ప్రజలు ఎన్నుకొనే ప్రభుత్వాలకు రాజకీయపరమైన నిర్ణయాలు చేయగల హక్కు ఉన్నప్పుడు, వాటి పరిష్కారానికి ప్రజలు ఎన్నుకున్న శాసన వేదికలకు నివేదించకుండా సుప్రీంకోర్టు వైపు ఎందుకు చూస్తున్నట్టు.. అని ఇటీవల సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం.. రాష్ట్ర రాజధాని సమస్యపై అసెంబ్లీ సాక్షిగా తీసుకున్న నిర్ణయాల్ని తప్పుపడుతూ ‘రాజధానిని మార్చే హక్కు ఏపీ ప్రభుత్వానికి లేదని’ ప్రకటించడం న్యాయసమ్మతమేనా అనే ప్రశ్నకు గౌరవప్రదమైన సమాధానం రావలసి ఉంది. మరోవైపు.. న్యాయస్థానాల్ని ఇరకాటంలోకి నెట్టి తమాషా చూడగల ‘రాజకీయ పక్షుల’ చేతుల్లో రాజ్యాంగ వ్యవస్థలు ఆటవస్తువులుగా మిగిలిపోతున్నాయన్నది వర్తమాన చరిత్ర. ఈ సరికొత్త వినాశకర ధోరణే దేశంలోనూ, రాష్ట్రాలలోనూ రాజ్యాంగ నిర్మాతలు విస్పష్టంగా నిర్దేశించిన నియమ నిబంధనలు ఒక్కొక్కటిగా కూలిపోతూండటానికి తార్కాణమని గమనించాలి.
వెనకటికి పల్నాటి నాయకురాలు నాగమ్మ, బ్రహ్మనాయుడితో పోరు సందర్భంగా ‘నీ మూతికి మీసాలుంటే నా ముంజేతికి వెంట్రుకలున్నవి తెలుసా’ అని ఎద్దేవా చేసిందట. నేడు దేశంలో రాజ్యాంగ వ్యవస్థలు కూడా పరస్పరం ‘నీవెంతంటే, నీవెంత’ అన్నట్టు కుమ్ములాడుకుంటున్నాయి. సుప్రీంకోర్టు గౌరవ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ తన అధ్యక్షతన సమావేశమైన ప్రత్యేక బెంచ్‌లో (8.4.2022) మాట్లాడుతూ, ప్రభుత్వ పాలనా వ్యవస్థ న్యాయమూర్తులను ఆడిపోసుకుంటూ ఉండటం కొత్తగా బయల్దేరిన ధోరణి అనీ, ఇది ‘అత్యంత దురదృష్టకర పరిణామ’మనీ వ్యాఖ్యా నించారు. అందునా, అవినీతి నిరోధక చట్టం కింద, ప్రజా ప్రయో జనాల రక్షణ చట్టం కింద కోర్టు ముందుకు విచారణ కోసం వచ్చే ప్రస్తావనలను న్యాయస్థానం పరిశీలించాల్సి ఉంటుంది.
ప్రజలు ఎన్నుకొనే ప్రభుత్వాలకు రాజకీయపరమైన నిర్ణయాలు చేయగల హక్కు ఉన్నప్పుడు, వాటి పరిష్కారానికి ప్రజలు ఎన్నుకున్న శాసన వేదికలకు నివేదించకుండా సుప్రీంకోర్టు వైపు ఎందుకు చూస్తున్నట్టు? అలాంటి పరిస్థితుల్లో అన్ని సమస్యల్ని కోర్టే పరిష్క రించాల్సి వస్తే, శాసన వేదికలు (పార్లమెంటు/రాష్ట్రాల శాసన సభ/శాసనమండలి) ఉన్నదెందుకు అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ సకాలంలో సంధించగలిగారు. అయితే ఇదే సమయంలో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా నియమితులైన ప్రధాన న్యాయమూర్తి రాజ్యాంగబద్ధంగా, అఖండ మెజారిటీతో ప్రజలు ఎన్నుకున్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ద్వారా రాష్ట్ర రాజధాని సమస్యపై అసెంబ్లీ సాక్షిగా తీసుకున్న నిర్ణయాల్ని తారుమారు చేస్తూ ‘రాజధానిని మార్చే హక్కు ఏపీ ప్రభుత్వానికి లేదని’ ప్రకటించడం న్యాయ సమ్మతమైనదా? అన్న ప్రశ్నకు గౌరవప్రదమైన సమాధానం రావలసే ఉంది.
