సాక్షి, అమరావతి : న్యాయ వ్యవస్థను, జడ్జిలను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత, అభ్యంతరకర పోస్టులు పెట్టడం వల్ల న్యాయ పాలనకు విఘాతం కలుగుతుందని హైకోర్టు తెలిపింది. సీబీఐ కేసులు నమోదు చేసినా పోస్టులు పెట్టడం ఆగడం లేదంది. హైకోర్టు ఇటీవల పలు కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిచ్చిన నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్డడంపై విచారణ జరపాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుల్లో తదుపరి పురోగతి లేదంటూ హైకోర్టు తరఫున రిజిస్ట్రార్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యంపై జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. సీబీఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు స్పందిస్తూ, సీబీఐ దర్యాప్తునకు సంబంధించిన స్థాయీ నివేదకను సీల్డ్ కవర్‌లో కోర్టు ముందుంచుతున్నామని, ఇది నాలుగవదని చెప్పారు. ఐదుగురిని అరెస్ట్ చేసి వారిపై చార్జిషీట్లు వేశామని, మరో 3 నెలల్లో దర్యాప్తు పూర్తవుతుందన్నారు. సీల్డ్ కవర్‌లో సీబీఐ ఇచ్చిన నివేదికను ధర్మాసనం పరిశీలించింది. ఇక్కడి నిందితుల విషయంలో సీబీఐ దర్యాప్తు సంతృప్తికరంగా ఉందని, అయితే విదేశాల్లో ఉన్న నిందితుల విషయంలో మాత్రం సీబీఐ విఫలమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విదేశాల్లో ఉన్న నిందితులపై విచారణను వేగవంతం చేయడానికి ఏం చేయాలో తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
సీబీఐ కేసు కొట్టేయాలంటూ పిటిషన్
తన అరెస్ట్‌తో పాటు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని గుంటూరుకు చెందిన అవుతు శ్రీధర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ బుధవారం విచారణ జరిపారు. ఐపీసీ సెక్షన్ 502(2) పిటిషనర్‌కు వర్తించదని అతని తరఫు న్యాయవాది చిన్మోయ్ ప్రదీప్ శర్మ వాదనలు వినిపించారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు.
న్యాయ పాలనకు విఘాతం కలగనివ్వద్దు
Published Thu, Oct 7 2021 5:11 AM | Last Updated on Thu, Oct 7 2021 5:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment