జస్టిస్‌ రాకేష్‌పై ‘సుప్రీం’ సీరియస్‌! | Supreme is serious about Justice Rakesh | Sakshi
Sakshi News home page

జస్టిస్‌ రాకేష్‌పై ‘సుప్రీం’ సీరియస్‌!

Published Sat, Feb 10 2024 4:57 AM | Last Updated on Sat, Feb 10 2024 7:22 AM

Supreme is serious about Justice Rakesh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయ­మూర్తులుగా ఉన్న సమయంలో జస్టిస్‌ రాకేష్‌ కుమార్, జస్టిస్‌ దొనడి రమేష్‌ తమ తీర్పులో అటు అత్యున్నత న్యాయస్థానం ఇటు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభు­త్వాన్ని లక్ష్యంగా చేసుకుని అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పక్షపాతంతో చేసిన ఆ అభ్యంతరకర, వివాదాస్పద వ్యాఖ్యలను ఆ తీర్పు నుంచి సుప్రీంకోర్టు తాజాగా తొలగించింది.

ఇలాంటి అసంబద్ధ, పక్షపాత వ్యాఖ్యలతో పాలనా­పరమైన ఇబ్బందులు తలెత్తుతాయన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. ఈమేరకు ఆ వ్యాఖ్యలను తీర్పు నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బేలా ఎం.త్రివేదీ, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ ధర్మాసనం శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది.

ఏం జరిగిందంటే...?
మిషన్‌ బిల్డ్‌ ఏపీ కింద ప్రభుత్వ ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై 2020 డిసెంబర్‌లో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేష్‌ కుమార్, జస్టిస్‌ రమేష్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ జరిగినప్పుడల్లా జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అభ్యంతరకర, ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిందా..? రాష్ట్రంలో ఆర్థిక అత్యాయక పరిస్థితి ఉందా? అంటూ వ్యాఖ్యలు చేశారు.

ఆ వ్యాజ్యాల విచారణను గమనించిన ప్రతి న్యాయవాది జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ పక్షపాతంతో వ్యవహరిస్తున్నట్లు అర్థం చేసుకున్నారు. ఈ ధోరణిని ఎన్నోసార్లు భరిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం చివరకు మీరు విచారిస్తే న్యాయం జరిగే అవకాశం లేదని, అందువల్ల ఈ వ్యాజ్యాల విచారణ నుంచి తప్పుకోవాలంటూ (రెక్యూజ్‌) జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ను కోరింది. ఆ మేరకు పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ తీరు ప్రజలందరికీ తెలిసింది. ప్రభుత్వం న్యాయబద్ధంగా చేసిన అభ్యర్థనతో జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ అహం దెబ్బ తిన్నది.

తనను విచారణ నుంచి తప్పుకోమనడం ధిక్కారపూర్వక చర్యే అవుతుందని జస్టిస్‌ రాకేష్‌ కుమార్, జస్టిస్‌ రమేష్‌ల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ధర్మాసనం తరఫున జస్టిస్‌ రాకేష్‌ కుమారే తీర్పు రాశారు. విచారణ నుంచి తప్పుకోవాలన్న ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. 

కొలీజియంపై తీవ్ర వ్యాఖ్యలు
సర్వ సాధారణంగా ప్రభుత్వం చేసిన అభ్యర్థన పట్ల అభ్యంతరం ఉంటే ఏ న్యాయమూర్తి అయినా ఉత్తర్వులు జారీ చేసి అంతటితో ఆగిపోతారు. జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ మాత్రం అలా ఆగలేదు. ఆ తీర్పు ద్వారా తన అసలు నైజాన్ని బయటపెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వంపైనే కాకుండా అప్పటి ఏపీ, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేసినందుకు సుప్రీంకోర్టు కొలీజియంపై సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏకంగా 55 పేజీల తీర్పు వెలువరుస్తూ మిషన్‌ బిల్డ్‌పై దాఖలైన వ్యాజ్యాలతో సంబంధం లేని అంశాలను ప్రస్తావించారు.

ఏ పిటిషనర్‌ ప్రస్తావించని అంశాలతోపాటు తమ ముందున్న కేసుతో సంబంధం లేని వివరాలను, వెబ్‌సైట్లలో ఉన్న వాటిని సైతం తీర్పులో పొందుపరిచారు. ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌పై అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం బనాయించిన కేసుల గురించి తన తీర్పులో ప్రముఖంగా ప్రస్తావించారు. జగన్‌మోహన్‌రెడ్డి గురించి తనకు తెలియదని, తరువాత చాలా ఆసక్తికర విషయాలు తెలుసుకున్నానంటూ ఓ న్యాయమూర్తి చేయకూడని వ్యాఖ్యలు చేశారు.

అంతేకాకుండా  గూగుల్‌లో ఖైదీ నెంబర్‌ 6093 అని టైప్‌ చేస్తే చాలా సమాచారం వస్తుందంటూ వ్యాఖ్యానించారు. తన పదవీ విరమణకు ఒక్క రోజు ముందు జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ ఈ వివాదాస్పద తీర్పును వెలువరించారు. ఆ మరుసటి రోజు ఆయన పదవీ విరమణ చేసి ఇంటికి వెళుతుండగా టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ మద్దతుదారులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ఆయనను పసుపు పూలతో ముంచెత్తారు. ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేసి స్వామిభక్తిని చాటుకున్నారు.

 ‘సుప్రీం’ విస్మయం..
ఈ తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2021లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ తీర్పుపై తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. ఆ తీర్పు తమను ఆందోళనకు గురి చేస్తోందంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. నిమిషం ఆలస్యం చేయకుండా జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ తీర్పు అమలుపై స్టే విధిస్తూ 2021 ఫిబ్రవరి 10న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

అనంతరం ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ బేలా త్రివేదీ ధర్మాసనం పలుమార్లు విచారణ జరిపింది. తాజాగా మరోసారి విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ మను సింఘ్వీ, ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ కేసుతో సంబంధం లేని అంశాలను ప్రస్తావించారని నివేదించారు. పలు అంశాలపై అవసరం లేని వ్యాఖ్యలు చేశారన్నారు.

సుప్రీంకోర్టు కొలీజీయంపై కూడా విమర్శలు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల పాలనపరంగా పలు ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ముఖ్యమంత్రి జగన్, రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు కొలీజియంను విమర్శిస్తూ జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ తన తీర్పులో చేసిన వ్యాఖ్యలను తొలగించాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ వ్యాఖ్యలన్నింటినీ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అత్యంత వివాదాస్పదుడు
పాట్నా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ న్యాయమూర్తిగా మారిన జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ న్యాయవ్యవస్థలో అత్యంత వివాదాస్పదుడిగా పేరుపొందారు. బిహార్‌ మహాదళిత్‌ వికాస్‌ మిషన్‌ ఫండ్‌ నిధుల విషయంలో ఐఏఎస్‌ అధికారి రామయ్య ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఆయన తోసిపుచ్చారు. అయితే కింది కోర్టు రామయ్యకు బెయిల్‌ ఇవ్వడాన్ని జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ తప్పుబడుతూ సుమోటోగా విచారణ జరిపారు. తాను బెయిల్‌ నిరాకరించిన వ్యక్తికి కింది కోర్టు బెయిల్‌ ఎలా ఇస్తుందని ప్రశ్నిస్తూ దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

సివిల్‌ కోర్టులో అవినీతి జరుగుతోందంటూ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. పాట్నా హైకోర్టులో అవినీతి బహిరంగ రహస్యమంటూ ఓ తీర్పే రాశారు. అవినీతి విషయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదన్నారు. జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ తీరును పాట్నా హైకోర్టు న్యాయమూర్తులందరూ సీరియస్‌గా తీసుకున్నారు.

అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏపీ షాహీ నేతృత్వంలో 11 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ప్రత్యేకంగా సమావేశమై జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ తీర్పును రద్దు చేసింది. జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ తీరుపై ఆ ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆయనను కేసుల విచారణ బాధ్యత నుంచి తప్పించారు. అటు తరువాత సుప్రీంకోర్టు జస్టిస్‌ రాకేష్‌ను 2019లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ చేసింది.

రాజ్యాంగ విచ్ఛిన్నమంటూ రభస
ఏపీ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించాక కొద్ది రోజులు మౌనం పాటించిన జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ ఆ తరువాత నిత్యం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. చిన్న చిన్న కేసుల్లో కూడా ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ హెబియస్‌ కార్పస్‌పై తీవ్రంగా స్పందించారు.

రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛినం జరిగిందంటూ విచారణ చేపట్టారు. పలు సందర్భాల్లో డీజీపీని ఆక్షేపించారు. రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపై తీర్పు రాసే అవకాశం కనిపించకపోవడంతో ముఖ్యమంత్రి జగన్‌ను లక్ష్యంగా చేసుకునేందుకు మిషన్‌ బిల్డ్‌ కేసును ఎంచుకున్నారు. 

బహుమానంగా ఎన్‌సీఎల్‌ఏటీ పదవి..
పదవీ విరమణ అనంతరం జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌కు జాతీయ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) జుడీషియల్‌ సభ్యుడిగా అవకాశం దక్కింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకే ఎన్‌సీఎల్‌ఏటీ పదవి దక్కిందన్నది న్యాయవ్యవస్థలో అందరికీ తెలిసిన విషయమే. ఎన్‌సీఎల్‌టీలో కూడా ఆయన వివాదాస్పదంగా వ్యవహరించారు. ఏకంగా సుప్రీంకోర్టు ఆదేశాలనే ఉల్లంఘించారు. తనకు కావాల్సిన విషయం విచారణ చేపట్టారు.

ఫినోలెక్స్‌ కేబుల్‌ వార్షిక సర్వసభ్య సమావేశం ఫలితాల విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారు. దీంతో సుప్రీంకోర్టు ఆయనపై కన్నెర్ర చేసి కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. రాకేష్‌ కుమార్‌ తీరు వల్ల ఎన్‌సీఎల్‌ఏటీ కుళ్లిపోయిందంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. దీంతో జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ బాగోతం దేశమంతా తెలిసిపోవడంతో గత్యంతరం లేక ఎన్‌సీఎల్‌ఏటీ జుడీషియల్‌ సభ్యుడి పదవికి రాజీనామా చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement