
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంత గ్రామాలు పంచాయతీ పరిధిలోకి రావని, మునిసిపాలిటీ పరిధిలోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అందుకే ఆ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదని తెలిపింది. రాజధాని ప్రాంత ఏర్పాటు ప్రక్రియలో పలు లోపాలున్నాయని, వాటిని సరిదిద్దుతున్నామని చెప్పింది. గ్రామ సభలు నిర్వహించకపోవడం, పంచాయతీలు తీర్మానాలు చేయకపోవడం వంటి లోపాలను సరిదిద్దాల్సి ఉందంది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఎన్నికలు నిర్వహించకపోతే ఆ గ్రామాల ప్రజలు వారి సమస్యలను ఏ ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లాలని ప్రశ్నించింది.
ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్లు లేదని, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించింది. ఎన్నికల నిర్వహణపై వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాలని ఎస్‌ఈసీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తుళ్లూరుకు చెందిన కొమ్మినేని కోటేశ్వరరావు, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ దేవానంద్ విచారణ జరిపారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది కె.శ్రీనివాసమూర్తి వాదనలు వినిపిస్తూ, ఎస్‌ఈసీ ఎన్నికలు నిర్వహించాల్సిన రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించకుండా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకుంటోందన్నారు. ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్‌మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, రాజధాని పరిధిలోని గ్రామాలన్నీ మునిసిపాలిటీ పరిధిలోకి వస్తాయని, అందువల్ల పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రశ్నే తలెత్తదన్నారు.
ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నందున ఎన్నికలు సాధ్యం కావని ప్రభుత్వం చెప్పిందన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి, సీఆర్‌డీఏ తిరిగి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై వైఖరి ఏమిటో తెలుసుకుని చెప్పాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment