వాదనలను వినడం సమస్యగా మారుతుందనే ఆలోచనతో అప్పట్లో 14 రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించాయి. అయితే అఖిల భారత సర్వీసు అధికారులు స్థానిక మాతృభాషను కచ్చితంగా నేర్చుకోవాలన్న నిబంధన ఉండటంతోపాటు ప్రస్తుత పరిస్థితుల్లో భాష నేర్చుకోవడం సమస్య కాదనే ఉద్దేశంతోనే మళ్లీ ఇప్పుడు ఐజేఎస్ను కేంద్రం తెరపైకి తెస్తోంది. చాలా మంచి పరిణామం... ఇది చాలా మంచి పరిణామం. దేశ సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుంది. న్యాయ వ్యవహారాల్లో స్థానిక జోక్యం తగ్గుతుంది. భాషా సమస్య ఎదురవుతుందని కొందరు అంటున్నారు. కానీ బ్రిటిష్ హయాంలోనే మన వాళ్లు భాషా సమస్యను అధిగమించారు. అందువల్ల భాష పెద్ద సమస్యే కాదు. మొత్తంమీద న్యాయ వ్యవస్థ మరింత మెరుగ్గా పనిచేయడానికి ఈ ప్రతిపాదన దోహదపడుతుంది. – జస్టిస్ ఎస్.రామలింగేశ్వర్రావు, రిటైర్డ్ హైకోర్టు జడ్జి లా పట్టభద్రులకు గొప్ప అవకాశం... ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాల నుంచే 50 వేల మంది లా డిగ్రీలు పొందుతున్నారు. లా విద్యార్థులకు ఇదో గొప్ప అవకాశం. ప్రతిష్టాత్మకమైన జాతీయ న్యాయ సంస్థల్లో చదువుకున్న వారిలో జడ్జీలుగా ఒక శాతం మంది కూడా వెళ్లడం లేదు. ఐజేఎస్ ద్వారా ప్రతిభగల న్యాయ విద్యార్థులకు జిల్లా జడ్జీలుగా అఖిల భారత సర్వీసుల్లోకి వెళ్లే అవకాశం వస్తుంది. – ఎం. సునీల్ కుమార్ (భూమి సునీల్), నల్సార్ యూనివర్సిటీ అనుబంధ ఆచార్యులు -
ఎల్ఈడీ టీవీలు, ఫారిన్ లిక్కరు!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల బార్ కౌన్సిళ్ల ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు.. రాజకీయ నాయకులకు ఏ మాత్రం తగ్గకుండా ఓటర్లకు తాయిలాలు ప్రకటిస్తున్నారు. హామీల విషయంలో భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు. ఎల్ఈడీ టీవీలు, విదేశీ మద్యం బాటిళ్లు, ఇళ్ల స్థలాలు, కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు అంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉభయ రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు ఈ నెల 29న ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి 86 మంది, ఏపీ నుంచి 107 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఖర్చుకు తగ్గకుండా.. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొందరు అభ్యర్థులు ఓటర్లను తమవైపు తిప్పుకోడానికి భారీ స్థాయిలో హామీలిస్తున్నారు. ఏపీ బార్ కౌన్సిల్‌కు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల కోసం రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు పక్కన పెట్టుకున్నట్లు చెబుతున్నారు. ఖరీదైన ఎల్ఈడీ టీవీలు, విదేశీ మద్యం బాటిళ్లు, స్మార్ట్ ఫోన్లు, ఖరీదైన వాచీలు ఇస్తామంటూ ఓటర్లకు వీరు వల వేస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ బార్ కౌన్సిల్ అభ్యర్థులు మాత్రం రాజకీయ పార్టీలపై దృష్టి సారించారు. బహుమతుల కన్నా రాజకీయ పలుకుబడిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సామూహికం గా పెద్ద పెద్ద పార్టీలు ఏర్పాటు చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో టీడీపీ నుంచి మద్దతు.. కృష్ణా–గుంటూరు జిల్లాల పరిధిలోని అభ్యర్థుల్లో ఒకరిద్దరు ఖర్చు విషయంలో వెనక్కి తగ్గడం లేదని ప్రచారం జరుగుతోంది. అధికార టీడీపీ నుంచి వారికి మద్దతు లభిస్తోందని సమాచారం. పార్టీ తరఫున ఎమ్మెల్యే లు సైతం రంగంలోకి దిగి వారికి ఓట్లు వేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది. న్యాయవ్యవస్థలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఆ అభ్యర్థుల గెలుపు బాధ్యత తీసుకున్నట్లు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం ఓ అభ్యర్థి కర్నూలులో న్యాయవాదులకు భారీ విందు ఏర్పాటు చేశారు. దీన్ని ఉపముఖ్యమంత్రి సోదరుడు పర్యవేక్షించినట్లు స్థానిక న్యాయవాదులు చెబు తున్నారు. ఈ పార్టీ ఏర్పాటు చేసిన అభ్యర్థి రాయలసీ మ జిల్లాల్లోని కొన్ని న్యాయవాద సంఘాలకు 50 ఇం చుల ఎల్ఈడీ స్మార్ట్ టీవీలను బహుమతిగా ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈసారి ఎన్నికల బరిలో నిలిచిన కొత్త వారు, యువకులు చేస్తున్న ఖర్చును చూసి బరిలో నిలిచిన పాత వారు ఆశ్చర్యపోతున్నారు. -
అందరూ అందరే!
త్రికాలమ్ కర్ణాటకలో సంభవిస్తున్న పరిణామాలు ప్రజాస్వామ్యప్రియులకు పెద్దగా సాంత్వన కలిగించవు. సంఖ్యాబలం లేకపోయినా జబర్దస్తీగా అధికారం హస్తగతం చేసుకోవడానికి బీజేపీ నాయకత్వం చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు వమ్ము చేయడం సంతోషించదగినదే. ముఖ్యమంత్రిగా 55 గంటల క్రితం యడ్యూరప్ప ప్రమాణం చేసినప్పటి నుంచీ రాజీనామా చేసేవరకూ ఉత్కంఠ కలిగించే అనేక ఘటనలు జరిగాయి. 222 మంది సభ్యులు ఉండే కొత్త శాసనసభలో 104మంది సభ్యులు మాత్రమే కలిగిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ వజూభాయ్ ఆహ్వానించడం అంటే ఎంఎల్ఏల ఫిరాయింపులకూ, బేరసారాలకూ అవకాశం ఇవ్వడమేనన్న విమర్శలు వెల్లువెత్తాయి. బెంగళూరు నుంచి కొచ్చికి శుక్రవారం సాయంత్రం ప్రయాణమైన కాంగ్రెస్, జేడీ (ఎస్) ఎంఎల్ఏలు తెల్లవారే సరికి హైదరాబాద్‌లో తేలారు. ఐదారు నక్షత్రాల హోటళ్ళలో బస చేశారు. వారితో సమాలోచనలు జరపడానికి బెంగళూరు నుంచి గులాంనబీ ఆజాద్, సిద్ధరామయ్య, కుమారస్వామి ప్రభృతులు వచ్చారు. సుప్రీం తీర్పుతో హుటాహుటిన బెంగళూరు తిరిగి వెళ్ళారు. శనివారం ఉదయం శాసనసభ్యుల ప్రమాణస్వీకారం జరుగుతూ ఉండగానే ఇద్దరు కాంగ్రెస్ సభ్యుల ఆచూకీ తెలియడం లేదనీ, ఎనిమిది మంది బీజేపీకి మాట ఇచ్చేశారనీ బ్రేకింగ్న్యూస్ రూపంలో టీవీ చానళ్ళు ఊదరగొట్టాయి. బెంగళూరులో, ఢిల్లీలో సర్వాత్రా ఉద్వేగభరితమైన దృశ్యాలు. జాతి యావత్తూ కర్ణాటక రాజధానిపైన దృష్టి నిలిపిన సందర్భం. భోజన విరామం తర్వాత ప్రమాణాలు తిరిగి ప్రారంభమైనప్పుడు ఉదయం అదృశ్యమైన ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యులూ ప్రత్యక్షమైనారు. అంతలోనే యడ్యూరప్ప ఉద్వేగభరితమైన ప్రసంగం చేసి, పదవి నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించి సభ నుంచి విసవిసా వెళ్ళిపోయారు. తాత్కాలిక సభాపతి సైతం జాతీయగీతం ఆలపించే వరకూ వేచి ఉండకుండానే నిష్క్రమించారు. న్యాయవ్యవస్థ పట్ల ద్వంద్వ వైఖరి న్యాయస్థానాలు, ముఖ్యంగా సర్వోన్నత న్యాయస్థానం ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయంటూ కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో శుక్రవారం జేడీ (ఎస్), కాంగ్రెస్‌ల పిటీషన్లపైన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం బీజేపీకి అశనిపాత సదృశమైన నిర్ణయాలు వెలువరించింది. బీజేపీ అడిగిన వరాలలో ఒక్కటీ మంజూరు చేయకుండా యడ్యూరప్ప ఆశలు అడియాసలు చేసింది. యడ్యూరప్పను ఆహ్వానిం చాలన్న గవర్నర్ నిర్ణయాన్ని తప్పుపట్టకపోయినా బలనిరూపణకు రెండువారాల వ్యవధి ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు ఆమోదించలేదు. ఒక్క వారమైనా గడువు ఇవ్వాలంటూ బీజేపీ చేసిన వేడుకోలునూ అంగీకరించలేదు. కేవలం 24 గంటల వ్యవధి ఇచ్చింది. సీక్రెట్ బ్యాలట్ నిర్వహించాలన్న కోర్కెకు సైతం ససేమిరా అన్నది. గతంలో యడ్యూరప్పకు అనుకూలించే విధంగా వ్యవహరించాడంటూ న్యాయస్థానం మొట్టికాయలు తిన్న బోపయ్య చేత తాత్కాలిక సభాపతిగా గవర్నర్ ప్రమాణం చేయించడాన్ని కాంగ్రెస్, జేడీ(ఎస్)లు శనివారం ఉదయం సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. న్యాయమూర్తులు బోపయ్య నియామకాన్ని రద్దు చేయలేదు కానీ అసెంబ్లీ కార్యక్రమాలను ప్రత్యక్షప్రసారం చేయాలని ఆదేశించారు. బీజేపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. తమ ఎంఎల్ఏలను ప్రభావితం చేయడానికి బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఆడియో టేపులను విడుదల చేసింది. ఇదంతా చూసిన ప్రజలకు రాజకీయాలంటే వెగటు పెరిగి ఉంటుంది. గోవాలో దిగ్విజయ్‌సింగ్ నిర్వాకంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ఈసారి ఆజాద్నీ, గెహ్లాట్నీ బెంగళూరు పంపించి బీజేపీ ఆటకట్టించింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వారికి అండగా నిలిచారు. జేడీ (ఎస్), కాంగ్రెస్‌లకు చెందిన శాసనసభ్యులు బీజేపీకి ఓటు వేసే అవకాశం లేదని గ్రహించిన యడ్యూరప్ప రాజీనామా చేయాలనుకోవడం సముచి తమే. ఈ నిర్ణయం యడ్యూరప్పదైనా, ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలది అయినా అభినందనీయమే. ప్రజాస్వామ్యాన్ని మరింత అపహాస్యం చేయకుండా సరైన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించినందుకు సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఇతర నాయకులు ధన్యవాదాలు చెప్పారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించాలంటూ రాజ్యసభలో నోటీసు ఇచ్చి, అందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అనుమతించకపోవడంతో సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసి, చివరికి పరిస్థితులు అనుకూలించక దాన్ని ఉపసంహరించుకున్న కాంగ్రెస్ ఇప్పుడు అదే న్యాయస్థానం ప్రజాస్వామ్యాన్ని కాపాడిందంటూ స్తుతించడం విడ్డూరం. కర్ణాటక వ్యవహారంలో నిక్కచ్చిగా వ్యవహరించడం వల్ల సర్వోన్నత న్యాయస్థానం పట్ల ప్రజలకు గౌరవం పెరిగింది. అందులో సందేహం లేదు. కానీ తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు మెచ్చుకోవడం, ప్రతికూలంగా వచ్చినప్పుడు పక్షపాతం ఆపాదించడం రాజకీయ నాయకులకు తగదు. అలాగే రాజ్యాంగాన్ని అదే పనిగా ఉల్లంఘించిన నాయకులు కర్ణాటక పరిణామాలపై వ్యాఖ్యానించడం, పార్టీ ఫిరాయింపులను నిరోధించినందుకు సుప్రీంకోర్టును అభినందించడం మరో వింత. 23 మంది ప్రతిపక్ష ఎంఎల్ఏలను కొనుగోలు చేసి, వారిలో నలుగురికి మంత్రిపదవులు కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి రాజ కీయ నాయకుడికి రాజ్యాంగబద్ధతపైనా, రాజకీయ విలువలపైనా మాట్లాడే నైతిక హక్కు ఉంటుందా? 1996లో 13 రోజులు అధికారంలో ఉండి బలం నిరూపించుకోలేక రాజీనామా చేసిన వాజపేయితో యడ్యూరప్పను ఒకందుకు పోల్చవలసి వస్తున్నది. ఇద్దరి వ్యక్తిత్వాలూ, నైతిక స్థాయీ, దృక్ప«థాలూ వేరైనప్పటికీ లోక్‌సభలో నాటి పరిస్థితులకీ, కర్ణాటక శాసనసభలో నేటి వాతావరణానికీ ఎంతో కొంత సామ్యం ఉంది. నాడు వాజపేయి లోక్‌సభలో బలం నిరూపించుకోలేక వైదొలిగిన తర్వాత ప్రధానమంత్రిగా దేవెగౌడ అందలం ఎక్కారు. ఇప్పుడు యడ్యూరప్ప రాజీనామా అనంతరం ముఖ్యమంత్రిగా దేవెగౌడ కుమారుడు కుమారస్వామి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అప్పుడు దేవెగౌడ 46 మంది ఎంపీల బలంతో ప్రధాని కాగలిగితే ఇప్పుడు కుమారస్వామికి తనతో సహా 37 మంది జేడీ (ఎస్) ఎంఎల్ఏలు ఉన్నారు. ఇద్దరూ కాంగ్రెస్ మద్దతు స్వీకరించినవారే. దేవెగౌడ సంవత్సరం తిరగకుండానే కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకున్న కారణంగా పదవీచ్యుతులైనారు. కుమారస్వామికి కాంగ్రెస్ మద్దతు ఎంతకాలం కొనసాగుతుందన్నది ప్రశ్న. అనిశ్చితికీ, అస్థిరతకూ దారితీసే అంశాలు అనేకం కర్ణాటక రాజకీయాలలోనే నిక్షిప్తమై ఉన్నాయి. రాహుల్ తప్పిదం సమాజాన్నీ, పార్టీలనూ విభజించే ప్రమాదభూయిష్టమైన రాజకీయాన్ని అన్ని పార్టీలూ బాధ్యతారహితంగా ప్రోత్సహించాయి. కావేరీ నీటి కంటే విరివిగా ఎన్నికలలో డబ్బు ఖర్చు చేశాయి. చుట్టుపక్కల రాష్ట్రాలలో ఏటీఎంలలో డబ్బులు లేకుండా, రెండువేల రూపాయల నోట్లు మచ్చుకైనా కనిపించకుండా చేశాయి. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు యధేచ్ఛగా చేసుకున్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వ్యక్తిగత దూషణలతో, నిందారోపణలతో ప్రచారపర్వాన్ని వేడెక్కించారు. ఎన్నికలలో గెలుపొందేందుకు ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేస్తారనీ, గెలిచినవారిని వెంటనే కొనుగోలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడరనీ, అందుకు గవర్నర్ ఎంత వ్యవధి ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటారనీ ప్రజలకు అర్థమైపోయింది. ఇటువంటి పరిస్థితులలో ఎన్నికల పట్లా, ప్రజాస్వామ్యం పట్లా సాధారణ ప్రజలకు విశ్వాసం ఏముం టుంది? కర్ణాటకంలో ఒక అంకానికి తెర పడింది. రెండో అంకానికి తెర లేవబోతున్నది. జేడీ(ఎస్) అధ్యక్షుడు కుమారస్వామి ముఖ్యమంత్రిగా సోమవారం కంఠీరవ స్టేడియంలో పదవీబాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఉపముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌కు చెందిన దళిత నాయకుడు జి. పరమేశ్వర ఉంటారని అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో సిద్ధరామయ్యను సంపూర్ణంగా బలపరిచే ప్రయత్నంలో రాహుల్‌గాంధీ ఒకానొక రాజకీయ తప్పిదం చేశారు. 2006లో జేడీ(ఎస్) నుంచి వైదొలిగి కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచీ సిద్ధరామయ్యకూ, దేవెగౌడ కుటుంబానికీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. ఎన్నికల ప్రచారంలో సిద్ధరామయ్య దాన్ని ప్రదర్శించడమే కాకుండా రాహుల్‌తో కూడా దేవెగౌడ కుటుంబానికి వ్యతిరేకంగా ప్రచారం చేయించారు. జేడీ (ఎస్)లో ‘ఎస్’అంటే సంఘ్ పరివారమనీ, జేడీ (ఎస్) బీజేపీకి ‘బీ–టీమ్’అనీ రాహుల్ నిందాస్త్రాలు సంధించారు. తన బొందిలో ప్రాణం ఉండగా బీజేపీతో పొత్తు పెట్టుకోనంటూ దేవెగౌడ పలుమార్లు ప్రకటించినా రాహుల్ వినిపించుకోలేదు. బీఎస్పీతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీ అధినేత మాయావతితో ప్రచారం చేయించినా జేడీ (ఎస్) నాయకత్వాన్ని విశ్వసించలేదు. లోగడ దేవెగౌడ బీజేపీ పట్ల ఇదే విధమైన ప్రతికూలత వెలిబుచ్చారనీ, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కుమారస్వామితో సంబంధాలు తెగతెంపులు చేసుకుంటానని ప్రకటించారనీ, తీరా కుమారస్వామి అదే బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆనందించారనీ విమర్శకులు గుర్తు చేస్తారు. రాహుల్ కాంగ్రెస్ అధినేతగా బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని నిర్మించాలని ప్రయత్నిస్తున్నారు. బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావాలనీ, ప్రతి లోక్‌సభ స్థానంలోనూ బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా అత్యంత యోగ్యుడైన అభ్యర్థిని ప్రతిపక్షాలు అన్నీ కలిసి నిలబెట్టాలనీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రతిపాదిస్తున్నారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత పెంపొం దించవలసిన రాహుల్ దేవెగౌడ కుటుంబంపైన మితిమీరి దాడి చేయడం అవివేకం. ఆ స్థాయిలో విరుచుకుపడకుండా ఉంటే నేటి మైత్రి అంత కృతకంగా కనిపించేది కాదు. మొత్తం మీద జేడీ (ఎస్), కాంగ్రెస్‌లు దక్షిణ కర్ణాటకలో హోరాహోరీ పోరాడాయి. అక్కడ బీజేపీ ఉనికి తక్కువ. ఆ విధంగా ద్వేషం పంచుకున్న రెండు పక్షాలు కేవలం బీజేపీని నిలువరించడంకోసం ఒకే తాటిమీదికి రావడం అవకాశవాదం అనాలో, సమయజ్ఞత అనాలో తేల్చుకోవడం కష్టం. రేపటి నుంచి ఈ సంకీర్ణం అంతర్గత విభేదాలను ఎట్లా పరిష్కరించుకుంటుందో, ప్రతిపక్ష బీజేపీని ఎట్లా ఎదుర్కొంటుందో మరి. కుమారస్వామి సారథ్యం విభజన రేఖలు స్పష్టంగా ఉన్నప్పటికీ సమైక్యంగా ఉంటామనీ, సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనీ నమ్మబలికే నాయకులను నమ్మడం ఎట్లా అన్నది కర్ణాటక ప్రజలను వేధిస్తున్న ప్రశ్న. ఒక వైపు ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే మరోవైపు సోనియా, రాహుల్ అత్యవసర సమాలోచన జరిపి జేడీ (ఎస్)కు షరతులు లేని మద్దతు ప్రకటించాలని నిర్ణయించారు. ఇదే ప్రాప్తకాలజ్ఞత. ఢిల్లీలో నిర్ణయించినంత మాత్రాన స్థానికంగా నిన్నటి వరకూ ఒకరిపైన ఒకరు పోరాడుకున్నవారు సఖ్యతతో ఉండగలరా? తమ శాసనసభ్యులు నైతిక విలువలను కాపాడారనీ, బీజేపీ ప్రలోభాలకు లొంగలేదనీ కాంగ్రెస్ అధినాయకత్వం కితాబు ఇచ్చింది. తెలంగాణలో ఫిరాయించిన కాంగ్రెస్ శాసనసభ్యులూ, శాసనమండలి సభ్యులూ, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను వీడి టీడీపీ పంచన చేరిన శాసనమండలి సభ్యులూ నిక్షేపంగా ఉన్నారు. వారిపై అనర్హత వేటు వేయమని రాజ్యాంగ వ్యవస్థలపైన ఒత్తిడి తేవడంలో దారుణంగా విఫలమైన కాంగ్రెస్ ఇలా గొప్పలు చెప్పుకోవడం ఆత్మవంచన. యడ్యూరప్ప అధికారంలో కొనసాగి ఉంటే 2019 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్, జేడీ (ఎస్)కు కర్ణాటకలో విజయావకాశాలు అధికంగా ఉండేవి. ఇప్పుడు అధికారం పంచుకుంటున్నాయి కనుక సంకీర్ణ భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తడం సహజం. ఆ మేరకు ప్రతిపక్షంలో ఉండే బీజేపీకి సానుకూల వాతావరణం ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలకు గడువు ఏడాది మాత్రమే ఉన్నది కనుక కర్ణాటకలో ఎన్నికల వాతావరణం కొనసాగుతుంది. అప్పటి వరకైనా సంకీర్ణ ప్రభుత్వాన్ని రక్షించుకోవాలన్న తాపత్రయం రెండు పార్టీలకూ ఉంటుంది. అదొక్కటే ఊరట. కె. రామచంద్రమూర్తి -
న్యాయానికి ‘పిల్’ అందించిన న్యాయమూర్తి
జస్టిస్ ప్రఫుల్లచంద్ర నట్వర్లాల్ భగవతి (95) న్యాయవ్యవస్థకు విశ్వసనీయతను తీసుకొచ్చిన విశిష్ట మూర్తి. ఈ రాజ్యాంగసంస్థలో ప్రాణరక్షకమైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) వ్యవస్థీకరించిన ఘనత ఆయనదే. ఈ న్యాయవ్యవస్థ క్రియాశీలత వల్లే క్రియారాహిత్యంతో, అశక్తితో, అవినీతితో నిండిన కార్యనిర్వాహక వ్యవస్థను పరీక్షించడం, తనిఖీ చేయడం సాధ్యపడింది. జస్టిస్ భగవతి తీసుకొచ్చిన పిల్ అనే ఔషధంలోనే సమాచార హక్కు (ఆర్టీఐ)కి బీజాలున్నాయి. ప్రభుత్వోద్యోగ వ్యవస్థలోని జాప్యందారీ విధానాలు, అసమర్థత, అవినీతితో కూడిన నిష్క్రియాతత్వం అనేవి ప్రజలకు హక్కులను, సుపరిపాలనను నిరాకరిస్తున్నాయి. ప్రభుత్వ వ్యవస్థ క్రియా రాహిత్యాన్ని ప్రశ్నించడానికి సగటు మనిషికి అందుబాటులో ఉన్న ఏకైక సాధనంగా న్యాయవ్యవస్థ ఉపయోగపడుతోంది. కానీ న్యాయవ్యవస్థ ఇప్పటికే 3 కోట్లకు పైగా కేసుల భారంతో సతమతమవుతోంది. అధికరణం 32, అధికరణం 226 కింద న్యాయ పరి హారం పొందే ప్రాథమిక హక్కును మన రాజ్యాంగమే కల్పించినందుకు మనం గర్వపడుతున్నప్పటికీ, కోర్టులకు వెళ్లడానికి ఆటంకంగా ఉన్న ప్రయాణఖర్చులు, న్యాయవాది ఫీజుల కారణంగా పై రెండు గొప్ప అధికరణలను ప్రజలు తక్కువగానే ఉపయోగించుకుంటున్నారు. సమాచార హక్కు ఉనికిలోకి వచ్చేంతవరకు, ఆర్థికంగా శక్తిలేని వారు హక్కులను వదులుకోవలసి వచ్చేది. గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో, మహానగరాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో లక్షల సంఖ్యలో పేరుకుపోతున్న క్రియారాహిత్యం, అవినీతిలకు వ్యతిరేకంగా చిన్న స్థాయి పీఐఎల్లాగా ఆర్టీఐ పనిచేస్తోంది. 1982 ఎస్సి 149కి చెందిన ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియన్ ఏఐఆర్ ఫస్ట్ జడ్జెస్ కేసులో జస్టిస్ భగవతి ఇలా చెప్పారు. ‘‘ఈ దేశ ప్రభుత్వ పాలనాయంత్రాంగానికి చెందిన నిజ మైన వాస్తవాలను తెలుసుకోవడంలో పౌరులకున్న హక్కు ప్రజాస్వామిక రాజ్యం మూలస్తంభాల్లో ఒకటి... ప్రభుత్వ పనితీరులో, ప్రభుత్వ ప్రక్రియల్లో గోప్యతను పాటించినట్లయితే, అది అణచివేతను, అవినీతిని, అధికార దుర్వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది.. ప్రభుత్వంలో పారదర్శకత అంటే ప్రభుత్వ యంత్రాంగం పని తీరులో పారదర్శకత్వం మాత్రమే అని కాదు. న్యాయ నియామకాలు, బదిలీలతోపాటు న్యాయవ్యవస్థ పని తీరులో కూడా ఇది ప్రతిబింబించాలి. ‘జస్టిస్ భగవతి చేసిన ఈ వ్యాఖ్య రాబోయే కాలాలకు కూడా బహిరంగ వాస్తవంగానే మిగిలి ఉంటోంది. అత్యవసర పరిస్థితిలో జీవించే, స్వేచ్ఛగా ఉండే ప్రాథమిక హక్కు పౌరులకు ఉండదని తీర్పు చెప్పిన ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్నందుకు జస్టిస్ భగవతి తర్వాత పశ్చాత్తాపం వ్యక్తపర్చారు. ప్రజల జీవించే, స్వేచ్ఛాహక్కును ఎమర్జెన్సీ దూరం చేయలేదని జస్టిస్ హన్స్‌రాజ్ ఖన్నా తన చారిత్రక అసమ్మతిని ఈ సందర్భంగానే వెలువరించారు. జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా తీర్పు ప్రస్తుతం రాజ్యాంగ చట్టంగా మారింది. హెచ్ఆర్ ఖన్నా ప్రజల వాణిని ప్రతి బింబించారు. ఎమర్జెన్సీని విధించడం అంటే పౌరుల ప్రాథమిక హక్కుకు ముగింపు పలికినట్లు అని అర్థం కాదు. జోక్యం చేసుకునే హక్కు –లోకస్ స్టాండి– ఒక కఠినమైన చట్టం. ఇది హక్కుల కోసం ఆందోళన చేసే హక్కును బాధితులకు తప్ప మరెవ్వరినీ అనుమతించదు. తరగతి గదులకే పరిమితమైన ప్రజా ప్రయోజనాన్ని జస్టిస్ భగవతి కోర్టు గదుల్లోకి తీసుకొచ్చారు. నేడు న్యాయవ్యవస్థ క్రియాశీలంగా ఉంటూ, ప్రజా ప్రయోజన అంశాలను వెలుగులోకి తీసుకువస్తోందంటే, జస్టిస్ భగవతి సృజనాత్మకమైన, మేధో న్యాయ దృక్పథమే కారణం. ప్రజా ప్రయోజనం, న్యాయవ్యవస్థ క్రియాశీలతపై జస్టిస్ భగవతి భావనే సమాచార హక్కుకు పునాదిగా నిలిచింది. ఎస్పీ గుప్తా కేసులో అద్భుతమైన తీర్పు ద్వారా ఆయన న్యాయమూర్తుల నియామకాల్లోని గోప్యతా విధానాన్ని బట్టబయలు చేశారు. ఆ చిన్న బీజమే నేడు ఆర్టీఐ అనే మహావృక్షంగా పెరిగింది. ప్రజా ప్రయోజనంపై తన భావన న్యాయవ్యవస్థ క్రియాశీలతనే కాదు.. ఆర్టీఐ చట్టంగా పరివర్తన చెందిన పౌరుల క్రియాశీలతను కూడా వేగవంతం చేసింది. కార్యనిర్వాహక ఇనుప తెరల కింద దాచిన సమాచారాన్ని పొందటానికి, బాధితుడా కాదా అనే అంశాన్ని పక్కన బెట్టి ఏ పౌరుడైనా సమాచారం కోసం ప్రశ్నించేలా ప్రోత్సహించడమే ఆర్టీఐ ప్రాథమిక లక్ష్యం. సమాచార హక్కు ద్వారా ఏ పౌరుడైనా ఫిర్యాదు చేయవచ్చు. ప్రశ్నించవచ్చు. దావాలో భాగం కాకుండానే ఏ పౌరుడైనా తనకు లేదా ఇతరులకు సంబంధించిన సమస్యపై సమాచారాన్ని ఇప్పుడు కోరవచ్చు. జస్టిస్ భగవతికి మరణం లేదు. పీఐఎల్, ఆర్టీఐ రూపకర్తగా న్యాయవైఖరినే పరివర్తింపజేసి, ప్రభుత్వ ఫైళ్లను పౌరులకు బహిరంగపర్చడానికి అవకాశం ఇచ్చిన న్యాయమూర్తిగా ఆయన కలకాలం జీవించి ఉంటారు. ప్రజాప్రయోజన వ్యాజ్యం, పారదర్శకత అనే భావనలకు ప్రాణం పోసిన సుప్రీంకోర్టు 17వ ప్రధాన న్యాయమూర్తిగా చిరస్మరణీయులు. సమాచారం తెలుసుకునే హక్కును తమకు దాఖలు పర్చిన జస్టిస్ పీఎన్ భగవతి పవిత్ర న్యాయాత్మకు దేశంలోని ప్రతి పౌరుడూ జోహార్లర్పించాలి. - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
దీర్ఘకాల కేసులే అసలైన సవాల్: సీజేఐ
అహ్మదాబాద్: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించడమే న్యాయ వ్యవస్థ ముందున్న అసలైన సవాలు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ అన్నారు. గుజరాత్ జ్యుడీషియల్ అకాడెమీని శనివారం ఆయన ప్రారంభించి ప్రసంగించారు. తాను పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ లోక్ అదాలత్‌లు నిర్వహించడం ద్వారా 14 లక్షల కేసుల్ని పరిష్కరించానని ఆయన తెలిపారు. అయితే చిన్న కేసుల్ని పరిష్కరించడమంటే చీపురు చేతబట్టి.. ఇంటిలో ఉన్న చెత్తాచెదారాన్ని ఊడ్చటంలాంటిదేనన్న భావన కలిగిందని, దీర్ఘకాలంగా కోర్టుల్లో మూలుగుతున్న కేసులను పరిష్కరించడంలోనే అసలైన సవాలు దాగుందన్న విషయం అవగతమైందని పేర్కొన్నారు. -
ప్రభుత్వాల జోక్యంతో ప్రమాదం
న్యాయమూర్తుల నియామకంపై జస్టిస్ చంద్రకుమార్ హైదరాబాద్: తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకోవాలనే ఆలోచన ప్రభుత్వాలకు ఉంటే భవిష్యత్‌లో న్యాయ వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. రాజ్యాధికారం అనేది నిజాయితీ గల వ్యక్తులకు రావాలని ఆయన అభిలషించారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ దేశంలో రాజకీయ అవినీతి పెరిగిపోయిందని, ముఖ్యమంత్రి నిజాయితీగా ఉంటే రాష్ట్రమంతా అలాగే ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం బాగా లేకుండా కింది స్థాయిలో బాగుండాలంటే సాధ్యం కాదన్నారు. ఇటీవల కాలంలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో సాక్షులను హత్య చేస్తున్నారని, ఇది విచారకరమన్నారు. సాక్షులను హత్య చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. ప్రజల భాగస్వామ్యంతో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ ఆర్.వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ప్రకాశ్, నమ్రిత జైశ్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఐటమ్‌సాంగ్‌కు డ్యాన్స్ చేయమన్నారు
మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిపై మహిళా న్యాయమూర్తి ఆరోపణలు లైంగిక వేధింపులపై సీజేఐకి లేఖ రాసిన మహిళా న్యాయమూర్తి ఆరోపణలను ఖండించిన హైకోర్టు న్యాయమూర్తి నిజమని తేలితే మరణశిక్షకైనా సిద్ధమని సీజేఐకి లేఖ భోపాల్: అత్యున్నతమైన న్యాయవ్యవస్థను లైంగిక వేధింపుల ఆరోపణలు ఓ కుదుపు కుదిపాయి. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఒకరు తనను లైంగిక వేధింపులకు గురిచేశారని గ్వాలియర్‌లోని మహిళా అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి సంచలన ఆరోపణలు చేశారు. తనను ఐటమ్‌సాంగ్‌కు డ్యాన్స్ చేయమన్నారని, జడ్జి వేధింపులు భరించలేక తాను రాజీనామా చేయాల్సి వచ్చిందంటూ ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ఆర్ఎం లోథాకు 9 పేజీల లేఖ రాశారు. అయితే మహిళా న్యాయమూర్తి ఆరోపణలను సదరు హైకోర్టు జడ్జి తోసిపుచ్చారు. తనపై ఆరోపణలు రుజువైతే మరణ శిక్షను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్లో ఓ న్యాయాధికారి భార్యతో ఫోన్ చేయించి ఓ పెళ్లి వేడుకలో తాను ఓ ఐటమ్ సాంగ్‌కు డ్యాన్స్ చేయాలని జడ్జి చెప్పించారని, అయితే అందుకు నిరాకరించానని మహిళా న్యాయమూర్తి సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. హైకోర్టు జడ్జి ఆదేశాలపై ముగ్గురు న్యాయాధికారులూ తనను వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. తనపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తప్పుడు నివేదికలు సమర్పించారని, అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకునే దానినని పేర్కొన్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా తనను గత నెలలో గిరిజన ప్రాంతానికి బదిలీ చేయించారని పేర్కొన్నారు. బదిలీపై హైకోర్టు జడ్జితో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. తన కోరిక తీర్చకపోవడం వల్ల, ఒంటరిగా తన బంగళాకు రాకపోవడం వల్లే బదిలీ చేసినట్టు చెప్పారని ఆరోపించారు. బదిలీకి సంబంధించి ప్రధాన న్యాయమూర్తి అపాయింట్మెంట్ కోరితే నిరాకరించారని, గత్యంతరం లేక ఆత్మాభిమానాన్ని, కుమార్తె కెరీర్‌ను కాపాడుకునేందుకు జూలై 15న రాజీనామా చేసినట్టు చెప్పారు. సీబీఐ విచారణకైనా సిద్ధం: హైకోర్టు జడ్జి ఈ ఆరోపణలను ఖండిస్తూ హైకోర్టు న్యాయమూర్తి మధ్యప్రదేశ్ చీఫ్ జస్టిస్కులేఖ రాశారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని, సీబీఐతో విచారణ చేయించవచ్చన్నారు. మహిళా జడ్జి మాత్రమే కాదు, ఏ మహిళనైనా తాను లైంగికంగా వేధించినట్టు, దూషించినట్టు రుజువైతే మరణశిక్షకూ సిద్ధమని చెప్పారు. ఈ లేఖను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐకి పంపారు. ఇది తీవ్రమైన అంశం.. సీజేఐ ఈ ఆరోపణల అంశం తీవ్రమైనదని, తగిన రీతిలో వ్యవహరిస్తామని సీజేఐ లోథా చెప్పారు. ఈ అంశం ఇంకా తన వద్దకు రాలేదని, అన్ని అంశాల్నీ పరిగణనలోకి తీసుకుంటామన్నారు. మరోవైపు మహిళా జడ్జి రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్టు మధ్యప్రదేశ్ హైకోర్టు తెలిపింది. బదిలీకి సంబంధించి జడ్జి అభ్యర్థనలను నిరాకరించామని, లైంగిక వేధింపులకు సంబంధించి ఆమె ఫిర్యాదు చేయలేదని తెలిపింది. కాగా, మహిళా జడ్జిపై వేధింపులకు పాల్పడిన న్యాయమూర్తిని తక్షణం విధుల నుంచి తప్పించాలని, మహిళా న్యాయమూర్తిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. మరోవైపు మహిళా జడ్జి ఆరోపణలకు సంబంధించి హైకోర్టు జడ్జిపై ఎఫ్ఐఆర్ నమోదు, న్యాయ విచారణకు ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.