![AP Judicial Academy was started by CJI Chandrachud - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/30/CJI-Chandrachud.jpg.webp?itok=8-VyL3lr)
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రారంభించారు. మంగళగిరి మండలం ఖాజాలో శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.
అనంతరం సీజేఐ మీడియాతో మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం వాడకం పెరిగింది. సాంకేతికతను అందిపుచ్చుకునేలా డిజిటలైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. సాంకేతికతకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలి. కేసుల సత్వర పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. న్యాయవాదులు నల్లకోటు ధరించి తిరగడం చూస్తుంటాం. అందులోని తెలుపు, నలుపు రంగులను ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణగా పరిగణిస్తారు.
న్యాయమూర్తులు నిత్య విద్యార్థులుగా ఉంటూ నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టులు వివాదాల పరిష్కారమే కాదు, న్యాయాన్ని నిలబెట్టేలా చూడాలి. కేసుల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించాలి. న్యాయవ్యవస్థను పరిరక్షించడానికి అందరి సహకారం అవసరం. పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలి. జడ్జిలకు సొంత సామర్ధ్యాలపై విశ్వాసం ఉండాలి. ముఖ్యమైన కేసుల్లో త్వరగా న్యాయం జరిగేలా చూడాలి. న్యాయవ్యవస్థలో కేసుల సంఖ్య కంటే తీర్పుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి అని సీజేఐ చంద్రచూడ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment