ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఆందోళనకరం | Supreme Court Stay On AP High Court Judgement | Sakshi
Sakshi News home page

ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఆందోళనకరం

Published Sat, Dec 19 2020 3:44 AM | Last Updated on Sat, Dec 19 2020 7:50 AM

Supreme Court Stay On AP High Court Judgement - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా?.. అనేది తేలుస్తామంటూ ఈ ఏడాది అక్టోబర్‌ 1న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌ కుమార్, జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తమవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ కొందరు హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌లు దాఖలు చేస్తే ఆ వ్యాజ్యాల్లో ఓ న్యాయస్థానం ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం ఎప్పుడైనా, ఎక్కడైనా మనం చూశామా? అంటూ విస్మయం వ్యక్తం చేసింది. ఇన్నేళ్ల మీ అనుభవంలో మీరైనా ఇలాంటి ఉత్తర్వులు చూశారా? అంటూ ప్రతివాదుల తరఫు న్యాయవాదిని కూడా ప్రశ్నించింది.

రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఆ న్యాయమూర్తులు భావించడానికి అంతగా ప్రభావితం చేసిన అంశాలేమున్నాయో అంతుబట్టడం లేదని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అన్న అంశాన్ని తేలుస్తామంటూ జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులపై తాజాగా సుప్రీంకోర్టు ‘స్టే’ విధించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ ‘స్టే’ ఉత్తర్వులు అమలులో ఉంటాయని స్పష్టం చేస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. క్రిస్మస్, సంక్రాంతి సెలవులు ముగిసిన తరువాత దీనిపై తదుపరి విచారణ చేపడతామని ప్రకటించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బాబ్డే, న్యాయమూర్తులు ఏఎస్‌ బొప్పన్న, వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

సుమోటోగా హైకోర్టు విచారణ..
తమ వారిని పోలీసులు అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారని, వారిని కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పలు హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు దాఖలు కావడం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే అకస్మాత్తుగా ధర్మాసనం రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అన్న అంశంపై తేలుస్తామని, ఆ దిశగా వాదనలు వినిపించాలని ప్రభుత్వ, పోలీసుల తరఫు న్యాయవాదులను ఆదేశిస్తూ అక్టోబర్‌ 1న ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యాంగం వైఫల్యం చెందినట్లు పిటిషనర్లు ఎవరూ పేర్కొనకున్నా, ఎలాంటి పిటిషన్‌ దాఖలు చేయకపోయినా కూడా ధర్మాసనం సుమోటోగా విచారణ ప్రారంభించింది. గత కొద్ది వారాలుగా రోజూ వారీ విచారణ ప్రారంభించింది.

విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. అయితే అసలు రాజ్యాంగ వైఫల్యంపై విచారణ జరిపే పరిధి హైకోర్టుకు లేదని, అందువల్ల అక్టోబర్‌ 1న జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రీకాల్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ రీకాల్‌ పిటిషన్‌ను జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ ఒక్క నిమిషంలోనే కొట్టి వేశారు. కావాలంటే దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి, రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అన్న అంశంపై తేలుస్తామంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ అప్పీల్‌ దాఖలు చేసింది. రాజ్యాంగ వైఫల్యంపై అధికరణ 356 కింద రాష్ట్రపతి జోక్యం చేసుకోవచ్చే కానీ న్యాయస్థానాలు కాదని రాష్ట్ర ప్రభుత్వం తన అప్పీల్‌లో పేర్కొంది. ఈ అప్పీల్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఏ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ (ఎస్‌జీ) తుషార్‌ మెహతా, రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్, పోలీసుల తరఫున సీనియర్‌ న్యాయవాది సర్వ సత్యనారాయణ ప్రసాద్‌ తదితరులు హాజరయ్యారు. 

హైకోర్టు ఉత్తర్వులు సబబు కాదు...
హైకోర్టు ఆదేశాలు ఏ మాత్రం సబబు కాదని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు నివేదించారు. హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లలో రాజ్యాంగ వైఫల్యంపై విచారణ జరుపుతామన్న హైకోర్టు ఉత్తర్వులు సహేతుకం కాదన్నారు. ఈ సమయంలో కేసు పూర్వాపరాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అక్టోబర్‌ 1న హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధిస్తున్నాం.. అని స్పష్టం చేసింది. 

రెండింటినీ వేర్వేరుగా చూడటం లేదు..
ప్రతివాది తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా (తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతీ కేసులో వాదనలు వినిపిస్తుంటారు) జోక్యం చేసుకుంటూ 14 హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లను హైకోర్టు విచారించిందని, ఆ సందర్భంగా రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అన్న అంశంపై కూడా విచారణ జరపాలని నిర్ణయించిందని తెలిపారు. దీనిపై జస్టిస్‌ బాబ్డే స్పందిస్తూ తాము రెండింటినీ వేర్వేరుగా చూడటం లేదన్నారు. అసలు ఈ రోజు ఏం చెప్పదలచుకున్నారో స్పష్టంగా చెప్పండి.. అని లూథ్రానుద్దేశించి సీజే వ్యాఖ్యానించారు. తమ ముందున్న హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌లలో కనిపించిన అంశాల ఆధారంగా హైకోర్టు రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అన్న అంశంపై విచారణ జరుపుతోందని లూథ్రా పేర్కొన్నారు.

హైకోర్టు అలాంటి ఉత్తర్వులెలా ఇవ్వగలదు?
దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ (శాసన, న్యాయ, కార్యనిర్వాహక) కుప్పకూలిపోయానని భావించినప్పుడు హైకోర్టు మాత్రం రాజ్యాంగ వైఫల్యంపై అలాంటి ఉత్తర్వులు ఎలా ఇవ్వగలదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే ప్రశ్నించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సబబేనా? అని అడిగారు. అసలు రాజ్యాంగం వైఫల్యం చెందిందని భావించేందుకు న్యాయమూర్తులను ప్రభావితం చేసినంత అంశాలు ఏమున్నాయో తమకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. 

ఇన్నేళ్లలో ఎప్పుడైనా చూశారా?
కాగా రాజ్యాంగం వైఫల్యంపై హైకోర్టు కేవలం ప్రశ్న మాత్రమే లేవనెత్తిందని, అవి  ఆదేశాలు కాదని సిద్దార్థ లూథ్రా పేర్కొనగా.. మీరెంత కాలం నుంచి న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారని సీజే ప్రశ్నించారు. 29 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉన్నానని లూథ్రా బదులివ్వడంతో ఇన్నేళ్లలో ఎప్పుడైనా ఏ కోర్టయినా ఇలాంటి కేసుల్లో (హెబియస్‌ కార్పస్‌) రాజ్యాంగం వైఫల్యంపై విచారణ జరుపుతామంటూ ఉత్తర్వులు ఇవ్వడం చూశారా? అంటూ జస్టిస్‌ బాబ్డే తిరిగి ప్రశ్నించారు. హైకోర్టు ఉత్తర్వులు అత్యున్నత న్యాయస్థానమైన తమకు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ సీజే ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement