ఒక న్యాయమూర్తి రిటైర్ అయిన తర్వాత రోడ్డుకు రెండు వైపులా కొంతమంది అమరావతి వాసులు నిలబడి వీడ్కోలు చెప్పడం జరిగింది. వీరంతా ఎలాంటి సంకేతం ఇచ్చారు? ఏపీలో పౌరుల హక్కులను కాపాడలేకపోతున్నామంటూ హైకోర్టువారు గంపగుత్తగా వ్యాఖ్యలు చేశారు. అదేదో ప్రతిపక్ష పార్టీ అందంటే వారి రాజకీయ అవసరం అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక జడ్జిగారు అలా మాట్లాడారంటే ఏమని అనుకోవాలి? ఏపీలో రాజ్యాంగం విచ్ఛిన్నం అయిందంటూ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపడితే, దానికి ఎందుకు సమాధానం ఇవ్వలేకపోయారు? న్యాయమూర్తులకు రాజకీయ దురుద్దేశాలు ఆపాదించకూడదు. కానీ న్యాయమూర్తులు కూడా తమ తీర్పులను రాజకీయ ప్రసంగాలుగా మార్చరాదు.
కొద్దికాలం క్రితం సుప్రీంకోర్టులో రిటైర్ అయిన జడ్జి దీపక్ గుప్తా ఒక వ్యాఖ్య చేశారు. న్యాయవ్యవస్థ ధనికులకు, శక్తిమంతులకు మాత్రమే అధికంగా ఉప యోగపడుతోందని అన్నారు. ఈ వ్యాఖ్య ఎంత అర్థవంతమైనదో ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ రాకేశ్ కుమార్ రిటైర్ అయిన తర్వాత ఆయనకు వీడ్కోలు చెప్పిన వారిని చూస్తే తెలుస్తుంది. రోడ్డుకు రెండు వైపులా కొంతమంది అమరావతి ప్రాంతవాసులు నిలబడి ఆయనకు వీడ్కోలు చెప్పడం జరిగింది. వీరంతా ఏం కోరుతున్నారు? మిగిలిన రాష్ట్రం ఎటైనా పోనీ, తమ భూములకు మాత్రం కోట్ల విలువ ఉండాలని ఆశిస్తున్నారు. అలాంటివారు ఒక న్యాయమూర్తికి వీడ్కోలు తెలిపా రంటే ఎలాంటి సంకేతం ఇచ్చారు? అలాగే కొన్ని నెలల క్రితం హైకోర్టుకు వెళ్లే న్యాయమూర్తులకు రోడ్డుపై నిలబడి దండాలు పెట్టారు. వారి వినతులను ఆలకించిన గౌరవ హైకోర్టు వారు, అదే సమయంలో కొందరు నిరసన బ్యాడ్జీలు పెట్టుకున్నారని మండి పడ్డారు. నిరసన చెప్పడం తప్పే కావచ్చు. కానీ దండాలు పెట్టడం మాత్రం సమర్థనీయమా ఆలోచించాలి.
ఇక రాకేశ్ కుమార్ గారు కొన్నాళ్ల క్రితం ఏపీలో రాజ్యాంగ విచ్ఛిన్నత జరిగిందంటూ ఆయనకు ఆయనే భావించి, కొందరు పిటిషనర్లను ఆ మేరకు పిటిషన్ వేయండని అడగటంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముప్పై ఏళ్లలో ఎన్నడైనా ఇలాంటి తీర్పు చూశామా అని చీఫ్ జస్టిస్ బాబ్డే వ్యాఖ్యానించారంటేనే అది ఎలాంటి తీర్పో విశ్లేషించుకోవచ్చు. దానికి సమాధానం చెప్పలేని రాకేశ్ కుమార్ సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను, తెలంగాణ చీఫ్ జస్టిస్‌ను బదిలీ చేయడాన్ని తప్పు పట్టినట్లు వ్యాఖ్యానించారు. మరి ఇది కోర్టు ధిక్కరణ కిందకు రాదా అంటే వస్తుందని న్యాయనిపుణులు అంటున్నారు. పైగా ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖ ఆధారంగానే ఈ రెండు రాష్ట్రాల చీఫ్ జస్టిస్‌లు బదిలీ అయ్యారని ప్రజలు అనుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. దీనివల్ల జగన్‌కు ఏదో అనుచిత లబ్ధి వచ్చిందని అనడం దారుణంగా ఉంది. తెలంగాణ సీజేపై జగన్ ఎక్కడా ఫిర్యాదు చేయలేదే? దానికి, జగన్‌కు ఏమి సంబంధం ఉందని రాకేశ్ గారు కనిపెట్టారో తెలియదు. జగన్ కేసుల గురించి, ఆయన జైలులో ఉన్నప్పుడు కేటాయించిన నంబర్ గురించి కూడా జడ్జి గారు మాట్లాడారంటే ఆయన ద్వేషంతోనో, లేదా మరే ఉద్దేశంతోనో ఇలాంటి తీర్పు ఇచ్చారని కొందరు న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తు న్నారు.
న్యాయమూర్తులకు రాజకీయ దురుద్దేశాలు ఆపాదించ కూడదు. అలాగే న్యాయమూర్తులు కూడా తమ తీర్పులను రాజకీయ ప్రసంగాలుగా మార్చరాదు. ఇదే సందర్భంలో జస్టిస్ రాకేశ్‌ను పట్నా హైకోర్టు నుంచి ఎందుకు బదిలీ చేశారో గుర్తుకు తెచ్చుకోవాలని మరో న్యాయ ప్రముఖుడు అన్నారు. అక్కడ కొందరు జడ్జీలపై ఈయన ఆరోపణ చేయడం, వారంతా దానిని ఖండించడం, ఈయనకు కేసులు విచారణకు ఇవ్వకుండా ఉండాలని నిర్ణయించడం, తదుపరి అక్కడ నుంచి బదిలీ చేయడం జరిగాయి. అప్పుడే సుప్రీంకోర్టు కొలీజియంపై ఎందుకు ఈయన దావా వేయలేదని మరో ప్రముఖ లాయర్ ప్రశ్నిం చారు. మూడు రాజధానుల కేసు గురించి, శాసనమండలి రద్దు గురించి, చివరికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివాదం గురించి కూడా తీర్పులో రాయవలసిన అవసరం ఏమిటి?
అసలు కేసు ఏమిటి? రాజ్యాంగం విచ్ఛిన్నం అంటూ గతంలో వ్యాఖ్యలు చేసినందున మిషన్ బిల్డ్ ఏపీ కేసును జస్టిస్ రాకేశ్ కుమార్ విచారించడానికి వీలు లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది పిటిషన్ వేశారు. అంటే ఈ న్యాయమూర్తి నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని పరోక్షంగా చెప్పడమే కదా. అలాంటప్పుడు విజ్ఞత కలిగిన ఏ జడ్జి అయినా ఆ కేసు నుంచి తప్పుకుంటారని చెబుతారు. కానీ ఆయన ఆ పని చేయకపోగా, ఆ పిటిషన్‌ను కొట్టివేసి, ఆ పిటిషన్ వేసిన ప్రభుత్వ అధికారిపై కోర్టు ధిక్కార కేసు పెట్టాలని తీర్పిచ్చారు.
తన రిటైర్‌మెంట్‌కు ఒక రోజు ముందు ఇలాంటి తీర్పు ఇవ్వడం అంటే ఆయన ఉద్దేశాలు ఏమిటో తెలుస్తున్నాయని కొందరు అంటున్నారు. జడ్జీలకు దురుద్దేశాలు ఆపాదించకూడదు కానీ, కొన్నాళ్ల క్రితం ఇదే కేసులో వాదించిన పోలీసు శాఖ తరపు న్యాయవాది ఎస్.ఎస్. ప్రసాద్... జడ్జి రాకేశ్ కుమార్ ఈ కేసులో ముందుకు వెళితే రాజకీయ దురుద్దేశం ఆపాదించవలసి వస్తుందని ఆనాడే చెప్పారు. అయినా జడ్జి గారు పట్టించుకోకుండా తన రాజకీయ ప్రసంగం మాదిరి తీర్పు ఇచ్చే శారు. ఈయనతో పాటు ఉన్న మరో జడ్జి రమేష్ మాత్రం ఈ వ్యాఖ్య లతో తనకు సంబంధం లేదని స్పష్టంగా చెప్పారట.
ప్రభుత్వంలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని ప్రస్తావించడం తప్పు కాదు. అది కూడా ఆయా విషయాలపై ఎవరైనా పిటిషన్లు వేస్తే తీర్పులు ఇవ్వవచ్చు. అలాకాకుండా జడ్జీలు వారికి వారే ఏవో ఊహిం చుకుని తీర్పులు ఇచ్చేయడం మొదలుపెడితే ఈ విషయం ఎక్కడిదాకా వెళుతుంది? శాసనమండలి రద్దు తీర్మానం గురించి జడ్జిగారికి ఏమి సంబంధం? ఆయన ఆ కేసును విచారిస్తుంటే సంబంధిత ప్రశ్నలు వేయవచ్చు. అలాకాకుండా దేశంలో ఎప్పుడూ శాసన మండలి రద్దు జరగనట్లుగా మాట్లాడితే వారికి ఉన్న సమాచార జ్ఞానం ఏమిటన్న ప్రశ్న వస్తుంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనమండలి రద్దు చేయాలని శాసనసభ తీర్మానాలు చేయడం, ఆ తర్వాత కొంత కాలానికి అది రద్దు కావడం కూడా జరిగింది.
ఇప్పుడు మండలి రద్దు అవుతుందా, లేదా అన్నది కేంద్రం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అది వేరే సంగతి. కానీ జడ్జిగారికి ఏమి సంబంధం? శాసనసభకు అసలు హక్కులు ఉండవనీ, మొత్తం పాలన వ్యవస్థను కూడా తామే నడుపుతామనీ గౌరవ న్యాయమూర్తులు భావిస్తే అది సమంజసం అవుతుందా? ఏపీలో పౌరుల హక్కులను కాపాడలేకపోతున్నా మంటూ గంపగుత్తగా వ్యాఖ్యలు చేయడం కూడా సమర్థనీయం కాదు. అదేదో ప్రతిపక్ష పార్టీ అందంటే వారి రాజకీయ అవసరం అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక జడ్జిగారు అలా మాట్లాడా రంటే ఏమని అనుకోవాలి?
హైకోర్టు మీద ప్రభుత్వం యుద్ధం చేస్తోందని హైకోర్టువారు వ్యాఖ్యానించారు కానీ నిజానికి హైకోర్టువారే ఏపీ ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నారని ప్రజలలో ఏర్పడిన అభిప్రాయం. రాజ్యాంగం విచ్ఛిన్నం అయిందంటూ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పు పడితే, మరి దానికి జస్టిస్ రాకేశ్ ఎందుకు సమాధానం ఇవ్వలేక పోయారు? రాజకీయ నేతల కేసుల గురించి ప్రస్తావిస్తున్న న్యాయ మూర్తి, న్యాయవ్యవస్థ అంతా కడిగిన ముత్యంలా ఉందని చెప్ప గలరా? ఆయనే ఒకప్పుడు న్యాయవ్యవస్థలో అవినీతిపై ఏమి మాట్లా డింది తెలియదా? తాజాగా ఏపీ హైకోర్టులో వచ్చిన ఒక తీర్పు గురించి తెలియదా? న్యాయవ్యవస్థలోని వారిపై అవినీతి కేసులు వస్తే అసలు విచారణే జరపరాదనీ, అసలు ఆ వార్తలే ప్రచారం చేయరాదనీ ఆదేశాలు ఇవ్వడాన్ని ఎలా సమర్థిస్తారు? కొన్ని కేసుల్లో నెలల తరబడి కొందరిని జైళ్లలో ఉంచే కోర్టులు, మరికొందరి విషయంలో భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నాయి? ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఆయనకేమి సంబంధం అని ప్రశ్నించిన జడ్జిగారు కూడా ఉన్నారు. ఒక నేతకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన ఒక న్యాయ మూర్తికి ఆయన రిటైర్ అయిన వెంటనే ప్రభుత్వంలో పెద్ద పదవి కూడా వచ్చింది. అవన్నీ సమర్థనీయమని గౌరవ రాకేశ్ కుమార్ భావి స్తున్నారా? ఒక హైకోర్టు జడ్జికి సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోషన్ వచ్చింది.
కానీ అప్పుడు ఆయనపై ఒక కేసు పెండింగులో ఉందన్న సమాచారం బయటకు వచ్చింది. దాంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని ఆ కేసును ఎత్తివేయించుకున్నారే! రాజకీయ నేతలు తమపై వచ్చిన కేసులు విత్‌డ్రా చేసుకుంటే తప్పు అయితే ఇది రైటు అవుతుందా? ఏ వ్యవస్థలో అయినా మంచి, చెడు ఉండవచ్చు. కానీ న్యాయ వ్యవస్థ మాత్రం చెడుకు దూరంగా ఉండాలి. ప్రభావాలకు లోను కాకుండా ఉండాలి. రాకేశ్ కుమార్ వల్ల న్యాయ వ్యవస్థ ప్రతిష్ట పెరి గిందా, తగ్గిందా ఆయనే ఆలోచించుకోవాలి.
జనం దృష్టిలో మాత్రం ఆయన రాసిన తీర్పు అంతా రాజకీయ ప్రసంగంగానే మిగిలిపోయిం దన్న విమర్శను ఎదుర్కోక తప్పదు. న్యాయ వ్యవస్థ భ్రష్టు పట్టేలా ఎవరూ వ్యవహరించరాదని సలహా ఇవ్వడం తప్ప మనం ఏమి చేయగలం? న్యాయవ్యవస్థకు ఆ పరిస్థితి ఎదురైతే సమాజానికి ప్రమాదం. ఇదంతా న్యాయ వ్యవస్థ బాగుపడాలని తప్ప, జడ్జీలపై అగౌరవంతో కాదనీ, ధిక్కార స్వరం అసలు కాదనీ న్యాయమూర్తులు భావిస్తే అదే పదివేలు.
-వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
కొమ్మినేని శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment