ఎన్నికల రద్దు సముచిత నిర్ణయమే | AP High Court Cancels Panchayat Election Schedule Guest Column | Sakshi
Sakshi News home page

ఎన్నికల రద్దు సముచిత నిర్ణయమే

Published Tue, Jan 12 2021 12:25 AM | Last Updated on Tue, Jan 12 2021 12:26 AM

AP High Court Cancels Panchayat Election Schedule Guest Column - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేయడం శుభ పరిణామం. ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఎదురు దెబ్బ, గుణపాఠం కూడా.   ఇదే నిమ్మగడ్డ రమేష్‌ ఏడు మాసాలనాడు పట్టుమని పది కరోనా కేసులు కూడా లేని సమయంలో ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా ఒక్క కలంపోటుతో రద్దుపరిచాడు. ఇప్పుడేమో ఎనిమిది మాసాలుగా ప్రజలను కరోనా కకావికలం చేస్తున్న సమయంలో ప్రభుత్వ సూచనలను బేఖాతరు చేసి ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించాడు. నిమ్మగడ్డ తీరు చూస్తే అడ్వొకేట్‌ జనరల్‌ వాదన సరైనదే అనిపిస్తుంది. ఒకపక్క కరోనా టీకాలపై భారీఎత్తున కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ యంత్రాంగం దానిపై నిమగ్నం కావలసి ఉంది. నిమ్మగడ్డ వీటిని పరిగణనలోకి తీసుకున్న దాఖలా లేదు. 

‘మన దేశంలోని పాలకులకు (ప్రభుత్వా నికి) రాజ్యాంగ చట్టం పట్ల నిబద్ధతలో ఆసక్తి పూజ్యం. అలా నిబద్ధులై ఉండే పాలకులకు ఎక్కడా అవార్డులు ఇచ్చి నట్టు గుర్తులేదు! పురస్కారాల సంగతి దేవుడెరుగు. రాజ్యాంగ నిబంధ నల ప్రకారం కనీసం అటు న్యాయ వ్యవస్థగానీ, పాలనా వ్యవస్థగానీ తప్పుడు పనులు చేసేవారినిగానీ, నేరచరిత్ర గలిగిన నాయకుల్ని, అధి కారులను గానీ, శిక్షించడమే లేదు.’’
– ఆకార్‌ పటేల్, సుప్రసిద్ధ ప్రసార మాధ్యమాల విశ్లేషకులు

అలా సెక్యులర్‌ రాజ్యాంగం అడుగడుగునా నెత్తిన నోరు పెట్టుకొని చాటుతున్నా ‘అధికారాంతంబందు చూడవలెరా ఆ అయ్య సౌభాగ్య ముల్‌’ అన్న రీతిలోనే కొందరు నాయకులు, వారి అడుగుజాడల్లో నడుస్తున్న కొందరు అవినీతిపరులయిన అధికారులు ప్రవర్తిస్తున్నారు. అధికారులకు చెవులయితే ఉంటాయిగానీ కళ్లుండ’వన్న సామెతలో ఎంత నిజముందో, ఇంకా పట్టుమని రెండు మాసాలు కూడా లేని తన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీకాలం ముగిసిపోబోతున్న తరుణంలో నిమ్మ గడ్డ రమేష్‌ కుమార్‌ చేష్టలు మరీ వికృతంగా మారాయి.

‘ప్రాక్టీసు లేని ప్లీడర్‌కు దేశాభిమానం ఎక్కువ’న్నట్టుగా తెలుగు దేశం ప్రభుత్వకాలంలో దాని ‘అభిమాన అధికారి’గా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పదవిలోకి వచ్చిన రమేష్‌ 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి చిక్కి శల్యావస్థలో ఉన్న చంద్రబాబు సేవలో తరించిపోయే దశకు చేరుకోవడం అంతటి పదవిలో ఉన్న వ్యక్తి సిగ్గుపడాల్సిన విషయం. కానీ ఇక కొద్దిరోజుల్లో ముగియనున్న (ఫిబ్రవరి 8) పదవీకాలాన్ని పొడిగించుకోవడానికి అధికారంలో ఉన్నప్పుడు తాను చేసిన మంచిపనులపైన ఆధారపడకుండా, పరువు కోల్పోయిన ఓ మాజీ ముఖ్యమంత్రికి తిరిగి పునరావాసం కల్పించడం కోసం తహ తహలాడటం, తాపత్రయపడటం! ఈ వెంపర్లాటలో రమేష్‌ ఆశిం చింది– తన పదవీకాలాన్ని పొడిగించుకోవడం ద్వారా రాష్ట్రంలో సుస్థి రమైన అఖండ విజయంతో రాజ్యాధికారానికి ప్రజాబలంతో దూసుకు వచ్చిన వైసీపీ కాంగ్రెస్‌ యువ అధినేత ముఖ్యమంత్రి జగన్‌కు అడు గడుగునా అడ్డంకులు కల్పించడం! అందుకోసం రమేష్‌ నమ్ముకున్నది తన చెవులనే గానీ, తన కళ్లను కాదు. తీరా ఇప్పుడు తన చెవులను తానే నమ్మలేని పరిణామాలు తనను చుట్టుముడుతున్న సమయంలో ‘దింపుడు కల్లం ఆశ’తో చేస్తున్న పని–కృష్ణాజిల్లాలోని మొవ్వ వేణు గోపాలస్వామి గుడికి హుటాహుటిన వెళ్లడం. ఆయనకు అక్కడ స్వాగతం పలికింది అఖిలపక్షాల వారు కాదు, కేవలం ఆ గ్రామ తెలుగుదేశం నాయకులు. 

వెనకటికొకడు ‘దేవుడే నిజమైతే, నా వెంట్రుకలకు కట్టేసి లాక్కు రానా’ అన్నాడట. కానీ ఆ శక్తి రమేష్‌కు లేదు కనుకనే ఉడిగిపోయిన ‘దేశం’లోని గువ్వల చెన్నయ్యల మీద ఆయన ఆధారపడాల్సి వచ్చింది. ఇంతకూ హైదరాబాద్‌లోని గుడులపైన నమ్మకం లేక మొవ్వకు రమేష్‌ ప్రయాణం కట్టారా? లేక చంద్రబాబుకు ఏదో ఒక రూపంలో ‘దేశం’ పేరిట పునరావాసం కల్పించడానికి ‘తాటితోనే దబ్బనం’ అన్నట్టుగా తన పదవీకాలాన్ని పొడిగించుకోవడం కోసం వేసిన ఎత్తుగడా? అందుకే ఒక దెబ్బకు రెండు లక్ష్యాలు నెరవేర్చుకోవడానికే అకస్మాత్తుగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించేశారు. అదీ ఎనిమిది మాసాలుగా ఆంధ్రప్రదేశ్‌ సహా దేశ వ్యాప్తంగా ప్రజలను, ప్రభుత్వాలను, అధికార గణాలను, గంప గుత్తగా కరోనా మహమ్మారి కకావికలు చేస్తున్న సమయంలో. పైగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపకుండా. 

ఇదే అధికారి ఏడు మాసాలనాడు పట్టుమని పది కరోనా కేసులు కూడా లేని సమయంలో స్థానిక సంస్థలకు జరగవలసిన ఎన్నికలను రాష్ట్రప్రభుత్వంతో నిమిత్తం లేకుండా (ఆ బాధ్యత రాజ్యాంగం నిర్దేశి స్తున్నా) ఒక్క కలం పోటుతో నిరంకుశంగా రద్దుపరిచాడు. కానీ ‘కరోనా’ విసిరిన కొరడాదెబ్బకి రాష్ట్రంలో ఇప్పటికే ఆరువేలమందికి పైగా పౌరులు వివిధ శాఖల అధికారులు మరణించిన దశలో, ఇంకా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్న ఘడియలలో, యావత్తు రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం భారీ సంఖ్యలో ప్రజా బాహుళ్యానికి ప్రాధాన్యతల వారీగా ఈ నెల 16 నుంచీ ‘టీకాలు’ (వ్యాక్సినేషన్‌) ప్రారంభించనున్న తరుణంలో రమేష్‌ గ్రామ పంచాయతీల ఎన్నికలు జరపాలని ఏకపక్షంగా నిర్ణయించి తక్షణ షెడ్యూల్‌ను అమలులోకి తెస్తూ ఈ నెల 8న ఉత్తర్వు జారీ చేశారు.

దానిపై అనేక సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు జరుగుతున్న సమయంలో రమేష్‌ ఏకపక్ష చర్యను సవాలుచేస్తూ ఎన్నికల షెడ్యూల్‌ను నిలుపుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక్కడ గమనించాల్సిన విషయం, ఇంతకు ముందెన్నడూ రాష్ట్ర ప్రభుత్వాల మనుగడలో జరగని పరిణామం... పరిపూర్ణ సంఘీభావాన్ని పాలనా రంగంలోని సకల ప్రభుత్వ శాఖల, స్థానిక సంస్థల, ఉద్యోగ సంఘాలూ, నాయకులూ సమన్వయంతో వ్యక్తీకరించడం.

ఈ పరిణామం ఇలా ఉండగా, దానికి ముందు పాలనా యంత్రాంగాన్ని, అనితర సాధ్యమైన రీతిలో పేదసాదలకు జగన్‌ ఆచరణ సాధ్యంచేస్తున్న పలు సంక్షేమ పథకాలకు మోకాలడ్డుతూ మరోవైపునుంచి అడుగడుగునా కొన్ని ప్రతిపక్షాలు (బీజేపీ సహా), గుళ్లను, గోపురాలను ధ్వంసం చేయడంలో రికార్డు సృష్టించిన చంద్ర బాబు గ్యాంగ్‌ పక్కవాటుగా విధ్వంస కాండకు తెర లేపారు. ఇందు వల్ల వారు సాధించదలచిన వికృత లక్ష్యం– పేదలకు అమలు జరుగుతున్న పలు సంక్షేమ పథకాల అమలుకు ఉద్దేశించిన నిధులను కుంటుపరిచి, తద్వారా మనుషులంటే రాయిరప్పల కన్నా కనాకష్ట మని భావించి, ఆ నిధులను పక్కదారులు పట్టించేట్టు ఒత్తిడి చేయడం. భారీస్థాయిలో నాలుగు రోజులలోనే ప్రారంభం కానున్న టీకాల ప్రక్రియలో నిమగ్నమైన అధికారులకు, ఉద్యోగులకు ఎలాంటి ఆటంకాలను కల్గించరాదు. కరోనా మందగించి, పూర్తిగా జనజీవితం నుంచి దూరమయ్యేదాకా ఇది కొనసాగాలి. 

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేయడం శుభ పరిణామం. ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఎదురు దెబ్బ, గుణపాఠం కూడా. పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం విచారించింది. ‘‘ఎస్‌ఈసీ నిర్ణయాలన్నీ ఉద్దేశ పూర్వకమైనవి. ఎస్‌ఈసీ తనకు తోచిన విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం సూచనలను ఏ మాత్రం పట్టించుకోలేదు. 2020 మార్చిలో వాయిదా వేసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను వదిలేసి పంచాయతీ ఎన్నికలు ప్రారంభించడం లోనే ఎస్‌ఈసీ ధోరణేంటో స్పష్టమౌతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పనిచేయాలి. ప్రభుత్వంలోని పెద్దలపై ఎస్‌ఈసీ నిరం తరాయంగా తప్పుడు వ్యాఖ్యలు చేస్తోంది.

ఒక రాజకీయ పార్టీ ప్రస్తు తమున్న ఎస్‌ఈసీ ఆధ్వర్యంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటోంది. ఆ పార్టీ కోరుకుంటుందనే ఎస్‌ఈసీ వెంటనే ఎన్నికలు జరపాలని చూస్తోంది. వ్యాక్సినేషన్‌ కోసం ఏ స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాల్సి ఉంటుందో రాష్ట్ర ఎన్నికల సంఘం ఊహించలేక పోతోంది’’ అంటూ రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ ప్రభుత్వం తరపున వాదన వినిపించారు. నిమ్మగడ్డ తీరు చూస్తే అడ్వొకేట్‌ జనరల్‌ వాదన సరైనదే అనిపిస్తుంది. ఒకపక్క కరోనా టీకాలపై భారీయెత్తున కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ యంత్రాంగం దానిపై నిమగ్నం కావలసి ఉంది. నిమ్మగడ్డ వీటిని పరిగణనలోకి తీసుకున్న దాఖలా లేదు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన ఏకపక్షంగా ప్రకటించారని పేర్కొంది. టీకా ప్రక్రియకు ఈ షెడ్యూల్‌ అవరోధం అవుతుందని చెప్పడమేగాక, ప్రజారోగ్యమే ముఖ్యమని స్పష్టం చేసింది. ఆర్టికల్‌ 14, ఆర్టికల్‌ 21 ప్రకారం ప్రజల జీవించే హక్కును కాపాడాల్సిందేననీ, ప్రజల హక్కులను కాలరాయలేమనీ ప్రకటిం చింది. ప్రభుత్వ వాదనలను ఎన్నికల సంఘం విస్మరించిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. 

గుడికట్టిన శ్రమజీవిని మరిచి, గూట్లో దీపం పెట్టేవాడిని అందలం ఎక్కించే రోజులు పోయాయని గుర్తించాలి. దేవుడిని తల చుకున్నంత మాత్రాన నిప్పులో చెయ్యిపెడితే కాలకుండా ఉంటుందని భ్రమించడం ఆశకు మించిన దురాశ. పాలకులు గంజాయి తోటలో తులసి మొక్కలు పెరగకుండా సదా జాగరూకులై ఉండాలి. పెట్టుబడి దారీ వ్యవస్థల్లో పెరిగేవి ఎక్కువగా గంజాయి వనాలేనని మరువ రాదు. మారవలసింది గుడులు కాదు, బుద్ధులు. అందుకే బహుశా సంవత్సరన్నర కాలంలో నిరంతరం ఎదురైన అనుభవాల దృష్ట్యా ‘ఈ కుళ్లిన వ్యవస్థను సమూలంగా మార్చవలసిందే’నన్న అభి ప్రాయానికి జగన్‌ వచ్చినట్టు కనిపిస్తోంది. ఇంతకూ అసలు పాఠం... బాబును నమ్ముకున్నవాడెవ్వడూ ఇంతవరకూ బాగుపడలేదు.

-ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement