న్యాయమూర్తుల నియామకాలపై రాజకీయ నీడ | KB Ramanna Dora Article On Allegations Against Supreme Court Judge | Sakshi
Sakshi News home page

న్యాయమూర్తుల నియామకాలపై రాజకీయ నీడ

Published Thu, Oct 22 2020 1:57 AM | Last Updated on Thu, Oct 22 2020 1:58 AM

KB Ramanna Dora Article On Allegations Against Supreme Court Judge - Sakshi

సుప్రీంకోర్టుకి చెందిన ఒక సీనియర్‌ న్యాయమూర్తికి వ్యతిరేకంగా ఫిర్యాదు దాఖలు చేసేంత తీవ్ర చర్య తీసుకునేలా ఆంధ్రప్రదేశ్‌ శాసనవ్యవస్థను.. న్యాయవ్యవస్థే ప్రేరేపించిందని మనం భావించవచ్చా? కొందరు అంటున్నట్లు న్యాయవ్యవస్థను అపఖ్యాతి పాలు చేయడానికి మాత్రమే ఉద్దేశపూర్వకంగా ఈ అంశాన్ని బహిర్గతపరిచారని కూడా భావించలేం. ఎందుకంటే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి మధ్య ఎలాంటి ముందస్తు శత్రుత్వమూ లేదు. క్విడ్‌ ప్రో కో కేసులో సీబీఐ నేరారోపణ చేసి జైలుకు పంపినప్పుడు కూడా ఏ న్యాయమూర్తినీ వైఎస్‌ జగన్‌ గతంలో తప్పుపట్టలేదు. వాస్తవానికి తనను సీబీఐ కేసులో ఇరికించడంలో కాంగ్రెస్, టీడీపీ రెండూ కుమ్మక్కయ్యాయన్నదే తొలినుంచీ ఆయన భావన.

తనకు వ్యతిరేకంగా మోపిన కేసులకు సంబంధించి న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా జగన్‌ ఎలాంటి ఫిర్యాదునూ చేయలేదు. ఏపీ ప్రజల సంక్షేమానికి సంబంధించి తాను తీసుకున్న కొన్ని చర్యల పట్ల న్యాయవ్యవస్థ వ్యతిరేకత ప్రదర్శిస్తూ వచ్చినా సరే గత 16 నెలల కాలంలో సీఎం జగన్‌ అనుసరించిన వైఖరి ప్రశంసనీయమైనది. తీవ్రమైన కష్టాలు ఎదుర్కొన్నప్పుడు కూడా వైఎస్‌ జగన్‌ ఆసాధారణమైన సంయమనం పాటిస్తూ వచ్చారు. అలాంటి సమయంలో కూడా ఆయన ఈ తరహా ఫిర్యాదు చేసి ఎరగరు. చివరకు రాష్ట్రప్రభుత్వంపై కొంతమంది న్యాయమూర్తులు తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఏపీ సీఎం స్పందించలేదు. చాలావరకు టీడీపీతో అంటకాగుతున్న ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా.. న్యాయమూర్తులు చేసిన అలాంటి వ్యాఖ్యలను పండగ చేసుకుంటున్న చందాన ప్రచురిస్తూ వచ్చాయి.

దీన్నంతటినీ కాస్సేపు పక్కన పెట్టి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చేసిన ఫిర్యాదుకు సంబంధించిన న్యాయ పర్యవసానాలకేసి చూపు సారిద్దాం. కక్ష తీర్చుకోవడానికి సీఎం ఇలా వ్యక్తిగత ఫిర్యాదు చేసినట్లు మనం దీన్ని పరిగణించవచ్చా అన్నదే సమస్య. లేదా, ఏపీలో న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా శాససవ్యవస్థ యుద్ధం ప్రకటించినట్లు భావించవచ్చా? ఈ అంశంపై ప్రజాభిప్రాయాన్ని కూడా పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్‌ న్యాయవ్యవస్థ ప్రత్యేకించి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు కొందరు తాము స్వతంత్రులుగానూ, ఎవరి ప్రభావానికి గురికానివారిగానూ తమను తాము ప్రదర్శించుకోలేకపోతున్నారన్నదే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సాధారణ అభిప్రాయంగా ఉంటోంది.

నిజానికి న్యాయవాదులను హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమోట్‌ చేసిన సందర్భాల్లో 90 శాతం నియామకాలు వ్యక్తుల న్యాయసూక్ష్మతపై కాకుండా పూర్తిగా రాజకీయ ప్రభావం ప్రాతి పదికనే తీసుకుంటున్నారన్నది వాస్తవం. న్యాయమూర్తి కావడానికి ప్రాతిపదిక ఏమిటంటే.. ఒక రాజకీయ పార్టీ అజెండాలోకి తాను దూరిపోవడమే. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటోంది అనే అంశంతో పనిలేకుండా, న్యాయవ్యవస్థలోకి ఇప్పటికే ప్రవేశించిన వారు తెలుగుదేశం పార్టీకి సహాయకారులుగా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. గత పదేళ్లకు పైగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతూ వస్తున్నది ఇదే అని చెప్పాలి. దీన్ని క్లుప్తంగా చెప్పాలంటే, ప్రస్తుత తుపానులో అందరి దృష్టికి వచ్చిన ఆ న్యాయమూర్తిని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెరవెనుక చేసిన ప్రయత్నాలతో ఏపీ హైకోర్టులో గతంలో నియమించడంతో ఈ ట్రెండ్‌ ప్రారంభమైంది. తర్వాత ఏపీ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తులుగా నియమితులైన వారందరూ తమ బాస్‌ డిమాండ్లు లేక అభ్యర్థనలకు సమ్మతిస్తూ పోయే వింత ట్రెండ్‌ కొనసాగుతూ వచ్చింది. 

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వ్యక్తిగతంగా, వృత్తిగతంగా తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నవారు మాత్రమే ఘనత వహించిన హైకోర్టులో న్యాయమూర్తులుగా ప్రమోషన్‌ పొందుతూ వచ్చారు. విశ్వాసానికి సంబంధించిన అంశాన్ని మాత్రమే ఈ వ్యవస్థలో పెంచి పోషిస్తూ వచ్చారు. వారి  తీర్పుల్లో కూడా ఇదే ప్రతిబింబిస్తూ వచ్చింది. అలాంటి పాక్షిక స్వభావం కలిగిన తీర్పులు వచ్చిన ప్రతిసారీ టీడీపీతో సంబంధిత న్యాయమూర్తి లేక న్యాయమూర్తుల సంబంధంపై చర్చ ముందుపీటికి వస్తూండేది. నిజానికి, ప్రస్తుత పరిస్థితి మూలాలు కూడా ఇలాంటి అనారోగ్యకరమైన ప్రాక్టీసులోనే కనిపిస్తాయి. ఇది న్యాయవ్యవస్థ మూలాల్నే కబళించివేస్తూ, ప్రజాస్వామ్య సారంపైనే సందేహాలను రేకెత్తిస్తూ వస్తోంది. న్యాయస్థానంలో నా 30 ఏళ్ల అనుభవంలో నేను ఏ రాజకీయపార్టీతోనూ అంటకాగలేదు. రాజకీయ పార్టీల దన్నుతో ఎదగడం గురించి నేను అస్సలు ఆలోచించలేదు. న్యాయవ్యవస్థలో నేను భాగం కాబట్టి నా ఆందోళన అంతా దాని గురించే ఉండేది. 

ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చింది మొదలుగా న్యాయవ్యవస్థ ద్వారా తెలుగుదేశం పార్టీ సమాంతర ప్రభుత్వం నడుపుతూ వస్తోందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడిపోయింది. వైఎస్సార్‌సీపీ చేతుల్లో టీడీపీ ఘోరపరాజయం చెందిన తర్వాత కూడా టీడీపీ ఇలాగే వ్యవహరిస్తూ వస్తోంది. ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఏపీ హైకోర్టులో కొంతమంది న్యాయమూర్తులు డజన్లకొద్దీ వ్యతిరేక తీర్పులను వెలువరిస్తూ రావడమనేది ఈ అభిప్రాయానికి మరింత బలం చేకూర్చింది. ఇటీవల ఏపీ మాజీ అడ్వొకేట్‌ జనరల్‌పై కేసు సందర్భంగా హైకోర్టు మీడియాపై విధించిన నిషేధం కూడా ఇదే అభిప్రాయాన్ని బలపర్చింది. పైగా  అర్ధరాత్రి దాటాక అగమేఘాలపై ఏపీ హైకోర్టు ఈ నిషేధ ఉత్తర్వులను జారీ చేయడం జాతీయ స్థాయి చర్చకు దారితీసింది. ఇదే చివరకు కొందరు న్యాయమూర్తులపై ముఖ్యమంత్రి ఫిర్యాదు చేయాల్సివచ్చిన దురదృష్టకరమైన ఘటనకు దారితీసింది. 

ఉమ్మడి హైకోర్టు ఉన్నట్లుండి విభజనకు గురై 2019 జనవరి 1 నుంచి రెండు హైకోర్టులుగా పనిచేయాల్సి వచ్చిన సందర్భంలో నా అనుభవాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సి ఉంది. ఏపీ హైకోర్టులో పనిచేయడానికి విజయవాడ తరలిపోవాలని 3 రోజుల నోటీసుతో ప్రతి ఒక్కరినీ కోరారు. న్యాయస్థానాన్ని పక్కకు నెట్టి, న్యాయవాదుల శ్రేయస్సును పణంగా పెట్టి అధికారులు వ్యవహరించిన తీరుపై నేను ఏపీ హైకోర్టు అడ్వొకేట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఆనాడు అసమ్మతి లేఖలు రాసాను. ఆ కారణంగానే నాటి అడ్వకేట్‌ జనరల్‌ సమక్షంలోనే నన్ను అవమానించారు. నాపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. బార్, దాని సంస్థను పూర్తిగా పక్కన పెట్టి ఏపీ నూతన హైకోర్టును ప్రారంభించారు. చివరకు న్యాయమూర్తులు సైతం మూగ ప్రేక్షకులుగా చూస్తుండిపోవాల్సి వచ్చింది. ఆ స్థాయిలో నాటి అడ్వొకేట్‌ జనరల్‌ అసాధారణ అధికారాలు చలాయిస్తూ వచ్చాడు. ఇలా ఒకే ఒక వ్యక్తి తన సమర్థత రీత్యా కాకుండా అపెక్స్‌ కోర్టులో కొందరు నేరుగా తనను సమర్థిస్తూ వచ్చిన కారణంగా ఇంత అధికారాన్ని చలాయించడం చాలామందిలో అగ్రహాన్ని రగిలించింది. ఇది నిజంగా దురదృష్టకరమే కానీ ఎలాంటి తనిఖీ లేకుండానే హైకోర్టులో తమ ప్రతి నిధిగా చలాయించడానికి ఆ వ్యక్తిని అనుమతించిన కారణంగానే న్యాయవ్యవస్థకు ఇంత నష్టం జరిగిందని అందరూ గుర్తించాలి. న్యాయమూర్తులపై వచ్చిన ఆ ఫిర్యాదును నేను బలపర్చలేను, ప్రోత్సహించలేను కానీ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మనస్సుల్లో అనుమానం బలపడినప్పుడు, దాని న్యాయపరమైన పర్యవసానాలు, వ్యాఖ్యానాలతో పని లేకుండా న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ రెండూ ఈ అంశంపై తమ వైఖరిని తేల్చి చెప్పాల్సిన అవసరముంది.

అలాగే ముఖ్యమంత్రి ఫిర్యాదుపై కూడా నిర్దిష్టంగా విచారించి ఇరుపక్షాలూ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక సెక్షన్‌ ప్రజలపైనే కేసులు, దర్యాప్తులు సాగిస్తూ మరొక సెక్షన్‌ను న్యాయవ్యవస్థ కాపాడుతోందన్న అభిప్రాయం ఏపీలో బలపడింది. ఇలాంటి పరిస్థితి ఇకపై కొనసాగదని భావిస్తాను. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోకుండా న్యాయవ్యవస్థ, శాసనవ్యవస్థ తమపై తాము పరిమితులను విధించుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. రేపటి తరం న్యాయమూర్తులు తాము నిష్పాక్షికంగా ఉంటామని, మనుషుల ముఖాలు చూసి కాకుండా కేసులనుబట్టి మాత్రమే తీర్పులు వెలువరిస్తామనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించాల్సి ఉంది. అదే సమయంలో శానసవ్యవస్థ కూడా తమ నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చిన ప్రతికూలమైన తీర్పులను కూడా స్వాగతించాలి. ఏది ఏమైనా రాజ్యాంగ పాలనపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడమే ప్రస్తుత కర్తవ్యం.


కేబీ రామన్నదొర

వ్యాసకర్త న్యాయవాది, మాజీ అధ్యక్షుడు,
ఏపీ హైకోర్ట్‌ అడ్వొకేట్స్‌ అసోసియేషన్, అమరావతి
మొబైల్‌ : 98495 67667 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement