పిటిషనర్లు రెండు విజ్ఞప్తులు చేశారు. తొలి అభ్యర్థన ఏంటంటే ఏపీ సీఎం జగన్ బహిరంగపరిచిన లేఖపై హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తి లేదా సీబీఐ విచారణ చేయాలి. ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి సీఎం జగన్‌కు ఉన్న అధికారాలేంటీ.. ఆయన అసలు సీఎం పదవికి అర్హుడు కాదని ప్రకటించాలంటూ రెండో అభ్యర్థన చేశారు. రెండో అభ్యర్థన చట్టబద్ధం కాదు. ఒకవేళ తొలి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటే అసలు పిటిషనర్ ఏం కోరుతున్నారో ఆయనకే తెలియని పరిస్థితి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ సీఎం రాసిన లేఖను బహిరంగపరచడంపై సుప్రీంకోర్టులో మరో ధర్మాసనం విచారణ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌లో మేం జోక్యం చేసుకోం. పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం.
– జీఎస్ మణి, ప్రదీప్‌కుమార్ పిటిషన్లపై జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్
పత్రికల్లో వచ్చిన కథనాలు తీసుకొని మీకేం కావాలో అది కోరుతూ పిటిషన్లు దాఖలు చేస్తారా? దీన్ని ఎలా పరిగణించాలి. వంద మంది పిటిషన్లో ఇంప్లీడ్ అవుతామంటే వంద మందినీ అనుమతించాలా? ఇలా చేస్తే ఇది అంతులేని విచారణ అవుతుంది’’
– యాంటీ కరప్షన్ కౌన్సిల్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాపై సుప్రీంకోర్టు ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలంటూ కోరడానికి చట్టరీత్యా వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ పనితీరుపై, దానిని ప్రభావితం చేస్తున్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)కి రాసిన లేఖను బహిర్గతం చేయడంపై విచారణ చేయాలంటూ న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్‌కుమార్‌లతోపాటు, యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. మరోవైపు సీజేఐకి రాసిన లేఖను బహిర్గతం చేయడంపై సీఎంను వివరణ కోరాలంటూ సునీల్‌కుమార్‌సింగ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను ఇవే ఆరోపణలున్న మరో కేసుకు జత చేస్తామని పేర్కొంది. దీన్ని సుప్రీంకోర్టులో మరో ధర్మాసనం వద్ద విచారణలో ఉన్న అమరావతి భూముల కుంభకోణంపై ఏర్పాటు చేసిన కేబినెట్ ఉప కమిటీ నివేదిక, సిట్ దర్యాప్తుపై స్టే ఇస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఏపీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌కు జతపరుస్తున్నట్టు పేర్కొంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
పిటిషన్ అసంబద్ధంగా ఉంది..
న్యాయవాది జీఎస్ మణి వాదనలు ప్రారంభిస్తూ.. సుప్రీంకోర్టు సీజేఐకి సీఎం జగన్ రాసిన లేఖ వెనక దురుద్దేశం ఉందన్నారు. కాలపరిమితితో అంతర్గత విచారణ చేయాలని కోరారు. సీఎం జగన్ చర్యల వల్ల స్వతంత్ర న్యాయవ్యవస్థకు ముప్పు వాటిల్లుతోందన్నారు. దీనిపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషన్ అసంబద్ధంగా ఉందని వ్యాఖ్యానించింది. విచారణ జరపాలని మీరే అంటారు.. దురుద్దేశపూర్వకంతో ఆరోపణలు చేశారని మీరే అంటారు.. అసలు ఏం కోరుతున్నారో మీకు అర్థమవుతోందా? అని జీఎస్ మణిని ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషన్లు వేసే ముందు ఆలోచించాలని సూచించింది. ‘‘వ్యక్తిగతంగా హాజరైన పిటిషనర్ రెండు అభ్యర్థనలు చేశారు. తొలి అభ్యర్థన కొంచెం గందరగోళంగా ఉంది.
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తిపై ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ కోరుతున్నారా లేక జ్యుడీషియల్ విచారణ కోరుతున్నారా? లేక అంతర్గత కమిటీ విచారణ చేయాలా? సీనియర్ విశ్రాంత న్యాయమూర్తితో సిట్ విచారణ చేయాలా? సీబీఐ విచారణ కోరుతున్నారా అనేది స్పష్టత లేదు. ఇక రెండో అభ్యర్థన విషయానికి వస్తే ఏపీ సీఎం జగన్ ముఖ్యమంత్రి కార్యాలయం నడపడానికి అర్హుడు కాదంటూ కో వారంటో జారీ చేయాలని కోరుతున్నారు. ఈ రెండో అభ్యర్థన చట్టపరంగా మెయింటైనబుల్ కాదు. ఈ రకంగా చూస్తే పిటిషనర్ ఏం కావాలనుకుంటున్నారో ఆయనకే తెలియదు’’ అని ధర్మాసనం తన ఆదేశాల్లో పేర్కొంది. ‘‘ సీజేఐకి సీఎం రాసిన లేఖలోని వివరాలు బహిర్గతం అయ్యాయి. వేరొక కేసులో హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇస్తే సుప్రీంకోర్టులో మరో ధర్మాసనం ఎత్తివేసింది కదా మరి.. ఈ పిటిషన్ విచారించాల్సిన అవసరం ఏముంది’’ అని జీఎస్ మణిని ప్రశ్నించింది.
ఈ పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం లేదు..
యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్టు లేవనెత్తిన అంశం మరో పిటిషన్‌లోని అంశం కూడా ఒకటేనని, కాబట్టి ఈ పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాకుండా పిటిషన్‌ను దేనికీ జత చేసే అవసరం లేదని పేర్కొంది. అసలు ఏ ప్రయోజనం కోసం ట్రస్టు ఏర్పాటు చేశారు? నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయని ధర్మాసనం ప్రశ్నించింది. అవన్నీ వివరిస్తామని ట్రస్టు తరఫు సీనియర్ న్యాయవాది శుక్లా పేర్కొన్నప్పటికీ ధర్మాసనం నిరాకరించింది. ఒకే అంశంపై వంద పిటిషన్లు వస్తే అన్నింటినీ ఇంప్లీడ్ చేసుకొని విచారించాలా? అని ప్రశ్నించింది. ఇలాంటి పిటిషన్లను విచారించబోమని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.
Comments
Please login to add a commentAdd a comment