సరికొత్త వినాశకర ధోరణి!
నిజానికి న్యాయమూర్తులపై ‘ప్రభుత్వాలే దుష్ప్రచారం ప్రారంభిం చడం దురదృష్టకరమన్న’ జస్టిస్ రమణ విమర్శ సబబైనది. ఈ సరికొత్త దుష్ప్రచారానికి తెరతీసిన వాళ్లు కూడా కేంద్ర పాలకులేనన్నది మరచిపోరాదు. కోర్టుల్ని ఇరకాటంలోకి నెట్టి తమాషా చూడగల పాలకులు, ప్రభుత్వాలు ఉన్నచోట... పార్లమెంట్‌లు, శాసనసభ వేది కలు, న్యాయవ్యవస్థలు అధికార స్థానాల్లో ఉన్న ‘రాజకీయ పక్షుల’ చేతుల్లో ఆటవస్తువులుగా మిగిలిపోతున్నాయన్నది వర్తమాన చరిత్ర. ఈ సరికొత్త వినాశకర ధోరణే దేశంలోనూ, రాష్ట్రాలలోనూ రాజ్యాంగ నిర్మాతలు విస్పష్టంగా నిర్దేశించిపోయిన లిఖితపూర్వక నియమ నిబం ధనలు ఒక్కొక్కటిగా కూలిపోతూ ఉండటానికి తార్కాణమని గమ నించాలి. ఈ ధోరణిలో భాగమే పాలకులు ఉత్తర–దక్షిణ భారతాల మధ్య విభేదాల గండికొట్టి శాశ్వత శత్రుత్వాన్ని నర్మగర్భంగా పెంచి పోషిస్తూ రావడం!
ఉత్తరప్రదేశ్‌కు చెందిన 80 పార్లమెంట్ స్థానాలను ముందు కాంగ్రెస్, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ–ఆరెస్సెస్ కూటమి గట్టిగా నిలుపుకొంటూ వస్తున్నాయి. పార్టీలకు లభిస్తున్న ఈ ‘ప్రాణ దానం’లో మెట్టు వాటా ఎన్నికల సమయాల్లోనూ, ఆ పిమ్మట రాజ కీయ అధికారాన్ని నిలబెట్టుకోడానికి కార్పొరేట్ డొనేషన్లు కీలక పాత్ర వహిస్తూన్నాయి. 2019–20 నాటి లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు కార్పొరేట్ డొనేషన్ల రూపంలో ‘విరాళాల’ ముసుగులో ఐదు జాతీయ పార్టీలకు అందిన మొత్తం రూ. 920 కోట్లని ‘ప్రజాస్వామ్య సంస్కరణల పరిరక్షణా సంస్థ’ సాధికార పరిశోధనా పత్రం బయట పెట్టింది. ఆ పార్టీలు: బీజేపీ, కాంగ్రెస్, ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్, మార్క్సిస్టు పార్టీలు. బీజేపీ 2020 నుంచీ భారీ స్థాయిలో కార్పొరేట్ డొనేషన్ల ‘రుచి’ మరిగిన పార్టీగా పరిగణనలోకి వచ్చింది. ఆ పార్టీకి అత్యంత అధిక ‘విరాళాలు’ సమకూర్చే పెద్ద కార్పొరేట్ సంస్థ ‘ప్రూడెంట్ ఎలొక్టరల్ ట్రస్ట్’! ఇదే కాంగ్రెస్‌నూ సాకుతోంది. ఇవిగాక దొంగచాటుగా పార్టీల కరప్షన్‌కు తోడ్పడేవి మరికొన్ని సంస్థలూ!
ఇలాంటి సందర్భాలలోనే సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ సూటిగా పై ప్రశ్నను రాజకీయులకు సంధించాల్సి వచ్చిం దనుకోవాలి. ‘ప్రజాప్రయోజన వ్యాజ్యాలను న్యాయస్థానాలు విచా రణకు స్వీకరించాల్సి వస్తే ఇక ప్రజలు ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్ను కున్నట్టో, చట్టాలు చేసే పేరుతో శాసన వేదికలు ఉన్నదెందుకో...’ చెప్పాలన్న ప్రశ్నకు ప్రస్తుత పార్లమెంట్‌గానీ, పలు శాసన వేదికలు గానీ సమాధానాలతో స్పందించి తీరాలి. కానీ ఆ సంకల్పం ఎక్కడా ఇప్పుడు జరుగుతున్న ‘అమృత మహోత్సవాల’ సంబరాల ముంగిట కానరావడం లేదు.
తక్షణ విచారణకు నివేదిక
ఆ మాటకొస్తే నేడు జరుపుకుంటున్నది ‘అమృత మహోత్స’వాలేనా, అప్పుడే 75 సంవత్సరాలు మనకు తెలియకుండానే వృథా అయి పోయాయా అన్న ఆశ్చర్యమే మిగులుతుంది. అమృత మహోత్సవం అన్న పదం వినబడుతున్న సమయంలోనే దేశ రాజకీయ వేత్తలపై గత ఐదేళ్లకు పైగా నానుతూ వస్తున్న 2,000 అవినీతి కేసులను ముందు తక్షణం విచారించి శిక్షించాలని కోరుతూ జస్టిస్ రమణ అధ్యక్షతన ఉన్న బెంచ్ ముందుకు వచ్చింది. ఈ శిక్షను వెంటనే విధిగా డిమాండ్ చేసిన వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తూ సుప్రీం సీనియర్ న్యాయవాది, సుప్రీంకు న్యాయ సలహాదారుగా ఉన్న (ఎమికస్ క్యూరే) విజయ్ హన్సారియా. అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా... దేశంలో గత ఐదేళ్లుగా పెండింగ్‌లో పడిపోయిన అవినీతి కేసులకు సంబంధించిన 16వ నివేదికను కూడా ఆయన త్వరలో సమర్పించనున్నారు. ఆ ధర్మా సనంలో జస్టిస్ కృష్ణ మురారి, ముక్కుసూటి మనిషి హిమాకోహ్లీ కూడా ఉండబోవడం విశేషం. పెండింగులో ఉన్న అవినీతి కేసులు ఎదుర్కొంటున్న వారిలో మాజీ శాసనకర్తలే (ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు)గాక ప్రస్తుతం కొనసాగుతున్న శాసన కర్తలు కూడా ఉండటం విశేషం! పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీ, శాసనమండలి సభ్యులపై మొత్తం 4,984 కేసులుండగా, వాటిల్లో 1,899 కేసులు ఐదేళ్లకు పైగా నానుతున్నాయి. 2018 నాటికి నమోదై ఉన్న కేసులు 4,110 కాగా, అవి 2020 అక్టోబర్ నాటికి 4,859 దాకా పెరిగి పోయాయి.
ప్రశ్నలోనే ఉందా సమాధానం?!
పార్లమెంట్‌కు, రాష్ట్రాల శాసన వేదికలకు నేర చరిత్ర గలవాళ్లూ పార్టీల తరఫున ఎన్నికవుతున్నారని, సాధికార నివేదికలు తెల్పుతున్నందువల్ల ఇక జాప్యం చేయరాదని ఎమికస్ క్యూరే హన్సారియా సుప్రీంకు ఇలా తాజాగా నివేదించడం ఆసక్తికరం! ఎందుకంటే, త్యాగరాజు ‘నిధి చాల సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా’ అని ప్రశ్నించుకోవడంలోనే తెలివైన సమాధానం ఉంది. ‘నిధి’ సుఖమనుకున్నవారు, ధన సుఖం చూసుకునేవారు, జన సుఖానికి చెల్లుచీటీ ఇస్తారు. ఒక సామెత ఉంది – ‘న్యాయం చెప్పవయ్యా నాగిరెడ్డీ అంటే, నాకూ ఇద్దరు పెళ్లాలే, ఏం చెప్పేది’ అన్నాడట! ఈనాటి పరిస్థితులూ ఇందుకు భిన్నంగా లేవంటే బాధపడీ లాభం లేదు. ఈ సందర్భంలో ఎందుకనో దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆశావహమైన మాటలు గుర్తుకొస్తున్నాయి: ‘‘మంచో చెడో నువ్వు ఎవరితో పోతావు అని నన్నడిగితే, గోతిలోనికి తీసుకుపోయినా యువజనంతోనే పోతాను అంటాను. మనిషి నిత్యపథికుడు. అందుకే శీతవేళ రానీయకు/ శిశిరానికి చోటీయకు/ పూలకారు ఏనాటికీ పోనీయకు’’!!
ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment