హైకోర్టన్నా లెక్కలేదా? ఇది ధిక్కారమే | AP High Court Fires On Police Department For Fake Cases | Sakshi
Sakshi News home page

హైకోర్టన్నా లెక్కలేదా? ఇది ధిక్కారమే

Apr 11 2025 4:09 AM | Updated on Apr 11 2025 8:40 AM

AP High Court Fires On Police Department For Fake Cases

మా అధికారాన్నే సవాలు చేస్తున్నారు.. పరిధులు దాటి వ్యవహరిస్తున్నారు 

పోలీసులపై నిప్పులు చెరిగిన హైకోర్టు  

సెక్షన్‌ 111ను ఎప్పుడు పెట్టాలో స్పష్టంగా చెప్పాం 

అయినా కూడా ఎడాపెడా ఆ సెక్షన్‌ కింద కేసులు పెట్టేస్తున్నారు.. ఎప్పుడో నమోదు చేసిన కేసులో ఇప్పుడు అదనపు సెక్షన్లు పెడతారా? 

మా ఆదేశాలున్నా కూడా అదనపు సెక్షన్లను ఎలా చేరుస్తారు?  

సూళ్లూరుపేట ఇన్‌స్పెక్టర్‌ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారు 

దీన్ని మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం.. ఇది కోర్టు ధిక్కారమే   

ఎందుకు చర్యలు తీసుకోరాదో స్వయంగా హాజరై చెప్పాలి

హైకోర్టు ఆదేశాలంటే పోలీసులకు లెక్కే లేకుండా పోయింది. సెక్షన్‌ 111ను ఎప్పుడు, ఎలాంటి సందర్భాల్లో వాడాలో స్పష్టంగా చెప్పాం. అయినా ఉద్దేశపూర్వకంగా ఆ సెక్షన్‌ కింద కేసులు నమోదు చేయడమంటే మా ఆదేశాలను ధిక్కరిస్తున్నట్లే. ఎప్పుడో నమోదు చేసిన కేసులో మీ ఇష్టం వచ్చినట్లు ఇప్పుడు అదనపు సెక్షన్లు ఎలా చేరుస్తారు? అంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్లు కాదా? ఇది ఎంత మాత్రం ఆమో­దయోగ్యం కాదు. సూళ్లూరు­పేట ఇన్‌స్పెక్టర్‌ చర్యలు న్యాయ వ్యవస్థను తక్కువ చేసి చూపేలా ఉన్నాయి. దీన్ని మేం తీవ్రంగా పరిగణిస్తూ ఆ ఇన్‌స్పెక్టర్‌కు కోర్టు ధిక్కార చట్టం కింద ఫాం 1 నోటీసు జారీ చేస్తున్నాం. 
– హైకోర్టు న్యాయమూర్తి  

సాక్షి, అమరావతి: సోషల్‌ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 111 కింద అడ్డగోలుగా కేసులు పెడుతున్న పోలీసులపై హైకోర్టు మరోమారు నిప్పులు చెరిగింది. పోలీసుల చర్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని తేల్చి చెప్పింది. కోర్టులన్నా.. కోర్టులిచ్చి­న ఆదేశాలన్నా పోలీసులకు లెక్కేలేదంటూ తీవ్రంగా ఆక్షేపించింది. కోర్టు అధికారాన్ని, న్యాయ పాల­నను పోలీసులు సవాలు చేస్తున్నారంది. పరిధి దాటి వ్యవహరిస్తున్నారని మండిపడింది. 

తమ ఆదేశాలున్నా కూడా సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై పోలీసులు అదనపు సెక్షన్ల కింద కేసు పెట్టడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టం చేసింది. సెక్షన్‌ 111ను చాలా అరుదుగానే ఉపయోగించాలని, అవసరమైన సందర్భాల్లో మాత్రమే దానిని ఉప­యోగించాలని తాము గతంలో ఓ కేసులో ఇచ్చిన తీర్పులో చాలా స్పష్టంగా చెప్పామంది. అయినా కూడా పోలీసులు సెక్షన్‌ 111 కింద కేసులు పెడుతూనే ఉన్నారంటూ ఆక్షేపించింది. 

ఇలా ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోసాని కృష్ణ మురళిపై తమ ఆదేశాలకు విరుద్ధంగా అదనపు సెక్షన్లు చేర్చడాన్ని తప్పు పట్టింది. తిరుపతి జిల్లా సూళ్లూరు­పేట ఇన్‌స్పెక్టర్‌ మురళీకృష్ణ ఉద్దేశ పూర్వకంగానే ఇలా చేశారంది. తద్వారా ఆయన పరిధి దాటి వ్యవహరించారని తేల్చింది. మురళీకృష్ణ చర్య­లు కోర్టు ధిక్కారమేనని తెలిపింది. 

ఇందుకు గాను ఎందుకు చర్యలు తీసుకోరాదో స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని మురళీకృష్ణను హైకోర్టు ఆదేశించింది. పోసానిపై సూళ్లూరుపేట పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నూనెపల్లి హరినాథ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.  

బీఆర్‌ నాయుడిని తిట్టారంటూ ఫిర్యాదు  
టీటీడీ చైర్మన్, టీవీ 5 యజమాని బొల్లినేని రాజగోపాల్‌ నాయుడుని పోసాని కృష్ణ మురళి దూషించారని, వాటిని సోషల్‌ మీడియాలో వ్యాప్తి చేశారంటూ టీవీ 5 ఉద్యోగి బొజ్జా సుధాకర్‌ గత ఏడాది నవంబర్‌ 14న సూళ్లూరుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేశారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 

పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ కూడా ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడేవే కావడంతో, పోసానికి బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 35(3) నోటీసు ఇచ్చి, వివరణ తీసుకోవాలని సూళ్లూరు­పేట పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే సూళ్లూరుపేట ఇన్‌స్పెక్టర్‌ మురళీకృష్ణ ఈ నెల 7న పోసాని కృష్ణమురళికి సెక్షన్‌ 35(3) కింద నోటీసులు జారీ చేశారు. 

అయితే ఈ నోటీసుల్లో గతంలో నమోదు చేసిన సెక్షన్నే కాకుండా బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 111తో పాటు పలు ఇతర సెక్షన్లను కూడా జత చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ కొట్టేయాలంటూ పోసాని హై­కోర్టును ఆశ్ర­యించారు. ఈ వ్యా­జ్యంపై గురువారం న్యాయ­మూర్తి జస్టిస్‌ హరినాథ్‌ విచారణ జరిపారు.

పోలీసుల చర్యలు న్యాయ వ్యవస్థను తక్కువ చేస్తున్నాయి..
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ‘సెక్షన్‌ 111ను దురుద్దేశ పూర్వకంగా, ఎలాపడితే అలా వాడటానికి వీల్లేదని ఇదే హైకోర్టు ఇప్పటికే పప్పుల చలమారెడ్డి కేసులో చాలా స్పష్టంగా చెప్పింది. సెక్షన్‌ 111ను ఏ సందర్భాల్లో వాడాలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. 

అయితే పోసాని కృష్ణమురళిపై గతంలో నమోదు చేసిన కేసులో తాజాగా జారీ చేసిన నోటీసులో అదనపు సెక్షన్లు చేర్చడం, అందులోనూ సెక్షన్‌ 111ను చేర్చడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇన్‌స్పెక్టర్‌ చర్యలు కోర్టు ఆదేశాలను అణగదొక్కే విధంగా ఉన్నాయి. అంతేకాక కోర్టు ఆదేశాలను సైతం ఇన్‌స్పెక్టర్‌ అతిక్రమించారు. అతని చర్యలు న్యాయ వ్యవస్థను తక్కువ చేసేలా కూడా ఉన్నాయి. 

కేసు దర్యాప్తు విషయంలో పోలీసులు ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై అర్నేష్‌ కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ మార్గదర్శకాలకు విరుద్ధంగా పోసానికి జారీ చేసిన నోటీసుల్లో అదనపు సెక్షన్లు చేర్చారు. ఉద్దేశ పూర్వకంగానే ఇలా చేశారు. 

అందువల్ల ఇన్‌స్పెక్టర్‌కు కోర్టు ధిక్కార చట్టం కింద ఫాం 1 నోటీసు జారీ చేస్తున్నాం’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 25న స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేశారు.

ఇప్పుడు అదనపు సెక్షన్లు విస్మయకరం
పిటిషనర్‌ తరఫు న్యాయవాది పాపిడిప్పు శశిధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, గతంలో సెక్షన్‌ 35(3) కింద నోటీసులిచ్చి, వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించిందన్నారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా సెక్షన్‌ 35(3) కింద పోసానికి నోటీసులు జారీ చేశారని, అయితే విస్మయకరంగా ఆ నోటీసుల్లో పలు అదనపు సెక్షన్లను జత చేశారని చెప్పారు. 

మహిళలను కించ పరిచారంటూ కూడా కేసు పెట్టారన్నారు. టీటీడీ చైర్మన్‌ను దూషించారంటూనే మహిళలకు ఉద్దేశించిన చట్టం కింద కేసు నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీసుల తరఫున అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) సాయిరోహిత్‌ వాదనలు వినిపిస్తూ, హైకోర్టు ఆదేశాల మేరకు పోసానికి సెక్షన్‌ 35(3) కింద నోటీసులు ఇచ్చామన్నారు. అదనపు సెక్షన్ల నమోదు వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు. దీనిపై పూర్తి వివరాలు సమరి్పంచేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement